31, జులై 2020, శుక్రవారం

సీతారామ కల్యాణం - లోకకల్యాణార్థం విశ్వామిత్ర జనకుల పాత్ర


శ్రీమద్రామయణంలో సీతారామ కల్యాణం అత్యంత ముఖ్యమైనది. ఎందుకంటే, అది లోకకల్యాణార్థం రాముని అయనానికి నాంది. అందులో ముఖ్యమైన పాత్రలు విశ్వామిత్ర మహర్షి, రాజర్షి జనకుడు. వివరాలను పరిశీలిద్దాం.

విశ్వామిత్రుడు
===========

పిల్లలకు పెండ్లి చేస్తే బాగుండునని దశరథుడు అనుకుంటూ ఉండే సమయంలో విశ్వామిత్రుడు ప్రవేశిస్తాడు. సీతారాముల వివాహమైన మరునాడే విశ్వామిత్రుడు ఉత్తరగిరికి బయలుదేరి వెళతాడు. ఆ తరువాత మరల విశ్వామిత్రుని ప్రసక్తి రాదు. దీనిని బట్టి సీతారాముల కలయికకు, విశ్వామిత్రుని యాగసంరక్షణకు ఏదో అలౌకికమైన సంబంధం ఉన్నట్లు తోచుతుంది. యాగం అనే నెపంతో ఆయన రామకార్యార్ధమై వచ్చాడని కులగురువులు వశిష్ఠుల వారు దశరథునికి సూచనప్రాయంగా ఈ విషయం చెబుతాడు. ఈ రహస్యాన్ని తనంతట తాను విప్పి చెప్పటం ఇష్టం లేకనే విశ్వామిత్రుడు దశరథునితో అంటాడు - "మీ కుమారుడు ఎంతటి మహనీయుడో నాకు తెలుసు, అతనిలో దాగియున్న సత్య పరాక్రమాన్ని మీ వాత్సల్యం అవగాహనం చేసుకోలేకుండా ఉన్నది. కావాలంటే వశిష్ఠుణ్ణి లేదా మరో తపస్సంపన్నుణ్ణి అడుగు. వాళ్లకు తెలుసు" అని అంటాడు.

అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం
వశిష్ఠశ్చాపి ధర్మాత్మా యేచేమే తపసి స్థితాః

సీతారాముల కల్యాణమే విశ్వామిత్రుని ధ్యేయం. మధ్యలో యాగ సంరక్షణ, రాక్షస వధ, అహల్యా శాపవిమోచనం అన్నీ ఈ పరమ కల్యాణ సంరంభానికి హంగులు. తమోగుణ ప్రధానమైన తాటకను సంహరించి, రజోలీనయై అదృశ్యగానున్న అహల్యను ఆవిష్కరించి, నిత్య సత్య సందీప్తమైన సాత్త్విక తేజస్సుతో అయోనిజగా జనకుని వాత్సల్యంతో పెరుగుతున్న జానకిని చేపట్టటమే రామభద్రుడు విశ్వామిత్రుని అనుసరించటంలో సాధించిన సత్త్వసిద్ధి. విశ్వామిత్రుడు గాయత్రీమంత్ర ద్రష్ట. రామాయణం గాయత్రీ బీజ సంహిత. ఇరవై నాలువు వేల శ్లోకాలలో వేదమాతను బీజరూపంగా ప్రతిబింబింపజేసిన వాల్మీకి రచనకు మూలాధారం విశ్వామిత్రుని పాత్ర. ఈ మహర్షి సాధించిన సీతారామ సమాగమం సీతాసమేత అయిన రాముని అయనానికి మొదటి మెట్టు.

జనకుడు
=======

ఈ సమాగంలో రహస్యం, దీనికి గల ప్రాశస్త్యం జనకుడు పాణిగ్రహణ సందర్భంలో సూత్రప్రాయంగా సూచిస్తాడు. రామభద్రునికి సీతమ్మను అప్పగిస్తూ, ఆ రాజర్షి అన్న మాటలు మంత్రభావంతో మననం చేయదగినవి.

ఇయం సీతా మమ సుతా సహధర్మచరీ తవ
ప్రతీచ్ఛ చైనాం భద్రం తే పాణిం గృహ్ణీష్వ పాణినా

ఇదిగో మా అమ్మాయి సీత, నీకు ధర్మకార్య నిర్వహణలో సహచరిగా ఉపకరిస్తుంది. ఈమెను స్వీకరిస్తే నీకు శుభం చేకూరుతుంది, ఈమెను పాణిగ్రహణం చేసి చేదోడు వాదోడుగా జీవితం సాగించండి. ఇదీ జనకుని సందేశ సారం. ఇందులో రామాయణ మహాయనమంతా సూక్షంగా గోచరిస్తుంది. వాల్మీకి వర్ణించిన సీతాకల్యాణ ఘట్టానికి ప్రాణప్రాయమైనది ఈ శ్లోకం. మొదటి పంక్తిలో ఇయం (ఈమె), మమ (నా), తవ (నీ) మూడు సర్వనామాలున్నాయి. ఇవి కేవలం సీత, జనకుడు, రాముడికే కాక జీవధానిలోని జీవధారులందరికీ వర్తించే సర్వనామాలు. మా అమ్మాయి సీత, మా ఇంట్లో పెరిగి మీ ఇంటికి వెళుతున్నది, ఎందుకు? ధర్మం నిలబెట్టేందుకు. ఈమె యందు నీకు పరిపూర్ణమైన అనురాగం (ఇచ్ఛ) ఉంటే నీకు శుభం కలుగుతుంది. ఎన్ని చిక్కులు వచ్చినా, ఎన్ని ఆపదలు ముంచుకు వచ్చినా మీ యిరువురి మధ్య ఈ ఇచ్ఛాశక్తి దృఢంగా ఉంటే మీకేమి అపాయం లేదు, ఇచ్ఛకు, ప్రతీచ్ఛకు మధ్య చిన్న పెద్దలు, హెచ్చు తగ్గులు, హాని వృద్ధులు ఉండేందుకు అవకాశం లేదు. సమరస భావం సహచరుల జీవితానికి సంతోషం, సార్థకత సమకూర్చగలుగుతుంది అని జనకుని భావం. సాక్షాత్తూ జగన్మాత తన యింట పెరిగినందుకు, అలాంటి సీతమ్మను పరమేష్ఠి స్వరూపుడైన రాముని చేతుల్లో పెడుతూ జనకుడు ఎంతగా ఏ దిక్కున పొంగిపోయి ఉంటాడో "మమ సుతా" అనే వాక్యం చెబుతుంది. "ఇయం సీతా" అనటంలో సీతాదేవి పుట్టుపూర్వోత్తరాలు, "తవ" అన్న మాటలో దశరథనందనుని ఘనత వేయి విధాల వ్యక్తమవుతున్నట్లు భావించాలి.

శ్రీ గురుభ్యోనమః. శ్రీసీతారామచంద్ర పరబ్రహ్మణే నమః.

25, జులై 2020, శనివారం

సారసాక్షిసదా పాహి మాం - శ్యామశాస్త్రి


సారసాక్షి! సదా పాహి మాం! కుమార జనని! సరస హృదయే!
పరాశక్తి! బాలే! సుశీలే! అపార మహిమా స్ఫూర్తే! శివే!

కోటి సూర్య ప్రభే! కోమలే! త్రికోణ నిలయే! కనక సదృశే!
కటి ధృత కాంచే! సలీలే! ప్రకాశ సుగుణ కీర్తే! ఉమే!

శ్యామ కృష్ణ నుతే! శ్యామలే! శ్రీ కామకోటి పీఠ సదనే!
సామగానలోలే! సుశోభే! విశాల హృదయ మూర్తే! శుభే!

కలువల వంటి కన్నులు గల కుమారస్వామి జననీ! కరుణా హృదయము కల పరాశక్తీ! బాలాత్రిపురసుందరీ! సుగుణవతీ! అపారమైన మహిమలను కురిపించే శివానీ! నన్ను ఎల్లప్పుడూ కాపాడుము. కోటి సూర్యకాంతులతో, కోమలమై, త్రికోణములో నివసిస్తూ బంగారు కాంతితో యున్న, కటి భాగమున మ్రోగే గజ్జలను ధరించిన, లీలావినోదినియైన, సుగుణములు కలదానిగా ఎంతో ప్రఖ్యాతి గాంచిన ఓ ఉమా! నన్ను ఎల్లప్పుడూ కాపాడుము. నల్లని కృష్ణునిచే నుతించబడిన, కామకోటి పీఠములో నివసించే, సామగానమును ఆనందించే, అద్భుతముగా ప్రకాశించే, విశాలహృదయమునకు రూపమై సమస్త శుభములను కలిగించే శ్యామలా! నన్ను ఎల్లప్పుడూ కాపాడుము.

లలితాంబికాం చింతయామ్యహం - దీక్షితుల వారు



లలితాంబికాం చింతయామ్యహం
శ్రీ గురుగుహ పూజిత పరాంబికాం

త్రిలోక రాజ్ఞీం దీన రక్షిణీం
త్రికోణ వాసినీం భండ మర్దినీం

కలా రూపిణీం కాత్యాయనీం
కంజ లోచనీం కనక మాలినీం
పాలిత మంత్రిణ్యాది సమూహాం
పశుపతి హృదయానందకర మోహాం

కుమారస్వామిచే పూజించబడిన, పరదేవతయైన లలితాంబికను నేను ధ్యానించుచున్నాను. ముల్లోకములకు మహారాజ్ఞియైన, దీనులను రక్షించే, త్రికోణములో నివసించే, భండాసురుని వధించిన లలితాంబికను నేను ధ్యానించుచున్నాను. సకల కళలకు రూపమైన, కాత్యాయని అయిన, కలువల వంటి కన్నులు గల, బంగారు ఆభరణములు గల, మంత్రిణి మొదలైన దేవతా సమూహమును పాలించే, పరమశివుని హృదయానికి ఆనందం కలిగించి మురిపించే లలితాంబికను నేను ధ్యానించుచున్నాను.

- ముత్తుస్వామి దీక్షితుల వారు

కాత్యాయని అన్న అమ్మ నామానికి అద్భుతమైన వివరణ ఇచ్చారు కందాళై రామానుజాచార్యుల వారు. కతి అయనాని అస్య కాత్యాయని. కతి అంటే ఎన్ని, అయనము అంటే మార్గము. కతి అయనాని అంటే మోక్షానికి ఎన్ని దారులు? కర్మ, భక్తి, జ్ఞాన మార్గములలో ఉపాసన అనేవి ప్రధాన మార్గాలు. ఏ మార్గములలో ఆరాధించినా, నన్ను ఆరాధించి దుఃఖనివృత్తిచే ఆనందాన్ని పొందవచ్చు అన్న దానికి సంకేతం కాత్యాయని నామం.

సరసిజనాభ సోదరి - దీక్షితుల వారు


సరసిజనాభ సోదరి శంకరి పాహి మాం

వరదాభయ కరకమలే శరణాగత వత్సలే

పరంధామ ప్రకీర్తితే పశుపాశ విమోచితే
పన్నగాభరణ యుతే నాగగాంధారీ పూజితాబ్జపదే
సదానందితే సంపదే వర గురుగుహ జనని మద శమని
మహిషాసుర మర్దిని మందగమని మంగళవర ప్రదాయిని

శ్రీహరి సోదరివైన శంకరీ! నన్ను రక్షింపుము. వరద అభయ ముద్రలతో కమలములవంటి హస్తములు కలిగిన, శరణు కోరిన వారిపట్ల వాత్సల్యము చూపించే శంకరీ నన్ను రక్షింపుము. శ్రీహరిచే నుతించబడే, భవబంధముల నుండి విముక్తి కలిగించే, నాగాభరణమును ధరించే శివునితో కూడి యుండే, నాగగాంధారి రాగములో పూజించబడిన పాదములు కలిగిన, సచ్చిదానందమనే సంపదను కలిగించే, శ్రేష్ఠుడైన కుమారస్వామి జనని అయిన, రాక్షసులలో మదమును తొలగించే, మహిషాసురుని వధించిన, నెమ్మదిగా నడచే, మంగళకరమైన వరములను ప్రసాదించే శంకరీ నన్ను రక్షింపుము.

పాహిమాం శ్రీ రాజరాజేశ్వరి - మహావైద్యనాథ అయ్యరు


పాహిమాం శ్రీ రాజరాజేశ్వరి కృపాకరి శంకరి

ఏహి సుఖం దేహి సింహవాహిని దయాప్రవాహిని మోహిని

భండ చండ ముండ ఖండని మహిష భంజని రంజని నిరంజని
పండిత శ్రీ గుహదాస పోషణి సుభాషిణి రిపు భీషణి వర భూషణి

కృపను ప్రసాదించే ఓ శాంకరీ! రాజరాజేశ్వరీ! నన్ను రక్షింపుము. సింహవాహినివై దయను ప్రవహింపజేసే మోహినీ, నాకు సుఖమును ప్రసాదించుము. భండ, చండ, ముండాసురులను, మహిషాసురుని సంహరించి లోకములకు ఆనందము కలిగించిన నిర్మలమైన తల్లీ! పండితుడైన శ్రీగుహదాసుని పోషించే తల్లీ! మంచి వాక్కు గలిగిన మాతా! శత్రువులను పారద్రోలి వరములనొసగే రాజరాజేశ్వరీ! నన్ను రక్షింపుము.

- మహావైద్యనాథ అయ్యరు

అద్భుతాలు - పరమాచార్యుల అభిప్రాయం



సనాతన ధర్మంలో అనేకులైన మహనీయులు, గురువులు, సన్యాసులు ఎన్నో అద్భుతాలను లీలలుగా చేసి చూపించారు. నేటి కాలంలో చాలామందిని వేధించే ప్రశ్న ఆ అద్భుతాలు అవసరమా? అవి నిజమా? ప్రజలను మోసం చేసేవా? దీని గురించి పరమాచార్యుల వారి అభిప్రాయమేమిటి? ఎస్. బాలకృష్ణన్ గారు 1930 దశకం నుండి పరమాచార్యుల వారి భక్తులు. ఆయన ఒకసారి ఒక చిన్న సమూహంలో దీని గురించి చెప్పిన సమాధానాన్ని మనకు వివరించారు.

"ప్రజలకు అనేకానేక కామ్యములు. అవి తీర్చుకోవటానికి ఇలాంటి అద్భుతాలు చేసే వారి వద్దకు వెళుతూ ఉంటారు. అసలు అద్భుతాలు ఎవరు చేయగలరు? సిద్ధి పొందిన వారు మాత్రమే. ఇక్కడ రెండు ప్రయోజనాలున్నాయి - ఒకటి ఆ వ్యక్తి తాను ఉపాసన చేసిన దేవతపై మరింత మందికి నమ్మకం కలిగించటం, రెండవది ఆర్తులైన వారి కామ్యము/సమస్యను తీర్చటం. రెండూ కూడా మానవ జన్మ ఎత్తినందుకు సహజమైనవే, అద్భుతాల ద్వారా అటువంటివి తీరటం కూడా సబబే. సమస్యల్లా 1. అది ఆ వ్యక్తులు చేశారనుకోవటం 2. ఆ వ్యక్తులు అలా సిద్ధుల ప్రదర్శన వద్దే ఆగిపోవటం.

మరి దీనిని ఎలా అర్థం చేసుకోవాలి?

1. ఎవరు ఏ సిద్ధిని ఉపయోగించి ఎటువంటి అద్భుతాలు చేసినా, అది పూర్తిగా పరమాత్మ లీలగానే భావించాలి. ఒక వ్యక్తి యొక్క గొప్పతనంగా భావించరాదు. ఆ వ్యక్తి రూపంలో పరమాత్మ ఉన్నాడని, ఒక పెద్ద కారణం చేతనే అలా అద్భుతాలు చేయబడుతున్నాయని భావించి తీరాలి. అప్పుడే మానవీయ పరిధిని దాటి ఆ అద్భుతాలను పరిశీలించగలము.

2. సిద్ధులు అనేవి ఆధ్యాత్మిక మార్గంలో సహజంగా కలిగే ఫలితాలు. వాటిలోనే మునిగిపోతే ఆధ్యాత్మిక ప్రయాణం ఆగిపోయినట్లే. సమాజ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని, దాని శ్రేయస్సు కోసం, వ్యక్తిగత అభ్యున్నతి కోసం సిద్ధులను దాటి ప్రయాణించగలగాలి, అటువంటి వ్యక్తుల వద్దకు వెళ్లే వారికి కూడా అదే ప్రధాన ఆకర్షణ కారాదు. ఒక వ్యక్తి సిద్ధులను సాధించగలిగాడంటే అతను మరింత ఎంత సాధించగలడో అన్నది ఆలోచించి శాశ్వతమైన ఆనందం కోసం పాటుపడే పరిస్థితులను ఆ వ్యక్తి, అతని వద్దకు సమస్యలతో వెళ్లే వారు కలిగించాలి. తప్పకుండా సిద్ధులు కలిగిన మానవులు ఇతరుల కన్నా ఆధ్యాత్మికంగా ముందున్నట్లే. కానీ, అక్కడే ఆగిపోకూడదు, అవే పరమావధి కారాదు. "

మరి పరమాచార్యులు ఏమి చేశారు? అద్భుతాలను అర్హులైన వారికి అనుభూతులుగా అందజేశారు, వాటిని స్వయంగా బహిర్గతం చేయలేదు, ప్రచారం కూడా చేయలేదు. దీనికి ఒక చిన్న ఉదాహరణ. ఒక స్త్రీ ఎన్నో సమస్యలలో ఉండి స్వామి వారి వద్దకు వచ్చి వేడుకుంది. స్వామి ఆమెకు ఒక గంధపు ముద్దనిచ్చి దానిని కామాక్షీ అమ్మ రూపంగా నమ్మకంతో, విశ్వాసంతో ఆరాధించమన్నారు. ఆమె అలాగే చేసింది. ఆమె చూపిన నమ్మకానికి, భక్తికి ఆ గంధపు ముద్ద కొన్నాళ్లకు అమ్మ రూపంగా పరిణామం చెందసాగింది, ముఖము, చెవులు, ముక్కు, కాళ్లు, చేతులు ఆకృతులు ఆ గంధంలో ఉద్భవించాయి. ఆమె సమస్యలు తీరాయి. ఇక్కడ అద్భుతం ఎవరిది? ఆలోచిస్తే మనం నేడు ఎదుర్కుంటున్న విపరీతాలకు సమాధానం దొరుకుతుంది.

శ్రీ చంద్రశేఖర గురోర్భగవాన్ శరణ్యే!

(కామకోటి పీఠం వెబ్‌సైట్ మరియు ఇతర మూలల నుండి అనువాదం)

అంతయు నీవే హరి పుండరీకాక్ష - అన్నమాచార్యుల వారు


అంతయు నీవే హరి పుండరీకాక్ష చెంత నాకు నీవే శ్రీరఘురామ

కులమును నీవే గోవిందుడా నా కలిమియు నీవే కరుణానిధి
తలపును నీవే ధరణీధర నా నెలవును నీవే నీరజనాభ

తనువును నీవే దామోదర నా మనికియు నీవే మధుసూదన
వినికియు నీవే విఠ్ఠలుడా నా వెనకముందు నీవే విష్ణు దేవుడా

పుట్టుగు నీవే పురుషోత్తమ కొన నట్టనడుము నీవే నారాయణ
ఇట్టే శ్రీవేంకటేశ్వరుడా నాకు నెట్టన గతి ఇంక నీవే నీవే

కలువలు వంటి కన్నులు గల శ్రీరామా! ఈ విశ్వమంతా నీవే, నాకు చెంతననున్నది నీవే. కరుణకు నెలవైన ఓ గోవిందా! నా కులము, నీవే. భూదేవిని ధరించే శ్రీహరీ! నా తలపులు నీవే. కమలనాభా! నీవే నా నెలవు. ఓ దామోదరా! నా శరీరము నీవే. మధుసూదనా! నా నివాసము నీవే. ఓ విఠ్ఠలుడా! నా మాటలు ఆలకించేది నీవే. విష్ణుదేవా! నా ముందు వెనుక రక్షణ నీవే. ఓ పురుషోత్తమా! పుట్టుక నీవే. ఓ నారాయణా! జీవనము, అంతము నీవే. ఓ శ్రీవేంకటేశ్వరా! నాకు పరమగతి ఇంక నీవే!

- తాళ్లపాక అన్నమాచార్యుల వారు

శృంగేరి శారదా పీఠం 12వ జగద్గురువులు విద్యారణ్య మహాస్వామి


అవిద్యారణ్యకాంతారే భ్రమతాం ప్రాణినాం సదా
విద్యామార్గోపదేష్టారం విద్యారణ్యగురుం శ్రయే

అవిద్య (అజ్ఞానం) అనే అరణ్యంలో తిరుగాడే జీవికి ఎల్లప్పుడూ విద్యను ప్రసాదించి మార్గదర్శకులైన విద్యారణ్య గురువులకు నమస్కరించుచున్నాను.

విద్యారణ్య మహాస్వామి - శృంగేరి శారదా పీఠం 12వ జగద్గురువులు. వీరు శంకర భగవద్పాదుల తరువాత దాదాపు 500 ఏళ్ల తరువాత జన్మించిన వారు. శంకరుల తరువాత భారతదేశంలో ఆధ్యాత్మికంగా మహోన్నత శిఖరాలకు తీసుకు వెళ్లి ప్రజలకు పాలకులకు మార్గదర్శకమై నిలిచారు. వీరే విజయనగర సామ్రాజ్య స్థాపకులైన హరిహర బుక్కరాయలకు గురువులు. సామ్రాజ్యంలో ధర్మం నిలబడటానికి, పాలకులు ధర్మబద్ధులై ఉండటానికి విద్యారణ్యుల వారే కారకులు. వీరు శృంగేరి మరియు హంపీలలో క్షేత్రాలను నిర్మించి అభివృద్ధి చేశారు. శృంగేరిలోని విద్యాశంకర మరియు శారదాంబ దేవస్థానాలు వీరి పీఠాధిపత్యంలో నిర్మించినవే. వీరు రచించిన వేదాంత పంచదశీ మరియు జీవన్ముక్త వివేక భాష్యాలు అద్వైత పరంపరలో గురువులకు మార్గదర్శకమై నిలిచాయి. శృంగేరిలో ఉన్న శాసనాల ప్రకారం వీరు ఏకశిలా నగరంలో (ఓరుగల్లు/వరంగల్ ప్రాంతం) జన్మించిన వారు. దక్కన్ సుల్తానులను తరిమి హైందవం నిలపటానికి హరిహర బుక్కరాయలచే విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపింపజేశారు విద్యారణ్యులు.

విద్యారణ్యుల అసలు పేరు మాధవ. వీరి తమ్ముడు జ్ఞానం కోసం దేశ సంచారం చేస్తూ శృంగేరి చేరుకుని అక్కడి పీఠాధిపతి అయిన విద్యాశంకర భారతీస్వామి వారి కలుస్తాడు. స్వామి అతనిలోని జిజ్ఞాసకు సంతోషించి సన్యాసమిచ్చి భారతీకృష్ణ తీర్థగా నామకరణం చేశారు. తమ్మునికై వెదకుతూ మాధవుడు శృంగేరి చేరుకుని విద్యాశంకర భారతీస్వామి వారిని కలిసి అక్కడే ఉంటాడు. కొన్నాళ్లకు పీఠాధిపతులు అతనికి మాధవ సన్యాస దీక్షనిచ్చారు. శ్రీవిద్యారణ్యులుగా నామకరణం చేశారు. గురువుల ఆదేశంతో విద్యారణ్యులు కాశీ వెళ్లి విద్యాధ్యయనం చేశారు. తరువాత బదరిలో శ్రీవిద్యా ఉపాసన చేశారు. అక్కడి నుండి హంపీ సమీపంలో ఉన్న మతంగ పర్వతంపై తపస్సు చేస్తున్నప్పుడు మాధవ మరియు శాయన అనే ఇద్దరు సోదరులు వారి వద్దకు వస్తారు. వారిని ఆశీర్వదించి తాను వ్రాస్తున్న వేద భాష్యాలను పూర్తి చేయవలసిందిగా చెబుతారు. అవే తదుపరి కాలంలో మాధవీయం, శాయనీయంగా పేరొందాయి. వీరిద్దరు హరిహర బుక్కరాయల వద్ద మంత్రులుగా పనిచేశారు.

విద్యారణ్యులు పరాశర మాధవీయ, సర్వదర్శనసంగ్రహ, జైమినీయ న్యాయమాల, పరాశరస్మృతి వ్యాఖ్యాన, స్మృతి సంగ్రహ, వ్యవహార మాధవ, శ్రీ విద్యాతీర్థ దీపిక, వివరణప్రమేయ సంగ్రహ, దృక్ దృశ్య వివేక, అపరోక్షానుభూతి టీకా, ఆరు ఉపనిషద్దీపికలు అనే అద్భుతమైన రచనలు కూడా చేశారు. వీరి పంచదశీ నేటికి ప్రామాణికమే. వివేక, దీప, ఆనంద అనే మూడు భాగాలు కలిగిన ఈ భాష్యం ఆదిశంకరుల తత్త్వాన్ని విశదీకరించి ఆధ్యాత్మిక జ్యోతులు శాశ్వతమై వెలిగేలా చేసింది. అలాగే, వీరు మాధవీయ శంకరవిజయమనే గ్రంథాన్ని రచించారు. అది సంక్షిప్తంగా ఆదిశంకరుల జీవితచరిత్ర. మిమాంస సూత్రములపై కూడా భాష్యం రచించారు. వీరే మాధవాచార్యులుగా కూడా పేరొందారు.

విద్యారణ్యుల సోదరులు భారతీకృష్ణ తీర్థులు తొలుత శృంగేరి శారదాపీఠాధిపతిగా ఉండి సిద్ధి పొందిన తరువాత విద్యారణ్యులు పీఠాధిపత్యాన్ని స్వీకరించారు. అనేక దేవాలయాలు వీరి హయాంలోనే నిర్మించబడ్డాయి. ఆధ్యాత్మికంగా ఆదిశంకరుల తరువాత హైందవం మహోన్నతమైన ప్రాభవం పొందింది విద్యారణ్యుల పీఠాధిపత్యంలోనే అని చెప్పవచ్చు. నేడు ఉన్న శ్రీచక్రార్చన విధి విధానం విద్యారణ్యుల వారి చలవే. అందుకు ఈ జాతి వారికి ఎంతో ఋణపడి ఉంది.

(శృంగేరి శారదా పీఠం వారి వెబ్ సైట్ నుండి)

శ్రుతులెందుకు? - చంద్రశేఖర భారతీస్వామి వారు


ధర్మానుష్ఠానమే ఉత్తమ ప్రమాణాలు గల జీవితానికి మార్గం. ఆ అనుష్ఠానానికి, మంచి చెడుల విచక్షణకు సూచికలు ఈ వాఙ్మయం. స్మృతులు, శ్రుతులలో ఉన్నవి దైవసంకల్పితమైనవి, ఈ విశ్వానికి మార్గదర్శకమైనవి. అనంతకోటి విలక్షణమైన జీవరాశులతో ఉన్న ఈ అద్భుత విశ్వాన్ని చూస్తే మనకొక విషయం అర్థం కావాలి - పరమాత్మ అత్యంత శక్తిమంతుడు, అన్నిటా ఉన్నవాడు. ఆయన విచక్షణ అత్యుత్తమమైనది, సత్యమైనది అన్న దానికి ఒక చిన్న కథ.

ఒక యాత్రికుడు ఒకసారి దారిపక్కనే ఉన్న మఱ్ఱిచెట్టు నీడన నిద్రపోవాలనుకుని విశ్రమించాడు. ఆ పెద్ద చెట్టు, దానికున్న చిన్న చిన్న పండ్లు చూసి ఇలా అనుకున్నాడు - "ఒక చిన్న తీగ ఎంత పెద్ద గుమ్మడి కాయలనిస్తుంది, ఇంత పెద్ద చెట్టు చిన్న చిన్న పండ్లనివ్వటమేమిటి? వృక్షము, ఫలాలు సరైన నిష్పత్తిలో ఉండాలి కదా. దేవుడు ఈ సృష్టిని మరింత బాగా చేసి ఉండవచ్చు" అనుకున్నాడు. ఆ ఆలోచనతోనే నిద్రపోయాడు. నిద్రలేచి చూసే సరికి ఆ చిన్న చిన్న పండ్లు రాలి తన శరీరం అంతా కప్పబడి ఉండటం చూసి పరమాత్మ సృష్టిలోని అద్భుతాన్ని గ్రహించాడు. నీడనిచ్చి సేదతీర్చే మఱ్ఱిచెట్టు గనుక తన పరిమాణానికి తగ్గ పండ్లిస్తే తన లాగా నిద్రబోయే యాత్రికుల గతి ఏమిటి? తన అజ్ఞానానికి సిగ్గుపడి పరమాత్మకు ప్రణమిల్లాడు.

ఇలాగ, ఈ సృష్టిలో ఎన్నో విషయాలు మానవుని మేధస్సుకు అందనివి, మంచి చెడు అనేవి మనం నిర్ణయించినంత తేలిగ్గా చెప్పబడేవి కావు. అటువంటి విచక్షణ చేసుకోవటానికి మార్గదర్శకానికే మనకు ఈ వాఙ్మయం అవసరం.

-శృంగేరి పీఠాధిపతులు చంద్రశేఖర భారతీస్వామి వారు (1892-1954)

నాద తనుమనిశం శంకరం - త్యాగరాజస్వామి


నాద తనుమనిశం శంకరం నమామి మే మనసా శిరసా

మోదకర నిగమోత్తమ సామవేద సారం వారం వారం

సద్యోజాతాది పంచవక్త్రజ సరిగమపదని వర సప్తస్వర
విద్యాలోలం విదళిత కాలం విమల హృదయ త్యాగరాజపాలం

ప్రణవ నాదమునే తనువుగా గల ఓ శంకరా! నీకు ఎల్లప్పుడూ మనసా శిరసా నమస్కరించుచున్నాను. ఆనందకరమైన వేదములలో శ్రేష్ఠమైన సామవేద సారమైన సంగీతమునకు ఆత్మయైన శంకరా నీకు మరల మరల నమస్కరించుచున్నాను. సద్యోజాత వామదేవ ఈశాన తత్పురుష అఘోర ముఖములనుండి సాంబ పార్వతీ హృదయములనుండి వెలువడిన సప్తస్వరముల సారమైన సంగీత విద్యకు నీవులు లోలుడవు, యముని జయించినవాడవు, సాధు హృదయుడైన త్యాగరాజుని పాలించేవాడవు నీవు. నీకు ఎల్లప్పుడూ మనసా శిరసా నమస్కరించుచున్నాను.

(సాంబుని హృదయము నుండి షడ్జమము (స), శివుని తత్పురుష ముఖము నుండి రిషభము (రి), అఘోర ముఖము నుండి గాంధారము (గ), వామదేవ ముఖము నుండి మధ్యమము (మ), గౌరి హృదయము నుండి పంచమము (ప), శివుని సద్యోజాత ముఖము నుండి దైవతము (ద), ఈశాన ముఖము నుంది నిషాదము (ని) వెలువడినట్లు వేదోక్తము)

పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో - - భద్రాచల రామదాసు


పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో
పాహి భద్రాద్రి వైదేహి రామ ప్రభో

ఇందిరా హృదయారవిందాధిరూఢ
సుందరాకారనానంద రామప్రభో
ఎందునే చూడ మీ సుందరానందము
కందునో కన్నులింపొంద రామప్రభో

బృందారకాది బృందార్చిత పదార
విందముల సందర్శితానంద రామప్రభో
తల్లివి నీవె మా తండ్రివి నీవె
మా దాతవు నీవు మా భ్రాత రామప్రభో

నీదు బాణంబులను నాదు శతృల బట్టి
బాధింపకున్నావదేమి రామప్రభో
ఆదిమధ్యాంత బహిరంతరాత్ముండనుచు
వాదింతునే జగన్నాథ రామప్రభో

శ్రీరామరామేతి శ్రేష్ఠ మంత్రము
సారె సారెకును వింతగా చదువు రామప్రభో
శ్రీరామ నీ నామ చింతనామృత పాన
సారమే నాదు మది గోరు రామప్రభో

కలికి రూపము దాల్చి కలియుగంబున నీవు
వెలసితివి భద్రాద్రి నిలయ రామప్రభో
అవ్యయుడవైన ఈ అవతారములవలన
దివ్యులైనారు మునులయ్య రామప్రభో

పాహి శ్రీరామ నీ పాద పద్మాశ్రయుల
పాలింపుమా భద్రశైల రామప్రభో
పాహి రామప్రభో పాహి రామప్రభో
పాహి భద్రాద్రి వైదేహి రామప్రభో

ఓ భద్రాద్రి సీతారామచంద్ర ప్రభో! పాహి పాహి! లక్ష్మీదేవి హృదయమునకు అధిష్ఠానమై, సుందరాకారుడవైన ఆనందారామా! పాహి పాహి. ఏ సుందర రూపము కాంచినంత కన్నులకు అమితమైన ఆనందము కలుగునో ఆ రూపమును కలిగిన శ్రీరామా! పాహి పాహి. దేవతలు మొదలైన బృదములు పూజించే పాదారవిందములు కలిగి, సందర్శించే వారికి ఆనందము కలిగించే రామచంద్రప్రభో! మా తల్లి దండ్రి దాత మరియు సోదరుడవు నీవే రామచంద్ర ప్రభో! పాహి పాహి. నీ బాణములచేత మా శతృవులైన అరిషడ్వర్గములను పట్టి బాధించుకుండా యున్నావేమి రామ ప్రభో! ఆది, మధ్య, అంత్యము, బాహ్యము, అంతరాత్మ అన్నీ నీవే అని వాదించుచున్నాను రామచంద్రప్రభో! పాహి పాహి. శ్రీరామ రామ అనే శ్రేష్టమైన మంత్రమును మాటిమాటికి చదువుతున్నాము రామచంద్ర ప్రభో. ఓ శ్రీరామచంద్రా! నీ నామస్మరణ అనే అమృతమును పానము యొక్క సారమే నా మనసు కోరుచున్నది, పాహి పాహి. అందమైన రూపముతో ఈ కలియుగములో భద్రగిరిపై వెలసినావు రాంచంద్ర ప్రభో! నాశనములేని నీ అవతారముల వలన మునులందరూ దివ్యత్వమును పొందినారు, రామచంద్రప్రభో పాహి పాహి. ఓ శ్రీరామా! నీ పాదపద్మములను ఆశ్రయించినవారిని పాలింపుము,ఓ భద్రాద్రి సీతారామచంద్ర ప్రభో! పాహి పాహి!

ధర్మం - ఎందుకు?


ఆహార నిద్రా భయం మైథునం చ సమానమేతత్ పశుభిర్నరాణాం
ధర్మో హి తేషామధికో విశేషో ధర్మేణ హీనాః పశుభిస్సమానాః

ఆహారము, నిద్ర, భయము, దేహవాంఛలు పశువులకు, మానవులకు సమానమే. ధర్మాచరణ మాత్రమే ఈ రెండు రకాల జీవుల మధ్య తేడా. ధర్మ హీనుడైన మానవుడు పశువుతో సమానం.

- మహాభారతం

పశువులకు లేని ధర్మం మానవులకెందుకు? వివేకము, విచక్షణ కలిగి ఉన్నాడు కాబట్టి, దానిని దుర్వినియోగం చేసి ఆత్మ మరింత హీనమైన దేహధారణ చేయకుండా, ఉన్నతివైపు అడుగులు వేయటానికే ధర్మం. ఆ ధర్మమే లేకపోతే సమాజంలో ఎంతటి అరాచకముండేదో ఊహించండి. బలవంతుడు, ధనవంతుడు అయిన వానిదే పైచేయిగా మిగిలి మానవత్వమనేది లేకుండా పోయేది. వివేక విచక్షణలను ఆత్మ అనునది పరబ్రహ్మమునకు భేదమైనది కాదని తెలుసుకొనుటకు వినియోగించాలి తప్ప, ఇతరులను అవమానించి హింసించి వాంఛలను తీర్చుకుని రాక్షసత్వం పెంచుకోవటానికి కాదు.

ఇప్పుడు సమాజంలో జరుగుతున్న దారుణాలకు కారణం ఈ ధర్మ భ్రష్టుత్వమే. పురుషులు విద్యావినయ సంపన్నులై ధర్మపరాయణులై కఠినమైన శ్రమతో స్వీయోద్ధరణ, సమాజోద్ధరణ చేయకుండా పూర్తిగా దేహవాంఛలకు, తాత్కాలికమైన ఆనందాలపై దుర్వినియోగం చేసి పతనమవుతున్నారు. స్త్రీలపై అత్యాచారాలతో పాటు సమాజంలో ఉన్న ఎన్నో సమస్యలకు పురుషులు ధర్మాన్ని నిర్వర్తించకపోవటమే కారణం.

ధర్మము సత్యము అనేవి విడదీయలేనివి. ఏది సమస్తభూతములకు హితమైనదో అదే సత్యమని, శిష్టులైన వారు, పెద్దల అభిమతమే ధర్మమని ఆదిశంకరుల అభిప్రాయం. మనకు ఋషిప్రోక్తమైనది అత్యంత శ్రేష్ఠమైనది. అవే వేదాలు. అందుకే వేదాచరణ చేస్తే ధర్మాచరణ జరిగినట్లే. సత్యాన్వేషణ అక్కడే ఆరంభం. ఇతర వాఙ్మయాలు ధర్మాచరణకు సాధనాలు.

ధర్మాన్ని విస్మరించి, పశువులలా హీనులమవుదామా? లేక వీలైనంత ఆచరించి మరింత ఉన్నతమైన జన్మను పొందుదామా? అన్నది మన చేతిలోనే ఉంది. ధర్మాచరణ ధర్మ రక్షణలో ముఖ్యమైన భాగం. ముందు ఆచరణ జరిగితే తరువాత ప్రచారం. ధర్మాచరణ చేస్తేనే పరధర్మాల నుండి కలిగే దాడులను సమర్థవంతంగా ఎదుర్కొని ధర్మ పరిరక్షణకు తోడ్పడగలం. నేడు క్రైస్తవం పేరుతో, నాస్తికత్వం పేరుతో జరుగుతున్న దుష్ప్రచారం కొనసాగటానికి కారణం మనలో ధర్మాచరణ లేకపొవటం, ధర్మంపై విశ్వాసం లేకపోవటం.

యతో ధర్మస్తతో జయః - ధర్మమెక్కడో అక్కడే జయము. ఇక్కడ జయమంటే ప్రధానంగా కర్మాచరణలో అని కాదు, ఆత్మోద్ధరణలో అని.

గీత - పంచమవేదం


గీత పంచమవేదంగా పరిగణించబడటానికి కారణం మానవునికి సమస్త పరిస్థితులయందు దిశానిర్దేశం చేయడంలో ఈ బోధ అత్యంత ప్రభావవంతమైనది కాబట్టే. కర్మ, భక్తి, జ్ఞాన, వైరాగ్యముల ద్వారా తానెవరో తెలుసుకునేందుకు రాచబాట భగవద్గీత. ఆచరించగలిగితే ప్రతి ఒక్క మానవుడూ శ్రీకృష్ణ పరమాత్మ కాగలడు. ఆచరించలేకపోయినా సత్యాసత్య విచక్షణ కొంతైనా కలిగియుండి సరైనా మార్గంలో మనలను నడిపించగలిగిన అద్భుతశక్తి ఈ జగద్గురు బోధ. పఠించగా పఠించగా విషయమవగతమై స్థితప్రజ్ఞత వైపు నడిపే మహోన్నత ఆధ్యాత్మిక సంపద భగవద్గీత. మనకు కావలసింది ఏమిటి? సుఖదుఃఖాల సమ్మేళనమైన జీవితంలో వీలైనంత ఆనందంగా ఉండగలిగే, వీగిపోని వ్యక్తిత్వమే కదా? అది 100% అందజేసేది ఈ బోధ.

పరమాత్మ చెప్పిన ఒక్క విషయం ఈ నాటి సమాజానికి చాలా ముఖ్యమైనది, మనందరిలోనూ లోటైనది - సమభావం. ఈ సమభావం కలిగిన వారు నాకు అత్యంత ప్రియులు అని ఆయన అనేక మార్లు గీతలో చెప్పారు. ఈరోజుల్లో సనాతన ధర్మ ఆచరిస్తున్నాము అనుకునే వారిలో మృగ్యమైనది ఈ సమభావం. నిరంతరము నేను గొప్ప వాడు తక్కువ అన్న వివక్షతో ఈ ప్రపంచంలో ఘోరమైన అసంతులన సృష్టిస్తున్నారు. అన్నీ ఆ సృష్టిలో ఓ ప్రత్యేకమైన పాత్ర కలవే అన్న సత్యాన్ని మారస్తున్నారు. అందుకే సనాతన ధర్మం అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంది. ఆలోచించి సత్యం తెలుసుకుంటేనే ఈ జాతికి మనుగడ.

ఇహైవతైర్జితైః సర్గో యేషాం సామ్యే స్థితం మనః
నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాద్ బ్రహ్మణి తే స్థితాః

ఎవరి మనసు సమభావమందు స్థిరమై యున్నదో అటువంటి వారు ఈ జన్మలోనే సమస్తమును జయించినవారగుదురు. అనగా ప్రాపంచిక విషయాతీత స్థితికి చేరుకొందురు. పరమాత్మ సముడు, దోషరహితుడు కావున అట్టి వారియందే స్థితుడగును.

- కర్మసన్న్యాస యోగం 19వ శ్లోకం

ఈ ప్రపంచాన్ని పీడిస్తున్న మరో పెద్ద సమస్య - నేను, నా వల్ల, నా వల్లనే అని విర్రవీగే అహంకారము. దాని కారణంగా సుఖము, దుఃఖములకు కారణం తెలుసుకోలేని అజ్ఞాన పరిస్థితి. కర్మలను ఫలాపేక్ష లేకుండా ఆచరించమని పరమాత్మ చెప్పినా, మనం నిత్యమూ చేసేది ఫలాపేక్షతోనే. అందుకే అహంకారప్రేరితమైన అరిషడ్వర్గాలు పేట్రేగి మానవత్వం నశించి రాక్షసత్వం తాండవిస్తోంది. ఎందుకు ఫలాపేక్ష లేకుండా కర్మలనాచరించమన్నాడో గీత చదివితే అర్థమవుతుంది. పాపక్షయానికి అదొక్కటే మార్గము.

బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః
లిప్యతే న స పాపేన పద్మపత్రమివాంభసా!

ఎవడు కర్మలనన్నిటినీ భగవదర్పణము చేసి ఫలాసక్త రహితముగా కర్మలనాచరించునో వాడు తామరాకుపై నీటిబిందువు వలె పాపములచే నంటబడడు.

-కర్మ సన్న్యాస యోగం 10వ శ్లోకం

మూడవ విషయం: మనలో అరిషడ్వర్గాలు ప్రకోపించటానికి కారణం కృష్ణ పరమాత్మ చక్కగా తెలిపాడు - విషయములను ఎక్కువ చింతన. ఇది ప్రతి క్షణం మనం చేస్తూనే ఉంటాము, చూస్తూనే ఉంటాము. కొందరికి రాజకీయం, కొందరికి రంధ్రాన్వేషణ, కొందరికి జాతీయవాదం, కొందరికి మూఢభక్తి, మరికొందరికి నాస్తికత. కావలసిన దానికన్నా ఎక్కువ సమయం ఓ విషయంపై వెచ్చిస్తే కలిగేవే అరిషడ్వర్గాలు. తద్వారా నాశనము.

ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే
సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే

క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః
స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః బుద్ధి నాశాత్ ప్రణశ్యతి

-సాంఖ్యయోగం (62,63 శ్లోకాలు)

విషయ చింతన ఎక్కువ చేయటం వలన ఆసక్తి కలుగును. ఆ ఆసక్తి వలన వానిని పొందే కోరిక కలుగును. ఆ కోరికలు తీరనప్పుడు క్రోధము కలుగును. ఆ క్రోధము అదుపు దాటినప్పుడు మోహము కలుగును. దాని ప్రభావముతో వివేకము నశించును, తద్వారా జ్ఞానశక్తి నశించును. దీని వలన మనుష్యుడు పతనమవుతున్నాడు. ఇది కఠోర సత్యం. తెలుసుకుంటే శాశ్వతానందం.

అన్నీ తెలిసిన సనాతన ధర్మవాదులు ఈ విషయాసక్తిలో చిక్కుకుని అసలు లక్ష్యానికి దూరమవుతున్నారు. జ్ఞానులు ధనకనక వస్తు వాహనములుపై ఆసక్తితో అధోగతి పాలవుతున్నారు. సన్న్యాసులు సామ్రాజ్యాలను ఏర్పరచుకునే వలలో చిక్కుకుని ప్రజల గౌరవాన్ని కోల్పోతున్నారు. మొత్తం సమాజమే భ్రష్టు పట్టే ప్రమాదం ఈ విషయాసక్తి మితి మీరడం వల్లన.

కృష్ణం వందే జగద్గురుం.🙏🏻🙏🏻

నామ స్మరణమెలా పనిచేస్తుంది?



కలియుగంలో పరమాత్మ నామ స్మరణం ముక్తికి మార్గం అన్నది ఆర్యోక్తి. నామం ఉచ్చరిస్తే పాపాలు తొలగుతాయా? అలా అయితే ఏ నామమైనా దేవుని నామమేగా? అలాంటప్పుడు ఏ పదాన్ని స్మరించి ఉచ్చరించినా పాపాలు పోవాలి కదా? ఇలాంటి ప్రశ్నలు నాస్తిక పిడివాదులు సనాతనధర్మాన్ని అనుసరించే వారిపై సంధిస్తూనే ఉంటారు. సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను.

అమ్మ - ఈ పదానికి ఉన్న పవిత్రత ఎక్కడి నుండి వచ్చింది? సగం దానిలోని అక్షరాల నుండి, మిగిలిన సగం ఆ పాత్రకు ఉన్న గొప్పతనం నుండి. అమ్మా అని పిలవకుండా ఆ మనిషిని ఇంకెంత గౌరవభావంతో పిలిచినా ఆ అమ్మదనానికి ఉన్న పవిత్రత రాదు కదా? అంటే ఏమిటి? ఇక్కడ భావనలో ఔన్నత్యానికి సాఫల్యతనిచ్చింది అమ్మ అనే పదం. ఆ పదంలోని అక్షరాల కూర్పు అలాంటిది. ప్రత్యక్ష దైవం అమ్మ కదా? అమ్మ అన్న పదంలో అంతటి మహత్తు ఉంటే, మరి విశ్వాంతర్యామి అయిన ఆయన నామంలో ఎంతటి మహత్తు ఉండాలి? వాటి రహస్యం ఏమిటి?

శబ్దం విశ్వజనీన శక్తికి ఓ అద్భుతమైన ప్రతిబింబం. శబ్దంతోనే ప్రకంపనలు, ప్రకంపనలతోనే భావాలు, భావాలతోనే సంకల్పం, సంకల్పంతోనే చూడలేనివి చూడగలగటం, అనుభూతి చెందలేనివి అనుభూతి చెందటం, ఊహకు అందనివి స్ఫురణకు రావటం. ఆ శబ్దాలు ఋషిప్రోక్తమైనప్పుడు వేదాలయ్యాయి. అలాగే దేవతా స్వరూపముల నామములు. అపురూపమైన, మహత్తరమైన, అర్థవంతమైన శబ్దాల కలయికతో ఏర్పడినవి నామాలు. నారాయణ కాని, రామ కాని, కృష్ణ కాని, గౌరి కాని, శివ కాని..మనకున్న దేవతాస్వరూపాల నామాలలోని శబ్దాల కలయికకు ఒక పరమార్థం ఉంది, వాటిని పఠించటం ద్వారా విలక్షణమైన ఫలితం కలిగి తీరుతుంది.

మరి విశ్వమంతటా పరమాత్మే ఉన్నప్పుడు కొన్ని శబ్దాలతో కూడిన నామాలకే ఎందుకా నామస్మరణ సాఫల్యం? అన్నిటికీ ఉండాలి కదా? అక్కడే భావం ముఖ్యం. దేవతా స్వరూపాన్ని, మనం తలచిన భావానికి, శబ్దానికి తీగలా అనుసంధానం చేసేది నామం. ప్రపంచంలో అన్ని శబ్దాలకూ అటువంటి శక్తి ఉండదు, తదనుగుణమైన భావం ఉప్పొంగదు. ఎలాగైతే అమ్మా అన్నప్పుడు అద్భుతమైన మాతృత్వం ఉప్పొంగి తల్లి హృదయం స్పందిస్తుందో, ఒసేయ్ అన్నప్పుడు దానికి పూర్తిగా విరుద్ధమైన భావనలు కలుగుతాయో, అలాగే నామాలు కూడా. ఇక్కడ సూక్ష్మం శబ్దాల ప్రకంపనలు మనలో ఎటువంటి భావాలను కలిగిస్తాయి అన్నది. ఎందుకలా? శబ్దాలు దేహంలోని కణాలను, గ్రంథులను జాగృతం చేస్తాయి. ఇది మనకు ఉచ్చ్వాస నిశ్శ్వాసలలోని సోహం శబ్దం ద్వారా నిరూపితమే. సోహం శబ్దం మనకు తెలియకుండా నిరంతరం దేహంలో ప్రయాణం చేస్తున్నంత వరకు దేహం ఆత్మకు ఆలవాలమవుతుంది, ఆగిన మరుక్షణం పార్థివమవుతుంది. అలాగే, దేవతల నామాల ఉచ్చరణ కూడా. ఆయా దేవతల లక్షణాలను బట్టి, నామాలను బట్టి విలక్షణమైన శబ్దాలు మన శరీరంలోని కణాలు, గ్రంథులు అంతే విలక్షణంగా జాగృతమై మన మనసులో పేరుకుని ఉన్న ఆలోచనలను కరగిస్తాయి, పొరలను పటాపంచలు చేస్తాయి. భావయుక్తమైన, పవిత్రమైన శబ్దాలతో కూడిన పదాలకు అంతటి శక్తి కలదు. ఇది శాస్త్రీయంగా నిరూపించబడింది.

మరి నామస్మరణ సఫలమెలా అవుతుంది? నమ్మకంతో, అచంచలమైన విశ్వాసంతో, దృఢ సంకల్పంతో. ఇవన్నీ కూడా భావాన్ని పరిపుష్టం చేసి శబ్ద ప్రకంపనలను దేహమంతా ప్రసరింపజేసి దేహాన్ని జాగృతం చేస్తాయి, హృదయ జ్యోతి చుట్టూ ఉన్న పొరలను తొలగిస్తాయి. నామస్మరణ మొదట యాంత్రికంగా జరిగినా అది ఒక క్రమశిక్షణకు, ఏకాగ్రతకు నాంది అవుతుంది. ఆ తరువాత శబ్ద ప్రకంపనలు దేహంలో మార్పులు తీసుకు వస్తాయి. నిరంతర నామస్మరణ వలన దేహం దేవాలయంగా మారుతుంది. జీవాత్మ ఉద్ధరించబడుతుంది, జనన మరణ చక్రాల నుండి బయటపడే మహద్భాగ్యాన్ని పొందుతుంది.

మరి కలిలో నామస్మరణే మార్గమని ఎందుకన్నారు?

యజ్ఞ యాగాదుల సాఫల్యానికి అనువైన పరిస్థితులు సృష్టించటం చాలా కష్టం కాబట్టి. కార్య నిర్వహణ, కర్తలలో సంకల్పబలం, స్థల సామాగ్రిలో పవిత్రత, పంచభూతములలో శుద్ధి ఇవన్నీ కలియుగంలో మృగ్యం కాబట్టే మునుపటి యుగాలలో జరిగిన క్రతువుల వంటివి ఈ యుగధర్మానికి ఆచరణయోగ్యం కాదు. కలిపురుషుని ప్రభావం చేత సమాజంలొ వచ్చే మార్పులను దృష్టిలో పెట్టుకునే నామస్మరణమనేది ఈ యుగంలో ముక్తికి మార్గంగా చెప్పారు.

ఇతడేనా ఈ లోకములో గల - భద్రాచల రామదాసు


ఇతడేనా ఈ లోకములో గల
పతితులనెల్లను పావనము చేయువాడు

పరిపూర్ణ కరుణచే బ్రహ్మాదుల గాచిన
నరసింహుడైనట్టి నళినదళేక్షణుడు

ఇల లంకాపురమున అవనిజను బ్రోవ
బలుడైన రావణుని పరిమార్చిన వాడు

అలనాడు ద్రౌపదికి అక్షయ వలువలు
వలనొప్ప వొసగిన వైకుంఠ వాసుడు

ఈవేళ మునివరులు ఇతర చింతలు మాని
కేవలము మది నుంచి కొలువుగాచెడి వాడు

ప్రేమను దయతోనాపన్నుల బ్రోచుచు
రామదాసునేలు రామచంద్ర విభుడు

ఈ లోకములో ఉన్న పాపాత్ములను పావనము చేసేవాడు ఇతడేనా! పరిపూర్ణమైన కరుణతో బ్రహ్మాది దేవతలను కాపాడుటకు నరసింహావతారమునెత్తిన కలువల వంటి కన్నులు కలవాడు ఇతడే. ఈ భువిపై లంకానగరములో భూమిజయైన సీతను కాపాడుటకు బలవంతుడైన రావణుని సంహరించినవాడు ఇతదే. ఆనాడు ద్రౌపది మానరక్షణకై అక్షయముగా చీరలు ఎంతో ఒప్పుగా ఒసగిన వైకుంఠవాసుడితడే. ఈనాడు మునిశ్రేష్ఠులు ఇతర ఆలోచనలు మాని మనసులో నిలుపుకుని కొలిచెడి వాడు ఇతడే. ప్రేమతో దయతో ఆపన్నులను బ్రోచుచు రామదాసును కాపాడే రామచంద్ర ప్రభువు ఇతడే.

సరోజదళనేత్రి హిమగిరి పుత్రి - శ్యామశాస్త్రి


సరోజదళనేత్రి హిమగిరి పుత్రి!
నీ పదాంబుజములె సదా నమ్మినానమ్మ! శుభమిమ్మా! శ్రీ మీనాక్షమ్మా!

పరాకు సేయకు వరదాయని నీవలె దైవము లోకములో గలదా
పురాణి శుకపాణి మధుకరవేణి సదాశివునికి రాణి

కోరి వచ్చిన వారికెల్లను కోర్కెలొసగే బిరుదు కదా అతి
భారమా నన్ను బ్రోవ తల్లి కృపాలవాల నే తాళ జాలనే

ఇందుముఖి కరుణించుమని నిన్నెంతో వేడుకొంటిని నా
యందు జాగేలనమ్మా మర్యాదగాదు దయావతి నీవు

సామగాన వినోదిని గుణధామ శ్యామకృష్ణనుతే శుక
శ్యామలాదేవి నీవే గతి రతికామకామ్యద కావవే నన్ను

ఓ మధుర మీనాక్షమ్మా! కలువలవంటి కన్నులు గలిగి హిమవంతుని పుత్రిక అయిన నీ పాదపద్మములను నేను ఎల్లప్పుడూ నమ్మియున్నాను, నాకు శుభములు కలిగించుము. సనాతనమైన తల్లివి, చిలుకను కరమందు కలిగి, తేనెటీల సమూహంవలె దట్టమైన కురులు యున్న సదాశివుని రాణివి వరదాయినివి నీవు, నీ వంటి దైవము ఈ లోకములో లేదు, నా పట్ల నిర్లక్ష్యం చూపకుము. కోరి నీ వద్దకు వారికందరికీ కామ్యములను తీర్చే తల్లివని నీవు ప్రఖ్యాతి గాంచినావు, నన్ను బ్రోచుటకు అంత భారమా తల్లీ! కరుణామయి! నే తాళలేను నన్ను కాపాడుము. చంద్రుని వంటి ముఖము కలిగిన తల్లీ! నన్ను కరుణించమని ఎంతో వేడుకున్నాను, నన్ను బ్రోచుటకు ఆలస్యమెందులకు, నీవు దయావతివి కదా, ఇది నీకు మర్యాద కాదు. సామగానమును ఆనందించే తల్లివి, సమస్త శుభలక్షణములకు ఆలవాలము నీవు, శ్యామకృష్ణునిచే నుతించబడినావు, నల్లని ఛాయ గలిగిన శ్యామలాదేవీ! నీవే నాకు గతి. రతీమన్మథులను అనుగ్రహించినట్లు నన్ను బ్రోవుము.

దిబ్బలు వెట్టుచు తేలినదిదివో- అన్నమాచార్యుల వారు


దిబ్బలు వెట్టుచు తేలినదిదివో ఉబ్బు నీటిపై ఒక హంస

అనువున కమలవిహారమె నెలవై ఒనరియున్నదిదె ఒక హంస
మనియెడి జీవుల మానస సరసుల వునికినున్నదిదె ఒక హంస

పాలు నీరు వేర్పరచి పాలలో ఓలలాడెనిదె ఒక హంస
పాలుపడిన యీ పరమహంసముల ఓలినున్నదిదె ఒక హంస

తడవి రోమరంధ్రంబుల గ్రుడ్లనుడుగక పొదిగీనొక హంస
కడు వేడుక వేంకటగిరి మీదట ఒడలు పెంచెనిదె ఒక హంస

కుప్పలు కుప్పలుగా ప్రకాశిస్తూ అలలపై ఆనందంగా తేలినదదిగో వటపత్రశాయియనెడి హంస! కలువలు కొలనులో విహరిస్తూ అక్కడే నివసించేది హంస, మానవుల మనసులనే సరస్సులలో నివసించే వాడు ఈ పరమాత్మయనే హంస. పాలు నీళ్లు వేరు చేసి పాలలో ఓలలాడేది హంస, మంచి చెడుల విచక్షణతో స్వాధీనమైన మనసులు గల పరమహంసల హృదయములలో ఓలి యున్నది ఈ పరమాత్మయనే హంస. ఎంతో జాగ్రత్తగా తన రోమములలోని రంధ్రముల మధ్య గుడ్లను పొదిగేది హంస, ఎంతో వేడుకగా వేంకటాద్రిపై వెలసి భక్తులకు ఆధారమై యున్నది ఈ పరమాత్మయనే హంస.

ప్రళయ విలయం తరువాత ప్రశాంత కడలిపై వటపత్రశాయియై చిరునవ్వులతో తేలి పునః సృష్టిని చేసిన వాడు శ్రీహరి. ఆ సృష్టిక్రమంలోనే కలియుగంలో ఏడుకొండలపై పరమాత్మ వెలశాడు. మంచి చెడుల విచక్షణలో నిరంతరం ధ్యానంలో ఉండే జీవి హంసతో సారూప్యంగా పరమాత్మ తత్త్వాన్ని ఆవిష్కరించారు అన్నమాచార్యుల వారు. మానససరోవరములో నివసించే హంసను పరమహంసలైన యోగుల మానస సరోవరములలో నివసించే పరమాత్మను పోల్చి మానవులకు పరమాత్మ యొక్క విశ్వవిరాట్ రూపాన్ని సూక్షంగా తెలియజేశారు. పాలు నీళ్లను విచక్షణ చేసి పాలను స్వీకరించేది హంస అయితే పాపపుణ్యముల విచక్షణ చేసి పుణ్యములను స్వీకరించి, పాపములను హరించి ముక్తినిచ్చేవాడు శ్రీనివాసుడు. తన శరీరములో గుడ్లను జాగ్రత్తగా పొదిగి సృష్టి క్రమాన్ని ముందుకు నడిపేది హంస ఐతే తన రోమ రోమము నుండి ప్రాణికోటిని పరిపుష్టం చేస్తూ అద్భుతమైన సృష్టిని కొనసాగించేవాడు పరమాత్మ అయిన శ్రీనివాసుడు. ఎంత మహత్తరమైన సారూప్యం కదా? అందుకే అన్నమాచార్యుల వారు సద్గురువులైనారు.

ఓం నమో వేంకటేశాయ!

గోపికలకు శ్రీకృష్ణుని సందేశం


కృష్ణుడు గోకులం వీడిన తరువాత మరల గోపికల చెంతకు భౌతికంగా వెళ్లలేదు. ఆ స్వామి సందర్శనముకై వేచి యున్న గోపికలు ఉద్ధవుని వద్ద స్వామి గురించి నిష్ఠూరాలు పలుకుతారు. అప్పుడు ఉద్ధవుడు కృష్ణుని సందేశం వినిపిస్తాడు.

ఎల్ల కార్యములకు నేను ప్రధాన కారణముగావున మీకు రమణులార
కలుగదు మద్వియోగ చరాచర రూపములలో మహాభూతములు వసించు
కరణి నుండుదు సర్వగతుడనై నే మనః ప్రాణబుద్ధి గణేందిర్యాశ్రయుండ
నాత్మయందాత్మచేనాత్మ బుట్టింతు రక్షితును ద్రుంతు హృషీక భూత

గణ గణాకారమాత్మకు గొమరు మిగులు
నిబిడ మాయానుభవమున నిత్య శుద్ధ
మాత్మ విజ్ఞానమయమునై యమరు గుణము
బ్రకృతి కార్యమనోవృత్తి బట్టిపొందు

జగత్తులో జరిగే సమస్త కార్యాలకు తానే కారణమంటూ ప్రతి కార్యములోనూ తనను దర్శించమని తెలిపాడు. చరాచర రూపాలన్నిటిలోనూ అంతర్గతంగా జీవం ఎలా ఉంటుందో అదే విధంగా తాను అన్నిటా చర్మచక్షువులకు కనిపించకుండా మనస్సు, ప్రాణము, బుద్ధి, గుణములు, ఇంద్రియములను ఆశ్రయించి ఉన్నానని చెబుతాడు. ఆత్మలో ఆత్మ ద్వారా ఆత్మను పుట్టించి రక్షించి త్రుంచెదనని తెలిపాడు. బాహ్యదృష్టి వీడి ఇంద్రియ నిగ్రహులై అంతర్ముఖులైనట్లయితే ఆత్మనే అంటి ఉన్న తనను దర్శించగలుగుతారని స్పష్టం చేశాడు.

ఒక విధంగా గోపికలకు కంటికి దూరమైన తనను ఆత్మలో దర్శించమనడంలో సగుణారాధనం నుండి నిర్గుణారాధనకు చేరుకునే స్థాయిని, స్థితిని తెలియజేశాడు. సాధకులు ఆరంభంలో తమ దృష్టికి ఆకర్షణీయమైన దేవతా స్వరూపాలను ఎంచుకుని దానిపై దృష్టిని కేంద్రీకరించి ఏకాగ్రతతో ధ్యానం చేస్తూ ఆలయాలకు పుణ్యక్షేత్రాలకు వెళ్లి ఆయా రూపాలను దర్శిస్తూ ఉండి రాను రాను కేవలం బాహ్య దృష్టికి మాత్రమే పరిమితం కాక ఆంతర్యంలో పరమాత్మ రూపాన్ని దర్శించగలిగే స్థాయికి చేరుకునే విధానం గోపికలు శ్రీకృష్ణుడు ఇచ్చాడు. కంటికి కనబడుతున్న వెలుగును అంతరాంతరాలలో నింపుకోగలగాలి. కంటికి కనబడేది సత్యమే అయినా అది శాశ్వతం కాదు. ఆ శాశ్వతం కాని దానిని అంతరంగంలో నిలుపుకుని శాశ్వతం చేసుకోవచ్చు. కనుకనే గోపికలతో ఎన్నో లీలలు చూపి మధురకు వెళ్లిన కృష్ణుడు తిరిగి ఎన్నడూ శారీరికంగా గోపికల దగ్గరకు బృందావనానికి రాలేదు.

ఎప్పుడూ నన్ను మీరలు చింతించుచునుండ గోరి యిటు దూరస్థత్వముంబొందితిం దలకం బోలదు నన్ను గూడెదరు నిత్యధ్యాన పారీణలై అని కృష్ణుడు గోపికలకు బోధిస్తాడు. కృష్ణుని సందేశాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నారు కనుకనే గోపికలు కృష్ణలీలలను మననం చేసుకుంటూ గడిపారు. అంతరంగంలో భగవంతుని ఏనాటికీ బంధించకపోతే సాధకుల సాధనకు అర్థం లేదు. అది సాధించిన వారు గోపికలు.

శ్రీకృష్ణపరమాత్మను ఊరకే జగద్గురుం అని బోధించలేదు. తల్లిదండ్రులకు, మిత్రులకు, సఖులకు, సతులకు, బంధుగణానికి, శత్రువులకు, సమస్త మానవాళికి ఎలా జీవించాలో ఎలా తరించాలో అద్భుతంగా బోధించి జగద్గురువైనాడు.

కులుకక నడవరో కొమ్మలాలా - అన్నమాచార్యుల వారు


అన్నమాచార్యుల వారు అమ్మవారిపై ఎన్నో కృతులను రచించారు, అందులో ఒకటి కులుకక నడవరో కొమ్మలాలా అన్నది ఒకటి. డాక్టర్ శోభారాజు గారు అద్భుతంగా ఆలపించిన కృతి ఇది. కుసుమ కోమలి అయిన అమ్మను జాగ్రత్తగా మోయమని అద్భుతంగా వర్ణించారు అన్నమయ్య.

కులుకక నడవరో కొమ్మలాలా
జలజల రాలీనీ జాజులు మాయమ్మకు

ఒయ్యనె మేను కదలీనొప్పుగా నడవరో
గయ్యాళి శ్రీపాద తాకు కాంతలాలా
పయ్యెద చెరగు జారి భారపు గుబ్బల మీద
అయ్యో చెమరించీ మాయమ్మకు నెన్నుదురు

చల్లడి గందవొడి మైజారి నిలువరో
పల్లకి పట్టిన ముద్దు పణతులారా
మొల్లమైన కుందనపు ముత్యాల కుచ్చులదర
ఘల్లనుచు కంకణాలు కదలీ మాయమ్మకు

జమళి ముత్యాల తోడి చమ్మాళిగలిడరో
రమణికి మణుల ఆరతులెత్తరో
అమరించి కౌగిట అలమేలుమంగనిదె
సమకూడె వేంకటేశ్వరుడు మాయమ్మకు

సఖులారా, అలమేలుమంగమ్మ ధరించిన జాజులు జల జలా రాలుతాయి, ఎక్కువగా కులుకకుండా నిదానంగా నడవండి. మృదువైన అమ్మ దేహమును నొప్పించకుండా మెల్లగా నడవండి. అమ్మ పాదాలను తాకే కాంతలారా,ఆమె పాదాలు నొచ్చుకుంటాయి,స్తన్యములపై నుండి చీర తొలగుతుంది, ఇప్పటికే అమ్మకు అలసటతో చెమటలు పట్టాయి,నెమ్మదిగా నడవండి. అమ్మ పల్లకీని మోసే ఓ అందమైన స్త్రీలారా! అమ్మపై చల్లని గంధపు పొడి చల్లి అలరించండి, అమ్మ ధరించిన బంగారు మరియు ముత్యాల సరులు కలిగిన చీర కుచ్చెలు అదరకుండా జాగ్రత్తగా మోయండి. అమ్మకు ముత్యాల వరుసలు కలిగిన పాదరక్షలు ధరింపజేసి, మణులతోటి హారతులు ఇవ్వండి, ఎంతో అందముగా అమ్మను శ్రీనివాసుడు కౌగిట చేర్చుకున్నాడు, కులుకకుండా నడవండి!

24, జులై 2020, శుక్రవారం

నను పాలింప నడచి వచ్చితివో - త్యాగరాజస్వామి


నను పాలింప నడచి వచ్చితివో నా ప్రాణనాథ

వనజ నయన మోమును జూచుట జీ
వనమని నెనరున మనసు మర్మము దెలసి

సురపతినీలమణినిభ తనువుతో
ఉరమున ముత్యపు సరుల చయముతో
కరమున శర కోదండ కాంతితో
ధరణి తనయతో త్యాగరాజార్చిత

నా ప్రాణేశ్వరుడవైన శ్రీరామా! కలువల వంటి కన్నులు గలిగిన నీ మోమును జూచుటే నా జీవనమని నమ్మిన మనసులోని మర్మమును తెలుసుకొని నా పై దయతో నన్ను పాలించుటకు నడచి వచ్చితివా! శివునిచే అర్చించబడిన శ్రీరామా! ఇంద్రనీలమణి కాంతితో మెరిసే శరీరముతో, వక్షస్థలములో ముత్యాల హార సమూహముతో, చేతిలో కోదండము, బాణముల కాంతితో, సీతమ్మతో కూడి నన్ను పాలించుటకు నడచి వచ్చితివా!

త్యాగరాజస్వామి వారి కుమార్తె వివాహ సమయంలో శిష్యులు కొందరు సీతారాముల చిత్రపటాన్ని బహుకరించగా ఆయన ఆనందంతో ఆలపించ కృతి ఇది. మోహన రాముని మోహన రాగంలో నుతించారు త్యాగరాజస్వామి.

(చిత్రం వడ్డాది పాపయ్య గారు గీచినది)

గురు లేక ఎటువంటి గుణికి తెలియగబోదు - త్యాగరాజస్వామి


గురు లేక ఎటువంటి గుణికి తెలియగబోదు

కరుకైన హృద్రోగ గహనమును గొట్ట సత్

తనువు సుత ధన దార దాయాది బాంధవులు
జనియించి చెదరు జాలిని కరుణతో
మనసునంటక మంచి మందనుచు తత్వబో
ధన చేసి కాపాడు త్యాగరాజాప్తుడగు

ఎంతటి సద్గుణ సంపన్నుడైనా గురువు లేకుండా పరతత్త్వము బోధపడదు. హృదయములో జన్మించిన కర్కశమైన అజ్ఞానపు ఆలోచనలనే అరణ్యమును ఛేదించుట గురువులు లేకుండా సాధ్యము కాదు. శరీరము, బిడ్డలు, ధనము, భార్య, దాయాదులు మొదలైన బంధువులు ఇవన్నీ శాశ్వతము కాదు అనే సత్యాన్ని మనపై కరుణతో, ఆ సంసార వాసనలను మన మనసులకు అంటకుండా మంచి మందు లాగా తత్త్వబోధ చేసి కాపాడే సుజ్ఞానము గురువు లేకుండా ఎంతటి సద్గుణ సంపన్నునికైనా బోధపడదు.

శ్రీగురుభ్యోనమః _/\_

నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప - తాళ్లపాక అన్నమాచార్యుల వారు


నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప!
నగరాజ ధరుడా! శ్రీ నారాయణా!

దీపించు వైరాగ్య దివ్య సౌఖ్యమునీయ
నోపక కదా నన్నునొడబరచుచు
పైపైని సంసార బంధముల గట్టేవు
నా పలుకు చెల్లునా నారాయణా!

చీకాకు పడిన నా చిత్తశాంతము సేయ
లేకనా నీవు బహులీల నన్ను
కాకు సేసెదవు బహు కర్మముల బడు వారు
నా కొలది వారలా నారాయణా!

వివిధ నిర్బంధముల వెడల ద్రోయక నన్ను
భవ సాగరముల తడ బడ జేతువా
దివిజేంద్ర వంద్య!` శ్రీ తిరువేంకటాద్రీశ!
నవనీత చోరా! శ్రీ నారాయణా!

ఓ నారాయణా! శ్రుతి స్మృతి పురాణములలో వర్ణించబడిన మనోహరమైన రూపము కలవాడవు, మందర పర్వతమును మోసిన వాడవు! నాకు ప్రకాశించే వైరాగ్య సుఖమును ప్రసాదించక నన్ను ఒప్పించి మరీ మరీ సంసార బంధములలో కట్టివేస్తావు, నా మాటలు చెల్లునా నారాయణా! అశాంతములోనున్న నా మనసును శాంతపరచ గలిగే నీవే నన్ను అనేక లీలలతో మరింత అలజడికి గురిచేసెదవు, అనేక కర్మలలో మునిగియున్న వారితో నాకు పోలికా నారాయణా! ఇంద్రాది దేవతలకు పూజ్యుడవైన ఓ శ్రీవేంకటేశ్వరా! వెన్నను దొంగిలించిన శ్రీకృష్ణా! అనేక పాశముల నుండి నన్ను రక్షించక మరిన్ని భవ సాగరములలో కొట్టుమిట్టాడేలా చేసెదవా నారాయణా!

స్వామి వైభవాన్ని నిత్యం కనులారా గాంచి, ఆయనపై అనేక వేల ఆధ్యాత్మిక శృంగార సంకీర్తనలు రచించి, పరమాత్వ తత్త్వాన్ని అనేక విధాల అనుభూతి చెంది, జీవితంలో మలిదశలో అడుగిడే సమయంలో అన్నమాచార్యుల వారు తనకు శాశ్వత సుఖాన్ని కలిగించే వైరాగ్యాన్ని, ప్రశాంతతను, భవబంధములనుండి ముక్తిని కలిగించమని ఆ శ్రీనివాసుని ఈ సంకీర్తనలో అద్భుతంగా వేడుకున్నారు. సాహిత్యాన్ని నిశితంగా పరిశీలిస్తే, ప్రతి ఒక్క పదం కూడా అర్థవంతమై పరిపూర్ణత్వానికి తోడ్పడేల ఉంటాయి. మానవ జన్మలో పరమాత్మ లీలలే ఈ బంధనాలన్నీ అని మనకు మూడు చరణాలలో అన్నమయ్య ఉదాత్తమైన ఆధ్యాత్మిక తత్త్వాన్ని బోధించారు. అన్నిటికీ సూత్రధారి, అన్నీ తెలిసిన స్వామే తన అంతరంగము తెలుసుకొని ఈ బంధనాల నుండి రక్షించగలడని మనకు మార్గం చూపించారు అన్నమయ్య. అందుకే ఆయన సద్గురువు.

ఓ నమో నారాయణాయ!

రామాయణ వైభవం


రామ శబ్దం రం అనే ధాతువునుండి ఏర్పడింది. దీని అర్థం రమించుట, ఆనందపడుట, హాయినిచ్చుట. అయనం అనగా కదలుట, నడచుట, పయనించుట. కాబట్టి రామాయణం అంటే రాముని చలనం, గమనం, స్పందనం అని అర్థం. కాబట్టి రామాయణం అంటే కేవం రాముని కథ కాదు, రాముని నడవడికను సూచించేది అని తేలింది. రామ శబ్దంలోని రమణీయతకు ఆయన శబ్దం కమనీయమైన గమనాన్ని, వేగాన్ని జోడిస్తుంది.

రామాయణంలో ప్రపంచంలో రెండు విధాలైన భౌతిక శక్తుల సమ్మేళన మనకు స్ఫురిస్తుంది - స్థితిజ (potential), గతిజ (kinetic). తదేజతి, తన్నైజతి - అది చలిస్తుంది, చలించదు అనే ఉపనిషత్సూక్తి రామాయణంలో ధ్వనిస్తుంది. నిజానికి రాముడు పుట్టింది మొదలు పట్టాభిషేకం వరకు ఆయన జీవితంలో అయనత్వం, నిరంతర నిర్విరామ నియమనిష్ఠ కనిపిస్తుంది. రాముని జననాన్ని వర్ణించగానే వాల్మీకి మహర్షి అదే సర్గలో విశ్వామిత్రుని ఆగమనాన్ని సూచిస్తాడు. పదహారేండ్లు కూడా నిండని పసివయస్సులో క్రూర రాక్ష సంహారం, యాగ సంరక్షణ, అహల్యా శాపవిమోచనం, శివ ధనుర్భంగం, సీతా స్వయంవరం, పెండ్లి చేసుకు రాగానే అడవులకు పయనం, నానా బాధలు, మహర్షుల మన్ననలు, నెలకో నెలవు. చివరకు పర్ణశాల అంటూ ఒకటి ఏర్పడితే కలలో కూడా ఊహించని సీతాపహరణం, తదుపరి అన్వేషణం, సేతుబంధనం, రావణ సంహారం. ఇలా, ఒక్క క్షణం కూడా జీవితంలో స్థాయి, హాయి లేకుండా సత్య ధర్మాలను మాత్రం వదలకుండా సాగిన రాముని జీవన యాత్ర ఒక గొప్ప ఆయనం. అదే రామాయణం. ఇంతటి సంచలనం, సంక్షోభం జరుగుతున్న రాముడు చలించడు, హిమవత్పర్వతంలా ధైర్యంగా నిలబడి అన్నిటినీ సమర్థించుకుంటాడు. అదే రామాయణంలోని రమణీయత.

మరి రాముడి అయనం రామాయణం కదా? అయితే సీతమ్మదేమీ లేదా అని ప్రశ్నించే వారికి సమాధానం. రామాయణం అన్న దానికి రామస్య అయనం, రామాయాః అయనం అని రెండు విధాలుగా చెప్పుకోవచ్చు. రామా అనగా సీతమ్మ. ఇదే రామాయణ శబ్దంలోని చమత్కారం. వాల్మీకి తన రచనకు పెట్టుకున్న పేరులోని పరమరహస్యం కూడా ఇదే. మరి సీతమ్మను రామా అని ఎందుకు పిలవరు? అన్న ప్రశ్నకు సమాధానం, స్వయంగా వాల్మీకే రామాయణంలో అనేకమార్లు రామా అన్న శబ్దాన్ని అమ్మను సంబోధించటం ద్వారా తెలిపారు. సుమంత్రుడు దశరథునికి సీతాదేవి గురించి చెప్పిన సందర్భంలో:

బాలేవ రమతే సీతా బాలచంద్ర నిభాననా
రామా రామేహ్యదీనాత్మా విజనేऽపి వనే సతీ

బాలచంద్రునివంటి ముఖముతో శోభిల్లుతున్న సీతమ్మ పసిపిల్లలా (బాలాత్రిపురసుందరిలా) మహారణ్యంలో కూడా దైన్యత లేకుండా నిబ్బరంగా సంతోషంగా ఉంది అంటాడు. ఇంతటి శక్తి ఆమెకు ఎక్కడి నుంచి వచ్చింది? రామ పక్కన రాముడుండగా దిగులెందుకు అంటాడు వాక్యవిశారదుడైన వాల్మీకి. ఇక్కడ రామ శబ్దం రామా శబ్దం వెంట వెంటనే జంటగా కనిపిస్తాయి. అందులో కూడా రామ, తరువాత రాముడు. నిజానికి రామాయణానికి వివరణ రామారామయోరయనం రామాయణం (రామా రాముల అయనమే రామాయణం) అని చెప్పటమే సరైనది.

సీతాదేవికి రామచంద్రుని పేరులోనే కాదు, ,తీరులో కూడా సామ్యముంది. హనుమంతుడు లంకనంతా గాలించి చివరకు అశోకవనంలో సీతాదేవి రూపలావణ్యం చూచి నివ్వెరపోతాడు. కారణం ఆమె అతిలోక సుందరి అయినందుకు కాదు, ఆమె ముమ్మూర్తులా రామచంద్రునిలా కనిపించటం వల్ల. ప్రపంచంలో తోబుట్టువులు, తల్లీ పిల్లలు, తండ్రీ బిడ్డలు ఒకలా ఉండటం సహజం. కానీ, ఇక్కడ భార్యాభర్తలు ఒకే రూపున ఉండటం అనేది విశేషం. అక్కడ రామయ్యను చూసి ఇక్కడ సీతమ్మను చూస్తే ఆ రాముడే స్త్రీ రూపంలో ఉన్నట్లు గమనించిన ఆంజనేయుడు మనస్సులో ఇలా అనుకున్నాడు:

అస్యా దేవ్యా యథారూపం అంగప్రత్యంగ సౌష్ఠవం
రమస్య చ యథారూపం తస్యేయమసితేక్షణా!

ఆ దేవి నిజరూపం - పోలికలు, అవయవములు, వాటి సౌష్టవం అన్నీ ఆ రాముని రూపానికి ప్రతిరూపంగా అన్నట్టుగా ఉంది.

ఎంత అద్భుతం కదా? ఇది ఎలా సాధ్యమైంది? అదే రామాయణంలోని అద్వైత రససిద్ధి. సీతారాములకు రూపంలోనే కాదు, గుణగణాల్లో, ఆలోచనల్లో, ఆనందంలో, ఆవేదనలో దేనిలో కూడా వ్యత్యాసం లేదు.

అస్యా దేవ్యా మనస్తస్మిన్ తస్యచాస్యాం ప్రతిష్ఠితం

ఆమె మనస్సు ఆయనలో లీనమైనట్టుగానే ఆయన మనస్సు ఆమె మనస్సులో లయించి ఉన్నదట. ఇలా ఒకరికొరికరు బింబ ప్రతిబింబంగా ఉన్న సీతారాముల ఆత్మ మనశ్శరీర సామరస్యాన్ని చూసి హనుమంతుడు స్థంభించిపోతాడు. సీతారాముల మధ్య ఉన్న ఈ అన్యోన్యతను, అభిన్నతను, అనుబంధాన్ని అక్షరరూపంలో నిరూపించటమే రామాయణ పర్మావధి. శ్రీరాముడు పరమాత్మ స్వరూపుడైతే సీతాదేవి పరమాత్మ యందలి పరమ కళ. ఈ కళ ముల్లోకాలకూ మూలాధారాన్ని ప్రసాదిస్తుంది.

రాజ్యం వా త్రిషు లోకేషు సీతా వా జనకాత్మజా
త్రైలోక్య రాజ్యం సకలం సీతాయావాప్నుయాత్ కలాం!

వాల్మీకి మహర్షి యొక్క అంతర్దృష్టి, అంతరార్థం, రామాయణం మహత్తు, సీతారాముల అభేద్య తత్త్వం ఇంతకన్నా విప్పిచెప్పేదేముంది?

"వందే వాల్మీకి కోకిలం"

భారమైన వేపమాను పాలువోసి పెంచినాను - అన్నమాచార్యుల వారు


భారమైన వేపమాను పాలువోసి పెంచినాను
తీరని చేదే గాక తీయనుండీనా

పాయదీసి కుక్క తోక బద్దలు వెట్టి బిగిసి నాను
చాయకెంత గట్టినాను చక్కనుండీనా
కాయపు వికారమిది కలకాలము జెప్పినా
పోయిన పోకలే కాక బుద్ధి వినీనా

ముంచి ముంచి నీటిలోన మూల నానబెట్టుకొన్నా
మించిన గొడ్డలి నేడు మెత్తనయ్యీనా
పంచ మహా పాతకాల బారిబడ్డ చిత్తమిది
దంచి దంచి చెప్పినాను దాగి వంగీనా

కూరిమితో తేలుదెచ్చి కోకలోన బెట్టుకున్నా
సారె సారె కుట్టుగాక చక్కనుండీనా
వేరు లేని మహిమల శ్రీ వేంకటవిభుని కృప
ఘోరమైన ఆస మేలుగోర సోకీనా

తాత్పర్యం:

ఎంతో పెద్దదైన వేపమాను తెచ్చి పాలు పోసి పెంచినా కూడా అది తీర్చలేని చేదు రుచే ఉంటుంది కానీ తీయగా మారుతుందా? పాయలుగా తీసి చెక్కబద్దలు పెట్టి బిగించి కొయ్యకు ఎంత కాలం కట్టినా వంకర పోయి చక్కగా ఉండునా? నీటిలో మరింత ముంచి మడుగున ఎంత నాన బెట్టినా పెద్ద గొడ్డలి ఏనాటికైనా మెత్తబడుతుందా? పంచమహాపాతకాల (బంగారాన్ని దొంగిలించటం, కల్లు తాగటం, గురుపత్నితో సంగమం, బ్రాహ్మణ హత్య, ఇలాంటివి చేసిన వానితో స్నేహం చేయటం) బారిన పడ్డ మనసిది, ఎంత గట్టిగా చెప్పినా మారి తన గుణాన్ని మార్చుకుంటుందా? ఎంతో ప్రేమగా తేలును తీసుకు వచ్చి చీరలో పెట్టుకుంటే మళ్లీ మళ్లీ కుడుతుందే కాని హానిచేయకుండా ఉంటుందా? ఘోరమైన ఆశలు కలిగిన మనసు లోతు తెలియని మహిమలు గల శ్రీవేంకటేశ్వరుని కృపను కోరనిస్తుందా?

వివరణ:

మాయావశమైన చిత్త ప్రవృత్తిని సద్గురువులు ఈ కృతి ద్వారా అన్నమాచార్యుల వారు అద్భుతంగా ఆవిష్కరించారు. వేప సహజ గుణం చేదు. దానికి నీళ్ల బదులు పాలు పోసి పెంచినా ఆ చేదు పోదు. దీనికి సారూప్యం ఏమిటి? మన మనస్సు. దాని సహజ గుణం చేదైనా విషయాలలో మునిగి యుండటం. ఇక్కడ చేదు అంటే రుచి అని కాదు, మనకు శ్రేయస్కరమైనవి కానివి అని. ఏది మనకు శ్రేయస్కరం? పరమాత్మయందు ధ్యాసే. కానీ, అలా నిలువదే మనసు? నిరంతరం పాప విషయ లంపటములలో మునిగి తేలుతూ ఉంటుంది. ఈ విషయాన్నే అన్నమయ్య పల్లవిలో ఆవిష్కరించారు. సహజంగా చెడు గుణాలలో పడే మనసు శ్రేయస్కరమైన వాటి పట్ల దృష్టి కలిగి ఉండదు అనేది ఆయన భావన. దీనిని మూడు చరణాలలో ఉదాహరణల ద్వారా మరింత వివరించారు అన్నమయ్య. వంకరగా ఉన్న కుక్క తోకను ఎంతో ప్రయత్నం చేసి గుంజకు కట్టి సరి చేయాలని చూసినా ఆ వంకర పోదు. అలాగే ఈ మనసు శరీరం వల్ల కలిగే అనేక వికారాల వల్ల స్వాధీనమైనట్లే ఉండి పట్టు విడవగానే మళ్లీ పక్క దారులు తొక్కుతుంది. ఎందుకు అలా? అదే మాయ. ఆ మాయకు ఆ దేహం వశపడుతుంది. తద్వారా మనసు ఆధీనము తప్పి వివిధ నీచ ప్రవృత్తులలో కొట్టుమిట్టాడుతుంది. అలాగే, కఠినమైన లోహముతో చేయబడ్డ గొడ్డలిని ఎన్ని మార్లు ఎంత కాలం నీటిలో ఉంచినా అది మెత్తబడదు. పాషాణమైన దాని గుణాన్ని మనసుతో పోల్చారు అన్నమయ్య. తేలు లక్షణం కుట్టటం. దాన్ని తీసుకు వచ్చి ప్రేమగా అందమైన చీరలో చుడితే అది కుట్టకుండా ఉంటుందా? మనసు కూడా అంతే. ఎన్ని అనుకూల పరిస్థితులు కల్పించినా తన సహజ స్వభావం నుండి మారదు. ఇక్కడ తేలును ప్రస్తావించటానికి రెండు కారణాలు 1. అది బాధ కలిగించేది 2. విషపూరితమైనది. రెండూ కూడా మనకు నిజజీవితంలో విషయలోలత్వం, దుర్జన సాంగత్యం వల్ల కలిగేవి. వీటివల్ల భగవత్కృప అనే అమూల్యమైన వరం పక్కనే ఉన్నా మనసు దానివైపు వెళ్లదు. ఈ సంకీర్తన మనకు అన్నమయ్య మనసు గురించి వాపోతున్నట్లు అనిపించినా, మార్గం పరమాత్మ సాన్నిధ్యమే అని కూడా సందేశం ఇచ్చారు.

సరే. చిత్త చాంచల్యం లేని వారెవరు? అర్జునుడంతటి యోధునికే తప్పలేదు. ఆ వీరుడు పరమాత్మను ఇలా ప్రశ్నించాడు:

యోऽయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన
ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరాం

చంచలం హి మనః కృష్ణ ప్రమాథి బలవద్దృఢం
తస్యాహి నిగ్రహం మన్యే వాయోరివ దుష్కరం

ఓ మధుసూదనా! నీవు చెప్పిన యోగము ద్వారా స్థిరత్వము, సమభావమనే స్థితిని నా చంచలత్వం వలన తెలుసుకోలేకున్నాను. ఈ మనసు చాలా చంచలమైనది. బాగా విషయ లోలత్వం చెందేది. మనసు యొక్క ఈ పోకడ చాలా దృఢమైనది, బలీయమైనది. దానిని ఆపటం గాలిని ఆపటంవలె అత్యంత కఠినమైనది.

అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా సమాధానం చెప్పాడు:

అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం
అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే

నిజమే మహాబాహువువైన కుంతీపుత్రా! నీవు చెప్పిన దానిలో ఏ మాత్రం సంశయం లేదు. మనస్సు చంచలమైనదే, దానిని నిగ్రహించటం చాలా కష్టం. కానీ, అభ్యాసము మరియు వైరాగ్యముతో మనస్సును స్వాధీనపరచుకోవచ్చు.

మరి ఏమిటా అభ్యాసం, వైరాగ్యం?

అభ్యాసమనగా నిరంతర సాధన. జ్ఞాన కర్మ భక్తి యోగములలో దేనిలోనైనా, కలిపైనా అభ్యాసము చేయటం. ఇది నిరంతరం అచంచలమైన విశ్వాసంతో జరగాలి. మొదట్లో యాంత్రికమనిపించినా కొన్నళ్ల తరువాత మనసు ఆ పరమాత్మ తత్త్వాన్ని కొద్ది కొద్దిగా గ్రహించి ఆ మార్గంపై విశ్వాసం కలుగుతుంది. ఇది ఒంటరి ప్రయాణం కాకూడదు. తప్పకుండా సద్గురువుల సాంగత్యంలోనే జరగాలి. అహంకారం మనిషి సహజ లక్షణం. దాని నియంత్రణకు స్వశిక్షణ సరైన మార్గం కాదు. గురువు మార్గదర్శకంలో అలవడే శిక్షణ వల్ల అహంకారము తొలగుతుంది. అందుకే మనకు సనాతన ధర్మం గురుతత్త్వాన్ని అనేక విధాల బోధించి ఆ గురు సుశ్రూషలో అభ్యసించమని శ్రుతి స్మృతి పురాణాలలో ఉట్టకించింది.

వైరాగ్యమనగా?

ఏ విషయమైనా కూడా రాగద్వేషరహితుడై ఉండటం. అనగా, మమకారము, ద్వేషము లేకుండా ఉండటం. ఇది ఎలా సాధ్యం? జీవితంలో అనేక మార్లు మనకు తాత్కాలిక వైరాగ్యం కలుగుతుంది. అందులో ముఖ్యమైనవి ప్రసూతి మరియు స్మశాన వైరాగ్యం. జనన మరణాల సమయంలో మనుషులకు తప్పకుండా వైరాగ్యం కలుగుతుంది. ఒకటేమో ప్రసవ సమయంలో ఆ తల్లి పడే ఆవేదన చూసి, మరొకటేమో మనకు ప్రియమైన మరో జీవి దేహాన్ని వీడి వెళ్లటం జీర్ణించుకోలేని విరాగం. రెండూ తాత్కాలికమే. ఇక్కడ పరమాత్మ చెప్పింది నిరంతర వైరాగ్యం. దీనికి ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో తెలుసుకోవటం చాలా ముఖ్యం. శాశ్వతమైన ఆత్మ, పరమాత్మల జ్ఞానం, అశాశ్వతమైన దేహము, ప్రపంచము యొక్క అవగాహన కలగాలంటే జీవన ధర్మాలను పాటిస్తూ, గురు సుశ్రూష చేస్తూ అనుభూతులను గమనించి తద్వారా కలిగిన జ్ఞానాన్ని ఆచరించటం చాలా ముఖ్యం. అభ్యాస వైరాగ్యాలు రెండిటికీ క్రమశిక్షణ చాలా అవసరం. ఇవి శమదమాది షడ్గుణాల ద్వారా సఫలమవుతాయి.

అన్నమాచార్యుల వారు పంచమహాపాతకాల గురించి ప్రస్తావించటం ఈ సంకీర్తనలో ఓ ముఖ్యమైన అంశం. అరిషడ్వర్గాల ప్రకోపం వల్ల మనిషి మనసు సంతులన కోల్పోయి చేసేవీ పాతకాలు. ధర్మాన్ని అర్థం చేసుకుని ఆచరించే వానికి వీటితో పనిలేదు. ఇవే కాకుండా మనకు తెలిసీ తెలియక అనేక జీవులకు మనం హాని కలిగిస్తూనే ఉంటాము. వీటికి ప్రాయశ్చిత్తంగా మనకు ధర్మం అనేక కర్మలను ప్రస్తావించింది. జీవకారుణ్యం, నిష్ఠగా కర్మానుష్ఠానం, గురు ముఖత జ్ఞానసముపార్జన, నవ విధ భక్తి మార్గాలు మనలను అరిషడ్వర్గాలను నియంత్రించి షడ్గుణ సంపదను పెంపొందించుకునేలా చేస్తాయి. అటువంటి మనోస్థితిని కలిగించమని, తద్వారా పరమాత్మ కృపకు పాత్రులమయ్యేలా చేయమని ఈ కృతి ద్వారా అన్నమయ్య తెలియజేశారు.

శ్రీగురుభ్యోనమః.

పరాకేల నన్ను పరిపాలింప - శ్యామశాస్త్రి


పరాకేల నన్ను పరిపాలింప
మురారి సోదరి! అంబా!

నిరాదరణ సేయరాదమ్మా శివే!
పరాశక్తి! నా మొరనాలకింప

ధరాద్యఖిలమునకు రాణి! హరి
హరాదులు పొగడు పరాత్పరి!
దురంధర మహిషాసుర దమని!
స్మరాధీనుడౌ శ్యామకృష్ణనుత!

విష్ణు సోదరివైన ఓ అంబా! నన్ను రక్షించుటకు పరాకెందుకు? ఓ శివానీ! నీవు పరాశక్తివి! నన్ను నిరాదరణ చేయకుము, నన్ను రక్షించుటకు పరాకెందుకు? భూమ్యాది సమస్త భువనములకు రాణివి నీవు! హరి హరాదులు పొగడు భగవతివి నీవు! మహాపరాక్రమవంతుడైన మహిషాసురుని సంహరించిన అమ్మవు నీవు, నల్లని వర్ణము గల కృష్ణునిచే నిరంతరము స్మరించబడే అమ్మా! నన్ను రక్షించుటకు పరాకెందుకు?

సనాతన ధర్మం


ఒకరి చేత చెప్పబడనిది, అనుభవైకవేద్యమైనది, కాలాతీతమైనది సనాతనధర్మం.  క్రైస్తవం, బౌద్ధం, ఇస్లాం - ఇవన్నీ కొన్ని వందల ఏళ్ల నాడు ఆయా మత ప్రవక్తలైన వారిచే నిర్వచించబడినవి. ఎవరో కొద్దిమంది గురువులు ప్రచారం చేసినది కాదు సనాతన ధర్మం. గంగాప్రవాహంలా కాలాతీతమై ముందుకు సాగుతూనే ఉంది. స్వయంగా భగవద్రక్షితమై, భగవద్ప్రేరితమై అపౌరుషేయమై ఉద్భవించినవి వేదాలు. మహా ఋషుల అపరోక్షానుభూతులు ఉపనిషత్తులుగా వచ్చాయి. అమిత తపోసంపన్నుడు, శ్రీమహావిష్ణువు అవతారము అయిన వేదవ్యాసునిచే లోకకల్యాణార్థమై రచించబడినవి 18 పురాణాలు. ఇవీ మన ధర్మానికి మూలాలు. ప్రతి యుగంలోనూ వీటి సారములు మనకు గాథలుగా, అనేకానేక దివ్యరచనలుగా అందించబడుతున్నాయి.

నాస్తికవాదులు, పరధర్మ ప్రచారకులు, కుహనావాదులు చేసే ఒక దుష్ప్రచారం మన ధర్మంలో స్వేచ్ఛ లేదు, శాస్త్రీయత లేదు అని. అంతకన్నా పచ్చి అబద్ధం ఇంకొకటి లేదు. మన ధర్మం ఇచ్చినంత స్వేచ్ఛ ఇంకే ధర్మమూ ఇవ్వలేదు. మన ధర్మానికున్నంత శాస్త్రీయత మరే ధర్మానికీ లేదు. విశ్వాసము మరియు ఆరాధనలలో సంపూర్ణ స్వేచ్ఛనిచ్చినది సనాతన ధర్మం. అందుకే మనకు ఎన్నలేనన్ని మార్గాలు, భగవద్రూపాలు. ప్రకృతి, ఆత్మ, దేవ, పరమాత్మ, అర్చనా తత్త్వాలను ప్రశ్నించి సమాధానం తెలుసుకునే స్వేచ్ఛ ఈ ధర్మం ఇచ్చింది. ఫలానా ఒక్క పద్ధతే సరైనది, ఫలానవి చేస్తేనే ఆరాధన సఫలమవుతుంది అన్నది సనాతన ధర్మం చెప్పలేదు. కోట్లాది మార్గాలు, కోట్లాది పద్ధతులు ఈ ధర్మంలో అంతర్భాగం. ఇతర ధర్మాల వారు చేసినట్లు సనాతన ధర్మం నాస్తికవాదాన్ని తప్పుగా పేర్కొనదు. సనాతన ధర్మంలో మానవీయ విలువలకున్న స్థానం మరే ధర్మంలోనూ లేవు. మరొక ధర్మం వారిని నిందించటం, వారిని బలవంతంగా ఈ ధర్మంలోకి మార్పిడి చేయడం అన్నవి లేవు. అసలు ఆ సిద్ధాంతమే సనాతన ధర్మంలో లేదు. అత్యంత ఉదారమైనది, విశాలమైనది సనాతన ధర్మం.

మన ధర్మంలో ఉన్న మొట్ట మొదటి గొప్పతనం - మానవుని నిత్య జీవితంలో ఎదురుకునే ప్రతి సమస్యకు, ప్రతి అలజడికి శాశ్వత, సర్వామోదయోగ్యమైన పరిష్కారం కలిగి ఉండటం. వేదాలు, ఉపనిషత్తుల సారమే మానవుని ఆత్మోద్ధరణ ద్వారా ఆనందాన్ని పొందటం. కాబట్టి, వ్యక్తిత్వ వికాసమనేది ఈ ధర్మంలో సహజ పరిణామం. నీతి, ధర్మం, న్యాయం మొదలైన వాని ద్వారా ఈ వ్యక్తిత్వ వికాసాన్ని మన ధర్మం మనకు ఉచితంగా అందిస్తుంది.

ఇక రెండవ గొప్పతనం - శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకునే జీవనశైలి, సూత్రాలు అద్భుతమైన యోగము ద్వారా, వైద్యశాస్త్రము ద్వారా మనకు అందించింది సనాతన ధర్మం. ప్రపంచంలో ఏ ధర్మంలోనూ లేనంత శాస్త్ర సాంకేతికత మన ధర్మంలో ఉన్నాయి కాబట్టే అనాదిగా వీనిని ఆచరించిన వారు దేహానికున్న పరిమితులను అధిగమించి దివ్యత్వాన్ని పొందగలిగారు.

మూడవ గొప్పతనం - స్త్రీలు, పురుషులు, పిన్నలు, పెద్దలు, ధనికులు, పేదలు అని లేకుండా ప్రతి ఒక్కరికీ ఆధ్యాత్మికత అనేది వారి వారి ఉపాధులలో, నిత్యజీవితంలో తెలియకుండానే అబ్బేలా చేసింది మన ధర్మం. బంధాలు, బాంధవ్యాలు, బాధ్యతలు, కట్టుబాట్లు మొదలైనవి మనిషిని ఆధ్యాత్మిక సంపన్నునిగా చేసింది ఈ ధర్మం. అందుకే నాస్తికులమని చెప్పుకునే వారు కూడా ఏదో ఒకరకంగా ఆధ్యాత్మికవాదులే.

సనాతన ధర్మమంటే కేవలం సన్న్యాసమూ కాదు, మాయావాదమూ కాదు, అనేక తత్త్వాల సమ్మేళనమూ కాదు. ఇది అగణితమైన ఆధ్యాత్మికానుభూతుల కలయిక. జీవితం గురించిన పరిపూర్ణము మరియు అఖండమైన దృష్టికోణము కలది. అత్యంత సహిష్ణుత, మానవీయత, ఆధ్యాత్మికత కలది సనాతన ధర్మం. అతివాదానికి దూరమైనది, అందుకే ఎన్నో దాడులు జరిగినా ఇప్పటికీ అలానే నిలిచి ఉంది. సనాతన ధర్మంలో ఉన్న కిటుకు మూలసూత్రాలలోనే. ఇవి పూర్తిగా అనుభవాల మీద, సత్యాల మీద ఆధారపడినవి. అందుకే కాలప్రవాహంలో చెక్కు చెదరకుండా నిలిచింది ఈ ధర్మం.

ధర్మో రక్షతి రక్షితః.

23, జులై 2020, గురువారం

నారాయణ తే నమో నమో - అన్నమాచార్యుల వారు


నారాయణ తే నమో నమో
నారద సన్నుత నమో నమో

మురహర నగధర ముకుంద మాధవ
గరుడ గమన పంకజనాభ
పరమ పురుష భవ బంధ విమోచన
నర మృగ శరీర నమో నమో

జలధి శయన రవి చంద్ర విలోచన
జలరుహ భవ నుత చరణ యుగ
బలి బంధన గోప వధూ వల్లభ
నళినో ధరతే నమో నమో

ఆది దేవ సకలాగమ పూజిత
యాదవ కుల మోహన రూప
వేదోద్ధర తిరు వేంకట నాయక
నాద ప్రియ తే నమో నమో

నారదునిచే నుతించబడిన ఓ నారాయణా! నీకు నమస్సులు. మురాసురుని సంహరించిన వాడవు, మందర పర్వతమును ధరించిన వాడవు, గరుత్మంతుని వాహనముగా సంచరించేవాడవు, నాభియందు కమలము కలవాడవు, పరమపురుషుడవు, సంసార బంధముల నుండి విముక్తి కలిగించే వాడవు, నరసింహ రూపుడవైన నీకు నమస్సులు. క్షీరసాగర శయనుడవు, సూర్యచంద్రులను నేత్రములుగా కలవాడవు, కమలము నుండి జన్మించిన బ్రహ్మచేత నుతించబడిన పాదయుగము గలవాడవు, బలిని మర్దించిన వాడవు, గోపికలకు ప్రభువువు, కమలమును ధరించు వాడవైన నీకు నమస్సులు. పరమాత్మవు, సమస్త శ్రుతి స్మృతి పురాణములచే పూజించబడిన వాడవు, యాదవ కులములో జన్మించిన మోహనాకారుడవు, వేదములను కాపాడిన వాడవు, నాదప్రియుడవైన శ్రీవేంకటేశ్వరా! నీకు నమస్సులు.

(చిత్రం నేపాల్ ఖాట్మండు సమీపంలోని జలనారాయణుడు)

గురు పరంపర ఎందుకు ముఖ్యం?


హిందుత్వం పేరుతో నేడు జరుగుతున్న కొన్ని అరాచకాలకు, అమలులో ఉన్న విపరీత సాంప్రదాయాలకు, వామాచారాలకు కారణం వాటిని ప్రచారం చేసే గురువులకు సరైన గురు పరంపర లేకపోవటం. ఉన్నట్టుండి ఒక వ్యక్తి బాబాగా మారి, తనను తానే గురువుగా ప్రకటించుకొని ఓ సంస్థ ఏర్పాటు చేసేసుకుంటున్న ఉదంతాలు గత 10-15 ఏళ్లలో చాలా ఎక్కువయ్యాయి. బలహీనతల వల్లో, లేక వారి అవసరాలను బట్టో ప్రజలు వీరి బారిన పడి తీవ్రంగా నష్టపోతున్నారు. ఇలాంటి వారి వల్ల హైందవానికి తీవ్ర అప్రతిష్ఠ కలిగి, ఈ ధర్మం గురించి ఘోరమైన దుష్ప్రచారం జరుగుతోంది. ఈ సమస్యను అరికట్టడానికి మనం గురు పరంపరను పరిశీలించటం చాలా ముఖ్యం. ఒకరు తనను తాను గురువుగా చెప్పుకుంటూ మనకు తారసపడితే మన విచక్షణ ఉపయోగించి, వారి పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకున్న తరువాతే వారిని విశ్వసించాలి. ఎందుకు ఈ గురు పరంపర ముఖ్యం?

1. అర్హత
------------

గురువుగా, ఒక సంస్థ (అనగా పీఠం లేదా మఠం) అధిపతిగా స్వయం ప్రకటితం చేసుకోవటం అనేది ఎప్పుడూ సరైన పద్ధతి కాదు. ఒక గురువు శిష్యుని వెదుక్కుంటూ వచ్చి, శిష్యునికి కావలసిన లక్షణాలను మరింత నిశితంగా పరిశీలించి, ఉత్తరాధికారం ఇవ్వటమే సరైన పద్ధతి. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులలో ఇలా జరగకపోయినా, బహుళ జనామోద యోగ్యమైన వారే గురువులుగా రాణించగలరు. ఇలా జరిగినప్పుడు వారిని అనుసరించే వారు ఆ గురువుల అర్హతలను మరింత దగ్గరగా గమనించి తీరాలి.

2. సిద్ధాంతాలకు మూలాలు
------------------------------------

ఒక మంచి పరంపర కలిగిన గురుతత్త్వంలో బలమైన సిద్ధాంతాలుంటాయి. ఆ సిద్ధాంతాలు కాలపరీక్షను తట్టుకుని ఒక తరం నుండి మరొక తరానికి బదిలీ చేయబడతాయి. దీనివల్ల ఆ సిద్ధాంతాలకు బలం చేకూరుతుంది. ఏ సిద్ధాంతమైనా ఒక రెండు తరాలన్నా నిలిచి లక్షలాది ప్రజల జీవితాలను మంచి వైపు నడిపిస్తేనే సఫలమైనట్లు. లేకపోతే అది గాలివాటం సిద్ధాంతమనే అనుకోవచ్చు. ఒక తరంలో గురువు కొత్త సిద్ధాంతాలు లేదా మార్గాలను ప్రతిపాదిస్తే, వాటిని గురు పరంపరలో చర్చించి, ఆమోదింపజేసుకుని కార్యాచరణ చేస్తారు కాబట్టి వికృతము, ఆగమ విరుద్ధము, ధర్మ విరుద్ధము, సమాజ విరుద్ధము, చట్ట విరుద్ధమైన సిద్ధాంతాలు పుట్టుకు వచ్చే అవకాశం ఉండదు.

3. అభ్యాసం
---------------

ఒక గురువు వద్ద శిష్యుడు శిక్షణ పొందేవి అనేకాలు - 1. అనాదిగా చెప్పబడిన శ్రుతి స్మృతి శాస్త్ర పురాణాలు 2. గురువుల అనుభవాలు, జీవిత విశేషాలు 3. ఆ సంస్థ యొక్క నియమావళి 4. ఆ సంస్థకు సంబంధించిన దేవతా స్వరూపం యొక్క అర్చనా విధులు 5. ఆ సంస్థ ద్వారా ఆధ్యాత్మిక ప్రచారం జరిపే వ్యవస్థ వివరాలు. ఇవే కాక, మరెన్నో. ఈ అభ్యాసం వల్ల ఆ శిష్యుని వ్యక్తిత్వం కావలసిన మార్పులు చేర్పులు జరిగి వ్యక్తిత్వ వికాసం పొంది, ఉత్తరాధికారానికి సిద్ధుడవుతాడు.

4. సమాజం అమోదం
---------------------------

సమాజం (అనగా పాలకులు, ప్రజల సమూహం) మతంలోని సంస్థలను, వ్యక్తులను, వాటి అధిపతులను చాలా నిశితంగా పరిశీలిస్తుంది. అనగా, మంచి, చెడు, వారి వైశిష్ట్యం, నిబద్ధత, మహత్తు, మార్గంలో విలక్షణత మరియు ఇతర సంస్థాగత విషయాలను సమాజం పరిశీలించి, విమర్శించి, పరీక్షిస్తుంది. ఈ పరీక్షలో నెగ్గిన సంస్థ/గురు పరంపరలే నాలుగు కాలాలపాటు ఆధ్యాత్మికగా మార్గదర్శకులు కాగలరు.

5. ఆరోగ్యకరమైన అభివృద్ధి
------------------------------------

ఒక గురు పరంపరలో వచ్చిన వ్యక్తుల ద్వారా ఏర్పడిన సంస్థలు కాలపరీక్ష తట్టుకుని, ప్రజల ఆమోదం పొంది, అనేకుల జీవితాలను ప్రభావితం చేయటానికి ఒక జీవితకాలం పడుతుంది. అప్పుడే అది ఆరోగ్యకరమైన పురోగతి అవుతుంది. రాత్రికి రాత్రి వెలసి, కొద్ది కాలంలోనే బాగా విస్తరించి, డబ్బు, ఆస్తులను కూడబెట్టింది అంటే దాని వెనుక అధార్మికమైన చర్యలు తప్పకుండా ఉండి తీరుతాయి. ఇటువంటి అభివృద్ధి సంస్థకు, సమాజానికి మంచిది కాదు. సహజ పరిణామంలో ఎదిగితేనే ఆ సంస్థ, గురుబోధలు కలకాలం నిలిచేది.

6. త్యాగాలు
---------------

ఒక పరంపరలో ఉన్నారంటే ఆ గురువులు అనేక త్యాగాలు చేసి, నిజమైన సన్న్యాసాశ్రమ ధర్మాన్ని నిర్వర్తించాలి. అప్పుడే ఆ పరంపరలో నిలదొక్కుగొనగలరు. సాంసారిక బంధనాలు, బంధుప్రీతి, రాగద్వేషాలు, కామక్రోధాది అరిషడ్వర్గాలు జయించటానికి గురు పరంపర, దాని నియమావళి ఎంతో దోహదపడతాయి. శమదమాది గుణములు, వైరాగ్యం, ఆత్మావలోకనం, ధర్మాధర్మ విచక్షణ ఈ త్యాగాల వల్ల కలుగుతాయి.

ఇవే కాక వేరెన్నో పరంపరలో అబ్బుతాయి. అందుకే మనం గురువులను ఎన్నుకునేటప్పుడు ప్రప్రథమ పరిశీలనాంశంగా పరంపరను తెలుసుకోవాలి. ఆధ్యాత్మికతలో నాయకత్వం అనగా గురుస్థానం కూడా దేశం లేదా మన వృత్తిలోని నాయకత్వం లాగానే కఠోరమైన పరిశ్రమ ద్వారానే సాధ్యమవుతుంది. అందుకే మనం నేటి వికృతాలను పోరాడటానికి ఈ దిశగా మరింత దృష్టి పెట్టాలి. గ్రుడ్డిగా నమ్మి మోసపోతున్న కొద్దీ ఈ దొంగ బాబాలు పుట్టగొడుగుల్లా పుడుతూనే ఉంటారు.

శ్రీగురుభ్యోనమః.

కృతజ్ఞత ఎందుకు?


విశ్వమంతా (శాస్త్రము మరియు అధ్యాత్మికము రెండిటి ప్రకారము కూడా) శక్తి బదిలీ మీద నడుస్తుంది. ఈ శరీరము, విశ్వము మొత్తం సానుకూల ప్రతికూల శక్తుల మధ్య జరిగే సంతులన సంగ్రామమే. ఒక సంకల్పం నెరవేరాలంటే ఎంతో కొంత శక్తిని వెచ్చించాలి. ఆ సంకల్పం నెరవేరినప్పుడు మనం మనకు ఆ శక్తిని ఇచ్చిన మూలాన్ని(ఇతరులలో ఉన్న దైవత్వం లేదా స్వయంగా దైవానుగ్రహము) గుర్తించి, దానికి మనకు మధ్య గల సంబంధాన్ని గ్రహించి, ఆ సంబంధం వలన మనకు కలిగిన మేలును స్మరించుకొని ఆ దైవత్వాన్ని కొనియాడటం. ఒక్కసారి దీని గురించి కొంచెం లోతుగా ఆలోచించండి. కృతజ్ఞతా భావన వలన మనలోని దైవత్వాన్ని ఇతరుల లేదా స్వయంగా భగవంతునితో అనుసంధానం చేసి దానిని కొనియాడుతున్నాము. అంటే, మనలను మనము తెలుసుకొంటూ, దైవికతతో ఒక శాశ్వత సంబంధం ఏర్పాటు చేసుకోవచ్చు. ఇది లేకపోతే?

కృతఘ్నత ఏమిటి?
--------------------------
రాక్షసులకు వరాలిచ్చేది దేవుడే. వారు చేసిన తపస్సు వలన (కఠోరమైన ధ్యానము చేసి ఒక దైవాన్ని ప్రార్థిస్తే ప్రపంచాలను గడగడలాడించే శక్తి విశ్వమునుండి తాపసి శరీరానికి బదిలీ అవుతుంది) ఆ దైవముతో ఒక అద్భుతమైన సంధానము కలిగి, ఆ దైవము ప్రకటితమవుతుంది. అనాదిగా వరములు పొంది రాక్షసులు చేసింది ఏమిటి? తాను పొందిన వరాలు తన శక్తి వలనే అని విర్రవీగి,వరములిచ్చిన దేవుని అపహాస్యము చేసి, దేవతలపై దాడి చేసి, సాత్వికులను హింసించి వికృత రూపం దాల్చి శాంతికి భంగం కలిగించటం. దైవత్వానికి ఆహారమైన యజ్ఞయాగాదులకు విఘ్నం కలిగించటం. కాబట్టి కృతఘ్నత లోకములో అశాంతికి మూల కారణం. మానవ లోకములో దీనికి స్వార్థము, అహంకారము అనే రెండు ముఖాలు లేదా ప్రధాన లక్షణాలున్నాయి.

ఈ రాక్షస లక్షణం కలియుగంలోని మానవులలో చాలా ఎక్కువగా కనిపిస్తోంది. కన్న తల్లిదంద్రులనే మరచి వారిని హింసించి అగౌరవపరచి అనాథలను చేస్తున్న పిల్లలు ఎందరో! విద్యను చెప్పే గురువును అవమానించి అవహేళన చేసి వారి భుజాలపై ఎక్కి గుండెలపై తన్నే చందంలో ప్రవర్తిస్తున్న శిష్యులెందరో! సాయం చేసిన వాడి సాయాన్ని, ఆ మనిషిని మరచి, అంతా నా వల్లే అని విర్రవీగుతున్న వారెందరో! మొక్కులు మొక్కి వాటిని మరచే స్వార్థపరులెందరో! మానవాతీతమైన శక్తిని అపహాస్యం చేస్తున్న నాస్తికులెందరో! దైవ దూషణ చేస్తున్న పాపులెందరో! తల్లి వంటి భూదేవిని మలినపరచే ప్రబుద్ధులెందరో! సస్యశ్యామలమైన ప్రకృతిని దుర్వినియోగం చేసి తల్లిని రొమ్ములపై తన్నే నీచులు ఎందరో! ఇవన్నీ కృతఘ్నతా లక్షణాలే.

మరి కృతజ్ఞత యొక్క విశేషము ఏమిటి?
--------------------------------------------------

సానుకూల శక్తిని ప్రసరింప జేసే అద్భుతమైన సాధనం కృతజ్ఞత. మనం కృతజ్ఞతతో గడిపే ప్రతిక్షణము కూడా ఒక విద్యుత్తరంగమై దైవముతో ఒక సంబంధాన్ని ఏర్పరుస్తుంది. మనలను దైవత్వము వైపు అంత వేగంగా ముందుకు తీసుకు వెళుతుంది.

ఎవరి పట్ల కృతజ్ఞులమై ఉండాలి?
-------------------------------------------

తల్లి, తండ్రి, గురువు, దైవము,పెద్దలు, మనకు తోడ్పడిన వారు, మనకు తోడుగా నిలబడిన వారు, తోటి మానవులందరూ, పెంపుడు జంతువులు, ప్రకృతి ,పర్యావరణం... ఇంకా చెప్పాలంటే మొత్తం విశ్వం పట్ల.

ఏమిటి సాధనాలు కృతజ్ఞతకు?
----------------------------------------

ఉదయం లేవగానే మనకు కారణమైన మూలానికి నమస్కారము, అర్హత ఉన్నవారు సంధ్యావందనము (మీరు ఈ ప్రక్రియలో వదిలే అర్ఘ్యాలు, తర్పణాలు కృతజ్ఞత తెలుపుటకే), స్తోత్త్రము, సంకీర్తన, ప్రతిఫలాపేక్ష లేకుండా సహాయం చేయటం, ఉపకారం పొందిన మూలాన్ని ప్రస్తుతించటం, తాను సాధించిన విజయాలకు అందుకు తోడ్పడిన వారి పట్ల గౌరవభావంతో ఉండటం. సనాతన ధర్మంలోని వాఙ్మయమంతా కూడా కృతజ్ఞతను నిరంతరం మనకు గుర్తు చేసేవే. పరమాత్మ యొక్క అనంత అద్భుత అనుగ్రహము, గురువుల అనుగ్రహము వల్ల మానవునికి కలుగుతున్న ఆనందానికి ప్రతీకగా కృతజ్ఞతలు తెలుపుతూ ఋషిప్రోక్తమైన అనేక సూక్తాలు వెలువడ్డాయి, అలాగే శంకరుల వంటి అవతారమూర్తుల నోట అనేకమైన స్తుతులు వచ్చి మనకు ఈ ముఖ్యమైన విషయాన్ని తెలియజేస్తూ మనలను సరైన దిశలో నడిపిస్తున్నాయి.

కృతజ్ఞత లేకపోతే?
--------------------------

ఈ భావం లేకుండా మనం చేసే ఎటువంటి కర్మ అయినా సాఫల్యం పొందదు. అంతే కాకుండా, అశాంతి, అరిషడ్వర్గాలు పేట్రేగుతాయి. ఎక్కడో ఒక చోట అది సంతులనను తీసుకు రావటం కోసం మనిషికి గుణపాఠం చెప్పే పరిస్థితులను సృష్టిస్తుంది. దేవభూమిగా చెప్పబడిన ఉత్తరాఖండ్‌లో, దేవుని స్వభూమిగా చెప్పబడే కేరళలో మానవుడు చేసిన పర్యావారణ వినష్టానికి, అక్కడ దివ్యత్వానికి కలిగించిన విఘాతానికి ప్రకృతి కన్నెర్ర చేసి వేలాది మందిని పొట్టనబెట్టుకుంది మనలోని కృతఘ్నత వల్ల కలిగే నష్టాలను గుర్తు చేసేందుకే. రాక్షసత్వం మితిమీరితే, పరమాత్మ కఠిన చర్యలకు మనం గురి కాక తప్పదు.

సారాంశం
------------

కృతఘ్నతకు మూలకారణం విశ్వంలో సర్వాతీతమైన శక్తి ఒకటి ఉందని నమ్మక పోవటం, మనమే అత్యంత శక్తివంతులమని, వచ్చే ఫలితాలన్నీ మన గొప్పతనమేనని. ఒక్క వాక్యంలో చెప్పాలంటే - అహంకారం కమ్ముకొని దైవము యొక్క ఉనికినే ప్రశ్నించటం. కాబట్టి అహంకారం తొలగటానికి మొదటిమెట్టు కృతజ్ఞతతో కూడిన కార్యములు (పైన పేర్కొనబడినవి). ఈ నేను, నావల్లే అన్న అహంకారం తొలగితే మానవుడే దైవము. దేహమే దేవాలయము. విశ్వంలో శాంతికి, సౌభ్రాతృత్వానికి, మానవత పరిఢవిల్లటానికి కృతజ్ఞత అద్భుతమైన సాధనం. పైసా ఖర్చుపెట్టవలసిన పనిలేదు, మన పురోగతికి కారకాలైన వారి పట్ల కృతజ్ఞులమై ఉంటే చాలు, మానవాళి సర్వతోముఖాభివృద్ధికి మనం ఎంతో తోడ్పడిన వారమవుతాము.

శ్రీగురుభ్యోనమః.

21, జులై 2020, మంగళవారం

ఆంజనేయం సదా భావయామి - ముత్తుస్వామి దీక్షితులు


ఆంజనేయం సదా భావయామి అప్రమేయం ముదా చింతయామి

అంజనా నందనం వారణేశం వరం పంచవక్త్రం సురేశాది వంద్యం
గురుగుహ హితం సంతతం సదా సేవిత శ్రీరామ పాద పంకజం
సంజీవి పర్వత కరం ముఖాబ్జం సదా రామచంద్ర దూతం భజే

ఆంజనేయుని నేను ఎల్లప్పుడూ భావించెదను. లెక్కించుటకు శక్యము కాని వాని సంతోషముతో ధ్యానించెదను. అంజనాదేవి పుత్రుడు, వానరులకు అధిపతి, శ్రేష్ఠుడు, పంచముఖములు కలవాడు, ఇంద్రాదులచే పూజించబడేవాడు, కుమారస్వామికి హితుడు, నిరంతరం శ్రీరాముని పద కమలములను సేవించేవాడు, సంజీవి పర్వతమును చేతిలో కలవాడు, వికసించిన కలువవంటి ముఖము కలవాడు అయిన శ్రీరామదూతను ఎల్లప్పుడూ భజించెదను.

- ముత్తుస్వామి దీక్షితులు

20, జులై 2020, సోమవారం

సరస్వతీ నమోస్తుతే - జీఎన్ బాలసుబ్రమణ్యం


సరస్వతీ నమోస్తుతే శారదే విద్యాప్రదే

కరధృత వీణా పుస్తక
వర మణిమాలాలంకృత

నరహరి సుత విధి లాలిత నవమణి యుత కంబుగళే
సుర సేవిత పద యుగళే సుధాకర సమధవళే

వీణ, పుస్తకములు చేతులలో ధరించి, శ్రేష్ఠమైన మణుల హారములచే అలంకరించబడిన ఓ సరస్వతీదేవి! నీకు వందనములు. శ్రీహరి సుతుడైన బ్రహ్మదేవునిచే లాలించబడి, నవరత్నములచే శోభిల్లే అందమైన కంఠము కలిగి, దేవతలచే సేవించబడే పదములు కలిగి, చంద్రునితో సమానమైన ధవళకాంతితో యున్న నీకు వందనములు!

- జీఎన్ బాలసుబ్రమణ్యం (ప్రఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసులు, వాగ్గేయకారులు)

తమిళనాట పుట్టినా అప్పుడు అంతా తెలుగుభాష మాట్లాడే వారు, ద్రావిడ ఉద్యమం రాక మునుపు రోజులవి. ప్రతి ఒక్క సంగీత కళాకారుడు కూడా త్యాగరాజు మొదలు ఇతర తెలుగు, కన్నడ వాగ్గేయకారుల కీర్తనలే పాడేవారు. జీఎన్‌బీ కూడా ఆ కోవకే చెందిన వారు. మద్రాసు రాష్ట్రంలో పుట్టినా, తాను రచించిన 250 కీర్తనలలో 90%కు పైగా తెలుగులో రాసినవే. వాటితో పాటు కొన్ని సంస్కృతంలో కూడా రచించారు. వాటిలో ఒకటి ఈ సరస్వతీ నమోస్తుతే. జీ్ఎన్‌బీ ఆనాడు ఓ ఒరవడి సృష్టించిన గాయకులు, నటులు మరియు వాగ్గేయకారులు. ఎమ్మెల్ వసంతకుమారి, రాధ-జయలక్ష్మి వంటి కళాకారులు ఆయన వద్ద శిక్షణ పొందారు. చిన్నవయసులోనే అనారోగ్యం చేయటంతో ఆయన 55 ఏళ్ల వయసులోనే మరణించారు. సరస్వతి రాగంలో ఆయన ఈ సరస్వతీ నమోస్తుతే అనే కృతిని కూర్చారు.

https://www.youtube.com/watch?v=vgnFuoEzGQ8

వేణుగానలోలుని గన వేయి కనులు కావలెనే - త్యాగరాజస్వామి


వేణుగానలోలుని గన వేయి కనులు కావలెనే

అలివేణులెల్ల దృష్టి చుట్టి వేయుచు మ్రొక్కుచు రాగ

వికసిత పంకజ వదనలు వివిధ గతుల నాడగ
ఒకరికొకరు కరమున నిడి యోర కనుల జూడగ
శుక రవములు గల తరుణులు సొగసు గాను బాడగ
సకల సురులు త్యాగరాజ సఖుని వేడగ వచ్చే

వేణుగానములో తన్మయుడై యున్న శ్రీకృష్ణుని చూచుటకు వేయి కన్నులు కావలెను. ఒత్తైన కురులు కలిగిన స్త్రీలు తమ దృష్టంతా ఆ కృష్ణునిపైనే యుంచి ఆయనకు నమస్కరిస్తూ వచ్చే వైభవాన్ని చూచుటకు వేయికన్నులు కావలెను. వికసించిన కలువల వంటి ముఖము కలిగిన స్త్రీలు అనేక గతులలో ఆడగా, ఒకరికొకరు చేతులు పట్టుకుని ఓర కన్నులతో కృష్ణుని చూడగా, చిలుకు పలుకులు కలిగిన స్త్రీలు సొగసుగా పాడగా సమస్త దేవతలు పరమశివుని సఖుడైన శ్రీకృష్ణుని వేడుకొనగా వచ్చే వైభవమును చూచుటకు వేయి కన్నులు కావలెను

(చిత్రం రాజా రవివర్మ)

17, జులై 2020, శుక్రవారం

మారకోటి సుందరి - జీ.ఎన్.బాలసుబ్రహ్మణ్యం


మారకోటి సుందరి మానిని మామవ సదా జగన్మోహిని

శారదా విదుసమవదనే నీరజదళ సులోచనీ

నారదాది పూజిత పావని తారక రిపు శుభ జనని
ఘోర పాప సంతాప శమని పారమార్థిక ఫలదాయిని

కోటిమన్మథుల సౌందర్యము గలిగి, జగన్మోహినివయిన ఓ పార్వతీదేవీ! నన్ను ఎల్లప్పుడూ రక్షించుము. శారదా స్వరూపిణివి, ఏనుగు కుంభస్థల మధ్యము వంటి అందమైన ముఖము, కలువరేకుల వంటి అందమైన కన్నుల గల తల్లీ! నన్ను ఎల్లప్పుడూ రక్షించుము. నారదాదులచే పూజించబడిన పావనీ! తారకాసురుని శత్రువైన సుబ్రహ్మణ్యుని జననీ! ఘోర పాపముల వల్ల కలిగే సంతాపములను తొలగించి పారలౌకిక ఫలములనొసగే తల్లీ! నన్ను ఎల్లప్పుడూ రక్షించుము.

- జీ.ఎన్.బాలసుబ్రహ్మణ్యం

ఇంతకన్నానందమేమి - త్యాగరాజస్వామి


ఇంతకన్నానందమేమి! ఓ రామ రామ!

సంతజనులకెల్ల సమ్మతి యుంటే గాని

ఆడుచు నాదమున పాడుచు ఎదుట రా
వేడుచు మనసున గూడియుండేది చాలు

శ్రీహరి కీర్తనచే దేహాది ఇంద్రియ స
మూహముల మరచి సోహమైనదే చాలు

నీ జపముల వేళనీ జగములు నీపై
రాజిల్లునయ్యా త్యాగరాజనుత చరిత్ర!

ఓ రామయ్యా! ఎల్లప్పుడూ హరికీర్తన చేయు హరిదాసులకిష్టమై యుండుటకన్నా ఆనందమేమున్నది? నాదానందముతో ఆడుచు పాడుచు నిను రమ్మని వేడుకొనుచు వానిపైనే మనసు నిలిపి యుంచుట కన్నా ఆనందమేమి? శ్రీహరివైన నీ నామ సంకీర్తనతో దేహము, ఇంద్రియములను మరచి వానికి తనకు అభేదమైన "సోహం" అనే ఆనందము కలుగును. అంతకన్నా ఆనందమేమున్నది? నిన్ను జపించేవేళ లోకాలన్నీ నీలోనే ప్రకాశించును. శివునిచే నుతించబడిన చరిత్రగల రామా! ఇంతకన్నా ఆనందమేమున్నది?

- సద్గురువులు త్యాగరాజస్వామి

త్యాగరాజస్వామి సజ్జన సాంగత్యములో హరిసంకీర్తనను మించిన ఆనందమేమున్నదన్న అద్భుతమైన భావనను మనకు ఈ కీర్తన ద్వారా వ్యక్తపరచారు. నిరంతర నామస్మరణతో చక్కగా రాగయుక్తంగా ఆడుతూ పాడుతూ మనలను మనం మరచి ఆ హరివైభవాన్ని నుతించి అందులోనే రమించటమనేది ఒక సుకృతం. దానివలన దేహభావనలు తొలగి, మనలోని మలినాలు కఱగి, ఆ పరమాత్మ మనయందే యున్నాడన్న అద్వైత భావము ఎఱిగి సచ్చిదానందము కలుగుతుంది. అంతకన్నా కావలసినదేముంది? ఈ కీర్తనలో భక్తి, యోగము, సత్సంగము, నామ స్మరణ అనే కలియుగంలోని అద్భుత మోక్ష సాధనాలను ఉట్టకించారు త్యాగయ్య. సగుణోపాసనలో ఇవి అత్యంత కీలకమైనవి. బిలహరి రాగంలో అద్భుతమైన శక్తి ఉందని త్యాగరాజస్వామి చరిత్ర మనకు తెలుపుతుంది. మరణశయ్యపైనున్న వానిని బ్రతికించే శక్తి గలిగిన స్వరాలు ఈ రాగంలో ఉంది. ఆరోగ్యాన్ని కలిగించటానికి, మనసును ఉత్తేజపరచటానికి, ఆత్మోద్ధరణకు ఈ రాగం బహుప్రయోజనకరమని పరిశోధనలో తేలింది. సాహిత్యంలోని భావానికి తగిన రాగంలో స్వరపరచారు కాబట్టే త్యాగయ్య మహావాగ్గేయకారునిగా, నాదయోగిగా శాశ్వతంగా నిలిచిపోయారు.