6, అక్టోబర్ 2016, గురువారం

బుచ్చి గ్రామ తిరగమోత



వంటింట్లోంచి వస్తున్న పోపు ఘాటు నషాలానికి అంటి ఉక్కిరి బిక్కిరై పొరలు పొరలుగా దగ్గుతున్నాడు అప్పదాసు. "ఏమేవ్ ఏమని నిన్ను కట్టుకున్నానో ఆ క్షణం నుండీ నీ గ్రామ తిరగమోతతో చస్తున్నాను..."

బుచ్చి: "ఆ అవును ఇంతోటి మన్మథుడని మీరు...ఆ ద్రాక్షారామం సంబంధం వదులుకొని మిమ్మల్ని చేసుకున్నాను చూడండీ! కాపురానికొచ్చిన మర్నాడే మీరు మీ అమ్మ కూర్చొని పోపు ఇలా పెట్టాలి, ఇవి వేయాలి, అవి వేయాలి అని నా బుర్ర తినేసి నేర్పించారు. ఆ తిరగమోతే ఇది...మీరు ఏది అన్నా అది మీకూ, పైనున్న ఆ మహాతల్లికి చెందుతాయి..."

అప్పదాసు: "ఒసేవ్! నీ మొహానికి పప్పులో తిరగమోతలో శనగపప్పు వేయకూడదని కూడా తెలియదు. అది చెప్పి సరిదిద్దితే నీ ముదనష్టపు తిరగమోత ఘాటును మాకు అంటగడతావా. ఇది అన్యాయమే బుచ్చీ!"

బుచ్చి:  "ఏవిటీ అన్యాయం! ఇది దప్పళం, అది పులుసు, ఇది పప్పు, అది పప్పు చారు, ఇది సాంబారు, అది కదంబం పులుసు అని వంద రకాల పేర్లు పెట్టి ఒకే వంటను తిప్పి తిప్పు చెప్పి వాటికి తలా ఓ రకం తిరగమోత చెబితే 16 ఏళ్ల వయసులో నాకేం తెలిసి చస్తాయి! అమ్మో అమ్మో మీరు మీ అమ్మ వంటల గోలతో నేను కాబట్టి వేగాను. ఇంకోతి అయితేనే ఎప్పుడే చెప్పున చాటన కొట్టేది.."

అప్పదాసు: "బుచ్చీ! చెప్పున చాటన కొడతావా!! ఉండు నీ పని చెబుతా" అని చేతిలో ఉన్న పేడ ముద్ద గట్టిగా బుచ్చి కాళ్లకేసి కొట్టాడు.

బుచ్చి: "ఆ! ఆ! ఎంత అఘాయిత్యం! పేడతో కొట్టడానికి నేనేవన్నా మట్టి గోడనా! ఉండండీ మీ పని చెబుతా" అని బలంగా చేతిలో ఉన్న కంచు గరిటె విసిరింది. ఆ కంచు దెబ్బకు అప్పదాసు మోకాలి చిప్ప ఖంగున మోగింది మరుక్షణం అప్పదాసు "అమ్మా" అని కింద బొక్క బోర్లా పడ్డాడు.

ఆ తరువాత బుచ్చి-అప్పదాసుల యుద్ధం ఓ గంటసేపు సాగింది. ఇల్లు కిష్కింధకాండ. ఆ ఇంట ఓ వానర జంట వీరంగం...

శరన్నవరాత్రులలో ఐదవనాడు కాత్యాయని అలంకారం



తిథి ద్వయం కావటంతో బెజవాడ దుర్గమ్మ మామూలుగా శరన్నవరాత్రులలో ఐదవనాడు లలితా త్రిపురసుందరి అలంకారానికి బదులుగా కాత్యాయనిగా దర్శనమిచ్చింది.

కాత్యాయని అనగానే నాకు నా చిన్ననాటి లలిత భక్తి గీతం కాత్యాయనీ కన్నతల్లీ గుర్తుకొచ్చింది. దీనిని శ్రీరంగం గోపాలరత్నం గారు అద్భుతంగా పాడారు. వింజమూరి శివరామారావు గారు ఆనాటి లలిత గీతాల రచయితలలో ప్రముఖులు. దేవులపల్లి వారికి, వింజమూరి సోదరీమణులకు బంధువు. లలిత సంగీతంలో భక్తిని గుప్పించిన కవుల ప్రతిభలు ఆనాడు ఆకాశవాణి కార్యక్రమాల ద్వారా వెలుగులోకి వచ్చాయి. దేవులపల్లి వారు రచించిన లలిత భక్తి గీతాలు అనేకం. అలాగే, మరెందరో  మహానుభావులు. వింజమూరి శివరామారావు గారు కథలు, పద్యాలు, కథానికలతో పాటు రామాయణాన్ని గేయంగా రచించారు కూడా. అది ఎంతో ప్రసిద్ధి పొందింది. దానిని తొలుత బాలమురళీకృష్ణగారు ఆలపించారు. ఆయన ప్రతిభకు గుర్తింపుగా ఆంధ్రా యూనివర్సిటీ వారు కళాప్రపూర్ణ బిరుదునిచ్చారు. ఆకసమున చిరుమబ్బుల చాటున, నల్లనివాడ నే గొల్లపిల్లనోయి, మధురానగరి సమీపంలో, వచ్చెనోయి వసంతము, వినవే చెలి పిలుపు అల్లదిగో వంటి ఎన్నో అద్భుతమైన లలితగీతాలను రచించారు. వీటిని బాలమురళిగారితో పాటు అలనాటి మేటి గాయనీమణులు రావు బాలసరస్వతి గారు, శ్రీరంగం గోపాలరత్నం గారు, వేదవతీ ప్రభాకర్ గారు ఆలపించి శాశ్వతం చేశారు. ఆయన కథలు, ఆయన రచించిన గీతాలన్నీ ఎంతో పేరు పొందాయి.

వింజమూరి వారి రచనలలో ఒకటి శ్రీరంగం గోపాలరత్నం గారు ఆలపించిన కాత్యాయనీ కన్నతల్లి అనే గీతం. శ్రీరంగం గోపాలరత్నం గారు తెలుగుజాతిలో జన్మించిన ఓ సంగీతపు ఆణిముత్యం. బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆవిడ గానం తేనె జాలువారినట్లు ఉండేది. పద్మశ్రీ బిరుదు పొందిన ప్రఖ్యాత ఆకాశవాణి ఆర్టిస్టు ఆవిడ. తెలుగునాట సంగీత పితామహులు శ్రీపాద పినాకపాణి గారి శిష్యురాలు. ఆవిడ భక్తిరనజనిలో పాడిన పాటలు ఎందరో జీవితాలలో భక్తిని మొలకెత్తించాయి. 1939లో విజయనగరం జిల్లా పుష్పగిరిలో సుభద్రమ్మ వరదాచారి దంపతులకు జన్మించిన వీరు హరికథలు, జావళులు, కూచిపూడి మరియు యక్షగానం వంటి కళలలో గాయనిగా ప్రసిద్ధి చెందారు. హైదరబాదు మరియు విజయనగరంలలో సంగీత కళాశాలకు ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆస్థాన విదుషీమణిగా పనిచేస్తున్నప్పుడు అన్నమాచార్యుల వారి కీర్తనలకు సంగీతాన్నిచ్చారు. సకలం హే సఖి అని ఆవిడ పాడిన అన్నమాచార్య కీర్తన ఎంతో పేరు పొంది నేటికి కూడా ప్రమాణమైంది. కాత్యానీ కన్నతల్లీ వివరాలు.

కాత్యాయనీ! కన్నతల్లీ! మమ్మేలు భక్తావనీ! కల్పవల్లీ!

నీ సేవలే నిత్య సంకీర్తనమ్ములే మా జీవితాల భాగ్యాలు సౌభాగ్యాలు

శివదేవ సీమంతినీ జేజేలు భువనైక సామంతినీ
నీ చూపు వెల్గులు నీ నవ్వు వెన్నెల
ఏ కాలమూ మూడు లోకాల పైనాడు

ఇంద్రకీలాద్వాసినీ దుర్గమ్మ సాంద్ర తేజోద్భాసినీ
నిన్ను పూజింతుమీ హృదయాల కుసుమాల
మన్నింపుమమ్మ నీ చరణాలే శరణాలు

ఆడియో కోసం ఈ లింకును ఓపెన్ చేయండి. క్రింది భాగంలో 2వ పాట ఇది.

http://eemaata.com/em/issues/201501/6384.html?fmt=rts

5, అక్టోబర్ 2016, బుధవారం

ఆశ్వయుజ శుద్ధ చతుర్ధి అనంతరం పంచమి - శ్రీ లలితా శివజ్యోతి


శ్రీచక్ర రాజ సింహాసనేశ్వరి శ్రీలలితాంబికయే భువనేశ్వరి
ఆగమ వేద కళామయ రూపిణి అఖిల చరాచరాచరి జనని నారాయణి
నాగ కంకణ నటరాజ మనోహరి జ్ఞాన విద్యేశ్వరి రాజరాజేశ్వరి

అని అగస్త్యార్ అమ్మవారిని కొలిచాడు. సమస్త జీవరాశులలో ఉన్న ఆ తల్లి నారాయణిగా రాజరాజేశ్వరిగా నుతించబడింది. శ్రీచక్రనివాసిని అయిన లలితాంబిక సనాతన వేద వాఙ్మాయానికి, సమస్త కళలకు రూపముగా ప్రస్తుతించబడింది. బ్రహ్మాండ పురాణంలో హయగ్రీవ-అగస్త్య సంవాదంలో చెప్పబడిన లలితా సహస్రనామావళిలో కూడా "చతుష్షష్ట్యుపచారాఢ్యా చతుష్షష్టి కళామయి మహా చతుష్షష్టి కోటి యోగినీ గణసేవితా" అని కొలువబడింది. 64 ఉపచారాలతో కొలువబడిన తల్లిగా, 64 కళలకు ఆలవాలంగా తల్లిని ఈ స్తోత్రంలో నుతించారు. మరి ఏమిటీ చతుష్షష్టి ఉపచారాలు అని ఒక ప్రశ్న వచ్చింది. ధ్యానం, దివ్య మందిరం, రత్న మంటపం, ఆందోళికం, ఆవాహనం, సింహాసనం, వితానం, పాద్యం, అర్ఘ్యం, ఆచమనం, మధుపర్కం, అభ్యంగం, ఉద్వర్తనం, పంచామృత స్నానం, శుద్ధోదక స్నానం, వస్త్రం, ఉత్తరీయం, దివ్య పాదుక, కేశపాశ బంధనం, సౌవీరాంజనం, ఆభరణం, శ్రీగంధం, అక్షత, హరిద్రాచూర్ణం, కుంకుమ విలేపనం, సుగంధ ద్రవ్యాణి, సిందూరం, అథాంగ పూజ, ధూపం, దీపం, కుంభార్తిక్యము, నైవేద్యము, హస్తప్రక్షాళనం, పానీయం, ఫలం, తాంబూలం, సువర్ణపుష్ప దక్షిణ, ఛత్రం, చామరం, దర్పణం, నీరాజనం, దివ్యమంత్ర పుష్పం, ప్రదక్షిణం, నమస్కారం, తురంగ వాహనం, గజ వాహనం, రథం, చతురంగ సైన్యం, దుర్గం, వ్యజనం, దృక్పానపాత్ర నటనం, నాట్యం, మృదంగ వాద్యం, గంధర్వకన్యా గానం, అనేక విధ వాద్యాని, క్షమాపణం, భక్త్రగృహ నివాసం, సువర్ణపర్యంకోపవేశనం, పాదయోః లాక్షారంజనం, గండూష జలపాత్రం, సుఖ శయనం, మమహృదయే నిత్యనివాసనం, పూజా ఫలం, ప్రసనార్ఘ్యం..అదండీ సంగతి. అమ్మను ఇంత వివరంగా కొలువవచ్చు. సమయాన్ని బట్టి, భావాన్ని బట్టి సేవలు.

లలితాపరమేశ్వరి అనగానే 1967లో విడుదలైన రహస్యం చిత్రంలో లీలగారు పాడిన శ్రీలలితా శివజ్యోతి సర్వకామదా అన్న పాట గుర్తుకు వస్తుంది. తెలుగునాట స్త్రీల నోట మంగళహారతి పాటగా శాశ్వతమైపోవటానికి కారణం అందులోని సాహిత్యం, తేలికైన భాష. సమస్త కామ్యములను తీర్చే తల్లిగే సకల శుభకరిగా ఆ జగన్మాతను ఈ గీతంలో కొనియాడారు.  సాహిత్యం పరిశీలిస్తే సముద్రాల వారు రచించినట్లు అనిపిస్తోంది. చిత్రం టైటిల్స్‌లో ఆయన పేరు ఉంది. కానీ ఖచ్చితంగా ఆయనే రచించారని చెప్పటానికి నా దగ్గర ఆధారాలు లేవు. ఎవరు రాసినా, తెలుగునాట ఈ పాట పొందిన ప్రాచుర్యం అంతా ఇంతా కాదు. లలితా త్రిపురసుందరికి మంగళ హారతి పలికే ఈ గీతం సాహిత్యం ఈనాడు ఆశ్వయుజ శుద్ధ చతుర్ధి అనంతరం పంచమి శుభదినాన అందరి కోసం.

శ్రీ లలితా శివజ్యోతి సర్వకామదా
శ్రీగిరి నిలయా గిరామయ సర్వమంగళా

జగముల చిరు నగవుల పరిపాలించే జననీ
అనయము మము కనికరమున కాపాడే జననీ
మనసే నీ వశమై, స్మరణే జీవనమై
మాయని వరమీయవే పరమేశ్వరి మంగళ నాయకి
శ్రీ లలితా శివజ్యోతి సర్వకామదా

అందరికన్నా చక్కని తల్లికి సూర్యహారతి
అందలేలే చల్లని తల్లికి చంద్రహారతి
రవ్వల తళుకుల కళల జ్యోతుల కర్పూరహారతి
సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళ హారతి


4, అక్టోబర్ 2016, మంగళవారం

శరన్నవరాత్రులు - అన్నపూర్ణాదేవి అలంకారం


అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఆ అన్నం జీవాధారమే కాదు, జీవికి మూలం కూడా.

అన్నాద్భవంతి భూతాని పర్జన్యాత్ అన్నసంభవః
యజ్ఞాద్భవంతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవః

కర్మలనుండి యజ్ఞము, యజ్ఞము వలన వర్షములు కలిగి, వర్షము వలన పంటలు పండుతాయి అని శ్రీకృష్ణ భగవానుడు శ్రీమద్భగవద్గీతలోని కర్మయోగములో చెప్పాడు.

అన్నము స్త్రీపురుషులలోని ఓజస్సుకు కారణమై మానవజాతి సృష్టికి మూలమైంది. ఆ ఆహారానికి అధిదేవతగా ఈనాడు ఆదిపరాశక్తి అన్నపూర్ణేశ్వరి అలంకారంలో దర్శనమిస్తుంది. ఆదిశంకరులు అన్నపూర్ణాష్టకంలో ఈ తల్లి వైభవాన్ని అద్భుతంగా వివరించారు. అంతే అద్భుతంగా ముత్తుస్వామి దీక్షితుల వారి తన కృతి అన్నపూర్ణే విశాలాక్షిలో వర్ణించారు. పాయసాన్నం కలిగిన బంగారు గిన్నె చేత ధరించిన తల్లి సాక్షాత్తు పరమశివునికే భిక్ష ఇచ్చింది. సమస్తలోకానికి అమ్మగా నిలిచింది. ఆ కీర్తన వివరాలు.

అన్నపూర్ణే విశాలాక్షి అఖిల భువన సాక్షి కటాక్షి

ఉన్నత గర్త తీర విహారిణి ఓంకారిణి దురితాది నివారిణి
పన్నగాభరణ రాజ్ఞి పురాణి పరమేశ్వరి విశ్వేశ్వర భాస్వరి

పాయసాన్న పూరిత మాణిక్య పాత్ర హేమదర్వీ విధృత కరే
కాయజాది రక్షణ నిపుణతరే కాంచనమయ భూషణాంబరధరే
తోయజాసనాది సేవిత పరే తుంబురు నారదాది నుత వరే
త్రయాతీత మోక్షప్రద చతురే త్రిపద శోభిత గురుగుహ సాదరే

ఓ అన్నపూర్ణ తల్లీ! విశాలమైన కన్నుల గల అమ్మా! సమస్త లోకాలకు సాక్షివి! కటాక్షాన్ని ప్రసాదించే తల్లీ!

ఉన్నతమైన గర్త తీరంలో విహారం చేసే, (తిరువారూర్ వద్ద కుళిక్కుళై అనే క్షేత్రంలో అన్నపూర్ణా విశ్వనాథుల క్షేత్ర కీర్తన ఇది) ఓంకార రూపిణీ! సమస్త పాపములను తొలగించే, నాగాభరణములను ధరించే శివుని రాణీ! పురాణములలో పొగడబడిన పరమేశ్వరీ! శివుని ప్రక్కన ప్రకాశించే అమ్మా!

పాయసాన్నము కలిగిన పాత్ర ఒక చేత, బంగారు గరిటే ఒక చేత కలిగి శోభిల్లే, మన్మథుడు మొదలైన వాని రక్షించుటలో నైపుణ్యము కలిగిన, బంగారు వస్త్రములను, ఆభరణములను ధరించిన తల్లీ! కమలాసనుడైన బ్రహ్మ మొదలగు దేవతలచే పూజించబడిన, నారదుడు, తుంబురుడు మొదలైన వారిచే నుతించబడే తల్లీ! ధర్మార్థ కామ్యములను దాటించి మోక్షమును ప్రసాదించటంలో చాతుర్యము కలిగిన, సత్-చిత్-ఆనందములచే శోభిల్లే, గురుగుహుని ఆదరించే తల్లీ! రక్షించుము!

ముత్తుస్వామి దీక్షితుల వారి క్షేత్ర కీర్తనలలో ఈ అన్నపూర్ణే విశాలాక్షీ ఎంతో ప్రాచుర్యం పొందింది. శ్రీవిద్యోపాసనలో సిద్ధులైన దీక్షితులవారు అమ్మను నిరంతరం దర్శించి ఎన్నో అద్భుతమైన కీర్తనలను రచించారు. సామరాగంలో ఈ అన్నపూర్నే విశాలాక్షీ అన్న కీర్తన కుళిక్కుళైలో గల కాశీవిశ్వనాథుని దేవేరి అన్నపూర్ణమ్మను నుతిస్తూ రచించారు.

అన్నపూర్ణ పార్వతీదేవి యొక్క స్వరూపము. సకల కామ్యములతో పాటు మానువుని జీవితానికి అత్యంత ముఖ్యమైన భోజ్యములను అనగా పాడి పంటల ద్వారా వచ్చే ఆహార పదార్థములను పుష్కలముగా అందించె కామితార్థ దాయిని. అన్నం పరబ్రహ్మ స్వరూపం. స్వయంగా సదాశివుడే కాశీ క్షేత్రంలో అమ్మ వద్ద భిక్షను ప్రతిరోజూ తీసుకుంటాడని పురాణలు చెబుతున్నాయి. ఆది శంకరుల వారు తన గురువైన మండన మిశ్రుని వద్దే కాక గురుపత్ని అయిన ఉభయ భారతీదేవి వద్ద కూడా విద్యను నేర్చుకున్నాడు. ఆ తల్లి తన పట్ల చూపిన ఆదరణకు కృతజ్ఞతతో అన్నపూర్ణాష్టకం రచించారు.

దీక్షితులవారి సాహిత్యంలో అమ్మ వైభవాన్ని ఎన్నో కోణాలలో అద్భుతమైన సాహితీ సంపదతో ఆధ్యాత్మిక సుగంధంతో తెలియజేశారు. ఆయనలోని దైవశక్తి ఆయన కీర్తనలలో స్పష్టంగా కనిపిస్తుంది. ఓంకార రూపిణి, పురాణి, త్రిపద శోభిత అని అన్నప్పుడు ఆయన ఆదిపరాశక్తిని ఏయే అనుభూతులలో ఏయే రూపాలలో దర్శించాడో అర్థమవుతుంది. నిగూఢార్థము కలిగిన పదాలు మనం అనుకుంటే రావు. పూర్తిగా ఆ దేవతా స్వరూపం ఆ కృతికర్తను అనుగ్రహించి పదాలను శక్తిపూరితం చేసి రచనలో వచ్చేలా చేస్తుంది. దీక్షితుల వారి ప్రతి కృతిలోనూ ఈ దైవానుగ్రహము, దైవబలము తేటతెల్లమవుతుంది. అందుకే ఆయన సంగీత త్రయంలో ఒక్కరైనారు. సంగీతం ద్వారా సనాతన ధర్మం పరిఢవిల్లటానికి, భారత దేశపు ఆధ్యాత్మిక శక్తి ప్రకాశించటానికి ఎంతో తోడ్పడ్డారు.

సామ రాగం అద్భుతమైన లాలిత్యము,కరుణ రసము కలిగినది. ఈ రాగంలో శాంతము లేక సౌఖ్యము లేదు, మానస సంచరరే మొదలైన మృదుభావాన్ని, పరిపూర్ణమైన ప్రశాంతతను ఒలికించే కీర్తనలు రచించ బడ్డాయి. దీక్షితులవారు అమ్మకు తనపై గల అపారమైన కరుణకు సూచికగా ఈ అన్నపూర్ణే  విశాలాక్షి కృతికి సామ రాగాన్ని ఎన్నుకొన్నారు. పాలు తేనె కలిసినట్లు భక్తిపూరితమైన సాహిత్యము, కరుణాపూరితమైన రాగలక్షణము కలిసి అమృతాన్ని కురిపించాయి.

ప్రఖ్యాత కర్ణాటక సంగీత విదుషీమణి ఎమ్మెస్ షీలా గారి గాత్రంలో ఈ కీర్తన వినండి.


3, అక్టోబర్ 2016, సోమవారం

శరన్నవరాత్రులు - గాయత్రీదేవి అలంకారం


ఈరోజు బెజవాడ కనకదుర్గమ్మ గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిస్తుంది. ఆ సందర్భంగా ఓ అరుదైన వాగ్గేయకారుడు మరియు ఆయన రచించిన గాయత్రీమాత కృతి వివరాలు మీకోసం.

గాయత్రీ దేవి మీద రచించబడిన కృతులలో ఎక్కువమటుకు మన తెలుగుజాతి మహనీయుడు ఓగిరాల వీరరాఘవ శర్మ గారు రచించినవే. భక్త జ్ఞానానందతీర్థగా సన్యాసాశ్రమంలో పిలువబడిన ఈ కృతికర్త మహా గాయత్రీ ఉపాసకులు. 1908 మార్చి 23న ఒంగోలు జిల్లా ధేనువకొండ గ్రామంలో జన్మించిన ఈయన తండ్రి వద్దే వేదవేదాంగాలు నేర్చుకున్నారు. ఈయన సంగీత గురువు హరి నాగభూషణం గారు. ఆలిండియా రేడియో ద్వారా కొన్ని వందల కచేరీలు చేశారు. రచనలు చేయటంతో పాటు ఆయన రాగాలను కూడా సృష్టించారు. భక్తి జ్ఞాన వైరాగ్యాలను ప్రస్ఫుటించే ఆయన కీర్తనలు దేవీ గానసుధ అనే పుస్తక రూపంలో ప్రచురించబడ్డాయి. గాయత్రీ మాతపై రచనలు చేసిన మొట్టమొదటి వాగ్గేయకారులు ఈయనే. తరువాత మైసూరు మహారాజావారు ఒక రచన చేశారు. సన్యాసాశ్రమానికి పూర్వం 'రాఘవ ' అనే ముద్రను, అటుతరువాత 'జ్ఞానానంద తీర్థ ' అనే ముద్రను ఆయన ఉపయోగించారు. ఆయన కుమారుడు ఓగిరాల రామకృష్ణగారు, కుమార్తెలు విమల-లలిత కూడా సంగీత ప్రవీణులు. ఈయన కొవ్వూరులో గాయత్రీ పంచాయతన పీఠం ఏర్పాటు చేశారు.1989లో ఆయన సిద్ధి పొందారు. ఆయన రచించిన శ్రీ గాయత్రీ దేవి సనాతని అనే కృతి వలజి రాగంలో మీకోసం. దీనిని బాలమురళీకృష్ణ గారు ఆలపించారు.

శ్రీ గాయత్రీ దేవీ సనాతని సేవక జన సుశ్రేయోదాయిని

వాగధిపతి సురేంద్ర పూజితే వరదాయకి పంచరదనే సువాసిని

రాగద్వేష రహితాంతరంగ హితే రత్నఖచిత మణిహార మండితే
రసయుత సంగీత మోదితే రాఘవాది భక్త రక్షణ చరితే


2, అక్టోబర్ 2016, ఆదివారం

శరన్నవరాత్రులు - బాలాత్రిపురసుందరి అలంకారం


ఈరోజు బెజవాడ కనకదుర్గమ్మ బాలాత్రిపుర సుందరి అలంకారం కదా. ముత్తుస్వామి దీక్షితుల వారి బాలాంబిక కృతి ఒకటి విన్నాను. అద్భుతమైన సాహిత్యం. ఆదిపరాశక్తి తత్త్వమంతా ఈ కృతిలో నిబిడీకృతమై ఉంది. కేజే యేసుదాస్ గారి గాత్రంలో దీనిని వినవచ్చు.

భజరే రే చిత్త బాలాంబికాం భక్త కల్ప లతికాం

నిజరూప దాన దక్ష చరణాం
అరుణాం నిత్యాం కళ్యాణీం శర్వాణీం

శ్రీ వాగ్భవ కూట జాత చతుర్వేద స్వరూపిణీం
శృంగార కామ రజోద్భవ సకల విశ్వ వ్యాపినీం
దేవీం శక్తి బీజోద్భవ మాతృకార్ణ శరీరిణీం
దేవనుత భవ రోగ హర వైద్య పతి హృదయ విహారిణీం
భావ రాగ తాళ మోదినీం భక్తాభీష్ట ప్రదాయినీం
సేవక జన పాలినీం గురుగుహ రూప ముత్తు కుమార జననీం


24, సెప్టెంబర్ 2016, శనివారం

మామ శకుని - ధూళిపాళ సీతారామశాస్త్రి గారు


మామ శకుని అనగానే మొదట సీఎస్సార్ తరువాత ధూళిపాళ గారి పేర్లు గుర్తుకోస్తాయి. ఒక లక్ష్యంతో కౌరవుల నాశనానికై ప్రతిజ్ఞ చేసిన శకుని పాత్రను ధూళిపాళ గారు ఎంతో బాగా పోషించారు. దాదాపు 40 ఏళ్ల సినీ నటజీవితంలో 300కు పైగా చిత్రాలలో నటించారు. ఆయన 95వ జయంతి ఈరోజు. ఆ సహజ నటునికి నివాళిగా ఈ వ్యాసం.

1921 సెప్టెంబర్ 24న ఇప్పటి గుంటూరు జిల్లా దాచేపల్లి గ్రామంలో (పల్నాడు ప్రాంతం) రత్నమ్మ మరియు శంకరయ్య దంపతులకు ధూళిపాళ సీతారామశాస్త్రి గారు జన్మించారు. 8వ తరగతి వరకు దాచేపల్లిలో చదువుకొని తరువాత బాపట్లలోని ప్రఖ్యాత శంకర విద్యాలయంలో వేదవిద్యను అభ్యసించారు. తొలుత ప్లీడరు గుమాస్తాగా పనిచేశారు. తరువాత స్త్రీ పాత్రల ద్వారా నాటక రంగ ప్రవేశం చేశారు. ఆయనకు నాటక రంగంలో బాగా పేరు తెచ్చిన పాత్ర దుర్యోధనుడు. ఆ కాలంలో మంచి నటుడు, రచయిత, గాయకుడు, దర్శకుడు అయిన గయుడు గారు ధూళిపాళ గారిని సినీ రంగానికి పరిచయం చేశారు. గయుడి గారి సహాయంతో 1962లో విడుదలైన భీష్మ చిత్రంలో దుర్యోధనుడి పాత్ర ధూళిపాళ గారికి లభించింది. దుర్యోధనుడిగా ధూళిపాళ గారు తొలిచిత్రంలోనే అద్భుతంగా నటించారు. ఆ పాత్ర ఆయనకు ఎంతో పేరు తెచ్చింది.

అదే సంవత్సరంలో పుండరకీక్షయ్య గారి నిర్మాణంలో కమలాకర కామేశ్వరరావు గారు మహామంత్రి తిమ్మరుసు చిత్రం విడుదల చేశారు. ఆ చిత్రంలో ధూళిపాళ గారు అల్లసాని పెద్దన పాత్ర వేసి మెప్పు పొందారు. ఇక తరువాత ఆయనకు వరుసగా అవకాశాలు వచ్చాయి. 1963లో విడుదలైన శ్రీకృష్ణార్జున యుద్ధం చిత్రంలో బావ-బావమరది మధ్య యుద్ధానికి కారకుడైన గయిని పాత్రను వేశరు. సినిమాలో గయుడిగా ధూళిపాళ గారి పాత్రం చాలా ముఖ్యమైనదే. తరువాత వచ్చిన అద్భుతకళాఖండంలో ధూళిపాళ గారు తనకు పేరు తెచ్చిన పాత్ర వేసే అవకాశం వచ్చింది. లక్ష్మీ రాజ్యం గారు నిర్మాతగా కమలాకర కామేశ్వరరావు గారి దర్శకత్వంలోనే 1963లో విడుదలై ప్రపంచమంతా పేరుపొంది తెలుగు సినీ స్వర్ణయుగంలో ఆణిముత్యం లాంటి చిత్రమైన నర్తనశాల (విరాట పర్వం) చిత్రంలో ధూళిపాళ గారు సుయోధనుడి పాత్ర వేశారు. దుర్లక్షణాలను తనం ముఖంలో అద్భుతంగా పండించి తన వంతు పాత్రను పరిపూర్ణంగా పోషించారు. కాకపోతే ఆ చిత్రంలో ఎస్వీఆర్, ఎన్‌టీఆర్, సావిత్రిల నటనా కౌశలం ముందు ఇంకెవ్వరూ నిలువలేకపోయారు. అఖండమైన విజయం సాధించి తెలుగు చలనచరిత్రలో కలికితురాయిగా నిలిచిన చిత్రం ఇది.

1964లో సీతారాం గారి దర్శకత్వంలో ఆయనే నిర్మాతగా విడుదలైన మరో మంచి చిత్రం బొబ్బిలి యుద్ధం. 18వ శతాబ్దంలో విజయనగరం క్షత్రియ గజపతి రాజులు మరియు బొబ్బిలి వెలమ రాజుల మధ్య జరిగే ఆధిపత్యపు పోరును తెరకెక్కించిన ఈ చిత్రంలో ధూళిపాళ గారు నరసరాయుడు పాత్రను పోషించారు. మళ్లీ పుండరీకాక్షయ్య/కమలాకర కామేశ్వరరావు గారి కాంబినేషన్‌లో 1967లో విడుదలైన శ్రీకృష్ణావతారం చిత్రంలో ధూళిపాళ గారు సత్రాజిత్తు పాత్రను పోషించారు. తరువాత ఉండమ్మా బొట్టు పెడతా, బాంధవ్యాలు, ఆత్మీయులు, ఏకవీర, బాలరాజు కథ, మట్టిలో మాణిక్యం, బాలభారతం, శ్రీరామాంజనేయ యుద్ధం, అందాలరాముడు, గుణవంతుడు, సీతాకళ్యాణం, మహాకవి క్షేత్రయ్య, కురుక్షేత్రం వంటి ఎన్నో చిత్రాలలో మంచి పాత్రలు పోషించారు.

ధూళిపాళ గారి నటజీవితంలో ముఖ్యమైన చిత్రాలు శ్రీకృష్ణ పాండవీయం (1966), బాలభారతం (1972), మరియు దాన వీర శూర కర్ణ (1977) చిత్రాలు. మూడింటిలోనూ ఆయన శకుని పాత్రను అద్భుతంగా పోషించారు. ఆ కళ్లలో పగ, ప్రతీకార జ్వాల ప్రస్ఫుటంగా కనబరచారు. డైలాగ్స్‌లో కుటిల రాజనీతి హృద్యమైన తెలుగు భాషలో సుస్పష్టమైన ఉచ్చారణతో ఆయన చలనచిత్రాల వైభవాన్ని ఇనుమడింపజేశారు. ధూళిపాళ గారికి పేరు తెచ్చిన మరో పాత్ర సాంఘిక చిత్రమైన బాంధవ్యాలు. 1968లో విడుదలైన ఈ చిత్రాన్ని ఎస్వీ రంగారావు గారు నిర్మించి దర్శకత్వం వహించారు, ప్రధాన పాత్ర కూడా అయానదే. ఆయన తమ్మునిగా ధూళిపాళ గొప్పగా నటించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి నంది అవార్డును పొందారు. చిత్రం కూడా ఉత్తమ చలనచిత్రంగా నంది అవార్డు గెలుచుకుంది. ధూళిపాళ గారి సినీ ప్రస్థానంలో చాలా మటుకు పాత్రలు పౌరాణిక, చారిత్రాత్మక పాత్రలే. కమలాకర కామేశ్వరరావు గారే మళ్లీ 1977లో విడుదలైన కురుక్షేత్రం చిత్రంలో ఆయనకు ఇంద్రుని పాత్రను ఇచ్చారు. విఠలాచార్య గారి చిత్రాలలో కూడా ధూళిపాళ గారు మంచి పాత్రలు వేశారు.

గొప్ప హనుమద్భక్తులైన ధూళిపాళ గారు కంచికామకోటి పీఠాధిపతులు జయేంద్ర సరస్వతీ స్వామి వారి ఆశీర్వాదంతో 2001లో సన్యాసం స్వీకరించారు. గుంటూరులో మారుతి ఆశ్రమాన్ని స్థాపించారు. 2007 ఏప్రిల్ 13న సిద్ధి పొందారు. పల్నాటి పొరుషం తన భాషలో కనబరచే రంగస్థల నటుడు, స్ఫురద్రూపి, మంచి వాక్పటిమ, ప్రత్యేకమైన నటనా కౌశలం కలిగి ఉండటంతో పాటు భక్తుడు అయిన ధూళిపాళ సీతారామశాస్త్రి గారికి జోహార్లు.

-అక్కిరాజు ప్రసాద్ (24 సెప్టెంబర్ 2016)

పాతాళ భైరవి – 1951: తెలుగు జానపద చిత్రరాజం

1951 మార్చి 15న విడుదలైన పాతాళ భైరవి తెలుగు చలనచిత్ర చరిత్రలో ఒక కీలక మలుపు. విజయా ప్రొడక్షన్స్ పతాకంపై బి. నాగిరెడ్డి, ఆలూరి చక్రపాణి నిర్మ...