కష్టాలు కష్టాల లాగ తీసుకోవద్దు, ధైర్యంగా ఉండాలి, కష్టాలు, సుఖాలు పరమాత్మ మాయ వగైరా వగైరా ఇలాంటివి ఏమి నేను చెప్పను ఎందుకంటే అవి ఆ పరిస్థితిలో ఉన్న వాళ్లకు రుచించవు, సరియైనదిగా అనిపించదు. నవ్వేసి సమస్య లేదు అనుకోవటం, ఎల్లప్పుడూ మానసిక నిగ్రహం, సంతులనలో ఉండటం చాలా తక్కువ మందికి సాధ్యం. కానీ, ప్రపంచంలో మనం ఎదుర్కుంటున్న పరిస్థితి ఎప్పుడోకప్పుడు ఎవరో ఇంకొకరు ఎదుర్కుని అధిగమించగలిగి ఉంటారు. మనం మొదలు కాదు, చివర కాదు. కనుక, తప్పకుండా పరిష్కారం ఉంటుంది.
మరి ఏమిటి చెయ్యటం?. ఈ పాట ఒక మంచి ఉదాహరణ ఏమి చెయ్యొచ్చో అన్నదానికి. పాజిటివ్ ఆలోచనలతో పోరాడమని దీని సారాంశం. ఎందుకంటే అనుకూల (పాజిటివ్) ఆలోచనలు వ్యతిరేక (నెగటివ్) ఆలోచనల కన్నా చాలా బలమైనవి. కొన్ని అనుకూల ఆలోచనలతో ఒక వ్యతిరేక ఆలోచనను పోరాడటం దీనిలో మొదటి మెట్టు. రెండోది - ఉన్న పరిస్థితిలోంచి బయటకు ఎవ్వరు లాగలేరు. అది మనం అడుగు వేస్తె తప్ప అవ్వని పని. అడుగు వెయ్యటానికి, ఆలోచనలు రావటానికి పక్కనవాళ్ళు సాయపడగలరు.
ఆశ వదలకుండా ఒక అడుగు అనుకూల ఆలోచనతో వేస్తె అక్కడ తప్పకుండా మనకున్న సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అందుకనే మన పెద్దలు అన్నారు - సమస్య ఉంటే పది మందితో చెప్పుకోవాలిరా అని. దాని అర్థం సానుభూతి పొందటానికి కాదు - కష్టంలో ఉన్న మనిషి యొక్క మానసిక పరిస్థితి అడుగు ముందుకు వేసే ఆలోచనలను రానివ్వకపోవచ్చు. అలాంటప్పుడు నలుగురితో కలిసి, మాట్లాడితే - కొత్త ఆలోచనలు మన మనస్సులోకి వెళ్లే అవకాశం ఎక్కువ. అలాగే, నలుగురుతో మాట్లాడితే మనకున్న సమస్యకన్నా ఇంకా పెద్ద సమస్య కనిపించొచ్చు. అప్పుడు మన సమస్యను 'ఆ ఇది చాలా చిన్నది, నన్నేమి చెయ్యలేదు, పాపం వాళ్ళు ఇంకా ఎంత పెద్ద భవసాగరంలో ఉన్నారో' అని కొట్టి పారేసే అవకాశం వస్తుంది. అంటే ఏమిటి?. - ఒక అనుకూల ఆలోచన మొదలయ్యినట్టే కదా?. అది చాలు మీ సమస్యను పూర్తిగా అధిగమించటానికి.
సాధనాలు ఏమిటి?
- ముందడుగు వేసే ధైర్యం - ఇక్కడ మనకు ఆ పరిస్థితిలో ధైర్యం ఉండకపోవచ్చు. అలాంటప్పుడు మన చుట్టూ ఉన్న వ్యవస్థను ఆశ్రయించాలి - కుటుంబం, బంధువులు, ఆత్మీయులు, స్నేహితులు, గురువులు, తోటి పనివారు, పుస్తకాలు. కానీ మొట్టమొదటి అడుగు మనమే వెయ్యాలి. పక్కవాళ్ళు వేయించారు అని అనిపించినా అది మన మనస్సు చెప్పనిదే జరగదు.
- పరిష్కారం ఉంది అనే నమ్మకం, భగవంతుడు ఎప్పటికీ మనల్ని ఇలానే ఉంచడు అన్న విశ్వాసం.
చిత్రం: వెలుగునీడలు
గాయకులు: ఘంటసాల వేంకటేశ్వరరావు
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
నటీనటులు: సావిత్రి, అక్కినేని నాగేశ్వరరావు
గేయ రచయితా: శ్రీశ్రీ (శ్రీరంగం శ్రీనివాసరావు)
కల కానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనె బలి చేయకు
కల కానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనె బలి చేయకు
గాలి వీచి పూవుల తీగ నేల వాలి పోగ
గాలి వీచి పూవుల తీగ నేల వాలి పోగ
జాలి వీడి అటులేగాని వదులవైతువా
చేర దీసి నీరు పోసి చిగురించ నీయవా
|| కల కానిది విలువైనది ||
అలముకున్న చీకటిలోనె అలమటించనేల
అలముకున్న చీకటిలోనె అలమటించనేల
కలతలకే లొంగి పోయి కలువరించనేల
సాహసమను జ్యోతిని చేకొని సాగిపో
|| కల కానిది విలువైనది ||
అగాధమౌ జలనిధిలోన ఆణిముత్యమున్నటులే
శోకాల మరుగున దాగి శుఖమున్నదిలే
అగాధమౌ జలనిధిలోన ఆణిముత్యమున్నటులే
శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే
ఏది తనంత తానై నీ దరికి రాదు
శోధించి సాధించాలి అదియే ధీర గుణం
|| కల కానిది విలువైనది ||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి