29, జులై 2017, శనివారం

రామా నిను నమ్మినవారము గామా - త్యాగరాజస్వామి కీర్తన


రామా నిను నమ్మినవారము గామా సకల లోకాభి 

పామర జన దూర వర గుణ ఘృణాపాంగ శుభాంగ ముని హృదయాబ్జ భృంగ 

వాలాయముగాను రాను జాగేల సుగుణ దశరథ నృపాల హృదయానందకార శ్రి లోల పాల వెలయుమిక
ఫాల లోచన హృదయాలయాప్త జన పాల కనకమయ చేల ఇక పరాకేల ఇపుడు మమ్మేల నీదు మనసేల రాదు

నీవే గతి యంటిని గాని నే వేరేమి ఎరుగను ముందర రావే నీ పద పంకజ భక్తి నీవే భావజారి నుత
దేవ నీదు పద సేవా ఫలము మము గావునే పతిత పావన త్రిదశ నాధనీయ ముని జీవనానిశము బ్రోవనేల శ్రీరామ 

ధారాధర నిభ దేహ జనాధార దురితాఘ జలద సమీర త్యాగరాజ హృదయాగార సార హీన సం
సారమందు వేసారి నిన్ను మనసార నమ్ము కొన నేరలేని నే నూరక ఇక విచారమందుటకు మేర గాదు శ్రీరామ

సమస్త లోకములకు ఆనందంకు కలిగించే శ్రీరామా! మేము నిన్ను నమ్మినవారము గామా? పామరులకు దూరుడవు, శ్రేష్ఠమైన గుణములు కలవాడవు, దయాకటాక్షములు గలవాడవు, శుభమైన అంగములు కలవాడవు, మునుల హృదయకమలములకు తుమ్మెద వంటి వాడవు నీవు. దశరథ మహారాజు హృదయమునకు ఆననందము కలిగించిన వాడవు మమ్ములను కాపాడుటకు వేగముగా రావేల? వచ్చి రక్షించుము. శివుని హృదయములో నివసించే వాడవు, ఆప్తజనులను పాలించే వాడవు, బంగారు వస్త్రములు ధరించే వాడవు, ఇంక పరాకెందుకు? ఇప్పుడు మమ్ములను కాపాడుటకు నీకు మనసేల కలుగుటలేదు? నీవే శరణన్నాను, నీ పాదపద్మముల భక్తి తప్ప వేరేమీ ఎరుగను, వేగముగా వచ్చి కాపాడుము. మన్మథుని శత్రువైన శివునిచే నుతించబడిన వాడవు, నీ పాదములను సేవించే ఫలము మమ్ములను కాపాడును కదా! పతితులను పావనము చేసే వాడవు, మూడులోకములకు అధిపతివి, మునుల జీవనమైన వాడవు, ఎల్లప్పుడూ మమ్ములను బ్రోచుటకేల ఆలస్యము? మేఘముల వంటి కాంతితో శరీరము గల శ్రీరామా! జనులకు ఆధారము నీవే. పాపములనెడి మేఘములను వాయువు వలె తరిమి కొట్టేవాడవు, శివుని హృదయములో నివసించే వాడవు, ఈ సారములేని సంసార సాగరమందు వేసారి నిన్ను మనసారా నమ్ముకొన్నాను, నిస్సహాయుడైయున్న నన్ను బాధ పెట్టుట ఇంక మర్యాద కాదు శ్రీరామా! మేము నిన్ను నమ్మినవారము, వేగమే వచ్చి మమ్ము రక్షించుము.

- సద్గురువు త్యాగరాజస్వామి

మోహన రాగంలో కూర్చబడిన ఈ కృతి ద్వారా త్యాగరాజస్వామి వారు తాను రామునితో చేసుకున్న విన్నపాలు, ఫిర్యాదులు, వేడుకోలు అన్నీ కలిపి ద్వైత భావనను కురిపించారు. రాముని వైభవాన్ని కొనియాడుతూనే తనను కాపాడటం లేదని కాస్త కినుక కూడా చూపించారు. ఎందరినో  బ్రోచిన నీవు నన్నెలా  బ్రోవవు అన్న భావనను ఈ కీర్తన ద్వారా వ్యక్తపరచారు. అన్నీ వదలి  నిన్ను నమ్ముకున్నాను అని ఆర్తితో నుతించారు. మోహన రాగం ఇటువంటి భావానికి పెట్టిన పేరు. మహారాజపురం సంతానం గారి గాత్రంలో మోహన రాగం మరింత సమ్మోహనంగా ఉంటుంది. ఆయన గాత్రంలో ఈ కృతి వినండి

దేవాది దేవ! సదాశివ! - త్యాగరాజస్వామి కృతి


దేవాది దేవ! సదాశివ! దిననాధ సుధాకర దహన నయన!

దేవేశ! పితామహ మృగ్య! శమాది గుణాభరణ! గౌరీ రమణ!

భవ! చంద్ర కళాధర! నీలగళ!
భాను కోటి సంకాశ! శ్రీశ నుత!
తవ పాద భక్తిం దేహి దీన బంధో!
దర హాస వదన! త్యాగరాజ నుత!

దేవాది దేవా! సూర్య చంద్రాదులు, అగ్ని మూడు కన్నులుగా గల సదాశివా! ఓ పరమేశ్వరా! పార్వతీ పతీ! శమదమాది గుణములచే అలంకరించబడిన నీవు బ్రహ్మ కూడా అందని వాడవు! శివా! చంద్రుని శిరసుపై ధరించి, గరళమును కంఠములో నిలుపుకొని, కోటి సూర్యుల ప్రకాశిస్తూ విష్ణువుచే నుతించబడిన వాడవు. త్యాగరాజునిచే నుతించబడి, చిరునవ్వు ముఖము కలిగిన ఓ దీనబంధో! నీ పదముల యందు భక్తిని నాకు ప్రసాదించుము!

- సద్గురువులు త్యాగరాజస్వామి

తిరువాయూరులో 1986వ సంవత్సరంలో ప్రధాని రాజీవ్ గాంధీ, ముఖ్యమంత్రి ఎంజీఆర్, విదేశాంగమత్రి పీవీ నరసింహారావు గారు ఉన్న సభలో ఎమ్మెస్ సుబ్బులక్ష్మి, రాధ విశ్వనాథన్ కలిసి చేసిన కచేరీలో ద్వారం మంగతాయారు గారు వయోలిన్, కేవీ ప్రసాద్ గారు మృదంగం. వీరు ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారికి 15 ఏళ్లు మృదంగ సహకారం అందించారు.  ఆ సభలో ఎమ్మెస్ సుబ్బులక్ష్మి-రాధా విశ్వనాథన్ కలిసి ఆలపించిన ఈ కృతి చూడండి. .

భజరే చిత్త బాలాంబికాం - ముత్తుస్వామి దీక్షితుల ఆధ్యాత్మిక సంపద


భజరే చిత్త బాలాంబికాం భక్త కల్ప లతికాం

నిజరూప దాన దక్ష చరణం
అరుణాం నిత్యాం కళ్యాణీం శర్వాణీం

శ్రీ వాగ్భవ కూట జాత చతుర్వేద స్వరూపిణీం
శృంగార కామ రజోద్భవ సకల విశ్వ వ్యాపినీం
దేవీం శక్తి బీజోద్భవ మాత్రృకార్ణ శరీరిణీం
దేవనుత భవ రోగ హర వైద్యపతి హృదయ విహారిణీం
భావ రాగ తాళ మోదినీం భక్తాభీష్ట ప్రదాయినీం
సేవక జన పాలన గురుగుహ రూప ముద్దు కుమార జననీం

ఓ మనసా! భక్తుల పాలిట కల్పతరువైన బాలాంబికను భజింపుము. నిజరూప దర్శన భాగ్యము కలిగించే చరణములు కలిగి, సూర్యకాంతి కలిగి, శాశ్వతమై, శుభకరమైన శర్వుని పత్ని అయిన ఆమ్మను భజింపుము. వాగ్భవ కూట బీజాక్షరములనుండి (లలితాదేవి పంచదశాక్షరీ మంత్రములోని మొదటి ఐదు బీజాక్షరాలైన క ఏ ఈ ల హ్రీం అనే అక్షర సంపుటిని వాగ్భవ కూట అంటారు) జన్మించిన, నాలుగు వేదాల స్వరూపిణి అయిన, శృంగార రూపిణిగా కామ రజో కూట బీజాక్షరములనుండి (పంచదశాక్షరిలోని తదుపరి ఆరు అక్షరాలు హ స క హ ల హ్రీం కామ రజో కూట అంటారు) ఉద్భవించిన, సమస్త లోకములు వ్యాపించియున్న బాలాంబికను భజించుము. శక్తి కూట బీజాక్షర సంపుటి నుండి (పంచదశాక్షరిలోని తదుపరి నాలుగు బీజాక్షరాలు స కల హ్రీం శక్తి కూటగా అంటారు) జన్మించిన, ఈ విధంగా అక్షరమాలా శరీరిణి అయిన దేవిని భజింపుము. దేవతలచే నుతించబడిన, ఈ దేహరోగములను హరించే వైద్యనాథుని హృదయ విహారిణి అయిన, భావము, రాగము, తాళములచే మోదము పొందే, భక్తుల కామ్యములను ప్రసాదించే అమ్మను భజించుము. సేవించే జనులను పాలిచించే, గురుగుహ రూపమైన కుమారస్వామి జనని అయిన బాలాంబికను భజింపుము.

- ముత్తుస్వామి దీక్షితుల వారు

దీక్షితుల వారు గొప్ప శ్రీవిద్యా ఉపాసకులు. మంత్ర సిద్ధి ద్వారా అమ్మ అనుగ్రహం పొందిన ఆధ్యాత్మిక సంపన్నులు. ఈ సాధనలోనే ఆయన అద్భుతమైన కీర్తనలు రచించారు. ఆయన కృతులలో మంత్ర శాస్త్రం ప్రకాశిస్తూ ఉంటుంది. బీజాక్షర యుతమై, లలితాసహస్ర నామావళి తత్వార్థ ప్రస్ఫుటమై ఉంటాయి. గురుగుహ అనే ముద్రతో ఆయన కీర్తనలు గుర్తించబడతాయి. కుమారస్వామిని గురుగుహునిగా కొలుస్తారు. దీక్షితుల వారు తనను ఆ అమ్మ తనయునిగా భావించి కొలిచి అనుగ్రహం పొందిన వాగ్గేయకారులు.  ఆయన రచించిన కమలాంబ నవావరణ కీర్తనలు, క్షేత్ర ప్రాధాన్యమైన కృతులు, నవగ్రహ కృతులు ఈ ఆధ్యాత్మిక సంపదతో నిండినవే. అటువంటిదే ఈ బాలాత్రిపురసుందరి కృతి. లలితాదేవి తత్వాన్ని ఆవిష్కరించే ఈ కృతిలో పంచదశాక్షరీ మంత్ర సంపుటిలోని బీజాక్షరాలను ప్రస్తావించే వాగ్భవ, కామ రజో, శక్తి కూటములను ప్రస్తావించి ఆయన తన మంత్రశాస్త్ర జ్ఞానాన్ని మనకు తెలియజేశారు. అంతే కాదు అమ్మ మహిమా వైభవాలను కూడా చక్కగా నుతించారు. కళ్యాణి రాగం అత్యంత శుభకరమైనది, ఆహ్లాదకరమైనది. గుణ వైభవ వర్ణనలకు ఈ రాగం ఎంతో ఉపయుక్తమైనది. భావయుక్తమైన పదాలతో, ఆధ్యాత్మిక ప్రాధాన్యమున్న చరణంతో దీక్షితుల వారు తన శ్రీవిద్యా ఉపాసనా బలానికి అక్షర రూపం ఇచ్చారు. తమిళనాడులోని అరియలూరు జిల్లాలోని కామరసవల్లిలో పార్వతీపరమేశ్వరులు సనాతనులై వెలసిన క్షేత్రం కర్కోటేశ్వర-బాలాంబిక దేవస్థానం. తిరువాయూరుకు ఉత్తరంగా కావేరీ నదికి ఆవల ఉన్న క్షేత్రం ఇది. వేళ ఏళ్ల చరిత్ర కలిగిన ఈ క్షేత్రంలో బాలాత్రిపురసుందరిగా అమ్మ కొలువబడుతుంది. ఆ అమ్మను నుతిస్తూ దీక్షితుల వారు ఈ కృతిని రచించారు.

యేసుదాసు గారి గళంలో ఈ భజరే చిత్త బాలాంబికాం వినండి.

26, జూన్ 2017, సోమవారం

చెంతనే సదా యుంచుకోవయ్యా - త్యాగరాజ స్వామి రామభక్తి



చెంతనే సదా యుంచుకోవయ్యా 

మంతుకెక్కు శ్రీమంతుడౌ హనుమంతు రీతిగ శ్రీకాంత 

తలచిన పనులను నే తెలిసి తలతో నడచి సంతసిల్లుదురా
పలుమారు బల్క పనిలేదు రామభరతుని వలె త్యాగరాజనుత

ఓ రామా! లక్ష్మీపతీ! ఎంతో భాగ్యవంతుడు, నీ పరమభక్తునిగా ప్రసిద్ధి చెందిన హనుమంతుని వలె మమ్ము నీ చెతనే యుంచుకొనుము. నీవు తలచిన పనులన్ని తెలివితో మెలకువతో శిరసావహించి సంతోషించెదను. మరల మరల చెప్పనవసరం లేకుండా నువ్వు చెప్పిన పని చేసెదను. అలా చేసిన భరతుని వలె నన్ను ఎల్లప్పుడు నీ చెంతనే యుంచుకొనుము.

- సద్గురువులు త్యాగరాజ స్వామి

రాముని బంటుగా హనుమ ఎంత ప్రసిద్ధి చెందాడో లోకవిదితమే. అసాధ్యమనుకున్న కార్యములను రామభక్తితో సాధించిన ధీరుడు ఆ హనుమ. అలాగే, అన్న మనసెరిగి ఆయన మాట శిరసావహించి జాగృత స్థితిలో యున్నవాడు భరతుడు. వారిద్దరిలా తనకు కూడా ఎల్లప్పుడూ ఆయన చెంతనే యుండే భాగ్యాన్ని కలిగించమని త్యాగరాజస్వామి ఈ కీర్తన ద్వారా కోరారు. మంతుకెక్కు అన్న పదానికి ప్రసిద్ధి చెందిన అని అర్థం. కీర్తనలో ఆ పదాన్ని ఉపయోగించి రామభక్తులలో హనుమకున్న అగ్రస్థానాన్ని త్యాగయ్య చాటారు. త్యాగరాజస్వామికి తెలుగు భాషపై ఉన్న పట్టు కొన్ని పదప్రయోగాలు గమనిస్తే అర్థమవుతుంది. నిరంతరము స్వామి ఆజ్ఞకై వేచియుండే హనుమ కార్యసిద్ధి హనుమంతునిగా పేరొందాడు. సీతమ్మ జాడను తెలిపిన హనుమను రాముడు హత్తుకొని ఉత్తమునిగా వర్ణించాడు. లక్ష్మణునికి ప్రాణం పోసి సంజీవని హనుమంతుడయ్యాడు. రాక్షససేనను సంహరించి వీర హనుమంతుడయ్యాడు. అందుకే సీతమ్మ సకల గుణ సంపన్నుడు అని పొగడి ముత్యాల హారాన్ని ఆ హనుమకు బహుమతిగా ఇచ్చింది. నిరంతర రామసేవా భాగ్యంలో తరిస్తూ దాసాంజనేయుడైనాడు. ఆ హనుమ వలె తనను ఎల్లప్పుడూ చెంతనే ఉంచుకోమని త్యాగరాజు కోరారు. అలాగే, అన్నపై అనన్యమైన భక్తి, గౌరవం కలవాడు భరతుడు. రాజ్యాన్ని త్యజించి అన్న పాదుకులను సింహాసనంపై యుంచి ధర్మాన్ని నిర్వర్తించిన వాడు ఆ భరతుడు. ఆ భరతుడంటే రామునికి అమితమైన వాత్సల్యం. అటువంటి వాత్సల్యం కోసం తనను చెంతనే యుంచుకోమని త్యగయ్య రాముని కోరారు. రామభక్తి సామ్రాజ్యంలో ఓలలాడే బంటులకు అలసట ఉండదు, ఎంత సేవ చేస్తే అంత సంతోషం. ఆ భావనలనే త్యాగయ్య ఈ కీర్తన ద్వారా తెలియజేశారు.

కుంతలవరాళి రాగం దాటు స్వరాలతో హనుమంతుని కుప్పిగంతులను గుర్తు చేస్తుందని నూకలవారు విశ్లేషించారు. అందుకే ఈ కీర్తనకు ఆ రాగాన్ని ఉపయోగించారు త్యాగరాజస్వామి. కుంతలవరాళి రాగంలో ఈ కృతిని వినండి.

చెంతనే సదా యుంచుకోవయ్యా!


25, జూన్ 2017, ఆదివారం

దొరకునా ఇటువంటి సేవ - వేటూరి అజరామర గీతం



దొరకునా ఇటువంటి సేవ నీ పద రాజీవముల చేరు నిర్వాణ సోపానమధిరోహణము సేయు త్రోవ

రాగాలనంతాలు నీవేయి రూపాలు భవరోగ తిమిరాల పోకార్చు దీపాలు
నాదాత్మకుడవై నాలోన చెలగి నా ప్రాణ దీపమై నాలోన వెలిగే
నిను కొల్చు వేళ దేవాది దేవా దేవాది దేవా దొరకునా ఇటువంటి సేవ


ఉచ్చ్వాస నిశ్శ్వాసములు వాయులీనాలు
స్పందించు నవనాడులే వీణాగానాలు
నడలు ఎదలోని సడులే మృదంగాలు
నాలోని జీవమై నాకున్న దైవమై
వెలుగొందు వేళ మహానుభావా మహానుభావా దొరకునా ఇటువంటి సేవ

పరమాత్మా! నీ పదకములములను చేరే ముక్తిపథములోని మెట్లను అధిరోహణము చేసే త్రోవ ఈ సంగీత సేవ. మళ్లీ మళ్లీ దొరకునా ఇటువంటి సేవ?అనంతమైన రాగాలు నీ వేల రూపాలు. అవి ఈ జననమరణాలతో కూడిన సంసారసాగరంలోని రోగాలనే అంధకారాలను తొలగించే దీపాలు. నా ఆత్మకు స్వరూపమై నాలోని నివసించి నా ప్రాణ దీపమి నాలోన వెలిగే నిన్ను కొలిచే వేళ, ఓ దేవాది దేవా!, ఎంత గొప్పది. ఇటువంటి సేవ మళ్లీ మళ్లీ దొరకునా? ఈ సంగీత సేవలో ఉచ్చ్వాస నిశ్వాసలే ఫిడేలు నాదాలు. ఆ సప్తస్వరాలకు స్పందించే నవనాడులు (ఇడ, పింగళ, సుషుమ్న, గాంధార, హస్తిని, పుష, జయస్విని, అలంబస, కుహ) వీణాగానాలు. వివిధ కదలికలు, హృదయ స్పందనలే మృదంగ ధ్వానాలు. నాలోని జీవమై, నాకున్న దైవమై నీవు వెలుగొందు వేళ, ఓ మహానుభావా! ఇటువంటి సేవ మళ్లీ దొరకునా!

- వేటూరి సుందరరామమూర్తి (శంకరాభరణం చిత్రం)

నాదోపాసనలో తరించే సంగీత యోగుల మనోభావనలను అద్భుతంగా ప్రతింబింబించే గీతం ఇది. ఆత్మజ్ఞానులు కావటానికి వేయటానికి సంగీతం ఓ అద్భుతమైన సాధనం. ఈ సేవలో తరించి ముక్తిని పొందిన వారెందరో. శంకరాభరణంలోని శంకరశాస్త్రీ అంతే. భావాన్ని స్వర రాగ యుక్తంగా నవనాడుల్లో నింపుకొని పరమాత్మతో అనుసంధానమై గానం చేసే యోగి. అందుకే కే విశ్వనాథ్ గారు ఆయన కోసం ప్రత్యేకమైన గీతాలను గేయకర్త చేత రచింపజేశారు. ఇటువంటి సేవ మళ్లీ దొరకునా అన్న భావన కలిగించేలా ఈ గీతాన్ని పతాక సన్నివేశంలో పొందుపరచారు. నాదసాధనే పరమాత్మకు పూజగా భావించిన వారు జీవన్ముక్తులైనారు. పవిత్రమైన నాదోపాసనలో ఉన్న శంకరశాస్త్రి వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించిన చిత్రం శంకరాభరణం. అనంతమైన రాగాలను ఆయన సహస్ర రూపాలుగా భావించి ఆ నాదసాధనే భవసాగరములోని చీకట్లను తొలగించే జ్ఞానజ్యోతిగా అనుభూతి చెందిన విద్వాంసుడు శంకర శాస్త్రి. ఆ సంగీత సేవ శాశ్వతం కావటానికి శిష్యుడు కావాలి కదా? అత్యాచారానికి గురైన ఓ స్త్రీని తన వెంటబెట్టుకుని ఇంటికి రాగా పండితులు ఆయనను వెలివేయగా ఆ స్త్రీ ఆయనకు దూరంగా వెళుతుంది. ఆమె కడుపున పుట్టిన బిడ్డ శంకరశాస్త్రి గారి నాదోపాసనను కొనసాగించేందుకు అద్భుతమైన సన్నివేశాలను సృష్టించి అందులో చివరగా ఈ గీతాన్ని ఆవిష్కరించారు. ఆత్మకుడైన పరమాత్మను కొలిచే సేవలో తనువులోని వేర్వేరు ప్రక్రియలను సంగీత సాధనలోని పరికరాల నాదాలకు ఉపమానం చేశారు కవి వేటూరి. సంగీత సాధనలో మనలోని మలినములు తొలగి జ్ఞానేంద్రియములు జాగృతమై పరమాత్మతో అనుసంధానమయ్యే అవకాశం ఉంది. పవిత్రమైన ఈ సాధన ముక్తిమార్గానికి సోపానము. ఈ సందేశాన్నే కవి మనకు ఈ గీతం ద్వారా అందజేశారు. అన్నమయ్య, త్యాగయ్య, రామదాసు వంటి వాగ్గేయకారులు ఇటువంటి భావనలనే అనుభవపూర్వకంగా సంకీర్తనల ద్వారా పలికారు. ఈ గీతం వెనుక ఉన్న కళాతపస్వి విశ్వనాథ్ గారికి, వేటూరి వారికి, సంగీత కారులు మహాదేవన్ గారికి, బాలసుబ్రహ్మణ్యం గారికి, వాణీజయరాం గారికి మనం ఎంతో రుణపడి ఉన్నాము. ఈ  పాట సాహిత్యం మరియు సన్నివేశం యొక్క ప్రాముఖ్యత ఇనుమడింపజేసేలా సోమయాజులు గారు, మంజు భార్గవి గారు, తులసి నటించారు. అందుకే ఈ చిత్రం సార్థక నామధేయమై నిలిచింది.



24, జూన్ 2017, శనివారం

సర్దుకుని కలిసుండటమా? విడిపోవటమా?


సర్దుకుని కలిసుండటమా? విడిపోవటమా? - ఇదీ నేటి భారతీయ యువ జంటలలో ఉన్న ప్రశ్న. చాలామంది విడిపోవటానికే మొగ్గు చూపుతున్నారు. నేను చెప్పేది పేదరికంలో మగ్గుతున్న వారు లేదా ఆర్థిక స్వావలంబన లేని వారు కాదు. ఉద్యోగాలు చేస్తూ చిన్న చిన్న విషయాలలో గొడవపడి నలుగురిని అందులోకి లాగి చివరకు ఏమీ చేయలేక విడాకులకు వెళుతున్న వారి గురించి. ఇటువంటి వారికి కీచులాటల మధ్యే ఒకరో ఇద్దరో బిడ్డలు.. వాళ్ల భవిష్యత్తు సింగిల్ పేరెంటింగ్‌లోనే. ఎవరినీ తప్పు పట్టలేము, తప్పని తెలిసినా చెప్పలేని, చెప్పినా వినలేని, విన్నా అర్థం చేసుకోలేని పరిస్థితులు. ఒకటి మాత్రం నిజం - వివాహానికి సిద్ధంగా లేనప్పుడు పెళ్లి చేయటం అనేది ఈ కాలంలో కూడని పని. సిద్ధం అంటే? - ఇతరుల మనస్తత్వాలను గమనించ గలిగే వ్యక్తిత్వ వికాసం, వైవిధ్యాన్ని, భిన్నత్వాన్ని స్వీకరించ గలగటం. ఇవిలేక అపరిపక్వత కలిగి ఉన్న యువతీ యువకులపై వివాహాన్ని రుద్దకూడదు. చాలా సమస్యలకు మూలం - పిల్లలను గారాబంగా పెంచటం, బాధ్యతలను సరైన వయసులో తెలియజేయలేకపోవటం, అడిగినదల్లా ఇచ్చి డబ్బు, ఆస్తులు ఎంత కష్టపడితే వస్తాయో నేర్చుకోనివ్వకపోవటం. తల్లిదండ్రులున్నది పిల్లలకు అన్నీ అందజేయటానికి కాదు. వారికి కావలసిన వ్యక్తిత్వ వికాసానికి తోడ్పటం వరకే. విద్య వ్యక్తిత్వ వికాసంలో భాగమే. ఆర్థిక స్వావలంబన అందరికీ తప్పనిసరి. కానీ, అది మానవీయ విలువలను, సంబంధాలను త్రుంచేదిగా ఉండకూడదు. పరిణతి, అవగాహన లేని వయసులో వివాహం చేసినందువలన ఊహించని సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంది. 25 ఏళ్లు ఇంకో ఇంట్లో పూర్తిగా భిన్నమైన వాతావరణంలో పెరిగిన జీవిత భాగస్వామి ఇష్టాయిష్టాలను గ్రహించి కొంత కూడా వారి కోసం సర్దుకోలేకపోవటానికి కారణం వ్యక్తిత్వం వికాసం, మనుషులతో వివృతి లేకపోవటం, అవగాహన పెరగకపోవటమే. ఇవి ఒకరోజులో వచ్చేవి కావు. గతంలో ఉమ్మడి కుటుంబంలో వేర్వేరు పాత్రల ద్వారా చాలామటుకు అందేవి. ఇప్పుడు మేమిద్దరం మాకిద్దరు మొత్తం నలుగురమే అనే కుటుంబ వ్యవస్థలో ఈ ముఖ్యమైన పాఠాలు అందే అవకాశం లేదు. కాబట్టి పిల్లలకు అవగాహన పెరిగే వరకు వేచి ఉండాలి. వారి నిర్ణయాల ఫలితాలను వారు భరించి ముందుకు వెళ్లేలా బాధ్యతాయుతంగా పెంచాలి. లేకపోతే ప్రతి మూడు వివాహాల్లోనూ ఒకటి విడాకుల వరకు వేళ్లే అవకాశం ఉంది.

నేటి భారతంలోని ఉరుకులు పరుగుల జీవితాల్లో డబ్బు చాలా పెద్ద పాత్ర పోషిస్తోంది. జీవన ప్రమాణాలతో పాటు డబ్బు అవసరం, డబ్బు యొక్క ప్రాధాన్యత వంద రెట్లు పెరిగాయి. ఎవరూ ఇంకొక మనిషిని పోషించే పరిస్థితులు లేవు. అందుకే మనుషులు ఆర్థిక స్థిరత్వం చిన్న వయసులోనే కోరుకుంటున్నారు. దీని ఫలితంగా ఉద్యోగ ప్రాధాన్యమైన చదువులే తప్ప వ్యక్తిత్వాలను దృఢ పరిచే చదువులు, అనుభవాలకు అసలు ప్రాధాన్యత లేదు. దాని వలన ఎదగని మనస్తత్వాలు, తొందరగా స్పందించే హృదయాలు, విమర్శను తట్టుకోలేని ఆవేశాలు. పురుషాహంకారం చదువుల వల్ల కొంత తగ్గినట్లు అనిపించినా, భార్యపై పైచేయి కావాలన్నదే ఇప్పటికీ భారతీయ పురుషుని మనస్తత్వం. దీనికోసం ఎంతకైనా తెగిస్తున్నాడు. అలాగే, స్త్రీలలో కూడా అర్థం చేసుకునే గుణం, ఓర్పు చాలా తగ్గాయి. వారిలో ఆవేశకావేశాలు పెరిగి ప్రతి చిన్న అభిప్రాయం భేదం కూడా తగవుగా మారుతోంది. అందుకే తల్లిదండ్రులు ఇప్పటికైనా కళ్లు తెరచి పిల్లల వ్యక్తిత్వ వికాసంపై దృష్టి పెట్టాలి. డిగ్రీ కాగానే పెళ్లి అన్నది ఈనాటి పిల్లలకు వర్తించదు. కాస్త సమాజంలో ఢక్కాముక్కీలు తిన్న తరువాతే పెళ్లి చేస్తే మంచిది. ప్రతి దానికీ ఏడ్చే ఆడపిల్లలు భర్తపై కూడా అలాగే వ్యవహరిస్తారు. నలుగురితో మసలుకోలేని మగవాడు, బాధ్యత తెలియని వాడు భార్య పట్ల కూడా అలాగే వ్యవహరిస్తాడు. కాస్త మమకారం తగ్గించుకుని పిల్లలను తల్లిదండ్రులు స్వతంత్రంగా గమనించాలి. వారి వ్యక్తిత్వాలలో అవకతవకలు, పెద్ద అవలక్షణాలు కనిపిస్తున్నప్పుడు వారికి వివాహం తలపెట్టకపోవటమే మంచింది. అలా చేస్తే కొరివితో తల గోక్కున్నట్లే.

మనమేదో సంస్కృతి సాంప్రదాయం అని భారత దేశం గురించి కలలు కంటాము. అవి పుస్తకాలకు, భాషణలకు మాత్రమే పరిమితం. వాస్తవం దారుణంగా ఉంది. మన యువతీ యువకుల వ్యక్తిత్వాలు డొల్లగా ఉన్నాయి. మనం చేస్తున్నది పాశ్చాత్యులను గుడ్డిగా అనుకరించటమే. వారికి 50 ఏళ్ల క్రితం వచ్చిన సమస్యలు మనకు ఇప్పుడు వస్తున్నాయి. అంతే తేడా. చదువు->ఉద్యోగం->వివాహం->పిల్లలు ఇవి ఇదివరకులా ఆటోమేటిక్ కాదు సుమా. ప్రతి అడుగులోనూ ఆత్మావలోకనం అవసరం.

4, మే 2017, గురువారం

సంఘ సంస్కర్తగా కాశీనాథుని విశ్వనాథ్ - సప్తపది చిత్రం


ప్రఖ్యాత దర్శకులు, కళాతపస్వి కే విశ్వనాథ్ గారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చిన సందర్భంగా వారి గురించి వ్యాస పరంపర ఆరంభిస్తున్నాను. వారి వ్యక్తిత్వపు వేర్వేరు కోణాలను తమ చిత్రాలలో ఎలా ప్రతిబింబించేలా చేశారో ఆ వివరాలను ఈ పరంపర ద్వారా అందించే ప్రయత్నం ఇది. మొట్ట మొదట వ్యాసం "సంఘ సంస్కర్తగా కాశీనాథుని విశ్వనాథ్."

దాదాపు 36 ఏళ్ల క్రితం ఓ సున్నితమైన సామాజిక అంశాన్ని తీసుకొని ఓ రసరమ్యమైన చిత్రాన్ని నిర్మించి దాని ద్వారా ఓ విప్లవానికి నాంది పలికిన మహానుభావుడు విశ్వనాథ్ గారు. బ్రాహ్మణత్వము, ఆచార సాంప్రదాయాలు ఓ పక్క, కళారాధనలో కులభేదాలు మరచి ఒకటవ్వాలనుకున్న జంటను ఆ చిత్రంలోని ప్రధాన పాత్ర అయిన యాజులు గారి ఎలా ఏకం చేశాడు అన్నది ఆనాటి పరిస్థితులకు చాలా వివాదాస్పదంగా మారగలిగే అంశం. తెలుగునాట కులవిభజనతో మగ్గిపోతున్న ప్రజలలో అగ్గిని రాజిల్ల జేయ గలిగిన కథాంశం అది. కానీ, ఎక్కడా, ఏ కులాన్నీ, ఏ మతాన్ని కించ పరచకుండా, పరమాత్మ తత్త్వాన్ని తెలియజేస్తూ ఆ పెద్దమనిషిలో ఎలా మార్పు వస్తుందో, కళ ద్వారా మానవీయ అంతరాలు దాటగలిగిన ప్రేమికులు ఎలా ఒకటయ్యారో విశ్వనాథ్ గారు అద్భుతంగా 1981లో విడుదలైన సప్తపది చిత్రం ద్వారా మనకు తెలిపారు.

సమాజాన్ని పట్టి పీడించే సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపగలిగిన వారే  సంఘసంస్కర్త. కులపిచ్చిలో మగ్గిపోతున్న జాతిని ముందుకు నడిపించేవి దైవికమైన కళలు అన్న ఇతి వృత్తాన్ని అద్భుతమైన సంభాషణల ద్వారా హృద్యంగా మనకు తెలియజేశారు కళాతపస్వి. జంధ్యాల సంభాషణలు ఈ చిత్రానికి ఆయువు పట్టు. వేటూరి గీతాలు ఈ కథకు ప్రాణప్రతిష్ఠ చేసి సందేశాన్ని ప్రేక్షకుల హృదయాలలో నాటుకునేలా చేశాయి. అటువంటి గీతమే ఏ కులము నీదంటే అన్నది. చాకలి వాళ్లు గోదారి గట్టున పాట పాడుతుంటే  తన ఇంట ఉన్న సమస్యపై ఆ యాజులు గారు ఆలోచనలోకి వెళతారు. తరువాత స్నేహితుడైన రాజుగారి హితబోధ ద్వారా సత్యాన్ని తెలుసుకొని విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకుంటాడు. కనువిప్పు కలిగించే ఇటువంటి గీతాన్ని సరైన సందర్భంలో పొందుపరచటం విశ్వనాథ్ గారి ప్రతిభకు మచ్చు తునక. ఈ గీతం ద్వారా దర్శకుడు ఒక నవశకానికి నాంది పలికించే ప్రయత్నం చేశారు. ఒక్కసారి గీతాన్ని పరిశీలించండి.

ఏ కులము నీదంటే గోకులము నవ్వింది మాధవుడు యాదవుడు మా కులమే లెమ్మంది.

ఏడు వర్ణాలు కలిసి ఇంధ్రధనసవుతాది
అన్నీ వర్ణాలకు ఒకటే ఇహము పరముంటాది

ఆది నుంచి ఆకాశం మూగది
అనాదిగా తల్లి ధరణి మూగది
నడుమ వచ్చి ఉరుముతాయి మబ్బులు
ఈ నడమంత్రపు మనుషులకే మాటలు ఇన్ని మాటలు

వేటూరి ఈ గీతంతో ఆ కర్మనిష్ఠాపరుడైన పురోహితుని మదిలో మార్పు మొదలవుతుంది. వేటూరి చేత ఇటువంటి గీతం పొందు పరచిన విశ్వనాథ్ గారి దర్శక ఔన్నత్యాన్ని ఎంత పొగడినా తక్కువే. జగద్గురువైన కృష్ణునిదే కులం అన్న పంక్తితో మొదలై అన్ని కులాలకు ఒకటే ఇహము పరము అన్న ఆధ్యాత్మిక తత్త్వాన్ని తెలిపి చిత్రంలో మలుపుకు వేటూరి గీతం ద్వారా నాంది పలికించారు విశ్వనాథ్ గారు. పంచభూతాలకు లేని విభజనలు మనుషులకే అని పలికి సమస్య తీవ్రతను తెలిపారు. అటు తరువాత యాజులు గారు, రాజు గారి మధ్య సంభాషణలతో చిత్రం పతాక సన్నివేశానికి రంగం సిద్ధమవుతుంది.

యాజులు గారు: "గౌరీనాథుడి (ఆయన మనుమడు తన భార్యను హరిజనుడైన ఆమె ప్రేమికునికి అప్పగించాలన్న) నిర్ణయం కొంతవరకు సబబే అని సర్దుకు పోయినా, వాడు చేస్తున్న పని, అందునా హరిజనుణ్ణి..."...

రాజు గారు: "యాజులు గారు! సర్వ శాస్త్ర కోవిదులు మీరనవలసిన మాట కాదండీ ఇది! హరిజనులు ఆ హరి జనులు. తర్కాన్ని శాస్త్రాన్ని కాచి వడపోసిన మీకు నేను చెప్పదగిన వాడిని కాకపోయినా, ఒక్క విషయం మాత్రం మనవి చేసుకుంటాను. శంకర విజయంలో ఆదిశంకరుల వారికి మాలకులస్థుడెదురైన సంఘటన ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి."

ఆది శంకరులు తనకు ఎదురైన ఛందాలుని దారి తప్పుకోమని అడిగిన సన్నివేశం:


శంకరులు: "తప్పుకొనుము..దారి విడువు"..

ఛండాలుడు: "దండాలు దొర! ఎవర్ని తప్పుకోమంటున్నారు తమరు? నన్నా? నాలోని పరమాత్మనా స్వామీ? నన్నైతే నా మట్టి కుండలోని నీటిలోనూ, మీ బంగారు పాత్రలోని నీటిలోనూ ఒకే సూర్యుడు ఒకే రకంగా కనిపిస్తాడు కదా స్వామీ? అలాగే, తమలోనూ నాలోనూ ఒకే పరమాత్ముడున్నాడు. పాత్రల తేడాలాంటిదే స్వామీ ఈ కులమతాల తేడా. అలా కాక నాలోని పరమాత్మను తప్పుకోమంటారా? ఆ భగవానుడి దర్శనం కోసం దేశమంతా సంచారం చేస్తున్న మీరు మీకు ఎదురైన పరమాత్మను తప్పుకుపోమంటారా స్వామీ? ఆత్మ పరమాత్మ స్వరూపమైతే ప్రతి మనిషీ దేవుడే స్వామి! దేవుడుకి కులం మతం రంగు రూపం తేడాలుంటాయా? కాదంటారా స్వామీ! "

రాజు గారు: "ఆదిశంకరులు ఆ వాదనా పటిమకు ముగ్ధులై ఆ చండాలుడిలోని ఈశ్వరుడికి పాదాభివందనం చేశారు. లోకధర్మాన్ని, సాంప్రదయాన్ని నిర్దేశించిన మహనీయుడు ఆదిపురుషుడు జగద్గురువైన ఆదిశంకరుడే హరిజనుడిని ఆదరించినప్పుడు మనమెంత యాజులు గారు! అసలు నన్నడిగితే మనిషి ప్రగతికి అనుకూలమైనదే కులం. ఇంకేమీ ఆలోచించకండి. ఆ శంకరుల వారినే ప్రార్థించండి. ఆయనే దోవ చూపిస్తాడు."

తను తీసుకున్న నిర్ణయంతో మనుమరాలిని ఆమె ప్రేమించిన వ్యక్తికి అప్పగించటానికి గోడారి ఒడ్డు చేరుకున్న యాజులను ఊరి పెద్దలు ఎదిరించి ప్రశ్నిస్తారు. తన నిర్ణయాన్ని సమర్థిస్తూ యాజులు గారు:

"పెళ్లనేది ఇద్దరు మనుషులను కలపటానికి కాదు, రెండు మనసుల్ని కలపటానికి. త్రికరణశుద్ధిగా ఆచరించని పని వ్యర్థమని శాస్త్రం చెబుతోంది. అసలు పెళ్లంటే ఏమిటి? పెళ్లి మంత్రాలకు అర్థం ఏమిటి? అష్ట వర్షాత్ భవేత్ కన్యా పుత్రవత్ పాలితా మయా ఇదానీం తవ పుత్రస్య దత్తా స్నేహేన పాలితా అంటాడు కన్యాదాత వరుడి తండ్రితో. ఇన్నేళ్లు కొడుకులా పెంచుకున్న నా కూతుర్ని నీ కొడుక్కి అప్పజెబుతున్నాను. వాళ్లిద్దరూ స్నేహంగా సఖ్యతగా ఉందురు గాక! అని. సర్వకాల సర్వావస్థలలోనూ ఆ స్నేహాన్ని కాపాడతానని వరుడు సర్వ దేవతల సాక్షిగా అగ్ని సమక్షంలో ప్రమాణం చేస్తాడు. పెళ్లంటే శోభనం ముందు జరిగే తంతు కాదు. ఒక పురుషుని స్త్రీని స్నేహితులుగా, సన్నిహితులుగా చేసే ఘట్టం. ఆ స్నేహం, సఖ్యత లోపించిన జంట కలకాలం కలిసి బ్రతకలేరు. అందుకే వేరు చేస్తున్నాను. ఆ స్త్రీ సాన్నిహిత్యాన్ని పొందే అర్హత గల వ్యక్తికి ఆమెను అప్పగిస్తున్నాను. "

పెద్దలు: "మీ మాటే శాస్త్ర సమ్మతమనుకుంటే, ఆమె పవిత్ర బ్రాహ్మణ స్త్రీ. అతడు జాతీయ ఛండాలుడైన శూద్రుడు. వాళ్లిద్దరినీ కలపటం సబబా?"

యాజులు గారు: "మంచి ప్రశ్న. ఇన్నాళ్లూ అజ్ఞానాంధకారంలో ఉండిపోయి  నేనూ అది సబబు కాదనే అనుకున్నాను. కానీ, ఒక్క క్షణం ఏకాగ్రతతో విషయావలోకనం చేస్తే నా అవివేకత నాకే తెలిసొచ్చింది. జన్మనా జాయతే శూద్రః సంస్కారాత్ ద్విజర్యుచ్యతే. జన్మము చేత మానవులందరూ శూద్రులే. వారి వారి సంస్కార ఫలితంగా వర్ణాలేర్పడతాయని ఉపదేశించిన మనువు స్ఫురణకొచ్చాడు."

ఊరి పెద్ద: "జన్మతో అందరూ శూద్రులెలా అవుతారండీ! చాతుర్వర్ణం మయా సృష్టం అనలేదా భగవానుడు గీతలో?"

యాజులు గారు: "అన్నాడు. చాతుర్వర్ణం మయా సృష్టం అని ఊరుకోలేదే? గుణ కర్మ విభాగశః అని కూడా అన్నాడు. గుణాల్ని బట్టి, కర్మలను బట్టి నాలుగు వర్ణాల్ని సృష్టించానన్నాడే తప్ప పుట్టుకను బట్టి కాదు. తన విధిని తాను నిర్వర్తించక అరిషడ్వర్గాలకు బానిసై భ్రష్టుడైన బ్రాహ్మణుడి కంటే పవిత్రమైన నడవడి గల శూద్రుడికి తలవంచి నమస్కరిస్తాను నేను. ఈ కర్మ ఛండాలుడి కంటే ఆ జాతి ఛండాలుడు లక్ష రెట్లు మేలు. దీనికి మన పూర్వ మహర్షులే ప్రత్యక్షణ ప్రమాణ భూతులు. క్షత్రియుడైన విశ్వామిత్రుడు బ్రహ్మర్షైనాడు. పల్లె పడుచుకు జన్మించిన వ్యాసుడు బ్రాహ్మణుడైనాడు, భగవానుడైనాడు. మతంగ కన్య అయిన అరుంధతిని వివాహమాడిన వశిష్ఠుడు బ్రహ్మర్షి అయినాడు. కాదంటారా?"

ఊరి పెద్ద: "ఏమైనా, ఇంతటి అకృత్యానికి పాల్పడి కులభ్రష్టం చేస్తున్న మీరు పవిత్రమైన దేవాలయంలో అర్చకత్వానికి అర్హులు కారు"

యాజులు గారు: "పరమాత్ముణ్ణి అర్చించుకోవటానికి ఆ నాలుగు గోడల మధ్యనే కూర్చో అక్కర్లేదు శాస్త్రి గారు. సర్వాంతర్యామి అయిన విధాత మీలో ఉన్నాడు, వీరిలో ఉన్నాడు, మట్టిలో ఉన్నాడు, గాలిలో ఉన్నాడు. నిరాకారుడైన ఈశ్వరుని నా మనాసులో చూసుకోగలను. ధ్యానించుకోగలను. ఇది నా పునర్జన్మ. గాఢాంధకరం అలముకొని ఉన్న ఈ ఒడ్డునుండి వెలుగురేఖలు నిండిన ఆ ఒడ్డుకు చేరుకోబోతున్నాను."

ఊరి పెద్ద: "వేదమంత్రాలు, సప్తపది ప్రమాణాలు అర్థం లేనివని మీ ఉద్దేశం అన్నమాట. మేమూ మీలాగే మారిపోయి ఆచార వ్యవహారాలన్నీ మంటగలిపేయాలని మీ కోరిక అన్నమాట."

యాజులు గారు: "పొరబడుతున్నారు. కాగితం గాలికి రెపరెపలాడకుండా బరువుంచినట్లు మానవ సంఘం అవినీతి వల్ల ఛిన్నాభిన్నం కాకుండా ఆచారాలనే బాధ్యత ఉంచబడింది. అంతే కానీ, వాటి పేరుతో మనిషిని మనిషిని వేరు చేయటానికి కాదు. సర్వ ప్రాణికోటి ఆ విరాట్పురుషుని దేహంలో నుంచి ఉద్భవించిందే. సృష్టిలోని ప్రతి వ్యక్తి ఆ పరమాత్ముని ప్రతి రూపమే. అన్యవర్ణాల వారు బ్రాహ్మణులను హేళన చేసి, బ్రాహ్మణులను మిగతా వర్ణాల వారిని చులకన చేసి చూడటం ఆ భగవంతుణ్ణి దూషించినంత పాపం. పిపీలికాది బ్రహ్మ పర్యంతం సర్వం ఈశ్వరమయం. ఇన్ని కోట్ల ఈశ్వర ప్రతి రూపాలను అందించే ప్రతి కులము గొప్పడే. అన్ని కులాలూ సమానమే. ..."

యాజులు గారు పెద్దలను దాటుకుంటూ పడవ ఎక్కటానికి వెళతారు. చిత్రం చివరి సన్నివేశం అదే. అప్పుడు వచ్చే మాటలు మనందరికీ కనువిప్పు కలిగించే సత్యవచనాలు.

"రాగానికి కులమేది? తాళానికి మతమేది? సప్తస్వర బద్ధమైన సంగీతం వారి కులం. నవరసభరితమైన నాట్యం వారి మతం. ఆ జంట వేసినవి ఏడడుగులు కావు. దాటినవి ఏడు అగడ్తలు. స్వరాలు సరిహద్దులుగా రాగాలు రాచబాటలుగా కల రస రాజధానిలోకి అడుగుపెడుతున్న ఆ జంటను మీరూ మనసారా ఆశీర్వదించండి."



విశ్వనాథ్ గారు సంఘ సంస్కర్త అని ఎందుకు అన్నాను అంటే, మన సమాజంలో విభజనకు కారణమై, జాడ్యాలకు దారి తీసే కొన్ని అపోహలను ఈ చిత్రంలో సంభాషణల ద్వారా, పాటల ద్వారా అయన తొలగించటంలో సఫలమైనారు. నాకు తెలిసిన చదువుకున్న వారికెందరికో ఈ చిత్రం కనువిప్పు కలిగించింది. చిత్రంలోని సందేశం సామాన్యుల మనసులలో ఉన్న ప్రశ్నలకు సమాధానం తెలిపి ప్రజలకు శాంతి కలిగించింది. ఏ సంఘ సంస్కరణ యొక్క ఉద్దేశమైనా ప్రజలలో విభజనను, అశాంతిని తొలగించటమే. కులాలకు అతీతమైన కళలకు ప్రాధాన్యతనిచ్చి, ఆ కళల ద్వారా మానవులను ఏకం చేసి దివ్యత్వం వైపు నడిపించే అద్భుతమైన మార్గాలను విశ్వనాథ్ గారు ఈ చిత్రం ద్వారా మనకు అందజేశారు.

అలాగే, ఎక్కడికక్కడ, వేర్వేరు వృత్తులు, కులాలకు చెందిన వారి ద్వారా అద్భుతమైన ఆధ్యాత్మిక సందేశాన్ని పలికించి మనం ఏమి చేయాలో అద్భుతంగా గుర్తు చేశారు. గోవులను కాచే కుటుంబం చేత గోవులు తెల్లన అనే పాట ద్వారా, దొమ్మరి కుటుంబం, రజక కుటుంబం చేత ఏ కులము నీదంటే అన్న పాట ద్వారా, అయిగిరి నందిని స్తోత్రంతో బ్రాహ్మణుని ద్వారా, రాజు గారి చేత ఆదిశంకరుల గాథ ద్వారా సమయోచితమైన సందేశాన్ని ఆయా పాత్రలకు తెలియజేసి చిత్రానికి పరిపూర్ణతను కలిగించారు.

మానవుని జీవితంలో తప్పులను సరిదిద్దుకుంటూ వెళ్లటం అనేది నిజమైన పురోగతి. ఆ తప్పులు ఆలోచనలలో ఉండవచ్చు లేదా కర్మలలో కూడా ఉండవచ్చు. చిత్రంలో వేర్వేరు మూలాల ద్వారా తనకు అందిన సందేశాన్ని గ్రహించిన యాజులు పురోగతి దిశగా అడుగులు వేయటానికి ఏ విధంగా సంసిద్ధుడైనాడో విశ్వనాథ్ గారు విశేషంగా ఆవిష్కరించారు. ఆయ్నలోని అజ్ఞానాంధకారం తొలగి జ్ఞానజ్యోతి వెలిగి ఆయనను ముందుకు నడిపించేలా చేసిన పద్ధతి రమణీయం. అలాగే, తాను తెలుసుకున్న నిజం వైపు దృఢచిత్తుడై నిలబడి ప్రశ్నించిన వారికి శాంతంగా సమాధానం చెప్పి తన మార్గంలో ముందుకు వెళ్లటం యాజులు గారి పాత్రలో సోమయాజులు అద్భుతంగా నటించారు. ఇలా - నటనలో, సంభాషణలలో, పాటలలో, నేపథ్య సంగీతంలో, చిత్రీకరణలో విశ్వనాథ్ గారి ముద్ర అణువణువునా కనబడుతుంది.

నేను విశ్వనాథ్ గారి చిత్రాలన్నిటిలోనూ సప్తపది ఉత్తమ సందేశం గల చిత్రంగా భావిస్తాను. సంగీత ప్రాధాన్యతను కొనసాగిస్తూనే ఎంతో ముఖ్యమైన సామాజిక సందేశాన్ని అందజేసిన చలన చిత్ర రాజం సప్తపది. అందుకే 1981 సంవత్సరానికి గాని నర్గీస్ దత్ జాతీయ సమైక్యతా ఉత్తమ చలన చిత్ర అవార్డును గెలుచుకుంది. అలాగే ఉత్తమ ఫిలింఫేర్ అవార్డు, ఉత్తమ స్చ్రీన్ ప్లే నంది అవార్డును కూడా పొందింది. తెలుగునాట మరుగున పడిపోతున్న కళలతో పాటు, విలువలపైనా అద్భుతమైన చిత్రాలను ఆవిష్కరించిన విశ్వనాథ్ గారికి శతసహస్ర వందనాలు. 

పాతాళ భైరవి – 1951: తెలుగు జానపద చిత్రరాజం

1951 మార్చి 15న విడుదలైన పాతాళ భైరవి తెలుగు చలనచిత్ర చరిత్రలో ఒక కీలక మలుపు. విజయా ప్రొడక్షన్స్ పతాకంపై బి. నాగిరెడ్డి, ఆలూరి చక్రపాణి నిర్మ...