రాముడు రాఘవుడు రవికులుడితడు
భూమిజకు పతియైన పురుష నిధానము
అరయ పుత్రకామేష్టి యందు పరమాన్నమున
పరగ జనించిన పర బ్రహ్మము
సురుల రక్షింపగ నసురుల శిక్షింపగ
తిరమై ఉదయించిన దివ్య తేజము
చింతించే యోగీంద్రుల చిత్త సరోజములలో
సతతము నిలిచిన సాకారము
వింతలుగా మునులెల్ల వెదకినయట్టి
కాంతుల చెన్ను మీరిన కైవల్య పదము
వేద వేదాంతముల యందు విజ్ఞాన శాస్త్రములందు
పాదుకొన పలికేటి పరమార్థము
పోదితో శ్రీ వేంకటాద్రి బొంచి విజయనగరాన
ఆదికిననాదియైన అర్చావతారము
సూర్యవంశమున రఘుమహారాజు పరంపరలో జన్మించి సీతమ్మకు పతియైన పురుషోత్తముడు ఈ రాముడు. దశరథ మహారాజు చేసిన పుత్రకామేష్టిలో పరమాన్నమున పరబ్రహ్మ రూపమై, దేవతలను రక్షించుటకు, దానవులను శిక్షించుటకు స్థిరముగా ఆవిర్భవించిన దివ్య తేజో రూపము ఇతడు. నిరంతరం ధ్యానించే యోగిశ్రేష్ఠుల హృదయ కమలములలో ఎల్లప్పుడూ నిలిచిన సాకారము, మునిజనులు ఎంతో ఆతృతతో వెదకే కాంతులతో ప్రకాశించే ముక్తి పదము ఇతడు. వేద వేదాంతములలో, విజ్ఞాన శాస్త్రములలో పలుకబడిన శాశ్వత పరమార్థము, వైభవముతో రక్షకుడై వేంకటాద్రిపై మరియు విజయనగరములో వెలసి, ఆదికే అనాదియై అర్చించబడే అవతారమూర్తి ఈ రాముడు.
ఈ కృతిని గరిమెళ్ల అనిలకుమార్ గారు ఆలపించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి