31, డిసెంబర్ 2020, గురువారం

రాజగోపాలం భజేऽహం - ముత్తుస్వామి దీక్షితుల వారి కృతి


ముత్తుస్వామి దీక్షితులవారి కృతులలో మన్నార్‌గూడి శ్రీవిద్యా రాజగోపాలస్వామి వారిపై రచించిన కృతి ఇది. ఈ క్షేత్రంలో శ్రీకృష్ణుడు రాజగోపాలస్వామిగా వెలశాడు.  ఇక్కడి ప్రధాన దేవత రూపాలు మూలమూర్తి వాసుదేవ పెరుమాళ్, ఉత్సవమూర్తి రాజగోపాలస్వామి. ఇక్కడ అమ్మవారు హేమభుజవల్లి (సెంగమల తాయారు). దేవకీవసుదేవులకు దర్శనమిచ్చి వారికి పుత్రునిగా జన్మించినది మొదలు గోపాలకునిగా 32 లీలలు ఆ శ్రీహరివి. వాటికి ప్రతీకగానే ఇక్కడి నిత్యసేవలు. రాజగోపాలుని రూపంలో ఒకచేతి మీద కొరడా, చేత వెన్నముద్ద, తలపాగా, చేతులకు గాజులు, నడుముకు ఆభరణములు,పంచెకట్టు, మరొక చేత ఏనుగు దంతము, చుట్టూ గోవులు ఉంటాయి. కంసుడు బలరాముని చంపటానికి కువలయపీఠమనే ఏనుగును పంపగా కృష్ణుడు దానిని చంపి దంతాలను విరుస్తాడు. దానికి ప్రతీకగానే ఇక్కడి స్వామి చేత దంతము. అలాగే గోపస్త్రీల వస్త్రములు, ఆభరణములు దొంగిలించిన దానికి ప్రతీకగా ఒకచెవికి గోపస్త్రీ కుండలము ఉంటుంది. ఇక్కడ స్వామికి పాలను నివేదన చేస్తారు. వివాహ సంతానాది దోషాల నివారణకు, పశు సంవృద్ధికి, సుఖసంతోషాలకు ఈ స్వామిని పూజిస్తే ఫలితం వెంటనే ఉంటుందని నమ్మకం. ఈ దేవాలయాన్ని 10వ శతాబ్దంలో చోళులు నిర్మించగా, 16వ శతాబ్దంలో తంజావూరు నాయకరాజులు పునరుద్ధరించారు. ఇక్కడి హరిద్రానది పుష్కరిణి భారతదేశంలోనే అత్యంత విశాలమైన తీర్థంగా ఒకటిగా పేరొందింది. ఇది 23 ఎకరాల మేర ఉంది. ఉత్సవమూర్తి అయిన రాజగోపాలస్వామి రుక్మిణీ సత్యభామల సహితుడై కొలువబడతాడు. ఈ క్షేత్ర వృక్షం పారిజాత వృక్షం. ఈ వివరాలలో కొన్నిటిని దీక్షితులవారు ఈ కృతిలో ప్రస్తావించారు. 

సాహిత్యం
=======

రాజగోపాలం భజేऽహం రమాలీలం

తేజోమయ మోహనకరం దివ్యాంబరాది ధరం
గజరాజ పూజిత పదం గుణిజన నత గోవిందం

నారదాది కృత భజనం నాదలయయుత సదనం
హరిద్రానదీ తీరం హత్యాది పాప హరం
పారిజాత తరుమూలం పంకజ నయన విశాలం
గురుగుహనుత వనమాలం గోపీజనమాలోలం

భావం
=====

లక్ష్మీదేవితో లీలలను చేసే రాజగోపాలస్వామిని నేను భజిస్తున్నాను. తేజోమయ రూపముతో మోహింపజేసేవాడు, దివ్యమైన వస్త్రములు, ఆభరణములు ధరించేవాడు, గజేంద్రునిచే పూజించబడిన పదములు కలవాడు, శ్రేష్ఠులచే నుతించబడిన గోవిందుడు, రాజగోపాలుని నేను భజిస్తున్నాను. నారదాది మునులచే భజించబడేవాడు, నాదలయయుతమైన సంగీతంలో నివసించేవాడు, హరిద్రానదీ తీర్థ సమీపంలో వెలసినవాడు, హత్య మొదలైన పాపములను హరించేవాడు, పారిజాతవృక్ష మూలమున నివసించేవాడు, కలువల వంటి విశాలమైన నేత్రములు కలవాడు, సుబ్రహ్మణ్యునిచే నుతించబడిన వాడు, వనమాల ధరించేవాడు, గోపస్త్రీలను మైమరపింపజేసేవాడు అయిన రాజగోపాలుని భజిస్తున్నాను. 

శ్రవణం
======

మోహన రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని అరుణా సాయిరాం గారు ఆలపించారు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి