17, మార్చి 2016, గురువారం
16, మార్చి 2016, బుధవారం
అత్త-కోడలు - ఆధిపత్యపు పోరు
కోడలు: అత్తయ్యా పెళ్లై ఇన్నేళ్లయ్యింది. మీకు ఏది ఇష్టమో తెలుసుకోవటం నా వల్ల కాలేదు...
అత్తగారు: అది మీ మామగారి వల్లే కాలేదు. ఇంక నీ వల్ల ఏమవుతుంది. అయినా, ఇష్టాలు అయిష్టాలు ఇష్టమున్న మనుషులతోనే లేమ్మా.
అత్తగారు: కోడలు పిల్లా! డబ్బేమన్నా దాస్తున్నారా? వాడికి వచ్చింది వచ్చినట్లు స్వాహాయేనా?
కోడలు: ఆ మీరు మామయ్యగారి జీతమంతా ఏం చేశారో మీ బీరువాల్లో చీరలే చెబుతాయి. నేను మాత్రం తక్కువ తిన్నానా?
అత్తగారు: పిల్ల కళ్లు ముక్కు అన్ని నావేనే. చక్కగా తీరుగా ఉంటాయి మా వాళ్ల పోలికలు.
కోడలు: అందరూ పిల్ల నలుపు మీదే వచ్చిందంటున్నారు అత్తయ్యా!
అత్తగారు: అమ్మాయ్! నలుపు అదృష్టమే. తెల్లతోలుంటేనే అందముటే...
కోడలు: మరి మీ అబ్బాయి నన్ను చేసుకుంది నా తెల్లతోలు చూసేగా?
కోడలు: వెధవ పోలికలు, వద్దనుకుంటే వస్తాయి. ఆ కోపం, ఆ హఠం వేయటం అన్నీ దిగిపడ్డాయి.
అత్తగారు: ఆ నిజమే. మీ అమ్మ పోలికే అని నేను మీ మామగారు ఎప్పుడూ అనుకుంటాం.
అత్తగారు: వెధవ గోదారి వంటలు, ప్రతి దాంట్లోనూ బెల్లం, ఆవ కూరలు. ఒంటికి వాతం, వేడి. తినలేక చస్తున్నా.
కోడలు: ముదనష్టపు గుంటూరు వంటలు. నోట్లో పెట్టుకుంటే నాలు ఊడాల్సిందే. ఒక రుచా పచా!
అత్తగారు: ఈ తూగోజీ వాళ్లున్నారు చూడండీ, భలే మాటలు చెబుతారండీ. అండీ అండీ అంటూనే వెనకాతల గోతులు తవ్వుతారు.
కోడలు: అబ్బో ఈ గుంటూరు కృష్ణా జిల్లాల వాళ్లతో పడలేము తల్లో. యమ టెక్కు, ఓ మాట పడలేరు, నోట్లోంచి మాట వస్తే విరిచినట్లే. మా అహంబోతులండీ.
అత్తగారు: అది మీ మామగారి వల్లే కాలేదు. ఇంక నీ వల్ల ఏమవుతుంది. అయినా, ఇష్టాలు అయిష్టాలు ఇష్టమున్న మనుషులతోనే లేమ్మా.
అత్తగారు: కోడలు పిల్లా! డబ్బేమన్నా దాస్తున్నారా? వాడికి వచ్చింది వచ్చినట్లు స్వాహాయేనా?
కోడలు: ఆ మీరు మామయ్యగారి జీతమంతా ఏం చేశారో మీ బీరువాల్లో చీరలే చెబుతాయి. నేను మాత్రం తక్కువ తిన్నానా?
అత్తగారు: పిల్ల కళ్లు ముక్కు అన్ని నావేనే. చక్కగా తీరుగా ఉంటాయి మా వాళ్ల పోలికలు.
కోడలు: అందరూ పిల్ల నలుపు మీదే వచ్చిందంటున్నారు అత్తయ్యా!
అత్తగారు: అమ్మాయ్! నలుపు అదృష్టమే. తెల్లతోలుంటేనే అందముటే...
కోడలు: మరి మీ అబ్బాయి నన్ను చేసుకుంది నా తెల్లతోలు చూసేగా?
కోడలు: వెధవ పోలికలు, వద్దనుకుంటే వస్తాయి. ఆ కోపం, ఆ హఠం వేయటం అన్నీ దిగిపడ్డాయి.
అత్తగారు: ఆ నిజమే. మీ అమ్మ పోలికే అని నేను మీ మామగారు ఎప్పుడూ అనుకుంటాం.
అత్తగారు: వెధవ గోదారి వంటలు, ప్రతి దాంట్లోనూ బెల్లం, ఆవ కూరలు. ఒంటికి వాతం, వేడి. తినలేక చస్తున్నా.
కోడలు: ముదనష్టపు గుంటూరు వంటలు. నోట్లో పెట్టుకుంటే నాలు ఊడాల్సిందే. ఒక రుచా పచా!
అత్తగారు: ఈ తూగోజీ వాళ్లున్నారు చూడండీ, భలే మాటలు చెబుతారండీ. అండీ అండీ అంటూనే వెనకాతల గోతులు తవ్వుతారు.
కోడలు: అబ్బో ఈ గుంటూరు కృష్ణా జిల్లాల వాళ్లతో పడలేము తల్లో. యమ టెక్కు, ఓ మాట పడలేరు, నోట్లోంచి మాట వస్తే విరిచినట్లే. మా అహంబోతులండీ.
13, మార్చి 2016, ఆదివారం
అసమాన సాహస మహిళ నీరజ భనోత్
మానవత్వం కోసం, తన ధర్మం కోసం ప్రాణాలొడ్డి పోరాడి వందలాది మంది ప్రాణాలు కాపాడిన వీర వనిత, భరతజాతి గర్వంతో చెప్పుకోగలిగిన ధీర నారి, ఊహించలేని సంక్లిష్టకరమైన సమయంలో సమయస్ఫూర్తి, తెగింపు, ఓర్పు చూపి విలువైన ప్రాణాలు కాపాడి తన ప్రాణాలు కోల్పోయిన త్యాగమూర్తి....ఇలా ఆమె కనబరచిన ధైర్య సాహసాలను ఎన్ని రీతుల చెప్పినా అవి తక్కువే. ఎవరని ఆలోచిస్తున్నారా? స్త్రీ శక్తిని, మానవ జన్మ లక్ష్యాన్ని తన అసమాన సాహసోపేతమైన చర్యలతో ప్రపంచానికి చాటిన మహిళ నీరజ భనోత్. తీవ్రవాదులతో పోరాడి విమాన ప్రయాణికులను కాపాడి తన ప్రాణాలను కోల్పోయిన ఈ అసమాన మహిళ వివరాలు తెలుసుకుందాం.
1963 సెప్టెంబర్ 7న పంజాబ్ రాష్ట్రంలోని చండీగఢ్‌లో హరీష్ మరియు రమా భనోత్ దంపతులకు నీరజ జన్మించింది. అప్పటికే అఖిల్ మరియు అనీష్ అనే ఇద్దరబ్బాయిలు వారికి పుట్టారు. నీరజ చండీగఢ్‌లోని సేక్రెడ్ హార్ట్ స్కూల్, ముంబైలోని బాంబే స్కాటిష్ స్కూల్లో చదివిన తరువాత అక్కడే సెయింట్ క్సేవియర్స్ కళాశాలలో చదువు పూర్తి చేసింది. తరువాత మోడలింగ్ కెరీర్ మొదలు పెట్టింది. అప్పుడే పాన్ ఆం ఎయిర్‌లైన్స్ వాళ్లు ఫ్లైట్ అటెండెంట్స్ పోస్టులకు పత్రికలలో ప్రకటన చేస్తే నీరజ అప్ప్లై చేసి అమెరికాలోని మయామీలో శిక్షణ పొందింది. ఆమె ప్రతిభకు మెచ్చి ఆ సంస్థ వాళ్లు ఆమెను ఛీఫ్ ఫ్లైట్ అటెండెంట్‌గా నియమించారు.
1986వ సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీన పాన్ ఆం 73 విమానం 361 మంది ప్రయాణికులు 19 మంది సిబ్బందితో ముంబై నుండి కరాచీ మరియు ఫ్రాంక్ఫర్ట్ మీదుగా న్యూయార్కుకు బయలు దేరింది. ముంబై నుండి కరాచీ విమానాశ్రయం చేరుకున్న విమానాన్ని నలుగురు అబు నిదల్ సంస్థకు చెందిన తీవ్రవాదులు హైజాక్ చేశారు. దానిని సైప్రస్ మళ్లించాలని అనుకున్నారు. ప్రయాణికుల విడులకు బదులుగా తమ సంస్థకు చెందిన ఖైదీలను విడుదల చేయాలని వారి డిమాండ్లు.
నీరజ సమయస్ఫూర్తితో కాక్‌పిట్‌లో ఉన్న పైలట్లకు హైజాక్ గురించి తెలియజేసింది. విమానం ఇంకా రన్‌వే మీదనే ఉండటంతో పైలట్లు కాక్‌పిట్ నుండి సురక్షితంగా బయట పడ్డారు. దీనితో విమానాన్ని నడిపే పరిస్థితిని నీరజ వలన తప్పింది. కానీ, విమానంలో ఉన్న మిగిలిన ఉద్యోగులలో నీరజే సీనియర్ కావటంతో భారమంతా ఆమెపై పడింది. ఆ తీవ్రవాదులు తమ డిమాండ్లకై అమెరికా ప్రభుత్వంపై వత్తిడి తీసుకురావటానికి నీరజను విమానంలో ఉన్న అమెరికన్ పౌరసత్వమున్న ప్రయాణికుల పాస్‌పోర్టులన్నీ సేకరించమని చెప్పారు. నీరజ చాలా తెలివిగా అమెరికన్ పాస్‌పోర్టులన్నీ సీట్ల కింద కొన్ని, చెత్త బుట్టలో కొన్ని దాచమని సిబ్బందిని నిర్దేశించింది. తాను కూడా అదే చేసింది. మొత్తం మీద 41 మంది అమెరికన్ ప్రయాణీకులు ఉన్నా నీరజ కనబరచిన సమయ స్ఫూర్తితో తీవ్రవాదులు వారిని వేరు చేయలేకపోయారు.
17 గంటలు దాటినా విమానం నడిపించటానికి విమానాశ్ర్య అధికారులు పైలట్లను పంపక పోవడంతో తీవ్రవాదులు పేలుడు పదార్థాలు, గన్లను ఉపయోఇంచటం మొదలు పెట్టారు. వారి వద్ద ఇక ఆయుధాలలో తూట్లు, పేలుడు పదార్థాల నిల్వలు నిండుకున్నాయి. అప్పుడు, ప్రాణాలకు తెగించి నీరజ ప్రయాణికుల సాయంతో ఎమెర్జెన్సీ డోర్లు తెరుస్తుంది. తన ప్రాణాలను కాపాడుకోవటానికి తాను ముందు దూకవచ్చు, కానీ ముగ్గురు చిన్నపిల్లలను ఆ తీవ్రవాదుల కాల్పులనుండి రక్షించటానికి వారితోనే ఉంటుంది. తీవ్రవాదుల కాల్పుల్లో మొత్తం 20 మంది ప్రయాణికులు మరణించారు. అందులో 12 మంది భారతీయులు ఇద్దరు అమెరికన్లు మిగిలిన వారు పాకీస్తాన్, యూకే మరియు మెక్సికోకు చెందినవారు. మిగిలిన 340 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడి నీరజ తన ప్రాణాలను కోల్పోయింది. పసిపిల్లల కోసం, తోటి ప్రయాణికుల కోసం సాహసోపేతంగా పోరాడి వీరమరణం పొందింది. పాకిస్తానీ సైన్యానికి చెందిన స్పెషల్ సెక్యూరిటీ గ్రూపుకు చెందిన సైనికులు ఆ తీవ్రవాదులను చెరబట్టారు.
అసమాన ధైర్య సాహసాలను ప్రదర్శించిన నీరజకు భారత ప్రభుత్వం 1987లో మరణానంతరం ఆశోకచక్ర అవార్డును ప్రకటించింది. నీరజ తల్లి రమ అప్పటి రాష్ట్రపతి జ్ఞాని జైల్‌సింగ్ చేతుల మీదుగా రిపబ్లిక్ డే నాడు ఆ అవార్డును స్వీకరించింది. అటు తరువాత పాకిస్తాన్ ప్రభుత్వం ఆమెకు తంఘా-ఎ-ఇన్సానియత్ అవార్డును, అమెరికా ప్రభుత్వం జస్టిస్ ఫర్ క్రైంస్ మరియు స్పెషల్ కరేజ్ అవార్డును ప్రదానం చేసింది. 2004వ సంవత్సరంలో భారత తపాలా శాఖ ఆమె సంస్మరణార్థం ఒక ప్రత్యేక తపాలా బిళ్లను విడుల చేసింది.
నీరజ తల్లిదండ్రులు ఆమె మరణాంతరం జీవిత భీమాతో వచ్చిన డబ్బుతో నీరజ భనోత్ -పాన్ ఆం అనే ట్రస్ట్ ఏర్పాటు చేశారు. విమానయానంలో డ్యూటీని మించి సేవాదృక్పథాన్ని కనబరచే వారికి ఒక అవార్డును, వరకట్నం వంటి సామాజిక అంశాలపై పోరాడే వారికి నీరజ భనోత్ అవార్డును ప్రతి సంవత్సరం ఇస్తున్నారు. ఈ రెండవ అవార్డుకు కూడా కారణం ఉంది. నీరజకు 1985లో గల్ఫ్‌లో ఉన్న ఒక వ్యక్తితో వివాహమైంది. కానీ, వరకట్న వేధింపులతో రెండు నెలలకే నీరజ తల్లిదండ్రుల వద్దకు తిరిగి వచ్చి తన కెరీర్‌పై దృష్టి పెట్టింది. ఆ దురాచారానికి వ్యతిరేకంగా తల్లిదండ్రులు ఈ అవార్డును ఇస్తున్నారు. నీరజ కాపాడిన పిల్లలలో ఒకరు ఇప్పుడు పైలట్. ఇది నీరజ చేసిన సాహసానికి ఉత్తమమైన సాఫల్యము మరియు సార్థకత.
నీరజ తండ్రి హరీష్ 2007లో, తల్లి రమ 2015 డిసెంబరులో మరణించారు. ఇటీవలే నీరజ సాహస చరిత్రను తెరకెక్కించారు. సోనం కపూర్ నీరజగా నటించింది. ప్రఖ్యాత నటి షబనా అజ్మీ నీరజ తల్లి రమగా నటించారు. నీరజ సోదరులు అఖిల్ మరియు అనీష్ ఈ చిత్రాన్ని చూసి ఎంతో సంతోషించారు. వాస్తవాన్ని యథాతథంగా తీసినందుకు నిర్మాతను, దర్శకుడిని అభినందించారు. ఈ చిత్రం ప్రతి మహిళ, ప్రతి బాలిక చూడవలసినది. ఆడది అబల కాదు అని మరో సారి చాటి చెప్పిన నీరజ సాహస గాథ తరతరాల పాటు మార్గదర్శకం. ఆమె కథను కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు పాఠ్యాంశాలలో చేర్చి దేశ పౌరులను మరింత సాహసవంతులుగా, దేశభక్తులుగా, మానవత్వంతో నిండిన మనుషులుగా తీర్చిదిద్దటానికి తోడ్పడాలి.
11, మార్చి 2016, శుక్రవారం
వేణువాద్య సమ్మోహనం - ప్రతిభామూర్తి జయప్రద రామమూర్తి
సంగీతం కొంతమందికి దైవానుగ్రహమైతే కొంతమందికి వంశపారంపర్యంగా వచ్చే వారసత్వం. రెండూ కలగలిపితే ఇక అది అద్భుతమైన ప్రతిభావిష్కరణే అవుతుంది. సంగీతం వారసత్వంగా వస్తే అది జీవితంలో ఒక అంతర్భాగమై ప్రత్యేకంగా నేర్చుకున్నట్లు అనిపించదు. ఎలాగైతే మాట్లాడటం, ఆడటం నేర్చుకుంటారో, అలాగే కొన్ని సంగీత కుటుంబాలలో సంగీతన్ని కూడా పిల్లలు చిన్నప్పటినుంచే నేర్చుకుంటారు. అటువంటి ఒక అసమాన కళాకారిణి జయప్రద రామమూర్తిగారు. తెలుగుగడ్డపై పుట్టిన తొలి వేణువాద్య ఏ గ్రేడ్ కళాకారిణిగా జయప్రదగారు ఈరోజు ఎంతో పేరు తెచ్చుకున్నారు. ఆవిడ వివరాలు తెలుసుకుందాం.
గతంలో నేను ప్రముఖ వేణు వాద్య కళాకారిణులు సిక్కిల్ సోదరీమణులు నీల కుంజుమణి గార్ల గురించి రాసినప్పుడు వాయిద్యాలలో వేణువు ఎందుకు కష్టమైనదో తెలిపాను. శ్వాసకు సంబంధించిన వాయిద్యం ఇది. ఆ శ్వాసలో స్వరాలను పలికించాలంటే తప్పకుండా ప్రత్యేకమైన సాధన కావాలి. అందులో వేర్వేరు కాలాలలో వాయించేటప్పుడు ఊపిరిని నియంత్రించటానికి ఎంతో శ్రమ పడాలి. అందుకే వేణుగాన విద్వాంసులు చాలా తక్కువమంది ఉంటారు. మరి జయప్రదగారు ఎంతటి పరిశ్రమ, సాధన చేసుంటే ఈనాడు విద్వాంసులయ్యుంటారో ఊహించండి.
జయప్రద గారు గురుముఖత విద్య నేర్చుకోక మునుపే సంగీతంలో మెళకువలన్నీ తల్లి వద్ద నేర్చుకున్నారు. జయప్రద గారు ప్రఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసురాలు ప్రేమా రామమూర్తి గారు. తండ్రి కీర్తిశేషులు శ్రీ ఓవీ రామామూర్తిగారు. ప్రేమ గారి తాత గారు బళ్లారి జమీందారు గారు శ్రీనివాస శాస్త్రిగారు వేణువాద్య విద్వాంసులు. ప్రేమ గారు డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి శిష్యురాలు, ఆలిండియా రేడియోలో ఏ గ్రేడ్ కళాకారిణిగా పనిచేశారు. జయప్రద గారు చిన్ననాడే సంగీతంలో ప్రావీణ్యం సంపాదించి ఆకాశవాణిలో దూరదర్శన్‌లో కచేరీలు చేసినా, తల్లి సలహా మేరకు ప్రఖ్యాత వేణువాద్య విద్వాంసులు డాక్టర్ ఎన్. రమణి గారి వద్ద చెన్నైలో, హైదరాబాదులో శ్రీ శ్రీనివాసన్ వద్ద నేర్చుకున్నారు. తరువాత శ్రీ సుదర్శనాచార్యుల వద్ద మృదంగం కూడా నేర్చుకున్నారు. తరువాత బంగ్లాదేశ్‌లో జరిగిన భారతీయ ఉత్సవాలలో ప్రఖ్యాత హిందూస్థానీ వేణువాద్య విద్వాంసులు పండిట్ హరిప్రసాద్ చౌరాసియా గారితో పరిచయం ఏర్పడింది. ఆయన సలహా మేరకు హిందూస్థానీ వేణువాదనం కూడా నేర్చుకున్నారు. కళతో పాటు తన విద్యాభ్యాసాన్ని కూడ అత్యున్నత స్థాయికి తీసుకు వెళ్లారు. కామర్స్‌లో పీహేచ్డీ పూర్తి చేశారు జయప్రదగారు. తన చదువును సంగీతంతో ముడిపెట్టి పీహెచ్‌డీని మార్కెటింగ్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అండ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అనే అంశంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పూర్తి చేశారు. ఆ విధంగా తనను డాక్టర్ జయప్రదగా చూడాలనుకున్న తల్లి ప్రేమ గారి ఆకాంక్షను నెరవేర్చారు.
జయప్రద గారు పాశ్చాత్య మరియు భారతీయ శాస్త్రీయ సంగీతాల మేళనను శాస్త్రీయత కోల్పోకుండా చేయటాన్ని ఇస్టపడతారు. ఆమె వేణువాద్యానికి కావలసిన శక్తిని యోగా మరియు ప్రాణాయం ద్వారా పొందారు. ఊపిరితిత్తుల మరియు చేతి వేళ్ల దృఢత్వాన్ని వీటి ద్వారా పొందారు. వేణువాద్యం సహజ ప్రాణాయామం కాబట్టి దానివలన నాడీమండలం ఆరోగ్యంగా ఉంటుంది అని మానసిక రోగులకు ఈ వాద్యాన్ని నేర్చుకోమని జయప్రదగారు సలహా ఇస్తారు. శబ్దానికి మానసిక ఆరోగ్యానికి ఉన్న సంబంధాన్ని జయప్రదగారు అందరికీ చెప్పాలన్న యోచనతో దానిపై పరిశోధన చేస్తున్నారు.
జయప్రద గారు నవీనతకు చిహ్నంగా వేగంగా వాయించే రోలింగ్ ఫింగర్స్ అని కొత్త విధానాన్ని కనిపెట్టి ప్రపంచ మరియు జాతీయ రికార్డులను సొంతం చేసుకున్నారు. రకరకాల వేణువులలో రాగాలను ఆయా వేణువుల ధర్మానికి అనుగుణంగా మలచుకుంటూ వేలి కదలికను సృజనాత్మకంగా చేయటంలో జయప్రదగారు రికార్డులను సొంతం చేసుకున్నారు. దీనిని ట్రాన్స్పోస్ ఫింగరింగ్ అంటారు. మనోధర్మాన్ని ఈ ప్రక్రియ ద్వారా వాయించి ఈ రికార్డులకెక్కారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ఉగాది పురస్కారం, ఢిల్లీ ప్రభుత్వం వారి పురస్కారం వంటి ఎన్నో గుర్తింపులు పొందారు. ఎన్నో దేవస్థానాలలో వీరి వేణువాద్యం అక్కడి దేవతామూర్తుల సేవలలో వినియోగిస్తున్నారు. పండిట్ రవిశంకర్ గారు వీరిలోని ప్రతిభను గుర్తించి ఎంతో ప్రశంసించి ఆశీర్వదించారు. విజయాలు సాధించినప్పుడు బాధ్యత పెరుగ్తుంది అన్న సత్యాన్ని జయప్రదగారు పరిపూర్ణంగా నమ్ముతారు.
సంగీతం అంటే ధ్యానం, దానితో వేరే ఆలోచనలన్నీ తొలగి మనసు ప్రశాంతతను పొందుతుందని పరిపూర్ణంగా విశ్వసించే నిష్ణాతురాలు జయప్రదగారు. ఆవిడ వేణువాదన వింటుంటే మనసు తేలిపోతుంది, తేలికపడుతుంది. శ్రీకృష్ణుడు ఎదుట నిలచినట్లనిపిస్తుంది. మనోవికారాలన్నీ తొలగి ఆత్మ సంతృప్తి కలుగుతుంది. ఆవిడ పలికించే గమకాలు, ఆవిడ చేసే శబ్ద విన్యాసాలు మనసును కట్టి పడేస్తాయి. తన గురువుల వద్ద నేర్చుకున్న విద్యను, తన సాధన ద్వారా పరిపక్వత చెందిన సంగీతాన్ని జయప్రదగారు తన శిష్యులకు అందజేస్తున్నారు. దేశవిదేశాల్లో ఎన్నో కచేరీలు చేసిన జయప్రదగారు మాండోలిన్ వంటి తీగలతో కూడిన వాయిద్యాలను కూడ ఇష్ట పడతారు. ఛందస్సు లేని చుటుకులను స్వరపరచే అవకాశాన్ని మైసూర్ దత్తపీఠాధిపతులు గణపతి సచ్చిదానంద స్వామి వారు జయప్రద గారికి అనుగ్రహించారు.
ఫ్లూట్ ఐకాన్ ఆఫ్ ఏషియా, ఫ్లూట్ మేస్ట్రో, దివా ఆఫ్ డక్కన్, ఆస్థాన విదుషీ, వేణుగాన వినోదిని, మురళీధర మృదుపద మంజీరం, నాదయోగ వంటి బిరుదులు పొందారు. జయప్రదగారిని భారత రాష్ట్రపతులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు వేర్వేరు సందర్భాలలో సత్కరించారు. గ్లోబల్ వరల్డ్ రికార్డ్, యునిక్ రికార్డ్, ఏషియాస్ టాప్ 100 టాలెంట్, నేషనల్ ఫెలోషిప్, భారతి గౌరవ పురస్కార్, గోల్డెన్ బ్రేస్లెట్ అవార్డ్, బెస్ట్ ఫ్లూటిస్ట్, ఔట్‌స్టాండింగ్ పర్ఫార్మర్ అవార్డులు పొందారు.
భగవంతుడు జయప్రదగారికి మరింత వేణువాద్య సేవాభాగ్యాన్ని, మరెన్నో గుర్తింపులను, పురస్కారాలను కలిగేలా అనుగ్రహించాలని ప్రార్థన. తెలుగుజాతి ముద్దుబిడ్డ జయప్రద గారి సంగీత సోపానం మరింత జయప్రదంగా సాగాలని ఆకాంక్షిద్దాం. వారి ప్రతిభ తరతరాలకు అందాలని ఆశిద్దాం. వారు వాయించిన కాంభోజి రాగ కీర్తనను వినండి.
పాత్రం, అపాత్రం - యోగ్యం, అయోగ్యం
దాత, గ్రహీత ఇద్దరూ అయోగ్యులైతే ఎన్నో చిక్కులు - సహాయం పొందిన వాడికి, చేసినవాడికి ఆ సహాయం యొక్క విలువ ఒకటిగా ఉండదు, ఒకరిపై ఒకరికి అభిప్రాయాలూ అంత గొప్పగా కూడా ఉండవు. చేసినవాడికి గోరంత కొండంతైతే పొందిన వాడికి కొండంత గోరంత అవుతుంది. ఊరికే చేయలేదు అని పొందిన వాడనుకుంటే, పొందిన వాడు కృతఘ్నుడు అని చేసినవాడనుకుంటాడు. ఒక్కసారి సాయం చేస్తే జీవితాంతం దాసోహం కావాలా అని పొందిన వాడు అనుకుంటే నేను చేయకపోతే వాడి బతుకు బస్‌స్టాండే అనుకుంటాడు చేసిన వాడు. నేను చేశాను కాబట్టి నేను మహనీయుడిని అని చేసినవాడు భావిస్తే అది ఆయన ప్రతిఫలాపేక్షతో చేశాడు అని పొందినవాడనుకుంటాడు. చూశారా? మంచి కోసం జరగాల్సిన కర్మలో ఎన్ని వికృతాలో? వీటన్నిటిలో మనిషి చాలా సార్లు మరచిపోయే విషయం - ఇవ్వటం ఉపకారం కాదు, అది మానవ జన్మ ఎత్తినందుకు ఒక కనీస ధర్మం. ఈ విశ్వంలో ఎక్కువ నుండి తక్కువకు, తక్కువ నుండి ఎక్కువకు నిరంతరం బదిలీ జరుగుతూ ఉండాల్సిందే. లేకపోతే విశ్వ పరిణామమే ఆగిపోతుంది. అది ఆలోచన కావచ్చు, ధనం, వస్తువు, బంగారం, వాహనం, ఏదైనా కావచ్చు. అందుకే చాలా సార్లు మేము జీవితమంతా ఇతరులకు మంచే చేశాము అనుకునే వాళ్లకు కూడా చెప్పుకోలేని కష్టాలు, బాధలు, వ్యాథలు. చేసినవారి మనసులు బరువులు, పొందిన వారి మనసులు చీడ పురుగులు...అందుకే పాత్రం, అపాత్రం అనే విచక్షణ ఉపయోగించకపోతే, యోగ్యం, అయోగ్యం అన్నది ఆలోచించకపోతే ఇద్దరికీ మిగిలేది పాపమే. మరి కావలసింది ఏమిటి?
1. సాయం చేసేటప్పుడు యోగ్యునికి, పాత్రమైనది చేయటం
2. ఫలాపేక్ష లేకుండా ఉండటం
3. సాయం పొందినందుకు భగవంతునికి కృతజ్ఞత తెలుపటం, మరొకరికి ఫలాపేక్ష లేకుండా చేయటం.
4. భగవంతుడంటే రాయో, ఆకాశమో, నేలో కాదు. యోగ్యమైనది ఏదైనా భగవంతుడే. కాబట్టి యోగ్యుడైన మానవుడు భగవంతుడే.
5. మనం చేసేది భగవంతుని కోసం అన్న భావన. అన్నీ చెందినవానికి, అన్నీ తానైన వానికి తిరిగి ఇవ్వటం లెక్క పెట్టకూడదు కదా? ఇది అదే.
మంచి జరిగిన తరువాత నకారాత్మకమైన ఆలోచనలు వచ్చి దగ్గర కావలసిన మనుషులు దూరమెందుకు అవుతున్నరు అని మీరు ఆలోచిస్తే చాలా సార్లు అపాత్రము, అయోగ్యత మరియు ప్రతిఫలాపేక్షే కారణాలు. ఇది బయట వాళ్లతోనే కాదు, రక్తసంబంధీకుల మధ్య కూడా ఉంటుంది. అందుకే కుటుంబాలు విడిపోతాయి. ఎప్పుడైతే ఈ మూడు కారణాలు రంగంలో ఉంటాయో అప్పుడు అసలు లక్ష్యం, అసలు ధర్మం పక్కకు నెట్టబడుతుంది. అందుకే సనాతన ధర్మం ఫలాపేక్షకు, అపాత్రమునకు పాప ప్రమాణము నిర్ణయించింది.
కలియుగంలో అధర్మం పాళ్లు, తద్వారా మనుషులలో అయోగ్యం, అపాత్రము పాళ్లు, ప్రతిఫలాపేక్ష ఎక్కువ ఉంటాయి కాబట్టి నిజాయితీతో సాయం చేయదలచుకుంటే పాత్రమును బాగా నిశింతంగా పరిశీలించి, ఫలాపేక్షలేకుండా చేయాలి. అప్పుడు పాప సంచయము మనకు రాదు. ఈ విచక్షణ చేయాలంటే మంచి-చెడు, ధర్మం-అధర్మం వివరాలు బాగా తెలియాలి. మనస్తత్త్వం అర్థం చేసుకోగలిగే సామర్థ్యం ఉండాలి. వీటన్నిటికీ అంతర్ముఖమైన సాధన ఉండాలి. ఆచరంచి మరింత ముందుకు వెళ్లగలిగే ఓర్పు సహనం ఉండాలి. మొత్తం మీద శుద్ధమైన అంతఃకరణం ఉంటే ఈ పాత్రము-అపాత్రము విచక్షణ చేసే శక్తి వస్తుంది. మన పురాణ ఇతిహాసాలు, యోగుల చరిత్రలు, వారి రచనలు కూడా చాల ఉపయోగపడతాయి. ఎందుకంటే అవి, కాలగమనం యొక్క పరీక్షలను తట్టుకొని ఎప్పటికీ సముచితంగా ఉండేలా రూపొందించబడినవి. ధర్మాధర్మ విచక్షణ నుండి పాత్రాపాత్ర విచక్షణ కలుగుతుంది. అప్పుడు అయోగ్యములైన వాటిని వీలైనంత త్వరగ మనకు దూరం చేసుకునే శక్తి కలుగుతుంది. యోగ్యములైన వాటిమీదే ధ్యాస ఉండి యత్నం సఫలమవుతుంది. కర్మ సాఫల్యం పొందుంతుంది. చేసే కర్మలు సఫలమైతే పాప పుణ్య సంచయం పటాపంచలై అకర్మ వైపు మనలను తీసుకువెళుతుంది.
ఇదం శరీరం ఖలు ధర్మ సాధనం. ఎంతో దుర్లభమైన మానవ శరీరాన్ని ఇతరులకు సాయపడేలా ఉపయోగించితేనే మానవ జన్మ సార్థకము.
10, మార్చి 2016, గురువారం
బ్యాడ్మింటన్ ద్రోణాచార్యుడు - తెలుగుతేజం పుల్లెల గోపీచంద్
ప్రశాంతమైన వదనం, చక్కని చిరునవ్వు, కొండంత వినమ్రత, చక్కని భాషణ, అపారమైన క్రీడా కీర్తి - కలబోస్తే? పుల్లెల గోపీచంద్. తెలుగుజాతికి కీర్తి పతాకలు తెచ్చిన క్రీడాకారుడు, బ్యాడ్మింటన్‌లో ద్రోణాచార్యుడు ఈ ప్రకాశం జిల్లా ముద్దుబిడ్డ. నలభై రెండేళ్ల వయసుకే పద్మ భూషణ్, పద్మశ్రీ, ద్రోణాచార్య, అర్జున మరియు రాజీవ్ ఖేల్ రత్న అవార్డులు పొందాడు. దేశంలో క్రీడలలో అత్యున్నత శిఖరాలను చూశాడు గోపీచంద్. ఆయన పేరు చెప్పగానే హైదరబాద్‌లోని అకాడెమీ, అక్కడ తీర్చిదిద్దబడిన సైనా నెహ్వాల్ వంటి అగ్రశ్రేణి క్రీడాకారులు గుర్తుకు వస్తారు. ఇవన్నీ ఎలా సాధ్యమయ్యాయి?
చదువుకునే రోజుల్లోనే బ్యాడ్మింటన్‌లో ప్రావీణ్యం సాధించిన గోపీచంద్ భారత సంయుక్త యూనివర్శిటీస్ జట్టుకు నేతృత్వం వహించాడు. మొదట ఎస్ ఎం ఆరిఫ్ వద్ద, తరువాత ప్రఖ్యాత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ఆల్ ఇంగ్లాండ్ టోర్నమెంట్ గెలిచిన ప్రకాష్ పడుకోనే వద్ద, తరువాత ప్రసాద్ గంగులీ వద్ద శిక్షణ పొందాడు. 1996లో తొలి జాతీయ చాంపియన్‌షిప్ గెలిచాడు. ఐదేళ్లపాటు వరుసగా ఈ టోర్నమెంట్ గెలిచాడు. ఏళ్లపాటు భారతదేశ బ్యాడ్మింటన్ కీర్తిని మరింత పెంచాడు. గోపీచంద్ క్రీడా జీవితంలో చారిత్రాత్మక ఘట్టం 2001లో వచ్చింది. బ్యాడ్మింటన్ వింబుల్డన్గా భావించబడే ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ గెలుచుకున్నాడు. 1980లో ప్రకాష్ పడుకోనే గెలిచిన తరువాత ఈ టోర్నమెంట్ గెలిచిన ఏకైక భారతీయుడు గోపీచంద్. తన బలహీనతలను కోచ్ గంగులీ ప్రసాద్ సాయంతో గమనించుకొని వేగాన్ని పెంచుకొని, శరీర దారుఢ్యాన్ని నిర్మించుకొని ఆ ఛాంపియన్షిప్ గెలిచాడు. బెంగుళూరులో ప్రకాష్ పడుకోనే అకాడెమీలో ఆయన వద్ద కోచింగ్ తన జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టంగా గోపీచంద్ చెబుతారు. ఆయన వద్ద గెలవగలం అన్న మనోస్థైర్యాన్ని నేర్చుకున్నాను అని గోపీచంద్ అంటారు.
క్రీడాకారుడిగా గోపీచంద్ సాధించిన విజయాలు ఒక ఎత్తైతే కోచ్‌గా ఆయన విజయాలు దానికి పదిరెట్లు. క్రీడాకారులను ఆడటం కోసం కాకుండా గెలవటం కోసం ఆడేలా శిక్షణ ఇవ్వటం, దేహ మరియు మానసిక దారుఢ్యాన్ని పెంచుకొని విజయాలు సాధించేలా సిద్ధం చేయటం గోపీచంద్ ప్రత్యేకత. ఆటగాళ్ల వ్యక్తిత్వానికి సరిపడా కోచింగ్ ఇచ్చి, ఆట ఆడే సమయంలో ఎక్కువ సేపు ఆడే సామర్థ్యాన్ని పెంచటం ఆయన గొప్పతనం. ముఖ్యమైన పోటీలకు దాదాపు ఏడాది ముందునుంచే శిక్షణ మొదలు పెట్టటం వంటి ప్రణాళికల వలన భారత క్రీడాకారులు అంతర్జాతీయ పోటీలలో నిలబడటమే కాదు ఒకటి తరువాత మరొకటి గెలిచేలా చేశాడు.
భారతదేశ బ్యాడ్మింటన్ చరిత్రలో గోపీచంద్ స్థాపించిన అకాడెమీ ఒక ముఖ్యమైన పేజీ. అప్పటివరకు బ్యాడ్మింటన్ అంటే చైనా ఆటగాళ్ల ఏకచ్ఛత్రాధిపత్యంగా ఉండేది. కానీ, గోపీచంద్ అకాడెమీ మొదలుపెట్టిన తరువాత ఈ దుర్భేద్యమైన చైనా ఆటగాళ్ల కోటను బద్దలు కొట్టగలిగారు. సైనా నెహ్వాల్, పీవీ సింధు వంటి ఆటగాళ్లు అగ్రశ్రేణి ఆటగాళ్లుగా ప్రపంచస్థాయిలో నిలబడగలిగారు. ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపటం గోపీచంద్ కోచింగ్ ముద్ర. ఒత్తిడిలో ఆడుతున్నప్పుడు ఒక స్థాయిని దాటి గెలిచే శక్తిని ఆటగాళ్లలో తీసుకురాగలిగిన కోచ్ గోపీచంద్. టోర్నీలు ఒకటి తరువాత ఒకటి చిన్నవయసులోనే గెలిచేలా ఆటగాళ్లను రూపకల్పన చేశాడు గోపీచంద్. తన అనుభవంతో, ఆటపై గల పట్టుతో ఆటగాళ్లకు మార్గదర్శిగా నిలిచాడు. సైనా నెహ్వాల్ ప్రపంచంలో మొదటి ర్యాంకుకు వెళ్లగలిగిందంటే దానిలో గోపీచంద్ పాత్ర ఎంతో ఉంది.
ఐదారుగురు అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లను తయారు చేయటం వలన భారతదేశంలో మూడవస్థాయి ఆటగా (క్రికెట్, టెన్నిస్ తరువాత) ఉన్న బ్యాడ్మింటన్‌ను వేలాది మంది పిల్లలు నేర్చుకునేలా స్ఫూర్తిని నింపాడు. ఈరోజు బ్యాడ్మింటన్‌లో ప్రీమియర్ లీగ్ మంచి ఆదరణతో నడుస్తోంది అంటే దానికి ఆద్యుడు గోపీచంద్ అనే చెప్పుకోవచ్చు. ఆటగాళ్లు ఓటమి పాలై నిరాశలో ఉన్నప్పుడు వారిని ఉత్సాహ పరచి విజయ పథంలో నడిపించిన ఆచార్యుడు గోపీచంద్. 2012లో సైనా నెహ్వాల్ లండన్ ఒలంపిక్స్‌లో కాంస్య పతకం గెలుచుకోవటంలో గోపీచంద్ పాత్ర మరువలేనిది. ఆమె సూపర్ సిరీస్ విజాయలకు కూడా రథసారథి గోపీచందే. సైనా ఫోర్‌హ్యాండ్, కోర్టులో నెట్ వద్ద ఆటలో నైపుణ్యతను అభివృద్ధి చేసి ఆమెను నంబర్ వన్ క్రీడాకారిణిగా గోపీచంద్ రూపొందించాడు. శరీర దారుఢ్యాన్ని, మానసికంగా గెలవాలి అన్న తపనను ఆమెలో నిరంతరం ఉండేలా చేశాడు గోపీచంద్.
ఈరోజు భారతదేశానికి సైనా నెహ్వాల్, పీవీ సింధు, పారుపల్లి కాశ్యప్, శ్రీకాంత్ కిడాంబి, అరుంధతి పంతవనె, ప్రణయ్ కుమార్, గురుసాయి దత్, అరుణ్ విష్ణు, రుత్విక శివాని వంటి ప్రపంచస్థాయి ఆటగాళ్లు ఉన్నారంటే గోపీచంద్ అకాడెమీలో ఆయన వద్ద పొందిన అద్భుతమైన శిక్షణ వలన అని చెప్పటంలో అతిశయోక్తి లేదు. అందుకే ఆయనకు చిన్న వయసులోనే అన్ని అవార్డులు వచ్చాయి. గోపీచంద్ వంటి మంచి వ్యక్తి భారతదేశ క్రీడారంగంలో ఉండటం ఈ దేశం అదృష్టం. ఈ దేశంలో బ్యాడ్మింటన్ అంటే గోపీచంద్ పేరు రాకుండా ఉండదు. అది ఆయన ఈ ఆటపై చూపిన ప్రభావం, ఆయన మన ఆటగాళ్లలో తెచ్చిన అనూహ్యమైన మార్పు, వారికి తెచ్చిపెట్టిన గుర్తింపు. తెలుగుజాతి ముద్దుబిడ్డ గోపీచంద్ గారు వందలాదిమంది ప్రపంచస్థాయి ఆటగాళ్లను సిద్ధం చేయాలని అభిలషిద్దాం.
9, మార్చి 2016, బుధవారం
సీతారామ వైభవం-4: ఇక్ష్వాకు-నిమి వంశజుల వివరాలు
సాధారణంగా పెళ్లి అనుకోగానే కుటుంబాల వివరాలు తెలుసుకుంటాము. ఇది మనకు సనాతన ధర్మం నుండి వచ్చిందే. శివధనుర్భంగం చేసిన తరువాత జనకుడు తన మంత్రులను పంపించి దశరథ మహారాజును మిథిలకు ఆహ్వానిస్తాడు. దశరథుడు సంతోషించి వశిష్ఠాదులతో మిథిల చేరుకుంటాడు. జనకుడితో తన వంశవృత్తాంతాన్ని వశిష్ఠుల వారు తెలుపుతారు అని అంటాడు. వశిష్ఠుడు ఇలా వివరంగా ఇక్ష్వాకు వంశ వివరాలు తెలుపుతాడు:
"ఓ జనక మహారాజా! అవ్యక్తమైన పరబ్రహ్మమునుండి చతుర్ముఖ బ్రహ్మ జన్మించాడు. ఆయనకు మరీచి, మరీచికి కాశ్యపుడు, కాశ్యపునికి సూర్యుడు జన్మించాడు. సూర్యుని కుమారుడు వైవస్వత మనువు. ఇతడు మొదటి ప్రజాపతి. ఇతని కుమారుడు ఇక్ష్వాకువు. ఈయన అయోధ్యకు మొదటి ప్రభువు. కుక్షి అనేవాడు ఇక్ష్వాకు పుత్రుడు. అతని కుమారుడు వికుక్షి. అతని కుమారుడు బాణుడు. మహాపరాక్రమశాలి అనరణ్యుడు బాణుని కుమారుడు. అతని కొడుకు పృథువు. పృథువు కొడుకు త్రిశంకువు. అతని కుమారుడు దుందుమారుడు. అతని కుమారుడు యువనాశ్వుడు. అతని కుమారుడు మాంధాత. అతని కుమారుడు సుసంధి. సుసంధి కుమారులు ధ్రువసంధి, ప్రసేనజిత్తు. ధ్రువసంధి కుమారుడు భరతుడు. అసితుడు భరతుని కుమారుడు. అసితుని కుమారుడు సగరుడు. సగరుని కుమారుడు అసమంజుడు. అతని కుమారుడు అంశుమంతుడు. ఆయన కుమారుడు దిలీపుడు. దిలీపుని కుమారుడు భగీరథుడు. ఆయన కుమారుడు కకుత్స్థుడు. అతని కుమారుడు రఘుమహారాజు. అతని కుమారుడు ప్రవృద్ధుడు. అతని కుమారుడు శంఖణుడు. అతని కుమారుడు సుదర్శనుడు. అతని పుత్రుడు అగ్నివర్ణుడు. అతని కుమారుడు శీఘ్రగుడు. అతని కుమారుడు మరువు. అతని కుమారుడు ప్రశుక్రుడు. ఆయన పుత్రుడు అంబరీషుడు. ఆయన కుమారుడు నహుషుడు. నహుషుని కొడుకు యయాతి. అతని కుమారుడు నాభాగుడు. ఆయన తనయుడు అజుడు. అజుని కుమారుడే దశరథుడు. ఇక్ష్వాకు వంశము మొదటినుండీ అతి పవిత్రమైనది. ఆ వంశములో పుట్టిన రాజులందరూ మహాధార్మికులు, వీరులు,సత్యసంధులు. ఓ రాజా! ఆ మహావంశసంజాతులైన రామలక్ష్మణులకు మీ కుమార్తెలను ఇచ్చి వివాహము చేయుట ఎంతో యుక్తము. వంశవైభవము వలన, సద్గుణసౌశీల్యముల వలన, ఈడు-జోడు బట్టి కూడా ఈ రాజకుమారులు మీ కుమార్తెలు వివాహమాడుటకు తగిన వారు" అని చెబుతాడు.
అప్పుడు జనకుడు మంగళ వచనాలు పలికి వశిష్ఠునికి ఇలా వివరాలు చెబుతాడు. "మహర్షీ మా వంశం కూడా చాలా గొప్పది. కన్యాదాత వివాహ సమయంలో వంశవృత్తాంతాన్ని పూర్తిగా వివరించటం సమంజసం. మా వంశానికి మూల పురుషుడు నిమి మహారాజు. ఆయన ముల్లోకాలలో ప్రసిద్ధి చెందిన వాడు. ఎంతో ధర్మాత్ముడు. అతని కుమారుడు మిథి. అతడే మిథిలా నగర నిర్మాత. ఆయన కుమారుడు ఉదావసుడు. అతని కుమారుడు నందివర్ధనుడు. అతని సుతుడు సుకేతుడు. అతని కుమారుడు దేవరాతుడు. ఆయన పుత్రుడు బృహద్రథుడు. ఆయన కుమారుడు మహావీరుడు. అతని కుమారుడు సుధృతి. అతని తనయుడు దృష్టకేతువు. అతని తనయుడు హర్యశ్వుడు. వీరందరూ ధర్మపరాయణులు. హర్యశ్వుని కుమారుడు మరువు. అతని పుత్రుడు ప్రతింధకుడు. అతని సుతుడు కీర్తిరథ మహారాజు. అతని తనయుడు దేవమీఢుడు. ఆయన కొడుకు విబుధుడు. ఆతని తనయుడు మహీధ్రకుడు. కీర్తిరాతుడు అతని కుమారుడు. అతని పుత్రుడు మహారోముడు. అతని తనయుడు స్వర్ణరోముడు. అతని పుత్రుడు హ్రస్వరోముడు. వీరందరూ రాజర్షులే. హ్రస్వరోముని కుమారులలో పెద్దవాడిని నేను. నా తమ్ముడు కుశధ్వజుడు మహావీరుడు. మా తండ్రిగారు జ్యేష్ఠుడనైన నన్ను రాజుగా చేశాడు. కుశధ్వజుడు నిర్మల హృదయుడు, దేవతుల్యుడు. ఓ మునీశ్వరా! చాలా సంతోషముగా నేను నా కుమార్తెలలో సీతను రామునికి, ఊర్మిళను లక్ష్మణునికిచ్చి వివాహం చేసెదను. ఓ దశరథ మహారాజా! నేను ఈ విషయం మూడు మార్లు చెబుతున్నాను. ఇందులో సందేహము లేదు. రామలక్ష్మణులచే స్నాతకము చేయించుము. నీకు శుభము కలుగు గాక. వివాహానికి సంబంధించిన నాందీవిధులను నిర్వహింపుము. ఉత్తర ఫల్గుణీ నక్షత్రమున వివాహ కార్యక్రమమును జరిపింపుము. రామలక్ష్మణులకు సుఖశాంతులు కలగటానికి దానాలు ఇప్పింపుము" అని పలుకుతాడు.
అపుడు విశ్వామిత్రుడు జనకునితో "రాజా! నీ తమ్ముడైన కుశధ్వజుని కుమార్తెలు మాండవి శ్రుతకీర్తి అనుపమానమైన సౌందర్యవతులు. మాండవిని భరతునకిచ్చి, శ్రుతకీర్తిని శతృఘ్నునికిచ్చి వివాహము చేయుట యుక్తము" అని పలుకుతాడు. దశరథుడు, జనకుడు అందుకు వెంటనే సంతోషించి అంగీకరిస్తారు.
వివరణ:
వివాహానికి కేవలం అబ్బాయి అమ్మాయి ఒకరినొకరు ఇష్టపడటంతో సరిపోదు, వివరాలు తెలుసుకొని ఆ వంశస్థుల వివరాలు కూడా ముఖ్యం. ఎందుకంటే, ఒక సంసారం హాయిగా సాగటానికి కుటుంబాలలో పాటించే పద్ధతులు, ఆచారాలు, వ్యవహారాలు తెలుసుకొని ఆ జంట అన్యోన్యంగా ఉండటానికి దోహదపడతాయి. అలాగే ఆయా వంశాలలో గొప్పవారి వివరాలు తెలుసుకోవటం ద్వారా వియ్యాలవారిని సముచితంగా గౌరవించే అవకాశముంటుంది.
ఇక్కడ ఇక్ష్వాకు వంశంలో జన్మించిన వారందరూ మహావీరులుగా, ధర్మపరాయణులుగా చెప్పబడ్డారు. అలాగే, జనకుని పూర్వజులందరూ రాజర్షులే. రాజ్యపాలనతో పాటు ధర్మసూక్ష్మాలు పాటిస్తూ, యజ్ఞ యాగాది క్రతువులు చేసి దివ్యశక్తులు పొందిన వారు. రెండు పవిత్రమైన వంశాల కలయిక సీతారాముల వివాహం. దానికి నాంది విశ్వామిత్రుడు రామలక్ష్మణులను యాగరక్షణకై తీసుకువెళ్లటం. మన పురాణాలలోని గొప్పతనం ఇదే. రాజులకు ఋషులు, మహర్షులు, యోగులు ఎప్పటికప్పుడు ధర్మాన్ని బోధించి లోకకళ్యాణార్థం సముచిత కార్యాలు చేయించే వారు. దీనివలన రాజులకు యశస్సు, రాజ్యానికి సుఖశాంతులు, ఋషులకు సత్కర్మ ఫలం దక్కేది. వశిష్ఠాదులు ఇక్ష్వాకు వంశాన్ని ఇలా కంటికి రెప్పలా కాపాడగా శతానందుడు మొదలైన వారు జనకుని వంశాన్ని ఉద్ధరించారు. వివాహమనేది ఒక పవిత్రమైన కార్యం. దాని వలన రెండు వైపులా తరాలు ఉద్ధరించబడతాయి. లోకోద్ధరణకు బీజం పడుతుంది. అందుకే మన వివాహ వ్యవస్థ అత్యంత శక్తివంతమైనది, సనాతనమైనా పుష్టికరమైనది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)
పాతాళ భైరవి – 1951: తెలుగు జానపద చిత్రరాజం
1951 మార్చి 15న విడుదలైన పాతాళ భైరవి తెలుగు చలనచిత్ర చరిత్రలో ఒక కీలక మలుపు. విజయా ప్రొడక్షన్స్ పతాకంపై బి. నాగిరెడ్డి, ఆలూరి చక్రపాణి నిర్మ...
-
నీ నామ రూపములకు నిత్య జయ మంగళం పవమాన సుతుడు పట్టు పాదారవిందములకు ||నీ నామ|| పంకజాక్షి నెలకొన్న అంక యుగమునకు ||నీ నామ|| నళినారి ...
-
శివాష్టకంగా పిలువ బడిన ఈ స్తోత్రము ఆది శంకరుల విరచితమని అంటారు. కాని నేను దాన్ని ధ్రువీకరించ లేకపోయాను. దీని సాహిత్యంలో ఉత్తర దక్షిణ భారత దే...
-
కంజదళాయతాక్షి కామాక్షి కమలా మనోహరి త్రిపురసుందరి కంజదళాయతాక్షి కామాక్షి కమలా మనోహరి త్రిపురసుందరి కుంజర గమనే మణిమండిత మంజుల చరణే ...







