RightClickBlocker

15, జులై 2010, గురువారం

అత్రి మహర్షి, అనసూయ మాత - దత్తాత్రేయ జననం| గురుర్బ్రహ్మా  గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మా తస్మైః శ్రీ గురవే నమః||

పతివ్రతల్లో అగ్రగణ్యురాలు అత్రి మహర్షి పత్ని అనసూయ మాత. అత్రి అంటే త్రిగుణాలను జయించిన వాడు అని (సత్వరజస్తమో గుణములు), అనసూయ అంటే అసూయ లేనిది అని అర్థం. అత్రి సప్తర్షులలో ఒకడు, బ్రహ్మ పుత్రుడు. కర్దమ ప్రజాపతి, దేవహూతిలకు పుట్టిన పుత్రిక అనసూయ. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు శ్రీ గురుచరిత్ర ప్రవచనంలో ఈ అనసూయ మాత గొప్పతనం గురించి అద్భుతంగా చెప్పారు.ఆయన ప్రవచనంనుంచి ఈ ఆదర్శ దంపతులు, దత్తాత్రేయ జననం గురించి వివరం. 

రామాయణంలో అత్రి, అనసూయల ప్రస్తావన వస్తుంది. ఆవిడ పండు ముసలి ఆ యుగంలో. సీతారాములు అత్రి మహర్షి ఆశ్రమానికి వచ్చినప్పుడు అత్రి మహర్షి ఈవిడ ఒక్క మానవుల చేతనే కాదు సమస్త లోకములకు వంద్యురాలు అని పరిచయం చేస్తాడు సీతమ్మకు. ఆవిడ ఎంత గొప్పదో దీన్ని బట్టి తెలుస్తుంది. అనసూయలాగా అసూయ లేకుండా ఉండాలంటే 1 .  నీకన్న పైనున్న వారి గుణములను గుర్తించి, అంగీకరించి నలుగురి ముంది స్తుతించటం, వారిలా నేను అయితే బాఉండు అని అనుకోవటం 2 .  మీకన్నా కింద ఉన్నవారిని అయ్యో వీరి దుర్గుణములు పోగొట్టుకొని ఉన్నత స్థానాన్ని ఎప్పుడు పొందుతారో అని అనుకోవటం. అనసూయ సమస్త జగమును ప్రేమించటం తప్ప ఎన్నడు దూషణ, అసూయ లేకుండా చూసింది. అలా త్రిగుణాలకు అతీతుడైన అత్రి, ప్రేమ తత్వ రూపమైన అనసూయల దాంపత్యం అనుపమానం, అపూర్వం.

ఆ అనసూయమ్మ మహా పతివ్రత అయ్యింది. మహా పతివ్రత ఎలా అయ్యింది?. దోషం లేని భర్తను అనుసరించి. ఆ తల్లికున్న గొప్పతనం ఏంటంటే - వివాహమయ్యిన క్షణం నుంచి భర్తను అనుగమించటం, భర్త మాటను ధర్మంగా పాటించటం. అలా ఉంది నా భార్య అని అత్రి సీతమ్మకు చెప్తాడు. ఒడిలి, ఒంగి, పండు అరిటాకులా ఉన్న అనసూయమ్మ సీతను ఆశీర్వదించి - నీవు భాగ్యవంతురాలివి తల్లి - అంటుంది.  సీతమ్మ వెంటనే చిరునవ్వుతో 'అవునమ్మ నాకన్నా భాగ్యవంతురాలు లేదు' అంటుంది. 'భోగ భాగ్యాలు, సుఖాలు, కన్నవారిని వదిలి భర్త, భర్త మాటయే పరమావధిగా తలచి కానలకు వచ్చావు తల్లి' అని శ్లాఘిస్తుంది అనసూయ సీతమ్మను. సీత రాములకు  అత్రి, అనసూయల దర్శనంతో అయోధ్య కాండను ముగిస్తాడు వాల్మీకి.

'అనసూయ పాతివ్రత్యం ఎలాంటిది అంటే - మహా క్షామం పదేళ్ళపాటు వచ్చింది ప్రపంచంలో. అప్పుడు అనసూయమ్మ నన్ను అనుగమించిన పాతివ్రత్యంతో గంగానదిని ప్రవహింపచేసింది. చెట్టు, పుట్ట, చేమ, ప్రాణి కోటిని రక్షించింది' - అని సీతమ్మకు చెప్తాడు అత్రి.  'భర్తను అనుగమించి వచ్చావు సీతమ్మ' అని ఎంతో ఆనంద పడుతుంది అనసూయమ్మ. అప్పుడు సీతమ్మ 'అమ్మా! నా వివాహ సమయంలో ఈ విషయాన్నే నా తల్లి నాకు చెప్పింది. భర్త మాటయే ఆచారము. ఎప్పుడు నన్నే మనమున ఉంచి, సదాచార సంపన్నుడై, ధర్మ రక్షకుడైన భర్త ఈ రామయ్య. ఆయనను నేను అనుగమించటంలో గొప్పతనం ఏముందమ్మ' అని  అంటుంది సీతమ్మ.  అనసూయ సీతతో ఇలా అంటుంది - 'సభర్త్రుకస్య సహధర్మచారిణి -  ఎప్పుడు భర్తను అనుసరించి ఆయన చెప్పినట్టు చేయడమే నీకు గొప్ప ధర్మము. అలా ఉండటం వల్ల కీర్తి, ధర్మము సంపూర్ణమవుతాయి'. అలా రామాయణంలో స్త్రీ ధర్మాన్ని బోధించిన మహా పతివ్రత అనసూయ. భర్త అనుమతితో పదివేల సంవత్సరాలు తపస్సు చేసిన మహాతల్లి. భర్తచే పొగడబడి, భర్త అనురాగము చూరగొన్న స్త్రీ ఈ మహా పతివ్రత అనసూయ.

ఆ అనసూయను త్రిమూర్తులు శ్లాఘించి 'అమ్మా! నువ్వు లోకానికి ఇంత మేలు చేసావు. నీకు మేము ఏమి ఇవ్వగలం?' అని అడుగుతారు. అప్పుడు ఆ తల్లి 'అమ్మా అని పిలిచారు కదా, అలాగే నా కడుపునా బిడ్డగా పుట్టండి' అని అడుగుతుంది. 'అంతకన్నా మా భాగ్యమేంటి తల్లి' అని ఆ బ్రహ్మ విష్ణు పరమేశ్వరులు ఆశీర్వదిస్తారు అనసూయను. అత్రి మహర్షి కూడా తపస్సు చేస్తే బ్రహ్మ సంతోషించి 'త్రిమూర్త్యాత్మకం గా మీకు పుత్రుడు జన్మిస్తాడు' అని వరమిస్తాడు.

ఒకసారి ముగ్గురు అమ్మలకు (గౌరీ, సరస్వతి, లక్ష్మి) ఈవిడ పాతివ్రత్యాన్ని పరీక్షించాలని అనిపించింది. వెంటనే తమ పతులకు ఆ పరీక్ష పెట్టాలని చెప్తారు. వెంటనే ముగ్గురు మూర్తులు అత్రి మహర్షి ఇంటికి వచ్చి వారి ఆతిథ్యం కోరారు. 'స్నానాచామనాలు చేసి భోజనం చెయ్యండి' అని కోరుతాడు అత్రి. అప్పుడు త్రిమూర్తులు అత్రితో 'మా నియమం భోజనం చేసేటప్పుడు యజమానురాలు నగ్నయై వడ్డించాలి' అంటారు. ఆశ్చర్యపడి అత్రి ఆ విషయాన్ని అనసూయకు చెపుతాడు. అప్పుడు ఆ పతివ్రత భర్తతో 'స్వామీ అలాగే. మీ మర్యాద పోనివ్వను' అంటుంది. అప్పుడు ఆమె ఆలోచించి, భర్త పాదాలకు నమస్కరించి - 'మనసా వాచా కర్మణా అత్రి మహర్షి ఆజ్ఞను  దాటని దాననైతే వీరు ముగ్గురు శిశువులు అవుదురు గాకా' అని మంత్రాక్షతలు చల్లుతుంది. వెంటనే త్రిమూర్తులు పసిపిల్లలుగా మారుతారు. వెంటనే నగ్నయై వడ్డిస్తుంది వారికి. వారి భుజించిన తర్వాత మళ్ళీ సవస్త్రయై వచ్చి 'నేను అత్రి మహర్షి మాటను శిరసావహించిన దాననయితే మీరు పూర్వ స్థితిని పొందుదురు గాక' అని మంత్రాక్షతలు చల్లుతుంది. వారు పూర్వ స్థితిని పొందుతారు.  అప్పుడు ఆవిడకు ఆలోచన వస్తుంది - వీరిని కడుపున పుట్టకుండానే నా బిడ్డలగా చేస్తాను అని మళ్ళీ భర్తను స్మరించి పసిపిల్లల్లా మార్చి ఊయలలో ఊపింది అనసూయమ్మ. ఇక ఆ అనసూయమ్మ అనుమతిస్తే తప్ప త్రిమూర్తులు తమ తమ విధులు నిర్వర్తించలేరు. ఈ విషయాన్ని చూసిన ముగ్గురు అమ్మలు  సిగ్గుపడి అనసూయ వద్దకు వచ్చి 'మా భర్తలకు పూర్వ రూపాన్ని ప్రసాదించు తల్లి' అని ప్రార్థిస్తారు. ఆ అనసూయ వెంటనే త్రిమూర్తులకు పూర్వ రూపాన్ని కలిగిస్తుంది. అప్పుడు ఆ బ్రహ్మవిష్ణుమహేశ్వరులు 'అమ్మా అనసూయ మాతా! నీ కడుపున పుట్టి నీ పాలు తాగి బిడ్డలుగా పెరగాలని ఉందమ్మా!' అని అడుగుతారు. 'తప్పకుండ మీరు మాకు బిడ్డలుగా వచ్చెదరు గాక' అని సంకల్పం చేస్తుంది ఆ తల్లి.  అదే సమయానికి దేవతలు పరిగెత్తుకుంటూ వచ్చి అత్రి మహర్షి కాళ్ళ మీద పడి -  'మహర్షీ! సూర్య చంద్రులను రాహువు తన అస్త్రముల చేత గ్రహిస్తున్నాడు. మీరే రక్షించాలి. సూర్యున్ని మిగల్చండి ఈ లోకానికి' అని ప్రార్థిస్తారు. అప్పుడు అత్రి తన తపశ్శక్తితో సూర్యునికి అక్షయ రూపాన్ని ప్రసాదిస్తాడు. ఒక్క హుంకారంతో రాక్షసులను నాశనం చేస్తాడు. అలా సూర్యచంద్రులను రక్షిస్తాడు అత్రి మహర్షి.

ఇక దత్తాత్రేయ అవతారము:

అత్రి ఆ అనసూయ మాతకు సంతానాన్ని ప్రసాదించాలని సంకల్పిస్తాడు. బ్రహ్మ అంశతో సోముడు (చంద్రుడు), శంకరుడి అంశతో దుర్వాసుడు (తమోగుణ ప్రధానుడై), పూర్ణమైన విష్ణు  స్వరూపంతో, నారాయణ తేజస్సుతో (అంశంగా కాకుండా, పూర్ణ విష్ణు స్వరూపంగా) దత్తాత్రేయుడు జన్మిస్తారు.  అత్రి తేజస్సుతో ఆ ఆత్రేయుడు దత్తాత్రేయుడు గా అవతరించారు. విశ్వానికి తొలి గురువయ్యాడు. సమస్త బ్రహ్మాండం నిండి నారాయణ రూపమైన ఆ దత్తాత్రేయుడు మనకు అత్రి, అనసూయల వలన లభించాడు.

| అవధూతాయ విద్మహే అత్రి పుత్రాయ ధీమహి తన్నో దత్తః ప్రచోదయాత్  |

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి