4, మే 2017, గురువారం

సంఘ సంస్కర్తగా కాశీనాథుని విశ్వనాథ్ - సప్తపది చిత్రం


ప్రఖ్యాత దర్శకులు, కళాతపస్వి కే విశ్వనాథ్ గారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చిన సందర్భంగా వారి గురించి వ్యాస పరంపర ఆరంభిస్తున్నాను. వారి వ్యక్తిత్వపు వేర్వేరు కోణాలను తమ చిత్రాలలో ఎలా ప్రతిబింబించేలా చేశారో ఆ వివరాలను ఈ పరంపర ద్వారా అందించే ప్రయత్నం ఇది. మొట్ట మొదట వ్యాసం "సంఘ సంస్కర్తగా కాశీనాథుని విశ్వనాథ్."

దాదాపు 36 ఏళ్ల క్రితం ఓ సున్నితమైన సామాజిక అంశాన్ని తీసుకొని ఓ రసరమ్యమైన చిత్రాన్ని నిర్మించి దాని ద్వారా ఓ విప్లవానికి నాంది పలికిన మహానుభావుడు విశ్వనాథ్ గారు. బ్రాహ్మణత్వము, ఆచార సాంప్రదాయాలు ఓ పక్క, కళారాధనలో కులభేదాలు మరచి ఒకటవ్వాలనుకున్న జంటను ఆ చిత్రంలోని ప్రధాన పాత్ర అయిన యాజులు గారి ఎలా ఏకం చేశాడు అన్నది ఆనాటి పరిస్థితులకు చాలా వివాదాస్పదంగా మారగలిగే అంశం. తెలుగునాట కులవిభజనతో మగ్గిపోతున్న ప్రజలలో అగ్గిని రాజిల్ల జేయ గలిగిన కథాంశం అది. కానీ, ఎక్కడా, ఏ కులాన్నీ, ఏ మతాన్ని కించ పరచకుండా, పరమాత్మ తత్త్వాన్ని తెలియజేస్తూ ఆ పెద్దమనిషిలో ఎలా మార్పు వస్తుందో, కళ ద్వారా మానవీయ అంతరాలు దాటగలిగిన ప్రేమికులు ఎలా ఒకటయ్యారో విశ్వనాథ్ గారు అద్భుతంగా 1981లో విడుదలైన సప్తపది చిత్రం ద్వారా మనకు తెలిపారు.

సమాజాన్ని పట్టి పీడించే సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపగలిగిన వారే  సంఘసంస్కర్త. కులపిచ్చిలో మగ్గిపోతున్న జాతిని ముందుకు నడిపించేవి దైవికమైన కళలు అన్న ఇతి వృత్తాన్ని అద్భుతమైన సంభాషణల ద్వారా హృద్యంగా మనకు తెలియజేశారు కళాతపస్వి. జంధ్యాల సంభాషణలు ఈ చిత్రానికి ఆయువు పట్టు. వేటూరి గీతాలు ఈ కథకు ప్రాణప్రతిష్ఠ చేసి సందేశాన్ని ప్రేక్షకుల హృదయాలలో నాటుకునేలా చేశాయి. అటువంటి గీతమే ఏ కులము నీదంటే అన్నది. చాకలి వాళ్లు గోదారి గట్టున పాట పాడుతుంటే  తన ఇంట ఉన్న సమస్యపై ఆ యాజులు గారు ఆలోచనలోకి వెళతారు. తరువాత స్నేహితుడైన రాజుగారి హితబోధ ద్వారా సత్యాన్ని తెలుసుకొని విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకుంటాడు. కనువిప్పు కలిగించే ఇటువంటి గీతాన్ని సరైన సందర్భంలో పొందుపరచటం విశ్వనాథ్ గారి ప్రతిభకు మచ్చు తునక. ఈ గీతం ద్వారా దర్శకుడు ఒక నవశకానికి నాంది పలికించే ప్రయత్నం చేశారు. ఒక్కసారి గీతాన్ని పరిశీలించండి.

ఏ కులము నీదంటే గోకులము నవ్వింది మాధవుడు యాదవుడు మా కులమే లెమ్మంది.

ఏడు వర్ణాలు కలిసి ఇంధ్రధనసవుతాది
అన్నీ వర్ణాలకు ఒకటే ఇహము పరముంటాది

ఆది నుంచి ఆకాశం మూగది
అనాదిగా తల్లి ధరణి మూగది
నడుమ వచ్చి ఉరుముతాయి మబ్బులు
ఈ నడమంత్రపు మనుషులకే మాటలు ఇన్ని మాటలు

వేటూరి ఈ గీతంతో ఆ కర్మనిష్ఠాపరుడైన పురోహితుని మదిలో మార్పు మొదలవుతుంది. వేటూరి చేత ఇటువంటి గీతం పొందు పరచిన విశ్వనాథ్ గారి దర్శక ఔన్నత్యాన్ని ఎంత పొగడినా తక్కువే. జగద్గురువైన కృష్ణునిదే కులం అన్న పంక్తితో మొదలై అన్ని కులాలకు ఒకటే ఇహము పరము అన్న ఆధ్యాత్మిక తత్త్వాన్ని తెలిపి చిత్రంలో మలుపుకు వేటూరి గీతం ద్వారా నాంది పలికించారు విశ్వనాథ్ గారు. పంచభూతాలకు లేని విభజనలు మనుషులకే అని పలికి సమస్య తీవ్రతను తెలిపారు. అటు తరువాత యాజులు గారు, రాజు గారి మధ్య సంభాషణలతో చిత్రం పతాక సన్నివేశానికి రంగం సిద్ధమవుతుంది.

యాజులు గారు: "గౌరీనాథుడి (ఆయన మనుమడు తన భార్యను హరిజనుడైన ఆమె ప్రేమికునికి అప్పగించాలన్న) నిర్ణయం కొంతవరకు సబబే అని సర్దుకు పోయినా, వాడు చేస్తున్న పని, అందునా హరిజనుణ్ణి..."...

రాజు గారు: "యాజులు గారు! సర్వ శాస్త్ర కోవిదులు మీరనవలసిన మాట కాదండీ ఇది! హరిజనులు ఆ హరి జనులు. తర్కాన్ని శాస్త్రాన్ని కాచి వడపోసిన మీకు నేను చెప్పదగిన వాడిని కాకపోయినా, ఒక్క విషయం మాత్రం మనవి చేసుకుంటాను. శంకర విజయంలో ఆదిశంకరుల వారికి మాలకులస్థుడెదురైన సంఘటన ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి."

ఆది శంకరులు తనకు ఎదురైన ఛందాలుని దారి తప్పుకోమని అడిగిన సన్నివేశం:


శంకరులు: "తప్పుకొనుము..దారి విడువు"..

ఛండాలుడు: "దండాలు దొర! ఎవర్ని తప్పుకోమంటున్నారు తమరు? నన్నా? నాలోని పరమాత్మనా స్వామీ? నన్నైతే నా మట్టి కుండలోని నీటిలోనూ, మీ బంగారు పాత్రలోని నీటిలోనూ ఒకే సూర్యుడు ఒకే రకంగా కనిపిస్తాడు కదా స్వామీ? అలాగే, తమలోనూ నాలోనూ ఒకే పరమాత్ముడున్నాడు. పాత్రల తేడాలాంటిదే స్వామీ ఈ కులమతాల తేడా. అలా కాక నాలోని పరమాత్మను తప్పుకోమంటారా? ఆ భగవానుడి దర్శనం కోసం దేశమంతా సంచారం చేస్తున్న మీరు మీకు ఎదురైన పరమాత్మను తప్పుకుపోమంటారా స్వామీ? ఆత్మ పరమాత్మ స్వరూపమైతే ప్రతి మనిషీ దేవుడే స్వామి! దేవుడుకి కులం మతం రంగు రూపం తేడాలుంటాయా? కాదంటారా స్వామీ! "

రాజు గారు: "ఆదిశంకరులు ఆ వాదనా పటిమకు ముగ్ధులై ఆ చండాలుడిలోని ఈశ్వరుడికి పాదాభివందనం చేశారు. లోకధర్మాన్ని, సాంప్రదయాన్ని నిర్దేశించిన మహనీయుడు ఆదిపురుషుడు జగద్గురువైన ఆదిశంకరుడే హరిజనుడిని ఆదరించినప్పుడు మనమెంత యాజులు గారు! అసలు నన్నడిగితే మనిషి ప్రగతికి అనుకూలమైనదే కులం. ఇంకేమీ ఆలోచించకండి. ఆ శంకరుల వారినే ప్రార్థించండి. ఆయనే దోవ చూపిస్తాడు."

తను తీసుకున్న నిర్ణయంతో మనుమరాలిని ఆమె ప్రేమించిన వ్యక్తికి అప్పగించటానికి గోడారి ఒడ్డు చేరుకున్న యాజులను ఊరి పెద్దలు ఎదిరించి ప్రశ్నిస్తారు. తన నిర్ణయాన్ని సమర్థిస్తూ యాజులు గారు:

"పెళ్లనేది ఇద్దరు మనుషులను కలపటానికి కాదు, రెండు మనసుల్ని కలపటానికి. త్రికరణశుద్ధిగా ఆచరించని పని వ్యర్థమని శాస్త్రం చెబుతోంది. అసలు పెళ్లంటే ఏమిటి? పెళ్లి మంత్రాలకు అర్థం ఏమిటి? అష్ట వర్షాత్ భవేత్ కన్యా పుత్రవత్ పాలితా మయా ఇదానీం తవ పుత్రస్య దత్తా స్నేహేన పాలితా అంటాడు కన్యాదాత వరుడి తండ్రితో. ఇన్నేళ్లు కొడుకులా పెంచుకున్న నా కూతుర్ని నీ కొడుక్కి అప్పజెబుతున్నాను. వాళ్లిద్దరూ స్నేహంగా సఖ్యతగా ఉందురు గాక! అని. సర్వకాల సర్వావస్థలలోనూ ఆ స్నేహాన్ని కాపాడతానని వరుడు సర్వ దేవతల సాక్షిగా అగ్ని సమక్షంలో ప్రమాణం చేస్తాడు. పెళ్లంటే శోభనం ముందు జరిగే తంతు కాదు. ఒక పురుషుని స్త్రీని స్నేహితులుగా, సన్నిహితులుగా చేసే ఘట్టం. ఆ స్నేహం, సఖ్యత లోపించిన జంట కలకాలం కలిసి బ్రతకలేరు. అందుకే వేరు చేస్తున్నాను. ఆ స్త్రీ సాన్నిహిత్యాన్ని పొందే అర్హత గల వ్యక్తికి ఆమెను అప్పగిస్తున్నాను. "

పెద్దలు: "మీ మాటే శాస్త్ర సమ్మతమనుకుంటే, ఆమె పవిత్ర బ్రాహ్మణ స్త్రీ. అతడు జాతీయ ఛండాలుడైన శూద్రుడు. వాళ్లిద్దరినీ కలపటం సబబా?"

యాజులు గారు: "మంచి ప్రశ్న. ఇన్నాళ్లూ అజ్ఞానాంధకారంలో ఉండిపోయి  నేనూ అది సబబు కాదనే అనుకున్నాను. కానీ, ఒక్క క్షణం ఏకాగ్రతతో విషయావలోకనం చేస్తే నా అవివేకత నాకే తెలిసొచ్చింది. జన్మనా జాయతే శూద్రః సంస్కారాత్ ద్విజర్యుచ్యతే. జన్మము చేత మానవులందరూ శూద్రులే. వారి వారి సంస్కార ఫలితంగా వర్ణాలేర్పడతాయని ఉపదేశించిన మనువు స్ఫురణకొచ్చాడు."

ఊరి పెద్ద: "జన్మతో అందరూ శూద్రులెలా అవుతారండీ! చాతుర్వర్ణం మయా సృష్టం అనలేదా భగవానుడు గీతలో?"

యాజులు గారు: "అన్నాడు. చాతుర్వర్ణం మయా సృష్టం అని ఊరుకోలేదే? గుణ కర్మ విభాగశః అని కూడా అన్నాడు. గుణాల్ని బట్టి, కర్మలను బట్టి నాలుగు వర్ణాల్ని సృష్టించానన్నాడే తప్ప పుట్టుకను బట్టి కాదు. తన విధిని తాను నిర్వర్తించక అరిషడ్వర్గాలకు బానిసై భ్రష్టుడైన బ్రాహ్మణుడి కంటే పవిత్రమైన నడవడి గల శూద్రుడికి తలవంచి నమస్కరిస్తాను నేను. ఈ కర్మ ఛండాలుడి కంటే ఆ జాతి ఛండాలుడు లక్ష రెట్లు మేలు. దీనికి మన పూర్వ మహర్షులే ప్రత్యక్షణ ప్రమాణ భూతులు. క్షత్రియుడైన విశ్వామిత్రుడు బ్రహ్మర్షైనాడు. పల్లె పడుచుకు జన్మించిన వ్యాసుడు బ్రాహ్మణుడైనాడు, భగవానుడైనాడు. మతంగ కన్య అయిన అరుంధతిని వివాహమాడిన వశిష్ఠుడు బ్రహ్మర్షి అయినాడు. కాదంటారా?"

ఊరి పెద్ద: "ఏమైనా, ఇంతటి అకృత్యానికి పాల్పడి కులభ్రష్టం చేస్తున్న మీరు పవిత్రమైన దేవాలయంలో అర్చకత్వానికి అర్హులు కారు"

యాజులు గారు: "పరమాత్ముణ్ణి అర్చించుకోవటానికి ఆ నాలుగు గోడల మధ్యనే కూర్చో అక్కర్లేదు శాస్త్రి గారు. సర్వాంతర్యామి అయిన విధాత మీలో ఉన్నాడు, వీరిలో ఉన్నాడు, మట్టిలో ఉన్నాడు, గాలిలో ఉన్నాడు. నిరాకారుడైన ఈశ్వరుని నా మనాసులో చూసుకోగలను. ధ్యానించుకోగలను. ఇది నా పునర్జన్మ. గాఢాంధకరం అలముకొని ఉన్న ఈ ఒడ్డునుండి వెలుగురేఖలు నిండిన ఆ ఒడ్డుకు చేరుకోబోతున్నాను."

ఊరి పెద్ద: "వేదమంత్రాలు, సప్తపది ప్రమాణాలు అర్థం లేనివని మీ ఉద్దేశం అన్నమాట. మేమూ మీలాగే మారిపోయి ఆచార వ్యవహారాలన్నీ మంటగలిపేయాలని మీ కోరిక అన్నమాట."

యాజులు గారు: "పొరబడుతున్నారు. కాగితం గాలికి రెపరెపలాడకుండా బరువుంచినట్లు మానవ సంఘం అవినీతి వల్ల ఛిన్నాభిన్నం కాకుండా ఆచారాలనే బాధ్యత ఉంచబడింది. అంతే కానీ, వాటి పేరుతో మనిషిని మనిషిని వేరు చేయటానికి కాదు. సర్వ ప్రాణికోటి ఆ విరాట్పురుషుని దేహంలో నుంచి ఉద్భవించిందే. సృష్టిలోని ప్రతి వ్యక్తి ఆ పరమాత్ముని ప్రతి రూపమే. అన్యవర్ణాల వారు బ్రాహ్మణులను హేళన చేసి, బ్రాహ్మణులను మిగతా వర్ణాల వారిని చులకన చేసి చూడటం ఆ భగవంతుణ్ణి దూషించినంత పాపం. పిపీలికాది బ్రహ్మ పర్యంతం సర్వం ఈశ్వరమయం. ఇన్ని కోట్ల ఈశ్వర ప్రతి రూపాలను అందించే ప్రతి కులము గొప్పడే. అన్ని కులాలూ సమానమే. ..."

యాజులు గారు పెద్దలను దాటుకుంటూ పడవ ఎక్కటానికి వెళతారు. చిత్రం చివరి సన్నివేశం అదే. అప్పుడు వచ్చే మాటలు మనందరికీ కనువిప్పు కలిగించే సత్యవచనాలు.

"రాగానికి కులమేది? తాళానికి మతమేది? సప్తస్వర బద్ధమైన సంగీతం వారి కులం. నవరసభరితమైన నాట్యం వారి మతం. ఆ జంట వేసినవి ఏడడుగులు కావు. దాటినవి ఏడు అగడ్తలు. స్వరాలు సరిహద్దులుగా రాగాలు రాచబాటలుగా కల రస రాజధానిలోకి అడుగుపెడుతున్న ఆ జంటను మీరూ మనసారా ఆశీర్వదించండి."



విశ్వనాథ్ గారు సంఘ సంస్కర్త అని ఎందుకు అన్నాను అంటే, మన సమాజంలో విభజనకు కారణమై, జాడ్యాలకు దారి తీసే కొన్ని అపోహలను ఈ చిత్రంలో సంభాషణల ద్వారా, పాటల ద్వారా అయన తొలగించటంలో సఫలమైనారు. నాకు తెలిసిన చదువుకున్న వారికెందరికో ఈ చిత్రం కనువిప్పు కలిగించింది. చిత్రంలోని సందేశం సామాన్యుల మనసులలో ఉన్న ప్రశ్నలకు సమాధానం తెలిపి ప్రజలకు శాంతి కలిగించింది. ఏ సంఘ సంస్కరణ యొక్క ఉద్దేశమైనా ప్రజలలో విభజనను, అశాంతిని తొలగించటమే. కులాలకు అతీతమైన కళలకు ప్రాధాన్యతనిచ్చి, ఆ కళల ద్వారా మానవులను ఏకం చేసి దివ్యత్వం వైపు నడిపించే అద్భుతమైన మార్గాలను విశ్వనాథ్ గారు ఈ చిత్రం ద్వారా మనకు అందజేశారు.

అలాగే, ఎక్కడికక్కడ, వేర్వేరు వృత్తులు, కులాలకు చెందిన వారి ద్వారా అద్భుతమైన ఆధ్యాత్మిక సందేశాన్ని పలికించి మనం ఏమి చేయాలో అద్భుతంగా గుర్తు చేశారు. గోవులను కాచే కుటుంబం చేత గోవులు తెల్లన అనే పాట ద్వారా, దొమ్మరి కుటుంబం, రజక కుటుంబం చేత ఏ కులము నీదంటే అన్న పాట ద్వారా, అయిగిరి నందిని స్తోత్రంతో బ్రాహ్మణుని ద్వారా, రాజు గారి చేత ఆదిశంకరుల గాథ ద్వారా సమయోచితమైన సందేశాన్ని ఆయా పాత్రలకు తెలియజేసి చిత్రానికి పరిపూర్ణతను కలిగించారు.

మానవుని జీవితంలో తప్పులను సరిదిద్దుకుంటూ వెళ్లటం అనేది నిజమైన పురోగతి. ఆ తప్పులు ఆలోచనలలో ఉండవచ్చు లేదా కర్మలలో కూడా ఉండవచ్చు. చిత్రంలో వేర్వేరు మూలాల ద్వారా తనకు అందిన సందేశాన్ని గ్రహించిన యాజులు పురోగతి దిశగా అడుగులు వేయటానికి ఏ విధంగా సంసిద్ధుడైనాడో విశ్వనాథ్ గారు విశేషంగా ఆవిష్కరించారు. ఆయ్నలోని అజ్ఞానాంధకారం తొలగి జ్ఞానజ్యోతి వెలిగి ఆయనను ముందుకు నడిపించేలా చేసిన పద్ధతి రమణీయం. అలాగే, తాను తెలుసుకున్న నిజం వైపు దృఢచిత్తుడై నిలబడి ప్రశ్నించిన వారికి శాంతంగా సమాధానం చెప్పి తన మార్గంలో ముందుకు వెళ్లటం యాజులు గారి పాత్రలో సోమయాజులు అద్భుతంగా నటించారు. ఇలా - నటనలో, సంభాషణలలో, పాటలలో, నేపథ్య సంగీతంలో, చిత్రీకరణలో విశ్వనాథ్ గారి ముద్ర అణువణువునా కనబడుతుంది.

నేను విశ్వనాథ్ గారి చిత్రాలన్నిటిలోనూ సప్తపది ఉత్తమ సందేశం గల చిత్రంగా భావిస్తాను. సంగీత ప్రాధాన్యతను కొనసాగిస్తూనే ఎంతో ముఖ్యమైన సామాజిక సందేశాన్ని అందజేసిన చలన చిత్ర రాజం సప్తపది. అందుకే 1981 సంవత్సరానికి గాని నర్గీస్ దత్ జాతీయ సమైక్యతా ఉత్తమ చలన చిత్ర అవార్డును గెలుచుకుంది. అలాగే ఉత్తమ ఫిలింఫేర్ అవార్డు, ఉత్తమ స్చ్రీన్ ప్లే నంది అవార్డును కూడా పొందింది. తెలుగునాట మరుగున పడిపోతున్న కళలతో పాటు, విలువలపైనా అద్భుతమైన చిత్రాలను ఆవిష్కరించిన విశ్వనాథ్ గారికి శతసహస్ర వందనాలు. 

2 కామెంట్‌లు:

  1. విశ్వనాధ్ గారి ఫిలాసఫీని చాలా బాగా వివరించారు. నెనరులు 🙏

    రిప్లయితొలగించండి
  2. It is not good to mix castes. Traditions food habits have to be severely compromised.

    రిప్లయితొలగించండి