ఈ మధ్యనే మన యువరాజుగారు నలభై ఏళ్ళు పూర్తి చేసుకున్నాడు. రాజకీయంగా తల్లి అండదండలు, వేరే దిక్కు లేని కాంగ్రెస్ పార్టీ బాగా అయ్యగారిని అత్యున్నత పదవికి దగ్గరికి నెడుతున్నాయి. స్వయంగా మన ప్రధానమంత్రిగారే ఎన్నో సార్లు అయ్యగారు తన కుర్చీలో కూచుంటే బాగుంటుంది, ఆయనకు అర్హత ఉంది అని చాలా సార్లు చెప్పి మేడంకి తన ప్రభుభక్తిని చాటుకున్నారు. చాలామంది ఇది ఆయన వినమ్రత అని తప్పుగా అర్థం చేసుకొని ఆయనను సానుభూతితో చూస్తారు కానీ ఆయనకు ఆ ఇద్దరి భజన చెయ్యకపోతే ఒక్క రోజు కూడా గడవదు. అది అసలు విషయం.
ఇక అబ్బాయిగారు, రాజకీయంగా అన్ని ఆలోచించి తన ఇమేజ్ బాగా పెరిగే విధంగా సరైన అడుగులు వేస్తున్నట్టు కనపడుతోంది. గత లోక్ సభ ఎన్నికల్లో ఆయన అభ్యర్థుల ఎంపికలో ముఖ్య పాత్రధారి అన్న విషయం తెలిసిందే. అలాగే ఉత్తరప్రదేశ్లో అడుగంటిన కాంగ్రెస్ వోటుబ్యాంకును పెంచి 18 లోకసభ స్థానాలు గెలవటానికి కష్టపడ్డారు. మాయావతితో తలపడ్డట్టే ఉండి అవిశ్వాస తీర్మానంలో అక్కయ్య మద్దతు కోసం లోపాయకారి ఒప్పందం చేయించటంలో కూడా అబ్బాయి, మేడం పాత్ర చాలా ఉంది.
రూపం చూసి పడిపోయే భారతీయ ఓటరు అబ్బాయిగారికి పట్టం కడితే ఉబ్బి తబ్బిబ్బయిపోతాడు. ఎందుకంటే మనకు ఆ కుటుంబం తప్ప దిక్కులేదు. అందులో, ప్రతిపక్షం అధ్వాన్న స్థితిలో ఉంది. ప్రస్తుత ప్రధానిగారు వయస్సు మీరుతున్నారు. తల్లిగారేమో నాకు వద్దు ఈ కుర్చీ అని త్యాగ రాణి అయ్యారు. తను ప్రధాని అయితే తన విదేశి గతం కాంగ్రెస్ ను, తనను రాజకీయంగా దెబ్బతీస్తుంది అని బాగా అర్థం అయ్యి మేడం అబ్బాయిగారిని ముందుకు నెట్టారు. తన తండ్రిలా ఒకేసారి ప్రధాన మంత్రి అవ్వకుండా అబ్బాయిగారు ఒక్కోమెట్టు ఎదుగుతున్నట్టు మనకు సినిమా చూపిస్తున్నారు. ఆయన ఇప్పటికే రెండోసారి ఎంపీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి. అలాగే బుందేల్ఖండ్, అమేథీ ప్రాంతాల మనోభావాలను, వెనుకుబాటుతనాన్ని ఉదహరించే పాత్రలో మంచి పావులు కదుపుతున్నారు.
యువతకు మార్గదర్శిగా, వారిని రాజకీయాల్లోకి రావాలని ఉత్తేజపరుస్తూ, అప్పుడప్పుడు కాలేజీలు, స్కూళ్ళకు వెళుతూ తను వారికి ప్రతినిధిగా, ప్రతిబింబంగా ఒక ఇమేజ్ చాలా జాగ్రత్తగా నిర్మిస్తున్నాడు ఈ యువరాజు. పేద ప్రజలతో ఫోటోలు, గ్రామాలకు వెళ్లి గుడిసెల్లో భోజనం చెయ్యటం, వారితో కాసేపు గడిపి ఆ వూరి ప్రజలను సమ్మోహితులను చెయ్యటం ఆయనకు నాయనమ్మ, తండ్రి దగ్గరనుంచి బాగా అబ్బింది. ఈ విద్యలో మన కాంగ్రెస్ నాయకులను మించిన వాళ్లు లేరు. ఉభయ భాష పరిజ్ఞానము (హిందీ, ఇంగ్లీష్), స్ఫురద్రూపము, అన్నిటికి మించి అత్యంత శక్తివంతమైన పరంపర, పార్టీ ఆయన వెంట ఉన్నాయి. ఆయనకు పార్టీలో ఎదురు లేదు. ఎదురు ఉండే అవకాశము లేదు. గత ఎన్నికల్లో పార్టీకి 206 సీట్లు రావటం ఆయన చలవే అని మీడియా మనల్ని ఇప్పటికే నమ్మించేసాయి. జరిగింది కూడా అదేనేమో. 2014 ఎన్నికల్లో (వీలయితే ఈలోపే) అబ్బాయిగారు ప్రధాని అవ్వటానికి అన్ని విధాలుగా పరిస్థితులను ఏర్పరుస్తున్నారు మేడం. ఆయనలాగా ఆలోచించి ఆయనకు తోడు నీడగా ఉండే రెండోతరం నాయకులు ఇప్పటికే కేంద్ర మంత్రివర్గంలో మంత్రులుగా పని చేస్తున్నారు. పాతనీరు ఇంకొక 2 -3 ఏళ్ళల్లో తెరవెనకకు వెళ్లే అవకాశం ఉంది.
ఆ పార్టీలో గత్యంతరం అయ్యి, ఆ కుటుంబం వద్దు అనుకుంటే తప్ప వేరే వాళ్లకు అగ్రతాంబూలం దక్కే అవకాశం లేదు. కాబట్టి అబ్బాయిగారికి గ్రహాలూ,దారులు అన్ని రేస్ కోర్సు రోడ్ వైపు చూపిస్తున్నట్టే. పార్టీ మంచి పరిస్థితిలోనే ఉంది. ఎన్నికలు బానే గెలుస్తున్నారు, దేశం అంతో ఇంతో ముందుకు వెళ్తోంది, ప్రతిపక్షం దీనావస్థలో ఉంది, రాజకీయ దురంధరులు ఏఐసీసీ కోర్ కమిటీ సభ్యులు, మేడంకు రాజకీయ సలహాదారులు, వ్యాపార అగ్రగాములు ఆమెకు వెన్నంటి ఉన్నారు. ఇవన్ని అబ్బాయిగారి పట్టాభిషేకానికి మంచి శుభసూచకాలు. అదును చూసి భీష్మాచార్యుల్ని రిటైర్ చేయించి ఏ రాష్ట్రపతి పదవో ఇచ్చేస్తే, మన అబ్బాయిగారి రాజ్యాభిషేకం జరపవచ్చు.
ఈ మధ్యనే మన సారథి ధోని కూడా మూడు ముళ్ళు వేసేశాడు. అయ్యా మరి, మీరుకూడా ఆ పనేదో కానిచ్చి మాకు భావి ప్రధాన మంత్రిని, కాంగ్రెస్ పార్టీ అధినేతను ఇవ్వాలి కదా?. ఇస్తే నాయనమ్మ వానప్రస్థానికి వెళ్ళొచ్చు. చెల్లెలి పిల్లకు కూడా ఉన్నారు కానీ ఎంతైనా మీ రక్తం మీదే కదా. తొందరగా మాకు నాయకత్వ వారసత్వాన్ని ఇస్తే మేము ఇప్పటినుంచే వారి భజన, పూజ చేసి "నీవే తప్ప ఇతః పరంబెరుగ సంరక్షించు భద్రాత్మకా" అని గజేంద్రుడు శ్రీ మహావిష్ణువుని వేడుకున్నట్టు వేడుకొని వారి పాదాక్రాన్తులమై ఇంకొన్ని వందల ఏళ్ళు మీ వంశాభివృద్ధికి పాటు పడతాము.
లలితా సహస్ర నామాలు మొదలయ్యేది - 'శ్రీ మాతా శ్రీ మహారాజ్ఞీ' తో. అలా మాకు రాజమాత, పెద్దదిక్కు అయిన మేడం త్వరగా పుత్రుడికి వివాహం చేస్తారని ఆశిస్తూ...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి