9, మార్చి 2016, బుధవారం

అలుపులేని యోధురాలు ఇరోం షర్మిల


ఇరోం షర్మిల - పేరు వినగానే ఆమె ముక్కుకున్న పైపు, విరబోసుకున్న జుట్టు, ముఖంలో పోరాట పటిమ గుర్తుకొస్తాయి. మణిపూర్ రాష్ట్రంలో ఆర్ముడ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ (ఏఎఫెస్పీఏ చట్టం 1958) రద్దు చేయాలని 780 వారాలకు, అనగా 15 ఏళ్లకు పైగా ఆహారాన్ని విసర్జించి శాంతియుగ నిరాహార దీక్ష చేస్తున్న అసమాన మహిళ. ఈ చట్టం శాంత్రిభద్రతలు అదుపులో లేని సరిహద్దు రాష్ట్రాల్లో ఆర్మీకి ప్రత్యేక అధికారాలు ఇవ్వటానికి భారత ప్రభుత్వం 1958లో రూపొందించింది. ఈ చట్టం ప్రకారం ఆయా రాష్ట్రాలలో ఆర్మీ వాళ్లు ఎటువంటి వారెంట్ లేకుండా అరెస్ట్ చేసి నిర్బంధించవచ్చు, పెద్దగా పర్మిషన్లు లేకుండా అల్లర్లు సృష్టించే వారిని కాల్చి వేయవచ్చు.

2000 సంవత్సరం నవంబర్ 2వ తేదీన మణిపూర్ రాజధాని ఇంఫాల్ సమీపంలో మలోం అనే ఊరు దగ్గర 10 మంది పౌరులు కాల్చబడ్డారు. దాని వెనుక భారత పారామిలటరీలో ఒక భాగమైన అస్సాం రైఫిల్స్ హస్తముందని ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనతో కలతకు గురై ఇరోం ఆ సంవత్సరం నవంబర్ 5 నుండి ఆమరణ నిరాహారదీక్ష మొదలు పెట్టింది. ఏఎఫెస్పీఏ చట్టాన్ని మణిపూర్‌లో ఉపసంహరించాలని, అంత వరకు ఆహారం, నీరు ముట్టనని, తల దువ్వుకోనని ప్రతిజ్ఞ చేసింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు షర్మిల తన మాటకు కట్టుబడే ఉంది. ఆమెకు శాశ్వతంగా ముక్కు-గొంతు ద్వార పొట్టకు ఒకపైపు వేసి ఆరోగ్యం క్షీణించనప్పుడల్లా ప్రభుత్వం దాని ద్వారా శరీరానికి కావలసిన శక్తిని అందజేస్తోంది.

వివాదాస్పద చట్టం ఏఎఫెస్పీఏను వెనక్కు తీసుకోవటానికి ఇరోం షర్మిల 2006లో ఢిల్లీ జంతర్-మంతర్‌లో దీక్ష చేసింది. ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి, హోం మంత్రికి లేఖలు రాసింది. 15 ఏళ్లుగా తన పోరాటం సాగిస్తూనే ఉంది. ఎన్నో సార్లు అరెస్టు అయి విడుదలైంది. ఆమెను గృహనిర్బంధంలో కూడా ఉంచారు. కొద్దికాలం క్రితం షర్మిలను కాపాడండి అనే ఉద్యమం కూడా ఆరంభమైంది. పుణే యూనివర్సిటీ వారు ఈమె పేరిట 39 మంది మణిపూర్ యువతీ యువకులకు ఉచిత డిగ్రీ కోర్సులను అందించింది. ఎన్నో విధాలుగా తన రాష్ట్రంలో తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు ఈమె పోరాడుతూనే ఉంది.

అంతర్జాతీయంగా ఇరోం షర్మిలకు మానవ హక్కుల సంఘాలనుండి ఎన్నో గుర్తింపులు అందాయి. 2007లో గ్వాంగ్‌జూ మానవ హక్కుల అవార్డు, పీపుల్స్ విజిలన్స్ కమిటీ ఆన్ హ్యూమన్ రైట్స్ అవార్డు, 2009లో మయిలమ్మ అవార్డు, 2010లో ఆసియా మానవ హక్కుల సంఘం నుండి జీవిత సాఫల్య పురస్కారం, రవీంద్రనాథ్ శాంతి బహుమతి, సర్వ గుణ సంపన్న అవార్డులు లభించాయి. 2013లో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఆమెను ప్రిజనర్ ఆఫ్ కాన్షియెన్స్ (మనస్సాక్షి ఖైదీ)గా గుర్తించింది.

ఏఎఫెస్పీఏను మణిపూర్‌నుండి ఉపసంహరించేంత వరకు తన తల్లిని కూడా కలువనని అకుంఠిత దీక్షతో ముందుకు సాగుతున్న ఇరోం షర్మిల గారికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జోహారులు. స్త్రీ అబల కాదు, స్త్రీకి అనంతమైన శక్తి ఉంది ఉన్నదానికి షర్మిల నిలువుటద్దం.

ఈమె లక్ష్యం భారత సైన్యంపై కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజల పట్ల చట్టం పేరుతో దౌర్జన్యం కూడదు అన్నది ఆమె పోరాటం వెనుక సారాంశం. మణిపూర్‌లో  గత ఐదేళ్లలో ఐదు వేలమంది హింసలో మరణించారు. ఇందులో ఎంతో మంది అమాయకులు. చట్టవ్యతిరేక శక్తులను చర్చలకు పిలిచి శాంతియుతంగా త్వరగా ఈ సమస్యను భారత మరియు మణిపూర్ ప్రభుత్వాలు పరిష్కరించి ఇరోం షర్మిలకు విముక్తి కలిగిస్తారని ఆశిద్దాం. 

6, మార్చి 2016, ఆదివారం

తిల్లానాలు - బాలమురళీరవం - నా దిర్ దిర్ ధీం తనన నోం


కర్ణాటక సంగీత సాంప్రదాయంలో రకరకాల అంశాలు ఉన్నాయి. వర్ణం, గీతం, కృతి, రాగమాలిక, పదం, జావళి,తిల్లాన..ఇలా ఎన్నో. ఒక్కో రకానికి ఒక్కో ప్రత్యేకత ఉంది, సముచిత స్థానముంది. వీటిల్లో తిల్లానాకు ప్రత్యేకమైన  లక్షణాలు ఉన్నాయి. తిల్లానాలు సంగీత కచేరీలలోనే కాదు, నాట్య ప్రదర్శనలో కూడా అద్భుతంగా ప్రదర్శిస్తారు. మిగిలిన ప్రక్రియలతో పోలిస్తే తిల్లాన చిన్నది. ఎక్కువ సాహిత్యం ఉండదు, శ్రావ్యంగా లయ బద్ధంగా తి ల న అనే అక్షరాల కలయికతో ఉంటుంది. ఎక్కువ శాతం జతులతో నిండి ఉండే తిల్లాన వినటానికి సొంపుగా ఉంటుంది, అందుకే నాట్య ప్రదర్శనకు కూడా అనువైన అంశం.

తిల్లానలకు మూలం మధ్యయుగానిక చెందిన కైవార ప్రబంధాలు. ఈ ప్రబంధాలలో జతులు కార్యక్రమాల చివరలో ఉండేవి. ఈ ప్రబంధాల ప్రేరణతోనే 18వ శతాబ్ది కాలంలో తిల్లానాలు పుట్టాయి.తిల్లానాలు సంగీత కచేరీలో రాగం తానం పల్లవి అనే సమయం పట్టే అంశం తరువాత వస్తుంది. నాట్య ప్రదర్శనలలో పదాల తరువాత తిల్లాన ఉంటుంది. కథా కాలషేపాలలో కూడా తిల్లాన వేగంగా ప్రేక్షకులను రంజింపజేసేలా ఉపయోగించబడుతుంది.  తిల్లానాలో పల్లవి, అనుపల్లవులలో జతులు, చరణంలో మొదటి భాగం సాహిత్యం, రెండవ భాగం జతి ఉంటుంది. చాలా మటుకు తిల్లానాలలో పల్లవి మొదటి కాలంలో ఉంటుంది. అనుపల్లవి మొదటి, మధ్యమ కాలంలో ఉంటుంది. చరణం మధ్యమ కాలంలో ఉండి చిట్టస్వరాలు కలిగి ఉంటుంది. కృతులకు భిన్నంగా తిల్లానాలో అనుపల్లవి చరణం తరువాత వచ్చి అటు తరువాత పల్లవి వస్తుంది.

తిల్లానాల కూర్పులో సాహిత్యకారుడికి స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది. అందుకనే అవి చాలా ప్రాచుర్యం పొందాయి. జతులు మొదటి, రెండవ కాలములతో పేర్చి కూర్చటంతో వినటానికి సొంపుగా, ఉత్సాహకరంగా ఉంటాయి. అనురూపత్వం (సిమెట్రీ) ఉండటంతో తిల్లానాల అనుపల్లవిలో ఒక మకుటం కూడా పొందుపరస్తారు సాహిత్యకారులు.

తిల్లానలో ప్రత్యేకత దిర్, థక్కు, ధిక్కు, తక తఢింగు, తళాంగు, కిటక మొదలైన ప్రబంధ శబ్దాలతో ఉండటం. వీటితో సంగీత కచేరీలు రక్తి కడతాయి.

తిల్లానలలో రకాలు

1. నాట్య ప్రదర్శనల కోసం రాసినవి - లయ  ప్రాధాన్యమైన జతులతో నిండి ఉంటాయి. మొట్ట మొదటి తిల్లానాలు ఈ కోవకు చెందినవే. మేలత్తూర్ వీరభద్రయ్య గారు, తంజావూర్ చతుష్టయంగా పేరొందిన  పొన్నయ్య, చిన్నయ్య, శేషయ్యర్, జీఎన్ బాలసుబ్రహ్మణ్యం గార్లు ఈ తిల్లానాలను రచించారు
2. ఉపపాదన కోసం రాసినవి - అనగా బోధనకు ఉపయోగించేవి. ఇవి అంగ, క్రియ, అక్షర కాలం మొదలైన పరిజ్ఞానం అందించటానికి రాసినవి. మహా వైద్యనాథ అయ్యరు, రామనాథపురం శ్రీనివాస అయ్యంగార్ మొదలైనవారు రాశారు.
3. సంగీత కచేరీల కోసం  రాసినవి - వీటిలో రాగ మాధుర్యానికి ప్రాధాన్యత ఉంటుంది. స్వర సంగతులను కూడ ప్రతిపాదిస్తారు. మైసూర్ వాసుదేవాచార్య, ముత్తయ్య భాగవతార్, బాలమురళీకృష్ణ, లాల్గూడి జయరామన్ మొదలైన వారు ఈ  రకమైన తిల్లానాలు రచించారు

తిల్లానాలకు హిందూస్థానీ సంగీతంలో కూడా చోటు ఉంది. వీటిని తరానాలు అంటారు. ఇవి ఒధని, తధని, తధీం మొదలైన పదాలతో నిండి ఉంటాయి. ఈ పదాలు పర్షియన్ మరియు అరబిక్ భాషల నుండి వచ్చినవి. 13వ శతాబ్దంలో అమీర్ ఖుస్రో ఈ ప్రయోగం మొదలు పెట్టాడు. సూఫీ సంగీతంలో, హిందూస్థానీ సంగీతంలో తరానాలకు ప్రత్యేకమైన స్థానం ఉంది.

కర్ణాటక సంగీతంలోని తిల్లానాలలో డాక్టర్ బాలమురళీకృష్ణ గారి రచనలకు ప్రత్యేక స్థానం ఉంది. అవి ఎంతో ప్రాచుర్యం పొందాయి. ఎందరో కళాకారులు ఆయన తిల్లానలను సంగీత నృత్య కచేరీలలో ప్రదర్శిస్తారు. ఆయన రాగమాలికగా, బృందావని, కుంతలవరాళి, కదనకుతూహలం, ద్విజావంతి రాగాలలో కూర్చిన తిల్లానాలు ఈనాడు ప్రమాణాలు. ఆ తిల్లానాలలో  కదనకుతూహలం రాగంలో కూర్చిన తిల్లానా వివరాలు పరిశీలిద్దాం.

సాహిత్యం:

నా దిర్ దిర్ ధీం తనన నోం తదరదాని నా దిర్ దిర్ తోం నా దిర్ దిర్ తోం ధిత్తిల్లిల్లాన

తదర దాని దిరన నిద ఉదర దాని దిరన
తకిటఝం మ ద ని తకిట ఝం గ ప స
తతకిట తోం స ని ద ప మ గ రి స

నా దిర్ దిర్ ధీం తనన నోం తదరదాని నా దిర్ దిర్ తోం నా దిర్ దిర్ తోం ధిత్తిల్లిల్లాన

తరికిట తోం తరికిట తోం త ఝణుత
తత్తరికిట తక తక ధిత్తళాంగు తక తరి కిటతక తక ధిత్తళాంగు తోం దిర్ దిర్ తోం దిర్ తోం
తిల్లాన ధిత్తిల్లాన ధిత్తిల్లాన
స రి మ గ రి స రి మ మ ద ద ని గ గ ప స స ని ద ప మ గ రి

వదనమదే విరిసెనే అధరమదే మురిసేనే
మధుర గానంబదే నా మురళీమనోహరుడదే
మదన కదన కుతూహలుడు రమ్మనె బిరాన బిరాన బిరాన రావే

ఈ తిల్లానాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.

1. ఉత్సాహంగా రాగానికి సముచితమైన జతులు, సాహిత్యం
2. అద్భుతమైన జతులు మరియు స్వర సంగతులు
3. రాగం పేరు, రచయిత పేరు రెండూ మకుటంగా రావటం
4. ఓలలాడించే గానంతో అద్భుతమైన కాలగతిలో కూర్చబడటం
5. గాయకునితో పాటు మృదంగం, వయోలిన్, ఘటం మొదలైన వాద్య కళాకారులకు కూడా ప్రతిభను కనబరచే అవకాశం ఉండటం

శ్రీకృష్ణునితో అనుబంధం కల ఎటువంటి రచనైనా ఆయన మోహన మురళీరవం లాగా మధురంగానే ఉంటుంది. అందుకనే, ఈ తిల్లానా కూడా మధురంగా, లయబద్ధంగా, కదనోత్సాహం కలిగించేలా ఉంటుంది. బాలమురళీకృష్ణ గారి గాత్ర సంగీత ప్రతిభ గురించి మాట్లాడనక్కరలేదు, కానీ వారి రచనలను చూస్తే ఆయనలోని బహుముఖ ప్రజ్ఞ అర్థమవుతుంది. తిల్లానా రచించాలంటే మాటలు కాదు. అందులో జనరంజకం చేయాలాంటే అది గాయకుల నోట నిరంతరం పలికేలా ఉండాలి. ఈ తిల్లాన ఆ కోవకు చెందినదే. వినగానే ఆనందం కలుగుతుంది. మళ్లీ వినాలి, పాడాలి అనిపిస్తుంది. అందుకే భాషా భేదాలు లేకుండా అన్ని ప్రాంతాలకు చెందిన సంగీత కళాకారులు ఈ తిల్లానాను తమ కచేరీలలో అంతర్భాగం చేసుకున్నారు.

సంగీతం దైవంతో ముడి పడి ఉన్నదానికి మరో నిదర్శనం తిల్లానాలు. ఎందుకంటే - సందేశంతో పాటు మనలను ఆనందం ఓలలాడించ గలిగే శక్తి దానిలో ఉంది. శబ్దం అమ్మ రూపమైతే లయ పరమశివుని ప్రతి రూపం. ఆ శబ్ద లయ విన్యాసమే తిల్లాన. బాలమురళీకృష్ణ గారి ఈ తిల్లానా విని ఆస్వాదించండి.




4, మార్చి 2016, శుక్రవారం

స్పూర్తిదాయక గీతాలు - మౌనంగానే ఎదగమని, కలకానిది విలువైనది


అపజయాలు, ఒత్తిళ్లు, కష్టాలు, పరాభవాలు, కుంగుబాట్లు, ఒంటరితనాలు, అన్యాయం జరిగిందన్న ఆవేశం, ఆక్రోశం...ఇలా మనిషికి నిజజీవితంలో ఎన్నో మనోవికారాలు. వాటి వల్ల జీవిత రథం దారి తప్పే అవకాశం ఉంది. ఇవన్నీ సహజమే, చాలా సార్లు ఎలా ఈ జీవితం అన్న ప్రశ్న వస్తుంది. అప్పుడే కావాలి ప్రేరణ. ఒక్కసారి ఆలోచనలు అనే చీకటి గదిలోంచి బయటకు వెళ్లి చూస్తే ఈ కష్టాలు, బాధలు పడేది మనం ఒక్కళ్లమే కాదు అని అర్థమవుతుంది. సమాజంలో మనకన్నా కష్టాలలో ఉండి కూడా స్ఫూర్తితో జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే వారిని చూస్తే ప్రేరణ కలుగుతుంది, ముందడుగు వేయాలన్న సంకల్పం చిగురిస్తుంది. ఎప్పుడైతే ఇవి దాటలేనివి, ఇవ నాకొక్కరికే వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి అన్న ఆలోచనలు వస్తాయో ఆ క్షణమే సమాజం వైపు చూడాలి, అంతర్ముఖులం కావాలి.

ఈ మానసిక స్ఫూర్తికి ఆది మనలోనే. ఏదో ఒక దానిపై నమ్మకం ఉండాలి. అది దైవం కావచ్చు, గురువు కావచ్చు, ఇంకో వ్యక్తి కావచ్చు, లేదా స్వయం శక్తి కావచ్చు. చాలా సార్లు కష్టాల కడలి అనిపిస్తుంది. ఆ సమయంలో మనకు సనాతన ధర్మం అందించిన వాఙ్మయం తప్పకుండా తోడ్పడతాయి. అనాదిగా మానవ జన్మ ఎత్తిన ప్రతి వానికీ కష్టాలు తప్పలేదు. ఇది అవతార పురుషులైనా, యోగులైనా, మహాత్ములైనా...ఎవ్వరైనా సరే. వారు నమ్ముకున్న ధర్మం వారికి ఎలా ఈ సాగరాన్ని దాటడానికి సహాయ పడింది అన్నది మనకు రామాయణ, భారత, భాగవతాలు, పురాణాలు, భగవద్గీత స్పష్టంగా తెలిపాయి. రాముడి జీవితంలో ఎన్ని కష్టాలు రాలేదు? పాండవుల జీవితంలో ఎన్ని బాధలు? ధర్మమే వారికి బాసటగా నిలిచింది.

కలియుగ లక్షణమే అశాంతి, కల్లోలం, మోసం. కాబట్టి మానవునికి కష్టాలు దాటాలంటే మరింత స్ఫూర్తి, వ్యక్తిత్వ వికాసం, ధర్మము మరియు దైవంపై నమ్మకం కావాలి. స్ఫూర్తి మనలోనే కలగాలంటే కొంత కష్టమే. అందుకే ఓ గ్రంథమో, ఓ మహనీయుని చరిత్రో, ఓ చిత్రమో, ఓ కథో, ఓ గీతమో, లేకుంటే మరో వ్యక్తి సాంగత్యమో...ఇలా ఏదో ఒకటి స్ఫూర్తినిస్తుంది. బాధల్లో ఉన్న మనిషికి సంగీతం సాంత్వనను ఎందుకిస్తుందో తెలుసా? అది హృదయాన్ని తాకే కళ కాబట్టి, దైవం అందులో నివాసముంటుంది కాబట్టి. సంగీతానికి అక్షరం ప్రాణవాయువు. ఆ అక్షరం మనిషి మనోభావాలకు ప్రతిరూపం. అందుకే మన మనుసులోని భావాలను కవి అక్షరాలతో స్వరయుక్తంగా తాకితే వెంటనే స్పందన ఉంటుంది. అందుకే, మనోవికారాలతో మనం క్రుంగిపోతున్నప్పుడు భావయుక్తమైన గీతాలు మనలను ఉత్తేజపరచి వికారాన్ని కాస్త తగ్గిస్తాయి. అటువంటి రెండు గీతాలు మీకోసం.

1. మొదటిది నా ఆటోగ్రాఫ్ చిత్రంలో చిత్ర పాడిన మౌనంగానే ఎదగమని అన్న గీతం. ప్రేమలో దారుణంగా విఫలమైన ఒక యువకుడు దారుణంగా క్రుంగిపోతాడు. జీవించటం వ్యర్థం అన్న దిగులుతో హైదరబాదు వచ్చి తిండికి కూడా అవస్థ పడుతూ ఉంటాడు. ఆ సందర్భంలో అంధులచే ఒక సంగీత విభావరి ఏర్పాటు చేసి వారికి స్ఫూర్తిదాయకురాలైన ఒక యువతి పాడే పాట అతనికి మార్గదర్శకంవుతుంది. అతనిలో మార్పు మొదలవుతుంది. ఎటువంటి వైకల్యాలు ఉన్నా, ఆటుపోట్లు ఎదురైనా ముందుకు సాగమని ఉద్బోధిస్తుంది. మన తలరాతను మనం మార్చుకోవచ్చన్న అద్భుతమైన సత్యాన్ని తెలుపుతుంది. ఎక్కువ ఆర్భాటాలు లేకుండ ఎదగటం, ఎదిగిన కొద్దీ వినయంతో మెలగాలని చెబుతుంది. అపజయం కలిగితే క్రుంగిపోరాదని ఋతువుల సమయంలో ఆకులురాలిన చొటే కొత్త చిగురు వస్తుంది అన్న సారూప్యంతో మనలకు ధైర్యాన్నిస్తుంది. మజిలీ చేరటానికి ఎంతో దూరం అన్నదాని గురించి ఎక్కువ ఆలోచించంకుండా ఎన్నోదారులున్నాయి అని ఆలోచిస్తే మంచిందని సలహా ఇస్తుంది. యుగయుగాలుగా మనకు తెలుస్తున్న సత్యం - ఏ బాధ కూడా శాశ్వతం కాదు. తప్పకుండా తిరిగి చిరునవ్వు నవ్వే రోజు వస్తుంది. ఏ గొప్ప పని మొదలు పెట్టినా మొదట ఎన్నో అవరోధాలు వస్తాయి. కానీ, వాటికి భయపడక ముందుకు సాగాలి. విశ్వకళ్యాణానికి చేసిన సాగరమథనంలో తొలుగ గరళమే పుట్టింది, తరువాతే అమృతం. అలాగే ప్రతి మంచిపనికి ముందు విఘ్నాలుంటాయి, తరువాతే విజయం. కష్టాలు దాటితే ఆనందమనే నిధి మనం సొంతమవుతుంది. ఇది జీవిత సత్యం అని పలుకుతుంది. నుదుటి రాతలు, చేతి గీతలు అన్నీ మన ప్రయత్నంతో మార్చ వచ్చు. కావలసింది శ్రమ, ధైర్యం. అటువంటి ధీర శ్రామికుల ముందు విధి కూడా తలవంచుతుంది, దైవం వారిని అనుగ్రహిస్తుంది. ఆ విధంగా ముందుకు సాగి చరిత్రలు రాయాలి అని హితవు పలుకుతుంది.

గీతం మనలోని బలహీనతలను పక్కకు పెట్టి, శక్తులకు జీవం పోసి మనకు మంచి ప్రేరణనిస్తుంది. మానవ జన్మ అన్న తరువాత ఏదో ఒక లోపం తప్పదు. ఆ లోపాలను అధిగమించి స్వశక్తులై ముందుగు సాగించటానికి ఇలాంటి గీతాలు ఎంతో ఉపయోగపడతాయి. చంద్రబోస్ గారు ఇటువంటి గీతం ఒక మంచి సందేశాత్మక చిత్రమైన నా ఆటోగ్రాఫ్‌లో అందించటం మన అదృష్టం. కీరవాణి గారి సంగీతం కూడా సందేశానికి సముచితంగా ఉంటుంది. చిత్ర గారి గానం దానికి శాశ్వతత్వాన్ని ఆపాదించింది.

మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది
ఎదిగిన కొద్దీ ఒదగమని అర్ధమందులో ఉంది

అపజయాలు కలిగినచోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది
ఆకులన్ని రాలినచోటే కొత్త చిగురు కనిపిస్తుంది.


దూరమెంతో ఉందని దిగులు పడకు నేస్తమా
దరికి చేర్చు దారులు కూడా ఉన్నాయిగా
భారమెంతో ఉందని బాధపడకు నేస్తమా
బాధవెంట నవ్వుల పంట ఉంటుందిగా
సాగరమథనం మొదలవగానే విషమే వచ్చింది
విసుగే చెందక కృషి చేస్తేనే అమృతమొచ్చింది.
అవరోధాల దీవుల్లో ఆనంద నిధి ఉన్నది
కష్టాల వారధి దాటిన వారికి సొంతమవుతుంది
తెలుసుకొంటే సత్యమిది
తలచుకుంటే సాధ్యమిది

చెమట నీరు చిందగా నుదుటి రాత మార్చుకో
మార్చలేనిదేదీ లేదని గుర్తుంచుకో
పిడికిలే బిగించగా చేతి గీత మార్చుకో
మారిపోని కథలే లేవని గమనించుకో
తోచినట్టుగా అందరి రాతలు బ్రహ్మే రాస్తాడు
నచ్చినట్టుగా నీ తలరాతను నువ్వే వ్రాయాలి
మా ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదించగా
మా సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలి
అంతులేని చరితలకి ఆది నువ్వు కావాలి

2. రెండవ గీతం వెలుగునీడలు చిత్రంలోని శ్రీశ్రీ గారి రచన "కలకానిది విలువైనది" అనే గీతం. మనిషికి ఎన్ని రకాల కష్టాలో? చిత్రంలో నాయికకు వివాహం చేసుకున్న కొన్నాళ్లకే భర్త యాక్సిడెంటులో మరణిస్తాడు. తీరని దుఃఖంలో జీవితం దుర్భరమయమనే భావనలో నలిగిపోతున్న ఆమెకు స్నేహితుడు ఈ గీతం ద్వారా సాంత్వననిచ్చి ఆమెలో మళ్లీ జీవించాలన్న సంకల్పాన్ని కలిగిస్తాడు. డాక్టర్ వృత్తిలోకి తిరిగి ప్రవేశించేలా చేస్తాడు. భార్యా భర్తలలో ఎవరు ఇలా అకాల మరణం చెందినా ఉన్న వారికి వర్ణించలేని వ్యథే. కానీ, అది వారు కోరి తెచ్చుకున్నది కాదు. అలాగే జీవితాంతం నిరర్థకంగా ఆనందానికి దూరంగా ఉండటం కూడా సరి కాదు. జీవిత భాగస్వామి మరణించినా కుటుంబం, సమాజం, దేశం పట్లా బాధ్యతలున్నాయి. ఆయుష్షు ఉన్నంత కాలం సకారాత్మక ధోరణితో జీవించాలి, ఏదో ఒకటి సాధించాలి. అన్నది ఈ గీతం సందేశం. కలకాదు, బ్రతుకు ఎంతో విలువైనది, దానిని కన్నీళ్లతో వృథా చేయకు అని చెబుతుంది ఈ గీతం. దానికి సారూప్యంగా, గాలి వీచినప్పుడు పూల తీగ నేల కూలితే దానిని అలానే వదిలేస్తామా? మృదువుగా నిలబెట్టి నీళ్లు పోసి మళ్లీం జీవం పోయమూ? జీవితం కూడా అంతే. అకాల మరణమనే పెనుగాలి వస్తే అంతటితో జీవితాన్ని ముగించకూడదు. మళ్లీ నిలబెట్టాలి. చీకటిలోనే అలమటించటమెందుకు? కలతలకు లొంగి మానసిక స్థైర్యాన్ని కోల్పోయి కవరించటం ఎందుకు? సాహసమే జ్యోతిగా చేసుకొని ముందుకు సాగాలి అని ఎంతో అద్భుతంగా చెబుతుంది. సముద్రపు లోతుల్లో ఆణిముత్యాలు ఉన్నట్లు శోకాల సముద్రం చాటున సుఖము కూడా ఉంది. జీవితంలో ఏదీ కూడా మన దగ్గరికి రాదు. మనమే కష్టపడి సాధించుకోవాలి అని ఒక దిశను నిర్దేశిస్తుంది.

శ్రీశ్రీగారు ఎంతటి ఉదాత్తమైన గీతాన్ని అందించారో సాహిత్యం చూస్తే అర్థమవుతుంది. యోగ్యత ఉన్న కవి హృదయం నుండి వెలువడే అక్షర సత్యాలు ఇవి. ఘంటసాల మాష్టారు భావ సౌందర్యం ప్రకాశించేలా అద్భుతంగా గానం చేశారు. పెండ్యాల వారి సంగీతం , ఏఎన్నార్ సావిత్రిల నటన ఈ పాటను సంపూర్ణం చేసి అత్యుత్తమ గీతాలలో ఒకటిగా నిలిపాయి.

కల కానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనె బలి చేయకు
కల కానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనె బలి చేయకు

గాలి వీచి పూవుల తీగ నేల వాలి పోగ
జాలి వీడి అటులేగాని వదులవైతువా
చేర దీసి నీరు పోసి చిగురించ నీయవా

అలముకున్న చీకటిలోనె అలమటించనేల
కలతలకే లొంగి పోయి కలువరించనేల
సాహసమను జ్యోతిని చేకొని సాగిపో

అగాధమౌ జలనిధిలోన ఆణిముత్యమున్నటులే
శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే
ఏది తనంత తానై నీ దరికి రాదు
శోధించి సాధించాలి అదియే ధీర గుణం


మడిసి అన్నాక కష్టాలు రాకుండా ఉంటాయా చెప్పండి!. శోకం, మానసిక వ్యధ, ఆందోళన, కన్నీళ్లు ఇవన్ని అందరికి ఎప్పుడోకప్పుడు వచ్చేవే. మరి అప్పుడు ఏమిటి చెయ్యటం?.  ఏమి చెయ్యొచ్చో అన్నదానికి ఈ పాటలు మంచి ఉదాహరణలు . పాజిటివ్ ఆలోచనలతో పోరాడమని వీటి సారాంశం. ఎందుకంటే అనుకూల (పాజిటివ్) ఆలోచనలు వ్యతిరేక (నెగటివ్)  ఆలోచనల కన్నా చాలా బలమైనవి. కొన్ని అనుకూల ఆలోచనలతో ఒక వ్యతిరేక ఆలోచనను పోరాడటం దీనిలో మొదటి మెట్టు. రెండోది - ఉన్న పరిస్థితిలోంచి బయటకు ఎవ్వరు లాగలేరు. అది మనం అడుగు వేస్తె తప్ప అవ్వని పని. అడుగు వెయ్యటానికి, ఆలోచనలు రావటానికి పక్కనవాళ్ళు సాయపడగలరు.

ఆశ వదలకుండా ఒక అడుగు అనుకూల ఆలోచనతో వేస్తె అక్కడ తప్పకుండా మనకున్న సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అందుకనే మన పెద్దలు అన్నారు - సమస్య ఉంటే పది మందితో చెప్పుకోవాలిరా అని. దాని అర్థం సానుభూతి పొందటానికి కాదు - కష్టంలో ఉన్న మనిషి యొక్క మానసిక పరిస్థితి అడుగు ముందుకు వేసే ఆలోచనలను రానివ్వకపోవచ్చు. అలాంటప్పుడు నలుగురితో కలిసి, మాట్లాడితే - కొత్త ఆలోచనలు మన మనస్సులోకి వెళ్లే అవకాశం ఎక్కువ. అలాగే, నలుగురుతో మాట్లాడితే మనకున్న సమస్యకన్నా ఇంకా పెద్ద సమస్య కనిపించొచ్చు. అప్పుడు మన సమస్యను 'ఆ ఇది చాలా చిన్నది, నన్నేమి చెయ్యలేదు, పాపం వాళ్ళు ఇంకా ఎంత పెద్ద భవసాగరంలో ఉన్నారో' అని కొట్టి పారేసే అవకాశం వస్తుంది. అంటే - ఒక అనుకూల ఆలోచన మొదలయ్యినట్టే కదా? అది చాలు సమస్యను పూర్తిగా అధిగమించటానికి.

మరి కష్టాలు దాటడానికి సాధనాలు ఏమిటి? 1. ముందడుగు వేసే ధైర్యం - ఇక్కడ మనకు ఆ పరిస్థితిలో ధైర్యం ఉండకపోవచ్చు. అలాంటప్పుడు మన చుట్టూ ఉన్న వ్యవస్థను ఆశ్రయించాలి - కుటుంబం, బంధువులు, ఆత్మీయులు, స్నేహితులు, గురువులు, తోటి పనివారు, పుస్తకాలు.  కానీ మొట్టమొదటి అడుగు మనమే వెయ్యాలి. పక్కవాళ్ళు వేయించారు అని అనిపించినా అది మన మనస్సు చెప్పనిదే జరగదు. 2. పరిష్కారం ఉంది అనే నమ్మకం, భగవంతుడు ఎప్పటికీ మనల్ని ఇలానే ఉంచడు అన్న విశ్వాసం.

గీతలో కృష్ణ పరమాత్మ, శంకరాచార్యుల వారు, రామకృష్ణ పరమహంస, వివేకానందుడు....ఇలా ఎందరో మనకు కష్టమయమైన జీవితాన్ని ఎలా సాగించాలో చక్కగా బోధించారు.  ఈ రెండు గీతాలు కూడా ఆ కోవకు చెందినవే . ఈ రెండు గీతాలు అప్పుడప్పుడూ వింటూ ఉంటే జీవితంలో మనం దిగులుతో కుంగిపోకుండా, మనకు వచ్చే సమస్యలను అధిగమిస్తూ ఖచ్చితంగా ముందుకు  సాగిపోతాము. 


3, మార్చి 2016, గురువారం

నిను కొలుచును ఈ జగమంతా - హనుమద్భక్తి గీతం


హనుమంతుడు అనగానే స్వామి భక్తి, అసమాన్య వీర పరాక్రమాలతో పాటు వినయము, జ్ఞానము, బుద్ధి కుశలత, సమయ స్ఫూర్తి గుర్తుకు వస్తాయి. అన్నిటికన్నా రామభక్తే ముందు నిలుస్తుంది. ఎందుకంటే, అదే ఆయనకు భృతి, ద్యుతి మరియు గతి. ఆయనకు వేరే తలపు లేదు. వేరే పని లేదు. అంతా స్వామికే, అన్నీ ఆయన కొరకే.  ఎంతటి పరాక్రమ సంపన్నుడైనా తనకు అన్నీ స్వామి అనుగ్రహం వలనే అన్నది ఆయన తత్త్వం. అందుకే, ఆయన ఎన్ని అవరోధాలు వచ్చినా ఎంతో  దుర్గమమైన కార్యాలను సాధించాడు. స్వామిపై పరిపూర్ణమైన నమ్మకంతో సాగరాన్ని దాటి, లంకను  ఛేదించాడు. ఎక్కడో హిమాలయాలలో ఉన్న సంజీవనిని తెచ్చి లక్ష్మణునికి పునరుజ్జీవుని చేశాడు.  

హనుమంతుడు రామనామ స్మరణతో నిరంతరం రోమాంచకుడై   ఉంటాడు . మరి రామభక్తిలో ఉన్న మహిమ మనకు తెలిసినదే. అందుకే త్యాగరాజస్వామి రోమాంచమనే ఘన కంచుకము, రామభక్తుడనే ముద్రబిళ్ల, రామనామమనే వరఖడ్గము - వీటిని రాముని బంటుయైన హనుమంతుని ఆయుధాలుగా చెప్పారు. రామనామస్మరణతో రోమాంచమైన శరీరము అత్యంత దృఢమవుతుంది అన్నదానికి హనుమంతుడు ప్రత్యక్ష ఉదాహరణ. అలాగే ఆ రాముని నామమే ఆయనకు అత్యంత శక్తివంతమైన ఆయుధం, రామభక్తే హనుమంతుని  చిరునామా! మరి హనుమంతుడు ఎక్కడ ఉంటాడు? రాముని కొలిచే ప్రతి చోటా... 

యత్ర  యత్ర  రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృత మస్తకాంజలిం 
బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత  రాక్షసాంతకం 

రాముని కీర్తించే ప్రతి చోటా తలవంచి నమస్కరిస్తూ, కన్నులలో ఆనందబాష్పాలు నింపుకొని ఉంటాడు ఆ హనుమంతుడు. హనుమద్భక్తులలో ఉండే ఒక గొప్ప లక్షణం ఎంతటి కష్టాన్నైనా ఆ రామబంటుపై నమ్మకంతో దాటగలిగే  ఆత్మస్థైర్యం. అలాగే,  వీరు రామభక్తి సామ్రాజ్యంలో  సంపాదించుకునే ప్రయత్నంలో నిరంతరం ఉంటారు.  విశేషమేమిటంటే, హనుమను  కాపాడుతాడు, రాముని తలచితే హనుమ  అండగా ఉంటాడు.

పాలగుమ్మి విశ్వనాథం గారు తెలుగు గడ్డపై  పుట్టిన బహుముఖ ప్రజ్ఞాశాలి. సంగీతకారునిగా, రచయితగా  ఆయన అందించిన సేవలు ఎనలేనివి. లలిత సంగీత జగత్తులో వారి స్థానం అనుపమానమైనది. 15 వేలకు పైగా గీతాలకు సంగీతం అందించి 100కు పైగా గీతాలు రచించారు ఆయన.  ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో దశాబ్దాల పాటు లలితా సంగీత కళామ తల్లికి సేవ చేశారు. లలిత సంగీత స్వర్ణయుగంలో బాలాంత్రపు  గారితో సమానంగా  విశ్వనాథం గారు తెలుగు సంగీత  ప్రపంచానికి వెలుగు తెచ్చారు. దేవులపల్లి కృశ్ణశాస్త్రి గారు, దాశరథి గారు, అబ్బూరి రామకృష్ణగారు మొదలైన గొప్ప రచయితల సాహిత్యానికి సంగీతం కూర్చారు. బాలమురళీకృష్ణగారు, ఎమ్మెస్ రామారావు గారు, చిత్తరంజన్ గారు, వేదవతీ ప్రభాకర్ గారు, కేబీకే మోహన్ రాజు గారు మొదలైన గాయకులకు తన సంగీతం ద్వారా ఎంతో  పేరు తెచ్చిపెట్టారు. ఆయన మంచి గాయకులు కూడా.

పాలగుమ్మి వారి సాహితీ రచనలలో నా చిన్నతనంలో ఆకాశవాణిలో వచ్చిన ఈ హనుమంతుని పాట మా ఇంట్లో అందరం పాడుకునే వాళ్లం.  సత్సంగంలో దీనిని భక్తితో ఆలపించే వారు. రచనను పరిశీలిద్దాం.

నిను కొలుచును ఈ జగమంతా నను మరువకుమో హనుమంతా!

రామచంద్రుని కొలువు దొరికెనట రామనామమే దారిబత్తెమట
రాత్రింబవలు రామ ధ్యానమట రామభక్తి సామ్రాజ్యపు దొరవట

రామకీర్తనమే చెవులబడినయే అడుగులు కదలక ఆగిపోదువుట
అరమోడ్పు కనులతో అంజలి ఘటించి అన్నీ మరచి నర్తించెదవట

శ్రీపాద ధూళి శిరసున దాలిచి శతయోజనముల సంద్రము దాటి
సీతామాత సేమమే అరసి శ్రీరామచంద్రుని ఓదార్చితివట

అయోధ్య రాముని అంతరంగమన స్థిరముగ నెలకొన్న హనుమంతా!
ప్రభువుకు మా మనవులందించుమన్నా ఆస్వామి నీ మాట కాదనడన్నా!

- పాలగుమ్మి విశ్వనాథం గారు

ప్రపంచమంతా నిన్ను కొలుస్తుంది. నన్ను మరువకుము అని కవి ప్రార్థిస్తున్నారు. హనుమంతుని వృత్తి ఏమిటి? రాముని సేవ. రాముని నామమే ఆయనకు దారి మరియు భృతి అట.  నిరంతరం రామ ధ్యానమట. ఆ రామ భక్తి  సామ్రాజ్యానికి హనుమంతుడు దొర  అట. నిజమే, ఎందుకంటే హనుమను మించిన రామ భక్తుడు లేడు.  

ఆ రాముని కీర్తన చెవులకు వినబడగానే హనుమంతుని అడుగులు ఆగిపోతాయట. అరమోడ్పు కనులతో స్వామికి అంజలి సమర్పించి, అన్నీ మరచిపోయి నర్తిస్తాడట. నిజమే, హనుమంతునికి రామనామ కీర్తన కన్నా సంతోషకరమైనది ఏముంది?  

స్వామి పాదధూళిని శిరసున దాల్చి నూరు యోజనాల దూరాన ఉన్న లంకకు చేరి సీతమ్మ క్షేమ సమాచారం తెలుసుకొని స్వామిని ఓదార్చాడట. నిజమే, స్వయంగా రాముడే నీవంటి సేవకుడు, భక్తుడు లేడు అని పలికాడు. అంతటి కార్యం చేసిన హనుమను రాముడు ఆలింగనం చేసుకొని ఆశీర్వదించాడు. 

రాముని తన హృదయమున నిలుపుకున్నాడు హనుమంతుడు. ఆ ప్రభువుకు మా మానవులు వినిపించు హనుమంతా! ఆయన నీ మాట కాదనడు అని కవి అద్భుతంగా వేడుకుంటున్నారు. నిజమే, బంటు అంతరంగములో ఉన్నాడు స్వామి, బంటుకు సంపూర్ణ అనుగ్రహం అందించాడు స్వామి. మరి మనం ఆ రామబంటుకు  అర్జీ  పెట్టుకుంటే స్వామి తప్పక అనుగ్రహిస్తాడు. 

పాలగుమ్మి వారు ఈ గీతాన్ని లలితమైన అచ్చ తెనుగు పదాలతో రచించి అంటే మధురమైన సంగీతాన్ని అందజేశారు . ఆయనే స్వయంగా పాడారు కూడా.  ఆయనలోని హనుమద్భక్తి గీతంలోని ప్రతి అక్షరంలోనూ గోచరిస్తుంది. స్వచ్ఛత, శరణాగతి, చనువు, హనుమంతుని తత్త్వ జ్ఞానం కలిగి పాలగుమ్మి వారు ఈ రచన చేశారు. అందుకే, ఇన్నేళ్లైనా ఈ పాట ఇప్పటికీ రామ-హనుమల బంధాన్ని ఆవిష్కరిస్తూ, హనుమద్భక్తి వైభవాన్నిహృద్యంగా చాటుతూనే ఉంది. పాలగుమ్మి వారి ప్రతిభకు, వ్యక్తిత్వానికి, శుద్ధ అంతఃకరణానికి  ఈ గీతం నిలువుటద్దం.

2, మార్చి 2016, బుధవారం

కూచిపూడి నృత్యాంశం - దశావతారం


పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం
ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే

అని కృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పాడు. ఈ తత్త్వాన్నే భాగవతంలో వ్యాస భగవానులు మనకు అనేకావతారముల వర్ణనతో వివరించారు. భగవంతుని అవతారములలో దశావతారములకు ప్రాముఖ్యత ఉంది. చెడు విపరీతమై పోయినప్పుడు ఆయా కాలమాన పరిస్థితులకు అనువైన అవతారం ఎత్తి దుష్ట శిక్షణ చేశాడు పరమాత్మ. వేదోద్ధరణ, సమస్త కామ్యముల సిద్ధికి క్షీర సాగర మథనం, హిరణ్యకశిపు బారినుండి భూమిని కాపాడటం కోసం, హిరణ్యాక్షుని దాష్టిణ్యాలను అణచటానికి నారసింహావతారం, బలిమర్దనానికై వామనావతారం, అధర్మానికి పాల్పడుతున్న క్షత్రియులను వధించటానికి పరశురామునిగా, రావణుని చంపటానికి రామావతారం, కౌరవులతో పాటు ఎందరో రాక్షస ప్రవృత్తి గలవారిని సంహరించటానికి బలరామ, కృష్ణావతారములుగా, కలియుగంలో అకృత్యములు మితిమీరినప్పుడు దుష్టశిక్షణకై కల్కిగా పరమాత్మ అవతరించాడు.

దశావతారాలను వర్ణిస్తూ ఎంతో మంది అద్భుతమైన గేయాలను, కీర్తనలను రచించారు. అన్నమాచార్యుల మొదలు ఇటీవలి వరకు ఎన్నో రచనలు వచ్చాయి. అందులో నాట్య శాస్త్రానికి అనువుగా గుంటూరు జిల్లా పెదపులివర్రు గ్రామానికి చెందిన సిద్ధాబత్తుల రంగదాసు గారు రచించిన ఈ దశావతార శబ్దం చాలా ప్రాముఖ్యత పొందింది. వెంపటి వారు, వేదాంతం వారు కూచిపూడి సాంప్రదాయంలో ఈ దశావతార శబ్దాన్ని బహుళ ప్రాచుర్యంలోకి తెచ్చారు. అద్భుతమైన స్వరములతో, సాహిత్యంతో మోహన రాగంలో ఈ గీతం కూర్చబడింది. మొదట శ్లోకం జయదేవుడు రచించిన గీతగోవిందంలోనుండి తీసుకొనబడింది. లయబద్ధంగా సాగే ఈ శబ్దంలో అద్భుతమైన తెలుగు పదప్రయోగం జరిగింది. పెదపులివర్రు గ్రామంలో వెలసిన వరదరాజస్వామి వారిపై రంగదాసు గారు ఈ కృతిని రచించారు.

దశావతార వర్ణన భారతీయ సంగీత నాట్య విద్యలలో చాలా ప్రముఖమైన స్థానం ఉండటానికి కారణం ఆయా అవతారముల విలక్షణ జన్మ లక్ష్యాలు. ఈ విలక్షణత వలన వాటి వర్ణన సంగీత నాట్య కళలలో కూడా మరింత వైవిధ్యభరితంగా చేయవచ్చు. కూచిపూడి నాట్య శాస్త్రంలో దశావతార అద్భుతమైన వర్ణనకు గొప్ప అవకాశం ఉంది. ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క లీలను వివరిస్తూ నర్తించవచ్చు. తద్వారా ఆ అవతార లక్ష్యాన్ని ప్రభావవంతంగా అందించవచ్చు. ఈ అవకాశాన్ని కూచిపూడి నాట్యగురువులు చాలా చక్కగా వినియోగించుకున్నారు. అందుకే దశావతార నృత్య ప్రదర్శనలు బహుళ ప్రాచుర్యం పొందాయి. వేదాంతం వారు, వెంపటి వారు తమ శిష్య పరంపరలో ఈ దశావతర  నాట్య శైలిని అందంగా తీర్చి దిద్దారు.

దక్షిణ భారత నాట్య సాంప్రదాయాలలో భరత నాట్యం మరియు కూచిపూడిలలో ప్రత్యేకమైన శబ్దాలతో లయ ప్రాధాన్యమైన నట్టువాంగానికి చాల ముఖ్యమైన స్థానం ఉంది. సాహిత్యానికి ముందు నట్టువాంగంలో కళాకారులు తమ ప్రతిభను ప్రయోగాల, పరిశోధనల ద్వారా మరింత మెరుగు పరచుకునే అవకాశం ఉంటుంది. నట్టువాంగానికి మంచి సాహిత్యం తోడైతే, దానికి తగిన ఆహార్యం, అభినయం కలిపితే ఆ నృత్య ప్రదర్శన ప్రేక్షకుల మనసును దోచుకుంటుంది. అటువంటి అంశమే ఈ దశావతారం.

మహంకాళి మోహన్ గారు ప్రసిద్ధ కూచిపూడి నాట్య గురువులు. వారు నట్టువాంగం అందించిన ఆడియో. దశావతార ప్రదర్శన వీడియోలు యూట్యూబ్‌లో చాలా ఉన్నాయి. మంజుభార్గవి గారి ప్రదర్శన బాగుంది, కానీ వీడియో క్వాలిటీ సరిగా లేదు. వీర నరసింహరాజు గారి సౌజన్యంతో ప్రముఖ నాట్యాచార్యులు  వేదాంతం రాఘవయ్య గారి దశావతార నాట్యం చూడండి. అలాగే నాట్య మయూరి తెలుగు సినీ జగత్తులో మెరుపువేగంతో శాస్త్రీయ సంగీతం చేసిన ఎల్  విజయలక్ష్మిగారు సతీ సుమతి చిత్రంలో రాగమాలికగా చేసిన అద్భుతమైన దశావతార నృత్యం  చూడండి.

సాహిత్యం:

వేదానుద్ధరతే జగన్నివహతే భూగోళముద్భిభ్రతే
దైత్యం దారయతే బలిం ఛలయతే క్షత్రక్షయం కుర్వతే
పౌలస్త్యం జయతే హలం కలయతే కారుణ్యమాతన్వతే
మ్లేచ్ఛాన్మూర్ఛయతే దశాకృతికృతే కృష్ణాయ తుభ్యం నమః

తక్కధింత తాహత ధీనుత తద్ధీనుత తాహతణాంత
తఝంతరిత తఝం ఝంతరిత తఝం తరిత ఝంతకు రేకిణ 
తడికు డిడికు డిడిడికు డింకు తడికు డిడికు డిడిడికు డింకు
తక్కిణణక తక్కుంతరికిణణక తక్కిణణక తక్కుంతరికిణణక 
తక్కుత ధిక్కుంత ధిక్కుంతరి తక్కుంతక

మత్సరమున మరి అంబుధిలో జొచ్చియున్న సోమకు ద్రుంచియు
విచ్చలవిడి వేదములజునకు ఇచ్చితివో మత్స్యావతారా!

తధనుఝణుత ధిమికిట ఝంతరి తాహత ఝణు ఝణఝణుత ఝణు
తఝ్ఝణుతా తక్కధితక్కుంతరి తఝ్ఝణుతా తక్కధితక్కుంతరి

పలుమరు మిము ప్రస్తుతి చేయుచు చెలగి సురలు జలధి మదింపగ
కలిమి బలిమి యెలమితో నొసగిన కులగిరిధర కూర్మావతారా! 

తధన ఝణుత ధిమికిట ఝంతరి  తాహత ఝణు ఝణఝణుత ఝణు
కుక్కుంతరికిట తరికిట కిట తక కుక్కుంతరికిట తరికిట కిట తక

స్థిరముగ ధరనురవడి చేకొని ఉరగపథంబిరువుగ జొచ్చిన
హిరణ్యాక్షు బరిమార్చితివో వర సుగుణా! వరాహరూపా!

తధన ఝణుత ధిమికిట ఝంతరి  తాహత ఝణు ఝణఝణుత ఝణు
తంథంథన తాణుతఢీంకుకు తంథంథన తాణుతఢీంకుకు

జంభారి సుర ప్రముఖ కదంబంబును రక్షింపంగ 
స్థంబంబున వెడలియు దానవఢింబకు గాచితివో నరసింహా!

తధన ఝణుత ధిమికిట ఝంతరి  తాహత ఝణు ఝణఝణుత ఝణు
తత్తణాంత తాహత ధీణుత తత్తణాంత తాహత ధీణుత

మానితముగ ముల్లోకంబుల తానొప్పుగ కాపాడంగ 
మానుగ మూడడుగులు బలిచే దానముగొను వామనరూపా

తధన ఝణుత ధిమికిట ఝంతరి  తాహత ఝణు ఝణఝణుత ఝణు
తరితతరిత ద్రుడుతత్తతకిట తరితతరిత ద్రుడుతత్తతకిట

తరమి తరమి ధరణీ పతులను పరశువుచే దునుమాడితివో
వర వీర పరాక్రమమున ధర పరగితివో భార్గవరామా 

తధన ఝణుత ధిమికిట ఝంతరి  తాహత ఝణు ఝణఝణుత ఝణు
తక్కుంతరిత రుంతకు రేకిణ తక్కుంతరిత రుంతకు రేకిణ

దశరథ తనయుడవై సురలకు వశముగాని దశముఖు త్రుంచియు
విశదముగా అయోధ్యకు సీతతో వేంచేసితివో రఘురామా

తధన ఝణుత ధిమికిట ఝంతరి  తాహత ఝణు ఝణఝణుత ఝణు
జగజగణపు జగణపు రేకిణ జగజగణపు జగణపు రేకిణ

యాదవ వంశాబ్ధి సుధాకరు ఆదిదేవుడనుజుడు కాగా
మోదమొసగి ఖలులను త్రుంచియు మేదిని భరముడిపిన బలరామా

తధన ఝణుత ధిమికిట ఝంతరి  తాహత ఝణు ఝణఝణుత ఝణు
తాకుధణకు తఢీంకు డేకు తాకుధణకు తఢీంకు డేకు

అంగనలకు సిగ్గలడలింపగ అంగజ సమ రూపముతో
రంగుగ పురకాంతల వ్రతములు భంగ పరచు బుద్ధావతారా

తధన ఝణుత ధిమికిట ఝంతరి  తాహత ఝణు ఝణఝణుత ఝణు
కిటకిటడక కిర్రటకిటడక కిటకిటడక కిర్రటకిటడక

కాటపు కలి బాధలు మాన్పగ నీటుగ కరవాలము జేకొని
ఘోటకమున యెక్కి దురాత్ముల గీటడచిన కల్క్యావతారా

తధన ఝణుత ధిమికిట ఝంతరి  తాహత ఝణు ఝణఝణుత ఝణు
జగకుణగకు జేజే జగకు జగకుణగకు జేజే జగకు

సురల్ మేలు మేలని పొగడగ నిరతము నీ దాసుల బ్రోవను
పరగ వ్యాఘ్రపురమున వెలసిన వరదరాజదేవా ఆశ్రిత సురభోజా పరాక్

1, మార్చి 2016, మంగళవారం

మాయాబజార్‌లో తత్త్వ బోధ


కళాఖండాలైన చిత్రాలలో వినోదం మరియు సాంకేతిక విలువలతో పాటు మానవజాతికి మంచి సందేశం కూడా ఉండేది. అటువంటి చిత్రాలలో మాయా బజార్ ఒకటి. 1957లో విడుదలైన ఈ చిత్ర కథాంశం పూర్తిగా కల్పితేమే అయినా ఆద్యంతం మనలను మంత్రముగ్ధులను చేయటానికి కారణం చిత్రీకరణ, నటన, సంగీతంలతో పాటు కథలోని సందేశం కూడా. శశిరేఖను అభిమన్యుడు పెళ్లాడటానికి ఘటోత్కచుడు చేసే మాయాజాలం పూర్తిగా కలిపితమే. మహాభారతంలో ఈ ఘట్టం లేదు. అయినా, ఈ చిత్రం చూస్తే ఏ మాత్రం కల్పితం అన్న భావన రాదు. అందుకు కారణం ప్రతి సన్నివేశం కూడా మనలను హత్తుకునేలా సంభాషణలు, సెట్టింగ్స్ మరియు వేషభూషలతో చిత్రీకరించటం వలన.

ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన ఘట్టం ఘటోత్కచుడు ద్వారకలో ఉన్న శశిరేఖను అపహరించి తన రాజ్యానికి తీసుకువెళ్లటం, తదుపరి తాను ఆ శశిరేఖగా నటించటం. ఘటోత్కచుడు ద్వారక ప్రవేశించే సమయంలో అతనిలో తాను ఏదైనా సాధించగలను అన్న ఆత్మవిశ్వాసం కాస్త మితిమీరుతుంది. అతని ఉత్సాహాన్ని అదుపులో ఉంచటానికి కృష్ణ పరమాత్మ ముసలి తాత రూపంలో కూర్చొని అతనిని పరీక్షిస్తాడు.  కార్య సాధనలో నేను చేయగలను అన్న ఆత్మ విశ్వాసంతో పాటు, అది పరమాత్మ అనుగ్రహంతో చేస్తున్నాను అన్న కృతజ్ఞత, జ్ఞానం ఉంటే పరమాత్మ ఆ కార్యాన్ని సఫలం చేస్తాడు. ఎప్పుడైతే నా వల్లనే జరుగుతుంది, నేనే దీనికి కర్తను అన్న భావన మనసులో ప్రవేశిస్తుందో అప్పుడు భంగపాటు తప్పదు. ఆ తత్త్వాన్ని విశదంగా తెలియజేటానికే ఈ సన్నివేశాన్ని సృష్టించారు దర్శకులు కేవీ రెడ్డి గారు. పింగళి నాగేంద్రరావు గారి సంభాషణలు మనకు అద్భుతమైన ఆధ్యాత్మిక సందేశాన్ని అందిస్తాయి. వివరాలు:

తాత:

చిరంజీవ చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ
చిరంజీవ చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ

అటు ఉన్నది ఇటు లేదు ఇటు ఉన్నది అటు లేదు
అటు ఉన్నది ఇటు లేదు ఇటు ఉన్నది అటు లేదు
అటు నేనే ఇటు నేనే అటు నేనే ఇటు నేనే
చిరంజీవ చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ

చిన చేపను పెద చేప చినమాయను పెనుమాయ
చిన చేపను పెద చేప చినమాయను పెనుమాయ
అది స్వాహా ఇది స్వాహా అది స్వాహా ఇది స్వాహా
చిరంజీవ చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ

ఎరుకకుండ వచ్చావు ఎరుకలేక పోతావు
ఇది వేదం ఇదె వేదం ఇదె వేదం ఇదె వేదం

ఘటోత్కచుడు: "ఏయ్ తాతా? నీ వేదం బాగానే ఉంది కానీ, అసలు నువ్వెవరివో చెప్పు"

తాత: "ఓహోహోహోహో నీవా? నీకు తెలియదూ నేనెవరినో?"

ఘటోత్కచుడు:"తెలియకనేగా అడిగేది"

తాత: "తెలియని వానికి చెప్పినా తెలియదు"

ఘటోత్కచుడు:"ఏయ్ తాతా! నీ కుతర్కం చాలించు. నువ్వెవరివైతే నాకేమిలే! చూడు...శశిరేఖ అనే చిన్నది ఎక్కడుందో కాస్త చెప్పు"

తాత:"హాయ్ హాయ్ నా సాయం కోరుతూ నన్నే అదిరిస్తున్నావ్? పేరు చెప్పి శరణు కోరి బుద్ధిగా అడుగు చెబుతాను."

ఘటోత్కచుడు:"ఏయ్ తాతా! ఏమనుకున్నావ్? జాగ్రత్త. నాకాగ్రహమొస్తే ఆగను. నిన్ను నీ ద్వారకను సముద్రంలో ముంచి పోతాను."

తాత:"అబ్బో అబ్బో అంత ఘనుడివా? చెప్పవేం మరి? అయితే, నువ్వు అంత పని చేయనక్కరలే. నేను ముసలి వాడిని.  నడవలేను. నన్ను మోసుకొని పో. అలాగే శశిరేఖను చూపిస్తా."

ఘటోత్కచుడు: "ఉం. అలా రా దారికి. హ హ లే."

తాత:"చిరంజీవ చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ చిరంజీవ చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ"

ఘటోత్కచుడు:"అరే! ఇంత బరువున్నావే!"

తాత:"ద్వారకనే పెళ్లగిస్తానంటివే? మరి నన్నే ఎత్తలేవా?"

ఘటోత్కచుడు:"హుం హా"

తాత:"హు హు హు హు హు హు ఎత్తు నాయనా ఎత్తు.."

ఘటోత్కచుడు:"ఊ.. ఏనుగులు మింగావా పర్వతాలు ఫలహారం చేశావా ఏమిటి నీ మాయ?"

తాత:"చిన మాయను పెను మాయ అది స్వాహా ఇది స్వాహా అటు నేనే ఇటు నేనే అది నేనే ఇది నేనే"

ఘటోత్కచుడు:"ఓహోహోహోహో తెలిసింది తెలిసింది..నమో నమో నమో నమో నమో నమః నమో కృష్ణ నమో కృష్ణ నమో కృష్ణ నమో నమః"

కృష్ణుడు: "చిరంజీవ చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ"

ఈ సంభాషణలను నిశితంగా పరిశీలిద్దాం.

ఆశీర్వచనంతో ప్రారంభించిన కృష్ణ పరమాత్మ మాయ, పరమాత్మ తత్వాలను నేరుగా ఆవిష్కరిస్తాడు. మాయ తన సృష్టే అని, కనిపించేది, కనిపించనిది, మన దగ్గర ఉన్నది దూరాన ఉన్నదీ అన్నీ తానే, అన్నీ తన లీలలే అని ఆయన చెబుతాడు. చిన్న మాయను పెద్ద మాయ చిన్న చేపను పెద్ద చేప మింగినట్లు మింగేస్తూ ఈ ప్రపంచమంతా మాయలో నడుస్తుందని ఆయన సనాతన ధర్మ ఆధ్యాత్మిక సారాన్ని అందించాడు. మాయలో నేను, నా వలన అన్న భావనలో, తాడును చూసి పాము అనుకునే భ్రాంతిలో మనిషి కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. ఇదంతా లీలగా ఆయన చూస్తుంటాడు. తెలియకుండానే పుడతాము. తెలియకుండానే పోతాము. అంటే ఈ శరీరానికి సంబంధించిన జనన మరణాలతో మేధకు సంబంధం లేకుండా కాలచక్రం సాగిపోతుంది. అందులో అన్నిటికీ అతీతంగా ఉండేది పరమాత్మ ఒక్కటే. అతీతమైన ఆయన అన్నిటికీ సృష్టికర్తగా చెప్పబడ్డాడు.

మరి ఎదురుగా పరమాత్మ నిలబడితే ఆయనను గుర్తించకుండా చేసేది? మన అహంకారం. ఈ దేహానికి సంబంధించిన వాసనలు. వీరోత్సాహంతో ద్వారక చేరిన ఘటోత్కచుడు తాత రూపంలో ఉన్న కృష్ణుని ఎన్ని సంకేతాలు వచ్చినా గుర్తించలేకపోతాడు. మనం కూడా అంతే. సృష్టిలోని జీవరాశులన్నిటిలోనూ పరమాత్మ ఉన్నాడని తెలియకు కొన్ని సార్లు, తెలిసినా కూడా మాయలో పడి అహంకారపూరితమైన వివక్షను చూపిస్తాము.

ఈ సంభాషణలో "తెలియని వానికి చెప్పినా తెలియదు" అని అంటాడు శ్రీకృష్ణుడు. తెలుసుకుందాము అని కోరుకునే వానికి ఫలితం రావాలంటే ముఖ్యం సంకల్పం, చిత్తశుద్ధి. మరి అహంకారముంటే ఆ రెండూ మలినమవుతాయి. అప్పుడు ఇతరులు చెప్పినా తెలుసుకోలేరు. హిరణ్యాక్షుడు, రావణుడు, దుర్యోధనుడు మొదలైన వారికి ఎంతో మంది హితవు పలికినా వారు వినాశనము వైపే అడుగులు వేశారు. కారణం మాయకు లోబడి పరమాత్మ తత్త్వాన్ని ఎరుగక పోవటం, తాము ప్రపంచాన్ని జయించామన్న అహంకారం.

ఘటోత్కచుడు ముసలివాడన్న చులకనతో ఆతనిని సాయం అడగటంలో కొంత అహంకారం ప్రదర్శిస్తాడు. దానికి సమాధానంగా పరమాత్మ - సాయం కోరి వచ్చినవాడివి అదిరిస్తున్నావు. నీ ఉనికి తెలిపి శరణు కోరు, తప్పక సాయం చేస్తాను అంటాడు. పరమాత్మకు కావలసినది శరణాగతి. అది ఉంటే సంకల్ప మాత్రాన మన కామ్యములు నెరవేరతాయి అన్నది ఈ సంభాషణలోని సందేశం. తరువాత, కార్యసాధనలో చులకన భావాన్ని ప్రదర్శించిన ఘటోత్కచుడికి భంగపాటు తప్పలేదు. ముసలివాడిని ఎత్తటం ఎంత అనుకున్నాడు. కానీ, అహంకారంతో వస్తే విశ్వమంతా ఉన్నవాడిని ఎలా ఎత్తగలడు? తన శక్తితో ద్వారకనే పెళ్లగిస్తానన్నవాడు ముసలివాడిని ఎత్తలేకపోతాడు. అనగా, తన శక్తికి కారణం దైవం అన్న సంగతి స్వాతిశయముతో కప్పబడుతుంది. దానికి కనువిప్పు కలిగిస్తాడు పరమాత్మ. కార్యసాధనలో భగవంతునిపై దృష్టి నిరంతరం ఉండాలి అన్న సత్యాన్ని మనకు కృష్ణ పరమాత్మ తెలియజేస్తాడు. దైవలీలతో కనువిప్పు కలిగి ఘటోత్కచుడు శ్రీకృష్ణుని శరణు వేడుతాడు. విజయాన్ని పొందుతాడు.

ఈ తత్వానికి మనకు అత్యంత ఉత్తమమైన ఉదాహరణ శ్రీమద్రామాయణంలో హనుమంతుడు. ఎంతటి బలసంపన్నుడైనా హనుమంతుడు స్వామి నామాన్ని మరువలేదు. తన బలిమి, కలిమి స్వామే అని నమ్మాడు. క్లైబ్యం వచ్చినా తనలను తాను మళ్లీ స్వామి నామస్మరణతో శక్తివంతం చేసుకున్నాడు. కార్యాన్ని సాధించాడు.

ఇటువంటి సందేశాత్మక సన్నివేశాలు మాయాబజార్ సినిమాలో మరెన్నో. అందుకే దాదాపు 60 ఏళ్లు అయినా ఈ చిత్రం ఇప్పటికీ నేటి సమాజంలో బహుళ ప్రజాదరణ కలిగి ఉంది. ఎన్ని మార్లు చూసినా మళ్లీ చూడాలన్న ఉత్సుకత కలుగుతుంది.




28, ఫిబ్రవరి 2016, ఆదివారం

యుధిష్ఠిర కృత దుర్గాదేవి స్తుతి - మహాభారతం విరాటపర్వం


యశోదాగర్భ సంభూతాం నారాయణవరప్రియాం
నందగోపకులే జాతాం మంగళ్యాం కులవర్ధినీం

కంసవిద్రావణకరీం అసురాణాం క్షయంకరీం
శిలాతటవినిక్షిప్తాం ఆకాశం ప్రతిగామినీం

వాసుదేవస్య భగినీం దివ్యమాల్య విభూషితాం
దివ్యాంబరధరాం దేవీం ఖడ్గఖేటక ధారిణీం

జయా త్వం విజయా చైవ సంగ్రామే చ జయప్రదా
మమాపి విజయం దేహి వరదా త్వం చ సాప్రతం

వింధ్యే చైవ నగశ్రేష్ఠే తవ స్థానం హి శాశ్వతం
కాళి కాళి మహాకాళి ఖడ్గఖత్వాంగధారిణి

దుర్గాత్ తారయసే దుర్గే తత్ త్వం దుర్గా స్మృతా జనైః
కాంతారేష్వవసన్నానాం మగ్నానాం చ మహార్ణవే

దస్యుభిర్వా నిరుద్ధానాం త్వం గతిః పరమా నృణాం
జలప్రతరణే చైవ కాంతారేష్వటవీషు చ

యే స్మరంతి మహాదేవి న చ సీదంతి తే నరాః
త్వం కీర్తిః శ్రీః ధృతిః సిద్ధిః హ్రీః విద్యా సంతతిర్మతిః

సంధ్యా రాత్రిః ప్రభా నిద్రా జ్యోత్స్నా కాంతిః క్షమా దయా
నృణాంచ బంధనం మోహం పుత్రనాశం ధనక్షయం

వ్యాధిం మృత్యుం భయం చైవ పూజితా నాశయిష్యసి
సోహం రాజ్యాత్ పరిభ్రష్టః శరణం త్వాం ప్రపన్నవాన్

ప్రణతశ్చ యథా మూర్ధ్నా తవ దేవి సురేశ్వరి
త్రాహి మాం పద్మపత్రాక్షి సత్యే సత్యా భవస్వ నః

యశోద గర్భము నుండి పుట్టి, నారాయణునికి ప్రియమైన, నందగోపుని వంశంలో జన్మించి, అందరికీ శుభములిచ్చి వంశాభివృద్ధి కలిగించే తల్లీ! కంసుని పారద్రోలి, అసురులను నాశనం చేసి, రాతిమీద కొట్టబడినా ఆకాశమార్గంలో పయనించిన వాసుదేవుని సోదరీ! దివ్యమైన పూలమాలలు, వస్త్రములు, ఖడ్గమును, డాలు దాల్చిన దేవీ!

నీవే జయవు, విజయవు. యుద్ధములో జయమునిచ్చే దానవు. నాకు కూడ విజయాన్ని ప్రసాదించే వరాన్ని ఇపుడీయుము.

కాళీ! మహాకాళీ! ఖడ్గము, కపాలం కల దండము ధరించి పర్వత శ్రేష్ఠమైన వింధ్య పర్వతాన్ని శాశ్వత నివాసం చేసుకున్నావు.

ఓ తల్లీ! భరింపరాని కష్టాలనుండి తరింప జేస్తావు కాబట్టే నిన్ను ప్రజలు దుర్గ అని కొలుస్తారు. అడవుల్లో చిక్కుకున్న వారికి, సముద్రం దాటే వారికి, దుర్గమమైన మార్గాలలో పయనించే వారికి, క్రూరుల బారిన పడేవారికి నీవే గతి. నిన్ను స్మరించినవారు ఈ కార్యాలలో కష్టాలపాలు కారు.

నీవే కీర్తివి, శుభానివి, ధైర్యానివి, సిద్ధి, లజ్జ, విద్య, సంతానం, బుద్ధి, సంధ్య, రాత్రి, తేజస్సు, నిద్ర, వెన్నెల, కాంతి, ఓర్పు, దయ మొదలైన రూపాలన్నీ నీవే. నిన్ను పూజించే వారి బంధనం, మోహం, పుత్రశోకం, ధననాశం, రోగం, మృత్యువు, భయము తీరుస్తావు. అమ్మా! ఇప్పుడు నేను రాజ్యభ్రష్టుడనయ్యాను. నీ శరణు వేడుతున్నాను.

దేవతలకు కూడా దేవివైన నీకు శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నాను. నీవు కలువరేకులవంటి ప్రసన్నమైన కనులు కలదానవు. నన్ను రక్షించు. నీవే సత్యము. మా పట్ల సత్యము కమ్ము!

మహాభారతం విరాట పర్వం ఆరంభంలో పాండవులు అజ్ఞాతవాసానికై విరాటుని కొలువుకు వెళ్లేముందు ధర్మరాజు దుర్గాదేవిని స్తుతించిన శ్లోకాలు. యుధిష్ఠిరుడి వంటి ధర్మ ప్రభువుకు, సత్యసంధునకు కూడా కష్టాలు తప్పలేదు. అఖండ భారతదేశాన్ని పాలించవలసిన పాండుకుమారులకు తమ నిజస్వరూపం తెలియకుండా మారువేషాలలో ఇంకొకరి పంచన ఉండాల్సిన అగత్యం వచ్చింది. ఎవరు అప్పుడు శరణు? ఆదిపరాశక్తి దుర్గ. ధర్మరాజు ఆ తల్లిని నారాయణుని సోదరిగా, కంసుని మరణానికి కారణమై, దానిని ఆ అసురునికి స్వయంగా తెలిపిన యోగమాయగా గ్రహించి నుతిస్తాడు. ఎంతో భక్తితో ధర్మరాజు కొలువగానే అమ్మ ప్రత్యక్షమై "నాయనా! నీకు త్వరలోనే విజయం కలుగుతుంది. నా అనుగ్రహం వలన విరాటుని కొలువులో మీరుండగా మీ జాడను కౌరవులతో సహా ఎవ్వరూ తెలుసుకోలేరు. నన్ను స్మరించిన వారికి నేను సదా రక్షగా ఉంటాను" అని ఆశీర్వదిస్తుంది. మనం కొలిచే దుర్గా స్వరూపం సనాతనమైనదని చెప్పటానికి ఇది నిరూపణ. అంతకుముందు కూడా ఎన్నో మార్లు ఎంతో మంది ఆదిపరాశక్తి రూపాన్ని కొలిచారు.

దుర్గామాతను నీచమైన కోణంలో ఇటీవల ఒక యూనివర్సిటీ విద్యార్థులు చూపించి, అతి నీచమైన మాటలు పలికారని బయటపడింది. మనసులో ఆదిపరాశక్తిని అన్నేసి మాటలన్న నరాధములను ఆ తల్లి శిక్షించాలని ఉక్రోషం కలిగింది. సనాతన ధర్మంపై ఇంతటి దాడి జరుగుతుంటే మనం జాగృతం కావాలి. దీన్ని నిరోధించాలి, వ్యతిరేకించి తీరాలి. ఇప్పుడు మౌనం పాటిస్తే రేపు మరింత ఘోరకలిని చూడాల్సి వస్తుంది. లేవండి! జరుగుతున్న దాడిని ఆపండి!

పాతాళ భైరవి – 1951: తెలుగు జానపద చిత్రరాజం

1951 మార్చి 15న విడుదలైన పాతాళ భైరవి తెలుగు చలనచిత్ర చరిత్రలో ఒక కీలక మలుపు. విజయా ప్రొడక్షన్స్ పతాకంపై బి. నాగిరెడ్డి, ఆలూరి చక్రపాణి నిర్మ...