11, నవంబర్ 2020, బుధవారం

నిన్నాడనేల - సద్గురువులు త్యాగరాజస్వామి కృతి

 


దైవనింద నాస్తికులే కాదు, భక్తిమార్గంలో ఉన్నవారెందరో కూడా చేస్తారు. దీనికి కారణం ఈ భవసాగరంలో ఎదురయ్యే బాధలు, సమస్యలను తట్టుకోలేక తాము నమ్ముకున్న దైవం కూడా కాపాడటం లేదు అన్న ఆవేదనతో. కానీ భగవదనుగ్రహం ఎప్పుడూ సానుకూల ఫలాలలోనే కాదు, భవసాగర తారణంలో కలిగే పాఠాలలో కూడా ఉంటుంది అనేది భగవంతుడు సాక్షీభూతుడుగా ఉండటంలో రహస్యం. ఇది సద్భక్తులకు అనుభవపూర్వకంగా అవగతమవుతుంది. అందుకే ఆధ్యాత్మిక కొండను ఎక్కుతున్న భక్తునికి మొదటి భాగంలో అనేక రకాల భావనలు వస్తాయి, ముందుకు వెళుతున్న కొద్దీ అనేక ప్రశ్నలకు సమాధానాలు లభించిన తరువాత దైవనింద చేయటం తగ్గుతుంది. పూర్వజన్మ కర్మఫలాలు కొన్నిటిని అనుభవించక తప్పదు అన్నది చాలా మెట్లు ఎక్కితే కానీ మనసు అంగీకరించదు. ఆ తరువాత ప్రయాణంలో అటువంటి ఆలోచనా తరంగాలు సద్దుమణుగుతాయి, తారణం సాఫీగా సాగుతుంది. 

అనుభవపూర్వకంగా కలిగే ఈ జ్ఞానాన్ని తన కృతిద్వారా వివరించారు సద్గురువులు త్యాగరాజస్వామి. సాక్షీభూతుడైన స్వామికి నిన్నాడనేల అని తన ఉన్నతమైన భావనలను తెలియజేశారు. కన్నడ రాగంలోని ఈ కృతిని హైదరాబాద్ సోదరులు శేషాచార్యులు, రాఘవాచార్యులు ఆలపించారు. కన్నడ రాగం ధీర శంకరాభరణ జన్యం. అందమైన గమకాలతో త్యాగరాజస్వామి భావనలను మనోజ్ఞంగా కన్నడ రాగం ఆవిష్కరిస్తుంది. 

నిన్నాడనేల! నీరజాక్ష శ్రీరామ!

కన్నవారిపైని కాకసేయనేల!

కర్మానికి తగినట్టు కార్యములు నడిచేని
ధర్మానికి తగినట్టు దైవము బ్రోచేని

చిత్తానికి తగినట్టు సిద్ధియు కలిగేని
విత్తానికి తగినట్టు వేడుక నడిచేని

సత్త్వరూప నిన్ను సన్నుతి జేసి
తత్త్వము దెలిసిన త్యాగరాజునికి

కలువలవంటి కన్నులు కలిగిన శ్రీరామా! నా కష్టములకు నిన్ను నిందించుట తప్పు. మన కష్టాలకు కన్న తల్లిదండ్రులపై కోపగించుకొనుట యెందుకు? కర్మలకు తగినట్లుగానే కదా ఫలములు, తదుపరి కార్యములు నడిచేది? ధర్మాచరణను బట్టి కదా దైవానుగ్రహము? మన చిత్తశుద్ధిని బట్టి కదా మనకు సిద్ధించే ఫలాలు? డబ్బుకు తగినట్లు కదా వేడుకలు? శుద్ధ సత్త్వ స్వరూపుడవైన నిన్ను నుతించి నీ తత్త్వము గ్రహించినాను, నేను నిందించే పని లేదు శ్రీరామా! 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి