27, డిసెంబర్ 2025, శనివారం

భగవద్రామానుజులు - మేల్కోటే రామప్రియ విగ్రహం

 ఆరోజుల్లో చోళరాజు పెడుతున్న హింసలు భరించలేక భగవద్రామానుజులు తన శిష్యగణంతో మైసూరు సమీపంలోని మేల్కోటేలో దాదాపు 20 ఏళ్లు నివసించారు. అక్కడ ఉన్నప్పుడు ఆయన సనాతనధర్మానికి, సమాజానికి చేసిన సేవ అంతా యింతా కాదు. వేదపాఠశాల, చెలువనారాయణస్వామి దేవస్థాన నిర్మాణం, తత్సంబంధమైన వ్యవస్థల ఏర్పాటు, క్షామంతో అలమటిస్తున్న ప్రజల కోసం తొన్నూరు రిజర్వాయర్ నిర్మాణం...ఇవన్నీ రామానుజుల వారి చలవే. అంతే కాదు, మొట్టమొదటిసారి హరిజనులు దేవాలయ ప్రవేశానికి అనుమతించబడింది చెలువనారాయణుని సన్నిధిలోనే, అది రామానుజుల వారి వల్లే.


అక్కడి మహారాజు విష్ణువర్ధనుని చేత తాలక్కాడ్, తొండనూర్, బేలూరు, నాగమంగళ, బెళవాడి అనే ఐదు ప్రదేశాలలో కీర్తినారాయణ, నంబినారాయణ, కేశవనారాయణ, సౌమ్యనారాయణ, వీరనారాయణ దేవస్థానాలను ఏర్పాటు చేయించి శ్రీవైష్ణవ వ్యాప్తికి, స్థిరత్వానికి తోడ్పడ్డారు. నిజం చెప్పాలంటే శ్రీరంగం కన్నా శ్రీవైష్ణవం నిలబడింది మైసూరు ప్రాంతంలో రామానుల వారు చేసిన ప్రయత్నాల వల్లనే. అందుకే ఆయన పంచ నారాయణ క్షేత్ర ప్రతిష్ఠాపనాచార్యగా ప్రసిద్ధి పొందారు.

అంతే కాదు, 82 ఏళ్ల వయసులో కాలినడకన ఢిల్లీ వెళ్లి మొఘల్ సుల్తాను వద్ద నుండి ఉత్సవమూర్తి అయిన రామప్రియ రూపాన్ని పరిపూర్ణమైన భక్తి మహిమతో సాధించి తీసుకు వచ్చి సనాతనధర్మంలోని భక్తి మార్గం యొక్క గొప్పతనాన్ని మరోమారు చాటి శాశ్వతం చేశారు. బీబీ నాంచారి అన్న గాథ ఈ ఉదంతానికి సంబంధించినదే. ఇస్లాంలో జన్మించినా ఆ రామప్రియ ఉత్సవమూర్తిలోని దైవాన్ని గ్రహించి ఆరాధించ గలిగిన స్త్రీ కాబట్టే ఆమెకు పూజనీయ స్థానం కలిగించారు రామానుజుల వారు.

వెయ్యేళ్ల నాడు రామానుజుల వారు ఢిల్లీ నుండి తెచ్చిన రామప్రియ విగ్రహం ఇదుగో!

రామానుజో విజయతే!



27, అక్టోబర్ 2025, సోమవారం

దేవ కార్యం - పితృ కార్యం

మనం చేసే కార్యాలలో హోమంతో కూడినవి దేవతలకు ప్రీతిగా చేసేవి, పితృదేవతలకు ప్రీతిగా చేసేవి ప్రధానంగా రెండు భాగాలు. పర-అపర కర్మలకు అనుసంధానమైనవి ఇవి. వీటిలో మనం వినే పదాలు స్వాహా స్వధా. ఇవి ఏమిటి?
స్వాహా అన్న పదానికి అగ్ని దేవుని భార్య, హవిష్ప్రదానం అన్నవి ప్రధానమైన అర్థాలు. యజ్ఞకాండలో స్వాహా శబ్దం లేకుండా హవిస్సులు వేల్చడం ఉండదు. ఏ దేవతలను ఉద్దేశించి యజ్ఞాదులు చేస్తున్నారో వారికి హవిస్సులు అందడానికి స్వాహా తప్పనిసరి. ఆహుతులు స్వాహాకార, వషట్కార పూర్వకంగా వేల్చినప్పుడే దేవతలకు అందుతాయి. అయితే, సంధ్యావందనంలో కేశవ నామాలు చెప్పేటప్పుడు త్రిరాచమ్య అంటూ ముమ్మారు స్వాహాకారంతో ఆచమనం చేయడం పద్ధతి. ఇక్కడ హోమాగ్ని ప్రసక్తి లేదు. అయినప్పటికీ అవి దేవతలకు సమర్పించేవే కనుక స్వాహా శబ్దాన్ని వాడవలసి వస్తున్నది. స్వాహా శబ్దం హోమ సంబంధమైన సాంకేతిక పదం మాత్రమే కాదు. అది సార్థకమైన వాఙ్నామం కూడా. చక్కగా హుతమగుగాక అనే అర్థాన్ని కొందరు భాష్యకారులు ఉదహరించారు. ఇది మహామహిమాన్వితమైన మంత్రమని కొందరు విద్వాంసుల భావన. వేద మంత్రాలు లేకుండానే స్వాహా మంత్రోచ్చారణ చేసే సందర్భాలు ఉన్నాయి. నిత్యనైమిత్తిక కర్మలలోనూ యజ్ఞ యాగాదులలోనూ ఆచమన క్రియతో స్వాహా సాక్షాత్కరించడం ప్రారంభ మవుతుంది. దేవతలకు ఆహుతులను అందించే శబ్దంగా స్వాహా ప్రసిద్ధమైంది. అంతే కాదు అనేక మంత్రాలకు చివర స్వాహా ఉంటుంది. స్వాహా దేవికి ప్రీతికరమైనది ఘృతము. అందుకే అగ్ని కార్యాలలో ఘృతము ప్రధానమైన భుక్కు.
అగ్నికార్యంలో/ యజ్ఞాలలో స్వాహా శబ్దం వినిపించినట్లే పితృ దేవతలకు తర్పణాలు ఇవ్వడంలో స్వధా శబ్దం వినిపిస్తుంది. పితృయజ్ఞాలలో స్వాహాదేవియే తర్పణాలలో స్వధా రూపిణిగా వస్తున్నదని శాస్త్రం. (పితృ యజ్ఞేషు స్వధా మాతా) పితృ దేవతలను ఉద్దేశించి వషట్కారం చేయడం స్వధాకారం.(స్వధానమ ఇతి వషట్కారపి). అగ్ని దేవుని భార్య స్వాహాదేవి యొక్క మరో రూపం స్వధా. ఈ స్వధా దేవికి ప్రీతికరమైనవి నల్ల నువ్వులు. అందుకే నల్ల నువ్వులను తర్పణ విధి పూర్వకంగా భుక్కుగా పితృదేవతలకు సమర్పిస్తాము. స్వధానమ తర్పయామి అన్న మంత్రం శ్రాద్ధ కర్మలలో వినిపించే మంత్రం. ఈ మంత్రాన్ని పఠించేటప్పుడు గోత్రం పేరు మరియు రూపాన్ని (వసు రూపం, రుద్ర రూపం, ఆదిత్య రూపం) పేర్కొని, తదనంతరం "స్వధా నమః తర్పయామి" అని మూడు సార్లు చెప్పి తర్పణం సమర్పిస్తాము.
మీరు పై నిర్వచనాలను, ప్రయోజనాలను గమనిస్తే రెండు విభాగాల ప్రక్రియలు కూడా చాలా సారూప్యత కలిగి ఉంటాయి. అందుకే పితృకార్యాలకు, ఇతర అగ్నికార్యాలతో సమానమైన స్థానం, ప్రయోజనాన్ని చెప్పారు మన ఋషులు.
రెండిటిలో ప్రధానమైన భేదాలు రెండిటి మధ్య తేడాను స్పష్టంగా తెలుపటానికి సాంకేతికంగా ఏర్పడినవే అని నా ఉద్దేశం. అందుకే పితృకార్యాలను ఇతర అగ్నికార్యాలను అంతే పవిత్రంగా, అంతే నమ్మకంతో, భక్తి పూర్వకంగా నిర్వర్తించాలి అని ప్రాజ్ఞులు నొక్కివక్కాణిస్తారు.

10, ఏప్రిల్ 2024, బుధవారం

అనరాదు వినరాదు ఆతని మాయలు నేడు - శ్రీరంగం గోపాలరత్నం ఆలపించిన అన్నమయ్య కృతి

తెలుగు గడ్డ మీద పుట్టిన ఓ అనర్ఘ్యరత్నం శ్రీరంగం గోపాలరత్నం గారు. ఆవిడ దివికేగి మూడు దశాబ్దాలు దాటినా ఈనాటికీ కూడా అటువంటి గాత్రం మళ్లీ తెలుగు గడ్డ మీద పుట్టలేదు. ఆవిడ గాత్ర మాధుర్యం, తెలుగుదనం ఉట్టిపడే ప్రతిభ అనన్యం. దాదాపు నాలుగు దశాబ్దాల సంగీత ప్రస్థానంలో ఆవిడ తెలుగు గడ్డపై శాస్త్రీయ సంగీతానికి మహారాణిగా నిలిచారంటే అతిశయోక్తి కాదు. కవిరాయుని జోగారావు గారు, డాక్టర్ శ్రీపాద పినాకపాణి గారి వద్ద సంగీతాన్ని అభ్యసించారు. అతిపిన్న వయసులోనే హరికథలు ఆలపించారు. 

ఆవిడ ఆలపించిన ఓ అన్నమాచార్యుల వారి కృతి, బాలకృష్ణుని లీలలపై, ఆరభి రాగంలో స్వరపరచబడింది. అన్నమాచార్యుల వారికి ఆ కృష్ణుని లీలలు ఎంత అద్భుతంగా కనబడ్డాయో అంతకు మించి అందంగా ఆయన పదాలలో వెలువడ్డాయి. అన్నమాచార్యుల సాహిత్యమంటేనే తెనుగుదనం ఉట్టీపడే జానపదాలు. గోపాలరత్నం గారు ఈ కృతిని రమ్యాతిరమ్యంగా ఆలపించారు.  

అనరాదు వినరాదు ఆతని మాయలు నేడు
దినదిన క్రొత్తలాయదృష్టమిదే మాకు

ఆడెడి బాలుల హరి అంగిలి చూపుమని
తోడనే వాండ్ల నోర దుమ్ములు చల్లి
యీడ మాతో చెప్పగాను యిందరము గూడిపోయి
చూడబోతే పంచదారై చోద్యమాయెనమ్మా

తీట తీగెలు సొమ్మంటూ దేహము నిండ గట్టె
తీటకుగాక బాలులు తెగి వాపోగా
పాటించి యీ సుద్ది విని పారితెంచి చూచితేను
కోటికోటి సొమ్ములాయ కొత్తలోయమ్మా

కాకి జున్ను జున్నులంట గంపెడేసి తినిపించి
వాకొలిపి బాలులెల్ల వాపోవగా 
ఆకడ శ్రీవేంకటేశుడా బాలుల కంటి నీరు
జోకగ ముత్యాలుసేసె జూడగానమ్మా 

ఓ యశోదమ్మా! ఈ చిన్ని కృష్ణుని మాయలు అంతా ఇంతా అని చెప్పలేము, ప్రతి రోజు కొత్త కొత్తగా ఉన్న ఈ మాయలను చూడటం మా అదృష్టం. తనతో ఆడే బాలురి అంగిలి చూపమని చెప్పి వారు నోరు తెరవగానే దుమ్ము చల్లాడుట. ఆ మాట పిల్లలు మాకు చెప్పగా మేమందరము వెళ్లి చూస్తే ఆ దుమ్మంతా పంచదారయ్యింది, ఇదేమి వింతో! దురదలు పుట్టించే తీగెలు ఆభరణాలంటూ తోటి బాలుర దేహముపై కృష్ణుడు కట్టాడుట, ఆ దురదలు భరించలేక బాలులు మా వద్ద వాపోగా, మేమంతా వెళ్లి చూస్తే ఆ తీగెలు అమూల్యమైన కొత్త ఆభరాణాలయినాయమ్మా! చిన్న చిన్న జున్ను ముద్దలు  గంపల కొద్దీ తోటి బాలురకు తినిపించాడుట, వారు ఆ వికారాన్ని భరించలేక మా వద్ద వాపోయారు. మేమంతా వెళ్ళి చూడగా శ్రీనివాసుడా బాలుల కంటి నీరును అద్భుతంగా ముత్యాలుగా మార్చేసాడమ్మా!  

3, సెప్టెంబర్ 2021, శుక్రవారం

క్షీరసాగర విహార - త్యాగరాజస్వామి కృతి



ఈ కృతి బాలమురళీకృష్ణ గారి గాత్రంలో వింటుంటే ఎంతటి కఠినమైన హృదయమైనా కరిగి పోవలసిందే. త్యాగరాజాది భక్తులను పోషించిన శ్రీరామచంద్రమూర్తి గుణవైభవాన్ని అద్భుతంగా ఆవిష్కరించే కృతి ఇది. త్యాగరాజస్వామి ఉత్సవ సాంప్రదాయ కృతులలో ఒకటి, బాలమురళీకృష్ణ గారు ఎంతో ప్రాచుర్యంలోకి తీసుకు వచ్చారు. ఆనందభైరవి రాగంలో స్వరపరచబడింది. త్యాగరాజ శిష్యపరంపరలో ఐదవ తరానికి చెందిన వారు బాలమురళీకృష్ణ గారు. సద్గురువుల సాహిత్యం, స్వరరచన యథాతథంగా కొనసాగించిన వారిలో మంగళంపల్లి వారు అగ్రగణ్యులు. వారి గాత్రంలో ఈ కృతిని విని ఆనందించండి. 

క్షీరసాగర విహార! అపరిమిత ఘోర పాతక విదార!
క్రూర జన గణ విదూర! నిగమ సంచార! సుందర శరీర!

శతమఖాऽహిత విభంగ! శ్రీరామ! శమన రిపు సన్నుతాంగ!
శ్రితమానవాంతరంగ! జనకజా శృంగార జలజ భృంగ!

రాజాధిరాజ వేష! శ్రీరామ! రమణీయ కర సుభూష!
రాజనుత లలిత భాష! శ్రీ త్యాగరాజాది భక్త పోష!

పాలకడలిలో విహరించేవాడు, అనంతమైన ఘోర పాపములను నాశనము చేసేవాడు, రాక్షస సమూహాన్ని సంహరించేవాడు, వేదములలో సంచరించేవాడు, సుందరమైన శరీరము కలవాడు, నూరు యజ్ఞములు చేసిన ఇంద్రుని శత్రువులను నాశనము చేసేవాడు, మన్మథుని శత్రువైన పరమశివునిచే నుతించబడినవాడు, ఆశ్రయించినవారి హృదయములలో నివసించేవాడు, కలువ వంటి సీతమ్మ పాలిట తుమ్మెద వంటివాడు, రాజాధిరాజు అయినవాడు, అందమైన హస్తములు కలిగి, చక్కని ఆభరణములు ధరించినవాడు, రాజులచే నుతించబడినవాడు, మృదువుగా మాట్లాడేవాడు, త్యాగరాజు మొదలైన భక్తులను పోషించేవాడు శ్రీరాముడు. 

- త్యాగరాజస్వామి

25, జనవరి 2021, సోమవారం

ఆనందసాగరమీదని దేహము - త్యాగరాజస్వామి కృతి

త్యాగరాజస్వామి వారి నాదయోగంలో బ్రహ్మానందస్థితిలో రచించిన కృతులెన్నో. ఆ అనందాన్ని అనుభవించలేని దేహం భూమికి భారమే అన్నది కూడా ఆయన స్పష్టంగా చెప్పారు. బ్రహ్మవిష్ణుమహేశ్వరులు, ఎందరో మహానుభావులు చేసిన నాదోపాసనను మానవుడూ కూడా అనుభూతి చెందాలన్నది సద్గురువుల సందేశం. అటువంటి భావమున్న కృతి ఆనందసాగరమీదని దేహము. వివరాలు:

సాహిత్యం
========

ఆనందసాగరమీదని దేహము భూమిభారమే రామబ్రహ్మా(నందసాగర)

శ్రీనాయకాఖిల నైగమాశ్రిత సంగీత జ్ణానమను బ్రహ్మా(నందసాగర)

శ్రీవిశ్వనాథ శ్రీకాంత విదులు పావనమూర్తులుపాసించలేదా
భావించి రాగలయాదుల భజియించే శ్రీత్యాగరాజనుత 

భావం
=====

ఓ రామా!సీతాపతీ! రామ పరబ్రహ్మమనే ఆనందసాగరములో ఈదని దేహము ఈ భూమికి భారమే. సమస్త వేదములకు ఆశ్రయమైన సంగీత జ్ఞానమనే బ్రహ్మానందమనే సాగరాన్ని అనుభూతి చెందని దేహము భారమైనది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, నిర్మలరూపులు సంగీతాన్ని ఆస్వాదిస్తూ ఉపాసించినారు కదా! ఆ విధముగా భావించి రాగలయాదులతో భజించే పరమశివునిచే నుతించబడే శ్రీరామా! బ్రహ్మానందమనే సాగరాన్ని అనుభూతి చెందని దేహము భారమైనది. 

శ్రవణం
======

గరుడధ్వని రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని కృత్తికా నటరాజన్ గారు ఆలపించారు.

16, జనవరి 2021, శనివారం

చిదంబర నటరాజమాశ్రయేऽహం - ముత్తుస్వామి దీక్షితుల కృతి


పంచభూతలింగ క్షేత్రాలలో ఒకటైన చిదంబరంలో నటరాజస్వామి, శివకామసుందరీ అమ్మ వారు, ఈ క్షేత్రంలోనే ఉన్న గోవిందరాజస్వామిపై నాదజ్యోతి ముత్తుస్వామి దీక్షితుల వారు ఎన్నో కృతులను రచించారు. చిదంబర క్షేత్రం విశ్వానికి హృదయస్థానంగా, చిత్సభలో నటరాజస్వామి చేసే నాట్యం యొక్క లయే విశ్వానికి హృదయస్పందంగా చెప్పబడింది. ఎంతో నిగూఢమైన సందేశం కలిగిన కృతులను ఆయన ఈ క్షేత్ర దేవతలపై రచించారు. వాటిలో ముఖ్యమైనవి ఆనందనటనప్రకాశం, చిదంబరేశ్వరం, శివకామీపతిం చింతయేऽహం, శివకామేశ్వరీం చింతయేऽహం, శివకామేశ్వరం చింతయామ్యహం, చింతయేऽహం సదా చిత్సభా నాయకం, గోవిందరాజాయ నమస్తే, సతతం గోవిందరాజం మొదలైనవి. వీటితో పాటు చిదంబర నటరాజమాశ్రయేऽహం అన్న కృతిని కూడా రచించారు. వివరాలు:

సాహిత్యం
=======

చిదంబర నటరాజమాశ్రయేऽహం శివకామీపతిం చిత్సభాపతిం

చిదంబరవిహారం శంకరం చిదానందకరం గురుగుహవరం
కేదారేశ్వరం విశ్వేశ్వరం కమలాపతి నుత పదం శశిధరం

భావం
=====

చిత్సభకు ప్రభువు, శివకామసుందరికి పతియిన చిదంబర నటరాజస్వామిని నేను శరణు కోరుచున్నాను. ఆకాశలింగ రూపములో చిదంబరంలో విహరించేవాడు, శాశ్వతమైన ఆనందమును కలిగించేవాడు, సుబ్రహ్మణ్యునికి వరములొసగినవాడు, కేదారేశ్వరునిగా కేదారనాథ్‌లో వెలసినవాడు, విశ్వమునకు ప్రభువు, లక్ష్మీపతి యైన శ్రీహరిచే నుతించబడిన పదములు కలవాడు, చంద్రుని తలపై ధరించినవాడు అయిన చిదంబర నటరాజస్వామిని నేను శరణు కోరుచున్నాను. 

శ్రవణం
======

కేదారం రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని ఐశ్వర్యా శంకర్ గారు ఆలపించారు

13, జనవరి 2021, బుధవారం

దొరకునా ఇటువంటి సేవ - త్యాగరాజస్వామి కృతి


త్యాగరాజస్వామి కృతులలో కొన్ని చాలా ప్రత్యేకమైనవి. ముఖ్యంగా రాముని సేవా భాగ్యం యొక్క గొప్పతనాన్ని ప్రస్తావించే ఉన్నతస్థాయి కృతులను ఎన్నో రచించారు. రాముని రూప లావణ్యాలను, ముక్కోటి దేవతలు, భాగవతోత్తములు శ్రీరాముని అనేక ఉపచారముల ద్వారా కొలిచే రీతిని కళ్లకు కట్టినట్లు వర్ణించి, మనసులు ఉప్పొంగి రామభక్తి సామ్రాజ్యంలో మనం కూడా అంతర్భాగం కావాలన్న సంకల్పం కలిగేలా చేశారు. ఆయన నిరంతర రామ సేవా భాగ్యంలో తరిస్తూ రచించిన ఈ కృతులు అమృతధారలై నిలిచాయి. అటువంటి ఒక కృతి దొరకునా ఇటువంటి సేవ. వివరాలు:

సాహిత్యం
========

దొరకునా ఇటువంటి సేవ

దొరకునా అల్ప తపమొనరించిన భూసురవరులకైన సురలకైన 

తుంబురు నారదాదులు సుగుణ కీర్తనంబుల నాలాపము సేయగ
అంబరీషముఖ్యులు నామము సేయగ జాజుల పై జల్లగ
బింబాధరలగు సురవార యలివేణులు నాట్యము లాడగ
అంబుజ భవ పాకారులిరుగడలనన్వయ బిరుదావళినిపొగడగ
అంబరవాస సతులు కర కంకణంబులు ఘల్లని విసరగ మణి హా
రంబులు కదలగ నూచే ఫణి తల్పంబున నెలకొన్న హరిని కనుగొన

మరకత మణి సన్నిభ దేహంబున మెరుగు కనక చేలము శోభిల్ల
చరణ యుగ నఖావళి కాంతులు చందురు పిల్లలను గేర
వర నూపురము వెలుగు కర యుగమున వజ్రపు భూషణములు మెరయ
ఉరమున ముక్తాహారములు మరియు ఉచితమైన మకర కుండలంబులు
చిరు నవ్వులు గల వదనంబున ముంగురులద్దంపు కపోలము ముద్దు
గురియు దివ్యఫాలంభున దిలకము మెరసే భువిని లావణ్యనిధిని గన

తామస గుణ రహిత మునులకు బొగడ దరము గాకనే భ్రమసి నిల్వగ
శ్రీమత్కనకపు దొట్ల పైని చెలువందగ కొలువుండగ
కామిత ఫలదాయకియౌ సీత కాంతుని గని యుప్పొంగగ
రామబ్రహ్మ తనయుడౌ త్యాగరాజు తాబాడుచు నూచగ
రాముని జగదోద్ధారుని సురరిపు భీముని త్రిగుణాతీతుని పూర్ణ
కాముని చిన్మయరూపుని సద్గుణధాముని కనులార మదిని కనుగొన

భావం
=====

సూక్ష్మమైన తపము చేసిన బ్రాహ్మణులకైనా, దేవతలకైనా ఇటువంటి రామ సేవాభాగ్యము దొరకునా? తుంబురు నారదులు సుగుణములను పొగడే కీర్తనలను ఆలాపన చేయగా, అంబరీషుడు వంటి భక్తాగ్రగణ్యులు నామమును నుతించగా, జాజులను చల్లుతూ ఎర్రని పెదవులు కలిగిన దేవ కన్యలు నాట్యము చేయగా, బ్రహ్మేంద్రాదులు ఇరుపక్కల అనేక బిరుదులతో పొగడగా, ఆకాశములో నివసించే సతులు చేతుల కంకణములు ఘల్లనిపించగా, మణిహారములు ఊగగా నూచే శేషతల్పశాయియైన హరిని చూచే సేవాభాగ్యము దొరకునా? పచ్చలకాంతి వంటి ప్రకాశము కలిగిన దేహముపై మెరిసే బంగారు వస్త్రము శోభిల్లగా, పాదములగోళ్ల కాంతులు చంద్రకాంతులను పోలగా, మంచి మంజీరములు పాదములపై వెలుగొందగా, చేతులయందు వజ్రాల ఆభరణాలు మెరయగా, కంఠమున ముత్యాల హారములు, చెవులకుచితమైన మకర కుండలములు, చిరునవ్వులు కలిగిన ముఖమున ముంగురులు, అద్దము వంటి చెక్కిళ్లు ముద్దులు కురిపించగా, దివ్యమైన నుదుట మెరిసే తిలకము కలిగిన ఈ భూమిపై సౌందర్యమునకు నిధియైన రాముని చూచే సేవాభాగ్యము దొరకునా? తామస గుణరహితులైన మునులకు పొగడ శక్యము గాక చకితులై నిలువగా, కనకపు ఊయలపై అందముగా కొలువుండిన, కోరిన వరములొసగే సీతమ్మ పతిదేవుని చూచి ఉప్పొంగగా, కాకర్ల రామబ్రహ్మం తనయుడైన త్యాగరాజు తాను పాడుచు ఊపగా, జగదోద్ధారకుడు, రాక్షసుల పాలిట అరివీరభయంకరుడు, త్రిగుణాతీతుడు, పూర్ణకాముడు, సచ్చిదానంద స్వరూపుడు, సద్గుణములకు నెలవైన రాముని కనులార మనసులో కనుగొనే సేవాభాగ్యము దొరకునా? 

శ్రవణం
=======

బిలహరి రాగంలో ఈ కృతిని రంజని-గాయత్రి సోదరీమణులు పాడగా వినండి

గానగంధర్వుడు ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం – భాగం 1

శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, అభిమానులందరికీ బాలు, ఎస్. పి. బి.గా సుపరిచితులైన ఈ మహాగాయకుడు భారతీయ సినీ సంగీత చరిత్రలో అరుదైన బహుము...