సర్దుకుని కలిసుండటమా? విడిపోవటమా? - ఇదీ నేటి భారతీయ యువ జంటలలో ఉన్న ప్రశ్న. చాలామంది విడిపోవటానికే మొగ్గు చూపుతున్నారు. నేను చెప్పేది పేదరికంలో మగ్గుతున్న వారు లేదా ఆర్థిక స్వావలంబన లేని వారు కాదు. ఉద్యోగాలు చేస్తూ చిన్న చిన్న విషయాలలో గొడవపడి నలుగురిని అందులోకి లాగి చివరకు ఏమీ చేయలేక విడాకులకు వెళుతున్న వారి గురించి. ఇటువంటి వారికి కీచులాటల మధ్యే ఒకరో ఇద్దరో బిడ్డలు.. వాళ్ల భవిష్యత్తు సింగిల్ పేరెంటింగ్‌లోనే. ఎవరినీ తప్పు పట్టలేము, తప్పని తెలిసినా చెప్పలేని, చెప్పినా వినలేని, విన్నా అర్థం చేసుకోలేని పరిస్థితులు. ఒకటి మాత్రం నిజం - వివాహానికి సిద్ధంగా లేనప్పుడు పెళ్లి చేయటం అనేది ఈ కాలంలో కూడని పని. సిద్ధం అంటే? - ఇతరుల మనస్తత్వాలను గమనించ గలిగే వ్యక్తిత్వ వికాసం, వైవిధ్యాన్ని, భిన్నత్వాన్ని స్వీకరించ గలగటం. ఇవిలేక అపరిపక్వత కలిగి ఉన్న యువతీ యువకులపై వివాహాన్ని రుద్దకూడదు. చాలా సమస్యలకు మూలం - పిల్లలను గారాబంగా పెంచటం, బాధ్యతలను సరైన వయసులో తెలియజేయలేకపోవటం, అడిగినదల్లా ఇచ్చి డబ్బు, ఆస్తులు ఎంత కష్టపడితే వస్తాయో నేర్చుకోనివ్వకపోవటం. తల్లిదండ్రులున్నది పిల్లలకు అన్నీ అందజేయటానికి కాదు. వారికి కావలసిన వ్యక్తిత్వ వికాసానికి తోడ్పటం వరకే. విద్య వ్యక్తిత్వ వికాసంలో భాగమే. ఆర్థిక స్వావలంబన అందరికీ తప్పనిసరి. కానీ, అది మానవీయ విలువలను, సంబంధాలను త్రుంచేదిగా ఉండకూడదు. పరిణతి, అవగాహన లేని వయసులో వివాహం చేసినందువలన ఊహించని సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంది. 25 ఏళ్లు ఇంకో ఇంట్లో పూర్తిగా భిన్నమైన వాతావరణంలో పెరిగిన జీవిత భాగస్వామి ఇష్టాయిష్టాలను గ్రహించి కొంత కూడా వారి కోసం సర్దుకోలేకపోవటానికి కారణం వ్యక్తిత్వం వికాసం, మనుషులతో వివృతి లేకపోవటం, అవగాహన పెరగకపోవటమే. ఇవి ఒకరోజులో వచ్చేవి కావు. గతంలో ఉమ్మడి కుటుంబంలో వేర్వేరు పాత్రల ద్వారా చాలామటుకు అందేవి. ఇప్పుడు మేమిద్దరం మాకిద్దరు మొత్తం నలుగురమే అనే కుటుంబ వ్యవస్థలో ఈ ముఖ్యమైన పాఠాలు అందే అవకాశం లేదు. కాబట్టి పిల్లలకు అవగాహన పెరిగే వరకు వేచి ఉండాలి. వారి నిర్ణయాల ఫలితాలను వారు భరించి ముందుకు వెళ్లేలా బాధ్యతాయుతంగా పెంచాలి. లేకపోతే ప్రతి మూడు వివాహాల్లోనూ ఒకటి విడాకుల వరకు వేళ్లే అవకాశం ఉంది.
నేటి భారతంలోని ఉరుకులు పరుగుల జీవితాల్లో డబ్బు చాలా పెద్ద పాత్ర పోషిస్తోంది. జీవన ప్రమాణాలతో పాటు డబ్బు అవసరం, డబ్బు యొక్క ప్రాధాన్యత వంద రెట్లు పెరిగాయి. ఎవరూ ఇంకొక మనిషిని పోషించే పరిస్థితులు లేవు. అందుకే మనుషులు ఆర్థిక స్థిరత్వం చిన్న వయసులోనే కోరుకుంటున్నారు. దీని ఫలితంగా ఉద్యోగ ప్రాధాన్యమైన చదువులే తప్ప వ్యక్తిత్వాలను దృఢ పరిచే చదువులు, అనుభవాలకు అసలు ప్రాధాన్యత లేదు. దాని వలన ఎదగని మనస్తత్వాలు, తొందరగా స్పందించే హృదయాలు, విమర్శను తట్టుకోలేని ఆవేశాలు. పురుషాహంకారం చదువుల వల్ల కొంత తగ్గినట్లు అనిపించినా, భార్యపై పైచేయి కావాలన్నదే ఇప్పటికీ భారతీయ పురుషుని మనస్తత్వం. దీనికోసం ఎంతకైనా తెగిస్తున్నాడు. అలాగే, స్త్రీలలో కూడా అర్థం చేసుకునే గుణం, ఓర్పు చాలా తగ్గాయి. వారిలో ఆవేశకావేశాలు పెరిగి ప్రతి చిన్న అభిప్రాయం భేదం కూడా తగవుగా మారుతోంది. అందుకే తల్లిదండ్రులు ఇప్పటికైనా కళ్లు తెరచి పిల్లల వ్యక్తిత్వ వికాసంపై దృష్టి పెట్టాలి. డిగ్రీ కాగానే పెళ్లి అన్నది ఈనాటి పిల్లలకు వర్తించదు. కాస్త సమాజంలో ఢక్కాముక్కీలు తిన్న తరువాతే పెళ్లి చేస్తే మంచిది. ప్రతి దానికీ ఏడ్చే ఆడపిల్లలు భర్తపై కూడా అలాగే వ్యవహరిస్తారు. నలుగురితో మసలుకోలేని మగవాడు, బాధ్యత తెలియని వాడు భార్య పట్ల కూడా అలాగే వ్యవహరిస్తాడు. కాస్త మమకారం తగ్గించుకుని పిల్లలను తల్లిదండ్రులు స్వతంత్రంగా గమనించాలి. వారి వ్యక్తిత్వాలలో అవకతవకలు, పెద్ద అవలక్షణాలు కనిపిస్తున్నప్పుడు వారికి వివాహం తలపెట్టకపోవటమే మంచింది. అలా చేస్తే కొరివితో తల గోక్కున్నట్లే.
మనమేదో సంస్కృతి సాంప్రదాయం అని భారత దేశం గురించి కలలు కంటాము. అవి పుస్తకాలకు, భాషణలకు మాత్రమే పరిమితం. వాస్తవం దారుణంగా ఉంది. మన యువతీ యువకుల వ్యక్తిత్వాలు డొల్లగా ఉన్నాయి. మనం చేస్తున్నది పాశ్చాత్యులను గుడ్డిగా అనుకరించటమే. వారికి 50 ఏళ్ల క్రితం వచ్చిన సమస్యలు మనకు ఇప్పుడు వస్తున్నాయి. అంతే తేడా. చదువు->ఉద్యోగం->వివాహం->పిల్లలు ఇవి ఇదివరకులా ఆటోమేటిక్ కాదు సుమా. ప్రతి అడుగులోనూ ఆత్మావలోకనం అవసరం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి