వంటింట్లోంచి వస్తున్న పోపు ఘాటు నషాలానికి అంటి ఉక్కిరి బిక్కిరై పొరలు పొరలుగా దగ్గుతున్నాడు అప్పదాసు. "ఏమేవ్ ఏమని నిన్ను కట్టుకున్నానో ఆ క్షణం నుండీ నీ గ్రామ తిరగమోతతో చస్తున్నాను..."
బుచ్చి: "ఆ అవును ఇంతోటి మన్మథుడని మీరు...ఆ ద్రాక్షారామం సంబంధం వదులుకొని మిమ్మల్ని చేసుకున్నాను చూడండీ! కాపురానికొచ్చిన మర్నాడే మీరు మీ అమ్మ కూర్చొని పోపు ఇలా పెట్టాలి, ఇవి వేయాలి, అవి వేయాలి అని నా బుర్ర తినేసి నేర్పించారు. ఆ తిరగమోతే ఇది...మీరు ఏది అన్నా అది మీకూ, పైనున్న ఆ మహాతల్లికి చెందుతాయి..."
అప్పదాసు: "ఒసేవ్! నీ మొహానికి పప్పులో తిరగమోతలో శనగపప్పు వేయకూడదని కూడా తెలియదు. అది చెప్పి సరిదిద్దితే నీ ముదనష్టపు తిరగమోత ఘాటును మాకు అంటగడతావా. ఇది అన్యాయమే బుచ్చీ!"
బుచ్చి: "ఏవిటీ అన్యాయం! ఇది దప్పళం, అది పులుసు, ఇది పప్పు, అది పప్పు చారు, ఇది సాంబారు, అది కదంబం పులుసు అని వంద రకాల పేర్లు పెట్టి ఒకే వంటను తిప్పి తిప్పు చెప్పి వాటికి తలా ఓ రకం తిరగమోత చెబితే 16 ఏళ్ల వయసులో నాకేం తెలిసి చస్తాయి! అమ్మో అమ్మో మీరు మీ అమ్మ వంటల గోలతో నేను కాబట్టి వేగాను. ఇంకోతి అయితేనే ఎప్పుడే చెప్పున చాటన కొట్టేది.."
అప్పదాసు: "బుచ్చీ! చెప్పున చాటన కొడతావా!! ఉండు నీ పని చెబుతా" అని చేతిలో ఉన్న పేడ ముద్ద గట్టిగా బుచ్చి కాళ్లకేసి కొట్టాడు.
బుచ్చి: "ఆ! ఆ! ఎంత అఘాయిత్యం! పేడతో కొట్టడానికి నేనేవన్నా మట్టి గోడనా! ఉండండీ మీ పని చెబుతా" అని బలంగా చేతిలో ఉన్న కంచు గరిటె విసిరింది. ఆ కంచు దెబ్బకు అప్పదాసు మోకాలి చిప్ప ఖంగున మోగింది మరుక్షణం అప్పదాసు "అమ్మా" అని కింద బొక్క బోర్లా పడ్డాడు.
ఆ తరువాత బుచ్చి-అప్పదాసుల యుద్ధం ఓ గంటసేపు సాగింది. ఇల్లు కిష్కింధకాండ. ఆ ఇంట ఓ వానర జంట వీరంగం...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి