25, జులై 2020, శనివారం

దిబ్బలు వెట్టుచు తేలినదిదివో- అన్నమాచార్యుల వారు


దిబ్బలు వెట్టుచు తేలినదిదివో ఉబ్బు నీటిపై ఒక హంస

అనువున కమలవిహారమె నెలవై ఒనరియున్నదిదె ఒక హంస
మనియెడి జీవుల మానస సరసుల వునికినున్నదిదె ఒక హంస

పాలు నీరు వేర్పరచి పాలలో ఓలలాడెనిదె ఒక హంస
పాలుపడిన యీ పరమహంసముల ఓలినున్నదిదె ఒక హంస

తడవి రోమరంధ్రంబుల గ్రుడ్లనుడుగక పొదిగీనొక హంస
కడు వేడుక వేంకటగిరి మీదట ఒడలు పెంచెనిదె ఒక హంస

కుప్పలు కుప్పలుగా ప్రకాశిస్తూ అలలపై ఆనందంగా తేలినదదిగో వటపత్రశాయియనెడి హంస! కలువలు కొలనులో విహరిస్తూ అక్కడే నివసించేది హంస, మానవుల మనసులనే సరస్సులలో నివసించే వాడు ఈ పరమాత్మయనే హంస. పాలు నీళ్లు వేరు చేసి పాలలో ఓలలాడేది హంస, మంచి చెడుల విచక్షణతో స్వాధీనమైన మనసులు గల పరమహంసల హృదయములలో ఓలి యున్నది ఈ పరమాత్మయనే హంస. ఎంతో జాగ్రత్తగా తన రోమములలోని రంధ్రముల మధ్య గుడ్లను పొదిగేది హంస, ఎంతో వేడుకగా వేంకటాద్రిపై వెలసి భక్తులకు ఆధారమై యున్నది ఈ పరమాత్మయనే హంస.

ప్రళయ విలయం తరువాత ప్రశాంత కడలిపై వటపత్రశాయియై చిరునవ్వులతో తేలి పునః సృష్టిని చేసిన వాడు శ్రీహరి. ఆ సృష్టిక్రమంలోనే కలియుగంలో ఏడుకొండలపై పరమాత్మ వెలశాడు. మంచి చెడుల విచక్షణలో నిరంతరం ధ్యానంలో ఉండే జీవి హంసతో సారూప్యంగా పరమాత్మ తత్త్వాన్ని ఆవిష్కరించారు అన్నమాచార్యుల వారు. మానససరోవరములో నివసించే హంసను పరమహంసలైన యోగుల మానస సరోవరములలో నివసించే పరమాత్మను పోల్చి మానవులకు పరమాత్మ యొక్క విశ్వవిరాట్ రూపాన్ని సూక్షంగా తెలియజేశారు. పాలు నీళ్లను విచక్షణ చేసి పాలను స్వీకరించేది హంస అయితే పాపపుణ్యముల విచక్షణ చేసి పుణ్యములను స్వీకరించి, పాపములను హరించి ముక్తినిచ్చేవాడు శ్రీనివాసుడు. తన శరీరములో గుడ్లను జాగ్రత్తగా పొదిగి సృష్టి క్రమాన్ని ముందుకు నడిపేది హంస ఐతే తన రోమ రోమము నుండి ప్రాణికోటిని పరిపుష్టం చేస్తూ అద్భుతమైన సృష్టిని కొనసాగించేవాడు పరమాత్మ అయిన శ్రీనివాసుడు. ఎంత మహత్తరమైన సారూప్యం కదా? అందుకే అన్నమాచార్యుల వారు సద్గురువులైనారు.

ఓం నమో వేంకటేశాయ!

2 కామెంట్‌లు: