12, నవంబర్ 2020, గురువారం

రఘునాయకా నీ పాదయుగ రాజీవముల - సద్గురువులు త్యాగరాజస్వామి

త్యాగరాజస్వామి కృతులలో శరణాగతి చాలా కృతులలో గోచరిస్తుంది. సంసార సాగరాన్ని దాటలేని నిస్సహాయ స్థితిలో ఆశ్రితులజనరక్షకుడని పేరొందిన రాముని పాదములను పట్టుకుని విడువకుండా కొలిచే స్థితిని రఘునాయకా నీ పాదయుగ రాజీవముల అన్న కృతిలో ఆవిష్కరించారు. ఎంతో శ్రమపడి రాముని సన్నిధి చేరి శరణు కోరుతున్నాను అని స్వామిని వేడుకున్నారు స్వామి. శ్రీమద్రామాయణంలో ఆశ్రయించిన వారిని రాముడు అమితమైన వాత్సల్యంతో అనుగ్రహించి రక్షించిన సందర్భాలు ఎన్నో. ఆ విధంగానే తాను కూడా, తనను ఆదరించి ఆనందము కలుగజేయవలసిందిగా రాముని ప్రార్థించారు. 

సాహిత్యం
========

రఘునాయకా నీ పాదయుగ రాజీవముల నే విడజాల శ్రీ 

అఘజాలముల పారద్రోలి నన్నాదరించ నీవే గతి గాదా శ్రీ

భవసాగరము దాటలేక నే బలు గాసి పడి నీ మఱుగు జేరితిని
అవనిజాధిపాశ్రితరక్షకా ఆనందకర శ్రీ త్యాగరాజనుత

భావం
=====

రఘుకుల శ్రేష్ఠుడవైన శ్రీరామా! నీ పదకమలములను నే విడువను. నా పాపసమూహములను పారద్రోలి ఆదరించుటకు నీవే గతి కదా! ఈ సంసార సాగరము దాటలేక నేను ఎంతో శ్రమపడి నీ సన్నిధికి చేరుకున్నాను. భూమిజయైన సీతకు పతివైన శ్రీరామా! నీవు ఆశ్రితరక్షకుడవు, ఆనందమును కలిగించేవాడవు! శివునిచే నుతించబడిన వాడవు, నీ పదకమలములను నేను విడువలేను. 

శ్రవణం
=======

హంసధ్వని రాగంలో కూర్చబడిన ఈ కృతిని ప్రియా సోదరీమణులు షణ్ముఖ ప్రియ, హరిప్రియ ఆలపించారు

11, నవంబర్ 2020, బుధవారం

నిన్నాడనేల - సద్గురువులు త్యాగరాజస్వామి కృతి

 


దైవనింద నాస్తికులే కాదు, భక్తిమార్గంలో ఉన్నవారెందరో కూడా చేస్తారు. దీనికి కారణం ఈ భవసాగరంలో ఎదురయ్యే బాధలు, సమస్యలను తట్టుకోలేక తాము నమ్ముకున్న దైవం కూడా కాపాడటం లేదు అన్న ఆవేదనతో. కానీ భగవదనుగ్రహం ఎప్పుడూ సానుకూల ఫలాలలోనే కాదు, భవసాగర తారణంలో కలిగే పాఠాలలో కూడా ఉంటుంది అనేది భగవంతుడు సాక్షీభూతుడుగా ఉండటంలో రహస్యం. ఇది సద్భక్తులకు అనుభవపూర్వకంగా అవగతమవుతుంది. అందుకే ఆధ్యాత్మిక కొండను ఎక్కుతున్న భక్తునికి మొదటి భాగంలో అనేక రకాల భావనలు వస్తాయి, ముందుకు వెళుతున్న కొద్దీ అనేక ప్రశ్నలకు సమాధానాలు లభించిన తరువాత దైవనింద చేయటం తగ్గుతుంది. పూర్వజన్మ కర్మఫలాలు కొన్నిటిని అనుభవించక తప్పదు అన్నది చాలా మెట్లు ఎక్కితే కానీ మనసు అంగీకరించదు. ఆ తరువాత ప్రయాణంలో అటువంటి ఆలోచనా తరంగాలు సద్దుమణుగుతాయి, తారణం సాఫీగా సాగుతుంది. 

అనుభవపూర్వకంగా కలిగే ఈ జ్ఞానాన్ని తన కృతిద్వారా వివరించారు సద్గురువులు త్యాగరాజస్వామి. సాక్షీభూతుడైన స్వామికి నిన్నాడనేల అని తన ఉన్నతమైన భావనలను తెలియజేశారు. కన్నడ రాగంలోని ఈ కృతిని హైదరాబాద్ సోదరులు శేషాచార్యులు, రాఘవాచార్యులు ఆలపించారు. కన్నడ రాగం ధీర శంకరాభరణ జన్యం. అందమైన గమకాలతో త్యాగరాజస్వామి భావనలను మనోజ్ఞంగా కన్నడ రాగం ఆవిష్కరిస్తుంది. 

నిన్నాడనేల! నీరజాక్ష శ్రీరామ!

కన్నవారిపైని కాకసేయనేల!

కర్మానికి తగినట్టు కార్యములు నడిచేని
ధర్మానికి తగినట్టు దైవము బ్రోచేని

చిత్తానికి తగినట్టు సిద్ధియు కలిగేని
విత్తానికి తగినట్టు వేడుక నడిచేని

సత్త్వరూప నిన్ను సన్నుతి జేసి
తత్త్వము దెలిసిన త్యాగరాజునికి

కలువలవంటి కన్నులు కలిగిన శ్రీరామా! నా కష్టములకు నిన్ను నిందించుట తప్పు. మన కష్టాలకు కన్న తల్లిదండ్రులపై కోపగించుకొనుట యెందుకు? కర్మలకు తగినట్లుగానే కదా ఫలములు, తదుపరి కార్యములు నడిచేది? ధర్మాచరణను బట్టి కదా దైవానుగ్రహము? మన చిత్తశుద్ధిని బట్టి కదా మనకు సిద్ధించే ఫలాలు? డబ్బుకు తగినట్లు కదా వేడుకలు? శుద్ధ సత్త్వ స్వరూపుడవైన నిన్ను నుతించి నీ తత్త్వము గ్రహించినాను, నేను నిందించే పని లేదు శ్రీరామా! 

7, నవంబర్ 2020, శనివారం

అక్షయలింగ విభో స్వయంభో - ముత్తుస్వామి దీక్షితుల కృతి

ముత్తుస్వామి దీక్షితులవారి కృతులలో ఎక్కువ మటుకు క్షేత్ర కృతులే. అనగా, దక్షిణ భారత దేశంలో ఉన్న అనేక దివ్యక్షేత్రాలను సందర్శించి, ఆ దేవతను ఆయన ఉపాసన చేసినప్పుడు రచించినవి. అటువంటి కృతి ఒకటి తమిళనాడులోని నాగపట్టణం జిల్లా కీళ్వేలూరులో ఉన్న అక్షయలింగేశ్వర క్షేత్రంలో వెలసిన స్వామిపై రచించినది. క్షేత్ర ప్రస్తావనలో వాగ్గేయకారులు ఆ క్షేత్రంలోని దేవతలతో పాటు ఇతర వివరాలను కూడా సుస్పష్టంగా పొందుపరచటంలో ఉద్దేశం ఆయా క్షేత్రాలు, దేవతామూర్తుల యొక్క విశిష్టతను, విలక్షణతను శాశ్వతం చేయటం కోసమే. ఇక్కడ అమ్మవారు, స్వామి బదరీవృక్షం క్రింద స్థితమై ఉంటారు. అలాగే ఇక్కడ భద్రకాళీ అమ్మ వారి మూర్తి కూడా ఉంది. వీటిని కృతిలో దీక్షితులవారు ప్రస్తావించారు. అక్షయలింగేశ్వర స్వామి క్షేత్రం చాలా పురాతనమైనది. స్వయంభూ లింగ స్వరూపంలో పరమశివుడు సుందరకుచాంబిక, భద్రకాళిగా పార్వతీ దేవి, వినాయకుడు, కుమారస్వామితో సహా అనేక దేవతామూర్తులు ఈ క్షేత్రంలో ఉన్నాయి. శైవయోగి, కవి జ్ఞానసంబంధర్ రచనలలో ఈ క్షేత్ర ప్రస్తావన ఉంది. కృతిలో చైత్రపూర్ణిమ నాడు స్వామికి జరిగే భవ్యమైన రథోత్సవ ప్రస్తావన కూడా దీక్షితార్ చేశారు. సనాతన ధర్మ పరిరక్షణలో దీక్షితార్ కృతుల పాత్ర ఎనలేనిది. ఇప్పుడు ద్రావిడవాదం వచ్చి పేర్లు మార్చబడినా, ఒకనాడు తమిళనాడులో ఉన్న క్షేత్రాలు, దేవతల నామాలన్నీ కూడా సనాతన ధర్మానికి మూలమైన సంస్కృత భాషలో ఉన్నవే. దీక్షితుల వారు ఆ నామాలనే తన కృతులలో ఉపయోగించారు. 

ధీరశంకరాభరణ రాగంలో కూర్చబడిన ఈ కృతిని డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు ఆలపించారు

అక్షయలింగ విభో స్వయంభో అఖిలాండ కోటి ప్రభో పాహి శంభో

అక్షయ స్వరూప అమిత ప్రతాప ఆరూఢ వృషవాహ జగన్మోహ
దక్ష శిక్షణ దక్షతర సుర లక్షణ విధి విలక్షణ లక్ష్య
లక్షణ బహు విచక్షణ సుధా భక్షణ గురు కటాక్ష వీక్షణ

బదరీ వనమూల నాయికాసహిత భద్రకాళీశ భక్త విహిత
మదన జనకాది దేవ మహిత మాయాకార్య కలనా రహిత
సదయ గురుగుహ తాత గుణాతీత సాధు జనోపేత శంకర నవనీత
హృదయ విభాత తుంబురు సంగీత హ్రీంకార సంభూత హేమగిరి నాధ
సదాశ్రిత కల్పక మహీరుహ పదాంబుజ భవ రథ గజ తురగ
పదాది సంయుత చైత్రోత్సవ సదాశివ సచ్చిదానందమయ

ఓ అక్షయలింగ ప్రభో! నీవు స్యయంభువుడవు, సమస్త విశ్వములకు ప్రభువువుం శంకరుడవు, నన్ను రక్షింపుము. నాశనము లేని స్వరూపము కలవాడవు, అమిత ప్రతాపవంతుడవు, నందీశ్వరుని అధిరోహించిన జగన్మోహనుడవు. దక్షుని శిక్షించినవాడవు, దేవతలకు విధివిధానములను, విలక్షణమైన తత్త్వములను, లక్ష్యములను దక్షిణామూర్తి రూపములో శిక్షణనొసగిన నిపుణుడవు, అనేక రకములైన విచక్షణ కలవాడవు, అమృతమును సేవించేవాడవు, ఘనమైన కటాక్ష వీక్షణము కలవాడవు, నన్ను రక్షింపుము. బదరీ వనములో పార్వతీదేవి సమేతుడవై యున్నవాడవు, భద్రకాళికి ప్రభువువు, భక్తులకు హితుడవు. మదనుని జనకుడైన శ్రీహరి మొదలైన దేవతలచే నుతించబడిన వాడవు, మాయ చేసే కల్పనలకు అతీతుడవు, ఎల్లప్పుడూ కుమారస్వామిపై పితృవాత్సల్యమును కురిపించేవాడవు, గుణాతీతుడవు, సాధుజనుల సమీపములో ఉండి శుభములు కలిగించేవాడవు, వెన్నవంటి హృదయము కలవాడవు, తుంబురుని సంగీతమును ఆనందించేవాడవు, హ్రీంకారము నుండి ఉద్భవించినవాడవు, కైలాసపతివి, నీ పదకమలములను ఆశ్రయించేవారికి కల్పవృక్షము వంటివాడవు, భవుడవు, రథ గజ తురగ పదాది సైన్యముతో చైత్రోత్సవములో ప్రకాశించే సదాశివుడవు, సచ్చిదానందమయుడవు. నన్ను రక్షింపుము.

చిత్రం కీళ్వేలూరులోని కెదిలియప్పర్ (అక్షయలింగేశ్వరుని) రూపము

6, నవంబర్ 2020, శుక్రవారం

తలచినంతనే నా తనువైతే ఝల్లనెరా - త్యాగరాజస్వామి కృతి


మానసిక స్థితిని బట్టి ఆధ్యాత్మిక అనుభూతులు. మన ధర్మంలో ఈ సత్యానికి ఎన్నో నిదర్శనాలు. సద్గురువులు త్యాగరాజస్వామి వారి కృతులలో ఇది మనకు సుస్పష్టంగా గోచరిస్తుంది. కనబడలేదని విచారము, దయలేదని నిష్ఠూరము, ఉన్నాడో లేడో అని సంశయము, మహిమ అనుభూతికి రాగానే అమితానందము, అంతటా ఉన్నాడని గ్రహింపుకు వస్తుంటే తనువు పులకింత, అది అనుభవాల ద్వారా మరింత ప్రగాఢమై అంతర్ముఖమైన సాధన, అన్నిటికీ రాముడే రక్ష అన్న దృఢమైన విశ్వాసముతో ఎటువంటి క్లేశాన్నైనా భరించే ఓర్పు...ఇలా త్యాగరాజస్వామి ఆధ్యాత్మిక ప్రయాణంలో సమస్త లక్షణాలూ తన కృతులలో వ్యక్తపరచారు. మలిదశలో పరిణతి చెందిన భక్తివిశ్వాసములతో పరిపుష్టమైన మానసిక వికాసము కనబరచిన ఒక కృతి తలచినంతనే నా తనువైతే ఝల్లనెరా. 

సాహిత్యము:

తలచినంతనే నా తనువైతే ఝల్లనెరా

జలజ వైరి ధరాది విధీంద్రుల
చెలిమి పుజలందిన నిను నే

రోటికి కట్టదగిన నీ లీలలు
మూటికెక్కువైన నీదు గుణములు
కోటిమదనలావణ్యమునైన
సాటి గాని నీ దివ్యరూపమును 

నిద్రాలస్య రహిత శ్రీరామ 
భద్రానిలజ సులభ సంసార
చ్ఛిద్రార్తిని దీర్చే శక్తిని విధి
రుద్రాదుల నుతమౌ చరితంబును

పాదవిజిత మునితరుణీ శాపా
మోద త్యాగరాజనుత ధరాప
నాదబ్రహ్మానంద రూప
వేదసారమౌ నామధేయమును

భావము:

ఓ శ్రీరామా! నిన్ను తలచినంతనే నా శరీరామంతా ఝల్లుమని పులకరిస్తుంది. కమలమునకు శత్రువైన చంద్రుని శిరమున ధరించే పరమశివుడు, బ్రహ్మేంద్రాదుల స్నేహము, పూజలు అందుకున్న నిన్ను తలచినంతనే నా శరీరము పులకిస్తుంది. శ్రీకృష్ణావతారములో నీ అల్లరి చేష్టలకు యశోదమ్మ నిన్ను రోటికి కట్టివేయుట, త్రిగుణాతీతమైన నీ గుణములు, కోటి మన్మథులకైన సాటి కాని సౌందర్యము గల నీ దివ్యరూపమును తలచినంతనే నా శరీరమంతా పులకించును. నిద్ర, అలసత్వము మొదలైన తమోగుణములు లేని శ్రీరామా! భద్రునికి, ఆంజనేయునికి నీవు సులభుడవు! సంసార దోషములనే ఆర్తులను తీర్చే శక్తి కలిగిన వాడవు! బ్రహ్మ రుద్రాదులచే నుతించబడిన చరితము కలిగిన నిన్ను తలచినంతనే నా శరీరము పులకించును. సమస్త భూమండలమును పాలించి, ఆనందముతో పరమశివునిచే నుతించబడిన శ్రీరామా! నీ పాద ధూళిని తాకినంతనే శాపవిముక్తురాలైన గౌతమముని పత్ని అహల్య చరితము, నీ నాదబ్రహ్మానంద స్వరూపము, వేదముల సారమైన నీ నామమును తలచినంతనే  నా శరీరమంతా ఝల్లని పులకిస్తుంది. 

వివరణ:

పరబ్రహ్మ స్వరూపమైన రాముని గుణములను, సౌందర్యాన్ని, వైభవాన్ని తెలిపే రామాయణాది వాఙ్మయం మనకు నిత్య పూజనీయమైనవి. శ్రీరాముని చరితమును అత్యంత మనోజ్ఞముగా వర్ణించిన వాల్మీకి మహర్షి రచించిన రామాయణం పఠించేటప్పుడు ఈ కృతిలో త్యాగరాజస్వామికి కలిగే భావనలన్నీ మనకు కలుగుతాయి. ఆ భావనలు మనసులో నిలిచిపోవాలంటే నిరంతర పునశ్చరణ, నామస్మరణముతో కూడిన సాధన అవసరం. ఆ స్థాయికి త్యాగరాజస్వామి వారు చేరుకున్నాక రాముని తలచుకున్న వెంటనే భవ్యమైన రామ పరబ్రహ్మ తత్త్వముతో పాటు సగుణ వైభవములు కూడా గోచరమై తనువు పులకించి తన్మయత్వము కలిగింది. ఈ భావనలన్నీ సాధకునికి భవసాగరం దాటడానికి అత్యంత ఉపయుక్తమైన ఆలంబనలు. అనంతమైన పరమాత్మ తత్త్వం ముందు మనము, మన కష్టాలు ఎంత? ఘోరమైన శాపం వల్ల  పాషాణమైన అహల్యకు ముక్తిని కలిగించాడు రాముడు, మనలను కూడా అదే విధంగా అనుగ్రహిస్తాడు అన్న భావనను తప్పక కలిగిస్తుంది. రాముని జీవితంలో ప్రతి అడుగూ మనకు ఆదర్శప్రాయమే, మన దోషాలను తొలగించుకుంటూ ముక్తి పథంలో ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి. ఇది అనుభవైకవేద్యంగా తెలిపారు నాదయోగి త్యాగరాజస్వామి. రామనామ స్మరణ, సంకీర్తనల ద్వారా రాముని హృదయములో నిలుపుకుని తరించారు. 

శ్రవణం:

ముఖారి రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని బాలమురళీకృష్ణగారు శ్రావ్యంగా ఆలపించారు

5, నవంబర్ 2020, గురువారం

అందము ఆనందము రామానుజార్య సంబంధము - నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యుల వారు

త్యాగరాజ శిష్యపరంపరకు చెందిన ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు, పండితులు, గురువులు, హరికథా భాగవతార్ శ్రీ నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యుల వారు. పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారి శిష్యులైన వీరు ఎందరో గొప్ప కళాకారులకు గురువులు. ఎన్నో పుస్తకాలను రచించారు. 1924లో కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో జన్మించిన వీరు వ్యాకరణ మీమాంస శాస్త్రములను అభ్యసించారు. రామకృష్ణయ్య పంతులు గారి వద్ద గురుకుల పద్ధతిలో కర్ణాటక శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించారు. 1948 నుండి 1983 వరకు ఆకాశవాణి విజయవాడలో నిలయ విద్వాంసునిగా పనిచేశారు. గానకళాప్రపూర్ణ, సంగీత సాహిత్య కళానిధి, హరికథా చూడామణి, సంగీత కళాసాగర బిరుదులను పొందారు. ఆకాశవాణి స్వర్ణోత్సవాల సమయంలో, తెలుగు విశ్వవిద్యాలయం నుండి ప్రత్యేక పురస్కారాలను పొందారు. కృష్ణమాచార్యుల వారు త్యాగరాజస్వామి యక్షగానాలను తెలుగు నుండి సంస్కృతంలోకి అనువదించారు. 20కు పైగా కృతులు, వర్ణాలు, తిల్లానాలు రచించారు. 60 ఏళ్ల సుదీర్ఘమైన సంగీత ప్రస్థానం కలిగిన వీరికి మద్రాస్ మ్యూజిక్ అకాడెమీ వారు వీరికి వాగ్గేయకార అవార్డును ప్రదానం చేశారు. శ్రీభాష్యం అప్పలాచార్యుల వారితో ఎంతో అనుబంధం ఉన్న వీరు 2006లో పరమపదించారు. 

కృష్ణమాచార్యుల వారు రామానుజుల వారిని నుతిస్తూ రచించిన ఒక చక్కని కృతిని రచించారు. ఈ కృతిని ఆనందభైరవి రాగంలో స్వరపరచారు. ఈ కృతిని వారి శిష్యుడు ప్రముఖ వయోలిన్ విద్వాంసులు శ్రీ ఎం.ఎస్.ఎన్ మూర్తి గారి సతీమణి, ప్రఖ్యాత విద్వాంసురాలు డాక్టర్ పంతుల రమ గారు ఆలపించారు

అందము ఆనందము రామానుజార్య సంబంధము దాని
చందము మోక్ష కందము మరి చందనాగురు గంధము 

ఘనము పావనము భాష్యకార పద సేవనము జీ-
వనము సదవనము ప్రాక్తన పాప మోచనము

సారము పుణ్య సారము యతి చంద్రుని దివ్యాకారము జగదా-
ధారము తమోదూరము భూత దయాపారావారము

ధ్యేయము భాగధేయము యతి దినకరు నామధేయము కర్ణ-
పేయము నిరపాయము కృష్ణ గేయము సదుపాయము

ఎవ్వరే రామయ్య నీ సరి - త్యాగరాజస్వామి కృతి


రాముని అనేక సుగుణాలలో వైరివర్గములో ఉన్నా సజ్జనులను గుర్తించి వారికి అభయమిచ్చి అనుగ్రహించటం. సీతమ్మను అపహరించిన రావణుని సోదరుడైన విభీషణుని అనుగ్రహించి లంకకు రాజును చేయటంలో రాముని విచక్షణ ఎంత ఉన్నతమైనదో, సునిశితమైనదో మనం గుర్తించాలి అన్న ముఖ్యమైన అంశాన్ని త్యాగరాజస్వామి ఈ కృతి ద్వారా మనకు తెలియజేస్తున్నారు. ఇక్కడ రాముని ప్రాతిపదిక విభీషణుని వ్యక్తిత్వం, ధర్మానురక్తి మరియు రావణుని తరువాత లంక సుఖశాంతులతో ఉండాలి అన్న సంకల్పం. రావణుడు చేసిన దారుణానికి విభీషణుని నమ్మకపోవటం అనేది మానవ సహజం, కానీ రాముడు అందుకు భిన్నంగా అతని నైజాన్ని, భక్తిని, సమర్థతను గుర్తించి సముచితమైన నిర్ణయం తీసుకున్నాడు. అందుకే రాముని మించిన ప్రభువు లేడు అన్నది త్యాగరాజస్వామి సుస్పష్టం చాటారు. 

రామాయణం పఠించి ఆ లోకాభిరాముని వ్యక్తిత్వాన్ని ఆకళింపు చేసుకుంటే రాముడి నడవడిక నుండి మనకు నిత్యజీవితంలో అత్యంత శ్రేయస్కరమైన లక్షణాలు ఎన్నో అవగతమవుతాయి. ఎక్కడ ఉన్నా ధర్మబద్ధమైన నడవడిక కలిగిన వారికి పరమాత్మ అనుగ్రహం ఉంటుంది అన్నది రాముని విచక్షణ ద్వారా మనకు ఎంతో కీలకమైన సందేశం. ఈ సులక్షణాలే మనకు ఎల్లప్పటికీ మార్గదర్శకాలు. 

ఎవ్వరే రామయ్య నీ సరి

రవ్వకు తావులేక సుజనులను రాజిగ రక్షించే వా(రె)

పగవానికి సోదరుడని యెంచక భక్తినెరిగి లంకా పట్టణమొసగగ
నగధర సురభూసుర పూజిత వర నాగశయన త్యాగరాజ వినుత సరి

ఓ రామయ్యా! నీకు సాటి ఎవ్వరు? కీర్తికి భంగము కలుగకుండా సుజనులను సక్రమముగా నీవలె రక్షించే వారెవ్వరు? శత్రు సోదరుడని యెంచక విభీషణుని భక్తిని గుర్తించి లంకా పట్టణమునకు రాజును చేసినావు. మందర పర్వతమును ధరించిన శ్రీహరీ! దేవతలచే, బ్రాహ్మణులచే పూజించబడిన శ్రేష్ఠుడా! ఆదిశేషునిపై శయనించేవాడా! పరమశివునిచే నుతించబడే శ్రీరామా! నీకు సాటి ఎవ్వరు? 

గాంగేయభూషణి రాగంలో కూర్చబడిన ఈ కృతిని బాలమురళీకృష్ణ గారు మధురంగా ఆలపించారు

4, నవంబర్ 2020, బుధవారం

రాముడు రాఘవుడు రవికులుడితడు - తాళ్లపాక అన్నమాచార్యుల వారు


 
రాముడు రాఘవుడు రవికులుడితడు 
భూమిజకు పతియైన పురుష నిధానము 

అరయ పుత్రకామేష్టి యందు పరమాన్నమున
పరగ జనించిన పర బ్రహ్మము
సురుల రక్షింపగ నసురుల శిక్షింపగ
తిరమై ఉదయించిన దివ్య తేజము

చింతించే యోగీంద్రుల చిత్త సరోజములలో
సతతము నిలిచిన సాకారము
వింతలుగా మునులెల్ల వెదకినయట్టి
కాంతుల చెన్ను మీరిన కైవల్య పదము

వేద వేదాంతముల యందు విజ్ఞాన శాస్త్రములందు
పాదుకొన పలికేటి పరమార్థము
పోదితో శ్రీ వేంకటాద్రి బొంచి విజయనగరాన
ఆదికిననాదియైన అర్చావతారము

సూర్యవంశమున రఘుమహారాజు పరంపరలో జన్మించి సీతమ్మకు పతియైన పురుషోత్తముడు ఈ రాముడు. దశరథ మహారాజు చేసిన పుత్రకామేష్టిలో పరమాన్నమున పరబ్రహ్మ రూపమై, దేవతలను రక్షించుటకు, దానవులను శిక్షించుటకు స్థిరముగా ఆవిర్భవించిన దివ్య తేజో రూపము ఇతడు. నిరంతరం ధ్యానించే యోగిశ్రేష్ఠుల హృదయ కమలములలో ఎల్లప్పుడూ నిలిచిన సాకారము, మునిజనులు ఎంతో ఆతృతతో వెదకే  కాంతులతో ప్రకాశించే ముక్తి పదము ఇతడు. వేద వేదాంతములలో, విజ్ఞాన శాస్త్రములలో పలుకబడిన శాశ్వత పరమార్థము, వైభవముతో రక్షకుడై వేంకటాద్రిపై మరియు విజయనగరములో వెలసి, ఆదికే అనాదియై అర్చించబడే అవతారమూర్తి ఈ రాముడు. 

ఈ కృతిని గరిమెళ్ల అనిలకుమార్ గారు ఆలపించారు

అంతా రామమయం - భద్రాచల రామదాసు కృతి

అంతా రామమయం ఈ జగమంతా రామమయం అంతరంగమున ఆత్మారాముడనంత రూపముల వింతలు సలుపగ సోమసూర్యులును సురలు తారలును ఆ మహాంబుధులు అవనీజంబులు అండాండంబులు పిండ...