16, జులై 2010, శుక్రవారం

అసమాన మహిళ - పాలువాయి భానుమతి


ఆమె నవరస నటన ఉత్తుంగ తరంగమై పొంగే సహజ గంగ ప్రవాహం. ఆమె గానం భక్తి, శాస్త్రాల మేళవంతో సాగే సప్త  స్వర ఝరీ  జలపాతం. ఆమె భాష అలకనందా జలంలా నిర్మలం, చిదానందం. ఆమె నృత్యం చూపరులకు ఆహ్లాదం. ఆమె రూపం మూర్తీభవించిన ఆరణాల తెలుగుదనం. ఆమె సాహిత్యం అచ్చ తెలుగు సీమ మిరపకాయ. ఆమె జీవన శైలి, ధోరణి స్వాభిమానంతో నిండుకున్న సింహలక్షణం. ఆమె మనసు 'పైన కఠినమనిపించును లోన వెన్న కనిపించును' చందం. ఆమె విమర్శ వజ్రాయుధమంత పదునైనది. వెరసి ముచ్చటగా ఈ లక్షణాలు ఉన్న వనితా రత్నం మన పాలువాయి భానుమతి రామకృష్ణ గారు.

ఒంగోలు జిల్లాలో బొమ్మరాజు వారింట పుట్టి తెలుగు చలన చిత్ర జగత్తులో రామారావు, నాగేశ్వరరావుల కన్నా ఉన్నత స్థానాన్ని అధిరోహించి తన సహజ నటనా ప్రావీణ్యంతో ఆరేడు దశాబ్దాలు ఏలిన మకుటమున్న మహారాణి భానుమతి.  తనకన్నా వయసులో చాలా పెద్ద అయిన రామకృష్ణగారిని వివాహమాడి, భరణి సంస్థను స్థాపించి, ఆ పతాకం మీద అద్భుతమైన కళాఖండాలను మనకు అందించారు. 'నేను మిస్సమ్మలో మేరీ పాత్రను వదులుకోకపోతే దక్షిణాది  చలన చిత్ర సామ్రాజ్యానికి సావిత్రి లాంటి మహానటి వచ్చేది కాదేమో' అని అనటంలో ఆమె ధైర్యానికి, ఆత్మవిశ్వాసానికి నిదర్శనం. సావిత్రి, జమున, అంజలి కన్నా ముందే దక్షిణాదిన అగ్రతారగా గుర్తింపబడింది భానుమతి.

ఎటువంటి పాత్ర అయిన సరే - వెండి తెర ఆమె ఉంటే అదిరి పోవాల్సిందే.  సాంఘిక, జానపద, పౌరాణిక, చారిత్రాత్మక చిత్రాలలో నాయిక, ప్రతినాయిక, క్యారెక్టర్ పాత్రలకు ఆమె జీవం పోసి వన్నె తెచ్చారు. ఆమె తన పాత్రలకు తానే నేపథ్యగానం. కొన్ని చిత్రాలకు సంగీత దర్శకత్వం కూడా చేశారు. మల్లీశ్వరి వంటి చిత్రం ఇంకా రాలేదు, రాబోదు అంటే అతిశయోక్తి కాదు. శాస్త్రీయ సంగీతంపై తనకున్న మక్కువను ప్రతిచిత్రంలో ఏదో ఒక కీర్తన రూపంలో చూపించారు. నగుమోము గనలేని, సావిరహే తవ దీనా రాధా, పక్కల నిలబడీ, తెర తీయగా రాదా ఇలా ఎన్నో...



ఇక పాత్రలకొస్తే,

మల్లీశ్వరిలో రామారావుగారికి సమానంగా తెరను డామినేటు చేశారు.'మనసున మల్లెల మాలలూగెనే', 'పిలచిన బిగువటరా' లాంటి పాటలు ఇంకెవ్వరు పాడలేరు.  'పరుగులు తీయాలి' అనే పాటలో ఘంటసాలతో పోటీపడి అద్భుతమైన యుగళగీతం పాడారు. 'బాటసారి'లో ఆమె నటన అనుపమానం. శరత్ నవల ఆధారంగా తీయబడిన ఈ చిత్రంలో ఆమె ప్రేమ, కట్టుబాటు మధ్య నలిగిపోయే పాత్రలో మనకు కళ్ళలో నీళ్ళు తెప్పిస్తారు. 'ఓ బాటసారి నను మరువకోయీ' అనే పాట ఈ చిత్రాన్ని తెలుగు చిత్రాల్లో ఒక ఆణిముత్యంలా నిలిపింది.  విప్రనారాయణలో శృంగారమొలికించే నాయిక పాత్రలో నాగేశ్వరరావు గారికి పోటీ ఇచ్చి ఆ చిత్రానికి ఘన విజయం సంపాదించారు. ఆ చిత్రంలో సావిరహే తవ దీనా రాధ' అనే జయదేవుని అష్టపదిని సున్నితంగా, లలితంగా పాడి ఇప్పటికీ ఆ పాట గాయకుల నోట వినిపించేలా చేశారు ఆమె.

ఇక పౌరాణిక/చారిత్రిక పాత్రలకొస్తే, తెనాలి రామకృష్ణలో వేగు పాత్ర, పల్నాటి యుద్ధంలో నాయకురాలు నాగమ్మగా ఆమె ప్రతినాయిక పాత్ర అంటే ఇలా ఉండాలి అన్నంత కసిగా నటించారు. నాగమ్మ అంటే భానుమతే. ఆ చిత్రంలో బ్రహ్మన్న పాత్రలో ఎన్టీ రామారావు గారికి దీటుగా నటించి శహభాష్ అనిపించుకున్నారు. అలానే బొబ్బిలి యుద్ధం చిత్రం కూడా. మల్లమ్మ పాత్రలో 'శ్రీకర కరుణాల వాల' అనే పాట చాలా హిట్.  అంతస్తులు చిత్రంలో గొప్పింట పుట్టి పేదరికంలో పెరిగి రాటు దేలిన మహిళగా ఆమె నటన అద్భుతం. ఆ పాత్రలో 'దులపర బుల్లోడో దుమ్ము దులపర బుల్లోడో' అనే పాట ఆదరణ పొందింది. ఇలా చెప్పుకుంటూ పొతే ప్రతి పాత్ర ఒక మాణిక్యమే. - చండీ రాణి, సారంగధర, చింతామణి, వివాహబంధం, మట్టిలో మాణిక్యం - లాంటి పాత్రకు ప్రాధాన్యమున్న పాత్రలు ఎన్నో.  80 - 90 దశకాల్లో తల్లి, నాయనమ్మ, అమ్మమ్మ పాత్రల్లో ఉత్సాహంగా ఉరకలు వేసి మనల్ని ఉబ్బి తబ్బిబ్బు చేశారు. మంగమ్మ గారి మనవడు చిత్రంలో మంగమ్మ పాత్ర మరిచిపోలేనిది. 'శ్రీ సూర్య నారాయణా మేలుకో' అనే పాట వీనుల విందు. అలాగే బామ్మ మాట బంగారు బాట, పెద్దరికం, సామ్రాట్ అశోక లాంటి చిత్రాలెన్నో తన శైలిలో నటించి సుదీర్ఘమైన చలన చిత్ర వృత్తిని సార్థకం చేసుకున్నారు.

అంతే కాదు, భరణి పతాకంపై వచ్చిన కొన్ని చిత్రాలకు దర్సకత్వం కూడా వహించారు.  చెన్నైలో సంగీత కళాశాల ప్రధాన అధ్యాపకురాలుగా సమర్థవంతంగా నిర్వహించారు.సాంఘిక సేవ కార్యక్రమాలలో పాల్గొని తన వంతు సేవ చేశారు.
చిత్రాల్లో నటిస్తూనే ఆమె సాహిత్యాభిరుచిని కూడా తీర్చుకున్నారు. ఆమె భాష, రచనా శైలి ఆమె ఆలోచనా పద్ధతిని పూర్తిగా ప్రతిబింబిస్తుంది. స్వచ్చమైన భాష, చదువరులను కట్టి పడేసే హాస్యంతో అత్తగారి కథలు రాసారు ఆమె. నాలో నేను అనే ఆత్మకథలో ఆమె తన జీవితాన్ని మనకు వివరించారు సహజమైన శైలిలో. ఆమె రచనలకు సాహిత్య అకాడెమి పురస్కారం కూడా లభించింది.

భారత ప్రభుత్వంచే పద్మ భూషణ్, మూడు సారులు జాతీయ స్థాయిలో ఉత్తమ నటి అవార్డు, ఆంధ్ర, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వారిచే గౌరవ డాక్టరేట్, ఎన్టీఆర్, రఘుపతి వెంకయ్య, కలైమామణి అవార్డు - ఇలా ఎన్నో. నటి, గాయని, రచయిత, దర్శకురాలు, నిర్మాత, అధ్యాపకురాలు - ఇలా వివిధ పాత్రలలో తన సత్తా చాటి, తనకంటూ ఒక ప్రత్యెక స్థానాన్ని ఏర్పరుచుకున్న బహుముఖ ప్రజ్ఞాశీలి డాక్టర్ భానుమతి.  ఆవిడ తెలుగుజాతిలో మరోమారు కళాకారిణిగా జన్మించాలని నా కోరిక. ఆవిడ పాడిన పాటల్లో నాకిష్టమైనది చక్రపాణి చిత్రం నుండి మెల్లమెల్లగా అనే ఈ గీతం. చూడండి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి