3, మార్చి 2016, గురువారం

నిను కొలుచును ఈ జగమంతా - హనుమద్భక్తి గీతం


హనుమంతుడు అనగానే స్వామి భక్తి, అసమాన్య వీర పరాక్రమాలతో పాటు వినయము, జ్ఞానము, బుద్ధి కుశలత, సమయ స్ఫూర్తి గుర్తుకు వస్తాయి. అన్నిటికన్నా రామభక్తే ముందు నిలుస్తుంది. ఎందుకంటే, అదే ఆయనకు భృతి, ద్యుతి మరియు గతి. ఆయనకు వేరే తలపు లేదు. వేరే పని లేదు. అంతా స్వామికే, అన్నీ ఆయన కొరకే.  ఎంతటి పరాక్రమ సంపన్నుడైనా తనకు అన్నీ స్వామి అనుగ్రహం వలనే అన్నది ఆయన తత్త్వం. అందుకే, ఆయన ఎన్ని అవరోధాలు వచ్చినా ఎంతో  దుర్గమమైన కార్యాలను సాధించాడు. స్వామిపై పరిపూర్ణమైన నమ్మకంతో సాగరాన్ని దాటి, లంకను  ఛేదించాడు. ఎక్కడో హిమాలయాలలో ఉన్న సంజీవనిని తెచ్చి లక్ష్మణునికి పునరుజ్జీవుని చేశాడు.  

హనుమంతుడు రామనామ స్మరణతో నిరంతరం రోమాంచకుడై   ఉంటాడు . మరి రామభక్తిలో ఉన్న మహిమ మనకు తెలిసినదే. అందుకే త్యాగరాజస్వామి రోమాంచమనే ఘన కంచుకము, రామభక్తుడనే ముద్రబిళ్ల, రామనామమనే వరఖడ్గము - వీటిని రాముని బంటుయైన హనుమంతుని ఆయుధాలుగా చెప్పారు. రామనామస్మరణతో రోమాంచమైన శరీరము అత్యంత దృఢమవుతుంది అన్నదానికి హనుమంతుడు ప్రత్యక్ష ఉదాహరణ. అలాగే ఆ రాముని నామమే ఆయనకు అత్యంత శక్తివంతమైన ఆయుధం, రామభక్తే హనుమంతుని  చిరునామా! మరి హనుమంతుడు ఎక్కడ ఉంటాడు? రాముని కొలిచే ప్రతి చోటా... 

యత్ర  యత్ర  రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృత మస్తకాంజలిం 
బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత  రాక్షసాంతకం 

రాముని కీర్తించే ప్రతి చోటా తలవంచి నమస్కరిస్తూ, కన్నులలో ఆనందబాష్పాలు నింపుకొని ఉంటాడు ఆ హనుమంతుడు. హనుమద్భక్తులలో ఉండే ఒక గొప్ప లక్షణం ఎంతటి కష్టాన్నైనా ఆ రామబంటుపై నమ్మకంతో దాటగలిగే  ఆత్మస్థైర్యం. అలాగే,  వీరు రామభక్తి సామ్రాజ్యంలో  సంపాదించుకునే ప్రయత్నంలో నిరంతరం ఉంటారు.  విశేషమేమిటంటే, హనుమను  కాపాడుతాడు, రాముని తలచితే హనుమ  అండగా ఉంటాడు.

పాలగుమ్మి విశ్వనాథం గారు తెలుగు గడ్డపై  పుట్టిన బహుముఖ ప్రజ్ఞాశాలి. సంగీతకారునిగా, రచయితగా  ఆయన అందించిన సేవలు ఎనలేనివి. లలిత సంగీత జగత్తులో వారి స్థానం అనుపమానమైనది. 15 వేలకు పైగా గీతాలకు సంగీతం అందించి 100కు పైగా గీతాలు రచించారు ఆయన.  ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో దశాబ్దాల పాటు లలితా సంగీత కళామ తల్లికి సేవ చేశారు. లలిత సంగీత స్వర్ణయుగంలో బాలాంత్రపు  గారితో సమానంగా  విశ్వనాథం గారు తెలుగు సంగీత  ప్రపంచానికి వెలుగు తెచ్చారు. దేవులపల్లి కృశ్ణశాస్త్రి గారు, దాశరథి గారు, అబ్బూరి రామకృష్ణగారు మొదలైన గొప్ప రచయితల సాహిత్యానికి సంగీతం కూర్చారు. బాలమురళీకృష్ణగారు, ఎమ్మెస్ రామారావు గారు, చిత్తరంజన్ గారు, వేదవతీ ప్రభాకర్ గారు, కేబీకే మోహన్ రాజు గారు మొదలైన గాయకులకు తన సంగీతం ద్వారా ఎంతో  పేరు తెచ్చిపెట్టారు. ఆయన మంచి గాయకులు కూడా.

పాలగుమ్మి వారి సాహితీ రచనలలో నా చిన్నతనంలో ఆకాశవాణిలో వచ్చిన ఈ హనుమంతుని పాట మా ఇంట్లో అందరం పాడుకునే వాళ్లం.  సత్సంగంలో దీనిని భక్తితో ఆలపించే వారు. రచనను పరిశీలిద్దాం.

నిను కొలుచును ఈ జగమంతా నను మరువకుమో హనుమంతా!

రామచంద్రుని కొలువు దొరికెనట రామనామమే దారిబత్తెమట
రాత్రింబవలు రామ ధ్యానమట రామభక్తి సామ్రాజ్యపు దొరవట

రామకీర్తనమే చెవులబడినయే అడుగులు కదలక ఆగిపోదువుట
అరమోడ్పు కనులతో అంజలి ఘటించి అన్నీ మరచి నర్తించెదవట

శ్రీపాద ధూళి శిరసున దాలిచి శతయోజనముల సంద్రము దాటి
సీతామాత సేమమే అరసి శ్రీరామచంద్రుని ఓదార్చితివట

అయోధ్య రాముని అంతరంగమన స్థిరముగ నెలకొన్న హనుమంతా!
ప్రభువుకు మా మనవులందించుమన్నా ఆస్వామి నీ మాట కాదనడన్నా!

- పాలగుమ్మి విశ్వనాథం గారు

ప్రపంచమంతా నిన్ను కొలుస్తుంది. నన్ను మరువకుము అని కవి ప్రార్థిస్తున్నారు. హనుమంతుని వృత్తి ఏమిటి? రాముని సేవ. రాముని నామమే ఆయనకు దారి మరియు భృతి అట.  నిరంతరం రామ ధ్యానమట. ఆ రామ భక్తి  సామ్రాజ్యానికి హనుమంతుడు దొర  అట. నిజమే, ఎందుకంటే హనుమను మించిన రామ భక్తుడు లేడు.  

ఆ రాముని కీర్తన చెవులకు వినబడగానే హనుమంతుని అడుగులు ఆగిపోతాయట. అరమోడ్పు కనులతో స్వామికి అంజలి సమర్పించి, అన్నీ మరచిపోయి నర్తిస్తాడట. నిజమే, హనుమంతునికి రామనామ కీర్తన కన్నా సంతోషకరమైనది ఏముంది?  

స్వామి పాదధూళిని శిరసున దాల్చి నూరు యోజనాల దూరాన ఉన్న లంకకు చేరి సీతమ్మ క్షేమ సమాచారం తెలుసుకొని స్వామిని ఓదార్చాడట. నిజమే, స్వయంగా రాముడే నీవంటి సేవకుడు, భక్తుడు లేడు అని పలికాడు. అంతటి కార్యం చేసిన హనుమను రాముడు ఆలింగనం చేసుకొని ఆశీర్వదించాడు. 

రాముని తన హృదయమున నిలుపుకున్నాడు హనుమంతుడు. ఆ ప్రభువుకు మా మానవులు వినిపించు హనుమంతా! ఆయన నీ మాట కాదనడు అని కవి అద్భుతంగా వేడుకుంటున్నారు. నిజమే, బంటు అంతరంగములో ఉన్నాడు స్వామి, బంటుకు సంపూర్ణ అనుగ్రహం అందించాడు స్వామి. మరి మనం ఆ రామబంటుకు  అర్జీ  పెట్టుకుంటే స్వామి తప్పక అనుగ్రహిస్తాడు. 

పాలగుమ్మి వారు ఈ గీతాన్ని లలితమైన అచ్చ తెనుగు పదాలతో రచించి అంటే మధురమైన సంగీతాన్ని అందజేశారు . ఆయనే స్వయంగా పాడారు కూడా.  ఆయనలోని హనుమద్భక్తి గీతంలోని ప్రతి అక్షరంలోనూ గోచరిస్తుంది. స్వచ్ఛత, శరణాగతి, చనువు, హనుమంతుని తత్త్వ జ్ఞానం కలిగి పాలగుమ్మి వారు ఈ రచన చేశారు. అందుకే, ఇన్నేళ్లైనా ఈ పాట ఇప్పటికీ రామ-హనుమల బంధాన్ని ఆవిష్కరిస్తూ, హనుమద్భక్తి వైభవాన్నిహృద్యంగా చాటుతూనే ఉంది. పాలగుమ్మి వారి ప్రతిభకు, వ్యక్తిత్వానికి, శుద్ధ అంతఃకరణానికి  ఈ గీతం నిలువుటద్దం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి