RightClickBlocker

4, ఫిబ్రవరి 2016, గురువారం

శ్రీశ్రీ రచన - సీతాకళ్యాణ హరికథ - వాగ్దానం (1961)


హరికథ భారతీయ కళలలో ఒక ప్రముఖమైన స్థానం కలిగి ఉండేది. 19వ శతాబ్దంలో ఆదిభట్ల నారాయణదాసు గారి పుణ్యమా అని వికసించిన ఈ కళ ఆంధ్రప్రాంతంలో బాగా ప్రాచుర్యం పొందింది. అలాగే కన్నడ, తమిళ, మరాఠీ ప్రాంతాలలో హరికథలు 19వ శతాబ్దంలో బాగా ప్రాచుర్యం చెందాయి. ధర్మ ప్రచారానికి, ఆధ్యాత్మిక వైభవానికి హరికథలు సాధనాలుగా నిలిచాయి. ఉత్తరాదిన ఇప్పటికి కూడా హరికథ ప్రజల జీవితంలో అంతభాగం. మరి ఏమిటి హరికథలో ప్రత్యేకత? సంగీతం, సాహిత్యం, భక్తి, భాగ్వత కథలు, కాస్తంత ఆహార్యం..ఇవి సమపాళ్లలో మేళవించి కథను చక్కగా విశదీకరించే ప్రక్రియ. దీనిలో భాషకు, వాక్శుద్ధికి, గాత్ర సౌలభ్యానికి, పురాణేతిహాసముల జ్ఞానానికి చాలా ముఖ్యమైన స్థానం ఉంది. హరికథలు సమాజంలో ప్రజలకు ధర్మ బోధతో పాటు జ్ఞాన వైరాగ్యాలను అందిస్తాయి. అటువంటి కళను చలన చిత్రాలలో చాలా తక్కువగా ఆవిష్కరించారు. అందుకు కారణం హరికథకు సమయం ఎక్కువ కావాలి, చలనచిత్రానికి పరిమితమైన సమయం. అయినా కూడా, కొంతమంది మహానుభావులు ఈ కళను తెరకెక్కించే ప్రయత్నం చేశారు. తెలుగు సినీ స్వర్ణయుగంలో జరిగిన అటువంటి ప్రయత్నమే 1961లో విడుదలైన వాగ్దానం చిత్రంలోని సీతాకళ్యాణ హరికథ.

దర్శకులు ఆత్రేయ అద్భుతంగా సామాజిక కథాంశంలో సీతారామ కళ్యాణం కథను గీత రూపంలో చిత్రీకరించారు. నాగేశ్వరరావు, కృష్ణకుమారిలపై ఎంతో అర్థవంతంగా ఈ హరికథా గీతాన్ని చిత్రీకరించారు. కథకులుగా రేలంగి, వాద్యసహకారం పాత్రలలో సూర్యకాంతం, పద్మనాభంలను పాత్రధారులను చేశారు. ఈ హరికథకు మూలస్థంభాలు శ్రీశ్రీ గారి సాహిత్యం, పెండ్యాల నాగేశ్వరరావు గారి సంగీతం, ఘంటసాల మాష్టారు గానం.

శ్రీశ్రీ అనగానే విప్లవ సాహిత్యం అనుకున్నారా? ఆయన విప్లవానికి ముందు అనేక రకాల రచనలు చేశారు. వాటిలో సీతాకళ్యాణ హరికథ అగ్రస్థానంలో నిలుస్తుంది. వారు యోగి అనటానికి ఈ పాట ఒక మంచి ఉదాహరణ. గణపతి ప్రార్థనతో మొదలయ్యే ఈ గీతం, అద్భుతమైన వచన మరియు పద్య సాహిత్యంతో విరబూసింది. సాహిత్యం పరిశీలిద్దాం:

శ్రీనగజా తనయం సహృదయం
చింతయామి సదయం త్రిజగన్మహోదయం

శ్రీరామ భక్తులారా! ఇది సీతాకళ్యాణ సత్కథ. నలభైరోజులనుంచీ చెప్పిన కథ చెప్పిన చోట చెప్పకుండా చెప్పుకు వస్తున్నాను. అంచేత కించిత్ గాత్ర సౌలభ్యానికి అభ్యంతరం ఏర్పడినట్లు తోస్తున్నది. నాయనా కాస్త పాలు మిరియాలు ఏమైనా...

చిత్తం! సిద్ధం!

భక్తులారా! సీతామహాదేవి స్వయంవరానికి ముల్లోకాలనుంచీ విచ్చేసిన వీరాధివీరులలో అందరినీ ఆకర్షించిన ఒకే ఒక దివ్య సుందరమూర్తి,ఆహా! అతడెవరయ్యా అంటే -

రఘురాముడు రమణీయ వినీల ఘనశ్యాముడు రమణీయ వినీల ఘనశ్యాముడు
వాడు నెలరేడు సరిజోడు మనగాడు
వాని కనులు మగమీలనేలురా వాని నగవు రతనాల జాలురా
వాని కనులు మగమీలనేలురా వాని నగవు రతనాల జాలురా
వాని జూచి మగవారలైన మైమరచి మరుల్కొనెడు మరోమరుడు మనోహరుడు రఘురాముడు


సనిదని సగరిగరిరిగ రిసగ రిరిగ రిసగ గరిసనిద రిస గగరి సని దని రిస నిద రిస నిద నిదపమ గరి రఘురాముడు

సనిస సనిససగరిరిగ రిసనిసనిస పదనిస సనిగరిసనిస సనిరిసనిదని నిదసనిదపమ గమద
ని ని ని ని ని ని ని ని ప స ప స ప స ప స  స ప స ప స ప త ధీం తరికిటతక రఘురాముడు రమణీయ వినీల ఘనశ్యాముడు


సెహభాష్ శభాష్.

ఆ ప్రకారంబుగా విజయం చేస్తున్న శ్రీరామచంద్రమూర్తిని అంతఃపుర గవాక్షమునుండి సీతాదేవి ఓరకంట చూచినదై చెంగటనున్న చెలికత్తెతో,

ఎంత సొగసుగాడే ఎంత సొగసుగాడే మనసింతలోనే దోచినాడే
మోము కలువరేడే మోము కలువరేడే నా నోము ఫలము వీడే
శ్యామలాభిరాముని జూడగ నా మది వివశమాయె నేడే ఎంత సొగసుగాడే

ఇక్కడ సీతాదేవి ఇలా పరవశయై ఉండగా,
అక్కడ స్వయంవర సభామంటపంలో జనక మహీపతి సభాసదులను జూచి:

అనియెనిట్లు ఓ యనఘులార నా యనుగు పుత్రి సీత
వినయాబ్ధిక సద్గుణ వ్రాత ముఖ విజిత లలిత జలజాత
ముక్కంటి వింటి నెక్కిడ జాచిన ఎక్కటి జోదును నేడు
మక్కువ మీరగ వరించి మల్లెల మాల వైచి పెండ్లాడు

అని ఈ ప్రకారం జనక మహారాజు ప్రకటించగానే సభలోని వారందరూ ఎక్కడి వారక్కడ చల్లబడిపోయారట. మహావీరుడైన రావణాసురుడు కూడా - "హా! ఇది నా ఆరాధ్య దైవమగు పరమేశ్వరుని చాపము. దీనిని స్పృశించుటయే మహాపాపము" అని అనుకొనిన వాడై వెనుదిరిగిపోయాడట.

తదనంతరంబున,

ఇనకుల తిలకుడు నిలకడ గల క్రొక్కారు మెరుపు వలె నిల్చి
తన గురువగు విశ్వామిత్రుని ఆశీర్వాదము తలదాల్చి
సదమల మదగజ గమనముతోన స్వయంవర వేదిక నెంచ
మదన విరోధి శరాసనమును తన కరమున బూనిన యంత

ఫెళ్లు మనె విల్లు గంటలు ఘల్లు మనె
గుభిల్లు మనె గుండె నృపులకు ఝల్లుమనియె జానకీ దేహము

ఒక నిమేషమ్మునందె నయము జయమును భయము విస్మయము కదురా

శ్రీమద్రమారమణ గోవిందో హరి

భక్తులందరూ చాలా నిద్రావస్థలో ఉన్నట్టుంది, మరొక్కసారి జై శ్రీమద్రమారమణ గోవిందో హరి

భక్తులరా ఆ విధముగా శ్రీరామచంద్రమూర్తి శివధనుర్భంగము గావించినాడు. అంతట,

భూతలనాథుడు రాముడు ప్రీతుండై పెండ్లియాడే
పృథుగుణమణి భాగ్యోపేతన్ సీతన్
భూతలనాథుడు రాముడు ప్రీతుండై పెండ్లియాడే

శ్రీమద్రమారమణ గోవిందో హరి

సాహితీ సౌరభం:

ఈ హరికథా గీతంలో శ్రీశ్రీ గారు గణపతి స్తుతి, శ్రీరాముని రూపవర్ణన, సీతాదేవి మనోభీష్టం, జనకమహారాజు మనోగతం, శివధనుర్భంగం, సీతారామ కళ్యాణం ఘట్టాలను వచన పద్య రూపాలలో అందించారు. హరికథలో కథకుడు భక్తులతో నిరంతరం అనుసంధానమై ఉండటం చాలా ముఖ్యం. అందుకే కాస్త హాస్యం కూడ కథకులు జోడిస్తారు, మధ్య మధ్యలో నామస్మరణ చేయిస్తారు. ఇది ఆంధ్ర ప్రాంతంలోని హరికథలలోనే కాదు, యావద్భారతావనిలో జరిగే హరికథా కార్యక్రమాలలో తప్పనిసరిగా ఉండే అంశం. శ్రీశ్రీ గారు అందుకే శ్రీమద్రమారమణ గోవిందో హరి అని అక్కడక్కడ జోడించారు.

ఇక ముఖ్యమైన ఘట్టలకు వస్తే, శ్రీరాముని వర్ణనలో తెలుగు పదాలను అసమానమైన రీతిలో గుప్పించారు. ఆ రాముని అందాన్ని వర్ణించటంలో అంతే అందమైన పదాలను ఉపయోగించారు. రమణీయ వినీల ఘన శ్యాముని ఆవిష్కరణలో చంద్రునితో పోల్చటం, ఆయన కనులను చేపలుగా, ఆయన నవ్వితే రత్నాలు జాలువారినట్లు, ఆ రాముని చూసి మగవారు సైతం మైమరచి మోహించేలా ఉన్న ఇంకో మన్మథుడా అన్నట్లు మనసులను దోచుకున్నాడట.ఈ చరణంలో అద్భుతమైన సంగీత ప్రతిభను పెండ్యాల వారు ప్రదర్శించారు. మంచి స్వరాలతో హుషారుగా సాగించేలా చేశారు. దానికి తగిన నటనతో రేలంగి గారు, గాత్రంతో ఘంటసాల గారు రక్తి కట్టించారు.

ఇక రెండవ ఘట్టం - సీతాదేవి రాముని చూడటం. సీతమ్మ అంతఃపురం కిటికీలోనుండి రాముని చూసి తన మనుసును అతనికి అర్పించి ఆతని ముఖము కలువల రాజైన చంద్రునిగా, తన నోము ఫలముగా భావించింది. ఆ శ్యామసుందరుని జూసి ఆమె మనసు వివశమైంది. శ్రీశ్రీ గారి పాండితీ ప్రతిభ ఈ ఘట్టంలో కూడా ప్రస్ఫుటంగా కనబడుతుంది.

తరువాతి ఘట్టం జనకమహారాజు సీతాస్వయంవరం కోసం తీర్చిన కొలువులో. జనకుని మనసులో ఉన్న సందేహము, ఆతృత ఆయన మాటలలో ఎలా ఉండాలో పరిపూర్ణంగా చెప్పారు శ్రీశ్రీ గారు. "ఓ పుణ్యాత్ములారా! నా ప్రియ పుత్రిక సీత వినయలక్షణ సంపన్నమైనది, సద్గుణములు కలిగినది, అన్ని విద్యలు నేర్చినది, శ్రీమహాలక్ష్మి. ఆమె విధంగా అంది - ఈ శివధనుస్సును ఎక్కుపెట్టిన వీరుని నేను ప్రేమతో వరించి మల్లెల మాల వేసి పెండ్లాడెదను"

తరువాత ఘట్టం రాముడు శివధనుర్భంగము చేయటం. శ్రీశ్రీ గారు ఇక్కడ మంచి పద్యాన్ని అందించారు. సూర్యవంశ తిలకుడు అయిన రాముడు తొలకరిలో వచ్చే మెరుపులాగా నిలబడి, గురువగు విశ్వామిత్రుని ఆశీర్వాదం పొంది మిక్కిలి నిర్మలమైన మదపుటేనుగు లాగా నడుస్తూ స్వయంవర వేదికకు చేరుకున్నాడు. మదనుని శత్రువైన శివుని ధనుస్సును ఎత్తి ఎక్కుపెట్టపోగా అది ఫెళ్లు మని విరిగింది. అక్కడ ఉన్న రాజులకు గుండె గుభిల్లుమంది. సీతమ్మకు ఒళ్లు ఝల్లుమంది. సభలో ఒకే సమయములో సిగ్గు, విజయ హాసం, భయము, ఆశ్చర్యము అనే భావనలు అక్కడి వారిలో కలిగాయిట. సీతమ్మకు సిగ్గు, రామయ్యకు విజయ భావన, మిగిలిన రాజులకు భయము, కొందరికి ఆశ్చర్యము...శ్రీశ్రీ గారు చేసిన పదప్రయోగం అపూర్వం.

ఇక తరువాత సీతారాముల కళ్యాణము..మంగళము..

శ్రీశ్రీ గారు చేసిన ఈ అనుపమానమైన, అరుదైన రచన తెలుగు సినీరంగానికే వన్నె తెచ్చింది. తరువాత 2-3 హరికథా ప్రయత్నాలు చలన చిత్రాలలో జరిగాయి. కే విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన స్వాతిముత్యం చిత్రంలో బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన సీతారామ కళ్యాణం బాగా పండింది. సూత్రధారులు చిత్రంలో సుశీలమ్మ పాడిన రుక్మిణీ కళ్యాణం పరవాలేదు అనిపించింది. ఈ సీతాకళ్యాణ హరికథను కానడ, శంకరాభరణం, తోడి, కేదారగౌళ, శ్రీ, కళ్యాణి రాగాలలో రాగమాలికగా అందించారు పెండ్యాల వారు. సంగీత, సాహిత్య, నటనా సుగంధాలతో ఈ గీతం ఇప్పటికీ మనలను అలరిస్తూనే ఉంది. 

3 వ్యాఖ్యలు:

 1. మంచి విశేషాలు గుర్తు చేశారు. ధన్యవాదాలు

  ప్రత్యుత్తరంతొలగించు
 2. ప్రసాద్ గారూ! "వాగ్దానం" చిత్రంలోని హరికథ గురించి మీ వివరణ చాలా బాగుంది. తెలుగుసినిమాల్లో చిత్రీకరించిన హరికథల్లో ఇది అగ్రగణ్యమైనదని చెప్పుటలో అతిశయోక్తి ఎంతమాత్రం లేదు.

  శివధనుర్భంగ ఘట్టములోని "ఫెళ్ళుమనె విల్లు" అనే పద్యం కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రిగారిది. వారి అనుమతితో శ్రీశ్రీగారు ఈ హరికథలో వినియోగించుకున్నారు.

  పోతే, "వాగ్దానం" లో జగ్గయ్యగారు నటించలేదు.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. ధన్యవాదాలండీ. జగ్గయ్య గారి పేరు తొలగించాను.

  ప్రత్యుత్తరంతొలగించు