ఎంకన్న సామీ,
దండాలయ్య!. నీకేమి సామీ హాయిగా ఏడు కొండలెక్కి కూసుంటివి. కింద మా మడుసులు సేసే మోసాలు నీకు తెలియవా సామి?. ఎప్పుడో రాయల పెబువు నీకోసం పేమతో నగలు నటరా సేయిచ్చి కొండలెక్కి నీకోసం తెచ్చినాడు కదా, మరి అయ్యాటిని కాపాడుకునే బాధ్యత నీ మీద లేదా దొర?. నిన్న మొన్న దాక ఆడున్నాయి ఈడున్నాయి అని సెప్పిన పెబుత్వం ఇప్పుడు ఆ అవి ఎప్పుడో కరగ బెట్టినం అంటోంది. ఇదేందన్న?. ఏదో ఒకటి అర కాదు కదయ్యా!. కొన్ని వందల కోట్లు సేసే నగలయ్య. పాపం రాయలయ్య గీ మడుసులు ఇంత మోసం సేస్తారంటే సేయించే వాడు కాదేమో?. ఎట్లా సామీ ఈ అన్యాయాన్ని అడ్డుకునేది?. నువ్వే ఏదో సేయాలయ్య.
మరి నువ్వేమో శానా పెసిద్ధి పొందితివి. బక్తులు విపరీతంగా నీ కాడికి వస్తుంటిరి. కష్టాలు పెరిగానాయి కదయ్యా మాకు?. రాకుండా ఎట్టా ఉంటామయ్య?. వస్తే మరి మూడు నాల్గు దినాలు నీ చూపు దక్కక పాయె. దక్కిన 5 సెకండ్లు. ఇంతల గాడ నిడుచున్న పోరలు నూకి నూకి పడేస్తున్నరు. గింతలో యాడో అంబాని అని వస్తే ఆళ్ళ కోసం మమ్మల్ని 2 -3 గంటలు ఆపుతున్నారే . బ్రేక్ దర్శనం అంటే నరకమే అన్న మాకు. క్యూలో నిలబడి నిలబడి మాకు కాలు సెయ్యి నొప్పి, నిన్ను సూసేకే ఓపిక లేకుండా పోతున్నామన్న.
ఈడ ఓ బోర్డు మొత్తం నాశనం సేసేస్తుందయ్యా. ఒకడేమో మందు వ్యాపారం సేసే దుర్మార్గుడయ్య. ఇంకొకడు రాజకీయ నాయకుడి శిష్యుడు, ఇంకోడు పని పాటలేని పోరంబోకు ఎదవ, ఇంకోడు పూర్తి నాస్తికుడు. ఇంకో భక్తి ఉన్న మడిసి ఏమి సేయ్యలేని పరిస్థితి అయ్యా. సామీ! నీకు ఇంత డబ్బు ఉంది కదా?. ఇంకా ఎందుకయ్యా నీ గుడికి బంగారం పుయ్యటం?. దాని పేరు పెట్టి ఈ నా ద్రోహులు బంగారం మింగేస్తున్నరే. ఏమి సెయ్యాలే సామి?. అంత మందు సాములు, రాజకీయ నాయకుల సుట్టాలు, పరమతస్తులు తప్ప నిజంగా నువ్వంటే ప్రేమ, బక్తి, నిజాయతి ఉన్నోడే లేదన్న. మరి నువ్వు ఇవన్ని సూస్తు ఎట్టా ఊరక ఉంటుండావు?. నీ సేవ మానేసి నీ పేరు పెట్టి నీ నగలు, నీ డబ్బు, మా డబ్బు దోచుకోటం ఏంటి అన్న?.
ఇంకా మాకు ఇసుగు వచ్చేసిందే అన్న. ఈ నా కొడుకులు ఏసే ఏసాలు సూసి. సేసే మోసాలు విని, సూసి. ఏడు కొండల్ని నువ్వే కాపాడుకోవాలన్న. నీ డబ్బు, నీ భూమి, నీ గుళ్ళు, నీ పాత్రలు, నీ కొండలు, నీ సెట్లు - అన్నే నువ్వే సూసుకోవాల.
దండాలన్న.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి