8, జులై 2020, బుధవారం

గురువు యొక్క కృప


చాలా సార్లు గురువంటే మన సమస్యల పరిష్కారానికో లేక మన ప్రశ్నల సమాధానానికో అనుకుంటాము. కానీ, తాబేలు బిడ్డలకు దూరంగా ఉండి గమనిస్తూ ఉన్నట్లు శిష్యుల ప్రగతిని, పరిణతిని నిత్యం గమనించి సరిదిద్దే వారు గురువులు. ఈ గురు తత్త్వం అనుభవైకవేద్యం. స్కాందపురాణంలోని బ్రహ్మ సంహితలో శివపార్వతుల సంవాదంలోని గురుగీత గురువు యొక్క గొప్పతనాన్ని 27 శ్లోకాల ద్వారా తెలిపింది. దాని సారాంశం.

గురువు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. ఆయనే ఆ పరబ్రహ్మము. అజ్ఞానమనే అంధకారాన్ని జ్ఞానమనే అంజనముతో తొలగించే వారు గురువులు. అనంతమైన, అఖండమైన, సృష్టిలోని కదిలే, కదలని ప్రతి ప్రాణి/వస్తువు లో ఉండే బ్రహ్మ యొక్క నిజాన్ని తెలిపే వారు గురువులు. సృష్టిలో, కదిలే కదలని ప్రతి వస్తువులో ఉండే జీవాత్మ నిజాన్ని తెలిపే వారు గురువులు. చరాచారాలతో కూడిన మూడులోకాలను వ్యాపించి ఉన్న శుద్ధ చైతన్య స్వరూపమైన బ్రహ్మ గురించి తెలిపే అసి శబ్దాన్ని వివరించే వారు గురువు. ఆత్మజ్ఞానమనేది ఎవరి ద్వారా అయితే ఒకనిమిషములోని అత్యంత అల్పమైన భాగములో కలుగుతుందో వారే గురువులు. దైవము, గురువు పట్ల అత్యంత ఉన్నతమైన భక్తి కలిగిన వానికే శాస్త్రాలు తమ నిగూఢ అర్థాన్ని పూర్తిగా తెలుపుతాయి. తల్లి, తండ్రి, దైవమై సంసార భయాన్ని పోగొట్టే వారు గురువ్లు. ఎవరి వలన ప్రపంచము సత్యముగా, ప్రకాశముగా, ఆనందముగా కనిపించి, తెలుస్తుందో వారే గురువులు. మూడు అవస్థలు (జాగృతము, స్వప్నము, సుషుప్త) - వీటి యందు చేతనను కలిగిన వారు గురువులు. జ్ఞానమనే శక్తిని అధిరోహించి, తత్వము (నిజము) అనే మాలతో అలంకరించబడి, మనకు భుక్తిని, ముక్తిని ప్రసాదించే వారు గురువులు. జ్ఞానమనే అగ్ని ద్వారా అనేక జన్మల నుంచి సంప్రాప్తించిన కర్మ అనే బంధములను దహించే వారు గురువులు.

ఎవరి పాదములు కడిగిన నీరు ఈ సంసారమనే సాగరాన్ని దాటించి, అసత్యాన్ని నాశనం చేస్తుందో వారే సద్గురువులు. గు అనే అక్షరము అంధకారాన్ని, రు అనే అక్షరము తొలగించడానికి ప్రతీక. అందుకనే గురు అనే పదము అంధకారాన్ని తొలగించేదిగా పిలవబడింది. కర్మలు, మనసు, వాక్కు - మూడింటి ద్వారా గురువును ఆరాధించాలి. గురువుకు పూర్తి సాష్టాంగ నమస్కారము చేయుటకు వెనుకాడ కూడదు. గురువుకు ప్రతి నిత్యం సాష్టాంగ నమస్కారము చేసి పూజించవలెను. అలా చేయటం వలన స్థైర్యము, ఆత్మ జ్ఞానము (తాను ఎవరు అని తెలిపేది) కలుగుతాయి.గురువును మించిన తత్వము (నిజము), తపస్సు, జ్ఞానము లేదు. గురువే కారణము, ఆది (మొదలు). కానీ ఆయనకు అవి లేవు. గురువు ఉత్తమమైన దైవము. గురు మంత్రాన్ని మించిన మంత్రము లేదు. నిజమైన వివేకము జాగృతమైనప్పుడు గురువే అత్యంత హితుడని తెలుస్తుంది. అన్ని ధర్మములకు మూలము గురువే. విశ్వము గురువు యందు స్థితమైయున్నది. గురువు విశ్వవ్యాప్తమై యున్నాడు. సంసారమనే అడవిలో చిక్కుకున్న వారికి, భ్రాంతిలో జీవించే వారికి ముక్తిని కలిగగించే వారు గురువు. మూడు రకాల తాపముల(శరీరము, ప్రాణులు,దైవికము) అగ్ని నుంచి ఉపశమనము కలిగించే గంగా నది వంటి వారు గురువు. సాక్షాత్తు శివుడే అయిన గురువు ఈ జగత్తులో మనకు ఏకైక హితుడు. సర్వ విద్యలకు ప్రభువు ఆయన.ధ్యానానికి మూలము గురువు యొక్క రూపము, పూజకు మూలము గురువు యొక్క పాదములు, గురువు యొక్క పలుకులు మంత్రానికి మూలము. గురువు యొక్క కృప ముక్తికి మూలము.

ధ్యానమూలం గురోర్మూర్తిః పూజా మూలం గురోః పదం
మంత్రమూలం గురోర్వాక్యం ముక్తిమూలం గురోః కృపాః

తస్మై శ్రీ గురవే నమః

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి