పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం
ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే
అని కృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పాడు. ఈ తత్త్వాన్నే భాగవతంలో వ్యాస భగవానులు మనకు అనేకావతారముల వర్ణనతో వివరించారు. భగవంతుని అవతారములలో దశావతారములకు ప్రాముఖ్యత ఉంది. చెడు విపరీతమై పోయినప్పుడు ఆయా కాలమాన పరిస్థితులకు అనువైన అవతారం ఎత్తి దుష్ట శిక్షణ చేశాడు పరమాత్మ. వేదోద్ధరణ, సమస్త కామ్యముల సిద్ధికి క్షీర సాగర మథనం, హిరణ్యకశిపు బారినుండి భూమిని కాపాడటం కోసం, హిరణ్యాక్షుని దాష్టిణ్యాలను అణచటానికి నారసింహావతారం, బలిమర్దనానికై వామనావతారం, అధర్మానికి పాల్పడుతున్న క్షత్రియులను వధించటానికి పరశురామునిగా, రావణుని చంపటానికి రామావతారం, కౌరవులతో పాటు ఎందరో రాక్షస ప్రవృత్తి గలవారిని సంహరించటానికి బలరామ, కృష్ణావతారములుగా, కలియుగంలో అకృత్యములు మితిమీరినప్పుడు దుష్టశిక్షణకై కల్కిగా పరమాత్మ అవతరించాడు.
దశావతారాలను వర్ణిస్తూ ఎంతో మంది అద్భుతమైన గేయాలను, కీర్తనలను రచించారు. అన్నమాచార్యుల మొదలు ఇటీవలి వరకు ఎన్నో రచనలు వచ్చాయి. అందులో నాట్య శాస్త్రానికి అనువుగా గుంటూరు జిల్లా పెదపులివర్రు గ్రామానికి చెందిన సిద్ధాబత్తుల రంగదాసు గారు రచించిన ఈ దశావతార శబ్దం చాలా ప్రాముఖ్యత పొందింది. వెంపటి వారు, వేదాంతం వారు కూచిపూడి సాంప్రదాయంలో ఈ దశావతార శబ్దాన్ని బహుళ ప్రాచుర్యంలోకి తెచ్చారు. అద్భుతమైన స్వరములతో, సాహిత్యంతో మోహన రాగంలో ఈ గీతం కూర్చబడింది. మొదట శ్లోకం జయదేవుడు రచించిన గీతగోవిందంలోనుండి తీసుకొనబడింది. లయబద్ధంగా సాగే ఈ శబ్దంలో అద్భుతమైన తెలుగు పదప్రయోగం జరిగింది. పెదపులివర్రు గ్రామంలో వెలసిన వరదరాజస్వామి వారిపై రంగదాసు గారు ఈ కృతిని రచించారు.
దశావతార వర్ణన భారతీయ సంగీత నాట్య విద్యలలో చాలా ప్రముఖమైన స్థానం ఉండటానికి కారణం ఆయా అవతారముల విలక్షణ జన్మ లక్ష్యాలు. ఈ విలక్షణత వలన వాటి వర్ణన సంగీత నాట్య కళలలో కూడా మరింత వైవిధ్యభరితంగా చేయవచ్చు. కూచిపూడి నాట్య శాస్త్రంలో దశావతార అద్భుతమైన వర్ణనకు గొప్ప అవకాశం ఉంది. ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క లీలను వివరిస్తూ నర్తించవచ్చు. తద్వారా ఆ అవతార లక్ష్యాన్ని ప్రభావవంతంగా అందించవచ్చు. ఈ అవకాశాన్ని కూచిపూడి నాట్యగురువులు చాలా చక్కగా వినియోగించుకున్నారు. అందుకే దశావతార నృత్య ప్రదర్శనలు బహుళ ప్రాచుర్యం పొందాయి. వేదాంతం వారు, వెంపటి వారు తమ శిష్య పరంపరలో ఈ దశావతర నాట్య శైలిని అందంగా తీర్చి దిద్దారు.
దక్షిణ భారత నాట్య సాంప్రదాయాలలో భరత నాట్యం మరియు కూచిపూడిలలో ప్రత్యేకమైన శబ్దాలతో లయ ప్రాధాన్యమైన నట్టువాంగానికి చాల ముఖ్యమైన స్థానం ఉంది. సాహిత్యానికి ముందు నట్టువాంగంలో కళాకారులు తమ ప్రతిభను ప్రయోగాల, పరిశోధనల ద్వారా మరింత మెరుగు పరచుకునే అవకాశం ఉంటుంది. నట్టువాంగానికి మంచి సాహిత్యం తోడైతే, దానికి తగిన ఆహార్యం, అభినయం కలిపితే ఆ నృత్య ప్రదర్శన ప్రేక్షకుల మనసును దోచుకుంటుంది. అటువంటి అంశమే ఈ దశావతారం.
మహంకాళి మోహన్ గారు ప్రసిద్ధ కూచిపూడి నాట్య గురువులు. వారు నట్టువాంగం అందించిన ఆడియో. దశావతార ప్రదర్శన వీడియోలు యూట్యూబ్‌లో చాలా ఉన్నాయి. మంజుభార్గవి గారి ప్రదర్శన బాగుంది, కానీ వీడియో క్వాలిటీ సరిగా లేదు. వీర నరసింహరాజు గారి సౌజన్యంతో ప్రముఖ నాట్యాచార్యులు వేదాంతం రాఘవయ్య గారి దశావతార నాట్యం చూడండి. అలాగే నాట్య మయూరి తెలుగు సినీ జగత్తులో మెరుపువేగంతో శాస్త్రీయ సంగీతం చేసిన ఎల్ విజయలక్ష్మిగారు సతీ సుమతి చిత్రంలో రాగమాలికగా చేసిన అద్భుతమైన దశావతార నృత్యం చూడండి.
సాహిత్యం:
వేదానుద్ధరతే జగన్నివహతే భూగోళముద్భిభ్రతే
దైత్యం దారయతే బలిం ఛలయతే క్షత్రక్షయం కుర్వతే
పౌలస్త్యం జయతే హలం కలయతే కారుణ్యమాతన్వతే
మ్లేచ్ఛాన్మూర్ఛయతే దశాకృతికృతే కృష్ణాయ తుభ్యం నమః
తక్కధింత తాహత ధీనుత తద్ధీనుత తాహతణాంత
తఝంతరిత తఝం ఝంతరిత తఝం తరిత ఝంతకు రేకిణ
తడికు డిడికు డిడిడికు డింకు తడికు డిడికు డిడిడికు డింకు
తక్కిణణక తక్కుంతరికిణణక తక్కిణణక తక్కుంతరికిణణక
తక్కుత ధిక్కుంత ధిక్కుంతరి తక్కుంతక
మత్సరమున మరి అంబుధిలో జొచ్చియున్న సోమకు ద్రుంచియు
విచ్చలవిడి వేదములజునకు ఇచ్చితివో మత్స్యావతారా!
తధనుఝణుత ధిమికిట ఝంతరి తాహత ఝణు ఝణఝణుత ఝణు
తఝ్ఝణుతా తక్కధితక్కుంతరి తఝ్ఝణుతా తక్కధితక్కుంతరి
పలుమరు మిము ప్రస్తుతి చేయుచు చెలగి సురలు జలధి మదింపగ
కలిమి బలిమి యెలమితో నొసగిన కులగిరిధర కూర్మావతారా!
తధన ఝణుత ధిమికిట ఝంతరి తాహత ఝణు ఝణఝణుత ఝణు
కుక్కుంతరికిట తరికిట కిట తక కుక్కుంతరికిట తరికిట కిట తక
స్థిరముగ ధరనురవడి చేకొని ఉరగపథంబిరువుగ జొచ్చిన
హిరణ్యాక్షు బరిమార్చితివో వర సుగుణా! వరాహరూపా!
తధన ఝణుత ధిమికిట ఝంతరి తాహత ఝణు ఝణఝణుత ఝణు
తంథంథన తాణుతఢీంకుకు తంథంథన తాణుతఢీంకుకు
జంభారి సుర ప్రముఖ కదంబంబును రక్షింపంగ
స్థంబంబున వెడలియు దానవఢింబకు గాచితివో నరసింహా!
తధన ఝణుత ధిమికిట ఝంతరి తాహత ఝణు ఝణఝణుత ఝణు
తత్తణాంత తాహత ధీణుత తత్తణాంత తాహత ధీణుత
మానితముగ ముల్లోకంబుల తానొప్పుగ కాపాడంగ
మానుగ మూడడుగులు బలిచే దానముగొను వామనరూపా
తధన ఝణుత ధిమికిట ఝంతరి తాహత ఝణు ఝణఝణుత ఝణు
తరితతరిత ద్రుడుతత్తతకిట తరితతరిత ద్రుడుతత్తతకిట
తరమి తరమి ధరణీ పతులను పరశువుచే దునుమాడితివో
వర వీర పరాక్రమమున ధర పరగితివో భార్గవరామా
తధన ఝణుత ధిమికిట ఝంతరి తాహత ఝణు ఝణఝణుత ఝణు
తక్కుంతరిత రుంతకు రేకిణ తక్కుంతరిత రుంతకు రేకిణ
దశరథ తనయుడవై సురలకు వశముగాని దశముఖు త్రుంచియు
విశదముగా అయోధ్యకు సీతతో వేంచేసితివో రఘురామా
తధన ఝణుత ధిమికిట ఝంతరి తాహత ఝణు ఝణఝణుత ఝణు
జగజగణపు జగణపు రేకిణ జగజగణపు జగణపు రేకిణ
యాదవ వంశాబ్ధి సుధాకరు ఆదిదేవుడనుజుడు కాగా
మోదమొసగి ఖలులను త్రుంచియు మేదిని భరముడిపిన బలరామా
తధన ఝణుత ధిమికిట ఝంతరి తాహత ఝణు ఝణఝణుత ఝణు
తాకుధణకు తఢీంకు డేకు తాకుధణకు తఢీంకు డేకు
అంగనలకు సిగ్గలడలింపగ అంగజ సమ రూపముతో
రంగుగ పురకాంతల వ్రతములు భంగ పరచు బుద్ధావతారా
తధన ఝణుత ధిమికిట ఝంతరి తాహత ఝణు ఝణఝణుత ఝణు
కిటకిటడక కిర్రటకిటడక కిటకిటడక కిర్రటకిటడక
కాటపు కలి బాధలు మాన్పగ నీటుగ కరవాలము జేకొని
ఘోటకమున యెక్కి దురాత్ముల గీటడచిన కల్క్యావతారా
తధన ఝణుత ధిమికిట ఝంతరి తాహత ఝణు ఝణఝణుత ఝణు
జగకుణగకు జేజే జగకు జగకుణగకు జేజే జగకు
సురల్ మేలు మేలని పొగడగ నిరతము నీ దాసుల బ్రోవను
పరగ వ్యాఘ్రపురమున వెలసిన వరదరాజదేవా ఆశ్రిత సురభోజా పరాక్
wonderful work ..
రిప్లయితొలగించండి