25, జులై 2020, శనివారం

గీత - పంచమవేదం


గీత పంచమవేదంగా పరిగణించబడటానికి కారణం మానవునికి సమస్త పరిస్థితులయందు దిశానిర్దేశం చేయడంలో ఈ బోధ అత్యంత ప్రభావవంతమైనది కాబట్టే. కర్మ, భక్తి, జ్ఞాన, వైరాగ్యముల ద్వారా తానెవరో తెలుసుకునేందుకు రాచబాట భగవద్గీత. ఆచరించగలిగితే ప్రతి ఒక్క మానవుడూ శ్రీకృష్ణ పరమాత్మ కాగలడు. ఆచరించలేకపోయినా సత్యాసత్య విచక్షణ కొంతైనా కలిగియుండి సరైనా మార్గంలో మనలను నడిపించగలిగిన అద్భుతశక్తి ఈ జగద్గురు బోధ. పఠించగా పఠించగా విషయమవగతమై స్థితప్రజ్ఞత వైపు నడిపే మహోన్నత ఆధ్యాత్మిక సంపద భగవద్గీత. మనకు కావలసింది ఏమిటి? సుఖదుఃఖాల సమ్మేళనమైన జీవితంలో వీలైనంత ఆనందంగా ఉండగలిగే, వీగిపోని వ్యక్తిత్వమే కదా? అది 100% అందజేసేది ఈ బోధ.

పరమాత్మ చెప్పిన ఒక్క విషయం ఈ నాటి సమాజానికి చాలా ముఖ్యమైనది, మనందరిలోనూ లోటైనది - సమభావం. ఈ సమభావం కలిగిన వారు నాకు అత్యంత ప్రియులు అని ఆయన అనేక మార్లు గీతలో చెప్పారు. ఈరోజుల్లో సనాతన ధర్మ ఆచరిస్తున్నాము అనుకునే వారిలో మృగ్యమైనది ఈ సమభావం. నిరంతరము నేను గొప్ప వాడు తక్కువ అన్న వివక్షతో ఈ ప్రపంచంలో ఘోరమైన అసంతులన సృష్టిస్తున్నారు. అన్నీ ఆ సృష్టిలో ఓ ప్రత్యేకమైన పాత్ర కలవే అన్న సత్యాన్ని మారస్తున్నారు. అందుకే సనాతన ధర్మం అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంది. ఆలోచించి సత్యం తెలుసుకుంటేనే ఈ జాతికి మనుగడ.

ఇహైవతైర్జితైః సర్గో యేషాం సామ్యే స్థితం మనః
నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాద్ బ్రహ్మణి తే స్థితాః

ఎవరి మనసు సమభావమందు స్థిరమై యున్నదో అటువంటి వారు ఈ జన్మలోనే సమస్తమును జయించినవారగుదురు. అనగా ప్రాపంచిక విషయాతీత స్థితికి చేరుకొందురు. పరమాత్మ సముడు, దోషరహితుడు కావున అట్టి వారియందే స్థితుడగును.

- కర్మసన్న్యాస యోగం 19వ శ్లోకం

ఈ ప్రపంచాన్ని పీడిస్తున్న మరో పెద్ద సమస్య - నేను, నా వల్ల, నా వల్లనే అని విర్రవీగే అహంకారము. దాని కారణంగా సుఖము, దుఃఖములకు కారణం తెలుసుకోలేని అజ్ఞాన పరిస్థితి. కర్మలను ఫలాపేక్ష లేకుండా ఆచరించమని పరమాత్మ చెప్పినా, మనం నిత్యమూ చేసేది ఫలాపేక్షతోనే. అందుకే అహంకారప్రేరితమైన అరిషడ్వర్గాలు పేట్రేగి మానవత్వం నశించి రాక్షసత్వం తాండవిస్తోంది. ఎందుకు ఫలాపేక్ష లేకుండా కర్మలనాచరించమన్నాడో గీత చదివితే అర్థమవుతుంది. పాపక్షయానికి అదొక్కటే మార్గము.

బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః
లిప్యతే న స పాపేన పద్మపత్రమివాంభసా!

ఎవడు కర్మలనన్నిటినీ భగవదర్పణము చేసి ఫలాసక్త రహితముగా కర్మలనాచరించునో వాడు తామరాకుపై నీటిబిందువు వలె పాపములచే నంటబడడు.

-కర్మ సన్న్యాస యోగం 10వ శ్లోకం

మూడవ విషయం: మనలో అరిషడ్వర్గాలు ప్రకోపించటానికి కారణం కృష్ణ పరమాత్మ చక్కగా తెలిపాడు - విషయములను ఎక్కువ చింతన. ఇది ప్రతి క్షణం మనం చేస్తూనే ఉంటాము, చూస్తూనే ఉంటాము. కొందరికి రాజకీయం, కొందరికి రంధ్రాన్వేషణ, కొందరికి జాతీయవాదం, కొందరికి మూఢభక్తి, మరికొందరికి నాస్తికత. కావలసిన దానికన్నా ఎక్కువ సమయం ఓ విషయంపై వెచ్చిస్తే కలిగేవే అరిషడ్వర్గాలు. తద్వారా నాశనము.

ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే
సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే

క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః
స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః బుద్ధి నాశాత్ ప్రణశ్యతి

-సాంఖ్యయోగం (62,63 శ్లోకాలు)

విషయ చింతన ఎక్కువ చేయటం వలన ఆసక్తి కలుగును. ఆ ఆసక్తి వలన వానిని పొందే కోరిక కలుగును. ఆ కోరికలు తీరనప్పుడు క్రోధము కలుగును. ఆ క్రోధము అదుపు దాటినప్పుడు మోహము కలుగును. దాని ప్రభావముతో వివేకము నశించును, తద్వారా జ్ఞానశక్తి నశించును. దీని వలన మనుష్యుడు పతనమవుతున్నాడు. ఇది కఠోర సత్యం. తెలుసుకుంటే శాశ్వతానందం.

అన్నీ తెలిసిన సనాతన ధర్మవాదులు ఈ విషయాసక్తిలో చిక్కుకుని అసలు లక్ష్యానికి దూరమవుతున్నారు. జ్ఞానులు ధనకనక వస్తు వాహనములుపై ఆసక్తితో అధోగతి పాలవుతున్నారు. సన్న్యాసులు సామ్రాజ్యాలను ఏర్పరచుకునే వలలో చిక్కుకుని ప్రజల గౌరవాన్ని కోల్పోతున్నారు. మొత్తం సమాజమే భ్రష్టు పట్టే ప్రమాదం ఈ విషయాసక్తి మితి మీరడం వల్లన.

కృష్ణం వందే జగద్గురుం.🙏🏻🙏🏻

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి