13, సెప్టెంబర్ 2026, ఆదివారం

చలమేలరా సాకేత రామా! - త్యాగరాజస్వామి కృతి


చలమేలరా సాకేత రామా!

వలచి భక్తి మార్గముతోను నిన్ను వర్ణించుచున్న నాపై 

ఎందుబోదు నేనేమి సేయుదును ఎచ్చోట నే మొర బెట్టుదును
దందనలతో ప్రొద్దుపోవలెనా తాళజాలరా త్యాగరాజనుత

ఓ సాకేత రామా! నిన్నే ప్రేమించి భక్తిమార్గములో వర్ణించుచున్న నాపై కరుణ చూపుటకు ఆలస్యమెందుకు చేయుచున్నావు? నేనెక్కడికి పోయెదను? ఏమి చేసెదను? ఎక్కడ మొరపెట్టుకొందును? నా జీవితమంతా అనవసరమైన విషయములలోనే వృథాగా గడచిపోవలసిందేనా? నేనింక తాళలేను రామా! ఆలస్యము లేకుండా నన్ను కాపాడుము. 

ఈ కృతిలో త్యాగరాజస్వామి భక్తి కేవలం స్తోత్రమో, సంగీతారాధనో కాదని స్పష్టమవుతుంది. ఆయనది రామునిపై సంపూర్ణ ఆధారపడిన జీవన మానక్సిక స్థితి. “వలచి భక్తి మార్గముతోను వర్ణించుచున్న నాపై” అనే భావంలో, ప్రేమతో రామనామాన్ని గానము చేస్తున్న భక్తుని అంతరంగవేదన ఉంది. అయినా ప్రభువు కరుణ ప్రత్యక్షం కావడంలో ఆలస్యం ఎందుకని ప్రశ్నించడం ద్వారా భక్తుని ఆర్తి మరింత గాఢమవుతుంది. ఇది సందేహం కాదు. తనకు హితుడు, రక్షకుడైన శ్రీరామచంద్రమూర్తికి తన బాధ చెప్పుకొనే హక్కుతో చేసిన వినతి. 

“నేనేమి సేయుదును, ఎచ్చోట నే మొర బెట్టుదును” అన్న ప్రశ్నలు అనన్యశరణాగతికి చిహ్నాలు. రాముడిని తప్ప వేరే ఆశ్రయం లేదని తెలిసిన భక్తుడు, తన రోజులు వ్యర్థవిషయాలలో గడవకముందే కాపాడమని వేడుకుంటున్నాడు. “తాళజాలరా”లోని అసహనము భౌతిక దుఃఖం వల్ల మాత్రమే కాదు. దైవసాన్నిధ్యం లేక గడిచే క్షణం కూడా భక్తునికి భారమనే విరహభావం. అందువల్ల ఈ కృతి కరుణ కోసం చేసే ప్రార్థనగా, భక్తి మార్గంలో నిలకడగా ఉన్న హృదయపు విన్నపంగానే నిలుస్తుంది. 

మార్గహిందోళ రాగంలో కూర్చబడిన ఈ కృతిని ప్రియా సిస్టర్స్ హరిప్రియ-షణ్ముఖప్రియ ఆలపించారు

12, సెప్టెంబర్ 2026, శనివారం

వందనము రఘునందనా - త్యాగరాజస్వామి కృతి


వాగ్గేయకారులకు ద్వైత భావనతో పరమాత్మతో సంభాషించటం, వేడుకోవటం, అప్పుడప్పుడు నిందించటం, అంతలో శరణనటం చాలా పరిపాటి. అది వారిద్దరి మధ్య ఉన్న ఆ బంధానికి ప్రతీక. భక్తిమార్గంలో సద్భక్తునికి స్వామిపై అనేక రకాలా భావనలు కలుగుతాయి. అటువంటి భావనలే మనకు ఈ త్యాగరాజస్వామి వారి ప్రహ్లాద విజయము అనే రచనలో రూపొందించబడిన వందనము రఘునందనా అనే సంకీర్తనలో స్పష్టముగా అవగతమవుతాయి. రాముని శరణనన్న త్యాగయ్య స్వామితో చేసిన విన్నపాలను, వ్యక్తపరచిన భావనలను పరిశీలించండి. అంతర్లీనంగా సందేశం మాత్రం ఒక్కటే - రామనామమే ఆయనకు భృతి, ద్యుతి, శరణాగతి. త్యాగయ్య కృతులు వ్రాయాలని వ్రాసినవి కాదు. ఆయన మనోభావనలు శబ్దరూపము పొంది రాగ యుక్తమై భక్తి పుష్పంగా ఆవిష్కరించబడ్డాయి. శహానా రాగం భక్తికి శరణాగతికి ఆర్తికి ప్రతీక. ఈ భావసుమం ఆ రాగంలోనే త్యాగయ్య ఆలపించటం ఆయనపై గల రామానుగ్రహానికి నిదర్శనం.


వందనము రఘునందనా! సేతుబంధనా! భక్తచందనా! రామ!

శ్రీదమా! నాతో వాదమా! నే భేదమా! ఇది మోదమా! రామ!

శ్రీరమా హృచ్చారమా! బ్రోవ భారమా! రాయబారమా! రామ!

వింటిని! నమ్ముకొంటిని! శరణంటిని! రమ్మంటిని! రామ!

ఓడను! భక్తి వీడను! ఒరుల వేడను! నీ వాడను! రామ!

కమ్మని విడెమిమ్మని! వరము కొమ్మని! పలుక రమ్మని! రామ!

న్యాయమా! నీకాదాయమా! ఇంక హేయమా! ముని గేయమా! రామ!

చూడుమీ! కాపాడుమీ! మమ్ము పోడిమిగా గూడుమీ! రామ!

క్షేమము! దివ్య ధామము! నిత్య నేమము! రామ నామము! రామ!

వేగరా! కరుణా సాగరా! శ్రీ త్యాగరాజ హృదయాకారా! రామ!

రఘువంశమున జన్మించిన శ్రీరామా! లంకకు సేతువును నిర్మించిన వాడా! భక్తులకు చందనము వలె సౌఖ్యాన్ని ఇచ్చే వాడా! నీకు నమస్కరిస్తున్నాను! సిరులను ఇచ్చే వాడా! నీకు నాతో వాదమా! నేను పరాయివాడనా! ఇది నీకు సంతోషమా రామా! నీకు నమస్కరిస్తున్నాను! లక్ష్మీదేవి హృదయ-ములో సంచరించే వాడా! నన్ను బ్రోచుటకు భారమా! నీకు నాకు మధ్య రాయబారములెందుకు రామా! నీకు నమస్కరిస్తున్నాను! భక్తులను బ్రోచే నీ కీర్తి విన్నాను, నిన్ను నమ్ముకున్నాను, శరణని నిన్ను రమ్మనుచున్నాను రామా! నీకు నమస్కరిస్తున్నాను! నిన్ను చూచే మార్గములో నేను ఓడను, నీ భక్తిని వీడను, ఇతరులను వేడను, నేను నీ వాడను రామా! నీకు నమస్కరిస్తున్నాను! కమ్మని తాంబూలమిమ్మని వరమును ఇచ్చుచున్నానను తీసుకొమ్మని నీవు నాతో పలుకవలెనని నేను నిన్ను ప్రార్థిస్తున్నాను రామా! నీకు నమస్కరిస్తున్నాను! నీకు ఇది న్యాయమా! నన్ను కరుణించకుండా ఉండుట నీకు ఆదాయమా, నాతో పలుకుట నీకు చులకనా మునులచేత నుతించబడిన రామా! నీకు నమస్కరిస్తున్నాను! నన్ను కరుణతో చూడుము, కాపాడుము, ఒప్పుగా నన్ను చేకొనుము రామా! నీకు నమస్కరిస్తున్నాను! నిరంతర నియమమైన నీ నామము క్షేమమైనది దివ్య ధామమైనది రామా! ఓ కరుణా సముద్రుడవైన రమా! వేగముగా రమ్ము, త్యాగరాజుని హృదయమునందు వెలసిన రామా! నీకు నమస్కరిస్తున్నాను!

-సద్గురువులు కాకర్ల త్యాగబ్రహ్మం

శహానా రాగంలో కూర్చబడిన ఈ కృతిని కోటా పావని ఆలపించారు.

భారత శాస్త్రీయ సంగీత విశిష్టత


రోజులో సమయం, మనోభావాలకు సముచితమైన రాగాలు - భారతీయ శాస్త్రీయ సంగీతానికి ఉన్న ప్రత్యేకతలలో ఇది ఒకటి. పంచభూతాత్మకమైన విశ్వంలో వచ్చే మార్పులకు సంకేతమైన నాదప్రక్రియ ఈ దివ్యమైన సంగీతం మనకు అందిస్తుంది. ప్రాణవాయువు + అగ్ని కలియుటచే (ప్రాణానల సంయోగము చేత) ఉద్భవించినది ఓంకారము లేదా ప్రణవ నాదము (మోక్షము గలదా కృతి ప్రస్తావన). ఆ ప్రణవ నాదము నుండి ఉద్భవించిన సప్తస్వరాలు స రి గ మ ప ద ని స, శరీరములో నాభి, హృదయము, కంఠము, ముక్కు, నాలిక మొదలైన భాగములను ప్రేరేపించే గ్రంథులలో నిలిచి విశ్వజనీనమైన నాదాన్ని మన దేహంలో జాగృతం చేస్తాయి (శోభిల్లు సప్తస్వర కృతి ప్రస్తావన). మరి ఆ గ్రంథులను బట్టి మన మనోభావాలు, ఆ భావాలకు తగిన స్వరాలతో రాగాలు, ఆ రాగాలు ఆలపించినప్పుడు ఆ భావానికి పరిపూర్ణత వస్తుంది. అలాగే ఏ స్వరాలను పలికితే ఏయే గ్రంథులలో శక్తి జాగృతమవుతుందో కూడా మన శాస్త్రీయ సంగీతం చెప్పింది. అందుకే ఎన్నో రోగాలకు సంగీతం ద్వారా ఉపశమనం కలిగించే అద్భుత సాధనం మన ధర్మంలో అంతర్భాగమైన శాస్త్రీయసంగీతమిచ్చింది.


రోజులో కాలాన్ని బట్టి రాగం ఎందుకు ప్రస్తావించానంటే మన శాస్త్రీయ సంగీతంలో సమయరాగ విభజన స్పష్టంగా ఉంది. ఉదయం భూపాలం, బౌళి, కల్యాణి వంటి రాగాలు, రాత్రి దేశ, హంసధ్వని, తిలాంగ్ వంటి రాగాలు సూచించబడ్డాయి. ఇవి ఉదాహరణకు మాత్రమే. మిగిలిన రాగాలన్నిటికీ కూడా రోజులో ఏ ఝాముకు ఉపయుక్తమో స్పష్టంగా శాస్త్రకారులు గుర్తించారు. కాలం, రాగం, భావం, లయ...అన్నీ ఒకదానితో ఒకటి ఎలా పెనవేసుకుని ఉన్నాయో ఈ వివరాలు తెలుసుకుంటే అర్థమవుతుంది. ప్రపంచంలో ఇంకెక్కడా కూడా ఇటువంటి దివ్యమైన సంగీతం దొరకదు.

కర్ణాటక సంగీత రాగాలు కేవలం స్వరాల క్రమాలు కావు; అవి మానవ హృదయపు సూక్ష్మ స్పందనలకు రూపం ఇచ్చే సజీవ భావభాషలు. శరణాగతి భావానికి మృదువైన వినయం, అంతర్ముఖత, దైవసన్నిధిలో తనను తాను అర్పించుకోవడం అవసరం; ఈ నాణ్యతను భైరవి, ముఖారి, పున్నాగవరాళి, యదుకులకాంభోజి వంటి రాగాలు ఎంతో గంభీరంగా మోస్తాయి. భక్తి భావంలో రాగం శ్రోతను ప్రార్థన వైపు తీసుకెళ్లాలి; మాధ్యమావతి యొక్క నిర్మలత, రేవతి యొక్క తపోభావం, కేదారగౌళ యొక్క సౌమ్యమైన ఆత్మీయత, శ్రీరాగం యొక్క గౌరవప్రదమైన దైవత్వం ఇందుకు అనుకూలం. వీటిలోని స్వరసంచారాలు తొందరపడవు; విరామాలు, మృదువైన గమకాలు, దిగువ స్థాయి స్పర్శలు మనసులో వినయాన్ని, ఆశ్రయాన్ని, విశ్వాసాన్ని పుష్టి చేస్తాయి.

ఆనందం, ఉత్సాహం, పైకి లేపే ఉల్లాసం వ్యక్తం చేయడంలో బిలహరి అసాధారణమైన రాగం. దాని చురుకైన స్వరచలనాలు, ప్రకాశవంతమైన నిషాద–ధైవత స్పర్శలు, ఉల్లాసభరితమైన ఆరోహణ శ్రోతలో సజీవతను మేల్కొలుపుతాయి. మోహనం యొక్క విశాలమైన స్వచ్ఛత, హంసధ్వని యొక్క మంగళప్రదమైన ప్రకాశం, శంకరాభరణం యొక్క సమతుల్య వైభవం కూడా సంతోషం, విజయోత్సాహం, శుభారంభ భావాలకు అత్యంత తగినవి. ఐశ్వర్యం, శుభం, మంగళకార్యం వంటి సందర్భాల్లో హంసధ్వని తన స్వచ్ఛమైన వెలుగుతో ముందుంటే, కల్యాణి తన విస్తారమైన స్వరప్రపంచంతో గంభీరమైన సంపదను, కృపను, ఉన్నతాశయాన్ని సూచిస్తుంది. కల్యాణి వినిపించినప్పుడు కలిగే భావం కేవలం సంతోషం కాదు; అది అభ్యుదయం, ఆశీర్వాదం, అంతరంగ వికాసం కలిసిన మహోన్నత మంగళభావం.

మనసును చల్లబరచే సాంత్వనకు సహానా, సామ రాగాలు అపూర్వమైనవి. సహానాలోని వక్రసంచారాలు, సున్నితమైన గమకాలు బాధను నిరాకరించకుండా దానిని సానుభూతితో ఆలింగనం చేసుకున్నట్లుంటాయి; అందువల్ల అది విరహం, మృదుస్మృతి, కరుణతో కూడిన ప్రేమకు ఎంతో సముచితం. సామ రాగం శబ్దకోలాహలాన్ని తగ్గించి అంతరంగంలో ప్రశాంతమైన వెలుగును నింపుతుంది; శాంతం, ధ్యానం, సాయంకాల నిశ్చలతకు అది సహజమైన ఎంపిక. ఆనందభైరవి మాత్రం కరుణ, శాంతి, మాతృస్నేహం, మృదువైన ఆనందం అన్నిటినీ సమన్వయపరచే అద్భుత రాగం. దాని భావం కన్నీటి అంచున ఉన్న సౌఖ్యంలా ఉంటుంది—వేదనను మధురతగా మార్చి, హృదయాన్ని మృదువుగా చేసి, చివరికి నిశ్శబ్దమైన ఆనందానికి చేర్చుతుంది. ఈ విధంగా ప్రతి రాగం తన ప్రత్యేక స్వరస్వభావంతో ఒక భావానికి మాత్రమే కాక, ఆ భావంలోని అనేక లోతైన ఛాయలకు కూడా సంగీతరూపం ఇస్తుంది.


మరొక ముఖ్యమైన విషయం - మన ధర్మంలో ఇతర విద్యల లాగనే శాస్త్రీయ సంగీతాభ్యాసంలో కూడా గురువు, క్రమశిక్షణతో అభ్యాసం, అర్థమెరిగి ఆలపించటం, సాహిత్యం ద్వారా వాగ్గేయకారులు ఏమి తెలియజేయదలచుకున్నారో దాని అవగాహన, ఆ సాహిత్యం యొక్క భాషా పరిజ్ఞానం, దైవభక్తి, త్రికరణ శుద్ధి చాలా అవసరం. ఇవి ఉన్నవారే ఈ సంగీతంలో ఉన్న గొప్పతనాన్ని పూర్తిగా ఆస్వాదించి నలుగురికి పంచగలరు. యాంత్రికంగా నేర్చుకుంటే ఒక్క అడుగు కూడా ముందుకు పడదు. ఆ సంగీత సాధనకు సాద్గుణ్యత, సాఫల్యము కలగవు.

కథయ కథయ మాధవం! హే రాధే! - నారాయణ తీర్థుల వారి తరంగం


కథయ కథయ మాధవం హే రాధే కథయ కథయ మాధవం

అథ సఖి కథయ శ్రీ మధుసూదనమశేష విధినా వర్ణిత వీర్యమమిత విభవం

వన భువి రహసి సమారాధితో భగవాననవద్య సుందరాంగి హే రాధే
ఘన జఘనాయా త్వయా ఘననీలకుంతల శ్రీ వనమాలీ పీతవాసా వసతి క్వవా జగతి

మృగ మద కలిత తిలక ఫాల సుందరం అగణిత సుగుణ మణి రత్నాకరం
విగత మోహమఖిల వేదభాగ విదితం భగవంతమాశ్రిత భావిత విధాతారం

సరస హాస రస సరళ తరళ మురళీ మిలిత గోప వధూ జనం
అరవింద లోచనమరివర్గ నిషూదనం నర నారాయణ తీర్థ వాంచిత ఫల నిదానం

ఓ రాధా! మాధవుని గురించి చెప్పవే! అమిత పరాక్రమవంతుడు, అత్యంత వైభవము కలవాడు, బ్రహ్మచే వర్ణించబడిన వాడు అయిన మధుసూదనుని గురించి చెప్పవే! అనుపమానమైన శరీర సౌందర్యం కల ఓ రాధా! నల్లని మేఘముల వంటి కురులు కలిగి, తులసీ వనమాల ధరించి, పీతాంబరములు ధరించిన ఆ మాధవుని ఏ రహస్య ప్రదేశములో నువ్వు పూజించావు? ఆ మాధవుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో చెప్పవే! కస్తూరితో అలంకరిచబడిన అందమైన ఫాలభాగము కలిగినవాడు, ఎన్నలేని సుగుణములకు నిధియైన వాడు, మోహాతీతుడు, సమస్త వేదములచే విదితమైనవాడు, ఆశ్రితుల కామ్యములు తీర్చే భగవంతుడు అయిన మాధవుని గురించి చెప్పవే! మందహాసముతో, మృదువుగా కంపించే మురళీరవముతో గోపికలతో కలిసి ఉన్నవాడు, కలువల వంటి కన్నులు కలవాడు, శత్రు సమూహములను నాశనము చేసేవాడు, నారాయణ తీర్థుని కామ్యములను నెరవేర్చిన మాధవుని గురించి చెప్పవే!

నారాయణ తీర్థుల వారి తరంగం కథయ కథయ మాధవం యొక్క భావం ఇది. శ్రీకృష్ణుని పరతర భావాన్ని దర్శించి, అనుభూతి చెందిన రాధ వాటిని బ్రహ్మవిద్యగా గోపికలకు తెలియజేసింది. రాధ తత్త్వం చాలా నిగూఢమైనది అన్నది ఈ తరంగం ద్వారా మనకు తెలియజేయటం నారాయణ తీర్థుల వారి లక్ష్యం. వాగ్గేయకారులు పరమాత్మ తత్త్వాన్ని ఎంత అందంగా మనకు తెలియజేస్తారు అన్న దానికి ఈ తరంగం ఓ అద్భుతమైన ఉదాహరణ. ఆధ్యాత్మిక సాధనలో పండి, త్రికరణ శుద్ధితో సగుణోపాసన చేసే వాగ్గేయకారులు పరమాత్మ విరాట్స్వరూపాన్ని మనకు ఎంత మనోజ్ఞంగా ఆవిష్కరిస్తారో ఈ కృతిలో మనకు తేటతెల్లమవుతుంది. మాధవుని తత్త్వం రాధ కన్నా ఎవరికి బాగా తెలుసు?

కల్యాణి రాగం మంగళకరమైనది. దివ్యమంగళస్వరూపుడైన శ్రీకృష్ణుని తత్త్వాన్ని వర్ణించటానికి ఎంతో ఉపయుక్తమైన రాగం. విదుషీమణులు రంజని గాయత్రి హృద్యంగా ఆలపించిన ఈ కృతిని విని తరించండి.

త్యాగరాజస్వామి వారి కృతి సామజవరగమన


సామజవరగమన సాధుహృత్సారసాబ్జపాల కాలాతీత విఖ్యాత

సామనిగమజ సుధామయ గాన విచక్షణ
గుణశీల దయాలవాల మాం పాలయ

వేదశిరోమాతృజ సప్తస్వర నాదాచలదీప స్వీకృత
యాదవకుల మురళీవాదన వినోద మోహనకర త్యాగరాజ వందనీయ

ఓ గజరాజు వంటి గంభీరమైన నడక కలిగినవాడా! సజ్జనుల హృదయసారమనే కమలములకు ప్రభువైన వాడా! కాలానికి అతీతమైన కీర్తి కలిగినవాడా! సామవేదం నుంచి పుట్టిన అమృతమయమైన గానంలో నిపుణుడా! సద్గుణశీలుడా! దయకు నిలయమైనవాడా! నన్ను రక్షించు. వేదాల శిరస్సు నుంచి ఉద్భవించిన సప్తస్వరాల నాదపర్వతానికి దీపంలా వెలిగేవాడా, దానిని స్వీకరించినవాడా! యాదవ వంశంలో జన్మించి మురళీవాదనలో ఆనందించి అందరినీ మోహింపజేసేవాడా! త్యాగరాజు పూజించే శ్రీకృష్ణా! నన్ను కాపాడు.

హిందోళ రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని మంగళపంపల్లి బాలమురళీకృష్ణ గారు ఆలపించారు

బాలమురళీకృష్ణ గారి రచన - అమ్మా! నిను కోరిన కోరికలిమ్మా!



అమ్మా! నిను కోరిన కోరికలిమ్మా! నీ అభిమాన కుమారుడనమ్మా!

ముమ్మాటికి నీవే నా దిక్కమ్మా! మానవమాత్రుడనమ్మా!
నిను కోరిన కోరికలిమ్మా! నీ అభిమాన కుమారుడనమ్మా!

పుట్టి మెట్టి గిట్టునట్టి తెరలో నేటి నటన బ్రతుకు యేటికమ్మా
పుట్టగానే మురళీగాన పట్టమిచ్చినట్టుగా మాయమ్మా!
నిను కోరిన కోరికలిమ్మా! నీ అభిమాన కుమారుడనమ్మా!

భావం:

అమ్మా! నేను నీ వద్ద కోరుకున్న కోరికలను నెరవేర్చమ్మా! నేను నీకు ఎంతో ప్రియమైన కుమారుడిని. నిజంగా నీవే నాకు దిక్కు, ఆధారం అమ్మా! నేను ఒక సాధారణ మానవుడినే. అందుకే మళ్లీ నిన్నే నా కోరికలు తీర్చమని వేడుకుంటున్నాను, ఎందుకంటే నేను నీ అభిమాన కుమారుడిని. పుట్టడం, ఎదగడం, చివరికి మరణించడం అనే తెర వెనుక నేటి జీవితం ఒక నాటకంలా సాగుతోంది—ఈ బ్రతుకు ఎందుకిలా ఉందో అమ్మా. నేను పుట్టగానే మురళీగానం చేసే కృష్ణుడికి పట్టం కట్టినట్లుగా, నీవు నాకు ఈ  ప్రపంచాన్ని ఇచ్చావమ్మా. కాబట్టి నా కోరికలను తీర్చు అమ్మా! నేను నీ ప్రియమైన కుమారుడిని.

ఈ కృతిని విని ఈ కొమరునికి తల్లిపై గల భక్తి విశ్వాసములను ఖమాస్ రాగంలో స్వయంగా ఆలపించగా ఆస్వాదించండి.

7, సెప్టెంబర్ 2026, సోమవారం

త్యాగధనుడు శిబి చక్రవర్తి


శిబి చక్రవర్తి భారతీయ ధార్మిక సంప్రదాయంలో దానశీలత, శరణాగత రక్షణ, ధర్మనిష్ఠ, త్యాగానికి ప్రతీకగా నిలిచిన మహోన్నత రాజు. ప్రజలను తన సంతానంలా భావించి, వారి రక్షణ కోసం తన సుఖాలను మాత్రమే కాకుండా అవసరమైతే తన ప్రాణాలను కూడా త్యాగం చేయడానికి సిద్ధపడిన ధర్మాత్ముడిగా శిబి చక్రవర్తి కీర్తి పొందారు.

శిబి చక్రవర్తి గురించి ప్రసిద్ధమైన కథ మహాభారతంలోని వనపర్వంలో, మార్కండేయ మహర్షి యుధిష్ఠిరునికి చెప్పిన సందర్భంలో వస్తుంది. ఒకసారి దేవతలు శిబి చక్రవర్తి ధర్మనిష్ఠను, శరణాగతుల పట్ల ఆయనకు ఉన్న బాధ్యతను పరీక్షించాలని నిర్ణయించుకున్నారు. ఇంద్రుడు డేగ రూపాన్ని, అగ్నిదేవుడు పావురం రూపాన్ని ధరించారు. డేగ వెంటాడుతుండగా ప్రాణభయంతో పరుగెత్తిన పావురం శిబి చక్రవర్తి ఒడిలోకి వచ్చి తనను రక్షించమని శరణు కోరింది.

శరణు కోరిన జీవిని తనకు అప్పగించేది లేదని శిబి చక్రవర్తి స్పష్టంగా చెప్పారు. కొద్దిసేపటికి డేగ అక్కడికి వచ్చి, ఆ పావురం తన ఆహారమని, దానిని తనకు అప్పగించాలని కోరింది. తన ఆకలిని తీర్చుకోవడం కూడా తన సహజధర్మమేనని డేగ వాదించింది. దీంతో శిబి చక్రవర్తి ఒక ధర్మసంకటాన్ని ఎదుర్కొన్నారు. ఒకవైపు తనను ఆశ్రయించిన పావురాన్ని రక్షించాల్సిన బాధ్యత, మరోవైపు ఆకలితో ఉన్న జీవికి ఆహారం అందాల్సిన సహజ ధర్మం. అయితే శరణాగతుడిని రక్షించడం తన క్షత్రియ ధర్మమని నిర్ణయించిన శిబి చక్రవర్తి, పావురాన్ని మాత్రం అప్పగించడానికి నిరాకరించారు.

అప్పుడు డేగ ఒక షరతు పెట్టింది. పావురాన్ని తనకు ఇవ్వలేకపోతే, దాని బరువుకు సమానమైన తన శరీర మాంసాన్ని ఇవ్వాలని కోరింది. శిబి చక్రవర్తి ఏమాత్రం వెనుకాడకుండా అంగీకరించారు. త్రాసులో ఒక వైపు పావురాన్ని ఉంచి, మరోవైపు తన శరీరం నుంచి కోసిన మాంసాన్ని ఉంచారు. ఎంత మాంసం కోసి పెట్టినా పావురం ఉన్న వైపే బరువుగా ఉండేది. చివరకు తన శరీరంలో మిగిలిన భాగమంతా త్యాగం చేయాలనే సంకల్పంతో శిబి చక్రవర్తి తానే త్రాసులో కూర్చున్నారు.

రాజు యొక్క ఈ అపూర్వమైన త్యాగాన్ని చూసి డేగ, పావురం తమ నిజస్వరూపాలను వెల్లడించాయి. డేగ రూపంలో వచ్చినది ఇంద్రుడు, పావురం రూపంలో వచ్చినది అగ్నిదేవుడు. శిబి చక్రవర్తి ధర్మనిష్ఠను పరీక్షించడానికే తాము ఈ రూపాలను ధరించామని వారు తెలిపారు. తనను ఆశ్రయించిన ఒక చిన్న జీవిని రక్షించడానికి తన శరీరాన్నే త్యాగం చేయడానికి సిద్ధపడిన శిబి చక్రవర్తి నిస్వార్థ ధర్మబుద్ధిని వారు ప్రశంసించి, ఆయనకు వరాలు ప్రసాదించారు.

శిబి చక్రవర్తి గొప్పతనం కేవలం దానధర్మాల్లోనే కాదు, శరణాగత రక్షణలోనూ కనిపిస్తుంది. తన వద్దకు రక్షణ కోసం వచ్చినవాడు బలహీనుడైనా, చిన్న జీవియైనా, అతన్ని రక్షించడం రాజు యొక్క ధర్మమని ఆయన తన ఆచరణ ద్వారా నిరూపించారు. తన ప్రాణాన్ని కాపాడుకోవడం కంటే ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం గొప్పదని ఆయన చూపించారు. అందుకే శిబి చక్రవర్తి కథ భారతీయ సంస్కృతిలో సత్యనిష్ఠకు, వాగ్దానపాలనకు, కరుణకు, త్యాగానికి శాశ్వతమైన ఉదాహరణగా నిలిచింది.

శిబి చక్రవర్తి కథకు ప్రధాన ప్రాచీన ఆధారం మహాభారతంలోని వనపర్వం. మార్కండేయ మహర్షి యుధిష్ఠిరునికి చెప్పిన ఈ కథలో ఇంద్రుడు డేగగా, అగ్నిదేవుడు పావురంగా మారి శిబి చక్రవర్తిని పరీక్షించిన ఘట్టం వివరంగా ఉంటుంది. ఇదే కథ బౌద్ధ జాతక సంప్రదాయంలో కూడా శిబి జాతకంగా ప్రసిద్ధి చెందింది. వివిధ సంప్రదాయాల్లో కథలో కొన్ని మార్పులు కనిపించినప్పటికీ, శరణు కోరిన జీవిని రక్షించడానికి రాజు తన శరీరాన్నే త్యాగం చేయడం అనే ప్రధాన సందేశం మాత్రం ఒకటే.

శిబి చక్రవర్తి జీవితం మనకు ధర్మం అంటే కేవలం మాటల్లో చెప్పే సిద్ధాంతం కాదని, అవసరమైన సమయంలో దానిని ఆచరణలో చూపించడమే నిజమైన ధర్మమని బోధిస్తుంది. తనను ఆశ్రయించిన ఒక చిన్న పావురం కోసం తన శరీరాన్నే సమర్పించడానికి సిద్ధపడిన ఆయన త్యాగం మానవతకు ఒక ఉన్నతమైన ప్రమాణాన్ని చూపిస్తుంది. అందుకే శిబి చక్రవర్తి పేరు భారతీయ సాహిత్యంలో ధర్మానికి కట్టుబడి, ఇతరుల ప్రాణాలను కాపాడేందుకు తన ప్రాణాన్నే పణంగా పెట్టిన మహా త్యాగశీలి రాజుగా చిరస్థాయిగా నిలిచిపోయింది.

వామాంక స్థితయా - ముత్తుస్వామి దీక్షితుల కృతి

వామాంక స్థితయా వల్లభయాऽऽశ్లిష్టం వారణ వదనం దేవం వందేऽహం వామన స్వరూపం వరదం సచాపం చామర కర్ణం శశి శేఖర తనయం నామరూప ధరం అభినవ గురుగుహ హృదయం అష్ట...