8, జులై 2020, బుధవారం

పరమాత్మ, పరమేశ్వర స్వరూపాలు


పరమాత్మ అనగా?

నిర్వచించలేకపోయినా ఈ సృష్టి ప్రవాహంలో సనాతన ధర్మ సాంప్రదాయంలో అనేక నిర్వచనాలు వచ్చాయి 1. స్వయంప్రకాశం కలిగి జ్ఞానరూపమైన ఆత్మ 2. కార్యాకారణాలకు భిన్నమై, క్షరాక్షరములకు అతీతమై, స్వాభావికంగా నిత్యమై, శుద్ధమై, ఋద్ధమై, ముక్తమైన పదార్థం 3. అవిద్య వల్ల ఆత్మగా తలచిన దేహం మొదలు బుద్ధి వరకు ఉన్న తత్త్వాలకు అతీతమైనది, సర్వోత్కృష్టమైనదీ, ఉపద్రష్టృత్వాది విశేషణ విశిష్టమై ప్రకాశించే ఆత్మ 4. ఆత్మగా కల్పితాలైన పంచకోశాలకు, విరాట్, హిరణ్య గర్భ, అవ్యాకృత తత్త్వాలకు అతీతమై బ్రహ్మకు పూర్వము నుంచి ఉన్న పదార్థము 5. సమస్త భూతాలలోని ప్రత్యక్చేతనము 6. మాయాశక్తికి ఆశ్రయం 7. సర్వానికి అధిష్ఠానమైనది 8. పరదేవత 9. దైవం లేదా పరబ్రహ్మం.

మరి ఆ పరమాత్మ/పరమేశ్వర స్వరూపాలు ఏమిటి?

సనాతన ధర్మం ప్రకారం పరమాత్మ ఇందుగలడందులేడు, చక్రి సర్వోపగతుండు, మనం చూడటాన్ని బట్టి అని ఎన్నో శాస్త్ర పురాణాలు తెలిపాయి. వీటికి ఓ ప్రాతిపదిక ఉంది. పరమేశ్వరుడు నిరాకారుడు, సర్వవ్యాపి, సర్వాంతర్యామి అయినా, మనం కొలిచే రూపాలు ఐదు విధాలు:

1. పర స్వరూపం - దృష్టి, గోచరము కలిగిన సృష్టికి అతీతమైనది దివ్యమంగళ స్వరూపం. అనగా విశ్వవ్యాప్తమైన పరబ్రహ్మ స్వరూపం. ఇది సృష్టి స్థితిలయాదుల ఆధీనములో ఉండదు. శాశ్వతము, పరమానందకరమైంది. అవాఙ్మానసగోచరమైనది అని అర్థం.

2. వ్యూహ స్వరూపం - ఉపాసకులకు అనుకూలమైన రూపము. అనగా ఉపాసకులకు సాధనలో గోచరమైన రూపము. ఈ రూపము వేర్వేరు సాధకులకు ఒకేలా కనిపించవచ్చు. ఆ రూపానికి వారి సాధనకు గట్టి లంకె ఉంటుంది. విష్ణు, పురుష, సత్య, అచ్యుత, అనిరుద్ధ రూపాలుగా వ్యక్తమని వైఖానస శాస్త్రం చెబుతుంది.

3. విభవ స్వరూపం - అనాదిగా అత్యంత వైభవం పొందిన రూపాలు - రాముడు, కృష్ణుడు, సీత మొదలైన రూపాలు. ఇవి వేద శాస్త్ర పురాణాదులలో వర్ణించబడి, నుతించబడి కాలగమనంలో అత్యంత వైభవంగా కొలువబడిన రూపాలు.

4. అంతర్యామి స్వరూపం - అనగా బాహ్యేంద్రియములకు గోచరము కాని స్వరూపం. జ్ఞాననేత్రంతో మాత్రమే చూసే స్వరూపం. ఆయా సూక్తాలు చెప్పినట్లు హృదయ స్థానంలో ఉండే సూక్ష్మరూపం ఈ అంతర్యామి స్వరూపం. సిద్ధులకు, ముముక్షువులకు ఇచ్ఛామాత్రమున కనిపించే రూపము.

5. అర్చా స్వరూపం - అనగా ఆలయాలలో విగ్రహ రూపంలో ప్రతిష్ఠితమై కనిపించే స్వరూపం. ఇవి విభవ స్వరూపానికి మరింత వివరమైన రూపము. గుణ విభవాలను బట్టి కాస్త రూపాంతరము చెంది స్థపతుల చేతిలో రూపొందుకునేవి. వీనికి ప్రాతిపదిక దేవాలయ ఆగమ శాస్త్రం మరియు పీఠాధిపతులు/మఠాధిపతుల అనుభూతులకు రూపము. కోదండరాముడు, పట్టాభిరాముడు, శక్తి గణపతి, శ్రీదేవీ భూదేవీ సమేత శ్రీనివాసుడు, సిద్ధి వినాయకుడు మొదలైనవి.

ఈ విధాలను గమనిస్తే ప్రధానంగా మన ధర్మంలోని దేవతా స్వరూపాలన్నీ అనుభవైకవేద్యమైనవి, అవతార సంబంధమైనవి, శాస్త్రప్రమాణవైనవి. మనం వర్ణించలేని పరమాత్మకు ఓ రూపం ఇవ్వటంలో ధ్యాత, ధ్యేయం, ధ్యాస కలిగి అవ్యక్తానందం వేగవంతంగా కలిగే అవకాశం ఉంటుంది అని మనకు విగ్రహారాధనను ప్రతిపాదించారు. మనలను మనం ఇష్టపడినట్లే ఒక రూపాన్ని మనకు రక్షకునిగా ఆరాధిస్తే ఈ జనన మరణములతో కూడిన దేహాన్ని ఓ అద్భుతమైన సాధనంగా ఉపయోగించుకోవచ్చు అని విగ్రహారాధనను ఈ ధర్మంలో ప్రోత్సహించారు. దృగ్గోచరము కాని పరమ స్వరూపాన్ని, అంతర్యామి స్వరూపాన్ని దర్శించాలంటే ఎంతో తీవ్రమైన సాధన చేయాలి, అది అందరికీ ఒక జన్మలో సాధ్యం కాకపోవచ్చు కాబట్టే విభవ, అర్చా స్వరూపాలు, బహుళ ప్రయోజనానికి దేవాలయాలు, స్వప్రయోజనానికి నిత్య పూజాయతనాలు ప్రతిపాదించబడ్డాయి. దేహము, గృహము, దేవాలయము...అన్నీ ఈ రూపాలకు నివాసము అన్నది మరల మరల చెప్పి మనలను ఆ మార్గంలో నిరంతరం నడిపించటానికే స్వరూపాలు.

పరమేశ్వరార్పణమస్తు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి