16, జులై 2010, శుక్రవారం

క్యాన్సర్ - ఎక్కువగా చెప్పుకునే కారణాలు

కాన్సర్ (రాచపుండు) రావటానికి ఫలానాది అని కారణం చెప్పలేకపోతోంది మన వైద్య రంగం. కానీ కొన్ని అయ్యి ఉండచ్చు అని పరిశోధన వ్యాసాల్లో రాస్తున్నారు.
  1. మనం తినే ఆహారంలో జన్యు మార్పిడి
  2. మనం పీల్చే గాలి, తాగే నీరులో రసాయనాలు (కాలుష్యం ద్వారా)
  3. తినే తిండిలో కొవ్వు, చక్కెర
  4. మానసిక ఒత్తిడి, నిద్రలేమి, ఎసిడిటీ/గ్యాస్ 
  5. శరీరంలో కణాలకు ఆక్సిజన్ సరైనంత అందకపోవటం - వ్యాయామం లేక 
 వీటిలో 1 ,3 ,4 ,5  చాలా మటుకు మనం నియంత్రించి, అధిగమించవచ్చు. ఆలోచించండి.
  1. సహజంగా ఉండే ఆహారం కాకుండా ప్రాసెస్ చేయబడిన ఆహరం, నిల్వ ఉంచటానికి ఆహారంలో కలిపే పదార్థాల వల్ల, తీయటం వల్ల ఆహారంలో ఉండే కణాలు తమ సహజ లక్షణం కోల్పోయి విపరీతమైన పరిణామాలు చూపిస్తున్నాయి. ఒకటే గుర్తు పెట్టుకోండి - బాగా రుచి ఉంది అంటే ఆహారం అది చాలా మార్పులకు లోని తన సహజత్వాన్ని కోల్పోయినట్టే - పిజ్జా, బర్గర్, చీజ్, బట్టర్, నూడిల్స్, కుర్కురే, ఇలా చాలా ఈ కోవకు చెందుతాయి.
  2. ఆంధ్రులకు పొట్టు తీసి సన్నగా నున్నగా ఉండే బియ్యమంటే మక్కువ. ఇలాంటి బియ్యము, పిండి తినటం వల్ల మన రక్తంలో చక్కెర ప్రమాణం పెరిగి పోతోంది. కాన్సర్ కి ప్రథమ మిత్రుడు చక్కెర. చక్కేరకి పరమ మిత్రుడు ఉప్పు. కాబట్టి మీరు తినే తిండిలో ఉప్పు, చక్కెర తగ్గించండి. అలాగే, పొట్టు ఉన్న ధాన్యం, పప్పులు తినండి - ఇవి సగం రుగ్మతలను నియంత్రిస్తాయి.
  3. మనకు చిరు తిళ్లు, పచ్చళ్లు, స్వీట్లు, వేపుళ్ళు బాగా అలవాటు అయ్యాయి గత 25 ఏళ్లలో. వాటిలో ఉన్న కొవ్వు, చక్కెర మన ఒంట్లో పేరుకొని శరీర బాధలకు కారణాలయ్యాయి. కణాల ఉత్పత్తి, పరిణామం మనకు తెలియని, శరీరానికి పనికిరాని దారిలో వెళుతున్నాయి వీటివల్ల. ముఖ్యంగా ఎక్కువ వేడి, ఎక్కువ పీడనం, ఎక్కువ చల్లదనంతో కూడిన ఆహారాల్లో తెలియని మార్పు మన మూల కణాల మీద అణు విస్ఫోటనం లా పనిచేస్తున్నాయి. పాలు, పండ్లు, మొలకలు, పొట్టు ఉన్న ఆహరం, కూరగాయలు బాగా తినండి.
  4. డబ్బు వెంట పడి పరిగెత్తి, మన స్వధర్మాన్ని, మతాన్ని వదిలి పరధర్మాల వెంట పడి మన మానసిక సంతులన కోల్పోయి, ఒత్తిడి గురవుతున్నాము. అలాగే వృత్తి పరంగా వ్యాయామం లేక, ఒత్తిడికి లోనై ఊబకాయులమై, మానసికంగా దెబ్బతిని - దాని ప్రభావం మన శరీర భాగాల మీద పడుతోంది. మీ శరీరం కోసం రోజుకు ఒక అరగంట కేటాయిస్తే ఊహించలేని మంచి మార్పులు మీ దేహం, మనస్సు, ఆలోచనల్లో కనిపిస్తాయి. 
  5. అలాగే ఈ ప్రపంచాన్ని నడిపించేది మానవుడు కాదు, మనకు అతీతంగా ఒక మహోన్నతమైన శక్తి  ఉందని నమ్మి,  దానికి దాసోహం అని జీవితంలో విర్రవీగకుండా, వేలం వెర్రిలా పరిగెత్తకుండా ఒక నిబద్ధమైన ధార్మిక జీవనం అలవర్చుకోండి. 

ఇది నా స్వానుభవమున చెప్తున్న మాట.ఇవన్ని మార్చుకుని, అధిగమించిన తర్వాత - పీల్చే గాలి, తాగే నీరులో ఎంత కాలుష్యం ఉందో, వాటి వల్ల ఏ జబ్బులు వస్తాయో/వచ్చాయో ఆలోచించండి.  వాటిని కూడా కొంత వరకు నియంత్రించి అధిగమించవచ్చు.
శరీరంలో వ్యాధినిరోధక శక్తి తగ్గింది అంటే కాన్సర్ కణాలకు ప్రాణం పోసినట్లే. ఒక్కసారి మన శరీరంలో కాన్సర్ బయట పడిందంటే చాలా దృఢ నిశ్చయముంటే తప్ప ఆ జబ్బును శాశ్వతంగా దాటలేము. ఒక రకంగా వన్ వే టికెట్ లాంటిది ఈ జబ్బు. ఇది పూర్తిగా కణాలకు సంబంధించిన జబ్బు కాబట్టి కణాలు ఆరోగ్యంగా ఉండే సాధనాలను వెతికి, పాటించి ఈ రాచ పుండును దగ్గరకు రానివ్వకండి. నా జీవితంలో 40 ఏళ్ళు ఈ విషయం తెలుసుకోకుండా అజ్ఞానంలో బతికాను. ఇప్పుడు అమ్మ ఈ వ్యాధితో పడే బాధను చూస్తూ పాఠాలు కఠిన మార్గంలో నేర్చుకుంటున్నాను.

యోగక్షేమం వహామ్యహం.

అసమాన మహిళ - పాలువాయి భానుమతి


ఆమె నవరస నటన ఉత్తుంగ తరంగమై పొంగే సహజ గంగ ప్రవాహం. ఆమె గానం భక్తి, శాస్త్రాల మేళవంతో సాగే సప్త  స్వర ఝరీ  జలపాతం. ఆమె భాష అలకనందా జలంలా నిర్మలం, చిదానందం. ఆమె నృత్యం చూపరులకు ఆహ్లాదం. ఆమె రూపం మూర్తీభవించిన ఆరణాల తెలుగుదనం. ఆమె సాహిత్యం అచ్చ తెలుగు సీమ మిరపకాయ. ఆమె జీవన శైలి, ధోరణి స్వాభిమానంతో నిండుకున్న సింహలక్షణం. ఆమె మనసు 'పైన కఠినమనిపించును లోన వెన్న కనిపించును' చందం. ఆమె విమర్శ వజ్రాయుధమంత పదునైనది. వెరసి ముచ్చటగా ఈ లక్షణాలు ఉన్న వనితా రత్నం మన పాలువాయి భానుమతి రామకృష్ణ గారు.

ఒంగోలు జిల్లాలో బొమ్మరాజు వారింట పుట్టి తెలుగు చలన చిత్ర జగత్తులో రామారావు, నాగేశ్వరరావుల కన్నా ఉన్నత స్థానాన్ని అధిరోహించి తన సహజ నటనా ప్రావీణ్యంతో ఆరేడు దశాబ్దాలు ఏలిన మకుటమున్న మహారాణి భానుమతి.  తనకన్నా వయసులో చాలా పెద్ద అయిన రామకృష్ణగారిని వివాహమాడి, భరణి సంస్థను స్థాపించి, ఆ పతాకం మీద అద్భుతమైన కళాఖండాలను మనకు అందించారు. 'నేను మిస్సమ్మలో మేరీ పాత్రను వదులుకోకపోతే దక్షిణాది  చలన చిత్ర సామ్రాజ్యానికి సావిత్రి లాంటి మహానటి వచ్చేది కాదేమో' అని అనటంలో ఆమె ధైర్యానికి, ఆత్మవిశ్వాసానికి నిదర్శనం. సావిత్రి, జమున, అంజలి కన్నా ముందే దక్షిణాదిన అగ్రతారగా గుర్తింపబడింది భానుమతి.

ఎటువంటి పాత్ర అయిన సరే - వెండి తెర ఆమె ఉంటే అదిరి పోవాల్సిందే.  సాంఘిక, జానపద, పౌరాణిక, చారిత్రాత్మక చిత్రాలలో నాయిక, ప్రతినాయిక, క్యారెక్టర్ పాత్రలకు ఆమె జీవం పోసి వన్నె తెచ్చారు. ఆమె తన పాత్రలకు తానే నేపథ్యగానం. కొన్ని చిత్రాలకు సంగీత దర్శకత్వం కూడా చేశారు. మల్లీశ్వరి వంటి చిత్రం ఇంకా రాలేదు, రాబోదు అంటే అతిశయోక్తి కాదు. శాస్త్రీయ సంగీతంపై తనకున్న మక్కువను ప్రతిచిత్రంలో ఏదో ఒక కీర్తన రూపంలో చూపించారు. నగుమోము గనలేని, సావిరహే తవ దీనా రాధా, పక్కల నిలబడీ, తెర తీయగా రాదా ఇలా ఎన్నో...



ఇక పాత్రలకొస్తే,

మల్లీశ్వరిలో రామారావుగారికి సమానంగా తెరను డామినేటు చేశారు.'మనసున మల్లెల మాలలూగెనే', 'పిలచిన బిగువటరా' లాంటి పాటలు ఇంకెవ్వరు పాడలేరు.  'పరుగులు తీయాలి' అనే పాటలో ఘంటసాలతో పోటీపడి అద్భుతమైన యుగళగీతం పాడారు. 'బాటసారి'లో ఆమె నటన అనుపమానం. శరత్ నవల ఆధారంగా తీయబడిన ఈ చిత్రంలో ఆమె ప్రేమ, కట్టుబాటు మధ్య నలిగిపోయే పాత్రలో మనకు కళ్ళలో నీళ్ళు తెప్పిస్తారు. 'ఓ బాటసారి నను మరువకోయీ' అనే పాట ఈ చిత్రాన్ని తెలుగు చిత్రాల్లో ఒక ఆణిముత్యంలా నిలిపింది.  విప్రనారాయణలో శృంగారమొలికించే నాయిక పాత్రలో నాగేశ్వరరావు గారికి పోటీ ఇచ్చి ఆ చిత్రానికి ఘన విజయం సంపాదించారు. ఆ చిత్రంలో సావిరహే తవ దీనా రాధ' అనే జయదేవుని అష్టపదిని సున్నితంగా, లలితంగా పాడి ఇప్పటికీ ఆ పాట గాయకుల నోట వినిపించేలా చేశారు ఆమె.

ఇక పౌరాణిక/చారిత్రిక పాత్రలకొస్తే, తెనాలి రామకృష్ణలో వేగు పాత్ర, పల్నాటి యుద్ధంలో నాయకురాలు నాగమ్మగా ఆమె ప్రతినాయిక పాత్ర అంటే ఇలా ఉండాలి అన్నంత కసిగా నటించారు. నాగమ్మ అంటే భానుమతే. ఆ చిత్రంలో బ్రహ్మన్న పాత్రలో ఎన్టీ రామారావు గారికి దీటుగా నటించి శహభాష్ అనిపించుకున్నారు. అలానే బొబ్బిలి యుద్ధం చిత్రం కూడా. మల్లమ్మ పాత్రలో 'శ్రీకర కరుణాల వాల' అనే పాట చాలా హిట్.  అంతస్తులు చిత్రంలో గొప్పింట పుట్టి పేదరికంలో పెరిగి రాటు దేలిన మహిళగా ఆమె నటన అద్భుతం. ఆ పాత్రలో 'దులపర బుల్లోడో దుమ్ము దులపర బుల్లోడో' అనే పాట ఆదరణ పొందింది. ఇలా చెప్పుకుంటూ పొతే ప్రతి పాత్ర ఒక మాణిక్యమే. - చండీ రాణి, సారంగధర, చింతామణి, వివాహబంధం, మట్టిలో మాణిక్యం - లాంటి పాత్రకు ప్రాధాన్యమున్న పాత్రలు ఎన్నో.  80 - 90 దశకాల్లో తల్లి, నాయనమ్మ, అమ్మమ్మ పాత్రల్లో ఉత్సాహంగా ఉరకలు వేసి మనల్ని ఉబ్బి తబ్బిబ్బు చేశారు. మంగమ్మ గారి మనవడు చిత్రంలో మంగమ్మ పాత్ర మరిచిపోలేనిది. 'శ్రీ సూర్య నారాయణా మేలుకో' అనే పాట వీనుల విందు. అలాగే బామ్మ మాట బంగారు బాట, పెద్దరికం, సామ్రాట్ అశోక లాంటి చిత్రాలెన్నో తన శైలిలో నటించి సుదీర్ఘమైన చలన చిత్ర వృత్తిని సార్థకం చేసుకున్నారు.

అంతే కాదు, భరణి పతాకంపై వచ్చిన కొన్ని చిత్రాలకు దర్సకత్వం కూడా వహించారు.  చెన్నైలో సంగీత కళాశాల ప్రధాన అధ్యాపకురాలుగా సమర్థవంతంగా నిర్వహించారు.సాంఘిక సేవ కార్యక్రమాలలో పాల్గొని తన వంతు సేవ చేశారు.
చిత్రాల్లో నటిస్తూనే ఆమె సాహిత్యాభిరుచిని కూడా తీర్చుకున్నారు. ఆమె భాష, రచనా శైలి ఆమె ఆలోచనా పద్ధతిని పూర్తిగా ప్రతిబింబిస్తుంది. స్వచ్చమైన భాష, చదువరులను కట్టి పడేసే హాస్యంతో అత్తగారి కథలు రాసారు ఆమె. నాలో నేను అనే ఆత్మకథలో ఆమె తన జీవితాన్ని మనకు వివరించారు సహజమైన శైలిలో. ఆమె రచనలకు సాహిత్య అకాడెమి పురస్కారం కూడా లభించింది.

భారత ప్రభుత్వంచే పద్మ భూషణ్, మూడు సారులు జాతీయ స్థాయిలో ఉత్తమ నటి అవార్డు, ఆంధ్ర, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వారిచే గౌరవ డాక్టరేట్, ఎన్టీఆర్, రఘుపతి వెంకయ్య, కలైమామణి అవార్డు - ఇలా ఎన్నో. నటి, గాయని, రచయిత, దర్శకురాలు, నిర్మాత, అధ్యాపకురాలు - ఇలా వివిధ పాత్రలలో తన సత్తా చాటి, తనకంటూ ఒక ప్రత్యెక స్థానాన్ని ఏర్పరుచుకున్న బహుముఖ ప్రజ్ఞాశీలి డాక్టర్ భానుమతి.  ఆవిడ తెలుగుజాతిలో మరోమారు కళాకారిణిగా జన్మించాలని నా కోరిక. ఆవిడ పాడిన పాటల్లో నాకిష్టమైనది చక్రపాణి చిత్రం నుండి మెల్లమెల్లగా అనే ఈ గీతం. చూడండి.

15, జులై 2010, గురువారం

పాపికొండల యాత్ర

నదులకు కవిత్వానికి ఏదో అవినాభావ సంబంధం. వేటూరి వారు 'కృష్ణా తరంగాల సారంగరాగాలు' అంటూ మూడు దశాబ్దాల కింద శంకరభారణంలో,  'ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి' అంటూ ఇటీవల గోదావరిలో, రెండు దశాబ్దాల ముందు ఆరుద్ర గారు 'వేదంలా ఘోషించే గోదావరి అమర ధామంలా శోభిల్లే రాజమహేంద్రి'  అంటూ ఆంధ్రకేసరి చిత్రంలో మనకు అందుబాటులో ఉండేటట్లు చక్కని గీతాల్ని అందించారు. సాహిత్యము, చారిత్రిక కట్టడాలు, పుణ్యక్షేత్రాలు వాటి పోషకులు నదీ పరీవాహక ప్రాంతాల్లో అభివృద్ధి చెందాయి అనటానికి ఎన్నో తార్కాణాలు. విజయనగర సామ్రాజ్యము, చోళులు, పాండ్యులు, మహా వాగ్గేయకారులు, రెడ్డి రాజులు, వెంగీరాజులు, అమరావతి కథలు - ఇలా చెప్పుకుంటూ పోతే అనంతమైన చిట్టా నదీనదాలను అల్లుకుని. మరి ఇంత అద్భుతమైన చరిత్ర గలిగిన నదులు మనరాష్ట్రం గుండా ప్రవహిస్తూ ఉంటే వాటికి సంబంధించిన కథలు, గాథలు ఎన్నో.

ఇక రంగంలోకి దూకుదామా?. నాలుగేళ్ల క్రితం వానలు మొదలయ్యిన ఒక నెలకు మా టీం లో ఉన్న ఔత్సాహికులు పోలవరం ప్రాజెక్ట్ వస్తే పాపికొండలు మునిగి పోతాయి అని,  పాపికొండలు చూద్దాం ప్రసాద్ గారు అంటే, వెంటనే నాలుగు కుటుంబాలతో ఒక ప్రణాళిక వేసాము. గోదావరి ఎక్ష్ప్రెస్స్ రైలెక్కి రాజమండ్రిలో అర్థరాత్రి దిగాము. అక్కడ అక్షయ హోటల్లో ఏసీ రూమ్స్ ముందే బుక్ చేసుకుని దిగాము. కాసేపు పడుకొని ఉదయం ఫలహారం చేసి పాపికొండల యాత్ర కోసం టికెట్ బుక్ చేసాము.  పాపికొండల యాత్రకు వెళ్లే మోటర్ పడవలు పట్టిసీమ నుంచి బయలుదేరుతాయి. బోటులో ఆట, పాట, ఆహారం, పానీయాలు, అల్పాహారాలు అన్ని ఆంధ్ర ప్రదేశ్ టూరిజం వాళ్ళదే. చిరుతిళ్ళు కొనుక్కోవటానికి వసతి కూడా ఏర్పాటు చేసారు.

దాదాపు 50 మంది పట్టే మోటర్ బోటులో  బయల్దేరాము. పట్టిసీమలో వీరేశ్వరుడి దేవస్థానం చాలా పురాతనమైనది. నది మధ్యలో ఉన్నట్టుగా ఉంటుంది. ఈ ఒడ్డు నుంచి ఈ దేవస్థానంకి వెళ్ళాలంటే పడవనుంచి ఒక కిలోమీటర్ దూరం ఇసుకలో నడవాలి. నీళ్ళు బాగా ఉంటే దూరం తగ్గొచ్చు. తప్పకుండా చూడాల్సిన దేవస్థానం కాబట్టి బద్ధకంగా పడవలో కూర్చోకుండా దిగి నడిస్తే మీకు అర్థం అవుతుంది ఆ అనుభూతి ఎంత బావుంటుందో. స్వాతిముత్యం చిత్రంలో సువ్వి సువ్వి పాట ఇక్కడ చిత్రీకరించిందే.

బోటు ప్రయాణంలో మొదటి ఆసక్తి కరమైన అంశం పోలవరం ప్రాజెక్ట్ మొదలు, చివరలు. అది దాటినా తర్వాత నది మధ్యలో ఒక చిన్న గుడి కనిపిస్తుంది. వరదలు వచ్చినప్పుడు ఈ గుడి మునుగుతుందని బోటు డ్రైవర్ చెప్పాడు. తర్వాత దేవీపట్నం మలుపు చాలా బాగుంటుంది. అక్కడ నది పూర్తిగా ౯౦ డిగ్రీలు మలుపు తిరుగుతుంది. ఈ మలుపు దగ్గర నదిలో సుడిగుండం ఉంది. అందుకని బోటు ఒడ్డుకు దగ్గరగా, వీలైనంత మెల్లగా వెళ్తుంది. ఇక్కడ నది ఒడ్డునే ఉన్న పోచమ్మ చాలా మహిమగలదని నానుడి.  ఈ మలుపు తర్వాత ఇక అసలు పాపికొండల యాత్రకు నాంది.

ఇరుపక్కల ఇసుక తిన్నెలు, పచ్చని చెట్లతో నిండిన పర్వతాలు, అక్కడక్కడ కనిపించే ఆదివాసీలు. పూర్తిగా నిశ్శబ్దంగా సిటీ రణగొణ ధ్వనికి దూరంగా ప్రకృతిమాత ఒడిలో ఉండే వారిజీవితం ఎంత నిరాడంబరమో. నదిలో చేపలు పడుతూ, చిన్న చిన్న పడవలలో అటు ఇటు వస్తువులు చేర వేసుకుంటూ, పాటలు పాడుకుంటూ  చీకు చింత లేకుండా ఉన్నారా వారు అనిపించింది. శంకరాభరణం చిత్రంలో సా రి గ రీ గ ప దా పా స రి గ ప దా ప గ రీ రి గ ప ద సా నీ దా పా గ ప ద ప ద ప...అనే సన్నివేశం/పాటలో శంకర శాస్త్రి నదిలో పాడుతూ, పిల్ల చేత పాడిస్తూ, తర్వాత తులసి పాత్రలో మంజు భార్గవి ఇసుక మీద నాట్యం చేసే సన్నివేశం చిత్రీకరించిన ప్రాంతం, మేఘ సందేశం చిత్రంలో  'ప్రియే చారుశీలే' లాంటి పాటలు చిత్రీకరించిన ప్రాంతం ఈ ప్రయాణం మొదటి భాగంలో కనిపిస్తాయి. మనస్సు, కళ్ళు అలా సమ్మోహితమై చూస్తూనే ఉంటాయి ఈ యాత్రలో ప్రకృతి అందాలను.

పచ్చదనం, ఇంకా మానవుడి ఆక్రమణ, అరాచకానికి గురి కానీ ప్రాంతాలు, అడవులు నదికి రెండు వైపులా. అక్కడక్క ఎప్పుడో ఋషులో/యోగులో మునులో ఇక్కడ తపస్సు చేసారా అనే ఆనవాళ్ళు కనిపిస్తాయి. 4 గంటల పాటు సాగే యాత్రలో ముందుకు వెళ్తున్న కొద్దీ నది ప్రవాహం పెరుగుతుంది. వెడల్పు తగ్గి గోదావరి ఉగ్ర రూపము కదల లేక కదుల్తున్న పడవ అనిపిస్తే ఇక పాపికొండలు దగ్గర పడ్డట్టే. ఇక్కడ కొండల ఎత్తు ఎక్కువ, లోయ వెడల్పు తక్కువ కాబట్టి నది వేగంగా ప్రవహిస్తుంది.

బోట్లో కూర్చొని గల గల లాడే గోదావరిని తాకటానికి నేను నా భార్య విశ్వప్రయత్నం చేసాము. అక్కడక్కడ సఫలం అయ్యాము. స్వచమైన గోదావరి నీళ్ళు అలా శరీరాన్ని తాకుతుంటే ఆ అనుభవం వర్ణించలేనిది. ఈ ప్రయాణమంతా మమ్మల్ని మేము మర్చిపోయి, మంత్రముగ్ధులయ్యాము. అక్కడక్కడ నదిలో కలిసే ఉపనదులు, ఏరులు, వాగులు, కాలువలు మహాద్భుతంగా ఉంటాయి. మధ్యలో వాన మొదలయ్యింది. చినుకులు, సూర్య కిరణాలు, ఇంద్ర ధనుస్సు, వేడి, చల్ల గాలి,  పులకించి నాట్యమాడే ప్రకృతి, మా మనసులు ఉప్పొంగి పొయ్యాయి.

పాపికొండల దగ్గరకు వచ్చేసరికి మధ్యాహ్నం ఒంటి గంట అయ్యింది. ఆ ప్రాంతంలో భోజనం పెట్టాడు టూర్ గైడ్. మంచి కారం కారంగా శాఖాహార భోజనం వేడి వేడిగా. భోజనం అయ్యేసరికి చివరి మజిలీ పేరంటాళ్ళ పల్లె వచ్చేసింది. ఇక్కడినుంచి భద్రాచలం ఇంకొక 7 - 8  గంటల ప్రయాణం. అక్కడ బోటు ఆపి ఒక కొండ మీద ఆశ్రమం, గుడి చూడమన్నారు. ఆ ఆశ్రమంలో రామకృష్ణ పరమహంస తపస్సు చేసారుట. అక్కడ ప్రకృతి ప్రశాంతత, సౌందర్యం చూస్తే అర్థం అవుతుంది రామకృష్ణులు ఎందుకు ఎంచుకున్నారో ఆ ప్రదేశాన్ని. అక్కడ గిరిజనులు తయారు చేసిన వెదురు వస్తువులు అద్భుతమైన నైపుణ్యంతో చేసిన కళాఖండాలు చాలా తక్కువ ధరకు అమ్ముతారు. ఆ ఆశ్రమము, గుళ్ళు చూసుకొని తిరుగు ప్రయాణం రాజమహేన్ద్రవరానికి మొదలు మధ్యాహ్నం మూడింటికి. మళ్ళా ప్రకృతి సౌందర్యం ఆస్వాదిస్తూ, చూసినవి గుర్తు చేసుకుంటూ పట్టిసీమ రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో చేరాము. నా జీవితంలో మర్చిపోలేని యాత్ర, అనుభూతి ఈ పాపికొండల షికారు యాత్ర.

నెంబర్ ౨ సైనా నెహ్వాల్

రాజీవ్ ఖేల్ రత్న, ద్రోణాచార్య, పద్మశ్రీ - మూడు అవార్డులనూ పొందిన ఏకైక భారతీయ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్.  ఈ మూడు భారతదేశంలో అత్యంత ప్రతిష్ఠాకరమైన పురస్కారాలు.  2001 లో అల్ ఇంగ్లాండ్ బాడ్మింటన్ చాంపియన్షిప్ గెలుచుకున్న గోపీచంద్ తర్వాత హైదరాబాద్లో గోపీచంద్ అకాడెమీని స్థాపించి అంతర్జాతీయ టోర్నీలలో పోటి చేసి గెలవగల సత్తా ఉన్న క్రీడాకారుల్ని అందజేస్తున్నాడు ఈ దేశానికి. ఆ యువ ద్రోణాచార్యుడి చేతిలో తర్ఫీదు పొందిన షటిల్ బాడ్మింటన్ వనితా కిశోరం సైనా నెహ్వాల్.

బాడ్మింటన్లో ఇవ్వాళ్ల ప్రపంచంలో రెండో ర్యాంకు ఈ హైదరాబాది అమ్మాయిది. ఇదేమి సులభం కాదు. గురువు, శిష్యురాలి కఠిన, కఠోర శ్రమ ఫలితం మన సైనా ఈ అగ్ర స్థానంలో ఉండటానికి కారణం. క్రికెట్ తప్ప వేరే ఏ క్రీడను ఆదరించని, అభిమానించని ఈ భారత దేశంలో మనందరికీ గర్వ కారణమైన సైనాకు మంచి భవిష్యత్తు ఉంది. సానియాలా కాకుండా ఈ అమ్మాయి తన ఆట మీద, శరీర దారుఢ్యం మీద దృష్టి పెట్టి, మీడియా దృష్టికి చెదరకుండా ఆటను నిలుపుకొని ముందుకు వెళ్తోంది. గోపీచంద్ గారికి, సైనాకు మా శుభాకాంక్షలు. ఆట బాగుంటే నెంబర్ 1 చేరుకోవటం కష్టమేమి కాదు. కానీ చేరిన స్థానాన్ని నిలుపుకొని, సామర్థ్యాన్ని పెంచుకొని సుదీర్ఘమైన కెరీర్ నిర్మించటం అతి కష్టమైనది. సైనా ఈ దిశలో ఆలోచించి ముందడుగు  వేయాలని ఆశిస్తూ, ఒక్క సచిన్ టెండూల్కర్ కే కాదు సైనా లాంటి మంచి ఆటగాళ్లకు కూడా సరైన గుర్తింపు, గౌరవము, ప్రతిఫలము ప్రభుత్వం ఇవ్వాలని నా విన్నపం.

సైనా కెరీర్లో కొన్ని మైలు రాళ్ళు:
  1. ఒలంపిక్స్ లో క్వార్టర్ ఫైనల్స్ చేరిన మొట్ట మొదటి భారతీయ బాడ్మింటన్ క్రీడాకారిణి. (2008)
  2. ప్రపంచ జూనియర్ బాడ్మింటన్ టైటిల్ గెలిచిన మొట్ట మొదటి భారతీయ బాడ్మింటన్ క్రీడాకారిణి.  (2008)
  3. మూడు వరుస సూపర్ సిరీస్ టైటిల్స్ గెలిచిన మొట్ట మొదటి భారతీయ బాడ్మింటన్ క్రీడాకారిణి.  (2009 -2010 )

అత్రి మహర్షి, అనసూయ మాత - దత్తాత్రేయ జననం



| గురుర్బ్రహ్మా  గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మా తస్మైః శ్రీ గురవే నమః||

పతివ్రతల్లో అగ్రగణ్యురాలు అత్రి మహర్షి పత్ని అనసూయ మాత. అత్రి అంటే త్రిగుణాలను జయించిన వాడు అని (సత్వరజస్తమో గుణములు), అనసూయ అంటే అసూయ లేనిది అని అర్థం. అత్రి సప్తర్షులలో ఒకడు, బ్రహ్మ పుత్రుడు. కర్దమ ప్రజాపతి, దేవహూతిలకు పుట్టిన పుత్రిక అనసూయ. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు శ్రీ గురుచరిత్ర ప్రవచనంలో ఈ అనసూయ మాత గొప్పతనం గురించి అద్భుతంగా చెప్పారు.ఆయన ప్రవచనంనుంచి ఈ ఆదర్శ దంపతులు, దత్తాత్రేయ జననం గురించి వివరం. 

రామాయణంలో అత్రి, అనసూయల ప్రస్తావన వస్తుంది. ఆవిడ పండు ముసలి ఆ యుగంలో. సీతారాములు అత్రి మహర్షి ఆశ్రమానికి వచ్చినప్పుడు అత్రి మహర్షి ఈవిడ ఒక్క మానవుల చేతనే కాదు సమస్త లోకములకు వంద్యురాలు అని పరిచయం చేస్తాడు సీతమ్మకు. ఆవిడ ఎంత గొప్పదో దీన్ని బట్టి తెలుస్తుంది. అనసూయలాగా అసూయ లేకుండా ఉండాలంటే 1 .  నీకన్న పైనున్న వారి గుణములను గుర్తించి, అంగీకరించి నలుగురి ముంది స్తుతించటం, వారిలా నేను అయితే బాఉండు అని అనుకోవటం 2 .  మీకన్నా కింద ఉన్నవారిని అయ్యో వీరి దుర్గుణములు పోగొట్టుకొని ఉన్నత స్థానాన్ని ఎప్పుడు పొందుతారో అని అనుకోవటం. అనసూయ సమస్త జగమును ప్రేమించటం తప్ప ఎన్నడు దూషణ, అసూయ లేకుండా చూసింది. అలా త్రిగుణాలకు అతీతుడైన అత్రి, ప్రేమ తత్వ రూపమైన అనసూయల దాంపత్యం అనుపమానం, అపూర్వం.

ఆ అనసూయమ్మ మహా పతివ్రత అయ్యింది. మహా పతివ్రత ఎలా అయ్యింది?. దోషం లేని భర్తను అనుసరించి. ఆ తల్లికున్న గొప్పతనం ఏంటంటే - వివాహమయ్యిన క్షణం నుంచి భర్తను అనుగమించటం, భర్త మాటను ధర్మంగా పాటించటం. అలా ఉంది నా భార్య అని అత్రి సీతమ్మకు చెప్తాడు. ఒడిలి, ఒంగి, పండు అరిటాకులా ఉన్న అనసూయమ్మ సీతను ఆశీర్వదించి - నీవు భాగ్యవంతురాలివి తల్లి - అంటుంది.  సీతమ్మ వెంటనే చిరునవ్వుతో 'అవునమ్మ నాకన్నా భాగ్యవంతురాలు లేదు' అంటుంది. 'భోగ భాగ్యాలు, సుఖాలు, కన్నవారిని వదిలి భర్త, భర్త మాటయే పరమావధిగా తలచి కానలకు వచ్చావు తల్లి' అని శ్లాఘిస్తుంది అనసూయ సీతమ్మను. సీత రాములకు  అత్రి, అనసూయల దర్శనంతో అయోధ్య కాండను ముగిస్తాడు వాల్మీకి.

'అనసూయ పాతివ్రత్యం ఎలాంటిది అంటే - మహా క్షామం పదేళ్ళపాటు వచ్చింది ప్రపంచంలో. అప్పుడు అనసూయమ్మ నన్ను అనుగమించిన పాతివ్రత్యంతో గంగానదిని ప్రవహింపచేసింది. చెట్టు, పుట్ట, చేమ, ప్రాణి కోటిని రక్షించింది' - అని సీతమ్మకు చెప్తాడు అత్రి.  'భర్తను అనుగమించి వచ్చావు సీతమ్మ' అని ఎంతో ఆనంద పడుతుంది అనసూయమ్మ. అప్పుడు సీతమ్మ 'అమ్మా! నా వివాహ సమయంలో ఈ విషయాన్నే నా తల్లి నాకు చెప్పింది. భర్త మాటయే ఆచారము. ఎప్పుడు నన్నే మనమున ఉంచి, సదాచార సంపన్నుడై, ధర్మ రక్షకుడైన భర్త ఈ రామయ్య. ఆయనను నేను అనుగమించటంలో గొప్పతనం ఏముందమ్మ' అని  అంటుంది సీతమ్మ.  అనసూయ సీతతో ఇలా అంటుంది - 'సభర్త్రుకస్య సహధర్మచారిణి -  ఎప్పుడు భర్తను అనుసరించి ఆయన చెప్పినట్టు చేయడమే నీకు గొప్ప ధర్మము. అలా ఉండటం వల్ల కీర్తి, ధర్మము సంపూర్ణమవుతాయి'. అలా రామాయణంలో స్త్రీ ధర్మాన్ని బోధించిన మహా పతివ్రత అనసూయ. భర్త అనుమతితో పదివేల సంవత్సరాలు తపస్సు చేసిన మహాతల్లి. భర్తచే పొగడబడి, భర్త అనురాగము చూరగొన్న స్త్రీ ఈ మహా పతివ్రత అనసూయ.

ఆ అనసూయను త్రిమూర్తులు శ్లాఘించి 'అమ్మా! నువ్వు లోకానికి ఇంత మేలు చేసావు. నీకు మేము ఏమి ఇవ్వగలం?' అని అడుగుతారు. అప్పుడు ఆ తల్లి 'అమ్మా అని పిలిచారు కదా, అలాగే నా కడుపునా బిడ్డగా పుట్టండి' అని అడుగుతుంది. 'అంతకన్నా మా భాగ్యమేంటి తల్లి' అని ఆ బ్రహ్మ విష్ణు పరమేశ్వరులు ఆశీర్వదిస్తారు అనసూయను. అత్రి మహర్షి కూడా తపస్సు చేస్తే బ్రహ్మ సంతోషించి 'త్రిమూర్త్యాత్మకం గా మీకు పుత్రుడు జన్మిస్తాడు' అని వరమిస్తాడు.

ఒకసారి ముగ్గురు అమ్మలకు (గౌరీ, సరస్వతి, లక్ష్మి) ఈవిడ పాతివ్రత్యాన్ని పరీక్షించాలని అనిపించింది. వెంటనే తమ పతులకు ఆ పరీక్ష పెట్టాలని చెప్తారు. వెంటనే ముగ్గురు మూర్తులు అత్రి మహర్షి ఇంటికి వచ్చి వారి ఆతిథ్యం కోరారు. 'స్నానాచామనాలు చేసి భోజనం చెయ్యండి' అని కోరుతాడు అత్రి. అప్పుడు త్రిమూర్తులు అత్రితో 'మా నియమం భోజనం చేసేటప్పుడు యజమానురాలు నగ్నయై వడ్డించాలి' అంటారు. ఆశ్చర్యపడి అత్రి ఆ విషయాన్ని అనసూయకు చెపుతాడు. అప్పుడు ఆ పతివ్రత భర్తతో 'స్వామీ అలాగే. మీ మర్యాద పోనివ్వను' అంటుంది. అప్పుడు ఆమె ఆలోచించి, భర్త పాదాలకు నమస్కరించి - 'మనసా వాచా కర్మణా అత్రి మహర్షి ఆజ్ఞను  దాటని దాననైతే వీరు ముగ్గురు శిశువులు అవుదురు గాకా' అని మంత్రాక్షతలు చల్లుతుంది. వెంటనే త్రిమూర్తులు పసిపిల్లలుగా మారుతారు. వెంటనే నగ్నయై వడ్డిస్తుంది వారికి. వారి భుజించిన తర్వాత మళ్ళీ సవస్త్రయై వచ్చి 'నేను అత్రి మహర్షి మాటను శిరసావహించిన దాననయితే మీరు పూర్వ స్థితిని పొందుదురు గాక' అని మంత్రాక్షతలు చల్లుతుంది. వారు పూర్వ స్థితిని పొందుతారు.  అప్పుడు ఆవిడకు ఆలోచన వస్తుంది - వీరిని కడుపున పుట్టకుండానే నా బిడ్డలగా చేస్తాను అని మళ్ళీ భర్తను స్మరించి పసిపిల్లల్లా మార్చి ఊయలలో ఊపింది అనసూయమ్మ. ఇక ఆ అనసూయమ్మ అనుమతిస్తే తప్ప త్రిమూర్తులు తమ తమ విధులు నిర్వర్తించలేరు. ఈ విషయాన్ని చూసిన ముగ్గురు అమ్మలు  సిగ్గుపడి అనసూయ వద్దకు వచ్చి 'మా భర్తలకు పూర్వ రూపాన్ని ప్రసాదించు తల్లి' అని ప్రార్థిస్తారు. ఆ అనసూయ వెంటనే త్రిమూర్తులకు పూర్వ రూపాన్ని కలిగిస్తుంది. అప్పుడు ఆ బ్రహ్మవిష్ణుమహేశ్వరులు 'అమ్మా అనసూయ మాతా! నీ కడుపున పుట్టి నీ పాలు తాగి బిడ్డలుగా పెరగాలని ఉందమ్మా!' అని అడుగుతారు. 'తప్పకుండ మీరు మాకు బిడ్డలుగా వచ్చెదరు గాక' అని సంకల్పం చేస్తుంది ఆ తల్లి.  అదే సమయానికి దేవతలు పరిగెత్తుకుంటూ వచ్చి అత్రి మహర్షి కాళ్ళ మీద పడి -  'మహర్షీ! సూర్య చంద్రులను రాహువు తన అస్త్రముల చేత గ్రహిస్తున్నాడు. మీరే రక్షించాలి. సూర్యున్ని మిగల్చండి ఈ లోకానికి' అని ప్రార్థిస్తారు. అప్పుడు అత్రి తన తపశ్శక్తితో సూర్యునికి అక్షయ రూపాన్ని ప్రసాదిస్తాడు. ఒక్క హుంకారంతో రాక్షసులను నాశనం చేస్తాడు. అలా సూర్యచంద్రులను రక్షిస్తాడు అత్రి మహర్షి.

ఇక దత్తాత్రేయ అవతారము:

అత్రి ఆ అనసూయ మాతకు సంతానాన్ని ప్రసాదించాలని సంకల్పిస్తాడు. బ్రహ్మ అంశతో సోముడు (చంద్రుడు), శంకరుడి అంశతో దుర్వాసుడు (తమోగుణ ప్రధానుడై), పూర్ణమైన విష్ణు  స్వరూపంతో, నారాయణ తేజస్సుతో (అంశంగా కాకుండా, పూర్ణ విష్ణు స్వరూపంగా) దత్తాత్రేయుడు జన్మిస్తారు.  అత్రి తేజస్సుతో ఆ ఆత్రేయుడు దత్తాత్రేయుడు గా అవతరించారు. విశ్వానికి తొలి గురువయ్యాడు. సమస్త బ్రహ్మాండం నిండి నారాయణ రూపమైన ఆ దత్తాత్రేయుడు మనకు అత్రి, అనసూయల వలన లభించాడు.

| అవధూతాయ విద్మహే అత్రి పుత్రాయ ధీమహి తన్నో దత్తః ప్రచోదయాత్  |

8, జులై 2010, గురువారం

ఎనభై ఏళ్ల బాలుడు బాలమురళి

ఆయన ముఖం చూస్తే ఏ అరవై ఏళ్ళు ఉంటాయో అనిపిస్తుంది. కళ్ళు మూసుకొని ఆయన గాత్రం వింటే ఏ నలభై ఏళ్ళు ఉంటాయో అనిపిస్తుంది. కేవలం ఆయన నవ్వునే చూస్తే ఏ ముప్ఫై ఏళ్ళు ఉంటాయో అనిపిస్తుంది. ఆయన మాట వింటే పదేళ్ళ పిల్లాడిలా కిల కిల మంటూ ఉంటుంది. ఆయన తెలుగు భాష తేనె లాగ తియ్యగా, మందాకినీ జలాల అంత స్వచ్చ్చంగా సరస్వతీ దేవి వీణాగానంలా వీనులకి హాయిగా ఉంటుంది. ఆ సంగీత సామ్రాజ్య స్వర సార్వభౌముడు ఎనభై వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా వాగ్దేవి మానసపుత్రునికి నా పాదాభివందనములు. మురళీ గాన రసాస్వాదనలో మునిగి తేలుతున్న వీక్షక, ప్రేక్షక జనానీకం,  రసప్రియులు, రసజ్ఞుల తరపున పద్మ విభూషణ్ డా|| మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారికి జన్మ దిన శుభాకాంక్షలు. ఆ సరస్వతీదేవి మీ నోట ఇలానే నూరు వసంతాలు పలకాలని మా ఆకాంక్ష.

'ఎందరో మహానుభావులు' అని ఘన రాగ పంచరత్న కీర్తన పాడినా,  'ఏ తీరుగ నను దయ చూసేదవో'  అని రామదాసు  కీర్తనలను ప్రాచుర్యంలోకి తెచ్చినా, ' 'పిబరే రామ రసం' అని భక్తి రసం ఒలికిన్చినా, 'అసమానమైన తిల్లాన మురళీగాన వినోదమైన తిల్లాన' అని తిల్లానలకు ఆది గురువుగా, 'ఏమి సేతురా లింగా' అని పామరులు పాడుకొనే తత్త్వ గీతాన్ని పాడినా, 'ఓంకార ప్రణవ' అని స్వీయ రచనలో స్తుతించినా,  'సలలిత రాగ సుధా రస సారం' అని నర్తనశాల చిత్రంలో బృహన్నల పాత్రకు జీవం పోసినా, 'మౌనమే నీ భాష ఓ మూగ మనసా' అని గుప్పెడు మనసులో ఆత్రేయ గీతానికి అత్యున్నత కీర్తి తెచ్చిపెట్టినా - ఇలా చెప్పుకుంటూ పొతే కొన్ని పేజీలు  అయిన చాలవు ఆ మహానుభావుడి బహు కళా ప్రావీణ్యానికి.

శుద్ధ స్ఫటిక సంకాశంలా ఆయన కర్నాటక సంగీత ప్రవాహం, మంజుల సౌరభ మృదు కుంజంలా ఆయన సినీ నేపథ్యగానం, నటన, వాగ్గేయకారుడిగా ఎన్నో కీర్తనలు, రాగాలను సృష్టించిన ఆయన సంగీత జ్ఞానం - ఇవన్ని ఒక ఎత్తు. ఆయన పాడేటప్పుడు కనిపించే భక్తి, జ్ఞానము, లయ, కొత్త దనము, విని, చూసేవారిని సమ్మోహితుల్ని చేసే ఆయన స్వర ఝరి, వినమ్రత ఇంకొక ఎత్తు.

తెలుగు భాషను ఖూనీ చేసే ఛాందస తమిళ సంగీతకారుల ప్రవాహానికి, ధాటికి తట్టుకొని, నిలబడి, శిఖరాన్ని అధిరోహించి అక్కడ దశాబ్దాలు నిలబడగలిగిన ఏకైక సంగీతజ్ఞుడు ఆయన. సంగీతంలో ఉత్సాహాన్ని, జ్ఞానాన్ని, భక్తిని, రక్తిని, అనురక్తిని ఒకే కచేరిలో చూపించే విశిష్ట గాయకుడు బాలమురళి గారు. 25000 కు పైగా కచేరీలు, 400 కు పైగా కృతిరచనలు చేసి ఇప్పటికీ నవయవ్వనంలో ఉన్న గాయకుడిలా ఆడుతూ పాడుతూ పాడేస్తున్నారు మంగళంపల్లి.

తెలుగునాట టెలివిజన్ లేనప్పుడు రేడియోలో భక్తి గీతాలు, తత్వాలు, దాస సంప్రదాయ కీర్తనలు, లలిత గీతాలను తన గానంతో బహుళ ప్రాచుర్యంలోకి తెచ్చారు. 'గాయతి వనమాలీ' అనే సదాశివ బ్రహ్మేంద్ర కృతి, 'శ్రీ కృష్ణా యను నామ మంత్రము' అనే అమర నారేయన కృతి,  'రామ రామ యనరాద' అనే రంగదాసు కృతి - ఇలా ఎన్నో ఆయన వాక్ప్రవాహంలో ప్రసిద్ధి పొందినవి.

ఆ మహనీయుడికి ప్రభుత్వం అత్యున్నత పురస్కారమైన భారత రత్న ఇవ్వాలని ఆకాంక్షిస్తూ ఆయన సంగీత ప్రవాహం ఇలానే కొనసాగాలని ప్రార్థన.

కౌసల్యా సుప్రజా రామా

వాల్మికి రామాయణం  బాలకాండంలో రాసిన ఈ శ్లోకం మనకు చాలా సుపరిచితమైనది.

కౌసల్యా సుప్రజా రామా పూర్వా సంధ్యా ప్రవర్తతే  |
ఉత్తిష్ఠ నరశార్దూల! కర్తవ్యం దైవమాహ్నికం ||

ఈ శ్లోకం యొక్క సందర్భం నాకు ఈరోజు రామాయణ పారాయణలో వచ్చింది.  విశ్వామిత్రుడు యాగ సంరంక్షణ నెపంతో బాలుడైన, నూనూగు మీసాలు కూడా రాని రాముడిని భయంకర రాక్షసులైన మారీచ సుబాహులను పోరాడి చంపడానికి దశరథుడిని కోరుతాడు. పుత్ర వాత్స్యల్యము, మోహముతో ఆ మహారాజు భీతి చెంది నేను ఆ బాలుడిని పంపలేను అంటాడు. వశిష్ఠ గురువులు అప్పుడు దశరథుడికి హితబోధ చేస్తాడు. విశ్వామిత్రుడి గొప్పతనము, ఆయన శక్తి, సామర్థ్యాలు వివరంగా చెప్పి ఆయన ఉండగా ఆ రాక్షసులు రాముడికి ఏ అపాయమూ కలుగచేయలేరని ఆశ్వాసన కలిగిస్తాడు. అప్పుడు దశరథుడు రామలక్ష్మణులను విశ్వామిత్ర మహర్షితో సంతోషంగా, నిస్సందేహంగా పంపిస్తాడు.

అలా తన ఆశ్రమానికి తీసుకెళ్ళే దారిలో సరయు, గంగ నదులు దాటుతూ, కొన్ని ఆశ్రమాల, అడవుల ప్రాముఖ్యతను రామలక్ష్మణులకు తెలియజేస్తాడు విశ్వామిత్రుడు.  వారికి బల, అతి బల విద్యలు నేర్పిస్తాడు. ఈ విద్యల వల్ల వారికి ఆకలిదప్పులు, దాహము, నిస్సత్తువ లాంటివి లేకుండా ఎల్లప్పుడూ శక్తివంతులై ఉంటారు. ఆ యాత్రలో నదీ తీరాన రామచంద్రుడు నిద్రపోతున్నప్పుడు, మహర్షి రాముడిని నిద్ర లేపుతూ ఈ శ్లోకం పఠిస్తాడు - " కౌసల్య తనయుడవైన ఓ రామా! సంధ్య, అగ్నిహోత్రం మొదలైన కర్తవ్యాలు నెరవేర్చాలి. మేలుకో!".  అప్పటి వరకు అల్లారు ముద్దుగా రాచరికంలో పెరిగిన రామచంద్రుడికి ముందు ముందు నెరవేర్చాల్సిన, కార్యాలు, ధర్మసంరక్షణ చాలా ఉన్నాయి అని గుర్తు చేస్తూ ఈ మేలుకొలుపు. ఆ కర్తవ్యపాలనకు కావలసిన విద్యలను, అస్త్ర శస్త్రాలను ప్రసాదిస్తు వారితో ముందుకు సాగుతాడు ఆ మహర్షి.

అంతా రామమయం - భద్రాచల రామదాసు కృతి

అంతా రామమయం ఈ జగమంతా రామమయం అంతరంగమున ఆత్మారాముడనంత రూపముల వింతలు సలుపగ సోమసూర్యులును సురలు తారలును ఆ మహాంబుధులు అవనీజంబులు అండాండంబులు పిండ...