RightClickBlocker

3, జులై 2010, శనివారం

ఝుమ్మంది నాదం - చిత్ర సమీక్ష

చిత్రం: ఝుమ్మంది నాదం 
విడుదల: జూలై 2, 2010
తారాగణం: మంచు మనోజ్, తాపసి, మోహన్ బాబు, సుమన్, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, తనికెళ్ళ భరణి తదితరులు.
దర్సకత్వం: రాఘవేంద్ర రావు
నిర్మాత: మంచు లక్ష్మీ ప్రసన్న
సంగీత దర్శకులు: ఎం ఎం కీరవాణి
నేపథ్య గాయకులు: బాలసుబ్రహ్మణ్యం, సునీత, గీతా మాధురి, కృష్ణ చైతన్య, చైత్ర, అనూజ్, దీపు తదితరులు. 

ఝుమ్మందినాదం చిత్రానికి కావలిసిన పరికరాలు - అనుభవఙ్ఞుడైన దర్శకులు రాఘవేంద్రులు, సంగీత వాణి కీరవాణి, ప్రతిభ ఉన్న నటులు మనోజ్, మోహన్ బాబు, బ్రహ్మానందం, సుమన్, అందమైన నూతన కథానయిక తాప్సి - అన్నీ ఉన్నాయి కానీ నాకు మళ్లీ రాఘవేంద్రరావు పైత్యం ఎక్కువ అనిపించింది.

తెలుగు సాంప్రదాయం అని మంచి సంగీతంతో, కోనసీమ, అరకు సౌందర్యాలతో, భిన్నమైన పాత్రలో మోహన్ బాబు, ఎమ్మెస్, బ్రహ్మి, ధర్మవరపుల హాస్యంతో మొదలయ్యిన మొదటి భాగం రెండో భాగానికి వచ్చేసరికి బూతులు, ద్వంద్వార్థాలు, రొటీన్ సంగీతం (పెళ్లి మరియు సంక్రాంతి పాటలు), మసాలా - రాఘవేంద్రరావు చిత్రాల్లో కనిపించే యాపిల్స్, రంగులు, బుడగలు, అంగాంగ ప్రదర్శన, కొబ్బరి చిప్పలు గాడిద గుడ్డులా తయారయ్యింది చివరకు. పెళ్లి తంతుల మీద పాటలు చూసి చూసి, రంగుల పాటలు చూసి చూసి ఇవంటే కొంత మొహం ఎత్తింది నాకు.

తెలుగు రాని అమ్మాయిని తీసుకుని తెలుగుదనం మీద చిత్రం తీయటం ఎందుకో అర్థం కాలేదు. ఏమన్నా అంటే ఆ అమ్మాయి పాత్ర ఎన్నారై అనొచ్చు. కాని ఆ అమ్మాయి అంతరించిపోతున్న తెలుగుదనం, సాంప్రదాయ సంగీతం మీద ప్రాజెక్టు చేయటానికి భారతదేశానికి వస్తుంది. మరి అదేంటో - కట్టు, బొట్టు, నడవడిలో ఎక్కడా తెలుగుదనం కనిపించదు. మొత్తం మీద - సంగీతం (కొన్ని పాటలు), కొంత హాస్యం, మంచు మనోజ్ అభినయం బాగున్నాయి. వయస్సున్న పాత్రలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారు బానే చేసారు. చిత్రానికి బలం చేకూర్చాల్సిన నాయిక అందం గుదిబండ అయ్యిందేమో అనిపించింది.

కొత్త గాయకులకు అవకాశం ఇచ్చిన కీరవాణి గారికి అభినందనలు. బాలు, బృందం పాడిన శాస్త్రీయ సంగీత ప్రధాన తొలిపాట, బాలు, గీతా మాధురిల యుగళగీతం 'లాలి పాడుతున్నది ', సునీత, కృష్ణచైతన్యల 'ఎంత ఎంత'  అనే శృంగార యుగళగీతం, అలాగే అనూజ్, చైత్రల జానపద/ఆదివాసి యుగళ గీతం 'ఏం సక్కగున్నావ్ రా'  వీనుల విందు. చిత్రం ముగింపులో ఉన్న పాట హైలైట్. చంద్రబోస్ గారు రాసిన 'దేశమంటే మతం కాదోయ్' దేశహిత సందేశం ఉన్న ఈ గీతం చాలా బాగుంది.

వస్త్ర ధారణ, మేకప్, నాయిక, మితిమీరిన శృంగారం - వీటిని కొంచెం జాగ్రత్తగా ఎంపిక  చేస్తే చాలా బాగుండేది చిత్రం.  మొత్తం మీద కీరవాణి గారి సంగీతం ఆహ్లాదకరం, శ్రవణానందకరం. మంచు మనోజ్ కు మంచి భవిష్యత్తు ఉంది. 5 లో 2 -1 /2 మార్కులు ఇస్తాను నేను. ఈ మొత్తం మార్కులు సంగీతానికే.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి