ఇది ప్రజానాయకులకు నా బహిరంగ లేఖ:
మీకు దమ్ము, నిజాయితీ ఉంటే:
- ఇంకో వారం రోజుల్లో అసెంబ్లీ మరియు పార్లమెంటు వర్షాకాలపు సమావేశాలు మొదలవుతాయి. అక్కడ నిలదీయండి. ఈ నిర్ణయాన్ని పూర్తిగా ప్రభుత్వం విశదీకరించేవరకు సభను జరగనీయకండి.సహాయ నిరాకరణ చెయ్యండి సభలో. మీ మీద ప్రభుత్వ మనుగడ చాలా ఆధారపడి ఉంది. అది గుర్తుపెట్టుకొని మీ వ్యూహాన్ని వెయ్యండి.
- నెలలో ఉపఎన్నికలు ఉన్నాయి అక్కడ ఎండగట్టండి యూపీఏ విధానాలను. పత్రికల్లో రాయండి, నిర్ణయం తీసుకున్న మంత్రులు, ప్రధాన మంత్రి, సోనియా గాంధి గారింటి ముందు నిలబడి నినాదాలు చెయ్యండి, నిరాహార దీక్ష చేపట్టండి. మీ వాదనలో బలం, నిజాయితీ ఉంటే ప్రభుత్వం దిగి రావాల్సిందే.
దేనికండి మీరు చేసే బంద్?. ముక్కు పచ్చలారని పసి పాప వైష్ణవిని విజయవాడలో దారుణంగా, అమానుషంగా చంపి కొలిమిలో తగలబెడితే ఏ ఒక్క నాయకుడికి పట్టలేదు. ఆ చంపిన వాళ్ళను ఎవ్వరు ఏమి చెయ్యలేకపోయారు. పార్లమెంటు దాడిలో నిందితుడైన అఫ్జల్ కు ఇంతవరకు ఉరిశిక్ష పడేట్టు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాలేకపోయారు. ఇదేనా మీలో ఉన్న నిబద్ధత?. ఒకరోజు బంద్ చేస్తే ఎంత మంది చిన్న చితక వ్యాపారం చేసే వాళ్ళు నలిగి నష్ట పోతారో తెలుసా?. ఎంతమంది మీరు తీసుకునే తప్పుడు నిర్ణయాలవల్ల ఒకరోజు ఆదాయం కోల్పోతారో మీకు తెలుసా?.
బంద్ అనేది చట్ట వ్యతిరేకం అని దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చి నెట్టి మీద మొట్టికాయలు వేసినా మీకు బుద్ధి రాదు. అక్కడ నిరసనలు తెలిపేది ప్రజలు కాదు. కేవలం మీ పార్టీల నాయకులు, మీకింద పని పాట లేకుండా కూర్చునే చోటా నాయకులు. మీలో సగం మందికి అసలు దేనికి నిరసన తెలుపుతున్నారో కూడా తెలీదు.
బంద్ వల్ల జరిగే నష్టం మీకు తెలియకపోతే తెలుసుకోండి.
- విద్యార్థులు విద్య సంవత్సరంలో ఒక అమూల్యమైన రోజు.
- రవాణా వ్యవస్థకు దెబ్బ - బస్సులు, రైళ్ళు, ఆటోల మీద ఆధారపడి రోజు పనులకు వెళ్లే వివిధ తరగతుల వాళ్లు.
- రోడ్డు పక్కన, రోడ్డు మీద, జన సమ్మర్దమైన మధ్య తరగతి ప్రాంతాల్లో ఉండే చిన్న వ్యాపారులు - కిరాణా, పాలు, పండ్లు, కూరలు, హోటల్స్ - ఇలా ఎన్నో.
- పెద్ద వ్యాపారాలకు అనుబంధంగా ఆధారపడి ఉన్న సగటు వ్యాపారులు, పని వాళ్ళు, కాంట్రాక్టు ఉద్యోగులు.
- ప్రభుత్వ కార్యాలయాల్లో పని. అసలే మనము నత్త నడక. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డ చందం ఈ బంద్.
- అదను చూసుకొని కొన్ని ముఖ్యమైన వస్తువుల ధరలను పెంచటం వల్ల ప్రజలకు జరిగే నష్టం, ఇబ్బందులు.
- మీరు రైళ్లు, బస్సులు ఆపినందు వల్ల ఒక పనిమీద గమ్యానికి చేరాల్సిన మనిషి పని మీరు చేస్తారా?. ప్రజా జీవితాన్ని సాఫీగా నడిపే బాధ్యత మీలో లేనప్పుడు, వాళ్ళను బాధ పెట్టే హక్కు కూడా మీకు లేదు.
- రైల్వే, ఆర్టీసీ ఎమన్నా మీ అమ్మ, నాన్న వ్యక్తిగత ఆస్తా మీ ఇష్టం వచ్చినట్టు తగలబెట్టటానికి?. మీ పార్టీ ఫండ్ నుంచి ఆ నష్టాన్ని పూడుస్తారా?. మీరు చేసే నష్టం లేకపొతే అవి చాలా సమర్థవంతం గా పనిచేయ్యగల సంస్థలు.
- ఇంటర్వ్యూ కి వెళ్ళాల్సిన యువకుడికి మీ వల్ల కలిగిన ఇబ్బందివల్ల నష్టాన్నిఎవరు తీరుస్తారు?. మీ పార్టీ తరపున అతనికి ఉద్యోగం ఇప్పించగలరా?.
- ప్రాణాల కోసం వేరే ఊళ్లు వెళ్లే రోగుల బాధలు ఎవరు తీరుస్తారు?. వాళ్ల కోసం మీ పార్టీ వాళ్లు వాహనం ఏర్పాటు చెయ్యగలరా?.
- సందట్లో సడేమియా అని మోసం చేసే ఆటో వాలాల నుంచి కలిగిన నష్టాన్ని ఎవరు పూడుస్తారు?. పోలీసులు కడతారా ఈ డబ్బులు?.
- మధ్యాహ్నం రెండుగంటలకు గమ్యం చేరాల్సిన రైలు రాత్రి రెండుగంటలకు చేరితే దాని వల్ల జరిగే అసౌకర్యం ఊహించగలరా?. ఒక 18 ఏళ్ళ అమ్మాయిని మీలో ఎవరైనా అర్థరాత్రి ఇలాంటి పరిస్థితిలో ఇంటికి తీసుకెళ్ళి దింపి వాళ్ల అమ్మ నాన్నలను తృప్తి పరచగలరా?.
- మీరు చేసే ధర్నా వల్ల ట్రాఫిక్ జామ్ అయి ఎంత మంది ఇబ్బంది పడతారో ఊహించగలరా?. మిమ్మల్నే ఈ పరిస్థితిలో పెట్టుకొని ఒక్కసారి ఎంత కష్టంగా ఉంటుందో ఒక్క నిమిషం ఆలోచించండి. మీకే గుండెపోటు వచ్చి ఖైరతాబాద్ జంక్షన్లో ట్రాఫిక్ ఆగిపోయి మీకు అత్యవసర సేవ అందకపోతే?. ఊహించండి.
ప్లీజ్. ఆపండి ఈ అర్థం పర్థం లేని, అసౌకర్యము, బాధ, నష్టము కలిగించే బందులు.
Good article Prasad.
రిప్లయితొలగించండిచాలా బాగుంది. ఇది ఈనాటి రాజకీయ నాయకులకి ఒక చంప దెబ్బ. ఒక్క రాజకీయ నాయకుడైనా ఈవిధంగా అలొచించినా చాలు.
రిప్లయితొలగించండిvery good article...
రిప్లయితొలగించండి