వాల్మికి రామాయణం బాలకాండంలో రాసిన ఈ శ్లోకం మనకు చాలా సుపరిచితమైనది.
కౌసల్యా సుప్రజా రామా పూర్వా సంధ్యా ప్రవర్తతే |
ఉత్తిష్ఠ నరశార్దూల! కర్తవ్యం దైవమాహ్నికం ||
ఈ శ్లోకం యొక్క సందర్భం నాకు ఈరోజు రామాయణ పారాయణలో వచ్చింది. విశ్వామిత్రుడు యాగ సంరంక్షణ నెపంతో బాలుడైన, నూనూగు మీసాలు కూడా రాని రాముడిని భయంకర రాక్షసులైన మారీచ సుబాహులను పోరాడి చంపడానికి దశరథుడిని కోరుతాడు. పుత్ర వాత్స్యల్యము, మోహముతో ఆ మహారాజు భీతి చెంది నేను ఆ బాలుడిని పంపలేను అంటాడు. వశిష్ఠ గురువులు అప్పుడు దశరథుడికి హితబోధ చేస్తాడు. విశ్వామిత్రుడి గొప్పతనము, ఆయన శక్తి, సామర్థ్యాలు వివరంగా చెప్పి ఆయన ఉండగా ఆ రాక్షసులు రాముడికి ఏ అపాయమూ కలుగచేయలేరని ఆశ్వాసన కలిగిస్తాడు. అప్పుడు దశరథుడు రామలక్ష్మణులను విశ్వామిత్ర మహర్షితో సంతోషంగా, నిస్సందేహంగా పంపిస్తాడు.
అలా తన ఆశ్రమానికి తీసుకెళ్ళే దారిలో సరయు, గంగ నదులు దాటుతూ, కొన్ని ఆశ్రమాల, అడవుల ప్రాముఖ్యతను రామలక్ష్మణులకు తెలియజేస్తాడు విశ్వామిత్రుడు. వారికి బల, అతి బల విద్యలు నేర్పిస్తాడు. ఈ విద్యల వల్ల వారికి ఆకలిదప్పులు, దాహము, నిస్సత్తువ లాంటివి లేకుండా ఎల్లప్పుడూ శక్తివంతులై ఉంటారు. ఆ యాత్రలో నదీ తీరాన రామచంద్రుడు నిద్రపోతున్నప్పుడు, మహర్షి రాముడిని నిద్ర లేపుతూ ఈ శ్లోకం పఠిస్తాడు - " కౌసల్య తనయుడవైన ఓ రామా! సంధ్య, అగ్నిహోత్రం మొదలైన కర్తవ్యాలు నెరవేర్చాలి. మేలుకో!". అప్పటి వరకు అల్లారు ముద్దుగా రాచరికంలో పెరిగిన రామచంద్రుడికి ముందు ముందు నెరవేర్చాల్సిన, కార్యాలు, ధర్మసంరక్షణ చాలా ఉన్నాయి అని గుర్తు చేస్తూ ఈ మేలుకొలుపు. ఆ కర్తవ్యపాలనకు కావలసిన విద్యలను, అస్త్ర శస్త్రాలను ప్రసాదిస్తు వారితో ముందుకు సాగుతాడు ఆ మహర్షి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి