6, నవంబర్ 2020, శుక్రవారం

తలచినంతనే నా తనువైతే ఝల్లనెరా - త్యాగరాజస్వామి కృతి


మానసిక స్థితిని బట్టి ఆధ్యాత్మిక అనుభూతులు. మన ధర్మంలో ఈ సత్యానికి ఎన్నో నిదర్శనాలు. సద్గురువులు త్యాగరాజస్వామి వారి కృతులలో ఇది మనకు సుస్పష్టంగా గోచరిస్తుంది. కనబడలేదని విచారము, దయలేదని నిష్ఠూరము, ఉన్నాడో లేడో అని సంశయము, మహిమ అనుభూతికి రాగానే అమితానందము, అంతటా ఉన్నాడని గ్రహింపుకు వస్తుంటే తనువు పులకింత, అది అనుభవాల ద్వారా మరింత ప్రగాఢమై అంతర్ముఖమైన సాధన, అన్నిటికీ రాముడే రక్ష అన్న దృఢమైన విశ్వాసముతో ఎటువంటి క్లేశాన్నైనా భరించే ఓర్పు...ఇలా త్యాగరాజస్వామి ఆధ్యాత్మిక ప్రయాణంలో సమస్త లక్షణాలూ తన కృతులలో వ్యక్తపరచారు. మలిదశలో పరిణతి చెందిన భక్తివిశ్వాసములతో పరిపుష్టమైన మానసిక వికాసము కనబరచిన ఒక కృతి తలచినంతనే నా తనువైతే ఝల్లనెరా. 

సాహిత్యము:

తలచినంతనే నా తనువైతే ఝల్లనెరా

జలజ వైరి ధరాది విధీంద్రుల
చెలిమి పుజలందిన నిను నే

రోటికి కట్టదగిన నీ లీలలు
మూటికెక్కువైన నీదు గుణములు
కోటిమదనలావణ్యమునైన
సాటి గాని నీ దివ్యరూపమును 

నిద్రాలస్య రహిత శ్రీరామ 
భద్రానిలజ సులభ సంసార
చ్ఛిద్రార్తిని దీర్చే శక్తిని విధి
రుద్రాదుల నుతమౌ చరితంబును

పాదవిజిత మునితరుణీ శాపా
మోద త్యాగరాజనుత ధరాప
నాదబ్రహ్మానంద రూప
వేదసారమౌ నామధేయమును

భావము:

ఓ శ్రీరామా! నిన్ను తలచినంతనే నా శరీరామంతా ఝల్లుమని పులకరిస్తుంది. కమలమునకు శత్రువైన చంద్రుని శిరమున ధరించే పరమశివుడు, బ్రహ్మేంద్రాదుల స్నేహము, పూజలు అందుకున్న నిన్ను తలచినంతనే నా శరీరము పులకిస్తుంది. శ్రీకృష్ణావతారములో నీ అల్లరి చేష్టలకు యశోదమ్మ నిన్ను రోటికి కట్టివేయుట, త్రిగుణాతీతమైన నీ గుణములు, కోటి మన్మథులకైన సాటి కాని సౌందర్యము గల నీ దివ్యరూపమును తలచినంతనే నా శరీరమంతా పులకించును. నిద్ర, అలసత్వము మొదలైన తమోగుణములు లేని శ్రీరామా! భద్రునికి, ఆంజనేయునికి నీవు సులభుడవు! సంసార దోషములనే ఆర్తులను తీర్చే శక్తి కలిగిన వాడవు! బ్రహ్మ రుద్రాదులచే నుతించబడిన చరితము కలిగిన నిన్ను తలచినంతనే నా శరీరము పులకించును. సమస్త భూమండలమును పాలించి, ఆనందముతో పరమశివునిచే నుతించబడిన శ్రీరామా! నీ పాద ధూళిని తాకినంతనే శాపవిముక్తురాలైన గౌతమముని పత్ని అహల్య చరితము, నీ నాదబ్రహ్మానంద స్వరూపము, వేదముల సారమైన నీ నామమును తలచినంతనే  నా శరీరమంతా ఝల్లని పులకిస్తుంది. 

వివరణ:

పరబ్రహ్మ స్వరూపమైన రాముని గుణములను, సౌందర్యాన్ని, వైభవాన్ని తెలిపే రామాయణాది వాఙ్మయం మనకు నిత్య పూజనీయమైనవి. శ్రీరాముని చరితమును అత్యంత మనోజ్ఞముగా వర్ణించిన వాల్మీకి మహర్షి రచించిన రామాయణం పఠించేటప్పుడు ఈ కృతిలో త్యాగరాజస్వామికి కలిగే భావనలన్నీ మనకు కలుగుతాయి. ఆ భావనలు మనసులో నిలిచిపోవాలంటే నిరంతర పునశ్చరణ, నామస్మరణముతో కూడిన సాధన అవసరం. ఆ స్థాయికి త్యాగరాజస్వామి వారు చేరుకున్నాక రాముని తలచుకున్న వెంటనే భవ్యమైన రామ పరబ్రహ్మ తత్త్వముతో పాటు సగుణ వైభవములు కూడా గోచరమై తనువు పులకించి తన్మయత్వము కలిగింది. ఈ భావనలన్నీ సాధకునికి భవసాగరం దాటడానికి అత్యంత ఉపయుక్తమైన ఆలంబనలు. అనంతమైన పరమాత్మ తత్త్వం ముందు మనము, మన కష్టాలు ఎంత? ఘోరమైన శాపం వల్ల  పాషాణమైన అహల్యకు ముక్తిని కలిగించాడు రాముడు, మనలను కూడా అదే విధంగా అనుగ్రహిస్తాడు అన్న భావనను తప్పక కలిగిస్తుంది. రాముని జీవితంలో ప్రతి అడుగూ మనకు ఆదర్శప్రాయమే, మన దోషాలను తొలగించుకుంటూ ముక్తి పథంలో ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి. ఇది అనుభవైకవేద్యంగా తెలిపారు నాదయోగి త్యాగరాజస్వామి. రామనామ స్మరణ, సంకీర్తనల ద్వారా రాముని హృదయములో నిలుపుకుని తరించారు. 

శ్రవణం:

ముఖారి రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని బాలమురళీకృష్ణగారు శ్రావ్యంగా ఆలపించారు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి