2, జనవరి 2021, శనివారం

బ్రహ్మాండ వలయే మాయే - మైసూరు మహారాజా జయచామరాజ వడయార్ కృతి


ఈ భారతదేశంలో సంగీతం కలకాలం నిలిచింది అంటే దానికి ఆనాటి పాలకుల ఇచ్చిన ఆదరణ కూడా ఒక ముఖ్యమైన కారణం. త్యాగరాజస్వామి వంటి వాగ్గేయకారులు రాజాశ్రయాన్ని పూర్తిగా త్యజించారు, అది ఆనాటి పరిస్థితులకు సముచితంగా వారు ఎంచుకున్న మార్గం. రాజాశ్రయంలో ఉన్న లోటుపాట్లను ఎరిగే, నరస్తుతులకు, వారిచ్చే కానుకలకు దూరంగా నిలిచి పూర్తిగా రాముని సేవలోనే గడిపారు. కర్నాటక సంగీతంలో ఉన్న మహత్తును, ఆధ్యాత్మిక సంపదను గ్రహించి ఆ తరువాతి కాలంలో ఎందరో జమీందార్లు, పాలకుకు స్వయంగా సంగీతాన్ని పూర్తిస్థాయిలో అభ్యసించి, దానిని ఉపాసనా మార్గంలో వినియోగించుకుని, అద్భుతమైన అనుభూతులను పొందుతూ, తమ తమ ఆస్థానలలో సంగీత సాహిత్య నాట్య సాంప్రదాయాలకు పెద్ద పీట వేసి కళాకారులను, గురువులను ఆదరించి, ప్రోత్సహించారు. అటువంటి వారిలో మైసూరు సంస్థానం చివరి మహారాజా జయచామరాజ వడయార్ గారు ప్రముఖులు. వారు శ్రీవిద్యోపాసకులే కాకుండా కర్నాటక శాస్త్రెయ సంగీత ప్రావీణ్యం కలవారు, ఎన్నో కృతులను కూడా రచించారు. మైసూరు సామ్రాజ్య దేవత అయిన రాజరాజేశ్వరి అమ్మవారిని నుతిస్తొ ఆయన రచించిన ఒక కృతి. వడయార్ గారి ముద్ర శ్రీవిద్య. అలాగే, ఈ కృతిని ఆయన మాండ్ రాగంలో స్వరపరచారు. తగ్గట్టుగానే పల్లవిలోనే రాగముద్రను పొందు పరచారు. వారి సంస్థానంలో నిత్యం ఈ కృతిని విద్వాంసులు ఉదయం అమ్మవారి సేవలో ఆలపించేవారట. అద్భుతమైన ఆధ్యాత్మిక సంపద కలిగిన ఈ కృతిని పరిశీలిస్తే వడయార్ గారి సంస్కృత భాషా పాండిత్యం, ఉపాసనా బలం గోచరిస్తాయి. శివజాయే, బ్రహ్మరంధ్రనిలయే, అహినిభవేణి, అంతరహిత కైవల్య విహారిణి, గతినిర్జితకరిణి మొదలైన పదసమూహాలు వడయార్ గారి ప్రతిభలోని ఔన్నత్యాన్ని తెలుపుతాయి. వివరాలు:

సాహిత్యం
========

బ్రహ్మాండ వలయే మాయే బ్రహ్మాది వందిత శివజాయే

బ్రహ్మవిద్యానందిత హృదయే బ్రహ్మర్షాద్యుపాసిత శ్రీవిద్యా బ్రహ్మరంధ్రనిలయే

గౌతమార్చిత గాయత్రి గౌరీ గిరిరాజేంద్ర పుత్రి
కాంత రాగిణి నారాయణి కారుణ్య లలితే మంజులవాణి
అంతర్ముఖ జ్యోతిర్మయ కల్యాణి అహినిభవేణి పురాణి
అంతరహిత కైవల్య విహారిణి గతినిర్జితకరిణి గీర్వాణి

భావం
=====

పరమశివుని పత్నివైన ఓ పార్వతీదేవీ! నీవు బ్రహ్మాండమును చుట్టి యున్న మాయవు, బ్రహ్మాదులచే పూజించబడుచున్నావు. నీవు బ్రహ్మవిద్యచే ఆనందము పొందే హృదయము కలిగియున్నావు, బ్రహ్మర్షులచే ఉపాసించే శ్రీవిద్యవు, సహస్రార చక్రమునందు నివసించియున్నావు. నీవు గౌతమ మునిచే అర్చించబడిన గాయత్రివి, పర్వతరాజేంద్రుడైన హిమవంతుని పుత్రివి, పతియైన పరమశివునిపై అనురాగముతో నిండియున్నావు, నారాయణుని సోదరివి, కరుణామూర్తివి, లలితవు, మృదువైన పలుకులు కలిగియున్నావు, ఎల్లప్పుడూ అంతర్ముఖవై ప్రకాశించెదవు, ఎల్లప్పుడూ శుభములు కలిగించెదవు, తుమ్మెదల సమూహము వంటి కురులు కలిగియున్నావు, సనాతనమైనదానవు, అంతములేని మోక్షములో విహరించెదవు, ఏనుగును మించిన నడక కలిగి, వాక్కే అస్త్రముగా గల పరదేవతవు.

శ్రవణం
======

మాండు రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని విదుషీమణి ఎమ్మెస్ షీలా గారు ఆలపించారు. 


1, జనవరి 2021, శుక్రవారం

ఈ పాదం ఇలలోన నాట్య వేదం - వేటూరి గీతం



శ్రీహరి చరణకమలాల మహత్తును, రహస్యాన్ని ఎందరో ఋషులు, వాగ్గేయకారులు, కవులు వేనోళ్ల పొగిడారు, తమ అంతర్దృష్టితో పొందిన అనుభూతులను మనోజ్ఞంగా అక్షరరూపంలో ఆవిష్కరించారు. అపౌరుషేయమైన వేదములలో కూడా పరమపురుషుని పదాల గురించి అనేక చోట్ల ప్రస్తావన ఉంది. పురుష సూక్తంలో పాదోऽస్య విశ్వా భూతాని త్రిపాదస్యామృతం దివి, త్రిపాదూర్ధ్వ ఉదైత్పురుషః పాదోऽస్యేహాऽऽభవాత్పునః అని చెప్పబడింది, అనగా పరమాత్మ పాదమే విశ్వముగా ఆవిర్భవించింది, ఆ స్వామి మూడు పాదములు అమృతత్వం కలిగిన లోకాలపై నిలిచి ఉంటాయి, అవి అత్యున్నతమైన మోక్షాన్ని సూచించే విధంగా ఊర్ధ్వదిశగా ఉంటాయి, ఆ పరమపురుషుని ఒక పాదమే మరల మరల సృష్టి క్రమమవుతున్నది అని. ఈ సత్యాన్నే అనేక అవతారములలో మనం గమనిస్తాం కూడా. వాటిని వాగ్గేయకారులు తమ సాహిత్యంలో అద్భుతంగా ప్రస్తావించారు. అన్నమాచార్యుల వారు బ్రహ్మ కడిగిన పాదము అన్న కృతిలో దశావతారములలో పరమపురుషుని పదవైశిష్ట్యాన్ని ఆవిష్కరించగా, కృష్ణశాస్త్రి గారు పదములె చాలు రామా నీ పదధూళులె పదివేలు అన్నారు, అలాగే రామచరణం రామచరణం రామచరణం మాకు శరణం అని అటువంటి భావాన్నే తనదైన శైలిలో పలికించారు. ఆ తరువాత ఈ హరిపాద వైభవాన్ని అంతే మనోజ్ఞంగా, లోతుగా పలికించారు వేటూరి వారు. మయూరి చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సంగీతం కూర్చగా వేటూరి చేసిన శ్రీహరి పదార్చన వివరాలు.


సాహిత్యం
=======

ఈ పాదం ఇలలోన నాట్య వేదం
ఈ పాదం నటరాజుకే ప్రమోదం
కాల గమనాల గమకాల గ్రంథం 

ఈ పాదమే మిన్నాగు తలకు అందం
ఈ పాదమే ఆ నాటి బలికి అంతం
తనలోని గంగమ్మ ఉప్పొంగగా
శిలలోని ఆ గౌతమే పొంగగా
పాట పాటలో తను చరణమైన వేళ
కావ్య గీతిలో తను పాదమైన వేళ
గానమే తన ప్రాణమై లయలు హొయలు విరిసే ఈ పాదం

ఈ పాదమే ఆ సప్తగిరికి శిఖరం
ఈ పాదమే శ్రీహస్త కమల మధుపం
వాగ్గేయ సాహిత్య సంగీతమై
త్యాగయ్య చిత్తాన శ్రీగంధమై
ఆ పాదమే ఇల అన్నమయ్య పదమై
ఆ పాదమే వరదయ్య నాట్య పథమై
తుంబుర వర నారద మునులు  జనులు కొలిచే ఈ పాదం


భావం
====

శ్రీహరి పాదమే కదా ఈ భూమిపై నాట్యానికి వేదమైంది, ఈ పాదం పరమశివునికి ఆనందం కలిగించేది, ఈ పాదం కాలగమనంలోని మార్పులకు సాక్ష్యం. ఈ శ్రీహరి పాదమే కాళింగుని తలలపై అందంగా నాట్యం చేసింది, ఈ పాదమే ఆనాడు బలిని పాతాళానికి తొక్కివేసింది, ఈ పాదం నుండే సురగంగ జన్మించింది, ఈ పాదం తాకగానే అహల్య శాపవిముక్తి పొంది తిరిగి చైతన్యవంతమైంది, ప్రతి గీతంలోనూ ఈ పాదం ఒక చరణమైంది, ప్రతి కావ్యగీతికలోనూ ఈ శ్రీహరి చరణమే ఒక పాదమైంది, గానామృతమే తన ప్రాణం చేసుకుని లయబద్ధంగా హొయలు చిందించేది ఈ శ్రీహరి పాదమే. ఈ శ్రీహరి పాదమే ఏడుకొండలకు శిఖరమైంది, ఈ పాదమే లక్ష్మీ దేవి చేతిలో ఉన్న కమలముపై తుమ్మెదలా వ్రాలి ఉంది, ఈ పాదమే వాగ్గేయకారుల సాహిత్య సంగీత రూపమైంది, ఈ పాదమే త్యాగయ్య చిత్తానికి శ్రీచందనమైంది, ఈ పాదమే అన్నమయ్య పదకవితగా జాలువారింది, ఈ పాదమే క్షేత్రయ్యకు నాట్యసోపానమైంది, తుంబురుడు, నారదుడు, మునిశ్రేష్ఠులు, మానవులు కొలిచేది ఈ శ్రీహరి పాదమునే. 

శ్రవణం
======

వేటూరి సుందరరామమూర్తి గారి గీతాన్ని ఎస్బీ బాలసుబ్రహ్మణ్యం గారి స్వరపరచగా, ఎస్పీ శైలజ గారు ఆలపించారు. 

31, డిసెంబర్ 2020, గురువారం

రాజగోపాలం భజేऽహం - ముత్తుస్వామి దీక్షితుల వారి కృతి


ముత్తుస్వామి దీక్షితులవారి కృతులలో మన్నార్‌గూడి శ్రీవిద్యా రాజగోపాలస్వామి వారిపై రచించిన కృతి ఇది. ఈ క్షేత్రంలో శ్రీకృష్ణుడు రాజగోపాలస్వామిగా వెలశాడు.  ఇక్కడి ప్రధాన దేవత రూపాలు మూలమూర్తి వాసుదేవ పెరుమాళ్, ఉత్సవమూర్తి రాజగోపాలస్వామి. ఇక్కడ అమ్మవారు హేమభుజవల్లి (సెంగమల తాయారు). దేవకీవసుదేవులకు దర్శనమిచ్చి వారికి పుత్రునిగా జన్మించినది మొదలు గోపాలకునిగా 32 లీలలు ఆ శ్రీహరివి. వాటికి ప్రతీకగానే ఇక్కడి నిత్యసేవలు. రాజగోపాలుని రూపంలో ఒకచేతి మీద కొరడా, చేత వెన్నముద్ద, తలపాగా, చేతులకు గాజులు, నడుముకు ఆభరణములు,పంచెకట్టు, మరొక చేత ఏనుగు దంతము, చుట్టూ గోవులు ఉంటాయి. కంసుడు బలరాముని చంపటానికి కువలయపీఠమనే ఏనుగును పంపగా కృష్ణుడు దానిని చంపి దంతాలను విరుస్తాడు. దానికి ప్రతీకగానే ఇక్కడి స్వామి చేత దంతము. అలాగే గోపస్త్రీల వస్త్రములు, ఆభరణములు దొంగిలించిన దానికి ప్రతీకగా ఒకచెవికి గోపస్త్రీ కుండలము ఉంటుంది. ఇక్కడ స్వామికి పాలను నివేదన చేస్తారు. వివాహ సంతానాది దోషాల నివారణకు, పశు సంవృద్ధికి, సుఖసంతోషాలకు ఈ స్వామిని పూజిస్తే ఫలితం వెంటనే ఉంటుందని నమ్మకం. ఈ దేవాలయాన్ని 10వ శతాబ్దంలో చోళులు నిర్మించగా, 16వ శతాబ్దంలో తంజావూరు నాయకరాజులు పునరుద్ధరించారు. ఇక్కడి హరిద్రానది పుష్కరిణి భారతదేశంలోనే అత్యంత విశాలమైన తీర్థంగా ఒకటిగా పేరొందింది. ఇది 23 ఎకరాల మేర ఉంది. ఉత్సవమూర్తి అయిన రాజగోపాలస్వామి రుక్మిణీ సత్యభామల సహితుడై కొలువబడతాడు. ఈ క్షేత్ర వృక్షం పారిజాత వృక్షం. ఈ వివరాలలో కొన్నిటిని దీక్షితులవారు ఈ కృతిలో ప్రస్తావించారు. 

సాహిత్యం
=======

రాజగోపాలం భజేऽహం రమాలీలం

తేజోమయ మోహనకరం దివ్యాంబరాది ధరం
గజరాజ పూజిత పదం గుణిజన నత గోవిందం

నారదాది కృత భజనం నాదలయయుత సదనం
హరిద్రానదీ తీరం హత్యాది పాప హరం
పారిజాత తరుమూలం పంకజ నయన విశాలం
గురుగుహనుత వనమాలం గోపీజనమాలోలం

భావం
=====

లక్ష్మీదేవితో లీలలను చేసే రాజగోపాలస్వామిని నేను భజిస్తున్నాను. తేజోమయ రూపముతో మోహింపజేసేవాడు, దివ్యమైన వస్త్రములు, ఆభరణములు ధరించేవాడు, గజేంద్రునిచే పూజించబడిన పదములు కలవాడు, శ్రేష్ఠులచే నుతించబడిన గోవిందుడు, రాజగోపాలుని నేను భజిస్తున్నాను. నారదాది మునులచే భజించబడేవాడు, నాదలయయుతమైన సంగీతంలో నివసించేవాడు, హరిద్రానదీ తీర్థ సమీపంలో వెలసినవాడు, హత్య మొదలైన పాపములను హరించేవాడు, పారిజాతవృక్ష మూలమున నివసించేవాడు, కలువల వంటి విశాలమైన నేత్రములు కలవాడు, సుబ్రహ్మణ్యునిచే నుతించబడిన వాడు, వనమాల ధరించేవాడు, గోపస్త్రీలను మైమరపింపజేసేవాడు అయిన రాజగోపాలుని భజిస్తున్నాను. 

శ్రవణం
======

మోహన రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని అరుణా సాయిరాం గారు ఆలపించారు. 

30, డిసెంబర్ 2020, బుధవారం

క్షితిజారమణం చింతయే - దీక్షితుల వారి కృతి


దీక్షితుల వారు అద్వైత సిద్ధాంతంపై గల విశ్వాసాన్ని తమ కృతులలో పూర్తిగా ప్రతిబింబించారు. షణ్మతములలోని దేవతలను అంతే భక్తితో, తాదాత్మ్యతతో ఆరాధించారు, ఆ భావనలు ఆయన కృతులలో సుస్పష్టంగా తెలుస్తాయి. శైవ శాక్తేయ షణ్ముఖ సాంప్రదాయాలలోని దేవాలయాలలోని దేవతామూర్తులపై ఆయన ఉపాసనా పూర్వకంగా ఎలా కృతులు రచించారో అదే పద్ధతిలో ఆయన వైష్ణవ సాంప్రదాయంలోని అనేక దేవాలయాలను సందర్శించి అత్యద్భుతమైన కృతులను రచించారు. ఈ ధనుర్మాసంలో వారు రచించిన కొన్ని శ్రీరంగనాథుని కృతులను ప్రస్తావించాను. అలాగే, శ్రీరామచంద్రునిపై ఆయన మనోజ్ఞమైన ప్రాకృత భాషలో దివ్యమైన కృతులను రచించారు. వాటిలో ఒక కృతి వివరాలు:

సాహిత్యం
========

క్షితిజారమణం చింతయే శ్రీరామం భవతరణం

క్షితిపతి నత చరణం సేవిత విభీషణం
క్షితి భరణం శ్రితచింతామణిం అఘహరణం

సకలసుర మహిత సరసిజ పదయుగళం శాంతం అతికుశలం
వికసిత వదన కమలమతులితమమలం వీరనుత భుజబలం
శుకశౌనక ముని ముదిత గురుగుహ విదితం శోభన గుణ సహితం
ప్రకటిత సరోజ నయనం పాలిత భక్తం భవపాశహరణనిపుణం

భావం
=====

భవసాగరాన్ని దాటించేవాడు, భూమి నుండి జన్మించిన సీతాదేవి పతి అయిన శ్రీరాముని ధ్యానిస్తున్నాను. మహారాజులచే నుతించబడిన చరణములు కలవాడు, విభీషణునిచే సేవించబడిన వాడు, వరాహావతారంలో భూమిని రక్షించినవాడు, ఆశ్రితులకు చింతామణివలె కామ్యములను తీర్చేవాడు, పాపములను హరించేవాడు అయిన శ్రీరాముని ధ్యానిస్తున్నాను. సమస్త దేవతల చేత పూజించబడిన పదకమలములు కలవాడు, శాంతమూర్తి, అత్యంత నైపుణ్యము కలవాడు, వికసించిన కమలము వంటి ముఖము కలవాడు, సాటిలేని వాడు, నిర్మలుడు, వీరులచే నుతించబడిన భుజబలము కలవాడు, శుకశౌనకాది మునులకు ఆనందం కలిగించినవాడు, సుబ్రహ్మణ్యునిచే గ్రహించబడిన వాడు, సద్గుణములు కలిగి ప్రకాశించేవాడు, వికసించిన కలువల వంటి కన్నులు కలవాడు, భక్తులను పాలించేవాడు, జనన మరణ బంధముల నుండి ముక్తి కలిగించుటలో నిపుణుడైన శ్రీరామచంద్రుని ధ్యానిస్తున్నాను. 

శ్రవణం
======

దేవగాంధారి రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని జొన్నలగడ్డ శ్రీరాం ఆలపించారు. 

29, డిసెంబర్ 2020, మంగళవారం

పరిమళ రంగనాథం భజేऽహం - దీక్షితుల వారి క్షేత్ర కృతి

దీక్షితుల వారి క్షేత్ర కృతులలో ఒకటి తమిళనాడు తిరువిందళూరులోని పుండరీకవల్లీ సమేత పరిమళరంగనాథునిపై రచించినది. ఈ క్షేత్రానికి స్థల పురాణం ఉంది. శ్రీమహావిష్ణువు మత్స్యావతారుడై వేదాలను రక్షించి తిరువిళందూరులోని వనంలో తపస్సు చేసి ఆ వేదాలను వల్లించి వాటికి, తనకు కూడా శాశ్వతమైన పరిమళాన్ని ఆపాదించుకున్నాడు. అంతే కాదు, ఆ వనం కూడా పరిమళ వనంగా మారింది. ఇక్కడి విమానం పేరు వేదామోద విమానం. చంద్రుడు శాపవిముక్తికై ఈ క్షేత్రంలోనే తపస్సు చేసి శ్రీహరి అనుగ్రహం పొందాడు. ఈ క్షేత్రంలో అందుకే చంద్రుడు, అంబరీషుల మూర్తులు ఉంటాయి. ఈ విషయాలన్నీ దీక్షితుల వారు తన కృతిలో ప్రస్తావించారు. వివరాలు:

సాహిత్యం
========

పరిమళ రంగనాథం భజేऽహం వీరనుతం
పరిపాలిత భక్తం పుండరీకవల్లీనాథం

హరిం అంబరీష శీతాంశు వేదాది పూజితం
మురహరం భయహరం నరహరిం ధృత గిరిం
సురనర మునిజన ముదితం
పురహర గురుగుహ విదితం

సుగంధ విపినాంతరంగ శయనం రవిశశి నయనం
శుకశౌనకాది హృద్సదనం సరసిజ వదనం
ఖగరాజ తురంగం కమనీయ శుభాంగం
కనకాంబర కౌస్తుభమణి ధరం కంబు కంధరం
గగన సదృశమాబ్జకరం గజరాజ క్షేమ కరం
నగపతి సుతా సోదరం నర వరద దామోదరం

భావం
=====

వీరులచే నుతించబడేవాడు, భక్తులను పరిపాలించేవాడు, పుండరీకవల్లికి నాథుడైన పరిమళ రంగనాథుని నేను భజిస్తున్నాను. అంబరీషుడు, చంద్రుడు వేదములచే పూజించబడేవాడు, మురాసురుని సంహరించినవాడు, భయమును హరించేవాడు, నరసింహుడు, మందర పర్వతమును ధరించినవాడు, దేవతలు, మానవులు, మునిజనులకు ఆనందం కలిగించినవాడు, పరమశివుడు, సుబ్రహ్మణ్యునిచే గ్రహించబడిన వాడు అయిన పరిమళ రంగనాథుని నేను భజిస్తున్నాను. సుగంధవనము మధ్యలో శయనించేవాడు, సూర్యచంద్రులు కన్నులుగా కలవాడు, శుకశౌనకాది మునుల హృదయములో నివసించేవాడు, కమలము వంటి ముఖము కలవాడు, గరుత్మంతుడు వాహనముగా కలవాడు, అందమైన, శుభకరమైన శరీరవయవములు కలవాడు, బంగారు వస్త్రములు, కౌస్తుభమణి ధరించే వాడు, శంఖము వంటి కంఠము కలవాడు, ఆకాశమును పోలినవాడు, గజేంద్రునికి క్షేమము కలిగించినవాడు, హిమవంతుని కుమార్తె అయిన పార్వతికి సోదరుడైనవాడు, మానవులకు వరదుడు, దామొదరుడైన పరిమళ రంగనాథుని నేను భజిస్తున్నాను. 

శ్రవణం
=======

హమీర్ కల్యాణి రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని చారులత మణి గారు ఆలపించారు. 

28, డిసెంబర్ 2020, సోమవారం

రంగనాయకం భావయేऽహం - ముత్తుస్వామి దీక్షితుల వారి కృతి


సాహిత్య సంపదలో, ఆధ్యాత్మిక వైభవంలో, సంస్కృత భాషా విశేషణాలలో, సంగీతత్రయంలో ముత్తుస్వామి దీక్షితుల వారిది అగ్రస్థానం. వారి ఉపాసనా బలమంతా ఈ మూడు కోణాల ద్వారా ఆయన రచనలలో అద్భుతంగా గోచరిస్తుంది. అటువంటి ఒక కృతి వారు శ్రీరంగంలోని రంగనాథునిపై రచించినది. వివరాలు:

సాహిత్యం
========

రంగనాయకం భావయేऽహం శ్రీరంగనాయకీ సమేతం శ్రీ

అంగజ తాతమనంతమతీతం అజేంద్రాద్యమరనుతం సతతం
ఉత్తుంగ విహంగ తురంగం కృపాపాంగం రమాంతరంగం శ్రీ

ప్రణవాకార దివ్య విమానం ప్రహ్లాదాది భక్తాభిమానం
గణపతి సమాన విష్వక్సేనం గజ తురగ పదాది సేనం
దినమణికులభవ రాఘవారాధనం మామక విదేహ ముక్తి సాధనం
మణిమయ శశివదనం ఫణిపతి శయనం పద్మనయనం
అగణితసుగుణగణ నతవిభీషణం ఘనతర కౌస్తుభమణి విభూషణం
గుణిజన కృత వేదపారాయణం గురుగుహ ముదిత నారాయణం శ్రీ

భావం
=====

రంగనాయకీ సమేతుడైన శ్రీరంగనాయకుని నేను ధ్యానిస్తున్నాను. మన్మథునికి తండ్రి, అనంతుడు, అన్నిటికీ అతీతుడు, బ్రహ్మేంద్రాది దేవతలచే ఎల్లప్పుడూ నుతించబడేవాడు, గరుత్మంతుని వాహనంగా ఆకాశంలో విహరించేవాడు, కృపావీక్షణములు కలవాడు, లక్ష్మీదేవి హృదయములో ఉండేవాడు అయిన శ్రీరంగనాయకుని ధ్యానిస్తున్నాను. ఓంకారమనే దివ్యవిమానంలో విహరించేవాడు, ప్రహ్లాదాది భాగవతోత్తములను ప్రీతితో అనుగ్రహించేవాడు, గణపతితో సమానమైన విష్వక్సేనునిచే పూజించబడేవాడు, గజములు, అశ్వములు, సైనికులతో కూడిన సైన్యము కలవాడు, సూర్యవంశములో జన్మంచి రాఘవునిగా కొలువబడినవాడు, దేహముక్తి పొందేందుకు నాకు సాధనమైనవాడు, మణులతో ప్రకాశించేవాడు, చంద్రుని వంటి ముఖము కలవాడు, విభీషణునిచే నుతించబడినవాడు, శ్రేష్టమైన కౌస్తుభ మణిని వక్షస్థలమున ఆభరణముగా కలవాడు, ఉత్తములైన పండితులచే వేద పారాయణ ద్వారా నుతించబడిన వాడు, సుబ్రహ్మణ్యునికి ఆనందం కలిగించేవాడు, శ్రీమన్నారాయణుడైన రంగనాయకుని నేను ధ్యానిస్తున్నాను. 

శ్రవణం
=======

ఖరహరప్రియ జన్యమైన నాయకి రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారు ఆలపించారు.

25, డిసెంబర్ 2020, శుక్రవారం

కరుణ జూడవయ్య మాయయ్య కావేటి రంగయ్య - త్యాగరాజస్వామి శ్రీరంగ పంచరత్న కృతి

త్యాగరాజస్వామి వారు రచించిన శ్రీరంగ పంచరత్న కీర్తనలలో మరొకటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా. శ్రీరంగంలో స్వామి వైభోగాన్ని అనేక సేవలలో చూసి ఆనందించి రచించిన కృతి ఇది. 

సాహిత్యం
========

కరుణ జూడవయ్య మాయయ్య కావేటి రంగయ్య

పరమ పురుష విను మాపాలి పెన్నిధానమా
వరద నలుగురిలో వరమొసగి కరమిడి

చారడేసి కన్నులచే చెలంగు ఉభయ నా
చ్చారులతోను మరి సద్భక్తులతో యా
ళ్వారులతో నీవు వర నైవేద్యముల
నారగించు వేళల హరి త్యాగరాజుని పై

భావం
=====

మా తండ్రివైన ఓ కావేటి రంగయ్యా! నాపై కరుణతో చూడవయ్యా! మా పాలిట పెన్నిధివైన ఓ పరమ పురుషా నా మటలు ఆలకించు! ఓ వరదా! నలుగురిలో వరములు, అభయమునిచ్చి కరుణతో చూడవయ్యా! ఓ శ్రీహరీ! చారెడు కన్నులు కలిగిన శ్రీదేవి భూదేవిలతో, సద్భక్తులతో, ఆళ్వారులతో నీవు శ్రేష్టమైన నైవేద్యములు ఆరగించు వేళ త్యాగరాజునిపై కరుణతో చూడవయ్యా!

శ్రవణం
======

సారంగ రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని మహారాజపురం సంతానం గారు ఆలపించారు. 

శ్రీ శంభు తనయునకు జయమంగళమనరే - వినాయకునికి మంగళ హారతి

శ్రీ శంభు తనయునకు జయమంగళమనరే సిద్ధి వినాయకునకు శుభమంగళమనరే శ్రీ శంభు తనయుని సిద్ధి గణనాథుని విఘ్నాలకధిపతి ఆ దేవదేవుని సురుచిరముగ భాద్రపద శుద...