RightClickBlocker

8, జులై 2010, గురువారం

ఎనభై ఏళ్ల బాలుడు బాలమురళి

ఆయన ముఖం చూస్తే ఏ అరవై ఏళ్ళు ఉంటాయో అనిపిస్తుంది. కళ్ళు మూసుకొని ఆయన గాత్రం వింటే ఏ నలభై ఏళ్ళు ఉంటాయో అనిపిస్తుంది. కేవలం ఆయన నవ్వునే చూస్తే ఏ ముప్ఫై ఏళ్ళు ఉంటాయో అనిపిస్తుంది. ఆయన మాట వింటే పదేళ్ళ పిల్లాడిలా కిల కిల మంటూ ఉంటుంది. ఆయన తెలుగు భాష తేనె లాగ తియ్యగా, మందాకినీ జలాల అంత స్వచ్చ్చంగా సరస్వతీ దేవి వీణాగానంలా వీనులకి హాయిగా ఉంటుంది. ఆ సంగీత సామ్రాజ్య స్వర సార్వభౌముడు ఎనభై వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా వాగ్దేవి మానసపుత్రునికి నా పాదాభివందనములు. మురళీ గాన రసాస్వాదనలో మునిగి తేలుతున్న వీక్షక, ప్రేక్షక జనానీకం,  రసప్రియులు, రసజ్ఞుల తరపున పద్మ విభూషణ్ డా|| మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారికి జన్మ దిన శుభాకాంక్షలు. ఆ సరస్వతీదేవి మీ నోట ఇలానే నూరు వసంతాలు పలకాలని మా ఆకాంక్ష.

'ఎందరో మహానుభావులు' అని ఘన రాగ పంచరత్న కీర్తన పాడినా,  'ఏ తీరుగ నను దయ చూసేదవో'  అని రామదాసు  కీర్తనలను ప్రాచుర్యంలోకి తెచ్చినా, ' 'పిబరే రామ రసం' అని భక్తి రసం ఒలికిన్చినా, 'అసమానమైన తిల్లాన మురళీగాన వినోదమైన తిల్లాన' అని తిల్లానలకు ఆది గురువుగా, 'ఏమి సేతురా లింగా' అని పామరులు పాడుకొనే తత్త్వ గీతాన్ని పాడినా, 'ఓంకార ప్రణవ' అని స్వీయ రచనలో స్తుతించినా,  'సలలిత రాగ సుధా రస సారం' అని నర్తనశాల చిత్రంలో బృహన్నల పాత్రకు జీవం పోసినా, 'మౌనమే నీ భాష ఓ మూగ మనసా' అని గుప్పెడు మనసులో ఆత్రేయ గీతానికి అత్యున్నత కీర్తి తెచ్చిపెట్టినా - ఇలా చెప్పుకుంటూ పొతే కొన్ని పేజీలు  అయిన చాలవు ఆ మహానుభావుడి బహు కళా ప్రావీణ్యానికి.

శుద్ధ స్ఫటిక సంకాశంలా ఆయన కర్నాటక సంగీత ప్రవాహం, మంజుల సౌరభ మృదు కుంజంలా ఆయన సినీ నేపథ్యగానం, నటన, వాగ్గేయకారుడిగా ఎన్నో కీర్తనలు, రాగాలను సృష్టించిన ఆయన సంగీత జ్ఞానం - ఇవన్ని ఒక ఎత్తు. ఆయన పాడేటప్పుడు కనిపించే భక్తి, జ్ఞానము, లయ, కొత్త దనము, విని, చూసేవారిని సమ్మోహితుల్ని చేసే ఆయన స్వర ఝరి, వినమ్రత ఇంకొక ఎత్తు.

తెలుగు భాషను ఖూనీ చేసే ఛాందస తమిళ సంగీతకారుల ప్రవాహానికి, ధాటికి తట్టుకొని, నిలబడి, శిఖరాన్ని అధిరోహించి అక్కడ దశాబ్దాలు నిలబడగలిగిన ఏకైక సంగీతజ్ఞుడు ఆయన. సంగీతంలో ఉత్సాహాన్ని, జ్ఞానాన్ని, భక్తిని, రక్తిని, అనురక్తిని ఒకే కచేరిలో చూపించే విశిష్ట గాయకుడు బాలమురళి గారు. 25000 కు పైగా కచేరీలు, 400 కు పైగా కృతిరచనలు చేసి ఇప్పటికీ నవయవ్వనంలో ఉన్న గాయకుడిలా ఆడుతూ పాడుతూ పాడేస్తున్నారు మంగళంపల్లి.

తెలుగునాట టెలివిజన్ లేనప్పుడు రేడియోలో భక్తి గీతాలు, తత్వాలు, దాస సంప్రదాయ కీర్తనలు, లలిత గీతాలను తన గానంతో బహుళ ప్రాచుర్యంలోకి తెచ్చారు. 'గాయతి వనమాలీ' అనే సదాశివ బ్రహ్మేంద్ర కృతి, 'శ్రీ కృష్ణా యను నామ మంత్రము' అనే అమర నారేయన కృతి,  'రామ రామ యనరాద' అనే రంగదాసు కృతి - ఇలా ఎన్నో ఆయన వాక్ప్రవాహంలో ప్రసిద్ధి పొందినవి.

ఆ మహనీయుడికి ప్రభుత్వం అత్యున్నత పురస్కారమైన భారత రత్న ఇవ్వాలని ఆకాంక్షిస్తూ ఆయన సంగీత ప్రవాహం ఇలానే కొనసాగాలని ప్రార్థన.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి