21, జులై 2010, బుధవారం

అమెరికా-ఇండియా: పిల్లలు, తల్లిదండ్రుల ఆలోచనలు

"మా పిల్లలిద్దరూ అమెరికాలో ఉన్నారండి. ఈ మధ్య దాక ప్రతి సంవత్సరం పిల్లల పురుళ్ళనో ఇంకోటనో అక్కడికి వెళ్లి వచ్చే వాళ్లము. డెబ్భై కి దగ్గర పడుతున్నాము. ఇంక అంతంత దూరాలు ప్రయాణం చేత కావట్లేదు. మా వారేమో 'నాకు అక్కడ ఏమి తోచట్లేదు, ప్రతిదానికి వల్ల మీద ఆధార పడాలి,  బయటకి పోవటానికి లేదు, రావటానికి లేదు, ఎప్పుడూ ఆ కొంపలో పడి ఉండాలి.  ప్రతిది వీకెండ్ లో జరగాలి. నేను రాను. ఇక్కడే ఉంటాను, నువ్వు కావాలంటే వెళ్ళు' అంటున్నారు వదిన గారు. అమ్మాయేమో పిల్లల్ని చూసుకోవటం ఇబ్బందిగా ఉంది అని రమ్మని ఒకటే ఫోన్లు.  నాకా మోకాళ్ళ నొప్పులు, బీపీ, ఇప్పుడిప్పుడే షుగర్ కనిపిస్తోంది. నీరసం, దడ. ఒకరోజు బాగుంటే ఇంకొక రోజు పడుకోవటమే. మాకు చేసే వాళ్ళు లేరని మేము కనీసం అనుకోడానికి కూడా లేదు. ఆ చలి, ఆ వాతావరణం పడి చావట్లేదు. ఏమి చెయ్యాలో పాలు పోవట్లేదు వదినగారు. అబ్బాయేమో ఈ మధ్యనే పెళ్లి అయ్యింది, సంపాదనలో ఇప్పుడే పడ్డారు, ఇప్పటికిప్పుడు మాకోసం తిరిగి రమ్మనటం ఎలా?. ఇక్కడ మా పనులకు ఎన్నాళ్ళు బయట వాళ్ల మీద ఆధార పడతాం చెప్పండి?. పిల్లలు అక్కడ, మేము ఇక్కడ ఏంటో ఈ బతుకు."

ఇది ఆంధ్ర ప్రదేశ్ లో వృద్ధాప్యపు అంచున ఉన్న సగటు తల్లిదండ్రుల యొక్క ఆవేదన.  ఇక నాణాన్ని రెండోవైపు తిప్పితే:

"మా ఆవిడ కడుపుతో ఉందిరా. రెండు నెలల్లో డెలివరీ ఉంది. అమ్మ, నాన్నను సాయంగా ఉంటుంది రమ్మని అంటున్నాను. తను ఉద్యోగం ఈ మధ్యనే చేరింది, కాబట్టి వాళ్లు ఇచ్చే  8 వారాల సెలవు తర్వాత బిడ్డ ఎట్లాగ అని టెన్షన్. ఉద్యోగం మానుకుంటేనేమో మళ్ళీ వస్తుందన్న నమ్మకం లేదు. నా ఉద్యోగం అంతంత మాత్రంగా ఉంది ఎప్పుడు ఊడుతుందో తెలియదు. గ్రీన్ కార్డు లేదు. ఉద్యోగం పొతే హెచ్-1 మీద ఉద్యోగాలు తీసుకోవట్లేదు ఎక్కువ. అమ్మ, నాన్నకు  ఆరోగ్యం అంతంత మాత్రమే..ఇక్కడికి వచ్చి జబ్బున పడి నేను సరిగ్గా చూపించలేక ఎలాగా అని ఇంకో పక్క..ఏంటోరా అర్థం కావట్లేదు పరిస్థితి...ఇవన్ని అమ్మ, నాన్నకు చెప్పలేను. పోనీ అత్త గారి వాళ్ళను రమ్మని అందామంటే అంటే మామ గారు ఉద్యోగం సెలవు లేదు, ఆయనకు ఇబ్బంది. "

"అమ్మ, నాన్న బాబు పుట్టినప్పడు వచ్చారే.  నేను ఇంట్లో ఉన్నన్ని రోజులు వాళ్లకి అసలు బోర్ కొట్టలేదు. కానీ ఇప్పుడేమో నేను ఆఫీసుకి వస్తున్నాను. వాళ్ళకు బాబు తప్ప వేరే మొహం పగలంతా లేదు. బాబుని వదిలి ఎక్కడికి వెళ్లే పరిస్థితి లేదు. నాకేమో వీడు ఇంక సెలవులు ఇవ్వట్లేదు. పోనీ ఇంట్లోంచి పని చేద్దామా అంటే పిల్లాడితో సరిగ్గా వర్క్ చూసుకోలేకపోతున్న. ఆఫీసు వాళ్లు ఫోన్ చేసినప్పుడు పిల్లాడి చప్పుడు పక్కన వినిపిస్తే విసుక్కుంటున్నారు. ఇల్లు కొనుక్కున్నాము. ఆ లోన్ బోలెడు. ఒక్క జీతంలో కట్టలేము. కాబట్టి నేను ఉద్యోగం చెయ్యాల్సిందే. వాళ్లకు ఇబ్బంది అని తెలిసినా నాకు వేరే గత్యంతరం లేదే. ఏవైనా ప్రదేశాలు చూపిద్దామ అంటే అన్ని ఒకేలా ఉంటాయి అమెరికాలో మాకు బోర్ అంటున్నారు. ఎక్కడికి పోయిన అదే వాల్మార్ట్,  అదే ఇండియన్ స్టోర్స్. వాళ్లకు ఇండియాను ఇక్కడ సృష్టించలేము కదా. ఆలోచిస్తే పిచ్చెక్కుతోంది."

ఇవి అమెరికాలో ఉన్న పెళ్ళైన సగటు తెలుగు ఆడ, మగల ఆలోచన.  మీరే చెప్పండి ఇందులో ఎవరి తప్పుందో?. ఎవరి బాధల్లో వాళ్ళున్నారు. బాధ్యతలు, సంసారం, డబ్బు, విదేశం, మన సంస్కృతికి దూరం కాకూదన్న తపన, వృద్ధాప్యం, ఒంటరి తనం, పిల్లలతో ఉండాలన్న సహజమైన కోరిక - వీటన్నిట మధ్య కొట్టు మిట్టడుతున్న తల్లిదండ్రులు, పిల్లలు లక్షల మంది.

దీన్ని కొంత విశ్లేషణ చేద్దాము.
  1. పెరిగే వయసులు ఉన్నప్పుడు తల్లిదండ్రులు పిల్లల మీద చాలా ఆశలు పెంచుకుంటారు. వాళ్ళే లోకమని తమ రక్తం ఓడ్చి చదివించి, మేము పడిన కష్టాలు మా పిల్లలు పడకూడదు అన్న ఆలోచనతో తమ పరిధి దాటిన అమెరికా అనే "స్వర్గానికి" పంపిస్తారు చదువులకు. ఇక్కడ మొదటి రిస్క్ తల్లిదండ్రులు తీసుకున్నారు. తమకు తెలియని, తాము చూడని కొత్త దేశానికి కేవలం 'అక్కడికి వెళితే మనకన్నా పిల్లలు బాగుంటారు' అన్న అపోహతో. ఈ అపోహ తల్లిదండ్రుల్లో  కొంత కలగజేసేది పిల్లలే. డబ్బు సంపాదన అనేది ఎక్కడ ఉండినా చెయ్యొచ్చు అనేది చాలా మంది తల్లిదండ్రులకు, పిల్లలకు  తెలియదు. ఎంత డబ్బు సంపాయిస్తాము అనేది మన సామర్థ్యము, లౌక్యము, ఫ్లెక్సిబిలిటీ మీద ఆధార పడి ఉంటుంది. వేరే దేశంలో ఇది తేలిక అనిపించినా వాటిక సమపాళ్ళలో మనకు అర్థం కాని కొత్త కష్టాలు కూడా దాగుంతాయని ఊహించరు తల్లిదండ్రులు, పిల్లలు.
  2. అమెరికా చదువులు తేలిక కాదు. కొత్త దేశం, అప్పటిదాకా స్వతంత్ర నిర్ణయాలు తీసుకోని  అమ్మాయి/అబ్బాయి ఒక కొత్త దేశంలో, కొత్త సంస్కృతిలో, కొత్త విద్యా విధానంలో ఒక్క సారి మునుగుతారు. అప్పుడు డబ్బు, దాని విలువ, ఎంత కష్టపడితే ఒక డాలర్ మిగులుతుందో తెలుస్తుంది. డాలర్ విలువెంతో తెలుస్తుంది. దాంతో 'మేము చాలా కష్టపడి చదివాము అమెరికన్ యూనివెర్సిటీలో, కాబట్టి మేము బాగా సంపాయించి ఆ కష్టం యొక్క ఫలితాన్ని పూర్తిగా ఈ దేశంలోనే అనుభవించాలి' అని మనసులో చాలా మందికి నిర్ణయం ఏర్పడుతుంది. అమెరికాలో సుఖాలేంటో మొదటి రుచి చూస్తారు (సాఫీ జీవితం, పనులు వాటంత ఆవే తేలిగ్గా అవ్వటం, రూల్స్ పాటించే ప్రజలు, మంచి రోడ్లు, సార్లు, చెట్లు, పార్కులు, స్వేచ్చ వగైరా వగైరా).   ఈ నిర్ణయంతో పాటే ఇండియా వెళ్ళకూడదు అనే నిర్ణయం కూడా చాలా మంది తీసుకుంటారు, తమకు తెలియ కుండా. 
  3. కానీ, ఇది పూర్తిగా కూలంకషంగా ముందుచూపుతో ఆలోచించి తీసుకునే నిర్ణయం కాదు. ఎందుకంటే, జీవితంలో ప్రతి ఒక్క మెట్టులో వేర్వేరు ఆలోచనా పద్ధతులు, అవసరాలు, ప్రాముఖ్యాలు ఉంటాయి. పెళ్లి కాక ముందు/చదువుకునేటప్పుడు ఉండే ఉత్సాహంలో అమెరికా అంతా పచ్చగా, తీయగా, హాయిగా కనిపిస్తుంది. పెళ్లి అయ్యి, ఇల్లు కొనుక్కుని, ఇండియాలో ఉన్న అయిన వారి జీవితాల్లో ముఖ్యమైన అవసరాలు/ఘట్టాలు  (పెళ్ళిళ్ళు, మరణాలు) మిస్ అయినప్పుడు అసలు నిజాలు బయట పడుతుంటాయి - మనుషులు, బంధుత్వాలు, ఆత్మీయతలు, సంస్కృతి, తెలుగుదనం, ఇరుగు, పొరుగు, పెళ్ళిళ్ళు, గుళ్ళు ఇలా ఎన్నో. ప్రతిది అమెరికాలొ బాఉండదు ఇండియాలో బాగుంటుంది అన్న ఆలోచన తొలవటం మొదలవుతుంది.. అలాగే, అమెరికాలో పని వాళ్లు ఉండరు, ఇండియాలో డబ్బులు పారేస్తే పని వాళ్లు దొరకుతారు, ఇండియాలో పిల్లల్ని పనిమనుషుల దగ్గర ఉంచి ఉద్యోగానికి పోవచ్చు, లేకపొతే అమ్మ, నాన్నదగ్గర ఉంచొచ్చు ఇలా ఎన్నో అభిప్రాయలు. 
  4. ఇవేవి పూర్తిగా సరైన అభిప్రాయలు కాదు. ఆంధ్ర ప్రదేశ్లో ఉన్న జనంలో కూడా బంధుత్వాలు, ఆత్మీయతలు చాలా తగ్గిపోయాయి. పొగరు/అసూయలతో, ప్రేమతో  పిలిచినా రాని దుస్థితి. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు, నిజంగా పాశ్చాత్య దేశాలో కూడా లేని అసభ్య, అనాగరిక వేషాలు ఇక్కడ ఉన్న వాళ్లు వేస్తున్నారు. అలాగే, అమ్మ, నాన్నలను  బయటకు గెంటి, అనాథ ఆశ్రమాల్లో ఉంచిన వాళ్లు చాలా మంది ఉన్నారు. పిల్లలకు మన భాష, సంస్కృతీ నేర్పించని స్కూళ్ళు, తల్లిదండ్రులే ఎక్కువ.  తల్లిదండ్రులు కూడా చాలా మంది స్వాతంత్ర్యాన్ని కోరుకుంటున్నారు. బాధ్యత పిల్లల వైపు నుంచి కనిపిస్తేనే తాము వాళ్లకు సాయంగా ఉండాలని మనసులో అనుకుంటున్నారు. అమెరికాలో లేదు, ఇండియాలో ఉంది అన్న ఆలోచనలో - ఇండియాలో ఉన్న కాలుష్యము, ట్రాఫిక్, జబ్బులు, దోపిడీలు, లంచాలు, రోడ్డు ప్రమాదాలు, కిడ్నాప్లు, హత్యలు, రహస్యంగా జరుగుతున్నా పెళ్లి ముందు శృంగారం, ఏ మాత్రం అడ్డు, అదుపు లేని టీవీ చానల్స్,  చదువుల్లో ఊహించలేని పోటీ, ఒత్తిడి (ఓటమి చూసిన విద్యార్థుల ఆత్మ హత్యలు), ఆకాశంలో ఉన్న ధరలు - వీటన్నిటిని మర్చిపోతారు. ఇక్కడ పనివాళ్ళు మూడు రోజులు వస్తే రెండు రోజులు రారు, చుట్టాలు వచ్చారు అంటే ఎక్కువైనా అడుగుతారు లేదా మానేస్తారు, ఏదైనా రిపైర్ వచ్చిందంటే వాళ్ల చుట్టూ వంద సార్లు తిరగాలి, ఫోన్ చెయ్యాలి - అమెరికాలో ఉంది ఇండియా గురించి కలలు  కనే చాలా మందికి ఈ విషయాలు తెలియవు, తెలిసినా, కళ్ళతో చూస్తే కాని ఇవన్ని ఎంత ఒత్తిడో మనిషి మీద అర్థం కాదు. మంచి స్కూల్లో సీటు రావాలంటే లక్ష రూపాయలు డొనేషన్ కట్టాలి. మీకు వామ్మో అనిపిస్తే మేము ఏమి చెయ్యలేము. కాని అది వాస్తవం. అలాగే ఒక మంచి కాలేజీలో ఎం.బీ.బీ.ఎస్ డొనేషన్ కోటి రూపాయలు దాటే. సంవత్సరానికి ఇంజనీరింగ్ ఫీజు ముప్ఫై వేలు, ఇవి కాక డొనేషన్, నెల ఖర్చులు.  ఇన్సూరెన్స్ లేకుండా హాస్పిటల్ లో వారం ఉంటే ఖర్చు లక్ష రూపాయలకు తక్కువ కాదు. గుండె ఆపరేషన్ కు మూడు-నాలుగు లక్షలు కనీసం ఖర్చు. ఇలా ఎన్నో తెలియని, ఊహించలేని మార్పులు మీ చిన్నతనానికి, ఇప్పటికీ జరిగాయి ఇక్కడ. 
  5. అలాగే, అమెరికాలో ఇండియాలో కన్నా మన సంస్కృతిని, భాషను కాపాడి, అనుసరిస్తున్న వాళ్లు చాలా మంది ఉన్నారు. అక్కడ ఉన్నంత మంచి, నిజాయితీ ఉన్న సంగీతం, నృత్యం నేర్పే అధ్యాపకులు ఇక్కడ లేరు. అక్కడ వీళ్ళు 10-15 ఏళ్ళు నేర్పించి ఆ విద్యార్థిని ఆ శాస్త్రంలో నిష్ణాతులుగా చేస్తున్నారు.  అలాగే, అక్కడ తెలుగు భాష మీద చూప్తున్న శ్రద్ధ, వాగ్గేయ కారులను ప్రచారం చేసే కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యాక్రమాలు ఎన్నో. సిలికానాంధ్ర అనే సంస్థ అమెరికాలో ఆవిర్భావించిందే తెలుసా?. ఎన్ని భారతీయ సంస్థలు లక్ష గళ అర్చన లాంటి కార్యక్రమాలు నిర్వహించి మనల్ని గిన్నీస్ బుక్ లోకి ఎక్కించాయి?.   అక్కడ పెరిగిన పిల్లలందరూ చెడిపోతున్నారు అనేది తప్పు. మీకు తెలియ కుండ ఇక్కడున్న పిల్లలు చాలా పెద్ద తప్పులు చేసి మానసికంగా దెబ్బ తింటున్నారు. కాబట్టి అమెరికా పిల్లలు అంటే వారికి మన విషయాలు తెలియవు అనేది చాలా పెద్ద దురభిప్రాయం. ఇండియాలో మీ పిల్లలు సెల్ ఫోన్లో, బయటికి వెళ్ళినప్పుడు ఏమి చేస్తున్నారో మీకు తెలుసా?...అక్కడ చాలా విషయాల మీద ప్రభుత్వం, సమాజం చాలా స్పృహతో చట్టాలు చేశారు. కాబట్టి విలువలు అక్కడే ఎక్కువ ఉండే అవకాశం ఉంది. కాకపొతే మన హిందూ మతంలో, శృంగారం, పెళ్లి, ఆడ వాళ్లకు ఉన్న కట్టుబాట్లు వాళ్లకు లేవు కాబట్టి అక్కడి వాళ్లు చేసే ప్రతిది మనకు తప్పుగా, నేరంగా, ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. తక్కువగా బట్టలు వేసుకున్నంత మాత్రాన వాళ్ళంతా పతితలు ఎలా అవుతారు?. 
  6. ఇండియాలో పెరిగిన పిల్లలు చదువులు తప్ప మిగత విషయాలలో ఎంత రాణిస్తున్నారు?. ఎంత  స్వయంశక్తులై నలుగురికి ఉపాధి కలిగించగలుగుతున్నారు?. అమెరికాలో 10 +2 తర్వాత మంచి కాలేజీలో (మన ఐ.ఐ.టి లాంటి విద్యా సంస్థలలో)  డిగ్రీ చదవాలి అంటే విద్యార్థి చదువుతో పాటు ఆట, సేవలలో కొంత ప్రతిభ చూపించాలి. అలాగే, అన్ని విషయాలలో - చదవటం, రాయటం, గ్రహించటం, భాషణలు ఇవ్వటం లాంటి ప్రతిభను సమపాళ్ళలో చూపించాలి. కాబట్టే, అక్కడి విద్యార్థులు 17 -18 ఏళ్ళ వయసుకి తమంతట తాము ఉండగలిగే సామర్థ్యం చూపుతారు. ఇండియాలో 18 ఏళ్ళ కుర్రాడిని తనకు ఇష్టమైన సబ్జెక్ట్ మీద ఒక అరగంట మాట్లాడమంటే ఎంత మంది మాట్లాడగలరు?. ఎంత మంది తమ అభిప్రాయాల్ని నిర్దిష్టంగా వెలిబుచ్చగలరు?. ఎంతమంది తమ పని తాము చేసుకొని నాలుగు రూపాయలు సంపాదించగలరు?. ఎంతమంది అమ్మాయిలు వాళ్ల నాన్న లేకుండా వేరే ఊళ్లకు వెళ్లి తమ పనులు తాము చేసుకోగలరు?. (ఇక్కడ పరిస్థితులు కూడా మారుతున్నాయి కానీ క్వాలిటీ, క్వాంటిటీ ఇంకా చాలా తక్కువ).
నా ఉద్దేశంలో, ఎక్కడి సమస్యలు, సుఖాలు అక్కడ సమానంగా ఉన్నాయి. మనం ఒక సమయంలో ఏది అయితే ముఖ్యం అనుకుంటామో అది ముందు మెట్టులో ముఖ్యం కాక పోవచ్చు. అందుకని అన్ని కావాలి అనుకుంటే అది మాత్రం జరగదు. సుఖమైన జీవితం, వసతులు, ప్రమాణాలు - భారత దేశంలో కూడా ఉన్నాయి. కాని చాలా తక్కువ నిష్పత్తిలో, చాలా ఎక్కువ ధరలో. వెలకట్టలేని తల్లిదండ్రులు, బంధుత్వాలు - ఇవి పూర్తిగా మీరు అనుకున్నట్టు లేవు, ఉండవు కూడా. వీటిలో ఏది/ఏ కొన్ని అతి ముఖ్యమో తెలుసుకొని, దానికోసం ఎంత వెల, వ్యయప్రయాసలైన సరే మనసును సిద్ధంగా ఉంచుకోండి.  ఏ కొన్ని అయితే మీకు ఆత్మ సంతృప్తిని ఇచ్చి, మీలో న్యూనతా భావం లేకుండా చేస్తుందో అవి చెయ్యండి. వాటిని పొందండి. మిగతావి కోల్పోవటానికి మానసికంగా సిద్ధం కండి. ఇవి అమెరికాలో కావచ్చు, ఇండియాలో కావచ్చు. ఇవి పూర్తిగా మన మానసిక పరిస్థితి, ప్రాముఖ్యాలు, ఎటువంటి జీవన శైలిని కోరుకుంటున్నాము అన్న దానిమీద ఆధార పడి ఉంది.

ఈ సందర్భంలో నాకొక పాట గుర్తుకొస్తున్నది.  'అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి రాజు గుణము మిన్న రాణి మనసు వెన్న...ఆరాజుకు ఏడుగురు కొడుకులున్నారు వారు చదువు సంధ్యలుండికూడ చవటలయ్యారు ఉత్త చవటలయ్యారు...'. మనిషి చదివి కూడా చవట ఎందుకు అవుతున్నాడు?. తనకు ఏమి కావాలో అది తెలుసుకోలేక, ఉన్న దానితో సంతృప్తి పడక, అన్నీ కావాలని, ఆత్రుతతో ఉన్నది పోగొట్టుకోవటం వలన. చదువు, డబ్బే కాదు జీవితంలో ఆనందాన్నిచ్చే సంతులన, సమాజం, పరిసరాలు కూడా చాలా ముఖ్యమని తెలుసుకోక పోవటం వలన.

యుక్త వయస్సులో ఉన్నవాళ్ళు: మిమ్మల్ని జీవితాంతం మీరు రెండు పడవల్లో చెరొక కాలు పెట్టిన పరిస్థితిలో ఉంచుకోకండి. మీకు తృప్తి, ఆనందం ఇచ్చే అతి ముఖ్యమైన ఓ మూడు అంశాలను మీరు ఆలోచించి, నిర్ణయించుకొని వాటిని సాధించుకోండి. త్యాగాలకు సిద్ధంగా ఉండండి.

తల్లిదండ్రులు: మీరు ప్రోత్సహించి పంపించిన పిల్లలు మీరు రమ్మనప్పుడు రావటానికి పరిస్థితులు చాలా మీరు ఊహించలేకుండా ఉంటాయి. మీ పిల్లలకు ఆ సుఖాలు కావాలి అనుకుంటే, కొంత  మీ అంతటా మీరు ఉండటం అలవాటు చేసుకుంటే మంచిదేమో?. ఇంతకన్నా ముఖ్యం: మంచి విలువలు, ప్రేమ, ధర్మం, ధైర్యం, సామర్థ్యం ఇవి ముఖ్యం కాని డబ్బు, కార్లు,స్కూళ్ళు, పార్కులు కాదు. చెట్టులో కాండం లాంటివి - విలువలు, ప్రేమ, ధర్మం, ధైర్యం, సామర్థ్యం. ఆకుల్లంటివి డబ్బు, కార్లు, హోదా వగైరా లాంటి సుఖాలు. ఒక ఆకు పొతే ఇంకో ఆకు వస్తుంది, కాని కాండమే లేకపొతే?. ఆలోచించండి. మీ పిల్లల్ని ఎలా పెంచాలో, వారికి ఏది ముఖ్యమని చెప్పాలో?.

స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. స్వధర్మమనేది మనం ఆచరించి, మన పిల్లలకు నేర్పితే కదా వాళ్లు దాన్ని పాటించేది?.  మీరు పాటిస్తున్న ధర్మం తప్పు అనుకుంటే దాన్ని పాటించకండి. మేము పడిన కష్టాలు మీరు పడ కూడదు అని మనం నేర్పాల్సిన విషయాలు నేర్పని తప్పు చేసేది మనమే. మరి వాటి ఫలితాలు కూడా అనుభవించాలి కదా?. జిల్లేడు చెట్టు నాటి పనస పళ్ళు కాయాలంటే ఎలాగండి?. మీరు మీ అమ్మాయికి వంట నేర్పించరు, కానీ మీ కోడలు మీకు బాగా వండి పెట్టాలి. మీరు అవతలావాళ్ళ దగ్గరనుంచి ఏమి ఆశిస్తున్నారో, దాన్ని మీరు పాటిస్తున్నారా?. ఆలోచించండి.....ఏమంటారు?.

ప్రాధాన్యతలు, ప్రాముఖ్యాలు: ఇవి చాలా స్వంతమైన విషయాలు. చదువు, ఉద్యోగం, డబ్బు, హోదా - వీటికి దేశం/రాష్ట్రం/పట్టణంతో మనం అనుకున్నంత సంబంధం లేదు. పల్లెటూరులో ఉండి కూడా ఇవన్ని సాధించి తమ ప్రతిభను చూపిన వాళ్లు చాలా మంది ఉన్నారు. మనకు తేలికగా ఇవి కావాలి అంటే కుదరదు. 16,000 వేల మైళ్ళు వెళుతున్నాము అంటే -  దానికి చాలా ఆలోచించి, అది మన జీవన శైలిని, విధానాన్ని మారుస్తుందని తెలుసుకొని, దాని వల్ల వచ్చే ఆటు, పోటులను తట్టుకునే శక్తి మనకు ఉండాలని, అక్కడ ఇక్కడ పరిస్థితులు సృష్టించలేమని - మనకు వెళ్ళేటప్పుడు ఇవన్ని కూలంకషంగా అర్థం అయ్యే పరిస్థితి ఉండదు. ఒకటి రెండు అంశాలు/ప్రాధాన్యతలు  (విద్య, డబ్బు) ఆధారంగా నిర్ణయం తీసుకొన్న నిర్ణయం అన్ని అంశాల్లో కరెక్ట్ అవ్వలేదు. కానీ, మీ ఆ ఒకటి, రెండు అంశాలు/ప్రాధాన్యతలు చాలా ముఖ్యమైనవి అయితే, మీకు దువిధ అనేది చాలా తగ్గుతుంది.

ఇంకొక విషయం - మనం ఎక్కడున్నా, ఆ క్షణాన్ని, అక్కడ ఉన్న మంచి విషయాన్ని గ్రహించి, ఆనందించి, ఆస్వాదించకపోతే - మనం ఎక్కడున్నా ఈ రంధ్రాన్వేషణ తప్పదు. ఆత్రేయ గారు రాసిన ఈ పాట ఈ వ్యాసాంశానికి మంచి కొసమెరుపు.

మౌనమె నీ భాష ఓ మూగమనసా
తలపులు ఎన్నెన్నో కలలుగ కంటావు
కల్లలు కాగానె కన్నీరవుతావు

చీకటి గుహ నీవు చింతల చెలి నీవు
నాటక రంగానివే మనసా తెగిన పతంగానివే
ఎందుకు వలచేవో ఎందుకు వగచేవో
ఎందుకు రగిలేవో ఏమై మిగిలేవో

కోర్కెల చెల నీవు కూరిమి వల నీవు
ఊహల ఉయ్యాలవే మనసా మాయల గయ్యాళివే
లేనిది కోరేవు ఉన్నది వదిలేవు
ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు

2 కామెంట్‌లు:

  1. నేను మీ అంతర్యామి బ్లాగును ఈ రోజే చూశాను. చాలా మంచి బ్లాగు. తీరికగా అన్నీ చదివే ప్రయత్నం చేస్తాను.ఈ వ్యాసం చాలా బాగా వ్రాసారు. మా అబ్బాయి,కోడలు కూడా అమెరికాలోనే ఉన్నారు.మీ పోస్టు లింకును మా అబ్బాయికి పంపిద్దామనుకుంటున్నాను. అందరికీ ఉపయోగపడేలా వ్రాసారు. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  2. కృష్ణమూర్తిగారు - ధన్యవాదాలు. తప్పకుండా మీ అబ్బాయికి పంపించండి. నేను అమెరికాలో ఏడు ఏళ్లు ఉండి పరిస్థితుల కారణంగా ఎనిమిదేళ్ల క్రితం ఇండియా తిరిగి వచ్చాను.

    రిప్లయితొలగించండి