మహా వాగ్గేయకారుడు, అపర రామభక్తుడు త్యాగరాజు వేర్వేరు ఉత్సవాల్లో, వేడుకల్లో సీతారాముల వైభవాన్ని వర్ణిస్తూ రాసిన కీర్తనలు ఉత్సవ సాంప్రదాయ కీర్తనలుగా ప్రసిద్ధి చెందాయి. నిత్య నైమిత్తిక సేవల్లో మేలు కొలుపు, మంగళ స్నానాది శౌచములు, ఆరగింపులు, ఆరతులు, ఊయల, శయనములతో కూడిన షోడశోపచారములు ఈ కీర్తనలకు మూలం. ఆ దివ్య దంపతులు సపరివారసమేతంగా పొందే ఈ సేవలను త్యాగరాజు కన్నులకు కట్టినట్టుగా భక్తితో రమణీయంగా రచించాడు. చిత్తూర్ నాగయ్య గారి త్యాగయ్య చిత్రంలో మరియు కెవి సోమయాజులు గారి త్యాగయ్య చిత్రంలో ఈ వైభవాన్ని అనుభూతి, భక్తి తగ్గకుండా చూపించారు, వినిపించారు. ఆ ఉత్సవ సాంప్రదాయ కృతుల్లో ప్రతిది మన సమాజంలో జరిగే దైవిక ఉత్సవాల్లో భక్తుల నోట మంచి ప్రాచుర్యాన్ని పొందాయి. అందులో ఒకటి సీతారాముల కళ్యాణంలో రాముల వారి గుణగణాలను వర్ణించే ఈ క్రింది కృతి. శంకరాభరణం రాగం ఖండచాపు తాళంలో స్వరపరచబడింది. డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణగారు ఈ కృతితో పాటు మిగతా ఉత్సవ సాంప్రదాయ కృతులను కూడా కమనీయంగా పాడి బహుళ ప్రాచుర్యంలోకి తెచ్చారు.
పల్లవి:
సీతా కళ్యాణ వైభోగమే రామా కళ్యాణ వైభోగమే
చరణాలు:
1 . పవనజ స్తుతి పాత్ర పావన చరిత్ర రవిసోమ వరనేత్ర రమణీయ గాత్ర | సీతా కళ్యాణ |
తాత్పర్యము: వాయుదేవుని పుత్రుడైన హనుమంతునిచే స్తుతించబడిన పావనమైన చరిత్ర గలిగిన వాడు, సూర్య చంద్రులను కన్నులుగా కలవాడు, సుందరమైన శరీరము కలవాడు ఆ రాముడు.
2. భక్తజన పరిపాల భరిత శరజాల భుక్తిముక్తిదలీల భూదేవ పాల | సీతా కళ్యాణ |
తాత్పర్యము: భక్తులను పాలించే కల్పతరువు, శస్త్రాలను ధరించిన వాడు, భుక్తి (జీవనాధారాలైన వృత్తి, భోజనము), ముక్తి ప్రసాదించేవాడు, భూమిని పాలించేవాడు, సీతాపతి ఆ రాముడు.
3. పామరాసుర భీమ పరిపూర్ణ కామ శ్యామ జగదభిరామ సాకేతధామ | సీతా కళ్యాణ |
తాత్పర్యము: అజ్ఞానాన్ని, అసురులను నాశనం చేసేవాడు, భక్తుల కామ్యఫలదాయకుడు, నీలమేఘ శరీరుడు, సకల లోకములలోకెల్లా అందమైన వాడు, సాకేతపురాన్ని పాలించిన వాడు ఆ రాముడు.
4. సర్వలోకాధార సమరైకవీర గర్వమానస దూర కనకాంగ ధీర | సీతా కళ్యాణ |
తాత్పర్యము: ఈ జగత్తు అంతటికి ఆధారమైన వాడు, యుద్ధంలో ఎదురులేని వీరుడు, గర్వానికి దూరంగా ఉండే వాడు, స్వర్ణకాంతితో మెరిసిపోయే ధీరుడు ఆ రాముడు.
5. నిగమాగమ విహార నిరుపమ శరీర నగధరాఘవితార నతలోకాధార | సీతా కళ్యాణ |
తాత్పర్యము: వేదవేదాంగాలు, శాస్త్ర పురాణాలలో వర్ణింపబడి, స్తుతిన్చబడి వాటిలో విహరించేవాడు, అసమానమైన శరీరం కలవాడు, సమస్త ఆభరణ భూషితుడు, పాపశమనుడు, భక్తలోకానికి ఆధారుడు ఆ రాముడు.
6. పరమేశనుత కీర్త భవజలధి పోత తరణి కుల సంజాత త్యాగరాజనుత | సీతా కళ్యాణ |
తాత్పర్యము: శంకరునిచే స్తుతించబడిన వాడు, సంసార సాగరాన్ని దాటించేవాడు, సూర్యవంశంలో జన్మించిన వాడు, త్యాగరాజుచే నుతించబడిన వాడు ఆ రాముడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి