1, జనవరి 2021, శుక్రవారం

ఈ పాదం ఇలలోన నాట్య వేదం - వేటూరి గీతం



శ్రీహరి చరణకమలాల మహత్తును, రహస్యాన్ని ఎందరో ఋషులు, వాగ్గేయకారులు, కవులు వేనోళ్ల పొగిడారు, తమ అంతర్దృష్టితో పొందిన అనుభూతులను మనోజ్ఞంగా అక్షరరూపంలో ఆవిష్కరించారు. అపౌరుషేయమైన వేదములలో కూడా పరమపురుషుని పదాల గురించి అనేక చోట్ల ప్రస్తావన ఉంది. పురుష సూక్తంలో పాదోऽస్య విశ్వా భూతాని త్రిపాదస్యామృతం దివి, త్రిపాదూర్ధ్వ ఉదైత్పురుషః పాదోऽస్యేహాऽऽభవాత్పునః అని చెప్పబడింది, అనగా పరమాత్మ పాదమే విశ్వముగా ఆవిర్భవించింది, ఆ స్వామి మూడు పాదములు అమృతత్వం కలిగిన లోకాలపై నిలిచి ఉంటాయి, అవి అత్యున్నతమైన మోక్షాన్ని సూచించే విధంగా ఊర్ధ్వదిశగా ఉంటాయి, ఆ పరమపురుషుని ఒక పాదమే మరల మరల సృష్టి క్రమమవుతున్నది అని. ఈ సత్యాన్నే అనేక అవతారములలో మనం గమనిస్తాం కూడా. వాటిని వాగ్గేయకారులు తమ సాహిత్యంలో అద్భుతంగా ప్రస్తావించారు. అన్నమాచార్యుల వారు బ్రహ్మ కడిగిన పాదము అన్న కృతిలో దశావతారములలో పరమపురుషుని పదవైశిష్ట్యాన్ని ఆవిష్కరించగా, కృష్ణశాస్త్రి గారు పదములె చాలు రామా నీ పదధూళులె పదివేలు అన్నారు, అలాగే రామచరణం రామచరణం రామచరణం మాకు శరణం అని అటువంటి భావాన్నే తనదైన శైలిలో పలికించారు. ఆ తరువాత ఈ హరిపాద వైభవాన్ని అంతే మనోజ్ఞంగా, లోతుగా పలికించారు వేటూరి వారు. మయూరి చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సంగీతం కూర్చగా వేటూరి చేసిన శ్రీహరి పదార్చన వివరాలు.


సాహిత్యం
=======

ఈ పాదం ఇలలోన నాట్య వేదం
ఈ పాదం నటరాజుకే ప్రమోదం
కాల గమనాల గమకాల గ్రంథం 

ఈ పాదమే మిన్నాగు తలకు అందం
ఈ పాదమే ఆ నాటి బలికి అంతం
తనలోని గంగమ్మ ఉప్పొంగగా
శిలలోని ఆ గౌతమే పొంగగా
పాట పాటలో తను చరణమైన వేళ
కావ్య గీతిలో తను పాదమైన వేళ
గానమే తన ప్రాణమై లయలు హొయలు విరిసే ఈ పాదం

ఈ పాదమే ఆ సప్తగిరికి శిఖరం
ఈ పాదమే శ్రీహస్త కమల మధుపం
వాగ్గేయ సాహిత్య సంగీతమై
త్యాగయ్య చిత్తాన శ్రీగంధమై
ఆ పాదమే ఇల అన్నమయ్య పదమై
ఆ పాదమే వరదయ్య నాట్య పథమై
తుంబుర వర నారద మునులు  జనులు కొలిచే ఈ పాదం


భావం
====

శ్రీహరి పాదమే కదా ఈ భూమిపై నాట్యానికి వేదమైంది, ఈ పాదం పరమశివునికి ఆనందం కలిగించేది, ఈ పాదం కాలగమనంలోని మార్పులకు సాక్ష్యం. ఈ శ్రీహరి పాదమే కాళింగుని తలలపై అందంగా నాట్యం చేసింది, ఈ పాదమే ఆనాడు బలిని పాతాళానికి తొక్కివేసింది, ఈ పాదం నుండే సురగంగ జన్మించింది, ఈ పాదం తాకగానే అహల్య శాపవిముక్తి పొంది తిరిగి చైతన్యవంతమైంది, ప్రతి గీతంలోనూ ఈ పాదం ఒక చరణమైంది, ప్రతి కావ్యగీతికలోనూ ఈ శ్రీహరి చరణమే ఒక పాదమైంది, గానామృతమే తన ప్రాణం చేసుకుని లయబద్ధంగా హొయలు చిందించేది ఈ శ్రీహరి పాదమే. ఈ శ్రీహరి పాదమే ఏడుకొండలకు శిఖరమైంది, ఈ పాదమే లక్ష్మీ దేవి చేతిలో ఉన్న కమలముపై తుమ్మెదలా వ్రాలి ఉంది, ఈ పాదమే వాగ్గేయకారుల సాహిత్య సంగీత రూపమైంది, ఈ పాదమే త్యాగయ్య చిత్తానికి శ్రీచందనమైంది, ఈ పాదమే అన్నమయ్య పదకవితగా జాలువారింది, ఈ పాదమే క్షేత్రయ్యకు నాట్యసోపానమైంది, తుంబురుడు, నారదుడు, మునిశ్రేష్ఠులు, మానవులు కొలిచేది ఈ శ్రీహరి పాదమునే. 

శ్రవణం
======

వేటూరి సుందరరామమూర్తి గారి గీతాన్ని ఎస్బీ బాలసుబ్రహ్మణ్యం గారి స్వరపరచగా, ఎస్పీ శైలజ గారు ఆలపించారు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి