రామ నామంలోని రహస్యాన్ని మనకు ఒలిచిన అరటిపండులా తన కృతుల ద్వారా అందజేశారు నాదబ్రహ్మ త్యాగరాజస్వామి. అగ్ని బీజమై కాటుక కొండలవంటి సమస్త పాపములను నాశనము చేసే నామం రామ నామం. అనేక జన్మార్జిత పాపసంచయాన్ని అత్యంత శక్తిమంతమైన రామనామ స్మరణతో ఛేదించి ముక్తిని పొందవచ్చు అన్నది మనకు సనాతన ధర్మంలో ఎందరో సత్పురుషులు, సజ్జనుల జీవితాల ద్వారా విదితమే. దానినే మరల తన జీవన ప్రస్థానంలో అనేక కృతుల ద్వారా అనుభవ పూర్వకంగా పలికారు త్యాగరాజస్వామి. రామకోటి, రామాయణ పారాయణం, రామనామ స్మరణం, కీర్తనం వల్ల మనమే కాదు తరతరాలు ఉద్దరించబడతారు అని మా గురువు గారు ఎప్పుడూ చెబుతారు. అంతటి మహోన్నతమైన సాధనం మనందరికీ అందుబాటులో ఉంది. ఇక ఆలస్యమెందుకు? ఆ రహస్యాన్ని తెలుసుకుని, జపాది ఉపాసనామార్గాల ద్వారా అనుభూతి చెంది తరిద్దాం. జై శ్రీరాం!
జయతు జయతు మంత్రం జన్మ సాఫల్య మంత్రం
జనన మరణ భేద క్లేశ విచ్ఛేద మంత్రం
సకల నిగమ మంత్రం సర్వశాస్త్రైక మంత్రం
రఘుపతి నిజమంత్రం రామరామేతి మంత్రం
ఈ రామనామ వైభవాన్ని తెలిపే కృతి వివరాలు:
సాహిత్యం
=======
రమించువారెవరురా రఘూత్తమా నిను వినా!
శమాది షడ్గుణగణ సకల భువన జనులలో
రంయనే సుమర్మము రామయనే శర్మము స
దమరవరులకబ్బెనో త్యాగరాజ సన్నుత
భావం
======
రఘువంశోత్తముడవైన శ్రీరామా! సమస్త లోకములలోని ప్రాణులకు (శమ దమ ఉపరతి తితీక్ష శ్రద్ధ, సమాధాన అనే) ఆరు సద్గుణాలను ప్రసాదించి రమించేది నీవు కాక ఇంకెవ్వరు? రం అనే అద్భుతమైన బీజాక్షర రహస్యం (అగ్ని బీజమై అత్యంత తేజోమయమైనది అని అర్థం), రామ అనే శాశ్వతమైన ఆనందాన్ని యోగులకు, దేవతలకు అందజేసి పరమశివునిచే నుతించబడింది నీవు కాక ఇంకెవరు?
శ్రవణం
=======
సుపోషిణి రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని బాలమురళీకృష్ణ గారు ఆలపించారు.
అద్భుతమైన కీర్తన... చక్కటి వివరణ
రిప్లయితొలగించండి