శ్రీచక్ర రాజ సింహాసనేశ్వరి శ్రీలలితాంబికయే భువనేశ్వరి
ఆగమ వేద కళామయ రూపిణి అఖిల చరాచరాచరి జనని నారాయణి
నాగ కంకణ నటరాజ మనోహరి జ్ఞాన విద్యేశ్వరి రాజరాజేశ్వరి
అని అగస్త్యార్ అమ్మవారిని కొలిచాడు. సమస్త జీవరాశులలో ఉన్న ఆ తల్లి నారాయణిగా రాజరాజేశ్వరిగా నుతించబడింది. శ్రీచక్రనివాసిని అయిన లలితాంబిక సనాతన వేద వాఙ్మాయానికి, సమస్త కళలకు రూపముగా ప్రస్తుతించబడింది. బ్రహ్మాండ పురాణంలో హయగ్రీవ-అగస్త్య సంవాదంలో చెప్పబడిన లలితా సహస్రనామావళిలో కూడా "చతుష్షష్ట్యుపచారాఢ్యా చతుష్షష్టి కళామయి మహా చతుష్షష్టి కోటి యోగినీ గణసేవితా" అని కొలువబడింది. 64 ఉపచారాలతో కొలువబడిన తల్లిగా, 64 కళలకు ఆలవాలంగా తల్లిని ఈ స్తోత్రంలో నుతించారు. మరి ఏమిటీ చతుష్షష్టి ఉపచారాలు అని ఒక ప్రశ్న వచ్చింది. ధ్యానం, దివ్య మందిరం, రత్న మంటపం, ఆందోళికం, ఆవాహనం, సింహాసనం, వితానం, పాద్యం, అర్ఘ్యం, ఆచమనం, మధుపర్కం, అభ్యంగం, ఉద్వర్తనం, పంచామృత స్నానం, శుద్ధోదక స్నానం, వస్త్రం, ఉత్తరీయం, దివ్య పాదుక, కేశపాశ బంధనం, సౌవీరాంజనం, ఆభరణం, శ్రీగంధం, అక్షత, హరిద్రాచూర్ణం, కుంకుమ విలేపనం, సుగంధ ద్రవ్యాణి, సిందూరం, అథాంగ పూజ, ధూపం, దీపం, కుంభార్తిక్యము, నైవేద్యము, హస్తప్రక్షాళనం, పానీయం, ఫలం, తాంబూలం, సువర్ణపుష్ప దక్షిణ, ఛత్రం, చామరం, దర్పణం, నీరాజనం, దివ్యమంత్ర పుష్పం, ప్రదక్షిణం, నమస్కారం, తురంగ వాహనం, గజ వాహనం, రథం, చతురంగ సైన్యం, దుర్గం, వ్యజనం, దృక్పానపాత్ర నటనం, నాట్యం, మృదంగ వాద్యం, గంధర్వకన్యా గానం, అనేక విధ వాద్యాని, క్షమాపణం, భక్త్రగృహ నివాసం, సువర్ణపర్యంకోపవేశనం, పాదయోః లాక్షారంజనం, గండూష జలపాత్రం, సుఖ శయనం, మమహృదయే నిత్యనివాసనం, పూజా ఫలం, ప్రసనార్ఘ్యం..అదండీ సంగతి. అమ్మను ఇంత వివరంగా కొలువవచ్చు. సమయాన్ని బట్టి, భావాన్ని బట్టి సేవలు.
లలితాపరమేశ్వరి అనగానే 1967లో విడుదలైన రహస్యం చిత్రంలో లీలగారు పాడిన శ్రీలలితా శివజ్యోతి సర్వకామదా అన్న పాట గుర్తుకు వస్తుంది. తెలుగునాట స్త్రీల నోట మంగళహారతి పాటగా శాశ్వతమైపోవటానికి కారణం అందులోని సాహిత్యం, తేలికైన భాష. సమస్త కామ్యములను తీర్చే తల్లిగే సకల శుభకరిగా ఆ జగన్మాతను ఈ గీతంలో కొనియాడారు. సాహిత్యం పరిశీలిస్తే సముద్రాల వారు రచించినట్లు అనిపిస్తోంది. చిత్రం టైటిల్స్‌లో ఆయన పేరు ఉంది. కానీ ఖచ్చితంగా ఆయనే రచించారని చెప్పటానికి నా దగ్గర ఆధారాలు లేవు. ఎవరు రాసినా, తెలుగునాట ఈ పాట పొందిన ప్రాచుర్యం అంతా ఇంతా కాదు. లలితా త్రిపురసుందరికి మంగళ హారతి పలికే ఈ గీతం సాహిత్యం ఈనాడు ఆశ్వయుజ శుద్ధ చతుర్ధి అనంతరం పంచమి శుభదినాన అందరి కోసం.
శ్రీ లలితా శివజ్యోతి సర్వకామదా
శ్రీగిరి నిలయా గిరామయ సర్వమంగళా
జగముల చిరు నగవుల పరిపాలించే జననీ
అనయము మము కనికరమున కాపాడే జననీ
మనసే నీ వశమై, స్మరణే జీవనమై
మాయని వరమీయవే పరమేశ్వరి మంగళ నాయకి
శ్రీ లలితా శివజ్యోతి సర్వకామదా
అందరికన్నా చక్కని తల్లికి సూర్యహారతి
అందలేలే చల్లని తల్లికి చంద్రహారతి
రవ్వల తళుకుల కళల జ్యోతుల కర్పూరహారతి
సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళ హారతి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి