25, జులై 2020, శనివారం

నామ స్మరణమెలా పనిచేస్తుంది?



కలియుగంలో పరమాత్మ నామ స్మరణం ముక్తికి మార్గం అన్నది ఆర్యోక్తి. నామం ఉచ్చరిస్తే పాపాలు తొలగుతాయా? అలా అయితే ఏ నామమైనా దేవుని నామమేగా? అలాంటప్పుడు ఏ పదాన్ని స్మరించి ఉచ్చరించినా పాపాలు పోవాలి కదా? ఇలాంటి ప్రశ్నలు నాస్తిక పిడివాదులు సనాతనధర్మాన్ని అనుసరించే వారిపై సంధిస్తూనే ఉంటారు. సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను.

అమ్మ - ఈ పదానికి ఉన్న పవిత్రత ఎక్కడి నుండి వచ్చింది? సగం దానిలోని అక్షరాల నుండి, మిగిలిన సగం ఆ పాత్రకు ఉన్న గొప్పతనం నుండి. అమ్మా అని పిలవకుండా ఆ మనిషిని ఇంకెంత గౌరవభావంతో పిలిచినా ఆ అమ్మదనానికి ఉన్న పవిత్రత రాదు కదా? అంటే ఏమిటి? ఇక్కడ భావనలో ఔన్నత్యానికి సాఫల్యతనిచ్చింది అమ్మ అనే పదం. ఆ పదంలోని అక్షరాల కూర్పు అలాంటిది. ప్రత్యక్ష దైవం అమ్మ కదా? అమ్మ అన్న పదంలో అంతటి మహత్తు ఉంటే, మరి విశ్వాంతర్యామి అయిన ఆయన నామంలో ఎంతటి మహత్తు ఉండాలి? వాటి రహస్యం ఏమిటి?

శబ్దం విశ్వజనీన శక్తికి ఓ అద్భుతమైన ప్రతిబింబం. శబ్దంతోనే ప్రకంపనలు, ప్రకంపనలతోనే భావాలు, భావాలతోనే సంకల్పం, సంకల్పంతోనే చూడలేనివి చూడగలగటం, అనుభూతి చెందలేనివి అనుభూతి చెందటం, ఊహకు అందనివి స్ఫురణకు రావటం. ఆ శబ్దాలు ఋషిప్రోక్తమైనప్పుడు వేదాలయ్యాయి. అలాగే దేవతా స్వరూపముల నామములు. అపురూపమైన, మహత్తరమైన, అర్థవంతమైన శబ్దాల కలయికతో ఏర్పడినవి నామాలు. నారాయణ కాని, రామ కాని, కృష్ణ కాని, గౌరి కాని, శివ కాని..మనకున్న దేవతాస్వరూపాల నామాలలోని శబ్దాల కలయికకు ఒక పరమార్థం ఉంది, వాటిని పఠించటం ద్వారా విలక్షణమైన ఫలితం కలిగి తీరుతుంది.

మరి విశ్వమంతటా పరమాత్మే ఉన్నప్పుడు కొన్ని శబ్దాలతో కూడిన నామాలకే ఎందుకా నామస్మరణ సాఫల్యం? అన్నిటికీ ఉండాలి కదా? అక్కడే భావం ముఖ్యం. దేవతా స్వరూపాన్ని, మనం తలచిన భావానికి, శబ్దానికి తీగలా అనుసంధానం చేసేది నామం. ప్రపంచంలో అన్ని శబ్దాలకూ అటువంటి శక్తి ఉండదు, తదనుగుణమైన భావం ఉప్పొంగదు. ఎలాగైతే అమ్మా అన్నప్పుడు అద్భుతమైన మాతృత్వం ఉప్పొంగి తల్లి హృదయం స్పందిస్తుందో, ఒసేయ్ అన్నప్పుడు దానికి పూర్తిగా విరుద్ధమైన భావనలు కలుగుతాయో, అలాగే నామాలు కూడా. ఇక్కడ సూక్ష్మం శబ్దాల ప్రకంపనలు మనలో ఎటువంటి భావాలను కలిగిస్తాయి అన్నది. ఎందుకలా? శబ్దాలు దేహంలోని కణాలను, గ్రంథులను జాగృతం చేస్తాయి. ఇది మనకు ఉచ్చ్వాస నిశ్శ్వాసలలోని సోహం శబ్దం ద్వారా నిరూపితమే. సోహం శబ్దం మనకు తెలియకుండా నిరంతరం దేహంలో ప్రయాణం చేస్తున్నంత వరకు దేహం ఆత్మకు ఆలవాలమవుతుంది, ఆగిన మరుక్షణం పార్థివమవుతుంది. అలాగే, దేవతల నామాల ఉచ్చరణ కూడా. ఆయా దేవతల లక్షణాలను బట్టి, నామాలను బట్టి విలక్షణమైన శబ్దాలు మన శరీరంలోని కణాలు, గ్రంథులు అంతే విలక్షణంగా జాగృతమై మన మనసులో పేరుకుని ఉన్న ఆలోచనలను కరగిస్తాయి, పొరలను పటాపంచలు చేస్తాయి. భావయుక్తమైన, పవిత్రమైన శబ్దాలతో కూడిన పదాలకు అంతటి శక్తి కలదు. ఇది శాస్త్రీయంగా నిరూపించబడింది.

మరి నామస్మరణ సఫలమెలా అవుతుంది? నమ్మకంతో, అచంచలమైన విశ్వాసంతో, దృఢ సంకల్పంతో. ఇవన్నీ కూడా భావాన్ని పరిపుష్టం చేసి శబ్ద ప్రకంపనలను దేహమంతా ప్రసరింపజేసి దేహాన్ని జాగృతం చేస్తాయి, హృదయ జ్యోతి చుట్టూ ఉన్న పొరలను తొలగిస్తాయి. నామస్మరణ మొదట యాంత్రికంగా జరిగినా అది ఒక క్రమశిక్షణకు, ఏకాగ్రతకు నాంది అవుతుంది. ఆ తరువాత శబ్ద ప్రకంపనలు దేహంలో మార్పులు తీసుకు వస్తాయి. నిరంతర నామస్మరణ వలన దేహం దేవాలయంగా మారుతుంది. జీవాత్మ ఉద్ధరించబడుతుంది, జనన మరణ చక్రాల నుండి బయటపడే మహద్భాగ్యాన్ని పొందుతుంది.

మరి కలిలో నామస్మరణే మార్గమని ఎందుకన్నారు?

యజ్ఞ యాగాదుల సాఫల్యానికి అనువైన పరిస్థితులు సృష్టించటం చాలా కష్టం కాబట్టి. కార్య నిర్వహణ, కర్తలలో సంకల్పబలం, స్థల సామాగ్రిలో పవిత్రత, పంచభూతములలో శుద్ధి ఇవన్నీ కలియుగంలో మృగ్యం కాబట్టే మునుపటి యుగాలలో జరిగిన క్రతువుల వంటివి ఈ యుగధర్మానికి ఆచరణయోగ్యం కాదు. కలిపురుషుని ప్రభావం చేత సమాజంలొ వచ్చే మార్పులను దృష్టిలో పెట్టుకునే నామస్మరణమనేది ఈ యుగంలో ముక్తికి మార్గంగా చెప్పారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి