13, జనవరి 2021, బుధవారం

దొరకునా ఇటువంటి సేవ - త్యాగరాజస్వామి కృతి


త్యాగరాజస్వామి కృతులలో కొన్ని చాలా ప్రత్యేకమైనవి. ముఖ్యంగా రాముని సేవా భాగ్యం యొక్క గొప్పతనాన్ని ప్రస్తావించే ఉన్నతస్థాయి కృతులను ఎన్నో రచించారు. రాముని రూప లావణ్యాలను, ముక్కోటి దేవతలు, భాగవతోత్తములు శ్రీరాముని అనేక ఉపచారముల ద్వారా కొలిచే రీతిని కళ్లకు కట్టినట్లు వర్ణించి, మనసులు ఉప్పొంగి రామభక్తి సామ్రాజ్యంలో మనం కూడా అంతర్భాగం కావాలన్న సంకల్పం కలిగేలా చేశారు. ఆయన నిరంతర రామ సేవా భాగ్యంలో తరిస్తూ రచించిన ఈ కృతులు అమృతధారలై నిలిచాయి. అటువంటి ఒక కృతి దొరకునా ఇటువంటి సేవ. వివరాలు:

సాహిత్యం
========

దొరకునా ఇటువంటి సేవ

దొరకునా అల్ప తపమొనరించిన భూసురవరులకైన సురలకైన 

తుంబురు నారదాదులు సుగుణ కీర్తనంబుల నాలాపము సేయగ
అంబరీషముఖ్యులు నామము సేయగ జాజుల పై జల్లగ
బింబాధరలగు సురవార యలివేణులు నాట్యము లాడగ
అంబుజ భవ పాకారులిరుగడలనన్వయ బిరుదావళినిపొగడగ
అంబరవాస సతులు కర కంకణంబులు ఘల్లని విసరగ మణి హా
రంబులు కదలగ నూచే ఫణి తల్పంబున నెలకొన్న హరిని కనుగొన

మరకత మణి సన్నిభ దేహంబున మెరుగు కనక చేలము శోభిల్ల
చరణ యుగ నఖావళి కాంతులు చందురు పిల్లలను గేర
వర నూపురము వెలుగు కర యుగమున వజ్రపు భూషణములు మెరయ
ఉరమున ముక్తాహారములు మరియు ఉచితమైన మకర కుండలంబులు
చిరు నవ్వులు గల వదనంబున ముంగురులద్దంపు కపోలము ముద్దు
గురియు దివ్యఫాలంభున దిలకము మెరసే భువిని లావణ్యనిధిని గన

తామస గుణ రహిత మునులకు బొగడ దరము గాకనే భ్రమసి నిల్వగ
శ్రీమత్కనకపు దొట్ల పైని చెలువందగ కొలువుండగ
కామిత ఫలదాయకియౌ సీత కాంతుని గని యుప్పొంగగ
రామబ్రహ్మ తనయుడౌ త్యాగరాజు తాబాడుచు నూచగ
రాముని జగదోద్ధారుని సురరిపు భీముని త్రిగుణాతీతుని పూర్ణ
కాముని చిన్మయరూపుని సద్గుణధాముని కనులార మదిని కనుగొన

భావం
=====

సూక్ష్మమైన తపము చేసిన బ్రాహ్మణులకైనా, దేవతలకైనా ఇటువంటి రామ సేవాభాగ్యము దొరకునా? తుంబురు నారదులు సుగుణములను పొగడే కీర్తనలను ఆలాపన చేయగా, అంబరీషుడు వంటి భక్తాగ్రగణ్యులు నామమును నుతించగా, జాజులను చల్లుతూ ఎర్రని పెదవులు కలిగిన దేవ కన్యలు నాట్యము చేయగా, బ్రహ్మేంద్రాదులు ఇరుపక్కల అనేక బిరుదులతో పొగడగా, ఆకాశములో నివసించే సతులు చేతుల కంకణములు ఘల్లనిపించగా, మణిహారములు ఊగగా నూచే శేషతల్పశాయియైన హరిని చూచే సేవాభాగ్యము దొరకునా? పచ్చలకాంతి వంటి ప్రకాశము కలిగిన దేహముపై మెరిసే బంగారు వస్త్రము శోభిల్లగా, పాదములగోళ్ల కాంతులు చంద్రకాంతులను పోలగా, మంచి మంజీరములు పాదములపై వెలుగొందగా, చేతులయందు వజ్రాల ఆభరణాలు మెరయగా, కంఠమున ముత్యాల హారములు, చెవులకుచితమైన మకర కుండలములు, చిరునవ్వులు కలిగిన ముఖమున ముంగురులు, అద్దము వంటి చెక్కిళ్లు ముద్దులు కురిపించగా, దివ్యమైన నుదుట మెరిసే తిలకము కలిగిన ఈ భూమిపై సౌందర్యమునకు నిధియైన రాముని చూచే సేవాభాగ్యము దొరకునా? తామస గుణరహితులైన మునులకు పొగడ శక్యము గాక చకితులై నిలువగా, కనకపు ఊయలపై అందముగా కొలువుండిన, కోరిన వరములొసగే సీతమ్మ పతిదేవుని చూచి ఉప్పొంగగా, కాకర్ల రామబ్రహ్మం తనయుడైన త్యాగరాజు తాను పాడుచు ఊపగా, జగదోద్ధారకుడు, రాక్షసుల పాలిట అరివీరభయంకరుడు, త్రిగుణాతీతుడు, పూర్ణకాముడు, సచ్చిదానంద స్వరూపుడు, సద్గుణములకు నెలవైన రాముని కనులార మనసులో కనుగొనే సేవాభాగ్యము దొరకునా? 

శ్రవణం
=======

బిలహరి రాగంలో ఈ కృతిని రంజని-గాయత్రి సోదరీమణులు పాడగా వినండి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి