నాలుగు మాసాలు దీక్షగా గడిపే ఒక కర్మ. మతాచార్యులు, గురువులు, పీఠాధిపతులు వర్ష శరదృతువులున్న నాలుగు నెలలు ఒకేచోట గడపటానికి ఉద్దేశించిన వ్రతం. గృహస్థులు కూడా దీనిని పాటించవచ్చు. ఆషాఢ శ్రావణ భాద్రపద ఆశ్వయుజ మాసాలు వానలు కురిసే సమయం కాబట్టి సన్న్యాసులు ఈ నాలుగు నెలలు ఒక చోట స్థిరంగా ఉండటం మంచిదని ఇలా నాలుగు నెలల దీక్షా సాంప్రదాయాన్ని ఏర్పాటు చేశారు అని ఒక వివరణ. ఇప్పుడు చాలా మంది దీనిని రెండు నెలలకు తగ్గించి పాటిస్తున్నారు.
శృంగేరి శారదాపీఠం వారి ప్రకారం ఇది ఒక వ్రతం. వేదాల ప్రకారం పక్షా వై మాసాః అనగా ఒక పక్షాన్ని మాసంగా పరిగణించి ఈ వ్రతాన్ని రెండు నెలలు చేస్తారు. దీనిని వర్షఋతువులో పాటిస్తారు. ఈ సమయంలో గురువులు పరబ్రహ్మను ధ్యానిస్తూ శిష్యులకు ఉపనిషత్తులు, సాంఖ్యమును బోధిస్తారు.
సమాగతేభ్యోऽన్తేవసద్భ్యః ఔపనిషదం సాంఖ్యం ప్రతిపాదయంతో వర్తామహే
చాతుర్మాస్య సంకల్పం చేసే ముందు వ్యాసపూజ నిర్వహించి, దక్షిణామూర్తిని, శివుని, ఆచార్య పరంపరను, బ్రహ్మవిద్యా ప్రతిపాదకులకు, గురువులను, బోధకులను స్మరించుకుంటరు. సాధారణంగా సన్న్యాసులకు ఏ విషయముపైనా అనురాగము కలుగకుండా అనేక ప్రదేశాలు తిరుగమని నారద పరివ్రాజకోపనిషద్ నిర్దేశించింది. కానీ, వర్ష ఋతువు సమయంలో దానికి భిన్నంగా ఒకేచోట ఉండి చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించాలి.
ఏకరాత్రం వసేద్ గ్రామో నగరే పంచరాత్రకం
వర్షాభ్యోऽన్యత్ర వర్షాసు మాసాంశ్చ చతురో వసేత్
ద్విరాత్రం న వసేద్ గ్రామో భిక్షుర్యది వసేత్తదా
రాగాదయః ప్రసజ్యేరంస్తేనాసౌ నారకీ భవేత్
గ్రామాన్తే నిర్జనే దేశే నియతాత్మాऽనికేతనః
పర్యటేత్ కీటవద్ భూమౌ వర్షాస్వేకత్ర సంవసేత్
సన్యాసి, వర్హ ఋతువులో తప్ప, ఒక గ్రామంలో ఒక్క రాత్రి, నగరంలో రెండు రాత్రుల వరకు ఉండవచ్చు. వర్షఋతువులో గ్రామంలో కానీ, నగరంలో కానీ, నాలుగు మాసములు ఉండవచ్చు. గ్రామంలో ఒక రాత్రి కన్నా ఎక్కువ ఉంటే అనురాగ్రము, కామము మొదలైనవి ఆతని దృష్టిని మరల్చవచ్చు. గ్రామం యొక్క చివర, జనులెవరూ నివసించని ప్రదేశంలో నివాసముండి నియమంగా, నేలపై తిరిగే కీటకములా భిక్షాటన చేయవలెను. వర్షఋతువులో ఒక్క చోట ఉండవచ్చు.
వర్షఋతువులో ప్రదేశాలు తిరుగుట వలన సన్యాసులకు క్రిమికీటకాదులనుండి ఆపదలు, వ్యాధులు కలిగే అవకాశముంది కాబట్టి ఒకే చోట ఉండవచ్చు అన్న వ్రతం. నిరంతర పర్యటన వల్ల బ్రహ్మ విచారమునకు ఆటంకము కలుగుతుంది కాబట్టి ఈ నాలుగు మాసాలు వారు ఒక చోట ఉండి పరబ్రహ్మను ధ్యానిస్తూ, గురు శిష్యుల సాంగత్యములో ఉండి ఆధ్యాత్మిక శాస్త్ర విషయాదులను చర్చించుకునే అవకాశం కలుగుతుంది. శృంగేరి శారదా పీఠాధిపతులు చాతుర్మాస్య సమయంలో అనేక వ్రతాలను ఆచరిస్తారు. అవి 1. శ్రావణ సోమవార వ్రతము 2. వరమహాలక్ష్మీ వ్రతము 3. గోకులాష్టమీ వ్రతము 4. వామన జయంతి 5. అనంత పద్మనాభ వ్రతము 6. ఉమామాహేశ్వర వ్రతం. ఈ ఆఖరి వ్రతంతో చాతుర్మాస్య దీక్ష ముగుస్తుంది.
మన దేశంలో ఈ వ్రతాన్ని అన్ని సాంప్రదాయాలలోని సన్యాసులు కూడా ఆచరిస్తారు. జ్ఞాన సముపార్జనకు ధ్యానానికి వారికి ఇది అత్యుత్తమమైన సమయం, శిష్యకోటికి గురువులను ఒకే చోట సందర్శించుకునే మహదవకాశం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి