పనీర్ టిక్కా
స్టార్టర్స్ లేదా స్నాక్స్‌గా పనీర్ టిక్కా బాగుంటుంది. దీనికి గ్రిల్ అవసరం లేదు. పెనం మీద లేదా నాన్ స్టిక్ ప్యాన్ మీద చేసుకోవచ్చు.పనీర్‌తో పాటు క్యాప్సికం, ఉల్లిపాయ, పైన్ ఆపిల్, కార్న్ (మొక్క జొన్న కంకి), కాలీ ఫ్లవర్, టమాటో, బంగాళా దుంప ఇలా ఎన్నో కూరలను ఇందులో వాడుకోవచ్చు.
కావలసిన పదార్థాలు:
పనీర్ 1-1/2 అంగుళాల వెడల్పున్న పెద్ద ముక్కలు
క్యాప్సికం 1-1/2 అంగుళాల వెడల్పున్న పెద్ద ముక్కలు
చెక్కు తీసిన పైన్ యాపిల్ 1-1/2 అంగుళాల వెడల్పున్న ముక్కలు
తగినంత పెరుగు
తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్
ఎండు కారం
ఉప్పు
కొత్తిమీర (తరిగి గ్రైండ్ చేసినది)
కస్తూరి మెంతి (మెంతి ఆకులను ఎండబెడితే వచ్చేది)
గరం మసాలా
చాట్ మసాలా
నూనె
టూత్‌పిక్స్
తయారు చేసే పద్ధతి:
ముందుగా పెరుగులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, ఎండు కారం, కొత్తిమీర పేస్ట్, గరం మసాలా, చాట్ మసాలా, కస్తూరి మెంతి, కొద్దిగా నూనె వేసి బాగా కలపాలి. ఉప్పు కారం మసాలాలు మీ రుచికి తగ్గట్టుగా వేసుకోవాలి. ఈ పెరుగు మిశ్రమంలో పనీర్, క్యాప్సికం, పైన్ ఆపిల్ ముక్కలు వేసి ఒక సారి కలియతిప్పి అరగంటసేపు అలా ఉంచాలి. అప్పుడు ఆ డ్రెస్సింగ్‌లోని రుచులు ముక్కలకు పడతాయి. అరగంట తరువాత టూత్‌పిక్ తీసుకొని ఒక పనీర్ ముక్క, ఒక క్యాప్సికం ముక్క, ఒక పైన్ ఆపిల్ ముక్క దాని గుచ్చాలి. ఇలా మిగిలిన ముక్కలను వేర్వేరు టూత్‌పిక్స్‌లకు గుచ్చి పెట్టుకోవాలి. ఇప్పుడు పెనం/నాన్ స్టిక్ ప్యాన్ మీద నూనె వేసి అది వేడి అయిన తరువాత ఈ ముక్కలున్న టూత్‌పిక్స్‌లను అందులో ఉంచాలి. ముక్కలు మాడ కుండా గమనిస్తూ రంగు మారుతున్నప్పుడు మరో పక్క తిప్పాలి. అన్నివైపులా రంగు మారిన తరువాత వాటిని తీసి ప్లేట్లో ఉంచుకోవాలి. వీటిని ఏ చట్నీ లేకుండా తినవచ్చు. కావలసిన వాళ్లు కాస్త పెరుగు, సన్నగా కోసిన పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఉప్పు వేసి చట్నీ చేసుకొని దానితో తినవచ్చు. టిక్కాలను వేడి వేడిగానే తినాలి. చల్లారితే బాగుండవు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి