6, జులై 2020, సోమవారం

ఎంత భాగ్యమో మా పాల గల్గితివి - త్యాగరాజస్వామి


ఎంత భాగ్యమో మా పాల గల్గితివి ఎవరీడు ముజ్జగములలో తన

చెంతజేరి సౌజన్యుడై పలికి చింత బాగ తొలగించి బ్రోచితివి

మున్ను మీ సమీపమున వెలయు సన్మునులనెల్ల నణిమాది లీలలచే
తిన్నగాను పాలన చేసినటు నన్ను గాచితివి త్యాగరాజనుత!

ఓ శ్రీరామా! నీవు మాకు ఆశ్రయమైతివి, ఇది ఎంతటి భాగ్యమో! ముల్లోకములలో నీకు సాటి ఎవరయ్యా! చెంతకు వచ్చి మంచిమనసుతో మాటలాడి చింతలు ఎంతో చక్కగా తొలగించి కాపాడినావు, ఇది ఎంతటి భాగ్యమో! నీ సన్నిధిన చేరిన యోగులకు అణిమాది అష్టసిద్ధులను ప్రసాదించి నీ దివ్యలీలలచే ఎంతో చక్కగా పాలన చేసిన రీతి నీవు నాకు ఆశ్రయమైతివి, ఇది ఎంతటి భాగ్యమో!

-సద్గురువులు త్యాగరాజస్వామి

రామసాక్షాత్కారము తరువాత త్యాగరాజస్వామి రచించిన కీర్తనలలో ఇదొకటి. చాలామందికి తెలియని విషయం - త్యాగరాజస్వామి వారికి రామకృష్ణానందస్వామి అనే గురువులు రామతారకమంత్రోపదేశం చేశారు. తిరువాయూరులోని పంచనదీశ్వరుని సన్నిధిలో త్యాగరాజస్వామి రోజుకు లక్షా ఇరవై ఐదు వేల రామ తారక మంత్ర జపం చేశారు. ఆ విధంగా 38 ఏళ్ల కాలంలో 96 కోట్ల మంత్ర జపం పూర్తి చేశారు. అప్పుడు శ్రీరాముడు లక్ష్మణ సమేతుడై యాగసంరక్షణకై విశ్వామిత్రునితో వెడలిన రూపంలో త్యాగయ్యకు ప్రత్యక్షమై వెంటనే అంతర్ధానమైనాడు. ఆ పారవశ్యంలోనే త్యాగరాజస్వామి "బాలకనకమయ చేల సుజనపరిపాల" అనే సాక్షాత్కార కృతిని ఆశువుగా గానం చేశారు. ఈ విధంగా రామతారక మంత్ర సిద్ధి పొందిన తరువాతే త్యాగరాజస్వామి ఎక్కువ కృతులను రచించారు. వాల్మికీ మహర్షి 24,000 శ్లోకాలలో రామాయణాన్ని రచించగా త్యాగయ్య 24,000 కీర్తనలను రచించారు.

కాబట్టి మనం గమనించవలసినది - రామతారకమంత్రోపాసనలో సిద్ధి పొంది త్యాగయ్య పరిపూర్ణమైన యోగిగా జీవించారు. పరబ్రహ్మ తత్త్వాన్ని పూర్తిగా అనుభూతి చెందిన తరువాతే అద్భుతమైన కీర్తనలను రచించారు. అందుకే ధనకనక వస్తు వాహనాదులు, రాజభోగాలు ఆయనకు రుచించలేదు, ఉంఛవృత్తిలోనే జీవించారు. నిరంతర రామభజన తత్పరులై, సాంసారిక విషయ వాంఛలకు దూరంగా ఉంటూ, రామతారకమంత్రమనే సచ్చిదానందములో పవిత్రమైన జీవితాన్ని గడిపారు. ఆ నాదయోగికి నమస్సులు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి