నదులకు కవిత్వానికి ఏదో అవినాభావ సంబంధం. వేటూరి వారు 'కృష్ణా తరంగాల సారంగరాగాలు' అంటూ మూడు దశాబ్దాల కింద శంకరభారణంలో, 'ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి' అంటూ ఇటీవల గోదావరిలో, రెండు దశాబ్దాల ముందు ఆరుద్ర గారు 'వేదంలా ఘోషించే గోదావరి అమర ధామంలా శోభిల్లే రాజమహేంద్రి' అంటూ ఆంధ్రకేసరి చిత్రంలో మనకు అందుబాటులో ఉండేటట్లు చక్కని గీతాల్ని అందించారు. సాహిత్యము, చారిత్రిక కట్టడాలు, పుణ్యక్షేత్రాలు వాటి పోషకులు నదీ పరీవాహక ప్రాంతాల్లో అభివృద్ధి చెందాయి అనటానికి ఎన్నో తార్కాణాలు. విజయనగర సామ్రాజ్యము, చోళులు, పాండ్యులు, మహా వాగ్గేయకారులు, రెడ్డి రాజులు, వెంగీరాజులు, అమరావతి కథలు - ఇలా చెప్పుకుంటూ పోతే అనంతమైన చిట్టా నదీనదాలను అల్లుకుని. మరి ఇంత అద్భుతమైన చరిత్ర గలిగిన నదులు మనరాష్ట్రం గుండా ప్రవహిస్తూ ఉంటే వాటికి సంబంధించిన కథలు, గాథలు ఎన్నో.
ఇక రంగంలోకి దూకుదామా?. నాలుగేళ్ల క్రితం వానలు మొదలయ్యిన ఒక నెలకు మా టీం లో ఉన్న ఔత్సాహికులు పోలవరం ప్రాజెక్ట్ వస్తే పాపికొండలు మునిగి పోతాయి అని, పాపికొండలు చూద్దాం ప్రసాద్ గారు అంటే, వెంటనే నాలుగు కుటుంబాలతో ఒక ప్రణాళిక వేసాము. గోదావరి ఎక్ష్ప్రెస్స్ రైలెక్కి రాజమండ్రిలో అర్థరాత్రి దిగాము. అక్కడ అక్షయ హోటల్లో ఏసీ రూమ్స్ ముందే బుక్ చేసుకుని దిగాము. కాసేపు పడుకొని ఉదయం ఫలహారం చేసి పాపికొండల యాత్ర కోసం టికెట్ బుక్ చేసాము. పాపికొండల యాత్రకు వెళ్లే మోటర్ పడవలు పట్టిసీమ నుంచి బయలుదేరుతాయి. బోటులో ఆట, పాట, ఆహారం, పానీయాలు, అల్పాహారాలు అన్ని ఆంధ్ర ప్రదేశ్ టూరిజం వాళ్ళదే. చిరుతిళ్ళు కొనుక్కోవటానికి వసతి కూడా ఏర్పాటు చేసారు.
దాదాపు 50 మంది పట్టే మోటర్ బోటులో బయల్దేరాము. పట్టిసీమలో వీరేశ్వరుడి దేవస్థానం చాలా పురాతనమైనది. నది మధ్యలో ఉన్నట్టుగా ఉంటుంది. ఈ ఒడ్డు నుంచి ఈ దేవస్థానంకి వెళ్ళాలంటే పడవనుంచి ఒక కిలోమీటర్ దూరం ఇసుకలో నడవాలి. నీళ్ళు బాగా ఉంటే దూరం తగ్గొచ్చు. తప్పకుండా చూడాల్సిన దేవస్థానం కాబట్టి బద్ధకంగా పడవలో కూర్చోకుండా దిగి నడిస్తే మీకు అర్థం అవుతుంది ఆ అనుభూతి ఎంత బావుంటుందో. స్వాతిముత్యం చిత్రంలో సువ్వి సువ్వి పాట ఇక్కడ చిత్రీకరించిందే.
బోటు ప్రయాణంలో మొదటి ఆసక్తి కరమైన అంశం పోలవరం ప్రాజెక్ట్ మొదలు, చివరలు. అది దాటినా తర్వాత నది మధ్యలో ఒక చిన్న గుడి కనిపిస్తుంది. వరదలు వచ్చినప్పుడు ఈ గుడి మునుగుతుందని బోటు డ్రైవర్ చెప్పాడు. తర్వాత దేవీపట్నం మలుపు చాలా బాగుంటుంది. అక్కడ నది పూర్తిగా ౯౦ డిగ్రీలు మలుపు తిరుగుతుంది. ఈ మలుపు దగ్గర నదిలో సుడిగుండం ఉంది. అందుకని బోటు ఒడ్డుకు దగ్గరగా, వీలైనంత మెల్లగా వెళ్తుంది. ఇక్కడ నది ఒడ్డునే ఉన్న పోచమ్మ చాలా మహిమగలదని నానుడి. ఈ మలుపు తర్వాత ఇక అసలు పాపికొండల యాత్రకు నాంది.
ఇరుపక్కల ఇసుక తిన్నెలు, పచ్చని చెట్లతో నిండిన పర్వతాలు, అక్కడక్కడ కనిపించే ఆదివాసీలు. పూర్తిగా నిశ్శబ్దంగా సిటీ రణగొణ ధ్వనికి దూరంగా ప్రకృతిమాత ఒడిలో ఉండే వారిజీవితం ఎంత నిరాడంబరమో. నదిలో చేపలు పడుతూ, చిన్న చిన్న పడవలలో అటు ఇటు వస్తువులు చేర వేసుకుంటూ, పాటలు పాడుకుంటూ చీకు చింత లేకుండా ఉన్నారా వారు అనిపించింది. శంకరాభరణం చిత్రంలో సా రి గ రీ గ ప దా పా స రి గ ప దా ప గ రీ రి గ ప ద సా నీ దా పా గ ప ద ప ద ప...అనే సన్నివేశం/పాటలో శంకర శాస్త్రి నదిలో పాడుతూ, పిల్ల చేత పాడిస్తూ, తర్వాత తులసి పాత్రలో మంజు భార్గవి ఇసుక మీద నాట్యం చేసే సన్నివేశం చిత్రీకరించిన ప్రాంతం, మేఘ సందేశం చిత్రంలో 'ప్రియే చారుశీలే' లాంటి పాటలు చిత్రీకరించిన ప్రాంతం ఈ ప్రయాణం మొదటి భాగంలో కనిపిస్తాయి. మనస్సు, కళ్ళు అలా సమ్మోహితమై చూస్తూనే ఉంటాయి ఈ యాత్రలో ప్రకృతి అందాలను.
పచ్చదనం, ఇంకా మానవుడి ఆక్రమణ, అరాచకానికి గురి కానీ ప్రాంతాలు, అడవులు నదికి రెండు వైపులా. అక్కడక్క ఎప్పుడో ఋషులో/యోగులో మునులో ఇక్కడ తపస్సు చేసారా అనే ఆనవాళ్ళు కనిపిస్తాయి. 4 గంటల పాటు సాగే యాత్రలో ముందుకు వెళ్తున్న కొద్దీ నది ప్రవాహం పెరుగుతుంది. వెడల్పు తగ్గి గోదావరి ఉగ్ర రూపము కదల లేక కదుల్తున్న పడవ అనిపిస్తే ఇక పాపికొండలు దగ్గర పడ్డట్టే. ఇక్కడ కొండల ఎత్తు ఎక్కువ, లోయ వెడల్పు తక్కువ కాబట్టి నది వేగంగా ప్రవహిస్తుంది.
బోట్లో కూర్చొని గల గల లాడే గోదావరిని తాకటానికి నేను నా భార్య విశ్వప్రయత్నం చేసాము. అక్కడక్కడ సఫలం అయ్యాము. స్వచమైన గోదావరి నీళ్ళు అలా శరీరాన్ని తాకుతుంటే ఆ అనుభవం వర్ణించలేనిది. ఈ ప్రయాణమంతా మమ్మల్ని మేము మర్చిపోయి, మంత్రముగ్ధులయ్యాము. అక్కడక్కడ నదిలో కలిసే ఉపనదులు, ఏరులు, వాగులు, కాలువలు మహాద్భుతంగా ఉంటాయి. మధ్యలో వాన మొదలయ్యింది. చినుకులు, సూర్య కిరణాలు, ఇంద్ర ధనుస్సు, వేడి, చల్ల గాలి, పులకించి నాట్యమాడే ప్రకృతి, మా మనసులు ఉప్పొంగి పొయ్యాయి.
పాపికొండల దగ్గరకు వచ్చేసరికి మధ్యాహ్నం ఒంటి గంట అయ్యింది. ఆ ప్రాంతంలో భోజనం పెట్టాడు టూర్ గైడ్. మంచి కారం కారంగా శాఖాహార భోజనం వేడి వేడిగా. భోజనం అయ్యేసరికి చివరి మజిలీ పేరంటాళ్ళ పల్లె వచ్చేసింది. ఇక్కడినుంచి భద్రాచలం ఇంకొక 7 - 8 గంటల ప్రయాణం. అక్కడ బోటు ఆపి ఒక కొండ మీద ఆశ్రమం, గుడి చూడమన్నారు. ఆ ఆశ్రమంలో రామకృష్ణ పరమహంస తపస్సు చేసారుట. అక్కడ ప్రకృతి ప్రశాంతత, సౌందర్యం చూస్తే అర్థం అవుతుంది రామకృష్ణులు ఎందుకు ఎంచుకున్నారో ఆ ప్రదేశాన్ని. అక్కడ గిరిజనులు తయారు చేసిన వెదురు వస్తువులు అద్భుతమైన నైపుణ్యంతో చేసిన కళాఖండాలు చాలా తక్కువ ధరకు అమ్ముతారు. ఆ ఆశ్రమము, గుళ్ళు చూసుకొని తిరుగు ప్రయాణం రాజమహేన్ద్రవరానికి మొదలు మధ్యాహ్నం మూడింటికి. మళ్ళా ప్రకృతి సౌందర్యం ఆస్వాదిస్తూ, చూసినవి గుర్తు చేసుకుంటూ పట్టిసీమ రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో చేరాము. నా జీవితంలో మర్చిపోలేని యాత్ర, అనుభూతి ఈ పాపికొండల షికారు యాత్ర.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి