25, జూన్ 2017, ఆదివారం

దొరకునా ఇటువంటి సేవ - వేటూరి అజరామర గీతం



దొరకునా ఇటువంటి సేవ నీ పద రాజీవముల చేరు నిర్వాణ సోపానమధిరోహణము సేయు త్రోవ

రాగాలనంతాలు నీవేయి రూపాలు భవరోగ తిమిరాల పోకార్చు దీపాలు
నాదాత్మకుడవై నాలోన చెలగి నా ప్రాణ దీపమై నాలోన వెలిగే
నిను కొల్చు వేళ దేవాది దేవా దేవాది దేవా దొరకునా ఇటువంటి సేవ


ఉచ్చ్వాస నిశ్శ్వాసములు వాయులీనాలు
స్పందించు నవనాడులే వీణాగానాలు
నడలు ఎదలోని సడులే మృదంగాలు
నాలోని జీవమై నాకున్న దైవమై
వెలుగొందు వేళ మహానుభావా మహానుభావా దొరకునా ఇటువంటి సేవ

పరమాత్మా! నీ పదకములములను చేరే ముక్తిపథములోని మెట్లను అధిరోహణము చేసే త్రోవ ఈ సంగీత సేవ. మళ్లీ మళ్లీ దొరకునా ఇటువంటి సేవ?అనంతమైన రాగాలు నీ వేల రూపాలు. అవి ఈ జననమరణాలతో కూడిన సంసారసాగరంలోని రోగాలనే అంధకారాలను తొలగించే దీపాలు. నా ఆత్మకు స్వరూపమై నాలోని నివసించి నా ప్రాణ దీపమి నాలోన వెలిగే నిన్ను కొలిచే వేళ, ఓ దేవాది దేవా!, ఎంత గొప్పది. ఇటువంటి సేవ మళ్లీ మళ్లీ దొరకునా? ఈ సంగీత సేవలో ఉచ్చ్వాస నిశ్వాసలే ఫిడేలు నాదాలు. ఆ సప్తస్వరాలకు స్పందించే నవనాడులు (ఇడ, పింగళ, సుషుమ్న, గాంధార, హస్తిని, పుష, జయస్విని, అలంబస, కుహ) వీణాగానాలు. వివిధ కదలికలు, హృదయ స్పందనలే మృదంగ ధ్వానాలు. నాలోని జీవమై, నాకున్న దైవమై నీవు వెలుగొందు వేళ, ఓ మహానుభావా! ఇటువంటి సేవ మళ్లీ దొరకునా!

- వేటూరి సుందరరామమూర్తి (శంకరాభరణం చిత్రం)

నాదోపాసనలో తరించే సంగీత యోగుల మనోభావనలను అద్భుతంగా ప్రతింబింబించే గీతం ఇది. ఆత్మజ్ఞానులు కావటానికి వేయటానికి సంగీతం ఓ అద్భుతమైన సాధనం. ఈ సేవలో తరించి ముక్తిని పొందిన వారెందరో. శంకరాభరణంలోని శంకరశాస్త్రీ అంతే. భావాన్ని స్వర రాగ యుక్తంగా నవనాడుల్లో నింపుకొని పరమాత్మతో అనుసంధానమై గానం చేసే యోగి. అందుకే కే విశ్వనాథ్ గారు ఆయన కోసం ప్రత్యేకమైన గీతాలను గేయకర్త చేత రచింపజేశారు. ఇటువంటి సేవ మళ్లీ దొరకునా అన్న భావన కలిగించేలా ఈ గీతాన్ని పతాక సన్నివేశంలో పొందుపరచారు. నాదసాధనే పరమాత్మకు పూజగా భావించిన వారు జీవన్ముక్తులైనారు. పవిత్రమైన నాదోపాసనలో ఉన్న శంకరశాస్త్రి వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించిన చిత్రం శంకరాభరణం. అనంతమైన రాగాలను ఆయన సహస్ర రూపాలుగా భావించి ఆ నాదసాధనే భవసాగరములోని చీకట్లను తొలగించే జ్ఞానజ్యోతిగా అనుభూతి చెందిన విద్వాంసుడు శంకర శాస్త్రి. ఆ సంగీత సేవ శాశ్వతం కావటానికి శిష్యుడు కావాలి కదా? అత్యాచారానికి గురైన ఓ స్త్రీని తన వెంటబెట్టుకుని ఇంటికి రాగా పండితులు ఆయనను వెలివేయగా ఆ స్త్రీ ఆయనకు దూరంగా వెళుతుంది. ఆమె కడుపున పుట్టిన బిడ్డ శంకరశాస్త్రి గారి నాదోపాసనను కొనసాగించేందుకు అద్భుతమైన సన్నివేశాలను సృష్టించి అందులో చివరగా ఈ గీతాన్ని ఆవిష్కరించారు. ఆత్మకుడైన పరమాత్మను కొలిచే సేవలో తనువులోని వేర్వేరు ప్రక్రియలను సంగీత సాధనలోని పరికరాల నాదాలకు ఉపమానం చేశారు కవి వేటూరి. సంగీత సాధనలో మనలోని మలినములు తొలగి జ్ఞానేంద్రియములు జాగృతమై పరమాత్మతో అనుసంధానమయ్యే అవకాశం ఉంది. పవిత్రమైన ఈ సాధన ముక్తిమార్గానికి సోపానము. ఈ సందేశాన్నే కవి మనకు ఈ గీతం ద్వారా అందజేశారు. అన్నమయ్య, త్యాగయ్య, రామదాసు వంటి వాగ్గేయకారులు ఇటువంటి భావనలనే అనుభవపూర్వకంగా సంకీర్తనల ద్వారా పలికారు. ఈ గీతం వెనుక ఉన్న కళాతపస్వి విశ్వనాథ్ గారికి, వేటూరి వారికి, సంగీత కారులు మహాదేవన్ గారికి, బాలసుబ్రహ్మణ్యం గారికి, వాణీజయరాం గారికి మనం ఎంతో రుణపడి ఉన్నాము. ఈ  పాట సాహిత్యం మరియు సన్నివేశం యొక్క ప్రాముఖ్యత ఇనుమడింపజేసేలా సోమయాజులు గారు, మంజు భార్గవి గారు, తులసి నటించారు. అందుకే ఈ చిత్రం సార్థక నామధేయమై నిలిచింది.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి