అంగ భంగిమలు గంగ పొంగులై అన్నారు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు. ఈ గంగ పొంగులు ఎలా ఉంటాయో తెలియాలంటే మీరు ఉత్తరాఖండ్ వెళ్లి తీరాలి. ఉత్తరకాశి జిల్లాలో 10వేల అడుగుల ఎత్తున హిమాలయాలలో గోముఖమునుండి వెలువడిన భాగీరథి 13 కిలో మీటర్ల దిగువన ఉన్న గంగోత్రి వద్ద ఉరకలెత్తుతూ ప్రవహిస్తుంది. ఆ భాగీరథి సామన్యమైన నదా? ఇక్ష్వాకు వంశజుడైన భగీరథుని ప్రయత్నంతో విష్ణు పాదం నుండి శివుని జటాఝూటములో చేరి అక్కడినుండి గంగోత్రి దగ్గర ఈ భువిన అడుగిడింది. మన పాపాలను కడిగే పుణ్యనది ఈ పావన భాగీరథి. గంగోత్రి నుండి ప్రయాణం చేస్తూ దేవప్రయాగ వద్ద అలకనందతో కలసి అక్కడినుండి గంగగా పిలువబడుతుంది. గంగోత్రి వద్ద, దేవ ప్రయాగ వద్ద ఈ గంగమ్మ పరవళ్లు చూస్తే వాల్మీకి మహర్షి రామాయణంలో వివరించినది ఎంత అక్షర సత్యమో అర్థామవుతుంది.అలాగే సీతారామశాస్త్రిగారి భావజాలం ఎంత మనోజ్ఞమో అర్థమవుతుంది. శ్రీమద్రామాయణంలోని గంగావతరణం మీకోసం. సగర పుత్రులకు స్వర్గ ప్రాప్తికై భగీరుథుడు గంగను భువికి రప్పించాడు. ఇది మనకు తెలిసిందే. కాని, అసలు ఏమి జరిగింది అన్న విషయం కొంత తెలుసుకుందాము.
శ్రీమద్వాల్మీకి రామాయణంలో బాలకాండ 38 - 44 సర్గలలో ఈ గంగావతరణాన్ని విశ్వామిత్ర-రామలక్ష్మణ సంవాదంలో వివరించారు. కాళిదాసు రఘువంశం కావ్యంలో రమణీయంగా, విపులంగా ఈ విషయాన్ని రచించారు. నేను ఇంటర్ మీడియట్ రెండో సంవత్సరంలో (రెండవ భాష సంస్కృతం) రఘువంశంలోని ఈ అంశాన్ని చదువుకున్నాను. ఇటీవల రామాయణ పారాయణంలో మళ్లీ పఠించాను.
ఇక్ష్వాకు వంశంలో జన్మించిన సగరునికి ఇద్దరు భార్యలు - కేశిని, సుమతి. వీరికి సంతతి కలుగక, హిమాలయాలకు వెళ్లి భృగుప్రవర్శన మనే చోట తపస్సు చేశారు. వీరి తపస్సుకు మెచ్చి భృగు మహర్షి సగరుడి భార్యలలో ఒకరికి వంశాభివృద్ధి కలిగించే ఒక పుత్రుడు, ఇంకొకరికి అరవై వేల మంది పుత్రులు కలుగుతారు అని ఆశీర్వదిస్తాడు. ఆయన ఆశీర్వాద ఫలంతో కేశినికి అసమంజుడు, సుమతికి అరవైవేలమంది సగర పుత్రులు జన్మిస్తారు. వీరిలో అసమంజుడు దుష్ట చేష్టలు చేస్తూ ఉంటే సగరుడు అతడిని రాజ్య బహిష్కారం చేస్తాడు. అసమంజుని కుమారుడు అంశుమానుడు యోగ్యుడు.
ఈ సమయంలో సగరుడు యాగం తలపెడతాడు. యాగాశ్వాన్ని ఇంద్రుడు అపహరించి కపిల మహర్షి ఆశ్రమంలో దాచుతాడు. దీని వలన యాగం అసంపూర్ణంగా ఉంటుంది. అది తనకు అరిష్టమని గ్రహించిన సగరుడు తన అరవైవేలమంది పుత్రులను అశ్వాన్ని వెదకమని పంపిస్తాడు. భూనభోంతరాళములలో ఎక్కడ ఉన్నా వెదికి తీసుకురమ్మని ఆదేశిస్తాడు. సగర పుత్రులు భూమి అంతటా వెదికి, భూమిలో తవ్వి, సర్పలోకాన్ని వెదికి ఎక్కడ అశ్వం కనిపించక రసాతాలానికి వెళ్తారు. అన్ని దిక్కులు వెదికినా అశ్వం కనిపించదు. ఈశాన్య దిక్కులో శివస్థానంలో భూమిని తవ్వి వెదుకుతారు. అక్కడ కపిల మహర్షి ఆశ్రమంలో వారికి అశ్వం కనిపిస్తుంది. 'ఓరీ దుష్టుడా! నీవే మా తండ్రి గారి యాగాశ్వాన్నిఅపహరించావు' అని ఆ మహర్షిని దూషిస్తారు. అప్పుడు ఆ మహర్షి ఆగ్రహంతో వారిని ఒక్క చూపుతో భస్మీపటలం చేస్తాడు. ఆ మహర్షి క్రోధాగ్నికి భస్మపు కుప్పగా మారుతారు సగర పుత్రులు.
ఎన్నాళ్ళైనా పుత్రులు తిరిగి రాకపోయేసరికి సగరుడు మనుమడైన అంశుమానుడిని యాగాశ్వాన్ని, పిన తండ్రులను వెదకమని పంపిస్తాడు. కపిల మహర్షి ఆశ్రమము వద్దకు వచ్చి వారు దగ్ధమై ఉండటం చూసి దుఃఖితుడవుతాడు. వారికి ఉత్తరక్రియలు జరుపుదామని నిశ్చయిస్తాడు. కానీ, ఆ ప్రాంతంలో ఎక్కడ నీరు అనేది కనిపించదు. అప్పుడు సగర పుత్రుల మేనమామ (సుమతి సోదరుడు) అయిన గరుత్మంతుడు ప్రత్యక్షమై అంశుమానుడితో - 'నాయనా, ఇలా దగ్ధమైన నీ పిన తండ్రులకు స్వర్గ ప్రాప్తి జరగాలంటే మామూలు జలం చాలదు. దేవలోకంలో ఉన్న గంగానది వచ్చి వీరి భస్మంపై ప్రవహిస్తే వీరికి స్వర్గ ప్రాప్తి కలుగుతుంది' - అని చెప్తాడు. అంశుమానుడు యాగాశ్వాన్ని తీసుకొని సగరుడి దగ్గరకు తిరిగి వచ్చి జరిగింది వివరిస్తాడు. సగరుడు యాగాన్ని పరిసమాప్తి చేస్తాడు.
సగరుడు గంగను భువికి ఎలా తీసుకురావాలి అన్న దానిమీద నిర్ణయం తీసుకోలేకపోతాడు. తరువాత ముప్ఫై వేల సంవత్సరాలు పాలించి తనువు చాలిస్తాడు. అంశుమానుడు రాజ్యం పాలిస్తాడు. అతనికి దిలీపుడు అని ఒక సుపుత్రుడు జన్మిస్తాడు. అంశుమానుడు కొడుకుకి రాజ్యభారం అప్పగించి తపస్సులకై హిమాలయాలకు వెళతాడు. అంశుమానుడు ముప్ఫై రెండువేల ఏళ్ళు తపస్సు చేసిన తర్వాత స్వర్గ ప్రాప్తి పొందుతాడు కాని గంగను భూమి మీదకు తీసుకు రాలేకపోతాడు.
దిలీపుడు ధర్మబద్ధంగా పాలిస్తాడు. కానీ, ఆయన కూడా గంగను ఎలా తీసుకువచ్చి సగర పుత్రులకు స్వర్గ ప్రాప్తి కలిగించాలి అన్న సంకల్పం,నిశ్చయం చేసుకోలేకపోతాడు. దీని గురించి విచారపడతాడు దిలీపుడు. ఆ విచారంలోనే అతడు ప్రాణం విడుస్తాడు. దిలీపుడికి సర్వ లక్షణ సంపన్నుడైన కుమారుడు కలుగుతాడు. అతడే భగీరథుడు.
భగీరథుడు పుత్రసంతానం లేక విచారంలో ఉంటాడు. అప్పుడు ఆ మహారాజు రాజ్యభారాన్ని మంత్రులకు అప్పగించి, తన పిత్రుదేవతలైన సగర పుత్రుల స్వర్గ ప్రాప్తికి, తనకు పుత్ర సంతాన ప్రాప్తి కోసం ఘోర తపస్సు చేస్తాడు. కొన్ని వేల ఏళ్ళు తపమొనరించిన తర్వాత బ్రహ్మ దేవుడు ప్రత్యక్షమై అతని తపస్సుకి మెచ్చి గంగ ప్రవాహం ద్వారా సాగరపుత్రులకు స్వర్గ ప్రాప్తి, భగీరథుడుకి పుత్రప్రాప్తి వరాలను ఇస్తాడు. కానీ, గంగా ప్రవాహాన్ని తట్టుకొనే శక్తి భూమికి లేదని, ఆ పనికి ఒక్క శంకరుడే సమర్థుడని చెప్పి అంతర్ధానం అవుతాడు బ్రహ్మ.
గంగావతరణం కోసం భగీరథుడు ఏడాది శివుడి గురించి తపస్సు చేస్తాడు. శివుడు ప్రత్యక్షమై గంగను తన శిరస్సులో దాల్చటానికి ఒప్పుకుంటాడు. దేవతలా ఆశీర్వాదంతో గంగావతరణం మొదలవుతుంది.
గంగ పొగరుతో శివున్ని ముంచి పాతాళానికి వెళ్లాలని ఉవ్విళ్లూరుతుంది. శివుడి క్రోధంతో ఆమె మదాన్ని అణిచి తన జటా ఝూటాల్లో ఆమెను బంధిస్తాడు. గంగ ఆ బంధనంలోంచి బయట పడటానికి తీవ్ర ప్రయత్నం చేసి విఫలమవుతుంది. అలా బందీ అయిన గంగను భువి మీదికి వదలమని భగీరథుడు మళ్ళీ శివుని మెప్పించ తపస్సు చేస్తాడు. ఆ సదాశివుడు సంతుష్టుడై గంగను భూమి మీదకు విడుస్తాడు.
అలా శివుని జటా ఝూటాల్లోంచి గంగానది హిమాలయాలలోని బిందు సరస్సు ప్రాంతంలో భూమిని ఏడు పాయలుగా తాకుతుంది - తూర్పు దిక్కుగా హ్లాదిని, పావని, నళిని నదులుగా, పశ్చిమ దిక్కుగా సుచక్షు, సీత, సింధు నదులుగా పారుతుంది.
గంగా ప్రవాహమున సాగి వచ్చిన చేపలు, తాబేళ్లు, మొసళ్ళు మరియు ఇతర జంతువులతో భూమి మిక్కిలి శోబిల్లెను. దివినుండి భువికి దిగి వచ్చిన గంగను దేవతులు, ఋషులు, గంధర్వులు, సిద్ధులు కన్నుల పండువగా, సంభ్రమాశ్చర్యములతో చూశారు. గంగా ప్రవాహము కొన్ని చోట్ల అతివేగంగా, కొన్ని చోట్ల వంకరగా, కొన్ని చోట్ల విశాలముగా, కొన్ని చోట్ల దూకుతూ, తుళ్ళి పడుతూ, ఇంకొక చోట ప్రశాంతముగా సాగింది. దేవతలు, ఋషులు మున్నగు వారు "ఈ జలము శివుని శిరస్సునుంది పడింది, కనుక అతి పవిత్రమైనది" అని తలచుకుంటూ, ఆ నీటిని తమ శిరస్సుపై చల్లుకొని ఆచమనం చేశారు. శాపం వలన దివినుండి భువికి చేరినవారు ఈ గంగలో మునిగి పాపరాహితులై, తిరిగి తమ లోకాలకు వెళ్లారు. పవిత్ర గంగానదీ స్నానముచే జనాలు అలసటలు తొలగి సంతోషించారు.
ఏడవ పాయ భగీరథుడి రథాన్ని దక్షిణ దిక్కుగా అనుసరించి, జహ్ను మహర్షి ఆశ్రమాన్ని, యజ్ఞ వాటికను ముంచెత్తుతుంది. ఆ మహర్షి ఆగ్రహం చెంది ఆ నదిని మింగేస్తాడు. దేవతలు, ఋషులు, యక్షులు, గంధర్వులు ఆ మహర్షి పాదాలపై పడి గంగను వదలమని ప్రార్థిస్తారు. అప్పుడు శాంతించిన జహ్ను మహర్షి తన చెవి ద్వారా గంగను వదులుతాడు. అలా జహ్ను మహర్షి కుమార్తెయై గంగ జాహ్నవి అనే నామంతో కూడా పిలవబడింది. దక్షిణ దిశగా ప్రవహించి సాగరంలో కలిసి, పాతాళానికి వెళ్లి సగర పుత్రులను పావనం చేస్తుంది గంగ.
అప్పుడు బ్రహ్మాది దేవతలు ప్రత్యక్షమై భగీరథుడిని ప్రశంసించి, సాగరపుత్రులకు స్వర్గాలోకాలను అనుగ్రహిస్తారు. పిత్రుదేవతలకోసం అంతటి కష్టతరమైన కార్యం సాధించిన భగీరథుడికి ఎన్నో వరాలు ఇస్తారు. గంగావతరణానికి కారకుడైన అతడిని భువిలో గంగకు తండ్రిగా శ్లాఘిస్తారు. అప్పటినుంచి గంగ భాగీరథిగా ప్రసిద్ధి చెందింది.
గంగ మూడు లోకాలు (దివి, భువి, పాతాళం), మూడు దిక్కులు (తూర్పు, పడమర, దక్షిణ) పారింది కనుక త్రిపథగ గా పేరొందింది. అలా అవతరించిన గంగా నది ఈ అవనిలో అత్యంత పావనమైన నదిగా విశ్వ విఖ్యాతి పొందింది.
గంగను ఎన్నో విధాలా ఎంతో మంది నుతించారు . ఆదిశంకరులు గంగాష్టకంలో అద్భుతంగా ఈ తల్లిని నుతించారు.
భగవతి తవ తీరే నీరమత్రసనోహమ్
విగతవిషయతృష్ణ కృష్ణమారధాయమి
సకలకలుషభంగే స్వర్గసోపనసంగే
తరలతరతరంగే దేవి గంగే ప్రసీద
భగవతి భవలీలామాలే తవాంభః
కణమణుపరిమాణం ప్రాణినో యే స్పృశంతి
అమరనగరనారీచామరగ్రాహిణీనాం
విగతకలికలంకాతంకమంకే లుఠంతి
బ్రహ్మాండం ఖండయంతీ హరశిరసి జటావల్లిముల్లాసయంతీ
స్వర్లోకాదాపతంతీ కనకగిరిగుహాగండశైలాత్‍స్ఖలంతీ
క్షోణీపృష్ఠే లుఠంతీ దురితచయచమూనిర్భరం భర్త్సయంతీ
పాథోధిం పూరయంతీ సురనగరసరిత్పావనీ నః పునాతు
మజ్జన్మాతంగకుంభచ్యుతమదమదిరామోదమత్తాలిజాలం
స్నానైః సిద్ధాంగనానాం కుచయుగవిగలత్కుంకుమాసంగపింగమ్
సాయంప్రాతర్మునీనాం కుశకుసుమచయైశ్ఛిన్నతీరస్థనీరం
పాయన్నో గాంగమంభః కరికరమకరాక్రాంతరం హస్తరంగమ్
ఆదావాదిపితామహస్య నియమవ్యాపారపాత్రే జలం
పశ్చాత్పన్నగశాయినో భగవతః పాదోదకం పావనమ్
భూయః శంభుజటావిభూషణమణిర్జహ్నోర్మహర్షేరియం
కన్యా కల్మషనాశినీ భగవతీ భాగీరథీ దృశ్యతే
శైలేంద్రాదవతారిణీ నిజజలే మజ్జజ్జనోత్తారిణీ
పారావారవిహారిణీ భవభయశ్రేణీ సముత్సారిణీ
శేషాంగైరనుకారిణీ హరశిరోవల్లీదలాకారిణీ
కాశీప్రాంతవిహారిణీ విజయతే గంగా మనోహారిణీ
కుతో వీచీర్వీచిస్తవ యది గతా లోచనపథం
త్వమాపీతా పీతాంబరపురవాసం వితరసి
త్వదుత్సంగే గంగే పతతి యది కాయస్తనుభృతాం
తదా మాతః శాంతక్రతవపదలాభోఽప్యతిలఘుః
గంగే త్రైలోక్యసారే సకలసురవధూధౌతవిస్తీర్ణతోయే
పూర్ణబ్రహ్మస్వరూపే హరిచరణరజోహారిణి స్వర్గమార్గే
ప్రాయశ్చితం యది స్యాత్తవ జలకాణికా బ్రహ్మహత్యాదిపాపే
కస్త్వాం స్తోతుం సమర్థః త్రిజగదఘహరే దేవి గంగే ప్రసీద
మాతర్జాహ్నవీ శంభుసంగమిలితే మౌళౌ నిధాయాంజలిం
త్వత్తీరే వపుషోఽవసానసమయే నారాయణాంఘ్రిద్వయమ్
సానందం స్మరతో భవిష్యతి మమ ప్రాణప్రయాణోత్సవే
భూయాద్భక్తిరవిచ్యుతా హరిహరాద్వైతాత్మికా శాశ్వతీ
గంగాష్టకమిదం పుణ్యం యః పఠేత్ప్రయతో నరః
సర్వపాపవినిర్ముక్తో విష్ణులోకం స గచ్ఛతి
ఆది శంకరులు గంగమ్మను మూడు లోకాల పాపాలను హరించే దేవతగా అభివర్ణించారు. అదే రీతిలో మరెందరో గంగమ్మను నుతించారు. ఆ తల్లి మహాత్యం మిగిలిన వివరాలు తరువాయి భాగంలో
శ్రీ రామ జయ రామ జయ జయ రామ
Chaalaa baavundi! Gangaavataranam enni saarlu vinnaa,choosinaa, chadivinaa aanamdame!
రిప్లయితొలగించండిప్రసాద్ గారూ చాలా బాగా వివరించారు. శంకరాచార్యులవారి గంగా స్థుతి చాలా బాగుంది
రిప్లయితొలగించండి