5, ఫిబ్రవరి 2016, శుక్రవారం

తరాల మార్పులు - జీవితాల్లో పెను మార్పులు


కాలాలు మారాయి, అవసరాలు పెరిగాయి, ఉద్యోగాలలో పని గంటలు పెరిగాయి, మనుషుల్లో ధర్మం మారింది. వీటన్నిటితో పని చేసే వారి జీవితాలు ఒత్తిడితో ఉన్నాయి. దీన్ని వృద్ధ తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి.

కొడుకు/అల్లుడి గురించి -

"మేము ఉద్యోగాలు చేసినప్పుడు ఆరు గంటలకల్లా ఇంట్లో ఉండేవాళ్లమురా! ఈ ఉద్యోగాలేంటో? రాత్రింబవళ్లూ పని, పిల్లల చదువుల గురించి పట్టించుకునే సమయం లేదు. ఎందో, వీళ్లకు డబ్బుంది కానీ సుఖం లేదు..."

కోడలు/కూతురు గురించి -

"మా తరంలో ఆడవాళ్లు ఇంటి పట్టున ఉండి పిల్లలను చూసుకునే వాళ్లు. నా కోడలు, కూతురు ఉద్యోగం పొద్దున పోతే రాత్రి దాకా చేస్తూనే ఉంటారు. రాత్రిళ్లు పొద్దు పోయిన తరువాత కూడా కాల్స్...ఇక ఆ పిల్లల తిండి పట్టించుకునే వాళ్లు ఎవరు?...ఎందుకీ ఆడాళ్లకు ఉద్యోగాలు? మొగుళ్లు బోలెడు సంపాదిస్తున్నారు, హాయిగా మానేసి పిల్లల చదువులు, తిండి చూసుకోవచ్చు కాద?"

మనవలు/మనవరాళ్ల గురించి -

"వీళ్లకి బయటికి వెళ్లి ఆడుకునే బుద్ధి లేదు. ఇరవై నాలుగు గంటలూ టీవీ, సెల్ ఫోన్, ఐ ప్యాడ్...పసితనంలో సోడాబుడ్డీల కళ్లజోళ్లు..."

కోడలు గురించి -

"మా కోడలకి పిల్లలను అరిస్తే ఇష్టముండదు. మేము ఇలా పెంచలేదమ్మా. పిల్లలకు డిసిప్లీన్ లేకపోతే ఎలా? భయం భక్తి లేదు. ఎదురు ప్రశ్నిస్తారు, ఇంకా ముదిరితే అరుస్తారు..ఏవిటో ఈ పెంపకం..ఎందుకీ డబ్బు?..."

ఎదిగిన మనవడు/మనవరాలి గురించి:

"ఏం పిల్లలో, కాస్త కూడా ఒత్తిడి తట్టుకోలేరు, ఒక్క పని చాతకాదు, పొద్దున పోయి రాత్రికి వస్తారు కాలేజీనుంచి. వీళ్ల శరీరాల్లో శక్తి ఉండదు, ఏదైనా చెబితే కోపం..."

కొడుకు గురించి తండ్రి -

"మా వాడికి అప్పుడే స్పాండిలోసిస్ వచ్చింది. మెదలో, నడుములో డిస్క్ ప్రాబ్లం. ముప్ఫై కూడా లేవు. ఐదు కిలోల బరువు కూడ మోయలేడు. నేను ఆ వయసులో ఎంత బరువైన ఎత్తేవాడిని, ఎంత దూరమైనా నడిచి వెళ్లే వాడిని"

- ఇదీ చాలా మంది రిటైర్ అయిన తల్లిదండ్రులు తమ పిల్లల కుటుంబాల గురించి తమ సాటి వయస్కులతో, అక్క చెల్లెళ్లతో చెప్పేవి.

నిజమే. కానీ, ఈ సమస్యలకు కారణం ఏమిటి అని కూడా ఆలోచించాలి కదా?

1. ఇది వరకు చాలా మంధి చిన్న/మధ్య తరగతి ఊర్లలో, పట్టణాలలో ఉద్యోగాలు చేసుకునే వారు. కాబట్టి, తక్కువ డబ్బుతో అయినా సంసారం నడిచేది. ఇప్పుడు ఉద్యోగాలన్నీ పెద్ద పట్టణాలలోనే ఉంటున్నాయి. అక్కడ వస్తువుల ధరలతో పాటు, నెల ఖర్చులు విపరీతంగా పెరిగాయి. ఒక సంపాదనతో కుటుంబం గడవటం కష్టమే. స్త్రీలు ఉద్యోగం చేయటం అనేది స్త్రీ స్వేచ్ఛ కోసం కన్నా ఆర్థిక వెసులుబాటు కోసమే ఎక్కువగా తప్పనిసరి అయ్యింది. ఇది ఈ తరం వాళ్లు కోరి తెచ్చుకున్నది కాదే?

2. ఇదివరకు చాలా మంది ప్రభుత్వ ఉద్యోగాలలో చేసే వారు, పబ్లిక్ సెక్టార్ (బ్యాంకులు వగైరా) జాబుల్లో చేసేవారు. కాబట్టి వారికి పని గంటలు పరిమితం. ఇప్పుడు అలా కాదు, ప్రైవేట్ ఉద్యోగాలు, పని విపరీతం, కంపెనీల మధ్య పోటీ, తక్కువ సమయంలో ఎక్కువ పని చేయిస్తే తప్ప లాభాలు రావు. అది కూడా కాకుండా, బీపీవో వంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల వలన రాత్రిళ్లు పని చేయాల్సిన అవసరం. వేర్వేరు భౌగోళిక ప్రాంతాలలో ఉన్నవారితో కలిసి పని చేయాలి, అక్కడి కస్టమర్సును సపోర్ట్ చేయాలి. అలాగే, బ్యాకుల నుండి కస్టమర్లు ఎక్కువ పని వేళలు, ఎక్కువ సర్వీసులు ఆశిస్తున్నరు. ప్రభుత్వం కూడా దీనిపైనే దృష్టి పెట్టింది. ఇది వరకు 5:30 కల్లా ఇంటికి వచ్చే బ్యాంకు ఉద్యోగులు ఇప్పుడు రాత్రి పొద్దుపోయాక వస్తున్నారు. దీనితో పని వేళలలో అనూహ్యమైన మార్పులు వచ్చాయి. ఇవేవీ, ఈ తరం వాళ్లు కొని తెచ్చుకున్నవి కాదే?

3. ఇది వరకు సమాజంలో భద్రత ఉండేది, పిల్లలు రోడ్లపైకి వెళ్లి ఆడుకునేందుకు వీలుగా ట్రాఫిక్ తక్కువ ఉండేది, ఆడపిల్లలపై అత్యాచారాలు తక్కువగా ఉండేవి. అందుకని, హాయిగా పిల్లలు రోడ్ల మీద ఆడుకునే వాళ్లు. ఇప్పుడు జనాభా పెరిగింది, రోడ్లు పెరగలేదు, ఆట స్థలాలు ఆక్రమించబడ్డాయి. పిల్లల భద్రత కోసం వారిని తల్లిదండ్రులు బయటికి పంపించటం లేదు. ఇది నేటి తరం కొని తెచ్చుకున్నది కాదే?

4. ఇది వరకు ఒక్క దూరదర్శన్ మాత్రమే ఉండేది, సెల్ ఫోన్లు లేవు, ఇంటర్నెట్ లేదు, ఇన్ని రకాల పరికరాలు లేవు. కాబట్టి పిల్లలకు ఆటలు, ఇతరులతో కలిసే అవకాశం ఉండేది. ఇప్పుడో? వందల చానెళ్లు, వందల పరికరాలు, దానిలో పిల్లల సమయాన్ని హరించే లక్షల ఆటలు, పాటలు. దీనిలో నేటి తల్లిదండ్రులకు పాత్ర ఉంది. వారు నియంత్రణలో పెట్టవచ్చు, కానీ చేయటం లేదు.

5. ఒక తరం క్రితం, పిల్లలకు చదువులు -> ఉద్యోగాలు -> ఆర్థిక భద్రత అనే దాని మీదికి విపరీతమైన ఫోకస్ వచ్చి వ్యక్తిత్వ వికాసాన్ని వదిలేశారు. అంటే, మాకు డబ్బు లేదు, మా పిల్లలు చదువుకొని సంపాదించాలి అని ఆ తరం తల్లిదండ్రులు పిల్లలను చదువుల్లోనే ఉంచి,మిగితావి పక్కన పెట్టారు. దానితో ఎదిగే పిల్లల వ్యక్తిత్వ వికాసం జరగలేదు. కేవలం మార్కుల్లో మాత్రమే వారి ప్రతిభ. ఈ జాడ్యం నేడు, వికృతమై నారాయణ/చైతన్య వంటి కమర్షియల్ విద్యాసంస్థలకు జన్మనిచ్చింది. ఇక పిల్లలకు వ్యక్తిత్వ వికాసమే లేదు. దీనికి క్రిందటి తరం తల్లిదండ్రులే బాధ్యులు. నేటి తరం తల్లిదండ్రులు కళ్లు తెరిచి సరిదిద్దాలి.

6. ఇది వరకు అన్ని ఉద్యోగాలూ ఫైళ్లు చూడటం, రాయటం. అలాగే కార్మిక వర్గంలో ఎక్కువగా లేచి తిరిగి శరీరానికి పని పెట్టే ఉద్యోగాలు ఉండేవి. ఇప్పుడు అలా కాదు. అన్ని ఉద్యోగాలూ కంప్యూటర్ మీద చేసేలా మారాయి. కంప్యూటర్ ఉద్యోగాలు పెరిగాయి. ఇవి సిట్టింగ్ జాబ్స్ కావటం, సరైన పద్ధతిలో కూర్చోకపోవటం వలన వెన్నెముక్ సమస్యలు, ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. వీటికి ఉద్యోగులు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో వాళ్లు కూడ తోడ్పడి ప్రోత్సహించాలి.

మొత్తం మీద, క్రిందటి తరం తల్లిదండ్రులు పరిస్థితులను కాస్త అర్థం చేసుకోవాలి. తమ పిల్లలు ఎందుకు ఈ స్థితిలో ఉన్నారో గ్రహించి దానికి కారణాలను కనుక్కొని వీలైనంత సహాయకరంగా ఉండాలి. ఊరికే పక్కవారితో ఆడిపోసుకుంటే వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. మారిన తరంతో పాటు మారిన పరిస్థితులు. అంతే. ఇది తెలుసుకుంటే తరాల మధ్య అంతరాలు రావు.

4, ఫిబ్రవరి 2016, గురువారం

శ్రీశ్రీ రచన - సీతాకళ్యాణ హరికథ - వాగ్దానం (1961)


హరికథ భారతీయ కళలలో ఒక ప్రముఖమైన స్థానం కలిగి ఉండేది. 19వ శతాబ్దంలో ఆదిభట్ల నారాయణదాసు గారి పుణ్యమా అని వికసించిన ఈ కళ ఆంధ్రప్రాంతంలో బాగా ప్రాచుర్యం పొందింది. అలాగే కన్నడ, తమిళ, మరాఠీ ప్రాంతాలలో హరికథలు 19వ శతాబ్దంలో బాగా ప్రాచుర్యం చెందాయి. ధర్మ ప్రచారానికి, ఆధ్యాత్మిక వైభవానికి హరికథలు సాధనాలుగా నిలిచాయి. ఉత్తరాదిన ఇప్పటికి కూడా హరికథ ప్రజల జీవితంలో అంతభాగం. మరి ఏమిటి హరికథలో ప్రత్యేకత? సంగీతం, సాహిత్యం, భక్తి, భాగ్వత కథలు, కాస్తంత ఆహార్యం..ఇవి సమపాళ్లలో మేళవించి కథను చక్కగా విశదీకరించే ప్రక్రియ. దీనిలో భాషకు, వాక్శుద్ధికి, గాత్ర సౌలభ్యానికి, పురాణేతిహాసముల జ్ఞానానికి చాలా ముఖ్యమైన స్థానం ఉంది. హరికథలు సమాజంలో ప్రజలకు ధర్మ బోధతో పాటు జ్ఞాన వైరాగ్యాలను అందిస్తాయి. అటువంటి కళను చలన చిత్రాలలో చాలా తక్కువగా ఆవిష్కరించారు. అందుకు కారణం హరికథకు సమయం ఎక్కువ కావాలి, చలనచిత్రానికి పరిమితమైన సమయం. అయినా కూడా, కొంతమంది మహానుభావులు ఈ కళను తెరకెక్కించే ప్రయత్నం చేశారు. తెలుగు సినీ స్వర్ణయుగంలో జరిగిన అటువంటి ప్రయత్నమే 1961లో విడుదలైన వాగ్దానం చిత్రంలోని సీతాకళ్యాణ హరికథ.

దర్శకులు ఆత్రేయ అద్భుతంగా సామాజిక కథాంశంలో సీతారామ కళ్యాణం కథను గీత రూపంలో చిత్రీకరించారు. నాగేశ్వరరావు, కృష్ణకుమారిలపై ఎంతో అర్థవంతంగా ఈ హరికథా గీతాన్ని చిత్రీకరించారు. కథకులుగా రేలంగి, వాద్యసహకారం పాత్రలలో సూర్యకాంతం, పద్మనాభంలను పాత్రధారులను చేశారు. ఈ హరికథకు మూలస్థంభాలు శ్రీశ్రీ గారి సాహిత్యం, పెండ్యాల నాగేశ్వరరావు గారి సంగీతం, ఘంటసాల మాష్టారు గానం.

శ్రీశ్రీ అనగానే విప్లవ సాహిత్యం అనుకున్నారా? ఆయన విప్లవానికి ముందు అనేక రకాల రచనలు చేశారు. వాటిలో సీతాకళ్యాణ హరికథ అగ్రస్థానంలో నిలుస్తుంది. వారు యోగి అనటానికి ఈ పాట ఒక మంచి ఉదాహరణ. గణపతి ప్రార్థనతో మొదలయ్యే ఈ గీతం, అద్భుతమైన వచన మరియు పద్య సాహిత్యంతో విరబూసింది. సాహిత్యం పరిశీలిద్దాం:

శ్రీనగజా తనయం సహృదయం
చింతయామి సదయం త్రిజగన్మహోదయం

శ్రీరామ భక్తులారా! ఇది సీతాకళ్యాణ సత్కథ. నలభైరోజులనుంచీ చెప్పిన కథ చెప్పిన చోట చెప్పకుండా చెప్పుకు వస్తున్నాను. అంచేత కించిత్ గాత్ర సౌలభ్యానికి అభ్యంతరం ఏర్పడినట్లు తోస్తున్నది. నాయనా కాస్త పాలు మిరియాలు ఏమైనా...

చిత్తం! సిద్ధం!

భక్తులారా! సీతామహాదేవి స్వయంవరానికి ముల్లోకాలనుంచీ విచ్చేసిన వీరాధివీరులలో అందరినీ ఆకర్షించిన ఒకే ఒక దివ్య సుందరమూర్తి,ఆహా! అతడెవరయ్యా అంటే -

రఘురాముడు రమణీయ వినీల ఘనశ్యాముడు రమణీయ వినీల ఘనశ్యాముడు
వాడు నెలరేడు సరిజోడు మనగాడు
వాని కనులు మగమీలనేలురా వాని నగవు రతనాల జాలురా
వాని కనులు మగమీలనేలురా వాని నగవు రతనాల జాలురా
వాని జూచి మగవారలైన మైమరచి మరుల్కొనెడు మరోమరుడు మనోహరుడు రఘురాముడు


సనిదని సగరిగరిరిగ రిసగ రిరిగ రిసగ గరిసనిద రిస గగరి సని దని రిస నిద రిస నిద నిదపమ గరి రఘురాముడు

సనిస సనిససగరిరిగ రిసనిసనిస పదనిస సనిగరిసనిస సనిరిసనిదని నిదసనిదపమ గమద
ని ని ని ని ని ని ని ని ప స ప స ప స ప స  స ప స ప స ప త ధీం తరికిటతక రఘురాముడు రమణీయ వినీల ఘనశ్యాముడు


సెహభాష్ శభాష్.

ఆ ప్రకారంబుగా విజయం చేస్తున్న శ్రీరామచంద్రమూర్తిని అంతఃపుర గవాక్షమునుండి సీతాదేవి ఓరకంట చూచినదై చెంగటనున్న చెలికత్తెతో,

ఎంత సొగసుగాడే ఎంత సొగసుగాడే మనసింతలోనే దోచినాడే
మోము కలువరేడే మోము కలువరేడే నా నోము ఫలము వీడే
శ్యామలాభిరాముని జూడగ నా మది వివశమాయె నేడే ఎంత సొగసుగాడే

ఇక్కడ సీతాదేవి ఇలా పరవశయై ఉండగా,
అక్కడ స్వయంవర సభామంటపంలో జనక మహీపతి సభాసదులను జూచి:

అనియెనిట్లు ఓ యనఘులార నా యనుగు పుత్రి సీత
వినయాబ్ధిక సద్గుణ వ్రాత ముఖ విజిత లలిత జలజాత
ముక్కంటి వింటి నెక్కిడ జాచిన ఎక్కటి జోదును నేడు
మక్కువ మీరగ వరించి మల్లెల మాల వైచి పెండ్లాడు

అని ఈ ప్రకారం జనక మహారాజు ప్రకటించగానే సభలోని వారందరూ ఎక్కడి వారక్కడ చల్లబడిపోయారట. మహావీరుడైన రావణాసురుడు కూడా - "హా! ఇది నా ఆరాధ్య దైవమగు పరమేశ్వరుని చాపము. దీనిని స్పృశించుటయే మహాపాపము" అని అనుకొనిన వాడై వెనుదిరిగిపోయాడట.

తదనంతరంబున,

ఇనకుల తిలకుడు నిలకడ గల క్రొక్కారు మెరుపు వలె నిల్చి
తన గురువగు విశ్వామిత్రుని ఆశీర్వాదము తలదాల్చి
సదమల మదగజ గమనముతోన స్వయంవర వేదిక నెంచ
మదన విరోధి శరాసనమును తన కరమున బూనిన యంత

ఫెళ్లు మనె విల్లు గంటలు ఘల్లు మనె
గుభిల్లు మనె గుండె నృపులకు ఝల్లుమనియె జానకీ దేహము

ఒక నిమేషమ్మునందె నయము జయమును భయము విస్మయము కదురా

శ్రీమద్రమారమణ గోవిందో హరి

భక్తులందరూ చాలా నిద్రావస్థలో ఉన్నట్టుంది, మరొక్కసారి జై శ్రీమద్రమారమణ గోవిందో హరి

భక్తులరా ఆ విధముగా శ్రీరామచంద్రమూర్తి శివధనుర్భంగము గావించినాడు. అంతట,

భూతలనాథుడు రాముడు ప్రీతుండై పెండ్లియాడే
పృథుగుణమణి భాగ్యోపేతన్ సీతన్
భూతలనాథుడు రాముడు ప్రీతుండై పెండ్లియాడే

శ్రీమద్రమారమణ గోవిందో హరి

సాహితీ సౌరభం:

ఈ హరికథా గీతంలో శ్రీశ్రీ గారు గణపతి స్తుతి, శ్రీరాముని రూపవర్ణన, సీతాదేవి మనోభీష్టం, జనకమహారాజు మనోగతం, శివధనుర్భంగం, సీతారామ కళ్యాణం ఘట్టాలను వచన పద్య రూపాలలో అందించారు. హరికథలో కథకుడు భక్తులతో నిరంతరం అనుసంధానమై ఉండటం చాలా ముఖ్యం. అందుకే కాస్త హాస్యం కూడ కథకులు జోడిస్తారు, మధ్య మధ్యలో నామస్మరణ చేయిస్తారు. ఇది ఆంధ్ర ప్రాంతంలోని హరికథలలోనే కాదు, యావద్భారతావనిలో జరిగే హరికథా కార్యక్రమాలలో తప్పనిసరిగా ఉండే అంశం. శ్రీశ్రీ గారు అందుకే శ్రీమద్రమారమణ గోవిందో హరి అని అక్కడక్కడ జోడించారు.

ఇక ముఖ్యమైన ఘట్టలకు వస్తే, శ్రీరాముని వర్ణనలో తెలుగు పదాలను అసమానమైన రీతిలో గుప్పించారు. ఆ రాముని అందాన్ని వర్ణించటంలో అంతే అందమైన పదాలను ఉపయోగించారు. రమణీయ వినీల ఘన శ్యాముని ఆవిష్కరణలో చంద్రునితో పోల్చటం, ఆయన కనులను చేపలుగా, ఆయన నవ్వితే రత్నాలు జాలువారినట్లు, ఆ రాముని చూసి మగవారు సైతం మైమరచి మోహించేలా ఉన్న ఇంకో మన్మథుడా అన్నట్లు మనసులను దోచుకున్నాడట.ఈ చరణంలో అద్భుతమైన సంగీత ప్రతిభను పెండ్యాల వారు ప్రదర్శించారు. మంచి స్వరాలతో హుషారుగా సాగించేలా చేశారు. దానికి తగిన నటనతో రేలంగి గారు, గాత్రంతో ఘంటసాల గారు రక్తి కట్టించారు.

ఇక రెండవ ఘట్టం - సీతాదేవి రాముని చూడటం. సీతమ్మ అంతఃపురం కిటికీలోనుండి రాముని చూసి తన మనుసును అతనికి అర్పించి ఆతని ముఖము కలువల రాజైన చంద్రునిగా, తన నోము ఫలముగా భావించింది. ఆ శ్యామసుందరుని జూసి ఆమె మనసు వివశమైంది. శ్రీశ్రీ గారి పాండితీ ప్రతిభ ఈ ఘట్టంలో కూడా ప్రస్ఫుటంగా కనబడుతుంది.

తరువాతి ఘట్టం జనకమహారాజు సీతాస్వయంవరం కోసం తీర్చిన కొలువులో. జనకుని మనసులో ఉన్న సందేహము, ఆతృత ఆయన మాటలలో ఎలా ఉండాలో పరిపూర్ణంగా చెప్పారు శ్రీశ్రీ గారు. "ఓ పుణ్యాత్ములారా! నా ప్రియ పుత్రిక సీత వినయలక్షణ సంపన్నమైనది, సద్గుణములు కలిగినది, అన్ని విద్యలు నేర్చినది, శ్రీమహాలక్ష్మి. ఆమె విధంగా అంది - ఈ శివధనుస్సును ఎక్కుపెట్టిన వీరుని నేను ప్రేమతో వరించి మల్లెల మాల వేసి పెండ్లాడెదను"

తరువాత ఘట్టం రాముడు శివధనుర్భంగము చేయటం. శ్రీశ్రీ గారు ఇక్కడ మంచి పద్యాన్ని అందించారు. సూర్యవంశ తిలకుడు అయిన రాముడు తొలకరిలో వచ్చే మెరుపులాగా నిలబడి, గురువగు విశ్వామిత్రుని ఆశీర్వాదం పొంది మిక్కిలి నిర్మలమైన మదపుటేనుగు లాగా నడుస్తూ స్వయంవర వేదికకు చేరుకున్నాడు. మదనుని శత్రువైన శివుని ధనుస్సును ఎత్తి ఎక్కుపెట్టపోగా అది ఫెళ్లు మని విరిగింది. అక్కడ ఉన్న రాజులకు గుండె గుభిల్లుమంది. సీతమ్మకు ఒళ్లు ఝల్లుమంది. సభలో ఒకే సమయములో సిగ్గు, విజయ హాసం, భయము, ఆశ్చర్యము అనే భావనలు అక్కడి వారిలో కలిగాయిట. సీతమ్మకు సిగ్గు, రామయ్యకు విజయ భావన, మిగిలిన రాజులకు భయము, కొందరికి ఆశ్చర్యము...శ్రీశ్రీ గారు చేసిన పదప్రయోగం అపూర్వం.

ఇక తరువాత సీతారాముల కళ్యాణము..మంగళము..

శ్రీశ్రీ గారు చేసిన ఈ అనుపమానమైన, అరుదైన రచన తెలుగు సినీరంగానికే వన్నె తెచ్చింది. తరువాత 2-3 హరికథా ప్రయత్నాలు చలన చిత్రాలలో జరిగాయి. కే విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన స్వాతిముత్యం చిత్రంలో బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన సీతారామ కళ్యాణం బాగా పండింది. సూత్రధారులు చిత్రంలో సుశీలమ్మ పాడిన రుక్మిణీ కళ్యాణం పరవాలేదు అనిపించింది. ఈ సీతాకళ్యాణ హరికథను కానడ, శంకరాభరణం, తోడి, కేదారగౌళ, శ్రీ, కళ్యాణి రాగాలలో రాగమాలికగా అందించారు పెండ్యాల వారు. సంగీత, సాహిత్య, నటనా సుగంధాలతో ఈ గీతం ఇప్పటికీ మనలను అలరిస్తూనే ఉంది. 

పులకించని మది పులకించు - మనసుకవి ఆత్రేయ భావసంపద


మానవ జీవితంలో సంగీతానికి, అందులో పాటకు ఎంతో గొప్ప స్థానం ఉంది. శిశువులు, పశువులు, పాములు సంగీతానికి స్పందిస్తాయి. మనసులోని ఎటువంటి భావాలైనా వ్యక్తపరచటానికి అత్యద్భుతమైన సాధనం గానం. గానానికి ఉన్న ఈ మహత్తును మనసుకవి ఆత్రేయ కన్నా ఎవరు గొప్పగా రాయగలరు? ప్రేమ చిగురించిన ఓ వనిత ఆ ప్రియుని కోసం పాడే జోలపాటగా ఈ గీతాన్ని ఆవిష్కరించారు. 1960 సంవత్సరంలో విడుదలైన పెళ్లికానుక చిత్రంలో జిక్కి గారు అద్భుతంగా పాడిన గీతం పులకించని మది పులకించు. కృష్ణకుమారిపై చిత్రీకరించబడిన ఈ గీతం పాట యొక్క విశిష్టను పరిపూర్ణంగా ఆవిష్కరించింది. ఆత్రేయగారి పద సౌందర్యం, భావసంపద అనుపమానం. ఆత్రేయ గారి మనోకమలాన్ని పరిశీలిద్దాం:

పులకించని మది పులకించు
వినిపించని కథ వినిపించు
అనిపించని ఆశల యెంచు 
మనసునే మరపించు గానం మనసునే మరపించు                           

రాగమందనురాగమొలికి రక్తి నొసగును గానం
రేపు రేపను తీపికలలకు రూపమిచ్చును గానం
చెదరిపోయే భావములను చేర్చి కూర్చును గానం
జీవమొసగును గానం మది చింత బాపును గానం   
                                      
వాడిపోయిన పైరులైనా నీరుగని నర్తించును
కూలిపోయిన తీగలైనా కొమ్మలలమి ప్రాకును
కన్నెమనసు ఎన్నుకొన్న తోడు దొరికిన మురియు
దోరవలపే కురియు  మది దోచుకొమ్మని తెలుపు  
                             
మనసునే మరపించు ప్రేమ మనసునే మరపించు

ప్రేయసీ ప్రియుల ప్రేమలో పవిత్రతకు నాంది వారి విలువలు. ఆ విలువలకు మూలం సంస్కారం. మంచి సంస్కారం ఒక యువతి మనసులో ప్రేమను ఎంత అందంగా చిగురింపజేస్తుందో గమనించండి. ప్రేమ భావన కలిగిన మనసు పాటగా పులకిస్తుంది. ఇది వరకు ఎన్నడూ వినిపించని కథను వినిపిస్తుంది. అంతకు మునుపు అనిపించని ఆశలను లెక్కిస్తుంది. అదీ ఆ గానం యొక్క గొప్పతనం. రాగంలో అనురాగాన్ని ఒలికిస్తూ రక్తిని కలిగిస్తుంది. ప్రేమ వలన రేపటి కోసం ఎదురుచూసే తీయని భావనకు రూపమిస్తుంది. ప్రేమ చిగురించిన తరుణంలో చెదరిపోతున్న భావాలను చేర్చి కూర్చి జీవాన్ని ఇస్తుంది. చింతను తొలగిస్తుంది. ఇది ఆత్రేయగారి కవితాశైలికి చిహ్నం.

కవి తన అద్భుతమైన భావ ఝరిని రెండో చరణంలో మరింత అందంగా ఆవిష్కరించారు. వాడిపోయిన పైరులు కూడా నీరు దొరకగానే నర్తిస్తాయిట. కూలిపైన తీగలు కూడా కొమ్మల సాయంతో వాటికి చుట్టుకొని పాకుతాయిట. కన్య తన మనసు ఎన్నుకొన్న తోడు దొరికితే మురుస్తుంది. లేత వలపులు కురిపిస్తుంది, ఆ వలపులు దోచుకోమని సంకేతాలు చేస్తుంది. ఇవన్నీ ప్రేమ వల్ల కలిగినవే. ఆ ప్రేమ మనసునే మరపిస్తుంది.

రెండవ చరణంలో ఆత్రేయగారు ప్రేమ, మనసు, ఆశలు చిగురించటం, వాటిని ప్రకృతిలో వచ్చే మార్పులతో పోల్చటం ఎంత హృద్యంగా మన ముందుంచారో గమనించండి. స్త్రీపురుషులు మధ్య చిగురించే ప్రేమకు ప్రకృతిలో వచ్చే మార్పులే సామ్యాలు. ఆ మార్పులకు మనస్సు పలికితే? అదే ఇటువంటి మనోజ్ఞమైన గీతం. అందుకే ఆత్రేయ గారు మనసుకవిగా చిరస్మరణీయులు.

ఇక గీతానికి ప్రాణవాయువులు సంగీతం, గానం. ఏఎంరాజా గారు మంచి గాయకులు అని మనకు తెలుసు. ఆయన సంగీత దర్శకత్వం కూడా వహించారు. ఈ చిత్రాన్ని తొలుత తమిళంలో కల్యాణ పరిసు అని తీసారు. దానికి కూడా రాజా గారే సంగీతం, ఈ పాట తుళ్లాదు మనముల్ తుళ్లుం సొల్లాద కదింగల్ సొల్లుం అని పట్టుకొట్టై కళ్యాణసుందరం గారు రచించగా జిక్కి గారే పాడారు. తరువాత తెలుగులో తీసారు. తమిళంలో జెమినీ గణేశన్, సీఆర్ విజయకుమారి గార్ల మీద చిత్రీకరించగా, తెలుగులో ఏఎన్నార్, కృష్ణకుమారి గార్ల మీద తీశారు. రెండు చిత్రాలు, వాటిలోని పాటలు అద్భుతమైన విజయాన్ని సాధించాయి. జిక్కి గారి జీవితంలో ఈ పాట కలికితురాయిగా నిలిచింది. 

మాతృదేవోభవ పితృదేవోభవ!

మాతృదేవోభవ పితృదేవోభవ!


ఏడుపే మాటలైన సమయంలో తన శక్తిని పాలుగా ఇచ్చేది అమ్మ
తడబడే అడుగులు వేసేటప్పుడు చేయి పట్టి నడిపించే వాడు నాన్న

ప్రతిరోజూ లెక్కతప్పకుండా బడికి బాక్సులు తయారు చేసేది అమ్మ
బడికి టైం అయిపోతుంటే షూస్ పాలిష్ చేసి తొడిగించేవాడు నాన్న

చిందరవందరగా ఉన్న పుస్తకాలు బ్యాగులో నీటుగా సర్దేది అమ్మ
పెన్సిళ్లు ముక్కులు విరిగిపోతే చెక్కి బాక్సులో పెట్టేవాడు నాన్న

ఇంటికి రాగానే నీ ఆకలి తీర్చి నీ మురికిని వదిలించేది అమ్మ
బద్ధకాన్ని వదిలించి క్రమశిక్షణతో ముందుకు నడిపేవాడు నాన్న

విలువకట్టలేని విలువలను నిరంతరం అందించే దైవం అమ్మ
అపజయాలలో నిన్ను ప్రోత్సహించి ఉత్సాహపరచే వాడు నాన్న

అలుపు లేకుండా ఏళ్ల తరబడి ఉచిత సేవ చేసిన వాళ్లకు నువ్వు చేసేది ఉపకారమా?
నిస్స్వార్థంతో నీకోసం జీవించి అలసి ఒడలిన వారికి నువ్వు ఇవ్వగలిగేది ఒంటరితనమా? 

ఈనాటి నీ స్వార్థం రేపటి నీ దుఃఖం 
ఈనాటి నీ ధర్మం రేపటి నీ సాంత్వన

ఈనాటి నీ ఓర్పు రేపటి నీ రక్షణ
ఈనాటి నీ త్యాగం రేపటి నీ సంపద

మాతృదేవోభవ పితృదేవోభవ!

3, ఫిబ్రవరి 2016, బుధవారం

పనీర్ టిక్కా

పనీర్ టిక్కా 






స్టార్టర్స్ లేదా స్నాక్స్‌గా పనీర్ టిక్కా బాగుంటుంది. దీనికి గ్రిల్ అవసరం లేదు. పెనం మీద లేదా నాన్ స్టిక్ ప్యాన్ మీద చేసుకోవచ్చు.పనీర్‌తో పాటు క్యాప్సికం, ఉల్లిపాయ, పైన్ ఆపిల్, కార్న్ (మొక్క జొన్న కంకి), కాలీ ఫ్లవర్, టమాటో, బంగాళా దుంప ఇలా ఎన్నో కూరలను ఇందులో వాడుకోవచ్చు.

కావలసిన పదార్థాలు:

పనీర్ 1-1/2 అంగుళాల వెడల్పున్న పెద్ద ముక్కలు
క్యాప్సికం 1-1/2 అంగుళాల వెడల్పున్న పెద్ద ముక్కలు
చెక్కు తీసిన పైన్ యాపిల్ 1-1/2 అంగుళాల వెడల్పున్న ముక్కలు
తగినంత పెరుగు
తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్
ఎండు కారం
ఉప్పు
కొత్తిమీర (తరిగి గ్రైండ్ చేసినది)
కస్తూరి మెంతి (మెంతి ఆకులను ఎండబెడితే వచ్చేది)
గరం మసాలా
చాట్ మసాలా
నూనె
టూత్‌పిక్స్

తయారు చేసే పద్ధతి:





ముందుగా పెరుగులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, ఎండు కారం, కొత్తిమీర పేస్ట్, గరం మసాలా, చాట్ మసాలా, కస్తూరి మెంతి, కొద్దిగా నూనె వేసి బాగా కలపాలి. ఉప్పు కారం మసాలాలు మీ రుచికి తగ్గట్టుగా వేసుకోవాలి. ఈ పెరుగు మిశ్రమంలో పనీర్, క్యాప్సికం, పైన్ ఆపిల్ ముక్కలు వేసి ఒక సారి కలియతిప్పి అరగంటసేపు అలా ఉంచాలి. అప్పుడు ఆ డ్రెస్సింగ్‌లోని రుచులు ముక్కలకు పడతాయి. అరగంట తరువాత టూత్‌పిక్ తీసుకొని ఒక పనీర్ ముక్క, ఒక క్యాప్సికం ముక్క, ఒక పైన్ ఆపిల్ ముక్క దాని గుచ్చాలి. ఇలా మిగిలిన ముక్కలను వేర్వేరు టూత్‌పిక్స్‌లకు గుచ్చి పెట్టుకోవాలి. ఇప్పుడు పెనం/నాన్ స్టిక్ ప్యాన్ మీద నూనె వేసి అది వేడి అయిన తరువాత ఈ ముక్కలున్న టూత్‌పిక్స్‌లను అందులో ఉంచాలి. ముక్కలు మాడ కుండా గమనిస్తూ రంగు మారుతున్నప్పుడు మరో పక్క తిప్పాలి. అన్నివైపులా రంగు మారిన తరువాత వాటిని తీసి ప్లేట్లో ఉంచుకోవాలి. వీటిని ఏ చట్నీ లేకుండా తినవచ్చు. కావలసిన వాళ్లు కాస్త పెరుగు, సన్నగా కోసిన పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఉప్పు వేసి చట్నీ చేసుకొని దానితో తినవచ్చు. టిక్కాలను వేడి వేడిగానే తినాలి. చల్లారితే బాగుండవు.

29, జనవరి 2016, శుక్రవారం

గుళ్లో రామాయణాలు - 6

 గుళ్లో రామాయణాలు - 6



సాయినగర్‌లోని షిర్డీ సాయి గుడి ఆ కాలనీ వాసుల మంచి నిర్వహణతో బాగా పేరొందింది. నిజాయితీతో కమిటీ మెంబర్లు సాయినాథునికి రోజూ పూజలు, భక్తులకు సంతృప్తికరంగా చేయిస్తున్నారు. కమిటీలో దైవభక్తి కలిగిన రిటైర్డ్ ఉద్యోగులతో పాటు ఓర్పు,సామర్థ్యం కలిగిన మహిళలు కూడా ఉన్నారు. రెండేళ్లలో గుడి ఆదాయం బాగా పెరిగింది. ఆ గుడిపై అక్కడి స్థానిక రాజకీయ గూండాల కళ్లు పడ్డాయి. కమిటీ మెంబర్లను పిలిచారు.

"ఈ గుడి కమిటీకి మా పార్టీవోళ్లు ప్రెసిడెంటుగా ఉండాల. మేము దీన్ని మస్తు డెవలప్ చేస్తం. మా భిక్షపతన్న ఐతే మంచిగుంటది...." అని మాజీ కార్పొరేటర్ భిక్షపతిని ప్రెసిడెంటుగా చేయాలని ఒత్తిడి. ఎదిరించిన కమిటీ సభ్యులను బెదిరించటం, గుడి తాళాలు పగల గొట్టటం, హుండీలో డబ్బులు దోచుకోవటానికి ప్రయత్నాలు...

ఎవరా భిక్షపతి? పచ్చి గూండా. తాగుబోతు, భార్యను హింసించేవాడు, తల్లిదండ్రులను కాళ్లతో తన్నేవాడు. లేని అలవాటు లేదు. అధికార పార్టీలో సభ్యుడు.

కమిటీ సభ్యులు రాజకీయ ఒత్తిడికి తలవంచక తప్పలేదు. మొదలైంది గుళ్లో అధర్మం.

"మా బిడ్డ పుట్టినరోజు రేపు సండే. పొద్దుగాల అభిషేకం మేము జేస్తం, దర్శనం బంద్ చేయండి..." - పూజారికి బెదిరింపులు. భయంతో పూజారి తలవంచక తప్పలేదు. ఆరోజు ఉదయం దర్శనం బంద్. భక్తులకు అశాంతి.

"దసరారోజు సాయిబాబా సమాధి. దానికి పిల్లల చేత సాయి చరిత్ర నృత్య నాటిక ప్రదర్శిద్దాము..." అని పాపం ఒక కమిటీ సభ్యురాలు ప్రతిపాదన...

"గవన్నీ ఎందుకు. సినిమాపాటలు బెట్టి హుషారుగ డ్యాన్స్ ప్రోగ్రాం పెట్టిపిద్దం..."

ప్రతియేడాది సాయి సమాధి ఉత్సవాలు ఎంతో పవిత్రంగా జరిగేవి. ఎవరికీ ఎటువంటి అసౌకర్యం లేకుండా ఉండేది. ఈ యేడాది మైకులు, లౌడు స్పీకర్లలో రణగొణ ధ్వనులు...ప్రజలలో అసహనం పెరిగిపోతోంది. గుడి అంటే గౌరవం తగ్గిపోతోంది.దశమి నాడు ఒక వంద కార్లతో ఆ భిక్షపతి పార్టీ నాయకులు వచ్చారు. రెండు గంటల పాటు ట్రాఫిక్ జాం, మైకులో స్పీచులు. భగవంతుడు గురించి కాదు...వాళ్ల వాళ్ల స్వోత్కర్షలు...

గుడికి అన్నివైపులా తోరణాలు, పూమాలలు, లైట్లు మాత్రమే ఉండేవి. ఈ యేడాది, వీటన్నిటినీ కనుమరుగు చేసి భిక్షపతి, అనుచరుల ఫ్లెక్సీలు, సాయినాథునితో నించున్నట్లు, సాయినాథుడు ఆశీర్వదిస్తున్నట్లు, రకరకాల భంగిమలలో...వికారం పుట్టించేలా.

అన్నీ సాయినాథుడు గమనిస్తూనే ఉన్నాడు. 

28, జనవరి 2016, గురువారం

గుళ్లో రామాయణాలు - 5

గుళ్లో రామాయణాలు - 5


రామాపురం గ్రామం పురాతనమైన రామాలయం. కృష్ణదేవరాయల కాలంలో కట్టిందిట. ఆ స్థంబాలు, ఆకృతులు, మూర్తులు చూస్తే అర్థమవుతుంది. కానీ, గుడిలో దీపం పెట్టే దిక్కు లేదు, నైవేద్యానికి అంతకన్నా దిక్కు లేదు. పూజారి వారానికొకసారి పక్క ఊరినుండి తన ఇష్టం ఉంటే వస్తాడు. లేకపోతే లేదు. ఆయన ఐదు ఊళ్ల పూజారి.

ఊళ్లో పెద్దయ్య ఉండబట్టలేక కలెక్టరు దగ్గరకు వెళ్లాడు:

"అయ్యా! మన రామాపురంలో రామాలయం, వారానికి ఒక సారి కూడా తెరిచి ఉంచట్లేదు. మా పెద్దలు ఈ ఆలయం ఎంతో మహిమాన్వితమైనదని చెప్పేవారు..."

"అదేంటండీ! పూజారి రోజూ పూజలు, నివేదనలు చేస్తున్నట్లు వీఆర్వో రికార్డులు ఉన్నాయి. చూడండి...ఊరకే నా సమయాన్ని వృథా చేయకండీ" అని రికార్డులు పెద్దయ్య ముందుంచాడు.

నిర్ఘాంతపోయాడు పెద్దయ్య. అందులో, రామనవమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించినట్లు, దానికి లక్ష రూపాయలు ఖర్చు పెట్టినట్లు, లెక్కలు బిల్లులతో సహా ఉన్నాయి. నోట మాట రాక తిరిగి వచ్చాడు.

పూజారి, వీఆర్వోల అవినీతి ఆ రాముడు గమనిస్తూనే ఉన్నాడు.

తిమ్మాపురం గ్రామం:

"మంత్రి గారు! మన లలితా పరమేశ్వరి గుడిని పునరుద్ధరించాలి. అమ్మ ఈ గ్రామాన్ని కాపాడే దేవత. దానికి నిధులు విడుదలయ్యేలా కలెక్టరు గారికి చెప్పండీ!"...

"ఆ గుడి ప్రభుత్వం ఆధీనంలో లేదయ్యా. అయినా, మీ మీరు వాళ్లు నా పార్టీకి ఓటు వెయ్యలేదు. నేనెందుకు సాయం చేయాలి? ఊళ్లో ఉత్సవాలకు మమ్మల్ని పిలవరు, మా నాయకులను సత్కరించరు, డబ్బులకు మాత్రం మా దగ్గరికి వస్తారు. పోయి మీరు వోటేసిన ఆ ప్రతిపక్ష ఎమ్మెల్యేను అడగండి..." అని కసురుకున్నాడు.

దేవుడికి పార్టీలా? అంతా చూస్తూనే ఉంది ఆ పరమేశ్వరి.

హైదరాబాదులో ఒక కాలనీలో గుడి ప్రయత్నాలు:

అసోసియేషన్ ప్రతినిధులు కార్పొరేటర్ గారితో - "అయ్యా, మన ఎమ్మెల్యే గారిని కలిసి ఈ కాలనీ ప్రజలు కోరుతున్నట్లు ఈ సీతారాముల గుడిని కట్టించటానికి సాయం చేయండి.."

"సీతారాములతో పాటు, సాయిబాబా విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠిస్తేనే ఎమ్మెల్యే గారు నిధులు విడుదల చేయిస్తాడట. అయినా, సీతారాముల గుళ్లెందుకయ్యా! ఎవ్వరూ చిల్లి గవ్వ కూడా హుండీలో వేయరు! అదే సాయి బాబా గుడి అయితే నెలకు కొన్ని లక్షలు వస్తాయి...ఆలోచించండి..."

వెంటనే కాలనీ అసోసియేషన్‌లో రాజకీయాలు: అవును షిర్డీ సాయి విగ్రహం కూడా ఉండాలని కొందరు, లేదు ముందు తలచినట్లుగానే సీతారాముల గుడి అని ఇంకొందరు. నెలలపాటు ప్రతిష్ఠంబన, చివరకు ఆదాయం కోసం భయపడి షిర్డీ సాయిదే ప్రధాన విగ్రహం, పక్కన చిన్న రాముల వారి విగ్రహం.

సాయిబాబా...సీతారాముల మధ్య కూడా రాజకీయాలా? ఆదాయం కోసం గుళ్లా...అంతా ఆ పైవాడు గమనిస్తూనే ఉన్నాడు.

భక్త ప్రహ్లాద – 1967: పౌరాణిక కళాఖండం

భక్త ప్రహ్లాద తెలుగు చలనచిత్ర చరిత్రలో ఒకే ఇతివృత్తాన్ని కొత్త కాలపు సాంకేతికత, నటనా శక్తి, సంగీత వైభవం, నిర్మాణ విలువలతో పునర్నిర్మించిన వి...