త్యాగరాజ శిష్యపరంపరకు చెందిన ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు, పండితులు, గురువులు, హరికథా భాగవతార్ శ్రీ నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యుల వారు. పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారి శిష్యులైన వీరు ఎందరో గొప్ప కళాకారులకు గురువులు. ఎన్నో పుస్తకాలను రచించారు. 1924లో కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో జన్మించిన వీరు వ్యాకరణ మీమాంస శాస్త్రములను అభ్యసించారు. రామకృష్ణయ్య పంతులు గారి వద్ద గురుకుల పద్ధతిలో కర్ణాటక శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించారు. 1948 నుండి 1983 వరకు ఆకాశవాణి విజయవాడలో నిలయ విద్వాంసునిగా పనిచేశారు. గానకళాప్రపూర్ణ, సంగీత సాహిత్య కళానిధి, హరికథా చూడామణి, సంగీత కళాసాగర బిరుదులను పొందారు. ఆకాశవాణి స్వర్ణోత్సవాల సమయంలో, తెలుగు విశ్వవిద్యాలయం నుండి ప్రత్యేక పురస్కారాలను పొందారు. కృష్ణమాచార్యుల వారు త్యాగరాజస్వామి యక్షగానాలను తెలుగు నుండి సంస్కృతంలోకి అనువదించారు. 20కు పైగా కృతులు, వర్ణాలు, తిల్లానాలు రచించారు. 60 ఏళ్ల సుదీర్ఘమైన సంగీత ప్రస్థానం కలిగిన వీరికి మద్రాస్ మ్యూజిక్ అకాడెమీ వారు వీరికి వాగ్గేయకార అవార్డును ప్రదానం చేశారు. శ్రీభాష్యం అప్పలాచార్యుల వారితో ఎంతో అనుబంధం ఉన్న వీరు 2006లో పరమపదించారు.
కృష్ణమాచార్యుల వారు రామానుజుల వారిని నుతిస్తూ రచించిన ఒక చక్కని కృతిని రచించారు. ఈ కృతిని ఆనందభైరవి రాగంలో స్వరపరచారు. ఈ కృతిని వారి శిష్యుడు ప్రముఖ వయోలిన్ విద్వాంసులు శ్రీ ఎం.ఎస్.ఎన్ మూర్తి గారి సతీమణి, ప్రఖ్యాత విద్వాంసురాలు డాక్టర్ పంతుల రమ గారు ఆలపించారు.
అందము ఆనందము రామానుజార్య సంబంధము దాని
చందము మోక్ష కందము మరి చందనాగురు గంధము
ఘనము పావనము భాష్యకార పద సేవనము జీ-
వనము సదవనము ప్రాక్తన పాప మోచనము
సారము పుణ్య సారము యతి చంద్రుని దివ్యాకారము జగదా-
ధారము తమోదూరము భూత దయాపారావారము
ధ్యేయము భాగధేయము యతి దినకరు నామధేయము కర్ణ-
పేయము నిరపాయము కృష్ణ గేయము సదుపాయము
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి