1, జులై 2010, గురువారం

ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలు

డాక్టర్ మంతెన సత్యనారాయణరాజు గారి ప్రకృతి జీవన విధానం/వైద్య సలహాల పుణ్యమా అని ఆంధ్రులు తినే తిండి లో ఎంత చెడు, చేదు ఉందో తెలుస్తోంది. ఆయన పుస్తకాలు బజారులో దొరుకుతున్నాయి. మీకు వీలైనప్పుడు కొనుక్కోండి. లేదా కేబుల్ టీవిలో చానల్స్ తిప్పుతూ ఉంటే మీకు ఆయన తప్పకుండ ఏదో ఒక ఛానెల్లో కనిపిస్తారు. కొన్నాళ్ళు శ్రద్ధగా ఆయన కార్యక్రమాలు చూస్తే మీకు వివరాలు అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్టు చెబుతారు. కొన్ని ముఖ్యాంశాలు.

౧.మనం తినే ఆహారంలో  ఉప్పు అన్నిటికన్నా ప్రమాదకరమైన వస్తువు. మీకు వీలయితే ఉప్పును పూర్తిగా మానేయ్యండి. మరి శరీరానికి ఉప్పు ఎలా?. - ప్రకృతి మనకు ఇచ్చే ప్రతి కూరగాయలో ఉప్పు మన శరీరానికి తగినంత ఉంటుంది. అందుకని ఇంకా వేరేగా ఉప్పు వెయ్యక్కర్లేదు వంటల్లో. అబ్బో ఎలా అండీ తినటం. కష్టమే. ఉప్పు మానేసిన వాళ్ళలో ఫలితాలు చూసాను. చక్కర కన్నా ఉప్పు మధుమేహ వ్యాధిగ్రస్తులకు శాపం. ఎందుకు ఎలా అనేది ఆయన పుస్తకాల్లో వివరంగా ఉంది.
౨. రెండో ప్రేమాదకరమైన ఆహారం పాలిష్ పట్టిన బియ్యంతో వండిన అన్నం, పొట్టు తీసిన గోధుమలతో పట్టిన గోధుమ పిండి. ఆంధ్ర ప్రదేశ్ లో మధుమేహరోగులు దేశమంతటి కన్నా ఉండటానికి కారణం ఈ పాలిష్ పట్టిన ధాన్యంతో చేసిన ఆహారం. కాబట్టి తప్పకుండ పొట్టు తీయని ముడి బియ్యపు అన్నము, పొట్టుతో కూడిన గోధుమ పిండితో చేసిన రొట్టెలు/పుల్కాలు తినండి.
౩. మూడో ప్రమాదకరమైన వస్తువు వంట నూనె. శరీరంలోకి వంటనూనె ద్వారా వెళ్లే కొవ్వు అస్సలు అవసరంలేదుట. ప్రకృతి మనకు ఇచిన పప్పులు, గింజలు (వేరుశనగ, నువ్వులు వగైరా), కొబ్బరి లాంటివి మితంగా తీసుకుంటే చాలుట. కాబట్టి వేపుళ్ళు, నూనెలో ముంచిన కూరలు మానటమే కాదు, అసలు నూనె వెయ్యకుండా కూరలు చేసుకుంటే మంచిది.

పై మూడు పాటిస్తే చాలా మటుకు శరీరం బాగుపడుతుంది. ఎందుకంటే - ఉప్పులేకుండా, నూనెలేకుండా తినాలి అంటే ఫస్ట్ మానెయ్యాల్సింది ఊరగాయలు. దానితో సగం రోగాలు అదుపులోకి వస్తాయి.

వేరే చిట్కాలు:

౧. ఎప్పుడైనా తీపి తినాలి అనిపిస్తే పంచదార, బెల్లం కాకుండా తేనె, ఖర్జూరపు పొడి ప్రత్యామ్నాయాలుగా వాడండి.
౨. మొలకలు, పండ్లు, ఉడకబెట్టిన కూరలు ఆహారంలో ముఖ్యభాగం కావాలి.
౩. నూనె వెయ్యకుండా పెసరట్టు, పొట్టు మినపపప్పుతో చేసిన ఆవిరి కుడుములు లాంటివి ఉదయం ఫలహారంలో తినొచ్చు. ఇడ్లి/దోస/పూరి లాంటివాటితో పైన '౨' లో చెప్పిన సమస్యలే. కాబట్టి ప్రకృతి ప్రసాదించిన పండ్లు, మొలకలు, కూరగాయలు తింటే మంచిది.
౪. నూనె వెయ్యని పుల్కాలు, ముడి బియ్యంతో అన్నం - ఇవి ముఖ్య ఆహారంలో  (మధ్యాహ్నం, సాయంత్రం) మితంగా తీసుకోవచ్చు.
౫. సాయంకాలం భోజనం వీలైనంత త్వరగా తినండి.
౬. మంచి నీళ్ళు బాగా తాగండి. ఉదయం లేవగానే ౧-౨ లీటర్లు, ప్రతి భోజనం తర్వాత ఒక గంటకి, భోజనానికి ఒక గంటముందు  మళ్ళీ తాగండి.
౭, ద్రాక్ష, ఆపిల్ లాంటి పళ్ళు తినేటప్పుడు బాగా కడిగి శుభ్రం చేసి తినండి ఎందుకంటే వీటిమీద చాలా క్రిమిసంహారకాలు ఉంటాయి. అలాగే కాబేజీ, కాలీఫ్లవర్ లాంటి కూరగాయలను బాగా కడిగి, పూర్తిగా ఉడికిన తర్వాతే తినాలి.
౮. పులుపుకు ప్రత్యామ్నాయంగా నిమ్మ రసం, కాలాన్ని బట్టి దొరికే ఉసిరి, చింత కాయలు, మామిడికాయలు, దానిమ్మ గింజలు వాడుకోవచ్చు.
౯. కారం కావాలంటే ఎండుకారం/ఎందు మిరపకాయలకు బదులుగా పాచి మిరపకాయ వాడండి.

ఇవండీ నాకు తెలిసిన సూత్రాలు.మీరు పాటించి చూడండి. ఆరోగ్యకరమైన ఆహారం తింటే ఆరోగ్యకరమైన ఆలోచనలు వస్తాయిట.  ఆహారానికి తోడు మంచి వ్యాయామం (ప్రాణాయామం, యోగాసనాలు) చేస్తే మీరు రెండు వందల ఏళ్ళు అయిన బతకొచ్చు అని రాజు గారి సలహా. మీరు పాటిస్తున్నారా ప్రసాద్ గారు అంటే ప్రయత్నిస్తున్నాను, ఫలితాలు మెల్లగా కనిపిస్తున్నాయి అని మాత్రం చెప్పగలను. బాగా పాటిస్తున్న వాళ్ళలో ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి. అది సత్యం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి