RightClickBlocker

4, ఫిబ్రవరి 2016, గురువారం

పులకించని మది పులకించు - మనసుకవి ఆత్రేయ భావసంపద


మానవ జీవితంలో సంగీతానికి, అందులో పాటకు ఎంతో గొప్ప స్థానం ఉంది. శిశువులు, పశువులు, పాములు సంగీతానికి స్పందిస్తాయి. మనసులోని ఎటువంటి భావాలైనా వ్యక్తపరచటానికి అత్యద్భుతమైన సాధనం గానం. గానానికి ఉన్న ఈ మహత్తును మనసుకవి ఆత్రేయ కన్నా ఎవరు గొప్పగా రాయగలరు? ప్రేమ చిగురించిన ఓ వనిత ఆ ప్రియుని కోసం పాడే జోలపాటగా ఈ గీతాన్ని ఆవిష్కరించారు. 1960 సంవత్సరంలో విడుదలైన పెళ్లికానుక చిత్రంలో జిక్కి గారు అద్భుతంగా పాడిన గీతం పులకించని మది పులకించు. కృష్ణకుమారిపై చిత్రీకరించబడిన ఈ గీతం పాట యొక్క విశిష్టను పరిపూర్ణంగా ఆవిష్కరించింది. ఆత్రేయగారి పద సౌందర్యం, భావసంపద అనుపమానం. ఆత్రేయ గారి మనోకమలాన్ని పరిశీలిద్దాం:

పులకించని మది పులకించు
వినిపించని కథ వినిపించు
అనిపించని ఆశల యెంచు 
మనసునే మరపించు గానం మనసునే మరపించు                           

రాగమందనురాగమొలికి రక్తి నొసగును గానం
రేపు రేపను తీపికలలకు రూపమిచ్చును గానం
చెదరిపోయే భావములను చేర్చి కూర్చును గానం
జీవమొసగును గానం మది చింత బాపును గానం   
                                      
వాడిపోయిన పైరులైనా నీరుగని నర్తించును
కూలిపోయిన తీగలైనా కొమ్మలలమి ప్రాకును
కన్నెమనసు ఎన్నుకొన్న తోడు దొరికిన మురియు
దోరవలపే కురియు  మది దోచుకొమ్మని తెలుపు  
                             
మనసునే మరపించు ప్రేమ మనసునే మరపించు

ప్రేయసీ ప్రియుల ప్రేమలో పవిత్రతకు నాంది వారి విలువలు. ఆ విలువలకు మూలం సంస్కారం. మంచి సంస్కారం ఒక యువతి మనసులో ప్రేమను ఎంత అందంగా చిగురింపజేస్తుందో గమనించండి. ప్రేమ భావన కలిగిన మనసు పాటగా పులకిస్తుంది. ఇది వరకు ఎన్నడూ వినిపించని కథను వినిపిస్తుంది. అంతకు మునుపు అనిపించని ఆశలను లెక్కిస్తుంది. అదీ ఆ గానం యొక్క గొప్పతనం. రాగంలో అనురాగాన్ని ఒలికిస్తూ రక్తిని కలిగిస్తుంది. ప్రేమ వలన రేపటి కోసం ఎదురుచూసే తీయని భావనకు రూపమిస్తుంది. ప్రేమ చిగురించిన తరుణంలో చెదరిపోతున్న భావాలను చేర్చి కూర్చి జీవాన్ని ఇస్తుంది. చింతను తొలగిస్తుంది. ఇది ఆత్రేయగారి కవితాశైలికి చిహ్నం.

కవి తన అద్భుతమైన భావ ఝరిని రెండో చరణంలో మరింత అందంగా ఆవిష్కరించారు. వాడిపోయిన పైరులు కూడా నీరు దొరకగానే నర్తిస్తాయిట. కూలిపైన తీగలు కూడా కొమ్మల సాయంతో వాటికి చుట్టుకొని పాకుతాయిట. కన్య తన మనసు ఎన్నుకొన్న తోడు దొరికితే మురుస్తుంది. లేత వలపులు కురిపిస్తుంది, ఆ వలపులు దోచుకోమని సంకేతాలు చేస్తుంది. ఇవన్నీ ప్రేమ వల్ల కలిగినవే. ఆ ప్రేమ మనసునే మరపిస్తుంది.

రెండవ చరణంలో ఆత్రేయగారు ప్రేమ, మనసు, ఆశలు చిగురించటం, వాటిని ప్రకృతిలో వచ్చే మార్పులతో పోల్చటం ఎంత హృద్యంగా మన ముందుంచారో గమనించండి. స్త్రీపురుషులు మధ్య చిగురించే ప్రేమకు ప్రకృతిలో వచ్చే మార్పులే సామ్యాలు. ఆ మార్పులకు మనస్సు పలికితే? అదే ఇటువంటి మనోజ్ఞమైన గీతం. అందుకే ఆత్రేయ గారు మనసుకవిగా చిరస్మరణీయులు.

ఇక గీతానికి ప్రాణవాయువులు సంగీతం, గానం. ఏఎంరాజా గారు మంచి గాయకులు అని మనకు తెలుసు. ఆయన సంగీత దర్శకత్వం కూడా వహించారు. ఈ చిత్రాన్ని తొలుత తమిళంలో కల్యాణ పరిసు అని తీసారు. దానికి కూడా రాజా గారే సంగీతం, ఈ పాట తుళ్లాదు మనముల్ తుళ్లుం సొల్లాద కదింగల్ సొల్లుం అని పట్టుకొట్టై కళ్యాణసుందరం గారు రచించగా జిక్కి గారే పాడారు. తరువాత తెలుగులో తీసారు. తమిళంలో జెమినీ గణేశన్, సీఆర్ విజయకుమారి గార్ల మీద చిత్రీకరించగా, తెలుగులో ఏఎన్నార్, కృష్ణకుమారి గార్ల మీద తీశారు. రెండు చిత్రాలు, వాటిలోని పాటలు అద్భుతమైన విజయాన్ని సాధించాయి. జిక్కి గారి జీవితంలో ఈ పాట కలికితురాయిగా నిలిచింది. 

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి